స్టేషన్ డెరైక్టర్లు ఎలా ఉండేవారంటే ….

రోజుల్లో రేడియో స్టేషన్ ను సరైన మార్గంలో నడిపేందుకు స్టేషన్ డైరెక్టర్లు చాలా క్రియాశీలక పాత్ర పొషించేవారు.భక్తితో కూడిన భయం ఉండేది అందరికీ.. నేను అంతకుముందు చేసిన పెయింట్స్ కంపెనీ ఫాక్టరీ మేనేజర్ చాలా ఫ్రెండ్లీగా ఉండీ ఎవరైనా ఆయన కేబిన్ లోకి ఎలాంటి శషభిషలు లేకుండా వెళ్ళే పరిస్థితి.. కానీ ఇక్కడ SD ఛాంబర్లో ప్రవేశించాలంటే కొంచెం వణుకు అందరికీ ఈ వైరుధ్యం నాకు చాలా కాంట్రాస్ట్ గా అనిపించేది.

నేను 1988లో విజయవాడ రేడియో స్టేషన్ లో చేరినప్పుడు అప్పటి స్టేషన్ డెరైక్టర్ పి.యు.ఆయూబ్ గారు.  ఆయన తమిళుడు. తమిళంలో ఎన్నో నాటకాలు రచించారు. మనిషి చాలా షార్ప్. ఆయనకు భాష రాకపోయినా తెలుగు కార్యక్రమాలపై చాలా అవగాహన ఉండేది.

ఆకాశవాణి వార్షిక పోటీలకు విజయవాడ పెట్టింది పేరని గతంలో మనవి చేశాను కదా.ఆయన స్వయంగా కొన్ని అవార్డులు అంతకుముందు పొంది ఉన్నారు. దాంతోటి ఆ ఎంట్రీల సబ్జెక్టు మీద ఆయనకు అవగాహన బాగా ఉండేది.. కొంత గైడ్ చేసేవారనే చెప్పాలి.

డ్యూటీ రూం ఏరియాకు ఆయన అరుదుగా వచ్చేవారు. అక్కడ ఉండే లౌంజ్ లో సాయంత్రం వేళల్లో నవ్వులు కురుస్తుండేవి. నండూరి సుబ్బారావు గారు డ్యూటీ ముగించిన సీనియర్ అనౌన్సర్లు, కొంతమంది ప్రోగ్రాం ఆఫీసర్ లు అక్కడ ఆసీనులై లోకాభిరామాయణం చేస్తుండేవారు. ఈలోపల స్టేషన్ డెరైక్టర్ వస్తున్నారంటే డైరెక్టర్ గారి ప్యూన్ ముందే వచ్చి అలెర్ట్ చేసేవాడు. సారొస్తున్నారంటూ.. అప్పటివరకు సందడే సందడి అన్నట్టు గా ఉన్న డ్యూటీ రూం లౌంజ్ కర్ఫ్యూ పెట్టినట్లు మారిపోయేది. 

నేను చేరిన కొత్తల్లో అమాయకంగా నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కావాలని అడగటం నేను స్టేషన్ డెరైక్టర్ చాంబర్స్ కు వెళ్ళాను. డైరక్ట్ ఆయన రూం వెళ్ళటానికి లేదు. ముందు డైరెక్టర్ గారి స్టెనో కి కనపడి మన రిక్వెస్ట్ చెప్పాలి. అనంతరం మాత్రమే లోపలికి వెళ్ళే అవకాశం.

అలా నేను వారి విశాలమైన, చల్లని ఏసీ గాలులతో నిశ్శబ్దానికి రాజులా ఉన్న వారి ఛాంబర్లో ప్రవేశించినప్పుడు ఒక్కమాటతో నన్ను వెనక్కి పంపించేశారు. సంభాషణ ఇంగ్లీష్ లో సాగింది..

“సర్.. నేను కొత్తగా చేరిన డ్యూటీ ఆఫీసర్ ని.”

“మీరు మీ ట్రాన్స్ఫర్ గురించి వచ్చినట్లయితే మీరు వెళ్ళొచ్చు.. మీరు కనీసం ఓ పదేళ్ళయినా ఇక్కడ పనిచేయాలి”

అంతే..నాకింకో మాటకు అవకాశం లేకుండా పోయింది.

అదే వ్యక్తి నేను 1989 మార్చి, ఏప్రిల్లో కొత్తగూడెం స్టేషన్ కమీషన్ చేసే టీం లో భాగంగా వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చి నా బాగోగులు అడిగారు. అప్పటికి నన్ను చాలామంది భయపెట్టారు.

నువ్వు టూర్ మీద వెళ్ళావు.. అక్కడే నిన్ను పర్మినెంట్ గా ఉంచేస్తారంటూ..ఆ టైం లో స్టేషన్ డెరైక్టర్ ఆయూబ్ నన్నడిగారు.

నీ రెణ్ణెళ్ళ టూర్ అయిపోయింది..ఇంకా నువ్వు వెనక్కి వచ్చేయ్యచ్చు అని నన్ను వెనక్కి రప్పించారు..

శ్రోతల ఉత్తరాలతో కూడిన “ఉభయకుశలోపరి” ఆరోజుల్లో పాపులర్.. కొన్ని ఉత్తరాలు స్టేషన్ డెరైక్టర్ నే అడ్రస్ చేస్తూ ఉండేవి.ఒకసారి ఒకళ్ళు ఇంగ్లీష్ లో ఆయనకు రాశారు..మీ అనౌన్సర్లు “హైదరాబాద్” ను “హైడ్రాబాడ్” అని చదువుతున్నారు..కాస్త చూడండి అంటూ..ఆ ఉత్తరంపై ఈయన  very bad అని  స్కెచ్ పెన్ తో మార్క్ చేసి ఇన్స్ట్రక్షన్స్ రాశారు.

ఆ తర్వాత నుంచి ఆ తప్పు మళ్ళీ దొర్లలేదు. ఇంతకీ ఆయన దస్తూరీ చాలా బావుండేది..

ఆయన తర్వాత జి.కె.కులకర్ణి గారు స్టేషన్ డెరైక్టర్ గా వచ్చారు. కులకర్ణి గారు కన్నడ సాహిత్యం పై పట్టు ఉన్నవారు. ఎక్కువ ఆధ్యాత్మిక భావాలున్న వ్యక్తి.. యంగ్ పీపుల్ బ్రాడ్ కాస్టింగ్ లో కీలకపాత్ర పోషించాలని చెప్పేవారు.డ్యూటీరూంలో ఉండే డ్యూటీ ఆఫీసర్ లకు వివిధ కార్యక్రమాల బాధ్యతలు అప్పగించారు..అలా నేను యువవాణి, ఇంగ్లీష్ టాక్స్, సంస్కృతం సెక్షన్ల ప్రోగ్రాం అధికారులకు అసిస్ట్ చేసేవాడిని..ఆయన ఏ ప్రోగ్రామ్ ఆఫీసర్ రిపీట్ బ్రాడ్ కాస్ట్ చేయటానికి అంగీకరించే వారు కాదు.

 సుమన్ గారని ఆరోజుల్లో ఎడ్యుకేషనల్ బ్రాడ్కాస్ట్ ప్రొడ్యూసర్.. నిజానికి కార్యక్రమాలను ఎక్కువగా రిపీట్ చేసేవారు. దాంతోటి ఆయనకు ఇది ఇబ్బందిగా ఉండేది.. దాంతో ఆయన నన్ను స్టేషన్ డెరైక్టర్ ఛాంబర్ కు తీసికెళ్ళేవారు.. స్టేషన్ డెరైక్టర్ మీరు రిపీట్ ఇవ్వొద్దు, కొత్త ప్రోగ్రాం చేయండి అంటే రాంబాబు చేస్తాడు అని నన్ను చూపించేవారు.. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది..అది వేరే విషయం అనుకోండి.

కులకర్ణి గారు స్టేషన్ డెరైక్టర్ గా వచ్చాక ఉషశ్రీ గారిని పిలిచి భాగవతం, భారతాలపై కొన్ని వారాలపాటు కార్యక్రమాలు చేయించారు. న్యూస్ పేపర్లో విజయాలు సాధించిన వారిపై వచ్చిన  క్లిప్పింగ్స్ మాకిచ్చి వారిని స్టూడియో కి పిలవమనేవారు. లేదంటే మమ్మల్ని రికార్డు చేసుకుని రమ్మనేవారు.

ఆయన స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్.. ఒక్కోసారి సడెన్ గా ఫోన్ చేసేవారు రాత్రిపూట తెలుగు వార్తలు అయ్యాక ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రసారమయ్యే పంటసీమలు కార్యక్రమం లో ఏ ఐటెం ప్రసారమవుతోంది.. ప్రసంగం చేసేదెవరు.. డీటెయిల్స్ చెప్పమనేవారు.. మాకు రియాక్ట్ అయ్యే టైమిచ్చేవారు కాదు.. పొరపాటున తడబడ్డామో.. మాకు క్లాస్ ఉండేది..

వారి సమయంలోనే “ప్రభాతలహరి” అనే ఐదు నిమిషాలు ప్రోగ్రాం చేసేవాడిని.. అది ఆయన బ్రెయిన్ చైల్డ్..ఆ ప్రోగ్రాం కి మిత్రుడు కలగ కృష్ణ మోహన్ చక్కటి సిగ్నేచర్ ట్యూన్ సమకూర్చాడు..మా సీనియర్ కొలీగ్ మంత్రవాది మహేశ్వర్, సీనియర్ అనౌన్సర్ రామం ఆ స్క్రిప్ట్ చదువుతుండేవారు.. ఇంట్రెస్టింగ్ న్యూస్ స్టోరీస్ ను తెలుగు లోకి తర్జుమా చేసి చదివించే వాడిని.. ఆ ప్రోగ్రాం ఎంతో కొంత పాపులారిటీ సాధించందనే అనుకుంటున్నాను 

కులకర్ణి గారు ఉదయం పూట జరిగే ప్రోగ్రాం మీటింగ్ కు వచ్చారంటే అందరికీ టెన్షన్.. ఆయన ముందురోజు ప్రసారమయిన కార్యక్రమాల మీద డీటెయిల్డ్ డిస్కషన్ చేసేవారు ..డ్యూటీ ఆఫీసర్ రాసిన ట్రాన్స్మిషన్ రిపోర్ట్ ఆధారంగా ఆయా సెక్షన్ల వారికి నోట్ పంపించమనేవారు.. అప్పట్లో ఒక కార్యక్రమం తిరిగి ప్రసారం చేస్తే RBF(repeat broadcasting fee) ఉండేది..ఆ డీటెయిల్స్ లేకపోతే ఊరుకునేవారు కాదు.. తరువాతి కాలంలో, దాన్ని CBR (complete broadcasting rights) చేశారనుకోండి.. దాని వలన ఇక RBF ఉందా లేదా అన్న మీమాంస లేదు. 

 అలాగే కులకర్ణి గారు ఆరు తర్వాత స్టూడియో లో ఎవరన్నా ఉంటే డ్యూటీ ఆఫీసర్ ను అడిగేవారు.ఎందుకున్నారు..మీ పర్మిషన్ ఉందా అంటూ.. ఎవరైనా సరే రికార్డింగ్ ఆరు లోపల ముగించాలని ఆయన కోరుకునేవారు.. దానితోపాటు   కార్యక్రమాల పట్ల ఆయనకు చాలా కమాండ్ ఉండేది..

కులకర్ణి గారి తర్వాత వచ్చిన వారు దుర్గా భాస్కర్ గారు.. వారు మంచి అడ్మినిస్ట్రేటర్, చక్కని గాయని..పర్ఫెక్షనిస్ట్ కూడా..అప్పట్లో ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రసారమయ్యే “ఉదయరేఖలు” కార్యక్రమం breakfast show గా దేశవ్యాప్తంగా మొదలెట్టారు.ఉదయం ఏడుంపావు అంటే ప్రైం టైం..ఆవిడ ఆ ప్రోగ్రామ్ పాపులర్ చేయటానికి కంకణం కట్టుకున్నారు..

ఆ అరగంట అటు డ్యూటీ ఆఫీసర్ కీ,ఇటు అనౌన్సర్ కీ చాలా టెన్షన్ గా ఉండేది.. అనౌన్సర్ ఏం చెప్పబోతున్నారు..ఏం పాట ప్లే చేయబోతున్నారు ఇవన్నీ ముందురోజు సాయంత్రం అనౌన్సర్ రాసి చూపించి ఓకే చేయించుకునేవారు.. దాని ప్రకారం అంతా జరగాలి.. ఏమాత్రం డీవియేషన్ ఉన్నా డ్యూటీ ఆఫీసర్ కు అక్షింతలే..

ఆ తర్వాత పదిగంటలకు జరిగే ప్రోగ్రాం మీటింగ్ లో స్టేషన్ డెరైక్టర్  ఆరోజున ఉదయరేఖలు కార్యక్రమం ఎలా ఉంది..ఎలా ఉంటే ఇంకా బావుంటుందో సీరియస్ గా చర్చించేవారు. 

డ్యూటీ ఆఫీసర్ కు వార్తల్లోని ముఖ్య అంశాలు ఫోన్ చేసి చెప్పాల్సిన బాధ్యత కూడా దుర్గా భాస్కర్ గారు స్టేషన్ డెరైక్టర్ గా ఉన్న సమయంలో ఉండేది.

ఆవిడలో మంచి సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఉండేది.మేము భయపడుతూ ఉంటే ఆవిడ ఛలోక్తులతో సీరియస్ వాతావరణాన్ని తేలిక పరిచేవారు.

మా డ్యూటీ ఆఫీసర్ లలో డి.బి.రాజేంద్రప్రసాద్ మంచి మిమిక్రీ ఆర్టిస్ట్.. మమ్మల్నందరిని ఇమిటేట్ చేసేవాడు.ప్రతివారిలోను ఉండే టిపికల్ మేనరిజం పెట్టుకునేవాడు.

స్టేషన్ డైరెక్టర్ కూడా దీనికి మినహాయింపు కాదు..ఒకసారేమయిందంటే.. ఆ కథ వచ్చే కాలమ్  లో!

*

"రేడియో" రాంబాబు

4 comments

Leave a Reply to శ్యామల కల్లూరి Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఒకే బిగువున చదివించేలా రాస్తున్నావ్ రాంబాబు. ఆకాశవాణి కబుర్లు ఆసక్తిగా ఉన్నాయి.

  • ఎడిటర్ గారూ, అసంపూర్తిగా ఉందనిపిస్తోంది. మధ్యలో ఆపేసారా!

  • మా చిన్నతనంలో అంటే 1960లలో రేడియో ప్రతీ ఇంటా మోగుతూనే ఉండేది. ఆలిండియా రేడియో అంటే మాకు – విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్….మధ్య మధ్యలో వివిధ్ భారతి, రేడియో సిలోన్. మూడు పువ్వులు, ఆరు కాయలు. రేడియో అంటేనే సమయపాలన అని అప్పుడే తెలుసు. రాత్రి తొమ్మిది గంటలకు ఇంగ్లీషు న్యూసుకి ముందు వచ్చే బీప్ సిగ్నల్ ఆధారంగా నాన్నగారు తన చేతివాచీ సరిచూసుకొనేవారు. అయితే ప్రసారాల వెనుక ఇంత హడావుడి, ఇన్ని ప్రణాళికలు, ఇంత ఉద్రిక్తత, సమన్వయం ఉంటాయని ఇప్పుడే తెలిసింది. తెరవెనుక (స్పీకర్ వెనుక అనాలేమో) ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు, మిత్రమా!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు