ఆడవాళ్ళ క ‘న్నీళ్ళ బిందె’

      కాలు తడవకుండా సముద్రాన్నైనా దాటవచ్చునేమో కానీ కన్ను తడవకుండా సంసార సాగరాన్ని దాటలేమనేది సామెత. నీళ్లకు, ఆడవాళ్ళకు ఏదో జన్మ జన్మల సంబంధం ఉన్నట్టుంది. నీలి సముద్రమంతటి ఆడవాళ్ళ కళ్ల నిండా కష్టాల కన్నీళ్లే. చాలా మంది ఆడవాళ్ళకు కన్నీళ్లు ఉంటాయి. కానీ కొందరి కన్నీళ్లు నీటిలో చేప కన్నీళ్లలాగా ఎవరికీ కనిపించవు.

ఎండాకాలం వస్తే చాలు పల్లెలు, తండాలు, నగరాలు అన్నీ గుక్కెడు నీళ్ళు దొరకక నీళ్ళ భయంతో వణికిపోతాయి. పల్లె పడుచులైనా, నగరపు మహిళలైనా నీటికి, ఇంటికి మధ్య లోలకంలా తిరుగుతూనే ఉంటారు. జీవితంలో ఏదో వెలుతురును వెతుక్కుంటూ భర్తతో పాటు నగరాన్ని చేరిన ఒక బంజారా యువతి పట్నంలో ‘పానీపట్టు’ యుద్ధంలో ఓడిపోతూ, గెలుస్తూ ఎన్ని అగచాట్లకు గురైందో చాలా ఆర్ద్రంగా చెప్పిన కథ ‘నీళ్ళ బిందె’. .

కథ ఇక్కడ చదవండి.

నీళ్ళ బిందె

సైదీది సూర్యాపేట దగ్గర భీమ్లా తండా. అందరి ఆడ పిల్లల్లాగే ఊహల పల్లకీలో ఊరేగుతూ పెళ్లి చేసుకొని భర్తతో పాటు హైదరాబాద్ వచ్చింది. తండాలో అందరూ సైదీకి పట్నం సంబంధం దొరికిందని, బాగా సుఖ పడుతుందని సంబరపడ్డారు. కానీ “పట్నంల సుఖం లేదని, ఇది పట్నం కాదని.. కష్టాల పుట్ట అని తెలవడానికి సైదీకి వారం కూడా పట్టలేదు.” భర్త తాగుబోతు. సైదీ భవణాల నిర్మాణాల దగ్గర ఇటుకలు మోసి తన రెక్కల కష్టం మీదనే సంసారాన్ని ఏళ్లదీయాలె.

ఎట్లో తిప్పల పడుతూ సంసార బండి లాక్కొద్దామంటే తెల్లారి లేస్తే నీళ్ళ రంధి. హైదరాబాద్ లో “అపార్ట్ మెంట్ల మధ్య దిష్టి బొమ్మల్లాంటి రేకుల షెడ్లే సైదీ లాంటి కూలీలుండే ఇండ్లు. వీళ్ళంతా అక్కడే నీళ్ళను సంపాదించుకోవాలి. నీళ్ళ కోసం అపార్ట్ మెంట్లోనో, పెద్ద ఇండ్లున్న వాళ్లనో బతిమాలి తెచ్చుకోవాలి. పనికి తీసుకొచ్చిన కాంట్రాక్టర్ నీళ్ళ సౌకర్యం కల్పించలేదు కానీ, కల్లు కాంపౌండ్ మాత్రం పెట్టాడు. దూరంగా ఇలాంటి బిల్డింగ్ లేబర్ కోసమే ఒక వైన్ షాప్ కూడా తెరిచారు. నీళ్ళ గురించి మాత్రం ఎవరూ పట్టించుకోలేదు.”

అందుకే పొద్దున లేస్తూనే సైదీ నీళ్ళ కోసం వేట మొదలు పెడుతుంది. కనీసం బహిర్భూమికి కూడా పోవడానికి వీలు లేదు. అటు పోతే నల్లా బందై రెండు బిందెల నీళ్ళు కూడా దొరకవని ఆమె బాధ. ఏ ఇంటికి వెళ్ళి అడిగినా అందరూ చీదరించుకునే వారే కానీ ఒక్కరూ  బిందెడు నీళ్లిచ్చే వారు లేరు. అట్లా రెండు బిందెల నీళ్ళ కోసం వెతుక్కుంటూ మబ్బు పట్టిన ఆ ఉదయం, ఇంకా చీకటి తెరలు తొలగి పోని ఆ వేకువ జామున ఒక ఇంట్లో నల్లా కట్టెయ్యక పోవడంతో నీళ్ళ చప్పుడు విని మెల్లగా లోపలికి వెళ్ళి రెండు బిందెలు నింపుకుంది సైదీ. ఇంకో రెండు అడుగులు వేస్తే బయట పడేదే.

“సరిగా అప్పుడే… వెనక నుంచి ఒక్కసారిగా ఏదో చేయి తన నడుము చుట్టూ పాములా చుట్టుకుంది. ‘హే.. బాపురే..’ అరవబోతున్న నోటిని గుడ్డతో మూసేసింది మరో చేయి. ఆ పెనుగులాటలో బిందెలు కింద పడి దొర్లుకుంటూ ఎటో పోయాయి.  ఎవడో రెండు చేతులతో తనని గట్టిగా ఉడుములా పట్టుకున్నాడు. కాళ్ళు పైకి లేపడంతో పట్టు  దొరకడం లేదు. ఆ చీకట్లోనే గోడ చాటుకు తీసుకెళ్లి బలంగా కింద పడేశాడు. బలంగా నేలకు తగలడంతో తల దిమ్మెక్కి పోయింది. భయంతో నోట్లోంచి మాట రావడం లేదు. ఆ చీకట్లో వాడెవడో తెలియడం లేదు. బలంగా తన పైకి కొండ చిలువలా పాకుతున్నాడు. పాము నోట్లో కప్పలా గిలగిలా తన్నుకుంటోంది సైదీ.” తరువాత సైదీ పరిస్థితి ఏమిటో తెలియాలంటే మనం కూడా ‘నీళ్ళ బిందె’ ఎత్తుకొని హైదరాబాద్ లోని ఆ మురికి వాడకు పోవాల్సిందే.

ఎన్నో సామాజిక కోణాలను స్పృశించిన విశిష్టమైన కథ ఇది. పైకి మంచి నీటి కరువును చర్చించిన కథ లాగా కనిపించినా అంతర్గతంగా అనేక సమస్యలను ఎత్తి చూపిన కథ. దినసరి కూలీలను వైన్స్ షాప్ లు, కల్లు కాంపౌండ్ లు ఎలా పీల్చి పిప్పి చేస్తున్నాయో కళ్ళకు కడుతూనే తాగుబోతు భర్తల భారిన పడి సగటు ఇల్లాళ్లు ఎలా నలిగిపోతున్నారో చూపెడుతుందీ కథ. కళ్ళు చెదిరే అపార్ట్ మెంట్లెన్నో తమ చేతుల మీదుగా కట్టినా వాటి నీడను కూడా తాకలేని జీవితాలెన్నో రేకుల షెడ్లలోనే కరిగిపోతున్నాయి. అడవి మల్లెలాంటి లంబాడ కన్నెలెంతో మంది నగరపు అంచులకు చేరి ఎన్నో బాధల మధ్య జీవితాన్ని బిక్కుబిక్కుమనుకుంటూ గడుపుతున్నారు. కనీస అవసరాలకు నీళ్ళు కూడా దొరకక బిందె నీళ్ళ కోసం నీటి తపస్సు చేస్తున్నారు. ఉన్నోడు వాళ్ళ కుక్కలను కడగడానికి, కార్లను కడగడానికి నీళ్ళను విచ్చలవిడిగా ఖర్చు పెడుతాడు. కానీ సాటి మనిషికి తాగడానికి గుక్కెడు నీళ్లివ్వడు. దీనికి తోడు ఒంటరిగా ఆడది కనిపిస్తే చాలు పురుషాంగాన్ని భుజాన వేసుకొని తిరిగే ‘మదపు’టేనుగులు నలిపిపారేస్తాయి. చాలాసార్లు అమాయకంగా బలవుతుంటారు కూడా. ఈ బాధలన్నీ ఎవరికి చెప్పుకోవాలో దిక్కు తోచదు. వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతుంటారు.

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వజ్రోత్సవాలు జరుపుకోవడానికి పరుగులు పెడుతున్నాం. అయినా ఇంకా చాలా గ్రామాలకు, నగరాల్లోని మురికి వాడలకు సరిపడా రక్షిత మంచి నీటిని అందించలేకపోతున్నాం. దేశ అభివృద్ధిలోని డొల్లతనాన్ని ఈ కథ పట్టి చూపుతుంది. స్త్రీల రక్షణను, పేదరికాన్ని, శ్రమ దోపిడిని, పురుషాధిపత్యాన్ని ప్రశ్నిస్తున్న కథ కూడా. ఎన్ని సంకట పరిస్థితుల్లో అయినా, నిత్య జీవితంలో ఎన్ని ముళ్ళు గుచ్చుతున్నా, ఎన్ని దైన్య పరిస్థితుల్లో అయినా స్త్రీ జీవించి తీరవలసిందే. ఈ కష్టాలు ఎన్నటికి తీరేను? ఇదొక నిరంతర యుద్ధం.

కథా కాలం కేవలం 24 గంటలే. ఉదయం మంచి నీళ్ళ వెతుకులాటతో మొదలై మళ్ళీ మరుసటి రోజు నీళ్ళ కోసం యుద్ధానికి బయలు దేరడంతో  ముగుస్తుంది. కథంతా వర్తమాన కాలంలో నడిచినా మూడు దశాబ్దాల జీవితాన్ని చూపెడుతుంది. తాగు నీటి చూట్టూ ఎంత అగాథం పర్చుకుందో అర్థమై సగటు పాఠకుడు కదిలిపోతాడు. రచయిత ఎన్నుకున్న శిల్పం వల్ల ఈ కథ ఒక సజీవ దృశ్య కావ్యంలా కనిపిస్తుంది. కథలో చాలా పాత్రలున్నా కథా నాయిక మాత్రం సైదీ. ఈమె నేటి భారత దేశ అభివృద్ధికి ప్రతీకగా కనిపిస్తుంది. నరేషన్ అంతా ప్రామాణిక తెలుగులో, డైలాగ్ లన్నీ తెలంగాణ తెలుగులో ఉండడం ఈ కథకు బాగా నప్పింది.

‘నీళ్ళ బిందె’ ను తన భుజం మీది నుంచి మన నెత్తి మీదికెత్తిన కథకుడు చందు తులసి. వృత్తి రీత్యా హైదరాబాద్ లో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న చందు తులసి తెలంగాణ జీవితం, సంస్కృతి, సామాజిక సంఘర్షణలను ఇతి వృత్తాలుగా తీసుకొని ఇప్పటి దాకా సుమారు పది కథలు రాశారు. వీరి తొలి కథ ‘ఊరవతల ఊడల మర్రి’ 2015లో ప్రచురింపబడింది. కొన్ని రోజులు సారంగ వెబ్ మేగజైన్ లో ‘రేపటి కథ’ శీర్షికను నిర్వహించారు. ఇదే కథ ‘రివాజు’ తెలంగాణ కథ – 2018 సంకలనం కోసం ఎంపికై అందులో ప్రచురింపబడింది. ఈ కథ మొదట 30 డిసెంబర్ 2018న ఆదివారం ఆంధ్రజ్యోతిలో అచ్చు అయింది.

            *

 

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

18 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • థాంక్యూ శ్రీధర్ సార్. సారంగ కి కూడా

  • శ్రీధర్ గారు నీళ్ల బిందె కథ పై మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది. ఇదే కాదు ఇలా మీరు కథల పై రాసే విశ్లేషణలు అన్ని చాలా బాగుంటాయి. మీ ఆర్టికల్ చదివాక ప్రతీసారి నేను ఆ కథను చదవకుండా ఉండలేను. ఇప్పుడు కూడా ఇది చదివాక వెంటనే నీళ్ల బిందె కథను చదవాలని కుతూహలం గా ఉంది. మీ విశ్లేషణలతో మంచి మంచి కథలను మాకు పరిచయం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. అలాగే చందు తులసి గారికి అభినందనలు.

    • కథ యొక్క ఆత్మను పట్టి చూపిన ఇట్లాంటి విశ్లేషణ ద్వారా మంచి కథలు మాకు పరిచయమవుతాయి..ఇద్దరికీ అభినందనలు

  • ఇది చదివాక కథ ఖచ్చితంగా చదవాలి అని ఆరాటం కలిగింది. ధన్యవాదాలు సర్.
    చందుతులసి అన్నకి మనస్ఫూర్తిగా అభినందనలు.💐

  • శ్రీధర్ గారి విశ్లేషణలు అద్భుతాలు.
    మంచి కథకి మంచి చేర్పు.

  • నీళ్ళ బిందె కథ చాలా బాగుంది చదవాలి అనే ఆసక్తి కలిగింది.

  • అవునండి ..ఇంతకు ముందు చదివా ఈ కథ ను.
    తన్నీరు తన్నీరు అనే శీర్షికన కూడా గతంలో ఈ నీటి వెతలు చదివా…గుండెను పిండేసే వెతలేఅవి.
    కథా కథనం చక్కగావుంది… పలు సమస్యలను స్పుృశించారు రచయిత…దాన్ని శ్రీథర్ గారు కూడా సూచించారు.
    వెతలు కి కారణాలు సరే…..ముగింపులో అదే వెతలకి కొనసాగింపుతో మరో రోజు కూడా అదే రీతి న కొనసాగించారు.
    విరుగుడు, ఫుల్ స్టాపు ఇలా అనేటట్టు ముగింపువుంటే బాగుండేదికదాండి.
    లేక అలాంటివారి బతుకులుఅంతే వారి ఖర్మ అనేటట్టువుంది…మరింత బాధాకరంకదండి.
    రచయిత మంచి చెవగలవారే….
    సద్విమర్శలో శ్రీథర్ గారు సిథ్థహస్తులే.

  • మంచి కథ రాసిన రచయిత చందు తులసి గారికి అభినందనలు. కథను సమీక్ష విమర్శ రాసిన వెల్దండి సార్కి ధన్యవాదాలు. చందుతులసి గారు కథలో పాత్రల నుండి కన్నీళ్ల బిందెను పాఠకుల నెత్తి పైకెత్తితే, ఒడుపుగా కథా విమర్శ చేసి వెల్దండి శ్రీధర్ గారు పాఠకుల హృదయ దాహం తీర్చారు. ఇరువురికీ అభినందనలు. మంచి కథను మరియు సమీక్ష ను అందించిన saaranga వేదిక నిర్వాహకులకు కృతజ్ఞతలు.

  • ఎంత దుఃఖభరిత కథ
    ప్రతి రోజూ చేసే యుద్ధమిది
    Original story and review both are good

  • ప్రకృతి వనరులలో సహజంగా లభించే వాటిలో నీళ్లు ఒకటి. భూమిపై మూడు వంతులు నీరు ఉంది. సకల జలచరాలకు కావాల్సింది నీరే. నీరు లేకుంటే జీవుల మనుగడ ప్రశ్నార్ధకం. నేల సారవంతంగా ఉండాలన్న, పంటలు పండాలన్న నీరే ముఖ్యం. నదుల దగ్గరే నాగరికత వెలిసింది. భూగోళం లో కొన్ని ప్రాంతాలు మాత్రమే సుసంపన్నం కావడానికి ప్రధాన కారణాల్లో నీటి వనరుల లభ్యతే.కరువుకాటకాలు నీరు లేని ప్రాంతాల్లోనే ఎక్కువ శాతం వస్తుంటాయి. ప్రతిదీ నీటి వనరుల లభ్యత మీదనే ఆధారపడి ఉంది. కృత్రిమంగా ఎన్ని వస్తువులను సృష్టించిన ప్రకృతి అందించే వనరులను కృత్రిమంగా తయారు చేయడం అంత సులువైన విషయం కాదు. ప్రకృతి వనరులు నేటికీ పుష్కలంగా ఉన్నాయనే భ్రమలోనే ఉన్నాం. వాస్తవంగా ప్రకృతి వనరులు పుష్కలంగా లేవు. చాలా వరకు తగ్గిపోయాయి. తరిగిపోతూనే ఉన్నాయి. వాటిలో ప్రధానంగా నీరు కూడా ఒకటి.
    ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకున్న నీటి కొరత పైన చందుతులసి గారు చాలా చక్కని కథను అందించారు. మూడు కాలాలలో నీరు ఎక్కువగా అవసరమయ్యే కాలం ఎండాకాలం. ఈ కాలంలో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటాయి. కిలోమీటర్ల దూరం ప్రయాణించి, గుక్కెడు నీళ్లను సంపాదించుకునే గ్రామాలు నేటికీ ఉన్నాయి.
    ఒక కథలో రచయిత తెలియజేసే కోణం కొంతే అయినా, దాని వెనుక వారు లోతైన అధ్యయనం చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. కథలో ఒక కోణాన్నే స్పృశించినా, పాఠకుడికి అనేక ప్రశ్నలను సంధించే వదిలి పెడతారు. అలాంటి ప్రశ్నల్ని సంధించే కథలు సజీవమైన ప్రాణంతో వెలుగొందుతాయి. ఈ “నీళ్ళబిందె” కథలో సైది పాత్ర ద్వారా రెండు బిందెల నీటిని సంపాదించే ఇతివృత్తం ఎంచుకొని కథను రాసినా, ఆ రెండు బిందెల నీటి వెనుక ఒక చరిత్రను, సమకాలీన పరిస్థితులను, భవిష్యత్తులో జరగబోయే వైపరీత్యాలను కళ్లకు కట్టినట్లు చూపించారు రచయిత్రి చందుతులసి. ఒక పది సంవత్సరాల కాలాన్ని వెనక్కి తీసుకున్నట్లయితే నీటి వ్యాపారం చాలా తక్కువ. నీటిని వ్యాపారకోణంలో ఎప్పుడైతే పరిచయం అయిందో ప్రస్తుతం మనం చూస్తున్న ధరలే ప్రత్యక్ష సాక్ష్యం. ఒక లీటర్ నీళ్లకే నేడు ఇరవై, ముఫై రూపాయలు పెట్టి, కొని తాగే పరిస్థితి ఏర్పడింది. ఒక చెంబుడు నీళ్లు తాగి రెండు మూడు రోజులు బ్రతికినవారున్నారు. కానీ నేటి కాలంలో లో ఆ ఒక్క చెంబు నీళ్లను కూడా కొనే పరిస్థితులు దాపురించాయి.
    ఈ “నీళ్ళబిందె” కథలో పల్లెటూరు నుండి పెళ్లి చేసుకుని పట్నం వచ్చిన సైధి వంట చేసుకోవడానికి, తాగడానికి రోజులో భాగంగా రెండు బిందెల నీటిని సంపాదించిందా? లేదా? అనేదే కథాంశం. రెండు మూడు అంతస్తుల భవనాలు కూడా ఎరుగని సైది, అగ్గిపెట్టెలాంటి బహుళ అపార్ట్మెంట్ల మధ్యల ప్లాస్టిక్ రేకులషెడ్డులో భర్త మేఘాతో రోజు కష్టం చేసుకుని జీవిస్తుంటారు. వారే కాకుండా ఆ ప్రాంతంలో ఇరవై, ముఫై కుటుంబాలు అలాగే జీవిస్తుంటాయి. భర్త మేఘా అంతకుముందు ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. కానీ ప్రపంచీకరణలో ఆటోలు నడుపుకునే వారి పరిస్థితి కూడా ఉబర్, ఓలాలు వచ్చాక వారి పరిస్థితి ఎలా ప్రశ్నార్థకం అయిందో తెలిపారు. ఉన్న ఉపాధి పోయి ఈ రోజు కష్టం చేసుకుంటే గానీ జీవనం గడవని పరిస్థితి దాపురించింది. సైది రోజులాగే రెండు బిందెలు తీసుకొని అపార్ట్మెంట్ల దగ్గరికి నీళ్లకోసం వెళ్లడం, వారు చీదరించుకోవడం, కొన్నిచోట్ల గొడవలు, కొట్లాటలు నిత్యకృత్యమయ్యాయి.కాంట్రాక్టర్ల లబ్దికోసం ఎక్కడినుంచో ఒక చోటికి తీసుకువచ్చి కార్మికులను బలిపశువులను చేయడమే తప్ప వారికి కనీస సౌకర్యాలు కల్పించని పరిస్థితిని వివరించారు. ప్రభుత్వాలు కూడా ఏ వలస కార్మికుల కష్టనష్టాలను పట్టించుకోవడం లేదు. సంపన్నులు కుక్కలను, కార్లను కడగడానికి ఎలా నీటిని వృథా చేస్తున్నారో, మోటర్లు పెట్టి వాడుకునే ధనవంతులకు కనీసం రెండు బిందెల మీరు ఇచ్చే మానవత్వం లేదని అర్థమవుతుంది. అడవిలోయినా నీళ్లు దొరికే పరిస్థితులున్నాయి. కానీ అపార్ట్మెంట్ల దగ్గర నీళ్లు దొరికే పరిస్థితి లేదని సైది పాత్ర ద్వారా రచయిత్రి తెలియజేశారు. నీటి కోసం కూడా ఆడవాళ్ళ అఘాయిత్యాలు, అత్యాచారాలు ఎదుర్కొన్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ కథలో రెండు బిందెల నీటి కథనే మనకు వివరించిన, జరుగుతున్న సమకాలీన సమస్యలను ఎత్తిచూపారు.
    నేడు ఆధునిక నగరాలుగా చెప్పుకునే ప్రాంతాలలో పూరి గుడిసెలు వేసుకొని జీవించే పరిస్థితి ఇలాగే ఉంటుంది. రోజు కష్టానికి వెళ్లి వచ్చి, ఇంట్లో వంట చేసుకోవడానికి కూడా నీరులేని కుటుంబాల దీనగాథ. అపార్ట్మెంట్ల దగ్గర రేకులషెడ్డులో జీవించే వారి నిత్య కథ ఒకటే. ముఖ్యంగా ఈ ఎండాకాలంలోనైనా ప్రభుత్వాలు పరిస్థితులను గమనించి కొళాయిలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ట్యాంకర్లతో నీటి సమస్య ఉండే ప్రాంతాలలో అందించాలి. మానవత్వ హృదయంతో నీటి కొళాయిలున్నవారు పరిస్థితులను అర్థం చేసుకుని కనీసం తాగడానికి నీరు పట్టుకునే అవకాశాన్ని కలిగించాలని మనసారా కోరుకుందాం.
    ఇంత మంచి కథను అందించిన రచయిత్రి చందుతులసి గారికి కృతజ్ఞతలు. కాలానికి తగిన కథను సారంగ పత్రికలో సమీక్ష చేసి, మనకందించిన వెల్దండి శ్రీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

    • ఇంత వివరంగా సమీక్షించిన మీకు ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్లు ఎండాకాలం లో ఐనా ప్రభుత్వాలు నీళ్లు అందించాలి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు