@18

ఇంట్లో అందరూ నా మీద యుద్ధం ప్రకటించారు. ఇంట్లో అమ్మా, శ్రీమతీ, కొడుకూ, బహుశా కూతురూ అంతా ఒకవైపు… నేనొక్కడినీ ఒకవైపు. భేరీలు మోగలేదు, కేతనాలు ఎగరలేదు… ఖడ్గాలు తాడించలేదు… విల్లులు ఎక్కుపెట్టలేదు… అమ్ములు సంధించలేదు… ఫిరంగులు పేలలేదు… యుద్ధం మాత్రం అప్రకటితంగా సాగుతోంది. ఇంట్లో దేహాలు మాత్రమే తిరుగుతున్నాయి. మనసులు ముణగదీసుక్కూచున్నాయి. మా మధ్య మాటల్లో తడి యిగిరిపోయి ఉంది. మేధో యుద్ధ కౌశలాన్ని లెక్కవేస్తే మాలో ఎవరూ ఎవరికీ తీసిపోరు. పైగా అటువైపు వర్గంలో మందిబలం ఎక్కువ. అందుకే నా గుండె చుట్టూ ఉక్కుగోడలు కట్టుకున్నాను. ఆ ఇరుకులో అది కాస్త కురచనవుతోందేమో కూడా! ఇటు నేను ఒక్కడినే. ఒకే ఒక్కడిని.

అలాచెప్తే అతిగా ఉంటుంది. అందరినీ వదిలేసిన వాడు ఒక్కడు! అందరూ వదిలేసిన వాడు ఒంటరి! నేనిప్పుడు ఒంటరిని. మామూలుగా అయితే నా మాటను ఇంట్లో అందరూ… పాటిస్తారని కాదు గానీ, పరిగణిస్తారు. నిర్ణయాలు- ఎవరివి వారు తీసుకుంటారు. ఇప్పుడు అంతా కలిపి నా మీద దండెత్తారు. నా మాట తగ్గాలంటున్నారు! తగదంటున్నారు. తగాదా పడుతున్నారు.

నా ప్రతిపాదనను వాళ్ల ఎదటకి ‘పుష్’ చేసి వదిలేశాను. యీసడించుకున్నారు… ఆ స్పందన నేను ఊహించనిదేమీ కాదు. నిజానికి అంతకంటె ఘోరంగా రియాక్టవుతారనుకున్నాను. ‘ఏం’ చెప్పానన్నది పట్టుకుని కొట్టిపారేయడం కాదు… ‘ఎందుకు’ చెప్పానన్నది ఆలోచించండి.. మీరే ఒప్పుకుంటారు.. అన్నాను. ‘అసలు పాయింట్ ఉంటే, ఆలోచించొచ్చు’ ఇరవయ్యేళ్ల కొడుకు తేల్చేశాడు. ‘అప్పట్లో నా ఖర్మ అలా కాలిపోయింది. రోజులు మార్నాయని సంబరపడితే మళ్లీ యీ బుద్దులేంది. కట్టె మిగిలుండగానే, కాని రోజులొచ్చినాయి. కాడు పిలవని పాడు బతుకైపోయింది’ అంది అమ్మ. ‘మీకు మరీ అంత మూర్ఖత్వం పనికిరాదు.. ‘చేస్తే’ సంగతి తర్వాత… నలుగురికీ తెలిస్తే నవ్వులపాలవుతాం’. ఆ రాత్రి పడగ్గదిలోకి వచ్చిన తర్వాత శ్రీమతి ముక్తాయించింది. మేం అయిదుగురం కలిసి తీసుకోవాల్సిన నిర్ణయానికి, ‘నలుగురికీ తెలిస్తే’ అనే రంధి అడ్డం పడ్డం ఏంటో నాకు అర్థం కాలేదు.

మాటల్లో యీసడించకుండా మిగిలిపోయింది యిక నా కూతురొక్కటే.  దానర్థం.. నా వైపు ఉందని మాత్రం కాదు. అలాగని నేను తగ్గదల్చుకోలేదు.

* * *

 

బంధాలు స్తంభించిపోయిన ఇబ్బందికర వాతావరణంలోంచి కొన్నాళ్లు బయటపడ్డానికి ఛాన్సొచ్చింది. విజయక్క ఫోన్చేసింది. ‘‘మళ్లీ మీ ఊరి కెళ్లాలి. ఈ ఏడాది నాలుగు రోజులు. ముందు రెండ్రోజులూ… తర్వాత ఒక రోజూ… నీకు కుదురుతుందంటే టికెట్స్ బుక్ చేసేస్తా…’’

ప్రయాణాలతో కలుపుకుంటే అయిదార్రోజులు దూరంగా ఉండొచ్చు. చూద్దాం ఈలోగా ఏమౌతుందో. ఆ క్షణానికి ఛీ కొట్టేసినా.. నా మాటలు వాళ్ల బుర్రల్లో తిరుగుతూనే ఉంటాయి కదా. ఏమో.. నా పరోక్షంలో ఆలోచనల మధనం సాగితే.. సానుకూలత పుడుతుందేమో. అమృతం పుడుతుందనుకునే అప్పట్లో పాలకడలిని మధించారు. కానీ ముందు విషం పుట్టింది. కాస్త వేచిచూడకుండా, అప్పుడే భయపడి పారిపోయిఉంటే ఏమయ్యేది? ఆ తర్వాత పుట్టిన అమృతాన్ని మిస్సయి ఉండేవాళ్లు. ఆ ‘వేచిచూసే’ ఓరిమి… యిప్పుడు నా మీద యుద్ధం ప్రకటించిన వైరిపక్షాన్ని తిరిగి నా జట్టులోకి ఫిరాయింపజేసుకోడానికి చాలా అవసరం.

‘‘ఓకే అక్కా’’ అన్నా.

రెండ్రోజుల తర్వాత నేనూ, విజయక్కా శ్రీకాళహస్తి వెళ్లాం. శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మా ఊర్లో దేవుడి పెళ్లి చాలా ప్రశస్తం. శివరాత్రి తర్వాత రెండోరోజు జరుగుతుంది. ఆరోజున తిథివార నక్షత్రాలు ఏమైనా కానీ… దేవుడి పెళ్లి ముహూర్తానికి కొన్ని వేల పెళ్లిళ్లు జరుగుతుంటాయి. చుట్టు పక్కల పల్లెల్లో ఉండే బీదా బిక్కీకి దేవుడితోపాటే ముహూర్తం. ఊర్లోని నాలుగురోడ్లూ వీధులూ సందులూ… యిళ్ల అరుగులూ ఇవే పెళ్లి వేదికలు. దేవుడి పెండ్లిమండపం వద్ద  గోటిమేళం మోగగానే.. ఆ పక్కన రోడ్లలో బార్లు తీరిన కొన్ని వేల మంది తాళి కట్టేస్తారు.

ఇంత పెద్ద వేడుకలో ఒక చిన్న అపశృతి ఉంది. అసలే బీదా బిక్కీ. పూటపూటకీ రేపటి గురించిన భయంతో, యాతనతో, వెరపుతో బిక్కుబిక్కు మంటూ బతికే జనం. పిల్లలకు పెళ్లి చేసేయాలనే ఆత్రుతలో.. కాస్తంత తొందరపడిపోతుంటారు. పది పన్నెండేళ్లు కూడా నిండని పెళ్లి కూతుర్లు పచ్చటి బట్టల్లో, నుదుట బాసికాలు కట్టుకోని, బుగ్గన కాటుక చుక్క పెట్టుకోని…  భయంభయంగా తల్లి చేయి పట్టుకోని నడుస్తూ… ఆ రాత్రి మనకు వందల్లో కనిపిస్తుంటారు. చూడ్డానికి ముచ్చటగానే ఉంటుంది. ఆ వయసులో పెళ్లిళ్లు అయిన తర్వాత.. వాళ్ల జీవితాలు ఏమిటి? ఒక వయసు వచ్చే దాకా పిల్లలకు పెళ్లి చేయొద్దని.. పోరాడి మరీ చట్టాన్ని తయారు చేసుకున్న ఈ దేశంలో.. చట్టమొచ్చి తొంభయ్యేళ్లు దాటుతున్నా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వాటిమీదనే విజయక్క పోరాటం. ప్రభుత్వంలో ఏదో ప్రాజెక్టులో ‘జెండర్’ మీద పనిచేస్తుందామె. దేవుడి పెళ్లి నాడు పసిపిల్లలకు పెళ్లిళ్లు జరక్కుండా చూడాలనేది సంకల్పం.

మాకోసం ఓ కారూ, మాకు తోడుగా ఓ పోలీసు జీపూ! పోయినేడాది కార్లో మేం మాత్రమే వెళ్లాం. శ్రీకాళహస్తి చుట్టుపక్కల పల్లెలన్నీ తిరుగుతూ.. పసిపిల్లలకు పెళ్లిళ్లు చేయొద్దనీ.. అలా చేస్తే జైలు తప్పదనీ.. పల్లెల్లో, ప్రత్యేకించి పెళ్లికోసం రెక్కలకష్టాన్ని తగలేసే తాహతులేని పేదలుండే చోటుల్లో చెప్పుకుంటూ బాగా తిరిగాం. మనుషుల్ని బట్టి.. నయానా, భయానా, బీభత్సానా.. ఒప్పించే ప్రయత్నాలు చేశాం. అలా తిరుగుతున్నప్పుడు ఒకటి రెండు చోట్ల వాళ్లు మమ్మల్ని కొట్టడాని కొచ్చారు. అందుకే ఈసారి ముందుజాగ్రత్తగా మా కారు వెనుక పోలీసు జీపు. రెండు రోజుల పాటూ చాలా ఊర్లు తిరిగాం. దేవుడిపెళ్లి రోజొచ్చింది.

శ్రీకాళహస్తి నాలుగు వీధులూ కళ్లలో వత్తులు వేసుకుని వెతికామంటే నిజం. అసలే శివరాత్రి ఉత్సవాలు.. పైగా దేవుడి పెళ్లి. పుట్టలు పిగిలినట్లుగా ఎటు చూసినా జన ప్రవాహం. కారు అసాధ్యం… పొద్దున్నుంచీ కాలినడకన తిరుగుతూనే ఉన్నాం. పసితనం వాడకుండా చిన్న అమ్మాయిలూ, వాళ్ల వెంట పెద్దోళ్లూ కనిపిస్తే చాలు… పసుపుబట్టలు బాసికాలూ లేకపోయినా సరే.. పట్టుకోడం, మా వెంట ఉండే పోలీసోడికి అప్పజెప్పి స్టేషనుకు పంపడం. రేపటి ఉదయం దాకా, అంటే శివయ్య- జ్ఞానాంబ పెళ్లి ముహూర్తం దాటిపోయే దాకా వారిని అక్కడే ఉంచి పంపేయాలనేది ఆలోచన. స్టేషన్లో వాళ్లకు ఇది ఎందుకు తప్పో.. ఎలాంటి బాధలు ఉంటాయో నచ్చచెప్పడానికి వేరే కౌన్సెలర్లను ఏర్పాటుచేశాం.

తెల్లవారుజామున పాల వ్యాన్లు వచ్చే దాకా తిరుగుతూనే ఉన్నాం. దాదాపు నలభై మంది దొరికారు. పోయినేడాది వంద జంటలకు పైగానే దొరికాయి.

మా వూర్లో ప్రధాన కూడలి పెండ్లిమండపమే. ఆ మండపం ముందే పెద్ద పందిరి వేసి దేవుడికి పెళ్లి జరిపిస్తారు. కొన్ని గంటలముందే పెళ్లయిపోయింది. పెళ్లి చేసుకున్న దేవుళ్లు గుడికెళ్లిపోయారు. వందల్లో ఉండే కొత్త దంపతులు.. ఊర్లకు మళ్లుతున్నారు. దేవుళ్లూ వెళ్లిపోయాక, పెళ్లి సందడి మాసిపోయి… సీరియల్ లైట్లూ, పూలతోరణాలు, వైభోగమైన అలంకరణా మాత్రం మిగిలిపోయిన పెండ్లిమండపం… చిరునవ్వును పారేసుకున్న రాజకన్య లాగా ధగధగలాడిపోతా ఉంది.

ఆ మండపం పక్కనే మూసిఉన్న దుకాణాల ముందుండే దుమ్ము నిండిన మెట్ల మీద కూర్చుని టీ తాగుతున్నాం విజయక్కా, నేనూ.

‘‘పర్లేదు జనంలో చైతన్యం వొచ్చేస్తోంది… ఇంకో రెండేళ్లు గట్టిగా పన్చేస్తే చాలు… తర్వాత యింత శ్రమ ఉండదు’’ యీ మూడురోజుల పనిని రివ్యూ చేస్తున్నట్లుగా అంది విజయక్క.

‘‘నాణేనికి ఒక వైపునే పనిచేస్తున్నాం మనం’’ అన్నాన్నేను.

‘‘అంటే’’

‘‘పెళ్లీ, ఆ వ్యవస్థా… ఆ పరిణామాలతో ముడిపడే పర్యవసానాలూ, వ్యక్తిగత జీవితాలూ, సాంఘిక ధోరణులూ… ఇవన్నీ నాణేనికి పార్శ్వాల్లా రెండుంటాయి. అయితే…’’

‘‘పుస్తకాల్లో భాషతో, సిద్ధాంతాలతో చంపొద్దు. విషయమేంటో చెప్పు’’ కసురుకుంది. ఏం చేయగలను? నాలోనే అస్పష్టత, భయం ఉన్నప్పుడు భాష సరళంగా ఎలా వస్తుంది? ఆమె కసురుకున్నాక కాస్త మాటలు కూర్చుకుని అన్నాను.

‘‘గతిలేక, ‘తొందరగా ముడిపెట్టేద్దాం’ అనుకునే దరిద్రుల్ని భయపెట్టి, దిద్ది, గెలిచినట్లు అనుకుంటున్నాం మనం’’

‘‘మరి కాదా? ఇవన్నీ ఇలా వదిలేయాలా..’’

‘‘వదలొద్దు. కానీ ఈ గెలుపు సంపూర్ణం కాదు.. సగమే. రెండో సగం ఈ పల్లెల్లో వాడల్లో లేదు.’’ లోపల అనుకుంటున్నదేదో మాటల్లోకి సరిగా మార్చలేకపోతున్నాను. పట్టేస్తోంది.

‘‘ఏంది రా నీ గోల… సూటిగా చెప్పలేవా..’’

ఇక లాభం లేదు. ‘‘అదే అక్కా. బాల్యవివాహాలొద్దూ.. చట్టం ఉంది అంటూ ఇటువైపు పనిచేస్తున్నాం. ఇంకోవైపు పైచదువులూ, కెరీరూ, లైఫ్ సెటిల్మెంటూ, కులమూ, స్టేటస్సూ, జాతకాలూ, పొంతనలూ యిలాంటి రకరకాల కారణాలూ, సాకులూ, ముసుగుల కింద ముప్పయిలూ నలభైలూ దాటేసినా పిల్లలకు పెళ్లిళ్లు చేయకుండా దాచేసుకునే సమాజం ఇంకొకటి ఉంది. అటు వైపు నుంచి సమాజం పోకడలకి ఇంకా పెద్ద ముప్పు వస్తోంది…’’

‘‘అది ఇండివిడ్యువల్స్ సమస్య. వాళ్ల ఖర్మ. సమాజానికేంటి నష్టం. నీకేంటి నొప్పి..’’

‘‘ఎలా అక్కా? ఒక సమస్య ఒక వ్యక్తికి ఉంటే అది ‘ఇండివిడ్యువల్’. అదే నలుగురికి ఉంటే లేదా దాని ఎఫెక్ట్ నలుగురిమీద ఉంటే… సామాజికమే..’’

‘‘ఇంకొంచెం క్లియర్‌గా చెప్పు..’’ ఆమె గొంతులో ఇదివరకటి గద్దింపు లేదు. సీరియస్‌ ఆలోచన మొదలైనట్లు వింటోంది.

‘‘పాతికేళ్ల కుర్రాళ్లు బ్రోతల్ హౌసుల్లో దొరకడం, కలిగిన కుటుంబాల అమ్మాయిలు, అబ్బాయిలు లాడ్జీల్లో దొరకడం, రేవ్ పార్టీల్లో గుంపులుగా గుంపులుగా దొరకడం… ఇదివరకు కనబడని వినపడని ఈ ధోరణులంతా ఎక్కడినుంచి వస్తున్నాయ్..’’

ఆమె మాటాళ్లేదు. గాజుగ్లాసును గుండ్రంగా తిప్పుతూ… చల్లారిపోయిన టీ లోకి తదేకంగా చూస్తూ మౌనంగా ఉంది. ఏదోటి మాట్లాడితే తప్ప నేను కంటిన్యూ చెయ్యలేను.

ఈ లోగా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ కానిస్టేబుల్ వచ్చాడు. ‘‘పేపర్లలో మీ గురించి బలే రాశారు మేడం’’ అంటూ! అంతే. అచ్చులో, పెళ్లి ఆగిపోయిన పిల్లల ఫోటోల్ని, అందులో మా గెలుపుల్ని చూసుకుని,  మా భుజాల్ని మేం చరుచుకోవడంలో పడిపోయాం.

నేను చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది. ముఖ్యంగా ఇంట్లో కమ్ముకుని ఉన్న యుద్ధ మేఘాల గురించి కూడా. అదంతా పంచుకోడానికి, నేను తప్పో రైటో తూకం వేసుకోడానికీ విజయక్క సరైన తక్కెడ అనుకున్నాను. కానీ, ఆమె ఇప్పుడూ ఏమాటా వినేస్థితిలో లేదు. ఒక తన్మయావస్థలో పేపర్లలోని ఆ వార్తలకేసి చూస్తోంది.

‘‘వెధవది జిల్లాలో వేశారు… మెయిన్లో వేస్తే.. రాష్ట్రమంతా ఈ చైతన్యం తెలిసేది’’ పెదవి విరిచింది.

* * *

 

తిరుగుప్రయాణం రైల్లోనే బయల్దేరాం. తర్వాతి స్టేషన్లో తమ డిపార్టుమెంటు వారికి పురమాయించి డిన్నర్ స్టేషన్‌కే తెప్పించింది. డిన్నర్ ముగించే సరికి దాదాపుగా అందరూ బెర్తులు ఎక్కేశారు. మాకు సైడ్ బెర్తులు. నేను పైకెళ్లాలి. తిన్న వెంటనే పడుకోడం ఎందుకని ఆగాను. ఎదురుబొదురుగా కూర్చుని ఉన్నాం.

‘‘ఉదయం ఏదో కొత్త సామాజిక సమస్య పుట్టుక గురించి చెబుతున్నట్టున్నావ్…’’

‘‘అది నీకు సోదిలాగా అనిపించినట్లుంది’’ అన్నాన్నేను.. ఉదయం టాపిక్ దారిమళ్లిపోయిన తీరు గుర్తుతెచ్చుకుంటూ.

‘‘అలాక్కాదు. నువ్వు రాంగ్ టైంలో డిబేట్ పెట్టావు. నాకు అప్పటికే నిద్ర ముంచుకొచ్చేస్తోంది. రాత్రంతా మేలుకుని తిరుగుతున్నాం కద. అందుకే డైవర్ట్ అయిపోయింది. సీరియస్‌గా థింక్ చేయాల్సిన పాయింటే… కాస్త డీటెయిల్డ్‌గా చెప్పు..’’ అడిగింది.

‘‘ఎవరు ఏ వయసులో పెళ్లి చేసుకుంటే మనకెందుకు.. చట్టానికెందుకు… అది వారి సొంత గొడవ. చట్టం పేరు చెప్పి మనం వాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛను హరించేయడం లేదా…’’

కస్సుమని లేచింది.. ‘‘బుద్ధుండే మాట్లాడుతున్నావా.. పసిపిల్లల జీవితాలు ఛిద్రమైపోతున్నాయని… సమాజం అతలాకుతలమైపోతోందని… బాల్య వివాహాల మీద మనం ఇంత పోరాడుతోంటే… ఇలా అంటున్నావే. శత్రువును సారధిగా పెట్టుకుని యుద్ధానికెళ్లినట్లుంది నేను..’’

నేను నవ్వాను.

‘‘నువ్వు పూర్తిచేయకముందే అడ్డుపడిపోయానా?’’ అపాలజెటిగ్గా అంది.

అవునన్నట్లు తలాడిస్తూ చెప్పాను.. ‘‘ఒకవైపు మనం చట్టం పేరుచెప్పి… జీవితాలు దెబ్బతింటున్నాయని దిద్దుతున్నాం. ఇది అవసరం. కానీ రెండోవైపు.. ఇంకో రకమైన కారణాల్తో జీవితాలు దెబ్బతినిపోతున్నాయి.’’

‘‘పెళ్లిళ్లు లేటు కావడం వల్ల ఆడామగా తేడా లేకుండా చాలా మంది దారి తప్పుపోతున్నారనేగా నీ బాధ. అదొక్కటే కారణం కాదు. చాలా కారణాల్లో అదొకటి’’ సింపుల్ గా తేల్చేసింది.  అవునన్నట్లు తల ఊపి, మళ్లీ అన్నాను.

‘‘అసలు హర్ విలాస్ శారదా ఒక ఉద్దేశంతో చట్టం తెస్తే.. దాని ప్రభావం మరో రకంగా పడుతోంది సమాజమ్మీద’’

‘‘ఆవిడెవరు?’’ తెలీక అడిగిందా? టెస్టు చేద్దామని అడిగిందా?

‘‘ఆవిడకాదక్కా ఆయన. ఇలాంటి పిల్లల పెళ్లిళ్లు జరగకుండా చట్టం కోసం పోరాడిన వాడే.. రాయ్ బహద్దూర్ హర్ విలాస్ శారదా. ఆయన పేరుతోనే శారదా చట్టం అని పిలిచేవాళ్లు తొలుత అందరూ దీనిని. అదంతా బ్రిటిషు కాలంలో’’.

‘‘సరే.. అయితే ఏంటిప్పుడు…’’

‘‘అక్కా.. చట్టంలోని కనీస వయసు కంటె చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసుకునేవాళ్లని ఆ బాధలు పడకుండా కాపాడుతున్నాం మనం. మరి కనీస వయసు రెట్టింపు అయిపోతున్నా కూడా పెడదారి పట్టిపోతూ, గుట్టుచప్పుడు కాకుండా ఒక సామాజిక సమస్యగా మారుతున్న వాళ్లని ఏం చేయలేకపోతున్నాం’’

‘‘అంటే.. చట్టం చెప్పే వయసు దాటినోళ్లందరినీ పట్టుకుని బలవంతంగా పెళ్లిచేయాలంటావా? ఈ సోషల్ యాక్టివిస్ట్ పోరాటాలు మానేసి, మేరేజి బ్యూరో పెట్టుకోవాలి మనం’’ నవ్వింది. నేను కూడా నవ్వేశాను.

‘‘పెడదార్లకీ పెళ్లికీ లింకు లేదు..’’ మళ్లీ తనే అంది.

‘‘నిజమే. పెడదారిలోని అందర్నీ మార్చాలనుకోవడమూ భ్రమ. మనం మారుతూ.. ఒక్కో కారణాన్నీ విడిగా డీల్ చేయాలి. ఆ పద్ధతి నచ్చితే ఒక్కొక్కరూ మారుతారు…’’ తలవంచుకుని సీరియస్‌గా వింటున్నది కాస్తా తలెత్తి ఆశ్చర్యంగా చూసింది. ఇక చెప్పేయాలి. ఇంతసేపూ సాగదీసింది ఇంట్లో యుద్ధానికి కారణమైన నా ‘ప్రపోజల్’ను విజయక్క తక్కెడలో పెట్టేయడానికే. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను.

ఈలోగా అవతలి లోయర్ బెర్తు వ్యక్తి లేచాడు. మా మాటల అలికిడికి మాత్రం కాదు. అతనికి నిద్ర పడుతున్నట్లు లేదు. మా వల్ల చిరాకు పడ్డం లేదు కదా అని అతనికేసి ఓసారి చూసి,

‘‘మా అమ్మాయికి వచ్చే నెల్లో పద్దెనిమిది నిండుతోందక్కా.. వీలైనంత తొందర్లో పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నా…’’ అన్నాను.

మాట పూర్తయ్యేలోగానే అతను లైటు ఆర్పేశాడు. బోగీలో అప్పటిదాకా అదొక్కటే వెలుగుతోంది. హటాత్తుగా చీకటి. అక్క మొహం కనిపించడం లేదు. స్పందన కోసమే ఇంతసేపూ ఆగితే, అది తెలియకుండా చీకటి కమ్మేసింది. పరుగెత్తే రైలు చప్పుడు మరింత కఠినంగా ఉంది. జవాబేం రాలేదు. కొన్ని క్షణాలు చూసి నేను పై బెర్తు ఎక్కేశాను.

* * *

 

స్టేషన్లో దిగాక ఇద్దరం ముందు మా ఇంటికే వెళ్లాం. అక్కడే ఫ్రెషప్ అయి బ్రేక్ ఫాస్ట్ చేసి నేరుగా ఆఫీసుకు వెళ్లిపోతానంది అక్క. నన్ను దబాయించగల ఎవరో ఒక పెద్దదిక్కు కనపడగానే, యుద్ధం ప్రకటించిన వాళ్లకి చాలా ధైర్యం వచ్చేసింది. నా వెధవయిడియాను ఎవరి ముందు చెప్పినా సరే… నా మొహమ్మీదే ఉమ్మేస్తారని వాళ్లకు చాలా నమ్మకం. నేను ముందుగదిలో పేపరు చూస్తుండగానే.. అక్కకు ఎప్పుడు బ్రీఫ్ చేసేసిందో ఏమో…! టిఫిన్ చేస్తుండగా శ్రీమతి మొదలెట్టింది, నాకు వినిపించేలా!

‘‘కుటుంబం పరువు పోయే ప్లాన్లు వేస్తున్నారు.. ఈ వయసులో.. మీరు చెప్తే వింటారొదినా’’

విజయక్క తింటూ మాట్లాడుతోంది తనతో ‘‘చూడు లీలా.. మీ ఆయన పిల్లాడు కాదు. నాకంటే ఓ పదేళ్లు తక్కువుంటాడేమో. కానీ ఒక్కోసారి ఆలోచనల్లో నాకంటె పెద్దోడనిపిస్తాడు. ఈ విషయంలో… వాడు రైటని నేను జై కొట్టను. అలాగని ‘అది తప్పు, దిద్దుకో’ అన్లేను’’ వెళ్లి చేయి కడుక్కుని వచ్చి కూర్చుని, నీళ్లు తాగిన తర్వాత చెప్పింది… ‘‘నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు లీలా’’

ఆ తర్వాత నాల్రోజులకు వైరిపక్షం మొత్తం మెత్తబడ్డారు. పద్దెనిమిదికే పెళ్లి చేసేయాలంటున్నావ్ సరే.. ‘ఎందు’కనేది మేం నమ్మేలా చెప్పగలిగితే.. ఆలోచిస్తాం అన్నారు. విజయక్క తీర్పు చెప్పకుండా, తక్కెడ పక్కన పడేసి వెళ్లిపోయిన తర్వాత, ఆ నాలుగు రోజుల వ్యవధిలో, ఆ రెండు సంఘటనలూ జరగకపోయి ఉంటే గనుక.. ఆ రాజీ ప్రతిపాదనే వచ్చేది కాదు.

* * *

 

రెండో రోజున ఓ సంఘటన జరిగింది. ప్రెవేటు స్కూల్లో ఏడో తరగతి చదివే కుర్రాడు.. తన స్మార్ట్ ఫోన్తో తమ స్కూల్లోనే పదో తరగతి చదివే అమ్మాయి బాత్రూంలో ఉండగా బూతు వీడియోలు తీశాడు. అవి చూపించి ఆ అమ్మాయిని బెదిరించాడు. అలా బెదిరిస్తూ, ఆ అమ్మాయితో చాలా సార్లు సెక్స్ చేశాడు. ఆ తర్వాత వ్యవహారం పోలీసుల దాకా వచ్చాక వాడి ఫోన్లో చాలా మంది అమ్మాయిల బూతు వీడియోలు, పోర్న్ క్లిపింగులూ దొరికాయి. అక్కడివరకే అయితే ఇది రచ్చకెక్కేదో కాదో తెలియదు. కానీ ఒక రోజున ఆ అమ్మాయి క్లాస్ రూంలో స్పృహ తప్పి పడిపోవడం, హాస్పిటల్లో ప్రెగ్నన్సీ అని తేల్చి అబార్షన్ చేయడంతో గొడవైపోయింది. పేర్లు లేకుండా పేపర్లో వార్త వచ్చింది. మొహాలను బ్లర్ చేస్తూ టీవీ ఛానెళ్లలో కొన్ని వందల సార్లు న్యూస్ చూపించారు. ఇదంతా ఎక్కడో జరిగి ఉంటే మేం ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యేవాళ్లమో చెప్పలేను. కానీ, ఆ ఏడోతరగతి కుర్రాడి ఫ్యామిలీ మా అపార్ట్‌మెంట్లోనే కింద పోర్షన్లో ఉంటారు.

రెండో సంఘటన ఇంకా చిత్రమైంది. మా పెద్దబావ కొడుకు అమెరికాలో సాఫ్ట్‌వేర్ వెలగబెడుతున్నాడు. నా దగ్గర వాడికి చనువెక్కువ. అప్పట్లో డిగ్రీ కాగానే ఓ అమ్మాయిని ఇష్టపడుతున్నట్లు చెప్పాడు. ‘చేసేద్దాం’ అని మా బావతో అంటే కసురుకున్నాడు. ‘సెటిలవనీ’ అన్నాడు. అమెరికా వెళ్లి వాడు నెలనెలా లక్షలు పంపిస్తోంటే.. బావ ప్లాట్లు కొనేస్తూ వాడి మార్కెట్ రేటును లంబంగా పెంచుతూ పోయాడు. సమాంతరంగా పెళ్లిచూపులు జరుగుతూ వచ్చాయి. కొన్నాళ్లు వాడు ఎవరినీ నచ్చలేదు. కాస్త బట్టతల వచ్చింది. ఇప్పుడు వాణ్ని ఎవరూ నచ్చడం లేదు. మెలమెల్లగా ముప్ఫయి అయిదు దాకా వొచ్చేశాడు. యింకా పెళ్లి కాలేదు. అమెరికా నుంచి పెళ్లిచూపుల వారోత్సవాలకు వచ్చాడు. అయిదు రోజులుగా రోజుకు ఇద్దరేసి వంతున అమ్మాయిల్ని చూసేస్తున్నాడు. శని, ఆదివారాలు మాత్రం ఏవీ పెట్టొద్దు.. ఫ్రెండ్స్‌తో గడపాలి అన్నాట్ట. సరిగ్గా ఆ రెండు రోజుల  మధ్యలో అర్ధరాత్రి దాటిన తర్వాత, జరిగిందా సంఘటన. శివార్లలో ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ పెట్టుకుని ఓ పదిమంది అమ్మాయిల్ని తెచ్చుకుని, ఫ్రెండ్స్‌తో కలిసి తప్పతాగి.. ఒంటిమీద నూలుపోగు ఉందో లేదో తెలియని స్థితిలో.. పోలీసులు అందరినీ పట్టేసుకున్నారు!! కేసు రిజిస్టరు కాకుండా బయటకు తీసుకురావడానికి.. ఆ ఒక్కరోజులోనే మా బావ కొన్న వాటిలో ఒక ప్లాట్ అమ్మేయాల్సొచ్చింది.

ఆ తర్వాతే ఇంట్లో రాజీ ప్రతిపాదన వచ్చింది. ఎందుకు నేను ‘మేరేజి ఎట్ ఎయిటీన్’ అంటున్నానో ఇప్పుడు వాళ్లకి చెప్పాలి. నా మాటలు, వాదన నిజం అని వారు నమ్మాలి. అలా నమ్మాలంటే… నా అంతఃకరణంలో నిజాయితీ ఉండాలి. ‘దేవుడా నా ఆలోచన, వాదన సరైనది కాకపోతే… వారెవ్వరూ సమ్మతించకుండా ఉండేలా నువ్వే జాగ్రత్త తీసుకోవాలి స్వామీ’ మొక్కుకున్నాను. ‘‘నా వాదన ఏంటో అక్షరాల్లో కాగితమ్మీద నాలుగు కాపీలు ఇస్తా. మీ అభ్యంతరాలు రాయండి. తర్వాత మాట్లాడుకుందాం..’’ అంటే అంతా ఒప్పుకున్నారు.

‘‘మనువు అయినా, మహమ్మద్ అయినా జీవన విధానానికి ఒక మార్గం చూపించినప్పుడు… అది ఆ రోజులనాటి పరిస్థితులను బట్టి మాత్రమే ఉంటుంది. అందులో ప్రతి అంశమూ అప్పటికి సత్యమై, ఆచరణీయమై, అవశ్యమై ఉంటుంది. కాలగమనంలో అవి పొల్లుగా తేలిపోకూడదని ఆశించడం అవివేకం, భ్రమ. రాజ్యాంగం, చట్టాలు అంతకంటె గొప్పవి కాదు. అందుకే దానికి అప్పుడప్పుడూ సవరణలు జరుగుతూ ఉంటాయి. చట్టం మారినప్పుడు, దానికి జడిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిదా… పోకడల్ని ముందే గుర్తించి, బతుకు తీరుల్ని ముందే మార్చుకోడం మంచిదా?

పసిపిల్లలను పెళ్లి ఊబిలోకి దించేస్తోంటే.. అడ్డుకోడానికి శారదా చట్టం తెచ్చారు. 14-18 కూడా తప్పే అని గ్రహించాక.. అమ్మాయీ అబ్బాయిలకు 18-21 అంటూ దిద్దారు. దిద్దడానికి యాభయ్యేళ్లు పట్టింది. ఆ తర్వాత ప్రపంచం ఇంకా వేగంగా మారిపోతోంది. ఇప్పటికి మరో నలభయ్యేళ్లు గడిచాయి. ఆహారపు అలవాట్లు- ఎదుగుదల, చదువుల్లో అంశాలు- అవగాహన అన్నీ మారిపోతున్నాయి. ఇప్పటి పిల్లలకు సెక్స్, ఇంటర్‌కోర్స్, రీ ప్రొడక్షన్ వంటి విషయాలు ఎనిమిదో తరగతినుంచి తెలిసిపోతున్నాయి. అంతకంటె పెద్ద ప్రమాదం లేదా పరిణామం.. సాంకేతిక విప్లవం! ఒకటోక్లాసు నుంచి కూడా స్మార్ట్ ఫోన్లకీ, కంప్యూటర్లకీ, ఇంటర్నెట్‌కు పిల్లల్ని మనం దూరంగా ఉంచలేకపోతున్నాం. మనం దిద్దుకోలేకపోతున్న దౌర్బల్యం అది. అందుబాటులో ఉండే ఇంటర్నెట్ ప్రపంచంలో.. ఎవరూ తమని గమనించని సమయాల్లో… సెక్స్, పోర్న్ ల పట్ల పిల్లలకు ‘యాక్సెస్’ సహజంగా పెరుగుతోంది.

పాతతరాలతో పోల్చుకున్నప్పుడు… సెక్స్‌కు సంబంధించిన అన్నీ ఇవాళ్టి పిల్లలకు ముందుగానే తెలిసిపోతున్నాయి. తెలిసినది, అందకుండా ఉన్నంతవరకూ ఆరాటం జాస్తిగా ఉంటుంది. చాలా మంది దారితప్పుతున్నారంటే అందుకే. తెలియకుండా ఆపే వ్యవస్థ మనకిప్పుడు లేదు. ఆ ఆలోచనలు వారిని పెడదారి పట్టించకుండా కొంచెం జాగ్రత్త కోసం, తోచిన ఒక పరిష్కారం ఇది. నాట్ ఎగ్జాక్ట్‌లీ మేరేజ్ ఎట్ ఎయిటీన్ ఆర్ టొంటీవన్, బట్ వియ్ హేవ్ టూ కీప్ దెమ్ ప్రిపేర్డ్.. వియ్ హేవ్ టూ గెట్ ప్రిపేర్డ్.. వీలైనంత ఎర్లీగా చేసేయాలనేది ఆలోచన. నిజానికి నా ఉద్దేశం పెళ్లిని ఏజ్‌తో ముడిపెట్టాలని కాదు, కానీ సెక్స్ గురించి ఇప్పటి యూత్‌కు పెరుగుతున్న అవగాహన, వారిని డైవర్ట్ చేయకముందే చేసేయాలని! ఆ పనిచేయడానికి- చట్టం నిర్దేశించిన వయసును ఒక బెంచ్‌మార్క్‌గా పెట్టుకోవాలని!

పెళ్లి అనేది కేవలం సెక్స్ కాదు. ఒకరిని ప్రేమించే, వారి బాగు కోసం శ్రద్ధ పెట్టే, పరితపించే సొంత కుటుంబం సాధారణంగా ఒకటి ఉంటుంది. అలాంటి కుటుంబాలు రెండు ఏర్పడ్డమే పెళ్లి.  అలాంటి బంధాల సంపదను పిల్లలకు కాస్త ముందుగా అందిస్తే తప్పేముంది…

ఇక మీ యిష్టం.’’

చేతనైనంత క్లారిటీగా రాసి, నలుగురికీ నాలుగు కాపీలు ఇచ్చాను. మరునాడు ఉదయం సమ్మతిస్తూ మూడు వెనక్కి వచ్చాయి. కూతురు మాత్రం.. ‘‘నీతో విడిగా మాట్లాడాలి’’ అంది.

దేవుణ్ని పట్టించుకోడానికి జనానికి తీరిక ఉండని మధ్యాహ్నం వేళ గుళ్లో కూర్చున్నాం.. ఇద్దరం. ‘‘పెళ్లికి ముందే… చదువు, కెరీర్, లైఫ్ సెటిల్మెంట్ అవసరం కాదా నాన్నా’’ తను సూటిగా స్టార్ట్ చేసింది.

‘‘పరిస్థితి మారుతోంది అనుకుంటున్నానమ్మా.. పెళ్లి తర్వాతా అన్నీ చక్కగా సాగుతున్నాయిప్పుడు.. మనకి ఇంటరెస్ట్ ఉండాలే గానీ…’’

‘‘వివాహం విద్య నాశాయ అంటారు కద.. అలాంటి త్రెట్ ఉండదా.. నాకింకా చాలా చదవాలని ఉంది’’ తన కళ్లలో నీళ్లు.

‘‘అలాంటి ద్రోహం చేస్తానా తల్లీ’’ కొంచెం తమాయించుకుంది. ‘‘పెళ్లి ఒక బాదరబందీ, బాధ్యత, బరువు… పిల్లలు, సంసారం, ఒత్తిడి  అయినప్పుడు అది నిజమే. అలా కాకుండా పెళ్లి ఒక న్యూ రిలేషన్- నీ బాగు గురించి ఆలోచిస్తుండే ఒక కుటుంబానికి మరో కుటుంబం అదనం… ఒక యాక్టివిటీ- నీ శ్రద్ధ, ఏకాగ్రత పక్కకు మరలకుండా తిండీ నిద్రా లాంటి నిత్య వ్యవహారాలకు కొత్తగా జత చేరే ఒక అంశం…  అయినప్పుడు ఆ భయం ఉండదమ్మా…’’

‘‘ఐడియల్స్ ఉన్నట్టుగా, ఇండివిడ్యువల్స్ ఉండరు…’’ తన లోతైన మాట చాలా గర్వంగా అనిపించింది.

‘‘నిజం. వియ్ నీడ్ టూ సెర్చ్ ఎండ్ ఫైండ్ వన్. దొరికినప్పుడే! నే చెప్పేదేంటంటే.. సాకులతో జాగు చేయకుండా మనం సిద్ధంగా ఉంటే చాలు.’’

‘‘దెన్ ఇటీజ్ నాట్ ఏ ప్రాబ్లం’’ అంటూ, పేపర్ నా చేతికిచ్చేసింది. తన ఒపీనియన్ ఏంటో తెరచి చూడక్కర్లేదు.

ఇద్దరం లేచి, ముందుకు ఒక అడుగేశాం. ఒకటో అడుగు.

* * *

 

మునిసురేష్ పిళ్లె

సురేష్ పిళ్లె స్వతహాగా జర్నలిస్టు. శ్రీకాళహస్తిలో పుట్టి, పెరిగి హైదరాబాదులో స్థిరపడ్డారు. కథలు, కవితలు, రాజకీయ వ్యంగ్య రచనలు, సీరియల్ నవలలు రాశారు. కార్టూన్లు గీస్తారు. వృత్తి ప్రవృత్తి ఒకటే కావడం అదృష్టం. జర్నలిజంలో పీజీ, బీఎల్ చేశారు.
Facebook :: https://www.facebook.com/kamspillai

24 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
 • సూపర్బ్. చాలా వివరంగా ప్రస్తుత సమస్యలను వాటిరో పాటు పరిష్కారలని కొంత కన్విన్స్ గా కూడా
  .వివరించారు. ఒక అడుగు ముందుకు.వేయించారు. మీ కధనం,మీ నెరేషన్ అద్భుతంగా ఉంది. సురేష్ గారు

 • విధ్య, ఉద్యోగాలు, ఆర్ధికంగా నిలదొక్కుకోవటం లాంటి గమ్యాల వెంపర్లాటలో తరుణ వయస్సులో పెళ్లి కాక, దాంపత్య బాంధవ్యం ఏర్పడక, కొందరు వ్యక్తులు పెడదారి పట్టి దురలవాట్లకు, శారీరిక విశృంఖలత్వాలకు బాసినలై ఒక సామాజిక సమస్యగా మారుతున్నదాన్ని యీ ఒక్క కోణం నుంచే చూడాలా ?

  పెద్దల పెంపకం… గురువులందించే విధ్యా బుద్దులు, క్రమశిక్షణ… నైతికత అనైతికతల హద్దులు చూపిస్తూ ఉండే సమాజం…. సాహిత్యం నుండి వివిధ కళారూపాలు అందించే మనోవికాసం వంటి వాటన్నింటిలో
  కాలక్రమేణా చోటుచేసుకుంటున్న లోపాలు, నిర్లక్ష్యాలే నేటి యువత లోని ఓ వర్గం వికృత రూపాలకు కారణమా?

  తరతారల నుంచి వస్తున్న, కాలానుగుణంగా మెరుగుపడుతున్న ఉన్నత ఆశయాలు, ఆదర్శాలతో యువతను ప్రభావితం చెయ్యలేక పోవడం కారణమా ?

  చిరుప్రాయం లోని వారికి కూడా అతి చులకనగా అందుబాటులో ఉన్న మద్యం, మాదక ద్రవ్యాలు, అశ్లీల చిత్రాలు, పశు ప్రవర్తనల నుంచి వారికి రక్షణ కల్పించక పోవడం కారణమా ?

  అన్నీ సందేహాలే రోరన్నా… గజ్జెల మల్లన్నా

 • చాలాముఖ్యమైన సబ్జెక్ట్. దాదాపు పదేళ్ల కిందట ఒక సోషల్ మీడియా చర్చ గుంపులో నేను ఇటువంటి ప్రతిపాదన చేస్తే నన్ను ఉతికి అరేశారు.
  అఫ్కోర్సు, చర్చలతో, సిద్ధాంతాలతో వ్యాసమే కథ వేషం వేసుకుంది, అయిన పర్లేదు. సమకాలీన సమాజం గట్టిగా ఆలోచించాల్సిన విషయం ఇది.
  సురేష్ పిళ్లే గారికి అభినందనలు.

  • నారాయణస్వామి గారూ..
   వ్యాసం కథ వేషం వేసుకున్నట్టు అన్న కామెంట్ బాగుంది సర్. నిజానికి రాసేప్పుడు.. వ్యాసం తరహా డోసేజీ తగ్గించడానికి రకరకాల కుట్రలు చేశాను. డైరక్టుగా సోది లేకుండా.. కథలాగానే రాద్దాం అనుకున్నాను గానీ.. కొంత అలాగే వచ్చేసినట్టుంది.. మీరు చాలా పాలిష్డ్ గా చెప్పారు..
   సారంగ రచయితల్లో మరొకరు, నాకు ఆప్తులు.. ముక్కామల చక్రధర్ చాలా స్పష్టంగా.. ‘ఇది వ్యాసం.. కథ కాదు.. బాగోలేదు’ అని ముచ్చటగా చెప్పారు. 🙂

 • వర్తమాన విశృఖతకు పెళ్ళికి ముడి పెట్టి కథను @ 18 అనే టైటిల్ తో రాసిన కథకు బేసిక్ గ వయసు తో పాటు, బలహీనతలు బలాలుకూడా వ్యక్తికి వ్యక్తి కి చాలా వ్యత్యాసాలుంటాయి. అసలు మీరే కూతీరుపాత్ర ద్వారా తెలియజేసారు. ఐడియల్సుకి, ఇండివిడ్యూయల్సకి చాలా బెధాలుంటాయని. అప్పటికాలంలొ కట్టుబాటునగుబాటీలువుండేవి. ఇపుడు everything is at yours remote control..అది చూసే పెళ్ళీడు 18 – 21 మథ్య ఉంటేబాగుండును అని అనుకుంటున్నారు రచయీత..బట్ అది ఎవరి ఎదుగుదలబట్టివుంటుదనేది పాఠకునిగనాఅభాప్రాయం.చెవగలరచయితకాబట్టి ఎత్తుకోగలగేడు రచయిత ఈ సబ్జేక్టుని. ఇదీ అవసరమే అనిపించారు రచయిత.

  • భరద్వాజ గారూ..
   థాంక్యూ సర్. 18-21 మధ్య అనేది నా వాదన గానీ, నేను చెప్పిన సంగతి కాదు. అప్పుడు పెళ్లి చేసేయాలనేది కథలో చెప్పలేదు. రాజ్యాంగం నిర్దేశించిన వయసులో.. పెళ్లికి సంబంధించిన ఆలోచన మొదలు పెడితే మంచిది.. అనేది మాత్రమే..

 • ఇదొక కొత్త ఆలోచన అనొచ్చు. ఈ కాలపు సమస్యలను గుర్తు చేసే కథ..బాగుంది

 • యుక్త వయసు వచ్చాక ఎవర్నీ ఆపలేం. ఎందులో? కేవలం శారీరక సంబంధాల్లో మాత్రమే? అంతే కదా? ఎందుకంటే స్మార్ట్ ఫోన్లో అందుబాటులో ఉన్న కంటెంట్ వల్ల. అందుకే, ఆ వయసు రాగానే పెళ్లిళ్లు చేసేస్తే బెటర్ అనే ఆలోచన. కానీ, పెళ్లిళ్లు చేసేస్తే ఎవరికి బెటర్? ఆందోళనపడే తల్లి దండ్రులకా? లేక యుక్తవయసులో ఉన్న పిల్లలకా? అసలు ఆలోచనంతా శారీరక సంబంధాల గురించేనా ఇంకా ఏమైనా ఉందా? పెళ్ళికి ముందు శారీరక సంబంధాల గురించేనా లేక పెళ్లి తరువాత శారీరక సంబంధాల గురించికూడానా? సంబంధం ఒక్కరితోనే ఉండాలా లేక తన ఇష్టమా? పెళ్లి అనేది రేవ్ పార్టీలను ఆపుతుందా లేక పెంచుతుందా? ఇలాంటి తేనె తుట్టెని లేపిన కథ.

  • గోపిరెడ్డి అన్నయ్యా.. థాంక్యూ.
   నువ్వు ప్రస్తావించిన అన్నీ చర్చనీయాంశాలే.. కానీ ఒక్క కథలో ఇమిడేవి కాదు.

 • థాంక్యూ అండీ.. నేనెన్నడూ ఎరగని రీతిగా.. ఈ కథమీద బాగా చర్చ జరుగుతోంది.. కథలోని లోపాలను చాలా మంది సహేతుకంగా ఎత్తిచూపుతున్నారు. కథని సమర్థించుకోడానికి కాదు గానీ.. చర్చలో భాగంగానే కొన్నిమాటలు చెప్పాలని ఉంది.

 • Definitely a great argument, however, what if that girl (in the story) gets married to someone and while she finishes her education and gets exposed to a broader world of professionals and academicians and finds her husband not compatible with her current state of mind? We can’t guarantee a partner who will grow with her (same thing will apply to the partner as well). Instead of thinking about ‘marriage’, may be not frowning upon dating in highschool or college or whatever might be a simpler solution. In a western country, dating is not considered a hurdle to complete your studies or career, it’s considered part of life (ofcourse, un-wanted pregancies is a problem, but that’s a problem even when they marry very early)

 • కథ చదివాను సురేష్‌గారు. ఇది ఆలోచించాల్సిన విషయమే.
  ముక్కుపచ్చలారని పిల్లలకు పెళ్లి చేయడమనే అంశం మాత్రం తీవ్రంగా ఖండించాల్సిందే. ఇక 18 ఏళ్లకే పెళ్లి అన్న మాటకొస్తే … పెళ్లియిన తర్వాత కూడా చదువుకోవడం, కేరిర్‌ బిల్డప్‌ చేసుకోవడం అనేది వాళ్ల వాళ్ల ఆలోచన ధోరణి బట్టి, ఎదుగుదలను బట్టి ఉంటుంది. అయితే, ఒక విషయం – పెళ్లి అనేది స్వవిషయం అనేది నా ఆలోచన. అమ్మానాన్నలు చేయడం అనేది నాకు కొరుకుడు పడదెందుకనో. పిల్లల్ని కన్న తర్వాత వారికి చదువు చెప్పించడం వరకైతే ఫర్లేదు కాని, వాళ్లకు నచ్చినవాళ్లని కూడా తల్లిదండ్రులే వెతికి తెచ్చి డబ్బుల్లేకపోతే అప్పులు చేసి వైభవంగా పెళ్లి చేయడంలో అర్థం లేదు. సృష్టిలో మనిషి తప్ప ఏ ప్రాణీ తాము కన్న పిల్లల పెళ్లి (జత) విషయంలో జోక్యం చేసుకోదు. ఆ పిల్లలు తమకు నచ్చిన వాళ్లతో (వాటితో) జతకట్టడం జరుగుతుంది. అంతే. ఇలాగంటే ‘సంప్రదాయ’వాదులు మరో లాజిక్‌ తీస్తారు కాబోలు. వావి వరసలు మరిచి జత కడతాయి పక్షులు, జంతువులు. అలా కడితే చూస్తూ ఊరుకోమంటారా అని!
  ఇక్కడ నా ప్రశ్న అది కాదు. మనిషి పుట్టుక పుట్టిన తర్వాత ‘విచక్షణ’ అనేదొకటి ఉంటుంది కదా. దాని ప్రకారం కులమతాల్ని తోసి రాజని జత కట్టాలని నా అభిప్రాయం. అదీ జత కట్టాలని వాళ్లకుంటేనే సుమా. పెళ్లి జీవితానికి ప్రామాణికమా! పెళ్లి లేకపోతే జీవితం లేదా?!
  ఏతావాతా నేను చెప్పేదేమంటే, పిల్లల్ని చదివించడం వరకే తల్లిదండ్రుల బాధ్యతంటాను. ఆపై కేరిర్‌ అంటే .. ఉద్యోగం సంపాదించుకోవడం, జత కట్టడం (జత అంటే మిగతావారి దృష్టిలో పెళ్లి అన్నమాట) అంతా వాళ్ల స్వవిషయం. వాళ్లవాళ్ల ఎదుగుదలను బట్టి సహచరుల్ని వెతుక్కుంటారు. ఆనక ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోయినా విడివిడిగా ఉండాలంటను. ఒకే టైంలో ఒకరికి అంకితం అనేదానికి వత్తాసు పలుకుతాను కాని, ఎవరూ లేనప్పుడు మరొకరిని ఎంచుకోవడంలో తప్పులేదంటాను. మనకు తెలిసిన ఎందరో మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నవారు మన కళ్లముందే ధైర్యంగా, హోదాగా బతుకుతున్నారనేది మీకూ తెలుసు – అదీ విషయం.
  ముక్కు పచ్చలారని వాళ్ల పెళ్లిళ్లు ఆపడం, బట్టతల వాళ్లు ఏదో తప్పుడు పనిలో దొరికిపోవడం … ఇవన్నీ కాదు. జీవిక కోసం పరిపూర్ణమైన విద్య అభ్యసించిన అనంతరం పిల్లలందరూ విహంగాలే. వాళ్లను పట్టుకుని పలానా వాళ్లను పెళ్లి చేసుకోమని చెప్పడంలో అర్థం లేదు. పెళ్లి చూపులనే తంతే దరిద్రం నా దృష్టిలో. అదీ నా అభిప్రాయం.
  (నా అభిప్రాయం మీకు సరిగా అర్థమయ్యిందో లేదోనని సందేహంగానూ ఉంది).

  • గొరుసు గారూ..

   ఒక రకంగా ఈ కథ చెప్పడంలో నేను ఫెయిలయ్యాను.
   18కి లేదా 21కి పెళ్లి- ‘చేయాలి’ అనేది నా ఆలోచన కానే కాదు.
   పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్న వాళ్లకి – ‘పెళ్లి ఆలోచన అప్పుడు మొదలు అయితే మంచిది’ అని మాత్రమే!
   చివరి వాక్యాల్లో ఇదే రాశాను. ఇదే సంగతి కథ మధ్యలో ఇంకొద్దిగా గట్టిగా చెప్పాను.
   పిల్లలకు భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉండడం- లేకపోవడం గురించి, తల్లిదండ్రులు రుద్దడం గురించి (లేదా తల్లిదండ్రులే చూడడం గురించి) కథలో ప్రస్తావన లేదు. కానీ హెడింగు ‘@18’ అని పెట్టిన తర్వాత.. ఆ వయసుకు పెళ్లి చేయాలనేది కథ చేస్తున్న ప్రతిపాదన గా చదివేవారికి అనిపించింది. ఇది రాసిన వాడిగా నా చేతగానితనం.

   పిల్లల్ని కన్న తర్వాత చదువు చెప్పించడం వరకైతే.. మీరన్నట్టు పర్లేదేమో. కానీ వాళ్లు ఏం చదవాలో.. అవన్నీ బలవంతంగా రుద్దడం ఒక పెద్ద దుర్మార్గం.
   అప్పులు చేసి పెళ్లిళ్లు చేయడంలో మీ అభిప్రాయంతో నేను నూరుశాతం ఏకీభవిస్తాను. పెళ్లి అనేది ఒక ఎగ్జిబిషన్ గా, సంపద హోదా స్థాయిల ప్రదర్శనగా ఎందుకు మారిపోయిందో మూలాల్లోకి వెళ్లి తర్కించేంత జ్ఞానం నాకు లేదు. కానీ.. అలా కావడం వల్ల- సమూలంగా ఛిద్రమైపోతున్న జీవితాలు నాకు అనేకం తెలుసు. తాహతుకు మించి చేసిన పెళ్లిళ్ల వల్ల.. వాళ్లని సంపన్నులుగా లెక్కకట్టి, అమ్మాయి తరఫు నుంచి మరింత పిండుకోవాలనే, దండుకోవాలనే ఆబ.. ఎన్ని లేత జీవితాలను సర్వనాశనం చేసేస్తున్నదో కూడా మనం చూస్తూనే ఉన్నాం. పిల్లల పెళ్లి అనేది, కొందరికి, మన అహంకారాన్ని (దీనికి ప్రత్యామ్నాయ పదాలున్నాయి గానీ.. ప్రస్తుతానికి ఇది వాడుదాం) ప్రదర్శించుకోవడానికి ఒక మార్గం కావడం ఖర్మం.

   మనందరికీ తెలిసిన ఒక సినిమా సెలబ్రిటీ ఉన్నాడు. వయసులో పెద్దవాడు. ప్రముఖుడు. (ఆయన బహిరంగంగా ప్రకటించింది కాకుండా.. నాకు ఇతరుల ద్వారా తెలిసిన సంగతి కావడం వల్ల పేరు చెప్పడం లేదు) జీవితంతో రకరకాల ప్రయోగాలు చేసి.. అన్నిదెబ్బలూ రుచిచూసి ఇప్పుడు బా…గా స్థిమితంగానే ఉన్నాడు. పిల్లలు కుటుంబం (అందరూ సినిమావాళ్లే) గాడిన పడ్డ తర్వాత.. తానొక్కడూ విడిగా తనదైన శైలిలో జీవిస్తున్నాడు. చిన్న కొడుకు ఆయన దగ్గరకు వెళ్లి.. ‘నాన్నా రేపు నా పెళ్లి’ అని చెబితే.. ‘రావాలంటావా’ అని అడిగాడు.
   ఇదంతా కల్పన కాదు నిజం.

   మార్క్ ట్వైన్ చెప్పిన మాట నిజం అనిపిస్తుంది. ‘నిజం- కల్పన కంటె చిత్రంగా ఉంటుంది. కల్పన సాధ్యాసాధ్యాలకు లోబడి ఉండాలనుకుంటుంది. నిజానికి అలాంటి హద్దులుండవు’!

   ఆ సినిమా సెలబ్రిటీ గురించి నాకు చెప్పిన వ్యక్తి.. ఈ ఘటన గురించి నిందాత్మకంగా చెప్పాడు. కానీ.. అందులో నాకు ఒక ఋష్యత్వం కనిపించింది. అంత డిటాచ్‌మెంట్‌తో ఉండగల వాళ్లెవ్వరు! దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఆ యోగస్థితికి చేరువ కాగల వాళ్లెవ్వరు? ఈ కథ మంచిదా చెడ్డదా.. అపరిపక్వ ప్రస్తావన చేసిందా? అనేదంతా పక్కన పెడితే.. మీ కామెంట్ తర్వాత నాకు అనిపించిన భావన ఇదీ.. ‘బిడ్డల పెళ్లికి నేను కూడా ఒక అతిథిని. కాకపోతే క్రియాశీల అతిథిని’ అనుకోగల తత్వం ఎందరికి వస్తుంది? మన ఎరికలో బహు కొద్దిమందే ఉంటారు! వారిలో కూడా అత్యధికులు.. పెళ్లి అనే ఎపిసోడ్‌ను సంపద ప్రదర్శనకు వేదికగానే తయారు చేసేస్తారు. అందులో మాత్రం మెజారిటీ గుంపుది ఒకే మూస ధోరణి!

   సయోధ్య లేనప్పుడు విడిగా ఉండాలనడం.. నేను అంగీకరిస్తాను. కానీ.. పెళ్లి అనేది ప్రదర్శనగా భావించే తల్లిదండ్రులు అంగీకరిస్తున్నారా? విడిగా ఉండదలచుకున్న వారిని సమర్థిస్తున్నారా? నలుగురికంటె ముందే తామే కాకుల్లా పొడిచేయడం లేదా? విడిపోయే సందర్భాల్లో తల్లిదండ్రులు మద్దతిచ్చే అలవాటు మనకుంటే.. సమాజం మొత్తం ఇంకో రకంగా ఉండేది.

   పెళ్లి చూపులనే తంతు దరిద్రం కావడంలో భిన్నాభిప్రాయం లేదు. నా లోపం ఏంటంటే… ‘పిల్లలు పలానా వాళ్లను పెళ్లిచేసుకోవాలని చెప్పడం’ అనే ఐడియానే కథలో లేదు. దానిని సరిగా, స్పష్టంగా కథలో చెప్పలేకపోవడం నా అసమర్థత.

   మీ అభిప్రాయాలన్నీ నాకు పూర్తిగా అర్థమయ్యాయి సర్. దాదాపుగా అన్నింటితోనూ నేను ఏకీభవిస్తున్నా..

 • ఇది సమస్యే అయితే 18//21 యేళ్ళ పెళ్లి పరిష్కారం కాదు. 8/11 కావచ్చు.

  తలితండ్రులు పిల్లలకు ఆలోచించి పెట్టడం ఏ వయసు దాకా చెయ్యాలి, అన్నీ అమర్చి పెట్టడం ఏ వయసు దాకా ?!

  ఆలోచించడం నేర్పినపుడు( అది మనకు వస్తె) , అవగాహన పొందే శక్తి పిల్లలకు అందేలా చేసినపుడు ఈ vetiki pettadam అన్న పని అవసరం ఉండదు

 • ” పెళ్లి అనేది స్వవిషయం అనేది నా ఆలోచన. అమ్మానాన్నలు చేయడం అనేది నాకు కొరుకుడు పడదెందుకనో ” అంటున్న గొరుసన్నా! సీనియర్ కధా రచయిత గొరుసు జగదీశ్పర రెడ్డి దొరా !! నీ యీ నేలక్లాసు ప్రేక్షకుడి అరకొర వితండవాదం కూడా అవధరించవా?!

  త్రేతాయుగంలో సీతమ్మ తల్లి రావులోరు స్వావిని, ద్వాపరయుగంలో రుక్మిణి కన్నయ్యని, శకుంతల దుష్యంతుడిని, ఇంకా ఎందరో రాకుమారిలు స్వయంవరం ద్వారా తమ జీవిత భాగస్వాములను ఎంచుకున్నారంట గందా. మరి యీ కలియుగం లో సతీసహగమనం, కన్యాశుల్కం, వరకట్నం వంటి వెన్నో అధిగమించి ఆడబిడ్డలు సదువు సంధ్యల్లో సమాజం అన్నిరంగాల్లో తమసత్తా చాటుతున్నారు గందా. సక్కగా సదువుకుని, ఉద్యోగాలు సంపాదించుకుని తమకాళ్ల మీద తాము నిలబడుతూ యీ నాడు ఎందరెందరో ఆడబిడ్డలు తల్లిదండ్రులు చూపించిన వరుళ్లలో తమకు నచ్చని వాడిని తిరస్కరించి, అన్నివిధాలా నచ్చిన వాడినే జీవిత భాగస్వామిగా ఎంచుకుంటున్నారుగా.

  ముక్కుపచ్చలారని బాలికలను బలిపశువుల్లా పసుపుతాడు / పలుపుతాడుకి బిగించడాన్ని సంస్కరించాల్సిందే. కానీ అట్టని మన వివాహవ్యవస్థ పైనే చిన్నచూపు చూడొచ్చా ?

  ఆర్ధిక దారిద్యం, భావ దారిధ్యంతో కడుపున బుట్టిన ఆడపిల్లల్ని వేశ్యావాటికలకి, వయస్సుమళ్లిన డబ్బున్నోళ్లకి ముడిపెట్టటానికి, మాన ప్రాణాలకి రక్షణలేని విదేశాల్లో ఉద్యోగాలకి బలేస్తున్న హీనస్థితి నుండి సమాజం లోని ఆయా వర్గాల ఉద్దరణకి పాటుపడాలి. అర్ధరాత్రి స్వాతంత్ర ఫలాలు సమాజం లోని అట్టడుగు వర్గాలకీ అందేలా చూసి సాంఘికగా, ఆర్ధికగా, రాజకీయంగా ఎదిగేలా చెయ్యాలి.

  పెళ్లి, మనిషి ప్రవర్తన, జీవిక అన్నీ కూడా సభ్య సమాజం అనుసరిస్తున్న, అంగీకరించే పరిధిలో ఉండాలి. మనిషి సంఘజీవి. తన కోసమే కాక సంఘ శ్రేయస్సు కోసం కూడా జీవిస్తాడు ( అడవిలో అన్నల నుంచి పొట్టచేతపట్టుకుని వెళుతున్న వలస పక్షుల వరకూ అందరూ ).

  సభ్య సమాజం లో జీవిస్తూ కూడూ, గుడా, నీడా, సాంఘిక రక్షణ, విధ్య, ఆరోగ్య, రవాణా అంటూ సవాలక్ష సదుపాయాలు పొందుతూ నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను అంటే ఎలా కుదురుతుంది. దేశం లోని మిగిలిన ప్రజలు కూడా ఇలాగే ఉంటాము అంటూ విచ్చలవిడి తనం ప్రదర్శిస్తే అప్పుడు దేశం పురోగమిస్తుందా ?… లేక ఆటవిక సమాజం వైపు పయనిస్తుందా ?!

  పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు జతకట్టడమేనా… అటువైపు ఇటువైపు కుటుంబాలు కూడా జతకట్టడం కాదా. బంధుత్వాలు, బాంధవ్యాలు, అండదండలు ఏర్పడటం కాదా.

  తమ కడుపు కాల్చుకుని, రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన రూపాయి రూపాయి కూడబెట్టుకుని బిడ్డల్ని సాకుకుని ఎక్కదీసుకొచ్చేది వయసు వచ్చాక నచ్చినోటితో జతకట్టి యెగిరిపొమ్మని ఇడిసిపెట్టటానికా ?

  విహంగంలా అనిపించినా ఏ వ్యక్తీ నేలతల్లితోని తన మూలాల్ని మరిచిపోలేడు.

  కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ కొనసాగింపులో భాగంగా కొడుకు, కూతుళ్ల సంతానం మైన మనుమలు, మనవరా రాండ్లులకు కూడా పెద్దదిక్కుగా వ్యవహరించే భవబంధాలను పట్టుకు వేలాడే సాంప్రదాయం మనది కదా. ఇది వద్దు రెక్కలొచ్చిన పక్షులను వాటి స్వేచ్చ కి వాటిని వదిలెయ్యాలనడం పార్షిక న్యాయమే.

  యీ చర్చకి సరైన సమాధానం మా యమ్మ గజయీతరాలుని అడిగానా సెప్పుద్ది. కామ్రేడ్ రంగక్కను అడగాలంటే నీకు మల్లే నాకూ కూసింత బిడియం, బయ్యం. కాబట్టి బెజవాడ పి.సత్యోతక్కయ్యని సలా చేద్దాం.

  భారత దేశం లోని కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థలను ఎంతో అభివృధి చెందిన పాత్యాశ్చ దేశాలు కూడా అభినందిస్తుంటే మనకు వాటిపై సందేహాలే సందేహాలు. తార్కితక, హేతువాదాల నిరంతర మేధోమధనంతో, ఒడిదుడుపులకి గురౌతున్న మార్గాన్ని సరైన గమ్యం వైపుకి మళ్లించుకుంటూ వెళ్లడమే సరైన పద్దతని నా నేలక్లాసు బుర్రకాయికి ( గుంజు లేని బుర్రకాయికి ) అనిపిస్తున్నాది.

  నా సోదంతా విని గుస్సాజెయ్యమాకు గొరుసు దొరా! బాంచెన్ నీ కాల్మొక్కుతా !!

  ~ ఇట్లు, గొరుసన్న గారి తంపులమారి రావయ్య

  • కెకె రామయ్య గారికి.. నమస్తే

   గొరుసన్న మాట కూడా కొంచెం అస్పష్టంగా కనిపించినట్టుంది.

   నాకు అర్థమైనంత వరకు…
   ‘‘పెళ్లి అనేది స్వవిషయం అనేది నా ఆలోచన. అమ్మానాన్నలు చేయడం అనేది నాకు కొరుకుడు పడదెందుకనో.’’ ఈ రెండు మాటలూ రెండు వేర్వేరు భావాలు అనుకుంటున్నాను.

   ‘పెళ్లి అనేది స్వవిషయం.’ అంటే.. అంతిమ నిర్ణయాధికారం- పెళ్లి చేసుకునే వాళ్లకి ఉండాలి. ఎవరైనా తమ ఫ్రెండ్స్‌కు సలహా ఇచ్చినట్టే.. పిల్లలకు కూడా తల్లిదండ్రులు సలహా ఇవ్వడం తప్పుకాదు. అలాగే మిత్రులకు పెళ్లి ప్రపోజల్స్ చూపించినట్టే.. పార్టనర్ ను ఎంచుకోవడంలో వారికి సహకరించి, వారితో కలిసి ఆలోచించి, మంచిచెడులు తర్కించుకుని- వారు ఒక నిర్ణయానికి రావడంలో ఉపయోగపడినట్లే… పిల్లలతో కూడా అదే పాత్రను తల్లిదండ్రులు పోషించవచ్చు. అయితే.. అంతిమ నిర్ణయాధికారం- పెళ్లి చేసుకునే వారికే వదిలేస్తే చాలు.
   తాము చెప్పిందే చేసుకోవాలని రుద్దకుండా- అలగకుండా- విభేదించకుండా- సినిమాల్లో మాదిరిగా బెదిరించకుండా ఉంటే చాలు.. అని గొరుసు చెప్పినట్టు అనుకుంటున్నాు.

   ‘‘అమ్మా నాన్నలు చేయడం’’ అంటే.. జీవితభాగస్వామిని మీద రుద్దడం గురించి కాకపోవచ్చు. పెళ్లి అనే తంతు నిర్వహణకు సంబంధించిన ఆర్థిక భారాన్ని తల్లిదండ్రులు మోయడం గురించి అనుకుంటున్నాను. వెసులుబాటు ఉన్నవాళ్లు.. ఆ ఖర్చు- భారం కాని వాళ్ల విషయంలో ఎలాగైనా పర్లేదు గానీ.. గతిలేకపోయినా.. ఆ భారాన్ని బాధ్యతగా భ్రమించి.. తలకు మించి, తాహతు మీరి పెళ్లి జరిపించి ఛిద్రమైపోయే జీవితాల గురించిన ప్రస్తావన గొరుసు చేశారని అనుకుంటున్నాను.

   నేను అనుకున్నది కరక్టే అయి.. గొరుసు రాసింది ఈ రెండు అంశాలే అయితే గనుక.. ఇందులో మన వివాహ వ్యవస్థను చిన్నచూపు చూడడం అనే ప్రస్తావన లేదు. కథ లాగా కామెంట్ కూడా.. అందులో లేని అంశానికి సంబంధించిన చర్చకు దారితీసినట్టు అవుతుంది. 🙂

   వేశ్యావాటికలు, ముసలి సంపన్నులకు ముడిపెట్టడాలు, విదేశీ ఉద్యోగాలకు బలులు.. ఇవన్నీ ఇంకొక చర్చ. గొరుసు మాటల్లో సంఘనియమాలను ధిక్కరించి మోనార్క్ లాగా మనం బతకాలనేంత ఘాటైన ఉపదేశం ఉందని నాకనిపించలేదు.

   పెళ్లి విషయంలో నిర్ణయాధికారం పిల్లలకిస్తే అది ‘ఇడిసిపెట్టడం’ కాకపోవచ్చు.. సలహా చెబితే, గైడ్ చేస్తే అది ‘రుద్దడం’ కాకపోవచ్చు. ఇవన్నీ ఆ పని చేయడంలో డోసేజీని బట్టి ఉంటాయి. ఇక భవబంధాలను పట్టుకుని వేళ్లాడడం అనేది ప్రతి వ్యక్తికీ ఐచ్ఛికం.

 • ముని సురేష్ పిళ్ళై గారు నమస్తే. మీరు వ్రాసిన కథ “@18” చాల ఆలోచింపజేసింది. వర్తమాన ఆధునిక సమాజంలో వివాహవ్యవస్థ తీరుతెన్నులలో చాల మార్పులు వచ్చాయి. బాల్యవివాహాలు ఒక సమస్య అయితే ఆలస్యంగా ౩5+ తర్వాత జరిగే వివాహాలతో మరో సమస్య గా ఉంది. మీరు ఈ రెండు సమస్యల గురించి కథలో విశ్లేషణాత్మకంగా చెప్పారు. అయితే మీరు అన్నట్లు రేవ్ పార్టీలు, లైంగిక స్వేచ్ఛ పట్ల మక్కువ ఎక్కువౌతున్న ఈ ఆధునిక సంస్కృతిలో వివాహాలు వారి స్వేచ్చా ధోరణులను ఆపగలవా అని అనుమానం వస్తుంది. ఏమైనా ఈ కథ చాల ఆలోచింపచేసేదిగా ఉంది. అభినందనలు.

 • వివాహం సమాజానికి ఆవశ్యకమైన ఒక అద్భుత, ఆరోగ్యకర సంప్రదాయం. అది అపరిపక్వదశలో జరగడం ఎంత నష్టమో, పరిపక్వదశలో జరక్కపోవడమూ అంతే నష్టం సమాజానికి. ఈ అంశాన్ని మాతో సహా ఎందరో రచయితలు తమ రచనల్లో ప్రస్తావించారు. కానీ అదే అంశాన్ని సమకాలీనులకు అత్యవసరమైన సందేశంగా గుర్తించిన ఈ కథ, అందుకు తగిన పరిపక్వ కథనం – విశిష్టం. అనన్యసామాన్యం అనిపించేలా సమస్యను విశ్లేషించి ప్రదర్శించిన రచయితకు అభివందనాలు. ప్రచురించిన పత్రికకు అభినందనలు. తమ స్పందనతో అభివందనాలు అందుకునే పాఠకుల సంఖ్య అపరిమితమై, రచయిత కృషికి న్యాయం జరుగుతుందని ఆశిద్దాం- ‘వసుంధర’

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు