వాక్యాలకు అవసరమైన  రంగులకోసం….

సరళమైన భాష కవి మనసులోని భావం స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే కవి సాధించగలిగే ఒక మాధ్యమం. ఇది అనువాదకులకుకూడా వర్తించే ఒక అంశం. ఏదైనా ఒక work of art ను అనువాదకులు అర్థం చేసుకున్న తీరు వారి భాషలో సరళతకు కారణమవుతుంది.

క కవితను రాస్తున్నప్పుడు కవిలో కలిగే మార్పులేమిటి? అని ప్రశ్నించుకుంటే కవిత్వ రచనపై ఇప్పటికే ఉన్న అనేక సిద్ధాంతాలతో పాటు కవి హృదయం పొందే మార్పులూ కవితను ప్రభావితం చేస్తాయి. కవిత రాసే సమయంలో కవి తన మూర్తిమత్వాన్ని కోల్పోవచ్చు, ఇంకొకరిలో పరకాయ ప్రవేశం చెయ్యవచ్చు. ఒక ముసుగును ధరించవచ్చు, తన కంటే పెద్దదైన ఒక సూపర్ ఇగోను తానే అని భావించవచ్చు, అన్నింటికన్నా ముఖ్యం తన కవితకు అవసరమైన  రంగులకోసం కవి అనే సీతాకోక చిలుక ఎన్ని అడవి చెట్లనైనా అధిరోహించవచ్చు ఆవహించవచ్చు.

కవితాప్రక్రియ కవి భావావేశ తరుణంలోని ఒక అభివ్యక్తి. ఆధునిక కవిత్వానికి ఈ నిర్వచనం ఇంకా బాగా వర్తిస్తుంది. కవి ఒక భావ ప్రకటనా ప్రక్రియ మాత్రమే కాక భాషా సంబంధమైందీ రసోత్ప్రేరకమైనదీ కూడా. కవిత రాస్తున్నప్పుడు కవిలో జరిగే రసాయనిక ప్రక్రియ ఆ కవితకు ఒక రూపాన్నీ, భావాన్నీ, రసావేశాన్నీఇస్తుందంటే కవిత అతి తక్కువ కాలంలో చదివేవారి మనసును కదిలించే కొన్ని గుణాలను కలిగి ఉంటుందన్నమాట.

ఆ గుణాలు ఏమి ఉండవచ్చు?

  1. మొదటిది తనకు అర్థమయ్యే భాష.
  2. తన స్థాయికి సరితూగే సరళత.
  3. తన మనసును కదిలించగలిగే ఏదో ఒక రసం, అది వీర శృంగార, భయ, భీభత్స, కరుణ, విషాదాదులలో ఏదైనా కావచ్చు.
  4. సులభంగా మనసును కదిలించగలిగే శబ్దాల లయల నాదాల నర్తనం.
  5. చివరగా ఆ కవిత చదువరిపై వేయగల తనదైన ముద్ర.

ఆధునిక కవిత్వంలో పై లక్షణాలు అన్నీ ఏదో ఒక లక్ష్యంతోనే కుదురుకున్నాయి. అయితే కవిత్వం లక్ష్యం స్థల కాలాలతోపాటు మారే విషయంగా మనకు అర్థమవుతూనే ఉంది. ఆ లక్ష్యాన్ని కాలం విసిరే ఒక సవాలుగా భావించి కవి ఆ లక్ష్య సాధన కోసం చేసే కృషే కవిత్వంగా మనముందు నిలుస్తుంది.

కాలమూ లయా ఒకే భావానికి రెండు రూపాలనిపిస్తుంది నాకు. ఇవి రెండూ నిరంతరమూ మారే విషయాలు. భాషలో కొత్త పదాలు పుడుతున్న కొద్దీ లయకు కొత్త సొగసులు అద్దడానికి ప్రయత్నిస్తుంటారు కవులు. భాషలోని పదాల లయే కవిత్వంలోని లయకు ప్రాణమవుతుంది.  ఒక వంద సంవత్సరాల క్రితం మన పూర్వీకులు వాడిన పదాలు మనకు అప్రస్తుతంగా తోస్తాయి. భాషతో సృస్టించగలిగిన పదాలకు అంతు వుండదు. దీనికి ఒక ఉదాహరణగా మాండలికాలలో ప్రస్తుతం వస్తున్న కవిత్వాన్నీ, మాండలీకాలు విరివిగా వాడబడుతున్న కవిత్వాన్ని చెప్పుకోవచ్చు మనం.

కవితను మాండలికంలో రాయడంతో పాటు కవి అల్లగల పదచిత్రాలూ అతి తక్కువ పదాలతో హృదయాన్ని ఆకట్టుకోవదాలూ ఇటీవల ప్రచురితమైన ఈ కవితలో చూడండి.

“పొద్దు మల్లింది

పిలగాడు గుడిసెకు రాలేదు

ముసల్ది మనువడి కోసం గాలిచ్చింది

 

ఏటికాడ అగుపించాడు

పిల్లనగోయిని ఊపుతూ

 

వాని సుట్టూ స్యాపలు సేరి

ఆడుకుంటున్నాయి

 

తాంబేల్లు బోర్లా పండుకొని

పీకలు ఊదుతున్నాయి

 

సందమామ ముంగాళ్ళపై కూసోని

కుశాలుగా సూస్తావుంది

 

గాలి ఒంటి కాలిమీద నిల్సొని

ఈల ఏస్తోంది

 

నచ్చత్రాలు బడిపిల్లల్లా కూకొని

పాటాలు సెప్పే పంతుల్ని సూసినట్టు

సూస్తావున్నాయి

 

ఏరు పడవ మీంద

రెండు కాల్లు ఊపుతా కూసోని

తలకాయని ఊపుతాంది

 

పొదలోని నాగరాజు బయటకొచ్చి

సూస్తావున్నాడు సప్పట్లు కొడుతూ

 

కొబ్బరి సెట్టు కిందికి దిగి

గుట్టకానుకొని సూస్తావుంది

 

పేర్లు తెలీని రెండు పచ్చులు

పిలగాడిని కన్నుకొట్టకుండా

సూస్తాఉండాయి

 

ముసలాల్లు చెప్పే

ఇలాంటి కథలకోసం

ఒక తరం ఎదురుచూసేది

 

నేడు అమ్మమ్మల నాన్నమ్మల బంధం

కూలిన వారధి పిల్లల మధ్య

తెలుగు వెంకటేష్ కవిసంగమం Fb wall 28.12.25

చివరి రెండు చరణాలు తప్ప కవిత మొత్తం మాండలీకంలోనే ఉంది. చిన్న పదాలతో దృశ్యాలు అల్లిన తీరు కవికి కవిత్వం పై ఉన్న పట్టును చెబుతోంటే కవి ఎంచుకున్న దృశ్యం ప్రకృతికి దూరమవుతున్న ఒక తరపు లోటును సూచిస్తోంది. ‘ముసల్ది మనవాడి కోసం గాలిచ్చింది’ ఈ గాలింపు తప్పి పోయిన పిల్లలకోసం ఊర్లలో జరిగే తంతు. ఆ పిల్లలెక్కడో తోటి పిల్లలతో కలిసి ఆడుకునే దృశ్యం పల్లెల్లో హృద్యం.

‘తాంబేల్లు బోర్లా పండుకొని’  అవి సహజంగా అలాగేకదా ఉంటాయి. కవి వాటిని అలాగే వాడుకున్నాడు అయితే వాడిన చిత్రం మాత్రం రమ్యం.

‘సందమామ ముంగాళ్ళపై కూసోని కుశాలుగా సూస్తావుంది’

‘గాలి ఒంటి కాలిమీద నిల్సొని ఈల ఏస్తోంది’

‘నచ్చత్రాలు బడిపిల్లల్లా కూకొని పాటాలు సెప్పే పంతుల్ని సూసినట్టు సూస్తావున్నాయి’

‘ఏరు పడవ మీంద రెండు కాల్లు ఊపుతా కూసోని తలకాయని ఊపుతాంది’

‘పిల్లనగోయిని ఊపుతూ’ ఉన్న పిలగాడు తప్ప మిగతా దృశ్యమంతా అభంగ ప్రకృతి సౌందర్యమే. కవి ఆ చిత్రాన్ని పదాలతో అలంకరించిన తీరు కవికి ప్రకృతిపట్ల ఉన్న మమకారాన్నీ మాండలికం లో పల్లెలోని చిత్రాన్ని కవిత్వం చేసిన నేర్పునూ ఈ కవిత మనకు చెబుతుంది. ఈ కవితలోని సరళమైన భాషనూ కవి నైపుణ్యాన్నీ మనం ఇక్కడ గమనించవచ్చు.

సరళమైన భాష కవి మనసులోని భావం స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే కవి సాధించగలిగే ఒక మాధ్యమం. ఇది అనువాదకులకుకూడా వర్తించే ఒక అంశం. ఏదైనా ఒక work of art ను అనువాదకులు అర్థం చేసుకున్న తీరు వారి భాషలో సరళతకు కారణమవుతుంది.

అయితే కవి భావావేశపు తాదాత్మ్యతలో మునిగి పోయినప్పుడు  జరిగే చిన్న చిన్న పొరపాట్లకూ ఈ కవితలోని చివరి రెండు చరణాలూ ఒక ఉదాహరణ. హాయిగా సాగుతున్న కవితలోకి కవి హఠాత్తుగా ప్రవేశించాడు. తన మనసులోని భావం చదువరులకు అందదేమోనన్న ఆదుర్దా కవిని తొందరపాటుకు గురిచేసింది. ముగింపు వాచ్యమయ్యింది.

ప్రపంచం బాధను తన బాధగా మార్చుకున్న ఒక కవి రాసిన కవితకు తెలుగు అనువాదంగా మన ముందుకు వచ్చిన ఈ క్రింది కవితను ఒకసారి చూద్దాం.

గాజాలో తల్లుల కోసం

 

“నాకు ఏడేళ్ళున్నప్పుడు బొటనవేలికి గాయమైంది.

అమ్మ నన్ను హత్తుకుని,

నేనెన్నడూ ఎరుగని పాలస్తీనా పిల్లల

బాధనూ, వేదననూ

ఒక్కసారి తలచుకోమన్నది.

 

నాకిప్పుడు ముప్ఫై రెండేళ్లు.

నా చిన్నారి కూతురిని జోకొడుతూ,

నేనెన్నడూ చూడని ఆ గాజాలో

తల్లుల గుండెకోతను తలుచుకుంటూ

నా బిడ్డ కాలివేళ్ళను ముద్దెట్టుకున్నా.

 

ఆ తల్లుల పసికూనల వలెనే

నా పాపాయి కూడా

తెల్లని దుప్పట్లో ఒదిగి పడుకుంది,

కానీ, నా పాప-

రేపు పొద్దున్నే నిద్ర లేస్తుంది.”

మూలం- మర్వా. ఎల్. మరాద్     అనువాదం కాత్యాయని

(‘గాజా పొయెట్స్ సొసైటీ’ వెబ్సైట్ నుండి) Fb wall 15.03.2026

ఒక తల్లి హృదయ వేదనను ఆవిష్కరించిన కవితను కవి చెప్పినంత బలంగా అనువాదకులూ చెప్పగలగడం సరళమైన భాషద్వారా సాధ్యమైతే అనువాదకులు కూడా మాతృమూర్తి స్థానంలో ఉండడం కూడా అదనపు బలాన్ని ఇచ్చి వుండాలి.

వేదనకు పోలిక ఉంటుందన్నది సాపెక్షికమే అనే కఠోర సత్యాన్ని  ‘తెల్లని దుప్పట్లో’ పడుకుని ఉన్న పాపను చూసిన తల్లి పడిన వేదన సూటిగా చదువరుల మనసులను తాకుతుంది.

తమ అనుభూతిని చదువరుల అనుభూతిగా మార్చగలిగిన కవుల కవిత్వం మనకు కవిత్వంలోని చీకటి మర్మాలనెన్నింటినో తెలియజేస్తుంది.

*

చంద్రశేఖర్ కర్నూలు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు