వుమెన్స్ మార్చ్

అయినా గవర్మెంటుకి వ్యతిరేకంగా ప్రొటెస్టులకీ వాటికీ వెళ్ళకుండా ఉంటేనే మంచిదండీ. ఏదో కొన్నాళ్ళిక్కడుండి  నాలుగు డాలర్లు సేవ్ జేసుకోని పోతే సరిపోతుంది.

విశ్వం ఇదివరకే మాయింటికి రెండుమూడు సార్లోచ్చాడు, మా మురళీతో. కానీ అతనికొక గర్ల్ ఫ్రండ్ ఉందనీ, ఆమెది దక్షిణమెరికా అనీ వినడం ఇదే మొదటిసారి. నాకూ, మా ఆవిడ అనితకూ ఆశ్చర్యంగానూ, కొంచెం వింతగానూ అనిపించింది. మామూలుగా ఇక్కడ ఉండే సాఫ్ట్ వేర్ వాళ్ళకు అమెరికా వారితోనే దగ్గిర సంబంధాలుండవు. ఇతనికి ఈ దక్షిణమెరికా ఆమె ఎలా పరిచయం అయిందో వినాలని కుతూహలంగా ఉండింది. అందరం కూర్చుని భోజనాలు చేస్తున్నప్పుడు అడిగాం.

“నేనామెను నాలుగైదుసార్లు మా హాస్పిటల్ కేఫెటీరియాలో చూశానండీ. చూడ్డానికి ఇండియన్ లాగా ఉంటుంది. ఒకరోజు లంచ్ టైమ్ లో ఒక టేబుల్ దగ్గర తనొక్కతే కూర్చోనుంది. బిజీ టైమ్ అవడం వల్ల మిగతా టేబుల్సేవీ ఖాళీగా లేవు. నేను ఆమె టేబుల్ దగ్గరకెళ్ళి, “మే ఐ సిట్ హియర్,” అని అడిగాను.

‘ఆఫ్ కోర్స్, ప్లీజ్ డూ,’ అంది.

“నేనడిగాను, ‘యు ఫ్రమ్ ఇండియా?”

“ఆమె నవ్వుతూ, ‘నో,’ అని, ‘డు ఐ లుక్ ఇండియన్,’ అని తిరుగు ప్రశ్న వేసింది.

“వెల్, యస్, అన్నాను.

“ఈ సారి తను అడిగింది. ‘ఆర్ యు ఇన్ ఐటీ?’

“అరే, హౌ డిడ్ యు నో? నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది.

‘సాఫ్ట్ వేర్ ఇంజినీర్ షర్ట్ వేసుకున్నారుగా!’ అందామె.

 

నాకు నవ్వొచ్చింది. “అంటే, మీ హాస్పిటల్లో డ్రెస్ కోడ్ లేదా? సాఫ్ట్ వేర్ షర్ట్ వేసుకుని ఆఫీసుకెళ్ళొచ్చా?” అతని కథకు అంతరాయం కలిగిస్తూ నేనడిగాను.

“అరే, అంకుల్, మీకూ తెలుసా ఈ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ షర్ట్ ల గురించి?” అనడిగాడు విశ్వం, నమ్మలేనట్లు.

“వెల్, ఇది పెద్ద సీక్రెటేం కాదు. ఎక్కడైనా మాల్లో ముగ్గురునలుగురు ఇండియన్  అబ్బాయిలు కలిసి తిరుగుతుంటే చూడండి. వాళ్ళ షర్టులు చూడగానే వీళ్ళు కొత్తగా ఇండియానుంచి వచ్చిన ఐటీ స్టూడెంట్సని చెప్పొచ్చు.”

“అలాగా?”

“అది సరే. నీకు ఆమెతో పరిచయం ఎలా అయిందో చెప్తున్నావు, తర్వాత చెప్పు”

“ఆ, ఆరోజు అలా మొదలయింది మా పరిచయం. తర్వాత అప్పుడప్పుడూ కేఫెటీరియాలో కలిసి లంచ్ చేసే వాళ్ళం. మరియా, ఆమె పేరు మరియా,  మా హాస్పిటల్లోనే కార్డియోవాస్కులర్ డివిజన్లో రిసర్చ్ చేస్తుంది.

“మరియాది చిలీ అని దక్షిణమెరికా దేశం ఆట. కానీ ఇక్కడివాళ్ళకు చాలామందికి ఆ దేశం ఎక్కడుందో తెలియదట. అసలు చిలీ పేరుతో ఒక దేశం ఉందనికూడా చాలామందికి తెలియదట. నాక్కూడా చిలీ గురించి పెద్దగా తెలియదనుకోండి. కాకపోతే మరియా చెప్పడం చాలా తమాషాగా ఉంటుంది. ఇక్కడివాళ్ళు, ‘వేర్ డు యు కం ఫ్రం,’ అని అడిగినప్పుడు, ‘చిలీ’ అంటే, బిక్క ముఖం వేస్తారట. అది తినే వస్తువుకదా, దేశం పేరడిగితే ఇలాంటి సమాధానం ఇస్తుందేంటి అనుకుంటారట! ఇక్కడ చిల్లీ బాగా ఫేమస్ డిష్ ఆటగదా?”

*

విశ్వం – విశ్వం కాదులెండి – విష్వం. తన పేరు విష్వం అని చెప్పుకుంటాడితను. కానీ నాకు పాతకాలపు అలవాట్లవల్ల విష్వం, షివ, ష్రీనివాస్ – ఇట్లాంటి పేర్లు పలకడం కొంచెం కష్టం. విశ్వం అనే పిలుస్తానని చెప్పాను. విశ్వం, మా మురళీ, ఇంకొక ఇండియన్ అబ్బాయీ రూమ్ మేట్స్. మురళి మా పెద్దన్నయ్య కొడుకు. ఎమ్మెస్ చెయ్యడానికి డెట్రాయట్ వచ్చి, ఇప్పుడు హెచ్ 1 బీ వీసా మీద ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తున్నాడు. అదే ఏజెన్సీ ద్వారా పదేళ్ళ క్రితం ఎచ్ 1 బీ సంపాదించిన విశ్వం ఆరేళ్ళ క్రితం గ్రీన్ కార్డ్ కి అప్లయ్  చేశాడట . డెట్రాయట్లోనే ఒక  హాస్పిటల్లో ఈయమ్మార్ ఎనలిస్ట్ గా పని చేస్తున్నాడు. వాళ్ళ మూడో రూమ్మేట్ పోయిన వారం ఇండియా వెళ్ళాడు.

మా మురళీకి దాదాపు ముఫై య్యైదేళ్ళుంటాయి. విశ్వం కి ముఫైయ్యైదు-నలభై ఉండొచ్చు. ఇతను ఒక సంవత్సరం క్రితం మురళీవాళ్ళ రూంలో చేరాడు. అలాగే మాకు పరిచయం అయ్యాడు. మాయింటికి వచ్చినప్పుడు మామూలు కబుర్లు-అంటే ఉద్యోగం గురించీ, వీసాల గురించీ, తెలుగు చానెల్సులో ఎంటర్ టెయిన్మెంట్  ప్రోగ్రాములగురించీ- మాట్లాడతాడుగానీ మరియా ప్రస్తావన రావడం ఇదే మొదటిసారి.

*

భోజనాలు చేస్తున్నప్పుడు మా ఆవిడ అనిత అడిగిందతన్ని, “నువ్వా అమ్మాయిని పెళ్ళి చేసుకుందామనుకుంటున్నావా? ఇండియాలో మీవాళ్ళు ఒప్పుకుంటారా?” అని.

“ఇంకా అంత దూరం రాలేదులెండి. నాక్కూడా ఆ అమ్మాయి సూట్ అవుతుందో లేదో అనుమానంగానే ఉంది.” అన్నాడు విశ్వం.

“విష్, పోయిన వీకెండ్ ఏం జరిగిందో చెప్పు,” అని అతన్ని ప్రాంప్ట్ చేశాడు మా మురళి.

“ఏం జరిగింది?” నాక్కూడా కుతూహలంగా ఉండి అడిగాను.

“ఎం లేదంకుల్, పది రోజుల క్రితం ‘ఈ వీకెండ్ ఫ్రీగా ఉన్నావా’ అని అడిగింది మరియా.”

“అమ్మాయి డేట్ ప్రపోజ్ చేస్తుందని ఎక్సైట్ అయ్యాడు మనవాడు!” పక్క కూర్చీలో కూర్చున్న విశ్వాన్ని మోచేత్తో పొడిచాడు మురళి. అయితే విశ్వం వాడిని పట్టించుకోలేదు.

“నాకు ప్రోగ్రామ్ ఏమీ లేదు, ఫ్రీగానే ఉన్నానని చెప్పాను. ‘అయితే ఆదివారం వుమెన్స్ మార్చ్ వుంది, వస్తావా?’ అని అడిగింది.

“నాకు వెంటనే అర్థం కాలేదు. వుమెన్స్ మార్చ్ కి మగవాళ్ళు పోవచ్చా? ఎప్పుడూ, ఎక్కడా? నేను వివరాలు అడిగాను.”

‘చాలా చోట్ల జరుగుతుంది. నువ్వోచ్చేట్లయితే మనం లాన్సింగ్ వెళ్దాం. అక్కడ పెద్ద మార్చ్ జరుగుతుంది. మగా, ఆడా అని తేడాలేదు, ఎవ్వరైనా పోవచ్చు’ అంది. రెండు సంవత్సరాలనుంచీ జనవరిలో జరుగుతుందట. ఇది మూడో మార్చటా. తను ఇంతకు ముందు జరిగిన రెండిటికీ వెళ్ళిందట.

“ఈ వుమెన్స్ మార్చ్ ట్రంప్ కి వ్యతిరేకం అనీ, ట్రంప్ కి ఆడవాళ్ళంటే గౌరవం లేదనీ, అలాగే అతను ముస్లింలకీ, మెక్సికన్లకీ, ఇమ్మిగ్రెంట్స్ కీ వ్యతిరేకమనీ- అందరి హక్కులకోసం పోరాడేవాళ్ళు ఈ వుమెన్స్ మార్చ్ ఆర్గనైజ్ చేస్తుంటారనీ – ఈ వివరాలన్నీ చెప్పింది.

“నాక్కొంచెం భయమేసింది. ఎందుకూ లేనిపోని గొడవ. గవర్మెంటుకి వ్యతిరేకంగా జరిగుతున్న మీటింగుకి వెళ్తే వాళ్ళూరుకుంటారా? గవర్మెంటుకి తెలిస్తే నాకు వీసారాకుండా చెయ్యొచ్చు కదా?”

“అయినా, అమ్మాయి అడిగింది కదా? వెళ్లకపోతే వీడొక వేస్ట్ ఫెలో అనుకుంటుందని భయం మనోడికి.” మురళి మళ్ళా డొక్కలో ఒక పోటు పొడిచాడు విశ్వాన్ని. ఈసారి కూడా వాణ్ణి పట్టించుకోలేదు విశ్వం.

“మా రూమ్మేట్సునికూడా అడగనా, వస్తారేమో, అనడిగాను నేను. ‘తప్పకుండా, ఎంతమందొస్తే అంత మంచిది,’ అంది తను.

“నేను ఈ మహావీరులిద్దర్నీ అడిగాను. వాడు భార్గవేమో ‘నేను ఇండియా వెళ్తున్నానుకదా, నాకు షాపింగుంద’ని తప్పించుకున్నాడు. వీడేమో వాడితో షాపింగుకి వెళ్తున్నానని తప్పించుకున్నాడు.” మురళీని చూస్తూ చెప్పాడు విశ్వం,

“అయితే నువ్వైనా వెళ్ళావా మార్చ్ కి?” నేనడిగాను.

“వెళ్ళానంకుల్. పోయిన శనివారం. అయితే మరియా అనుకున్నట్లు పదివేలమంది రాలేదు. అయిదారొందలమంది వొచ్చుంటారు. కానీ అసలు అంతమంది రావడం కూడా ఆశ్చర్యమే. ఆరోజు బ్రూటల్ కోల్డ్, టెంపరేచర్ పది డిగ్రీలుంది. విపరీతమైన చలి గాలి. నాకైతే మానేస్తే బాగుంటుందనిపించింది. కానీ మరియా తప్పకుండా వెళ్ళాలంది. ‘నువ్వు రాకపోయినా ఫరవాలేదు, నేను వెళ్తాను’ అంది. ఇక నేనుకూడా సరేలే పోదాం అని వెళ్ళాను.

“అక్కడ ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కానీ అంత చల్లో చిన్న పిల్లలనుకూడా తీసుకొచ్చారు. మిషిగన్ గవర్నరట – ఆమె స్పీచ్ ఇచ్చింది. షి ఈజ్ వెరీ యంగ్. నలభైయ్యేళ్ళుంటాయేమో. నాకామె స్పీచ్ సరిగ్గా అర్థంకాలేదుగాని , చాలా బాగా మాట్లాడింది.

“మరియా రెండు ప్లెకర్డ్స్ కూడా తెచ్చింది. ఇమ్మిగ్రెంట్స్ మేడ్ దిస్ కంట్రీ అని ఒకటీ, వుమెన్స్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్ అని ఒకటీ. నాకొకటి ఆఫర్ చేసింది. నేను వుమెన్స్ రైట్స్ ది తీసుకున్నాను. అయినా నాక్కొంచెం భయంగానే ఉండింది. చాలామంది ఫోటోలు తీస్తున్నారు. అందులో ఐస్  వాళ్ళుకూడా తప్పకుండా ఉండే ఉంటారు.” తన మనసులోఉన్న భయాన్ని విశ్వం బయటపెట్టాడు.

“ఉండొచ్చనుకో, అయినా నువ్వేం తప్పు చెయ్యలేదు కదా. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు.” కొంచెం ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేశాన్నేను.

“నేనేమీ చెయ్యకపోయినా అక్కడికెళ్ళానుకదా అంకుల్. అక్కడ కొంతమంది ఘాటైన ప్లెకర్డ్స్ పట్టుకోనొచ్చారు. ఫొటోల్లో వాళ్ళపక్కన మనం కనపడ్డా ప్రమాదమేకదా?”

“అబ్బే, అంత భయపడాల్సిన అవసరం ఏంలేదు. అయినా ఏముందా పోస్టర్లమీద?” నాకూ కుతూహలంగా ఉండింది.

“అమ్మో,” అని అనిత వైపు జంకుతున్నట్లు చూశాడతను.

“ఫరవాలేదులే చెప్పు, అనిత ఏమీ అనుకోదు.”

తల కొంచెం వంచుకునే చెప్పాడు విశ్వం. “డంప్ ట్రంప్, గర్ల్ పవర్, నాస్టీ వుమన్, కీప్ యువర్ బైబుల్ ఆఫ్ మై బాడీ, ఫక్ వైట్ సుప్రీమసీ,  ట్రంప్ ఈజ్ ఫాసిస్ట్ – ఇట్లాంటివి. చిన్న పిల్లలుగూడా ఇలాంటి ప్లెకర్డ్స్ పట్టుకొనున్నారు, అంత విపరీతమైన చల్లో.”

“అయితే ఇంతకీ మరియాకి మార్చ్ నచ్చిందా?” నేనడిగాను.

“ఆ, అంత చల్లో ఆ అమ్మాయి సంతోషంగా కొత్త పరిచయాలు చేసుకుంటూ ఉండింది, ఆ మూడు నాలుగ్గంటలూ.”

ఈ సారి మా అనిత అడిగింది. “మరి ఆ అమ్మాయికి వీసా భయాల్లేవా? ఏం వీసా ఆ అమ్మాయిది?”

“జె వీసా ఆంటీ. ఆమెకి అమెరికాలో ఉండాలని లేదనుకుంటాను. కొన్నాళ్ళు రీసర్చ్ చేసి వాళ్ళ దేశం వెళ్ళిపోతుందనుకుంటా. అందుకేనేమో ఆమెకు ఇక్కడి ప్రభుత్వం అంటే ఏంభయం లేదు.”

“అంటే మీ రిలేషన్షిప్ సీరియస్ కాదన్న మాట. అయినా ఇండియాలో మీవాళ్ళొప్పుకుంటారా? ఆ అమ్మాయి చిలియన్ కదా.” మళ్ళీ అనితానే అడిగింది.

“మేం ఇంకా అంత దూరం ఆలోచించలేదాంటీ. నాకు నాగురించే అంత క్లారిటీ లేదు. నాకిప్పటికే ముఫైయ్యేడేళ్ళు. ఈ వీసా రావడానికి ఇంకా నాలుగైదేళ్ళు పట్టోచ్చు. ఈలోగా మావాళ్ళు మాచెస్ చూస్తున్నారు. కానీ ఇప్పుడు అబ్బాయి యూయస్ లో ఉన్నాడంటే సిటిజెనైనా అయ్యుండాలి, లేకపోతే గ్రీన్ కార్డ్ ఉన్నట్లు ప్రూఫైనా చూపించాలి అంటున్నారట అమ్మాయిల పేరెంట్స్.”

“అవును, ఈ మధ్య ఇక్కడున్నోళ్ళకు సంబంధాలు దొరకటం కష్టంగానే ఉందని విన్నాను నేనుకూడా.” అన్నాన్నేను.

“అసలే పరిస్థితులు బాగాలేవు. పైగా ఈ ట్రంప్ గాడేమో లాటరీ తీసేస్తాను, ఎచ్ 1 బీ తగ్గిస్తాను, ఇమ్మిగ్రెంట్స్ వొద్దు – ఇట్లా ఏదేదో చెత్తవాగుడు వాగుతుంటాడు. అక్కడ వాళ్ళు పిల్లల్నివ్వటం రిస్కులే అనుకుంటున్నారు. వాళ్ళని తప్పుబట్టడానికిలేదంకుల్,” అన్నాడు విశ్వం.

*

భోజనం అయింతర్వాత ఆంధ్రా తెలంగాణా రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ లివింగ్ రూంలో కూర్చున్నాము. టీవీలో సియెన్నెన్ వాళ్ళు రష్యా-ట్రంప్ సంబంధాల గురించి మాట్లాడుతున్నారు.

రిమోట్ తీసుకుని టీవీని ఎమ్మెస్ ఏన్బీసీకి మార్చాను. వాళ్ళుకూడా ట్రంప్ గురించే మాట్లాడుతున్నారు.

విశ్వం అడిగాడు, “అంకుల్, మీరు సిటిజెనా? గ్రీన్ కార్డా?”

“ఏం, అంకుల్కి మంచి సంబంధమేదైనా తీసుకొస్తావా?” జోకేసింది మా అనిత.

“అయ్యో, ఊరికే అడిగానాంటీ,” అతను కొంచెం ఇబ్బందిపట్టాడు.

“అనితా నేను గ్రీన్ కార్డులు తీసుకున్నాం. సిటిజన్ షిప్ తీసుకోలేదు. తర్వాతెప్పుడైనా అవసరం అయితే తీసుకుందాంలే అనుకున్నాం,”నేను సమాధానం చెప్పాను.

“అదే మంచిదిలే అంకుల్. ఈ మధ్య వీడు సిటిజెన్ షిప్  తీసుకున్న వాళ్ళను కూడా డిపోర్ట్ చేస్తాం అంటున్నాడట. వియత్నాం వాళ్ళైతే అలా తిరిగి వచ్చేవాళ్ళను తీసుకోం అన్నారట. ఎందుకొచ్చిన గొడవా. గ్రీన్ కార్డులయితే అవసరం అయినరోజు తిరిగి శుభ్రంగా ఇండియా వెళ్ళొచ్చు.”

“అంత అవసరం రాదులే. ఏదో క్రైంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళను తిరిగి పంపిస్తారేమోగాని మనపని మనం చేసుకుంటూ పోయేవాళ్లకి అలాంటివేమీ జరగవులే.” అన్నాన్నేను.

“మీరు చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారుకదా అంకుల్, ఈ విషయాలు మాకంటే మీకే బాగా తెలుసు. అయినా గవర్మెంటుకి వ్యతిరేకంగా ప్రొటెస్టులకీ వాటికీ వెళ్ళకుండా ఉంటేనే మంచిదండీ. ఏదో కొన్నాళ్ళిక్కడుండి  నాలుగు డాలర్లు సేవ్ జేసుకోని పోతే సరిపోతుంది.” తుది నిర్ణయం లాగా చెప్పేశాడు విశ్వం.

*

ఆరి సీతారామయ్య

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అంతే అంతే విశ్వం. తిన్నామా, తిరిగామా, డాలర్లు ముటగట్టుకొని వెళ్ళామా! ఎవరెటుపోతే మనకేల!

  • చాల బాగుంది సీతారాం గారూ – ఈ దేశానికి ఇమ్మిగ్రెంట్స్ లా సాఫ్ట్వేర్ ఉద్యోగాలకోసం వచ్చే మన ఇండియన్స్ మనస్తత్వాలను చాల బాగా పట్టిచ్చారు – ఇక్కడి వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడినా పోరాడినా తమ విశాలకు ఉద్యోగాలకు ప్రమాదకరమని చాల మంది తమకు తామే గిరి గీసుకుని స్వంత జీవితాలను గడిపేస్తుంటారు – పైగా తామెట్ల అమెరికా కు వచ్చారో మర్చిపోయి ఇప్పుడొస్తున్న వారి వీసాలు రద్దు చేయాలనీ వాదిస్తుంటారు –
    మంచి కథ అందించారు – మీకు అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు