‘శత్రువు ‘ ఎట్లా ఔతాడు?! 

సకల యుద్ధతంత్రాలన్నీ వంచనపైననే ( deception )ఆధారపడి ఉంటయ్.  అత్యున్నతమైన యుద్ధకళ ఏమిటంటే శత్రువుతో యుద్ధం చేయకుండానే గెలవడం .  ప్రతియుద్ధంలోనూ అసలు యుద్ధం జరుగకముందే గెలుపు నిర్ధారించబడ్తుంది

           – సన్ ట్జు , చైనా, క్రీ.పూ.544-496

 

కాలం కొన్ని అతికిరాతక ఆలోచనలను భావితరాలకోసం

ప్రక్షిప్తం చేసి అరిగిపోయిన పర్వతపు శిలల్లా మిగిల్చి ప్రవహిస్తూ వెళ్తుంది

 

వారసత్వంగా తరతరాలుగా లభిస్తూ వస్తున్న రక్తదాహం, భీకరహింస

రాజ్యాలకోసం, అధికారంకోసం, స్త్రీకోసం

కన్నతల్లివంటి భూమికోసంకూడా.. అంతా అంతఃవికృతి

ఖండిత శిరస్సులు దొర్లుతూ దొర్లుతూ ఖండ ఖండాల్లోనుండి

ఒకటే నెత్తుటిచరిత్రను అక్షరాలు అక్షరాలుగా వర్షిస్తూ వర్షిస్తూండగా

మనిషికి ప్రకృతిసహజ  ‘శాంతి ‘ ని బోధించకుండా

గురువులు యుద్ధకళలనూ, యుద్ధతంత్రాలనూ, యుద్ధవిద్యలనూ

యుద్ధాంత మరణాలనూ, మరణరహస్యాలను మాత్రమే నేర్పుతున్నపుడు

అరే.. ప్రశాంత మనుగడకోసం స్నేహితుల్ని సంపాదించుకోగలవు

కాని మంచి ఇరుగుపొరుగును సమకూర్చుకోలేవు నువ్వు.. అని

అడవి చెప్పినా.. ఆకాశం చెప్పినా.. సముద్రాలు చెప్పినా వింటున్నారా ఈ దేశాలపాలకులు

పైగా జీవితాన్ని జీవించడం కాకుండా వ్యూహించడమని నిర్వచిస్తున్నారు

 

గింజ మొలకెత్తడం, మొక్కై, చెట్టై పెరిగి.. తనను తాను దానం చేసుకుని

అలా గాలిలోకి ఎగిరి మాయమయ్యే పక్షిలా అంతరించడమే

జీవితమనికదా ప్రకృతి చెబుతూనే ఉన్నది అనాదిగా

మరి యుగయుగాలుగా ఈ యుద్ధాలెందుకు.?

2

వాడు విస్తరణకు కొత్త అర్థం చెబుతాడు

వ్యూహాత్మకంగా ఓడించవలసినవాణ్ణి ఒక పూర్ణ శత్రువుగా (systemic rival  ) గుర్తిస్తాడు

 

ఒక చితకదేశానికి  కొన్ని ట్రిలియన్ల డాలర్లను అప్పిచ్చి

వానికి ఆయుధాలనూ,యంత్రాలనూ, భవనాలనూ, అన్నాన్నీ

పీల్చుకునే గాలినీ ఋణంగా కూర్చి

ప్రజలనూ, ప్రభుత్వాలనూ వర్చువల్ బానిసలను చేస్తాడు

మనిషినైనా, ఒక దేశాన్నైనా తనముందు తలవంచుకుని నిలబడేట్టు

‘దేహీ’ అని యాచకుణ్ణి చేయడమే ‘ సన్  ట్జు ‘ గెలుపు

బలవంతుని ఇరుగుపొరుగును ఆర్థిక బానిసలను చేసుకుని

ఒక దేశాన్ని నిర్వీర్యం చేయడమే ‘ బెల్ట్ అండ్ రోడ్స్ ‘ ఇనీషియేటివ్

ఇది ఎవర్నైనా కదలకుండా చదరంగంలో ‘షా’ పెట్టడంవంటిది

 

మహావృక్షం ‘ తల్లివేరు ‘ను ధ్వంసించడమంటే చిటారుకొమ్మను కూల్చడమే

ఎరిత్రియా, ఇథియోపియా, సోమాలియా, సూయజ్‌కెనాల్, ఎర్రసముద్రంలతో పరివేష్టితమైన

హిందూమహాసముద్రం ముఖద్వారంలోకి దారిచూపే

‘జిబౌటి ‘ చిరుదేశాన్ని ప్రాణనాడిలా గుర్తించి పట్టుకోవడమే యుద్ధవ్యూహం

హార్న్ ఆఫ్ ఆఫ్రికా.. జిబౌటి.. బికారి ప్రజలకు అహారం, మందులు లంచాలు

పాలకులకు ఆయుధాలు, అధికారాలు, అప్పులూ, సుఖాలు నూకగింజల ఎర

చిల్లరనాణేలను గాలిలోకి విసిరి .. రక్తాలు కారుతూండగా ఏరుకునే

అలగాజనాన్ని వినోదించేదే ఉన్మాదం

 

అభివృద్ధి  స్వప్నాలకు రంగులద్ది  ట్రిలియన్ డాలర్ల తీర్చలేని అప్పు ఊబిలోకి దింపి

ఆ దేశంయొక్క కుడిచేయివంటి భూమిపై చైనా ఒక శాశ్వత నౌకా సైనిక స్థావరాన్ని ఏర్పర్చి

అది యు.ఎస్ గానీ, ఫ్రాన్స్ గానీ, ఇటలీ,  జపాన్ గానీ

అందరికీ యుద్ధకుతి.. ఆయుధాలను అమ్ముకో, ఆయుధాలతో భయపెట్టు

ఆయుధాలతో రక్తదాహం తీర్చుకో

 

కావలిస్తే కొన్ని గబ్బిలాలనూ, పులుగుపిల్లులనూ, కొన్ని కృత్తిమ కరోనా వైరస్‌లనూ

బయోవెపన్స్‌గా గాలినిండా వదిలి

ఏండ్లకు ఏండ్లు మిలియన్లమంది మృతులనూ, రేయింబవళ్ళు

లాక్‌డౌన్లనూ, కర్ఫ్యూలనూ, వర్క్ ఫ్రం హోంలనూ మిగిల్చి

ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టించిన వ్యూహాత్మక నిశ్శబ్ద కుట్రలతో

దీర్ఘకాలిక ‘ వ్యాక్సినేషన్ కాన్స్పిరసీ ‘ వ్యాపారాలతో

రక్తం కక్కుకుని చస్తున్న తెల్లకుందేలువంటి అమాయక ప్రపంచప్రజలు

అనాథశవాలై స్మశానం గేట్ బయట ‘క్యూ’లో ఉన్నపుడు

ఔను.. ‘సన్  ట్జు ‘ చెప్పింది నిజమే

 

అతికిరాతక యుద్ధవ్యూహంలో శత్రువుతో యుద్ధం చేయకుండానే గెలుస్తున్నాడు వాడు

ప్రపంచప్రజలం మనందరం  ప్రాణాలనప్పగిస్తూ మరణిస్తున్నాం మౌనంగా.. అంతే

 

3 

ఇంతకూ ఎవరైనా మరొకరికి ‘శత్రువు ‘ ఎట్లా ఔతాడు?!

*

 

Sun Tzu  ప్రాచీన చైనాలో B.C 544- 496 సంవత్సరాల్లో జీవించి The Art of War గ్రంథాన్ని రాసిచ్చి ఆ    

  దేశప్రజలను అతిగా ప్రభావితం చేసినవాడు.

 ‘ జిబౌటి ‘ ( Djibouti ) తూర్పు ఆఫ్రికా యొక్క మూడవ అతిచిన్న దేశం. అగ్రరాజ్యాలకు దశాబ్దాల పర్యంత లీజ్‌కు  తన కీలక భూభాగాలను ధారాదత్తం చేసి బలమైన సైనిక స్థావరాలను ఏర్పర్చుకునేందుకు అవకాశమిచ్చి.. కొన్ని కొవ్వెక్కిన దేశాలు మూడవ ప్రపంచయుద్ధాన్ని కలగంటున్న తరుణంలో తమదేశాన్నే ఒక ‘ మిలిటరీ బేస్ ‘ గా మార్చుకుని నిప్పులకుంపటిపై కూర్చుంది.  

*

 

రామాచంద్ర మౌళి

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అత్యంత హేయమైన గ్లోబల్ రాజ్యవిస్తరణ కుట్రను చిక్కని కవితగా అదించిన సీనియర్ కవి రామా చంద్రమౌళి గారికి కృతజ్ఞతలు.మంచి ఉపయుక్తమైన కవిత ఇది.

    సి.నరసింహారావు, హనుమకొండ

  • A thought provoking poem pens from Professor Raama Chandramouli, the usual signature style of this legendary poet. There’s a feel that I have read a poem that shakes my thought waves. Satruvu Etlaa avuthadu is a poem that tries to take you into the lap of Nature. Common man is lamb like and rulers treat them as power toys polluting their thought frame too.. Forest, Sky and Sea preach man to be at peace but hereditary-rulers from time immemorial strategically land them into warfields… or even bio-war fields… The contemporariness of the poem is commendable throughout second stanza.. finally the poet is warmth enough allowing to think: ఇంతకూ ఎవరైనా మరొకరికి ‘శత్రువు ‘ ఎట్లా ఔతాడు?!
    Thanks to Saranga for publishing such a grand poem that remebers me Robert Frost’s Mending Waal ….

  • సన్జు కొటేషన్ తో ఆరంభమైన కవిత్వపు ఎత్తుగడ యుద్ధ వ్యూహం అర్ధం చేసుకోవటానికి కావలసిన ఆలోచనతో మెదడును సావధాన పరిచింది. యుద్ధ దెయ్యపు ముసుగు తీసి దాని వికృత చేష్టల అసహ్యాన్ని అర్థం చేసుకుంటే ఆ అసహ్యం మరింత లోతయిన హేయ భావాన్ని కలిగించింది. సాలోచన దీర్ఘమైనదైతే ఆలోచన కూడా అంతఃస్సుదూరాలకు పయనిస్తుంది అప్రతిహతంగా.

  • రచయిత పరిజ్ఞానం ప్రపంచ
    చరిత్రనంత ఔపోసన పట్టినట్లుగా ఉంది. వివరించిన విషయాలు విజ్ఞానదాయకంగానేగాక విస్మయం కలిగిస్తున్నాయి. రచన శైలి ఊపిరి బిగబట్టించి
    ఉరికిస్తున్నది.

    రాటుదేలిన రచయిత శ్రీ రామా చంద్రమౌళి గారికి నా అభినందనలు, శుభాకాంక్షలు. వారి కలం నుండి మరిన్ని మహత్తర రచనలు జాలువారాలని
    కోరుకుంటున్నాను.. — వడ్డేపల్లి నర్సింగరావు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు