పర్వతాలూ, సరస్సుల మధ్య ……

మధ్య నేను నా కొడుకు, కోడలు, వారి ఇద్దరు పిల్లల తో సహా ట్రకీ అనే టౌన్ కు వెళ్ళాము. ఇది సాన్ ఫ్రాన్సిస్కో కు రెండు వందల మైళ్ళ దూరాన  ఈశాన్యంలోని  పర్వతాలలో  ఉండే టౌన్.  మాకు సాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా నుండి  ఇక్కడికి కారులో  రావటానికి దాదాపు నాలుగు గంటలు పట్టింది. ట్రాఫిక్, రోడ్ రేపైర్లు, మధ్యలో ఆగటం లాంటివి లేకపోతె, మూడు గంటల లోపే చేరవచ్చు.

ప్రతి చలికాలం, నా కొడుకు కుటుంబం  సెలవుల్లో  ఇక్కడ స్కి  కోసం రావడం ఆనవాయితీ. వారికి ట్రకీ అంటే మంచుతో నిండి తెల్లని కొండలమధ్య స్కి చేసే వారికోసమే ఉన్నదనిపించే టౌన్. కానీ ఇప్పుడు కొత్త రంగులతో ముస్తాబై కనిపించటంతో వారికి వింతగా అనిపించింది. పూర్వ జన్మలోవి గుర్తు చేసుకున్నట్టు, వారికి తెలిసిన ప్రతి మూలా చలి కాలంలో ఎలా ఉండేదో  పోల్చి చూసుకునే  పనిలో పడ్డారు.

అలా అని మేము ప్లాను, గట్రా లేకుండా వచ్చామని అనుకోవద్దు సుమీ! మేము చేయవలసిన కార్యక్రమాలు ఆలోచించుకోవటమే కాదు, వాటికీ కావాల్సిన సరంజామాతో సహా ట్రకీలో దిగి పోయాం.

మొదటి సారిగా ఇక్కడకు వచ్చేవాళ్ళు డోనర్ మ్యూజియం  కు వెళ్ళటం రివాజు. ఈ మ్యూజియంలో ముఖ్యంగా తెలుసుకోవలసినది – సీయిరా  నెవాడా పర్వతశ్రేణుల్లో ఉన్న డోనర్ పాస్ లో దిక్కు, దారి తెలియక చలిలో ఇరుక్కుపోయి విషాద పరిస్థితుల్లో చనిపోయిన వారి కథ. ఇది పందొమ్మిదవ శతాబ్దపు మధ్య భాగంలో జరిగిన సంఘటన. అందరం  ఈ మ్యూజియం చూసిన వాళ్ళమే  కాబట్టి,   అక్కడకు వెళ్లక పోయినా, దానిని గుర్తు చేసుకోకుండా మాత్రం ఉండలేక పోయాం.

ఇప్పటి మా ప్లానంతా బయటి వాతావరణంలో, అక్కడ పరిసరాల్లో గడపడమే – ట్రకీ నదిలో రబ్బరు ట్యూబుల్లో విహారం చేయటం,  పర్వతాలెక్కి ఎంతో ఎత్తున ఉన్న షర్లీ అనే పేరున్న సరస్సుకువెళ్లటం,  డోనర్ అనే పేరున్న సరస్సు దగ్గర ఉన్న వనంలో నడవటం.   పెట్రోల్ లేక పొతే బండి నడవదని గ్రహించిన వాళ్ళం కాబట్టి పొట్ట పూజనసలు అశ్రద్ధ చేయలేదుసుమండీ!  ఉదయం భోజనం మా వసతి లో నచ్చినవి తినటం, కంటికింపయిన ప్రదేశంలో మధ్యాహం పిక్నిక్, నోటికింపయిన రెస్టారెంటులో రాత్రి భోజనం.

మేము వచ్చిన రాత్రే, గదులెక్కడో చూసుకొని సర్దుకునే లోపులో, నా ఆరేళ్ళ మనవడు, మంచి నీళ్లు తెచ్చుకొనే మిషతో ఐస్ క్యూబ్స్ కలపటం తో పాటు కాఫీ, చాకొలేట్ వంటి పానీయాలేలా చేయవచ్చో చిటికెలో కనిపెట్టటమే కాకుండా, హోటల్లో ఏ మూల ఎక్సర్ సైజు రూమున్నదో, ఎక్కడ స్విమ్మింగ్ పూల్, హాట్ టబ్ ఉన్నాయో, ఎవరినడిగి ఏమి తెచ్చుకోవాలో కనుక్కొని, హోటల్ ఓనరుకు కూడా లేని ధీమాతో,  పిలిచినా పట్టించుకోకుండా కనిపించిన వాళ్ళతో కబుర్లు చెప్తూ బిజీ అయిపోయాడు. వాడికి, నాలెడ్జి వల్ల పవర్ ఎలా తెచుకోవచ్చో ఈ పాటికి కొట్టిన పిండి అయిపొయింది. ఆ నాలెడ్జి లేని వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదని కూడా తెలుసుకున్నట్టున్నాడు. ఈ లోపులో  వాడి అన్న మాత్రం ఒక చేతిలో పుస్తక భూషణంతో అడిగిన పని మాత్రం హడావుడిగా చేసి మళ్ళీ పుస్తక ప్రపంచంలో దూరి పోయాడు. బయటి ప్రపంచం చూడొచ్చు కదా అనే సలహా వాడి చెవికి సోకె దారే లేదు. అదీ ఒకందుకు మంచిదేనేమో, లేకపోతె, హోటల్ స్టాఫ్ మామీద పడే వారేమో!

లేక్ టాహో

ముందు రోజు సాయంకాలము లేటుగా వచ్చామేమో, తెల్లవారి  చాల తీరికగా బయట అడుగు పెట్టాము.  దారిలో ఇష్టమయిన బేకరీ షాప్, ఇంకా ఇతరత్రా పనులు చూసుకొని అప్పుడు లేక్ టాహో వైపు వెళ్ళాము. లేక్ పక్కన రక రకాల పైన్ చెట్లు. పిక్నిక్ కు కావలసిన సదుపాయాలతో చాల అందంగా, ప్రశాంతముగా ఉన్న ఒక ప్రదేశంలో ఆగాము. దిగీ దిగటంతోనే చిన్న వాడు ముందే ప్లాన్ వేసుకొని ఫిషింగ్ చేసే వాళ్ళను బాగా పరిశీలించి ఫిషింగ్ కర్ర దాని తాడు, దానికి ఒక చివరలో హుక్ కట్టి పదిలంగా తెచ్చుకొని, దానితో  ఒక బండ మీద కూర్చొని చాల శ్రద్ధతో, ఫిషింగ్ మొదలు పెట్టాడు. చిన్న పిల్లలను గౌరవించాలనే ఈ దేశమర్యాదను పాటించి   మేము బుద్దిగా ఉండటమే కాకుండా,  ఎన్ని చేపలు పట్టావనే తిక్క ప్రశ్నలతో వాడిని వేధించలేదు.

నీటిలో ఉన్న బాతులు కూడా వాటి దారిన అవి ఈదుతూ, మధ్య మధ్యలో చేపలు మింగుతూ ఈ సరస్సుకు మేమె రాజుల మన్నంత ఠీవి గ సూర్య రశ్మిని ఆస్వాదిస్తూ తిరుగుతున్నాయి. వీటన్నిటినీ చూస్తూ,  తెచ్చిన పదార్ధాలను భోజనానికి సిద్ధం చేసి,  అందరం తింటుంటే, మేమూ మీకు కంపెనీ ఇస్తామనుకుంటు బిల బిల కెనడియన్ బాతులు వచ్చాయి.  ‘ఆహా, అవును, మీరు రావటం బాగానే ఉంది కానీ, మీరు తినే చేపల లాగా మా భోజనం ఉండదు, పార్కు వాళ్ళు మమ్ముల్ని ఊరుకోరు, వచ్చిన దారినే పోండి’ అని చెప్పకనే చెప్పి ముగించాము.

అన్నీ మళ్ళీ కారులోకి ఎక్కించి  ట్రక్కీ నదిలో ట్యూబింగ్ చేయడం కోసం బయలు దేరాం. ఆ నది వెంటే మంచి ప్రదేశం కోసం వెతుక్కుంటూ ఒక దగ్గర ఆపాము.

కోడలు, కొడుకు ఒకొక్క ట్యూబ్ ట్రంక్ నుండి తీసి గాలి ఎక్కించే పనిలో పడ్డారు. తెచ్చుకున్న మెషిన్ కొంత వరకే పని చేస్తున్నదని తెలిసింది. వారు దగ్గరలో ఉన్న షాప్ లో ఒకొక్కటి గాలి కొట్టించి తీసుకు వచ్చే లోపులో నేను, నా మనవళ్ళు  దగ్గరలో నున్న నది ఒడ్డుకు చేరాము. పిల్ల గాలి నిశ్శబ్దంగా శరీరాన్ని తాకుతున్నది. పిట్టల కిల కిలరావాలు మృదువుగా వినిపిస్తున్నాయి. ఈగలు, దోమలు మాత్రం వెతికినా లేవు. ఉత్తర ప్రాంతపు కాలిఫోర్నియాలో ఉండే ఆనందమిదే. నాకయితే, సాన్ ఫ్రాన్సిస్కో  బే ప్రాంతాన్ని జనం ఇష్టపడడానికి ఇది కూడా ఒక ముఖ్యమైన కారణమనిపిస్తుంది. వాతావరణం ఎంత బాగా ఉన్నదంటే, ప్రతి రోజు ఫోనులో మా అమ్మ చెప్పే మాటలు గుర్తుకొచ్చాయి. తాను స్వర్గంలోనే ఉన్నానని తృప్తి పడడమే కాకుండా, మమ్మల్ని కూడా తృప్తి పరిచే మా అమ్మ అనేది – ‘అమ్మాయి, ఇక్కడ వేడిగా లేదు, చల్లగా లేదు, చాల బాగుందమ్మా.” వేసుకున్న స్వెట్టర్ తీసివేసి, పల్చటి కాటన్ జుబ్బాతో కొత్తగా స్వేచ్ఛ వచ్చినట్లుగా ఫీల్ అయి అక్కడ ఉన్న కొత్త రకం చెట్లనీ, పొదలను, తీగలను, పారుతున్న నదిని, నదిలో సంతోషంగా మాట్లాడుకుంటూ తిరుగుతున్న వారినీ చూస్తూ, భూతల స్వర్గమంటే ఇదే కదా అనిపించింది. కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళవచ్చు లేదా కళ్ళు బాగా తెరచి ఈ అందాన్ని తాగవచ్చు. ఇంత దూరం వచ్చినందుకు, నా మనవడ్లను చూసుకునేందుకు కూడా నాకు రెండవదే బాగా అనిపించింది.

పెద్దవాడు, నా పక్కన సిమెంట్ బెంచీ మీద కూర్చొని పుస్తకంలో దూరితే, చిన్నవాడు, పడవలు, ట్యూబులతో  అక్కడకు చేరిన వాళ్ళను ప్రశ్న మీద ప్రశ్న వేసి విషయ సేకరణలో మునిగి పోయాడు. వీలయితే ఎవరో ఒకళ్ళ ట్యూబునో, పడవనో పట్టుకొని ఆడేవాడేమో కానీ, వాళ్ళు బయలుదేరే హడావుడిలో ఉండి వీడి మాటలకి పడిపోయే స్థితిలో లేరని వాడికి తెలిసింది. ఈ లోపులో పెద్దవాడు లేచి నది ఒడ్డుకు చేరి గులక రాళ్లను నీళ్లలో జుంప్ చేయిస్తూ, వాడి బేస్బాల్ పిచింగ్ నేర్పరితనమంతా చూపిస్తున్నాడు. నేను లేచి వాడిని, వాడిని అనుకరిస్తున్న చిన్న వాడిని మెచ్చుకుంటూ అక్కడకు వచ్చిన వారితో పిచ్చా పాటీ మాట్లాడటం మొదలు పెట్టాను.

ఇంతలో మా కోడలొచ్చి, ట్యూబులు రెడీగా ఉన్నాయని, స్విమ్మింగ్ డ్రెస్ లోకి మారమని చెప్పటంతో, కారు దగ్గరకు వెళ్లి కావలసిన సామగ్రితో తిరిగి వచ్చి నదిలో దిగాం.

నా మొట్ట మొదటి ట్యూబింగ్‌

మా కుటుంబ విహారయాత్రలో ట్రక్కీ నదిలో ట్యూబింగ్ చేయడం ఒక అడ్వెంచర్ అనే చెప్పాలి.

లేక్ టాహో నుంచి ప్రారంభమయ్యే ఈ నది సుమారు 120 మైళ్లు ప్రవహిస్తూ రెనో నగరాన్ని దాటి నెవాడా రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. అయితే మా ట్యూబింగ్ ప్రయాణం టాహో సిటీ నుంచి రివర్ రాంచ్ వరకు ఉన్న రెండు గంటల నదీమార్గానికే పరిమితమైంది.

ట్యూబింగ్ చేయడానికి నదిలో తగినంత లోతు ఉండాలి. లేకపోతే అడుగున ఉన్న రాళ్లకు ట్యూబులు చిరిగిపోయే ప్రమాదం ఉంటుంది.

మేము ఈ ట్యూబింగ్‌లో పూర్తిగా కొత్తవాళ్లమే. అయినప్పటికీ చాల మంది ట్యూబర్లు, రాఫ్టర్లు అవలీలగా నదిలో విహరిస్తుండడం చూసి ధైర్యం వచ్చింది. ట్యూబుల్లో హాయిగా తేలుతూ, చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ అలవోకగా రివర్ రాంచ్ కి చేరుతామని మా ఊహ.

అయినా ఊహను పట్టుకొనే వేళ్లాడమనుకోవద్దు. ఎన్నోసార్లు ఆ నదిలో ట్యూబింగ్ చేసిన ఒక ఆయనను వివరాలడిగితే, ఆయన మాములుగా భరోసా ఇవ్వలేదు. ఆయన అచ్చంగా ఇలానే అన్నాడు:  కొన్ని చోట్ల నీరు తెర్లుకుంటూ ఉరుకులతో, చాల ఎత్తునుంచి కిందకు పడుతుంది, కానీ (ఈ కానీ కి చాల దీర్ఘం ఉంది లెండి) మొత్తమ్మీద తేలికే అని నొక్కి పలికాడు. నేను, నా కొడుకు ఎన్నో సార్లు పడవ నడిపిన వాళ్ళమే. పిల్లలతో సహా అందరికీ ఈతలో ప్రవేశముంది. రెండే తెడ్లున్డటం వల్ల, ఇంకా జాగ్రత్త కోసం, నా కోడలు, పెద్దవాడు ట్యూబ్లని కలుపుకొంటే, నేను, మావాడు, చిన్నవాడు ట్యూబులు కలుపుకొని, తెడ్ల భారం కోడలు, కొడుకుకు వదిలేశాం.

ఇన్ని చేసినా “తేలికే” అనే పదానికి అర్థం ఒక్కొక్కరి స్కిల్ నే బట్టి ఉంటుందని తెలుసుకొనే సరికి మేము నీటిఉరవడితో పాటు పైనుంచి కిందకు దూకుతూ పైకి కనిపించకుండా  నీటి మట్టానికి అనుకోని  ఉన్న రాళ్లనూ, నీటి పైకి చిన్న కొండల్లా కనిపిస్తున్న బండలనూ తప్పించుకొనే  పనిలో మునిగి పోయాం. దీనికి తోడు ఉరవడిగా పారె నదికి రెండు వైపులా మీదకు వంగి ఉన్న పెద్ద చెట్ల కొమ్మలు. వాటి మొద్దులు మమ్మల్ని   మొట్టికాయలు వేయకుండా ఒకరినొకరు హెచ్చరించుకుంటూ సర్కస్ ఫీట్లు. ఇటు రాళ్లను, అటు చెట్లను తప్పించుకొని బయటయపడినప్పుడంతా సంతోషంగా చప్పట్లు, నవ్వులు. పరిసరాలను జాగ్రత్తగా చూసుకొని వెళ్తున్నామేమో, అంత దూరంలో ఒక ఒడ్డున ఆనుకున్న రాతిమీదనీటిలో ఉండే  ఆటర్ అనే చిన్నజంతువు  ఒక శిల్పమా అనేట్లుగా కదలకుండా నుంచొని కనిపించింది. దగ్గరగా వచ్చేసరికి, అది నీటిలో దూకి మిగిలిన మందతో కలసి ఈదుకుంటూ, మాముందునుంచి అవతలి ఒడ్డుకు చేరింది. మా ట్యూబులన్నీ ఆపుకొని ఆ అనుకోని అదృష్టాన్ని  తనివితీరా చూసి, తృప్తిగా ముందుకు పోయాం.

కొంతసేపటికి  సూర్యుడు మేఘాల వెనుక దాక్కున్నాడు. నల్లని మేఘాల మీదనుంచి చల్లని గాలులు వీచడం ప్రారంభమైంది. చల్లని నీళ్ళతో తడిసి, శరీరం వణుకుతుండటంతో, ముఖ్యంగా చిన్నవాడు పళ్ళు టక టక లాడించటంతో, ఒడ్డుకు చేరటానికి అనువైన చోటును చూసుకుంటూ కదిలాం.

ఒక అనుకూలమైన ఒడ్డును చేరుకుని ట్యూబులలోని గాలిని వదిలేశాము. అవి పట్టుకొని సమీపంలోని రెస్టారెంట్ వైపు నడక సాగించాం. పెద్ద ఉరుములు తో తుంపర మొదలయింది.  మొదట చెప్పులతో నడిచినా, కొంతదూరం తరువాత వాటిని చేతిలో పట్టుకుని నడిచి రెస్టారెంట్ చేరాము. ఇది ఎప్పుడు కొడుకు, కోడలు వచ్చే రెస్టారెంట్ అయినా ముందుగా రిజర్వేషన్స్ లేకుండా రావడానికి వీలు కాదు. పైగా డ్రెస్ కోడ్ కూడా ఉన్నది. అయినా ఓనర్ మమ్మల్ని లోపలి రమ్మని పిలవటమే కాక, నా కొడుకు ఉబర్ తీసుకొని వెళ్లి కారు తెచ్చేసరికి లేటవటంతో, ఆ రోజు మాకు బయట భోజనం దొరకదని తెలిసి, టేబుల్ ఖాళీ అవటంతో,  ఒంటిమీద సరయిన బట్టలు లేకపోయినా మాకు డిన్నర్ చేయటానికి అనుమతిచ్చింది.  ఎంతో మంది మనకు తెలిసో తెలియకో చేస్తున్న సహాయం వల్లనే మనమీవిధంగా ఉండగలుగుతున్నామనే కృతజ్ఞతను ఆమె ఆదరంమరొకసారి గుర్తు చేసింది.  మా వాడు కారునుంచి తెచ్చిన బట్టలను ఆత్రంగా తగిలించొకొని తినటానికి కూర్చున్నాము.

ఆ రకంగా, మా అడ్వెంచర్ ముగించి, రెస్టారెంట్‌లో వెచ్చగా కూర్చొని, కిటికీనుంచి బయట ఉరకలేస్తూ వడిగా పెద్ద రాళ్ల మీద నుంచి శబ్దం చేస్తూ పరిగెత్తుతున్న నదిని చూస్తూ వేడి భోజనం తింటూ ఆ రోజులో చేసినవన్నీ తిరగ తోడుకున్నాం.  అప్పుడు ముందుగానే ట్యూబింగ్‌ ముగించి మంచి పని చేశామనుకొని సంతోషపడ్డాం. అయితే వెనక్కి తిరిగి చూసుకుంటే అది నిజంగా అనుకోని అడ్వెంచర్. కాదనేదేమీ లేదు. అయినా కూడా, బహుశా అందువల్లనేనేమో అది ఎంతో మరపురానిది, అపురూపమైనది కూడా.

పర్వతాల నెక్కి చేరుకొనే షర్లీ సరస్సు

షర్లీ సరస్సును చూడటానికి పోవడం, అన్నిటికంటె కష్టమైనా అంత ఇష్టంగానూ  అనిపించింది.  వేసవి కాలపు అందాలన్నీ నింపుకున్న పర్వతాలు నన్ను వచ్చి చూడు అని మురిపిస్తాయి. ఎక్కడం తేలిక కాకపోయినా, వాటి అందాలు మన కష్టాన్ని మరిపిస్తాయనటంలో అబద్దం అసలు లేదు. అక్కడ నాకు తెలిసినవి, ఎన్నో తెలియని రక రకాలపూలు ఇవి నిజంగా  అడవి పూలేనా ఎవరైనా వేసి పెంచుతున్నారా అనిపించేటట్లున్నాయి.  వాటికి తోడుగా అక్కడక్కడా జలపాతాలు కనులకు పండుగ చేస్తాయి.

కాలిఫోర్నియాలోని ఒలింపిక్ వ్యాలీ సమీపంలో, సియెరా నెవాడా పర్వతశ్రేణుల్లో సుమారు 8,200 అడుగుల ఎత్తులో షర్లీ సరస్సు ఉంది. షర్లీ కాన్యన్ గుండా సాగే కాలిబాట పర్వతాల పైకి దాదాపు మూడు మైళ్ల పొడవుంటుంది. అందువల్ల ఇది కొంచెం కష్టమైన పనిగానే లెక్క. మేము స్క్వా పీక్ రోడ్డుకు ఉత్తర భాగం చివర  నుంచి ఎక్కాము. ఎక్కువ బరువులు మోయకూడదనే ఉద్దేశ్యంతో, మధ్యాహ్నం భోజనానికి  కొద్దిపాటి తినుబండారాలు, తాగునీరు మాత్రం తీసుకెళ్లాము.

కొన్ని చోట్ల ప్రకృతి అంతా మెట్ల తోటలా కనిపించింది. రంగురంగుల అడవి పూలు పర్వత వాలులపై సహజసిద్ధమైన పుష్పతోరణాల్లా మమ్మల్ని రా రమ్మని పిలుస్తున్నట్లుగా అనిపించింది. ఎక్కడం మొదలు పెట్టగానే లోయలో ప్రవహిస్తున్న చిన్న వాగు మిమ్మల్ని కొద్దీ దూరం పంపుతానంటూ తోడుగా వచ్చింది. అక్కడక్కడా ఎదురైన జలపాతాలు మా అలసటను పోగొట్టి పై పైకెక్కమంటూ ఆనందాన్ని చిలకరించాయి.

మార్గమధ్యంలో ఉత్సాహంగా నడుస్తున్న వారినీ, అలసిపోయి కూర్చొన్న వారినీ కలుసుకున్నాము. అలాటి వారిలో ఒక యువకుడు మాతో మాటలు కలిపి ఒకాయన తిరిగి వస్తూ తనతో, “షర్లీ సరస్సు ఎక్కువ దూరం లేదు, మూల మలుపులోనే ఉంది” అన్నాడని అతనిపై విరుచుకు పడ్డాడు. కిందకు వెళ్ళాక అతను కానీ కనిపిస్తే  చంపేస్తాను, అన్నాడు.  అది మాట వరుసకేనని అందరికీ తెలుసు. అతని విసుగును మేమూ పంచుకుని కాసేపు కలిసి నవ్వుకున్నాము.

పిల్లలు మాత్రం కొండమేకల్లా చురుకుగా రాళ్ల మీదుగా ఎక్కుతూ పరుగులు తీశారు. అప్పుడప్పుడు మాకంటే చాలాఎత్తులో కొండ అంచులపై కనిపించి చేతులు ఊపుతూ మాకు ఊపు నిచ్చారు. ఆటలాగా, ఒక పెద్ద రాయి తర్వాత ఇంకో పెద్ద రాయిని పాకుతూ  ఎక్కుతున్న వాళ్ళను చూసి, ఆగమని చేతులూపుతూ, కొత్త ఉత్సాహంతో  ముందుకు సాగాము.

కొందరు అక్కడి నుంచి మరో మైలు ఎక్కి శిఖరానికి చేరుకునే పనిలో ఉన్నారు. అక్కడి నుంచి, వారంతా  వైమానిక ట్రామ్‌లో క్రిందికి దిగుతారట. కానీ మా దృష్టిలో సరస్సును చేరుకోవడమే ఆ పర్వతారోహణకు తగిన ప్రతిఫలం. ఎక్కిన వాళ్ళం, దిగటం కూడా తెలుసుకోవాలన్న ఊపు కూడా ఇంకొక కారణం.

చిట్టచివరికి ఎదురుచూస్తున్న షర్లీ సరస్సు రానే వచ్చింది. అది కనిపించగానే, అందరం మాట లేకుండా చూస్తూ ఉండి పోయాం. చుట్టూ ఉన్న పర్వతాలపై కరిగే మంచు, వర్షపు నీటితో నిండే ఈ సరస్సు నిశ్శబ్దంగా, నిర్మలంగా కనిపించింది. ధ్యానంలో ఉన్నదా అనిపించే దాని ప్రశాంతత మనని ధ్యానంచేయమని అడిగినట్లుగా అనిపిస్తుంది. నేను ఒక నున్నటి బండపై నడుం వాల్చి సరస్సు, దాని చుట్టూ ఉన్న పర్వతాలు, ఆ పైన ఆకాశం చూస్తూ, వాటి రక, రకాల నీలి రంగులు, పైన్ చెట్ల ఆకులూ, పూలు, వాటి కోనుల రంగులతో పోలుస్తూ సేద తీర్చుకున్నాను.  పెద్దవాడు వాళ్ళ నాన్నతో చుట్టుపక్కల తిరుగుతుంటే, చిన్నవాడు వాడి కిష్టమైన ఫిషింగ్ చేసుకున్నాడు. తర్వాత అందరం అక్కడకు చేర గలిగినందుకు సంతోషపడుతూ, తెచ్చుకున్నవి తిని వెనుక దారి పట్టాము. తిరుగు ప్రయాణంలోని మూడు మైళ్ల దిగువ దారి శ్రమ అంత లేకపోయినా కూడా సవాలుతో కూడుకున్నది. అందుకే దిగేటప్పుడు దాదాపు ఎక్కడా విశ్రాంతి తీసుకోకపోయినా, రాళ్లతో నిండిన దారిలో జారిపోకుండా ప్రతి అడుగూ జాగ్రత్తగా వేసి నిదానంగా దిగ వలసి వచ్చింది. కిందకు చేరేసరికి, సూరీడు పడమటి పర్వతాల్లో దోబూచులాడుతున్నాడు.

మొదటగా పిల్లలకు ఆశ చూపించిన ఐస్క్రీమ్ షాపుకు వెళ్లి, అక్కడ నుంచి మెక్సికన్ రెస్టారంట్ లో వరల్డ్ కప్ వేడుకల్లో, సాకర్ ఆడే నా పండెడ్ల మనవరాలు మార్చ్ చేయటం చూస్తూ భోజనం ముగించాము.

ఆ తర్వాత హోటల్ కు పోయి అందరం జాకుజీలో కొంత సేపు గడిపి, ఆ తర్వాత వేడి నీటి స్నానం ముగించి పక్కలకు చేరాం. ఆ రాత్రి పసిపిల్లల్లా గాఢంగా నిద్రపోయామని వేరే  చెప్పనవసరం లేదు.

డోనర్ సరస్సు

ఆఖరు రోజు డోనర్ సరస్సు వద్ద నడుస్తూ, పిక్నిక్ చేస్తూ గడిపాము. సముద్ర మట్టానికి 5,955 అడుగుల ఎత్తులో ఉన్న సియెరా నెవాడా పర్వతశ్రేణుల ఒడిలో ఒదిగిన ఈ సరస్సు సుమారు 2.7 మైళ్ల పొడవున విస్తరించి ఉంది. ఇది కూడా లేక్ టాహో కు కట్టిన ఏడు అనకట్టలలో ఒక దానివల్ల ఏర్పడిన సరస్సు.   ఎప్పుడు పచ్చగా ఉండే చెట్లతో, దట్టమైన పొదల నడుమ మెరిసిపోయే ఈ సరస్సు, పడవల మీద ట్యూబుల లో  తిరిగే వారితో  కల కల లాడుతూ, ఒక  దృశ్యకావ్యంలా మన మనసుల పై ముద్ర వేస్తుంది.  షిర్లీ సరస్సు వలె ఇది కూడా  మంచు  కరిగిన జలాలతో ఏర్పడినదవటం వల్ల నీరు చాల శుభ్రంగా  అద్దంలా ఉండి దాని రాతి అడుగుభాగం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సరస్సు చుట్టూ అనేక బీచ్‌లు ఉన్నాయి.

మేము తీరికగా అన్నీ సర్దుకొని వచ్చేటప్పటికి, స్టేట్ పార్క్ లో  కార్ పార్కింగ్ నిండి పోవటమేగాక, బయట రోడ్ పక్కన ఒక మైల్ పొడవునా ఎక్కడ ఖాళీ లేకుండా కార్లు పార్క్ చేయబడి ఉన్నాయి. ఎక్కడో దూరంగా దొరికితే,  ఇంతే చాలని అక్కడ పార్క్ చేసి, పార్క్ వైపు నడుస్తూ రోడ్ పక్కనే ఉన్న సరస్సును చూసుకుంటూ అక్కడే కాసేపు గడపొచ్చని అనుకున్నాం. పడవలను నీళ్లలో పెట్టటానికి వీలుగా ఎన్నో బోర్డులు వేసి ఉన్నాయి కానీ, ఒకటీ ఖాళీగా లేదు. అన్నిటి లోను ఒకటో రెండో కుటుంబాలు జంపఖానా లాటివి పరచుకొని, తీరిగ్గా  పిక్నిక్ చేసుకుంటున్నారు. సరేనని పార్క్ లోకి నడిచాము. లోపలికి  రావటం చాల బాగుందని అక్కడకు వచ్చాక గాని తెలీలేదు. ఇక్కడ ఉండే తీరు, ప్రశాంతత వేరు.  కొంతసేపు మేము సరస్సు ఒడ్డున అడవిలోంచి వెళ్లే కాలిబాటలో నడిచాము. సరస్సు ఒక సన్నని వంపు తిరిగే చోట, అది ఎదుటి ఒడ్డును సున్నితంగా చుట్టుకుంటూ ప్రవహిస్తున్న నదిలా కనిపించింది. ఆ దృశ్యం మధ్యలో ఒక ద్వీపం ఉన్నట్లుగా అనిపించింది. బాల్సమ్ చెట్లు, ఇతర పైన్ వృక్షాల సువాసనలు గాలిలో వ్యాపించి, మనసుకెంతో హాయిగా అనిపించింది. మేము నీటిలోకి దిగకపోయినా, పడవలు నడుపుతూ, ప్యాడిల్‌బోర్డింగ్ చేస్తూ, ట్యూబింగ్‌లో పాల్గొంటూ, ఈదుతూ ఆనందిస్తున్న వారిని చూస్తూ సంతోషించాము. ఈ సారి ట్యూబింగ్ చేస్తే ఇక్కడే చేయాలనీ మా కోడలు ప్రతిన బూనింది.

సెలవు రోజులలో మంచి చోటులో ఉన్న  పిక్నిక్ బల్లలను దక్కించుకోవడానికి ఎంతో మంది  ఉదయం ఎనిమిది గంటలకే చేరుకోవడం ప్రారంభిస్తారు. ఆలస్యంగా వచ్చే వారికి పార్కింగ్ స్థలాలు మాత్రమే కాదు, బయట కూడా మాకు లాగే ఎవరికీ కారు నిలిపే చోటు దొరకదు. ఈ సరస్సుకు ఉన్న ఆదరణకు ఇదే నిదర్శనం. జనసందోహం, పార్కింగ్ ఇబ్బందులు ఉన్నప్పటికీ, డోనర్ సరస్సును చూడటం నిజంగా ఆ శ్రమకు తగ్గ ఫలితమే.

భోజనం తర్వాత కొద్దీ మంది తిరుగు ముఖం పట్టటం గమనించి అక్కడే మాకు పిక్ నిక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అనుకున్నాం. ఆలోచన రాగానే, మా వాడు వెంటనే బయల్దేరి, కారు తెచ్చే ప్రయత్నంలో పడ్డాడు. వాడు కారులో నుంచి  ఐస్ బాక్స్ తీసుకొని వచ్ఛే లోపులో మేము వాడిని కలవొచ్చనే ఉద్దేశ్యంతో తిరిగాము. అలా నడుస్తుంటే  దారి లో  అనుకోకుండా మాకు అప్పుడే ఖాళీ చేస్తున్న ఒక పిక్నిక్ బల్ల దొరికింది. అది చాల మంచి చోటులో దొరికినందుకు ఎంతో ఆనందంగా సరస్సును చూస్తూ పిక్ నిక్  చేసుకున్నాం.

అడవి దారుల్లో నెమ్మదిగా నడవడం, తర్వాత తీరిగ్గా ఎంతో అందంగా, నీటుగా కనిపిస్తున్న సరస్సు ఒడ్డున ప్రశాంతంగా భోజనం చేయడం చాల మరపురాని మధురమైన అనుభూ భూతుల్ని మాకు మిగిల్చింది.

తిరుగు ప్రయాణంలో ట్రక్కీ పట్టణాన్ని దాటుతుండగా, అస్తమిస్తున్న సూర్యుడు పర్వతాలనూ, ఆకాశాన్నీ నానారంగుల కాంతులతో నింపి ఏ సంధ్య ఒక రకంగా ఉండదని గుర్తు చేసాడు. అంతేకాక ఇది నేను మీకిచ్చే మధురమైన వీడ్కోలు కూడా అన్నట్లు ఉహించుకొని తృప్తిగా ఇంటిముఖం పట్టాము.

*

శ్రీ పద్మ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.