కెంగార మోహన్ కథల పుస్తకం ‘బ్లాక్ రెయిన్ బో ‘ నిండా దళిత వేదన, ఆక్రోశం, ఆగ్రహం కనిపిస్తాయి. మారుతున్న పరిస్థితుల్లో మారని వివక్ష తాలూకు వివిధ రూపాల్ని చిత్రించే కథలివి.కర్నూలు జిల్లా గ్రామీణ సామాజిక వాస్తవికత ఆధారంగా రూపొందిన కథలే ఇందులో ఎక్కువ. పట్టణ నేపథ్యంలో నడిచిన కథలూ కొన్ని ఉన్నాయి.ఈనాటి దళిత అస్తిత్వానికి చెందిన విభిన్న డైమన్షన్ను ను బయటపెట్టిన కథలివి.
భూమిని కాజేయాలనే స్వార్ధంతో ఆధిపత్య కులస్తులు సృష్టించిన ఘర్షణ ల్లో ఎస్సీ బీసీ ప్రజలు ఇరుక్కుపోయి ఒకరినొకరు హతమార్చుకునే ప్రయత్నం లో చివరికి ఎస్సీ మాదిగలు హత్యకు గురైన వాస్తవాన్ని రికార్డు చేసిన కధ ‘సమిధలు ‘.అటు ఎస్సీ లు గానీ ఇటు బీసీ లు గానీ ఒకరినొకరు ద్వేషించుకోక పోయినప్పటికీ గ్రామ రెడ్డి భూస్వామి పన్నిన పన్నాగంలో సమిధలయి న తీరును ఈ కధ చూపుతుంది.కుల బలంతో కురువ క్రిస్టియన్ లు మాదిగ క్రిస్టియన్ లను క్రూర వివక్ష కు గురిచేసిన వైనన్ని ‘వసంతం ‘ కధ వెల్లడి చేసింది.ఎస్సీ బీసీలు ఇద్దరూ క్రిస్టియన్లు ఐన సందర్భం లోనూ కులాధిపత్యం తో బీసీలు
కురువ -మాదిగ ప్రేమ వివాహాన్ని కాలరాచిన ఉదంతమీ కధ.
కురువ కులపు వసంత, మాదిగ కులపు మనోహర్ ప్రేమించుకున్నందుకు మనోహర్ ఆత్మహత్య చేసుకునే శిక్షను విధించిన భయంకర వ్యవస్థ ను ఈ కధ కదిలించే రీతిలో స్పష్టంగా చూపుతుంది.బోయ కులస్తుల ఆధిపత్యాన్ని ప్రశ్నించినందుకు మాదిగ నారణప్ప బోయోళ్ల చేతుల్లో సర్వనాశనమయ్యిన తీరును ‘పైగేరి నారణప్ప కధ ‘ బలంగా పట్టుకుంది.ఇలా ఈ పుస్తకం లో ఆధిపత్య కులస్తుల వల్లనూ, కుల వ్యవస్థ నుంచి పుణికిపుచ్చు కున్న ఆధిపత్యాన్ని అమలు చేసే బీసీ ల వల్లనూ దళితులు ఎదుర్కొంటున్న వివక్షను రచయిత నిర్మొహమాటంగా బయట పెట్టాడు.బీసీ లు ఆధిపత్యకుల వారసత్వాన్ని అందిపుచ్చుకుంటున్న దృశ్యం, దళితుల్ని అణచివేస్తున్న దృశ్యం ఈ కథల ప్రత్యేకత. ఒక పక్క బహుజన ఉద్యమాలు ఎస్సీ బీసీ లను కలపటానికి ప్రయత్నిస్తుంటే మరో పక్క బ్రాహ్మణవాద మాయలో పడి ఎస్సీ ల మీద బీసీ లు దాడులు చేస్తున్న ట్రెండ్ ను రచయిత పట్టుకోగలగడం అభినందించదగ్గ విషయం. బీసీ ల ఆధిపత్య మత్తు ఏ స్థాయిలో ఉంటుందో చూపడానికి బోయోళ్ళు “సర్ల్యా గౌడా, సర్లే రెడ్డీ ” అని మాదిగల చేత పిలిపించుకుంటూ ఉండే సన్నివేశాలను రచయిత చూపుతాడు.
వ్యవసాయ కోణం నుంచి దళిత కుటుంబాలు దివాలా తీసిన స్థితి ని పట్టుకున్న కధ ‘వాన మెతుకులు ‘. ఈ కధ లో వ్యవసాయం కలిసిరాక గుంటూరు వైపు మిరపకాయ కూలికి వలస వెళుతూ స్కూల్లో మంచిగా చదువుకుంటున్న కూతుర్ని కూడా తమతో పాటు కూలి పనికోసం తీసుకెళ్లిన హనుమప్ప వ్యధ ను మన అనుభవం లోకి తెస్తాడు రచయిత.పిల్లల చదువును మధ్యలోనే ఆపిన పరిస్థితి కి అద్దం పట్టిన మరో కధ ‘ ఊరి దేవర ‘. ఫ్యాక్షనిజం లో చిక్కుకొన్న ఒక దళిత కుటుంబం లోని అడకూతురు బేలగా బతుకును ఈడుస్తూ తన కూతురు చదువు ను మధ్య లోనే అపి పెళ్ళికి ఏర్పాటు చేస్తుంది.వానలు లేకా, ఎన్ని బోర్లేసినా నీళ్లు పడకా వ్యవసాయం దుఃఖభరితంగా, హింసాత్మాకంగా పరిణమించిన సందర్భం లో ఆత్మహత్య చేసుకున్న గాది లింగప్ప కధ ను ‘మట్టి మనిషి ‘లో చూస్తాం.
ఉద్యోగస్తులుగా పట్టణ జీవితం గడిపే దళితుల జీవితాలు కూడా వివక్ష కు దూరంగా లేవు. దళిత ఉద్యోగుల మీద అవినీతి కేసులు బనాయించడం, వారి ఇళ్ల మీద రైడ్లు చేయటం పరిపాటిగా మారిపోయిన దుర్నీతిని ‘ నీ కృప నాకు చాలును ‘ కధ ఎండగడుతుంది.పై అధికారులు చెప్పినట్లు అన్యాయలకూ అవినీతి కీ పాల్పడని నిజాయితీ పరుడైన ఈశ్వరప్ప మీద తప్పుడు ఆధారాలతో సస్పెండ్ చేసిన ఘటన ఈ కధ లో చూస్తాం.ఈశ్వరప్ప సస్పెన్షన్ కాలంలోనే రిటైరవ్వడం, తనకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ పెండింగులో ఉండటం చదువరులను బాధిస్తుంది.ఈ కధలో దళిత ఉద్యోగిని అయిన సువార్తమ్మ విషయం లో తోటి దళితులే అక్కసుతో ఆమె మీద కంప్లైంట్ ఇచ్చినట్లు రచయిత అర్ధంచేయిస్తాడు.’భాగ్యమ్మ ‘ కధ మరో కోణాన్ని పట్టిస్తుంది. చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న కొడుకులు పట్టించుకోని పక్షం లో దిక్కులేక పిచ్చెక్కి పారిపోయిన తండ్రి నీ, ఇళ్లల్లో పనులకు వెళుతూ అడుక్కు తిని బతికే తల్లినీ చిత్రిస్తుంది ఈ కధ.ఇవి కాక వేరే ఇతి వృత్తాలతో నిర్మించిన మరో రెండు కధలు ఈ పుస్తకం లో ఉన్నాయి.
పల్లెటూరు దళిత జీవితాన్ని డీల్ చేస్తున్న కధల్లో గ్రామీణ దళిత భాషను సాధికారికంగా ప్రదర్శించగలిగాడు కెంగార మోహన్. స్థానిక గ్రామీణ నుడి, పలుకుబడి, యాస సహజ సిద్ధంగా పాత్రల సంభాషణ కు అమరిపోయే ఆర్టును సాధించగలిగాడు.అయితే కధ చెప్పే పధ్ధతికి సంబంధించి మరి కొన్ని మెళకువలు అవసరం. వాటిని తాను సాధించగలడు. కధా నిర్మాణ విషయం లో ఇతనిది సంప్రదాయ విధానం కాదు. గాడి నుంచి బయటపడే ప్రయత్నం కనిపిస్తుంది. ఇది అనుకూల విషయం.అనవసర మషాలా దట్టించే శైలి కాదు ఇతనిది. వీలున్నంత నాచురల్ గా కథను అల్లటానికి కృషి చేశాడు. పాఠకుల్ని ఇంప్రెస్ చేసే కృత్రిమ ప్రయత్నం ఎక్కడా కనిపించదు.ముందు ముందు ఇతను కధా కళ మీద మరింత పట్టు సాధించగలుగుతాడనే నమ్మకం కలుగుతుంది.రాయలసీమ దళిత కధకు మరో నూతన చేకూర్పు ను అందించిన కెంగార మోహన్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు.
*








కెంగార మోహన్ కథల సంపుటి ‘బ్లాక్ రెయిన్ బో’ పై మీరు అందించిన ఈ విశ్లేషణాత్మక వ్యాసం ఆలోచింపజేసేదిగా ఉంది. పుస్తకంలోని ప్రతి కథ వస్తువును, దళితులు ఎదుర్కొంటున్న బహుముఖ వివక్షను (ముఖ్యంగా మారుతున్న సామాజిక సమీకరణాల్లో బీసీల ఆధిపత్య ధోరణిని) చాలా నిశితంగా పట్టుకుని విశ్లేషించారు. రచయిత భాషా శైలిని, కథా నిర్మాణంలోని సహజత్వాన్ని లోతుగా అంచనా వేస్తూనే, కథా కళపై ఆయనకు మరింత పట్టు రావాలని ఆకాంక్షించిన మీ విమర్శనాత్మక దృక్పథం ఈ వ్యాస గౌరవాన్ని పెంచింది.
రాయలసీమ వర్తమాన జీవనచిత్రాన్ని పాఠకులకు పట్టిచ్చిన కథలు. వైవిధ్యమూ, నూతనమైన కథాంశాలు ఎన్నుకుని రచయిత కథలను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.
“అంటరాని ఆకాశంలో ‘నల్లని హరివిల్లు’”
చీకటిని ముక్కలు చేస్తూ ఆకాశంలో విరబూసే కాంతిని మనం ఇంద్రధనుస్సు అంటాం. కానీ, ఆ కాంతికి కూడా తన రంగులను అంటనివ్వని ఒక అదృశ్య, నిశ్శబ్ద, క్రూరమైన ఆధిపత్యం ఈ దేశంలో పదిలంగా ఉంది. అదే కులం.
కెంగార మోహన్ రాసిన “బ్లాక్ రెయిన్ బో” కేవలం ఒక దళిత కథల సంకలనం కాదు. అది ఈ దేశపు ‘గొప్ప’ ప్రజాస్వామ్య పునాదుల కింద, తరతరాలుగా ప్రాణాలు కోల్పోయి, చరిత్రలో అదృశ్యమైన నెత్తుటి గాయాలకు సజీవ సాక్ష్యం.
అధికారం ఎప్పుడూ పైనుంచి కిందికి ప్రవహిస్తుంది, దానికి ఎదురీదే చిన్న ప్రాణాలను కబళిస్తూ. మోహన్ కథలు ఆ ‘చిన్న విషయాల’ గురించే మాట్లాడతాయి.
రాయలసీమలోని తుంగభద్ర తీరంలో, నెర్రెలు బారిన మట్టి వెనుక దాగున్న అంతులేని దుఃఖాన్ని, అగ్రకుల, పితృస్వామ్య, భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థల దోపిడీని ఆయన తన అక్షరాల్లో బంధించారు. ఈ కథల్లో హింస అనేది ఎక్కడో జరిగే ప్రమాదం కాదు, అది వ్యవస్థాగతమైనది. అది పోలీసుల లాఠీల్లోనూ, గ్రామ పంచాయతీల తీర్పుల్లోనూ, అగ్రవర్ణాల కళ్ళల్లోని నిశ్శబ్ద క్రూరత్వంలోనూ అనునిత్యం శ్వాసిస్తూనే ఉంటుంది.
కార్పొరేట్ రాబందులు, కుల అహంకారులు చేతులు కలిపిన ఈ వ్యవస్థలో, ఒక దళితుడి ఆత్మగౌరవపు కల, ఒక మట్టిమనిషి స్వతంత్రంగా బతకాలనుకునే ఆశ ఎంత సులభంగా నలిగిపోతాయో ఈ కథలు మన చెవిలో గుసగుసలుగా చెబుతాయి.
ఇక్కడ భూమిని కోల్పోవడం, వలసపోవడం కేవలం వ్యక్తిగత విషాదాలు కావు. అవి ఈ కుల, వర్గ యంత్రాంగం ఉద్దేశపూర్వకంగా చేసిన ‘వ్యవస్థాగత హత్యలు’.
ఈ పుస్తకం చదువుతున్నప్పుడు మనకు స్పష్టంగా అర్థమయ్యే నిజం ఒక్కటే. మన చట్టాలు, న్యాయస్థానాలు పై కప్పు లాంటివి కావచ్చు, కానీ ఈ సమాజపు పునాది మాత్రం కులం, అంటరానితనం, దోపిడీ రాళ్లతోనే నిర్మించబడింది. మోహన్ వాక్యాలు పదునైన గాజు పెంకుల్లా మన అహంకారాన్ని, నిశ్శబ్దాన్ని కోస్తాయి.
ఆయన పాత్రలు బాధను మౌనంగా భరించే అనామకులు కారు. తమ నెత్తుటితో రేపటి చరిత్రను తిరిగి రాయడానికి సిద్ధపడిన వీరులు. ఈ దేశపు చీకటి ఆత్మను వినయంగా కాకుండా, ఆగ్రహంతో ప్రశ్నించాలనుకునే ప్రతి ఒక్కరూ చదవాల్సిన కవిత్వం ఈ “బ్లాక్ రెయిన్ బో”.
సమీక్ష పాఠకుడిని పుస్తకం కొనిపించి చదివించేలా ఉంది…