వీవీ అంటే…కట్టడి చేయలేని విప్లవ భావన!

ప్రసిద్ధ ప్రజా కవి, విప్లవ పోరాట యోధుడు వరవరరావు విడుదల కోరుతూ ఈ శీర్షిక- వీవీ కోసం!

రవర రావు అభిప్రాయాలతో ఏకీభావం లేని వాళ్ళు కూడా అతని స్వేచ్ఛ గురించి మాట్లాడటం, అన్యాయమైన జైలు నిర్బంధం నుంచి తనకు విముక్తి కలిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం ప్రజాస్వామిక లక్షణం. రాజ్యం పట్ల, దోపిడీ నుంచి విముక్తి పొందే రాజకీయాల పట్ల తనకు కొన్ని సిద్ధాంతపరమైన రాజకీయమైన అభిప్రాయాలూ వున్నాయి. వాటిని ఆయన రహస్యంగా దాచుకోలేదు. ప్రజల మధ్య ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉన్నాడు. వాటి మంచి చెడ్డలు, న్యాయాన్యాయాలు ఏమిటనే సంగతి పక్కకు పెడితే, అలా  తనకు ఆలోచించే స్వేచ్ఛ లేదనే విధంగా బిజెపి ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించడం ఎవరూ అంగీకరించలేనిది. నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నాడనే అభియోగం ఎంత హాస్యాస్పదమో ప్రజలంతా గుర్తిస్తూనే వున్నారు. సుదీర్ఘమైన అయన విప్లవ సాహిత్య, రాజకీయ జీవితంలో కుట్ర కేసులు కొత్త కావు. రాజ్యం అలాంటి అక్రమ కేసులు మోపడం వల్ల వరవర రావు వ్యక్తిత్వం మరింత బలపడ్డది. ప్రజల్లో ఆయన ప్రభావం మరింత ఇనుమడించింది నిజం. ఒక విప్లవ సిద్ధాంతాన్ని మరొక బలమైన సిద్ధాంతం ద్వారా ఎదుర్కోగలమనే ఇంగిత జ్ఞానం లోపించడం వల్లే రాజ్యం కుట్ర కేసుల యవనిక మీద బెదిరింపుల చలన చిత్రాన్ని ప్రదర్శించాలని ప్రయత్నిస్తుంది.

సోవియట్ రష్యా పతనం తర్వాత కమ్యూనిస్ట్ అనంతర చర్చ బౌద్ధిక క్షేత్రంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. చైనా, వియాత్నం, ఉత్తర కొరియా లాంటి దేశాల్లో సోషలిస్ట్ సమాజం నిర్మాణ మవుతుందా లేదా కమ్యూనిస్ట్ పార్టీల ఏలుబడిలో క్యాపిటలిజం అమలవుతున్నాదా అనే సంశయం చాల మందిలో ఉన్నది కానీ వరవర రావులో లేదు. ఆయా దేశాల పట్ల తనకో అవగాహన ఉన్నది. అవన్నీ క్యాపిటలిజాన్ని నిర్మిస్తున్న దేశాలనే అవగాహన తనది. బహుశా మావోయిస్టు పార్టీ అవగాహనా కూడా అదే కావొచ్చు. అయితే, అర్థ భూస్వామ్య, అర్థ పెట్టుబడిదారీ వ్యవస్థ గల ఆ దేశాల్లో క్యాపిటలిజం అనే దశ తప్పకుండా వొక ఉన్నత దశకు చేరవలసిందే. అంటే కమ్యూనిస్ట్ పార్టీ లేదా మావోయిస్టు పార్టీ పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రజలను నడిపే వొక ఏజెన్సీ లాగ పనిచేస్తుంది. ఈ సంధి దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దగ్గరే పొరపాట్లు జరిగి కమ్యూనిస్టు ప్రభుత్వాల పట్ల, రాజకీయాల పట్ల విముఖత నెలకొంది. మహా కథనాలకు కాలం చెల్లిందని పోస్ట్ మోడర్నిస్టులు ఎద్దేవా చేసినా, ఆ మహా కథనాన్ని నిజం చేయడానికి అంకిత భావంతో శ్రమిస్తున్న వాళ్ళు చాల మంది ఉన్నారు. అల్లాంటి వాళ్ళలో వివి వొకరు. కుల దోపిడీ హింసా పీడనకు వ్యతిరేకంగా అంబేడ్కర్ దృక్పథం నుంచి వెల్లువలా వొచ్చిన దళిత సాహిత్యాన్ని శివారెడ్డి వోలె వర్గ విచ్చిన్నవాదం అని వివి అనలేదు.

దళిత సాహిత్యాన్ని విప్లవ సాహిత్యంలో  అంతర్భాగంగానే అయన చూసారు. ఈ చూపు పట్ల నాకు కూడా విభేదం ఉన్నది కానీ బర్బర వర్గవాదం కన్నా ఇది కొద్దిగా నయం. అయితే ఇండియా సమాజ స్వభావాన్ని ఆయన మార్క్సిస్ట్ దృష్టి నుండి చూడ్డానికే ఇష్టపడుతున్నాడు. కుల నిర్మూలన సిద్ధాంత సార్వత్రిక అన్వయం పట్ల తనకు గల సందేహాలను చాల సెన్సిబుల్ గా  చర్చకు పెడుతాడు. కుల సమస్యకు వర్గ నిర్మూలన లోనే పరిష్కారం ఉన్నదనే దృష్టి వివిది. మావోయిస్టు సిద్ధాంతం పట్ల, ఆ పార్టీ రాజకీయాల పట్ల హోళిస్టిక్ ఒపీనియన్ తనకు ఉన్నప్పటికీ, ఆ పార్టీ నిర్మించబోయేది కూడా విప్లవం తర్వాత పెట్టుబడిదారీ వ్యవస్థనే. ఆధునిక పూర్వ దశలో ఉన్న సమాజంలో ఆ పార్టీ ఆధునికతను, దాని ప్రభావాన్ని పరిచయం చేస్తున్నది. ఈ పని అత్యున్నత పెట్టుబడిదారీ దశలో ఉన్న సమాజానికి ఎలా మార్గదర్శి అవుతుంది లేదా అనుసరించ దగిన మార్గం అవుతుందనే ప్రశ్నకు సరైన సమాధానం ఇంకా చెప్పలేక పోతున్నారు. మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకొని తదనుగుణంగా కార్యక్రం తయారు చేసుకొనే క్రమంలో అనేక బాలారిష్టాలను ఎదుర్కొంటున్న మావోయిస్టు పార్టీని చూసి అతిపెద్ద రాజ్యం భయపడటం వింతగా ఉన్నది.

మన దేశ రాజ్యాంగం ఎంతో బలమైంది. కానీ దాన్ని అమలుచేసే రాజ్యం చాల బలహీనమైనదని అనిపిస్తుంది. లేకపోతె ఏమిటి? డెబ్బయేళ్ళ ఒక కవి, తొంభై శాతం అవిటివాడైన మరో వ్యక్తి కుట్ర చేస్తే కూలిపోయే రాజ్యమా మనది? నరేంద్ర మోడీ వ్యక్తిగత భద్రతా వ్యవస్థ అంత బలహీనమైందా అనే అనుమానాలు తప్పకుండా తలెత్తుతున్నాయి. నిజానికి ఫాసిస్ట్ పార్టీకి బలహీనమైన శత్రువే కావాలి. అతన్ని హింసించటం ద్వారా మొత్తం సమాజాన్ని తన అదుపులో ఉంచుకోవాలని చూస్తుంది. మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులూ, మైనార్టీలు, స్త్రీలు, గిరిజనులు, పిల్లల మీద జరుగుతున్న హింసను చూస్తే ఈ సంగతి అర్థం అవుతుంది. విప్లవ రాజకీయాలను బలపరిచే మేధావుల మీద నిర్బంధం ప్రయోగించడం ద్వారా బహుజన రాజకీయాలు బలపడకుండా వ్యూహం పన్నుతున్నారని మొదటి నుంచి నా అనుమానం. ఈ నా అనుమానాన్ని నా మిత్రులు తోసిపుచ్చవోచ్చు. వెకిలిగా నవ్వుకోవచ్చు కూడా. కానీ ఈ కోణం చర్చ నుంచి జారిపోవడం సరికాదని నా భావన.

వివి, సాయిబాబా యిద్దరి ఆరోగ్యం పట్ల ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. కరోనా వేగంగా వ్యాపిస్తోంది. కరోనా సోకినా ఖైదీల మధ్య వాళ్ళను ఉంచుతున్నారని అనుమానాలు వున్నాయి. పాండమిక్ పరిస్థితిని రాజ్యం తనకు అనుకూలంగా మార్చుకొని, తన అధికారాన్ని అన్ని చోట్లకు, అన్ని స్థాయిలకు  విస్తరింప చేసి అది మరింత వ్యవస్థీకృతం అవడానికి ప్రయత్నిస్తుందని మిషెల్ ఫుకో తెలిపాడు. ఇప్పుడు ప్రపంచమంతా అనుసరిస్తున్న పద్ధతులన్నీ పద్దెనిమిదో శతాబ్దం నాటివి. అప్పుడు ప్రపంచాన్ని వొణికించిన కలరా గురించి,  రాజ్యం, అధికారం ఎలా ప్రవర్తించాయనే విషయం మీద ఫూకో లోతుగా వివరించారు. ఇప్పుడు నరేంద్ర మోడీ చేస్తున్నది కూడా అదే. అంతే కాదు,  అసమ్మతిని ఏమాత్రం సహించలేని ఫాసిస్ట్ స్వభావం కూడా వ్యక్తం అవుతుంది.

మనకు నచ్చని భావాలను కూడా ఎదుటి వ్యక్తి మాట్లాడే స్వేచ్ఛను మన సంవిధానం ఇచ్చింది. బాబాసాహెబ్ అంబేడ్కర్ భావ ప్రకటన స్వేచ్చ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఇప్పుడు విప్లవం గురించి మాట్లాడొద్దన్న ఫాసిస్టు ప్రభుత్వం, రేపు అగ్ర కులాలు, దళితులూ, బ్రాహ్మణవాదం, మనువాదం అనే భావాల గురించి మాట్లాడ కూడదు అంటే పరిస్థితి ఏమిటి? ప్రజాస్వామ్యం పట్ల అంగీకారం లేని వ్యక్తిని కూడా ప్రజాస్వామ్య బద్ధంగానే విచారించాలి. అతని మానవ, పౌర హక్కులను హరించి వేయరాదు. వ్యక్తులను నిర్బంధించటం ద్వారా లేదా వ్యక్తులను నిర్మూలించటం ద్వారా విప్లవం వైపు వెళ్లే వాళ్ళను ఆపలేదు రాజ్యం. వివి చెప్పినట్టు, శ్రీకాకుళంలో పాణి, సత్యంను చంపినా అనేక మంది సాయుధ విప్లవకారులను చంపినా నక్సలైట్ ఉదయం మరోచోట మొదలవుతూనే వొచ్చింది.  సమస్యలను పరిష్కరించినంత మాత్రాన కూడా విప్లవ భావాల ప్రభావం తొలిగిపోదు. సంక్షోభాలను సృష్టిస్తో పోయే పెట్టుబడిదారీ వ్యవస్థ కొమ్ముకాసే విధంగా రాజ్యం ప్రవర్తించినంత కాలం, ఆ సంక్షోభాలకు కారణమైన వర్గాలకు వ్యతిరేకంగా ఎదో ఒక రూపంలో ప్రజలు పోరాడుతూనే వుంటారు. అలా అని ఇది శుద్ధ ఆర్థిక కార్యకారణ విషయం కూడా కాదు.

ఇది అంతిమంగా భావజాల సంఘర్షణ. సైద్ధాంతిక పోరాటం. పాలక వర్గాలు భావజాల పోరాటంలో చేయాల్సిన పని చేయలేక, వివి లాంటి మేధావుల భౌతిక నిర్బంధం మీద దృష్టి పెడుతున్నాయి. వివి ఒక వ్యక్తికాదు. అతడొక కవిత్వం. ఒక లోతైన ఆలోచనా రచన. అతడొక విప్లవ భావన. ఆ భావనను నిర్బందించ  లేవు.  అందుకే వివిని సాయిబాబాను వొదిలేయడం ఉత్తమం.

*

జిలుకర శ్రీనివాస్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు