వన్ ప్లస్ వన్ ఈస్ ఈక్వల్ టు వన్

త్రికల్లోనూ, వివిధ సామాజిక మాధ్యమాల్లోనూ అంతగా హడావిడి లేని అచ్చ తెలుగు పల్లె కవి “చిట్ల ప్రేమ్ కుమార్”. వరంగల్ ప్రాంతపు నుడి కారాన్ని, యాసను ఒంటబట్టించుకుని ఒడుపుగా కవిత్వం చేస్తున్నవాడు. జీవిత మూలాల్ని, జీవన గమనాన్ని గుర్తెరిగి సాహిత్యాన్ని సృష్టిస్తున్న కవి.
*
బతుకుమెద
~
కొత్తగా తావిడ్సిన గువ్వలం
గుట్టుగా గూడల్లుకున్నం
బతుకు పచ్ఛీసాటల
‘దూగ’ పంజమైనం
ఇద్దరం కలిసి ‘నడై’
బతుకు మెదగట్టుకున్నం
కాయిసుగా ఆశల్ని కుప్పబోసుకున్నం
ఒంగి ఒరం జెక్కి
ఒడుపుగా ఒడ్డొరం బూసుకున్నం
కట్టె పిడుక ఒక్కదగ్గరేసి
కొట్టంల సట్టమేసుకున్నం
పచ్చగూర పచ్చడ మెతుకుల తోటి
పూటెల్లదీసినం
ఇద్దరం ఇసుర్రవుతులమై
కట్టాలన్నీ ఇసిరి  రొట్టెజేసుకున్నం
కలిమిలేమిల్ల కాపిష్కలమై
కలోగంజో కలుపుక తాగినం
బతుకంటే దస్తీబుస్తీ ఆటే
ఒక్కలతోటి ఒషంగాదు
ఆమెకునేను నాకు ఆమె
ఇద్దరం ఇంటి ఇరుసును మోసే
బండిగిర్రలమైనం
కంకరదేలిన తొవ్వల్ల
కలిసి నడుత్తానం…
*
జి. లక్ష్మీ నరసయ్య “కవిత్వం ,చర్చనీయాంశాలు” పుస్తకంలో ‘కవిత్వ స్వభావం’ గురించి చర్చిస్తూ తాను ఒక కవిత చదివేటప్పుడు ఏయే ప్రశ్నలు వేసుకుంటాడో వాటిని సోదాహరణంగా వివరించే ప్రయత్నం చేయడం జరిగింది. అవే ప్రశ్నల్ని సాధ్యమైనంత మేరకు కవి చిట్ల ప్రేమ్ కుమార్ రాసిన “బతుకు మెద” కవితకు అన్వయిద్దాం.
1. ఈ కవితలో కవి చెప్పదలచుకున్న విషయం ఏంటి? వ్యక్తపరిచిన భావం, ఉద్వేగ ప్రకంపన ఏంటి?
2. వ్యక్తం చేయాలనుకున్నది కవిత్వంగా మారడానికి కవి వాడిన టెక్నిక్ ఏంటి?  కవి ఏం చేస్తే తన భావం కవిత్వం అయ్యింది?
3. ఇతివృత్తానికి సంబంధించిన మూడ్ నీ, మనో ధోరణిని, వాతావరణం సృష్టించడంలో కవిత ఏ మేరకు సక్సెస్ అయ్యింది? ఇందులో కవి వాడిన భాష, నుడికారం, యాస మొదలైన విషయాలు పోషించిన పాత్ర ఏంటి?
*
ఉమ్మడి కుటుంబం నుండి వేరుపడి కొత్త సంసారం మొదలు పెట్టిన కొత్త జంట జీవన ప్రయాణంలోని ఒడిదుడుకులు, కష్టసుఖాలు గురించి చెబుతూ కొనసాగడం ఈ కవితలోని ప్రధాన వస్తువు. ఈ వస్తువును కవిత్వం చేయడానికి భార్యాభర్తలిద్దరు ఒక్కటే అన్న భావన కలిగేలా కవిత ఆసాంతం వివిధ వాడుక పదాలను ఒడుపుగా ప్రయోగించడం గమనించవచ్చు. పచ్చీస్ ఆట లో రెండు గవ్వలు పడితే ‘దూగ’ అంటాం. రెండు గడ్డి పోసల్ని మెలేసి కడితే ‘నడి’ అంటాం. ఇలా దూగ, నడి, ఇసుర్రవుతు, కాపిష్కలు, బండిగిర్రలు, దస్తీ బుస్తీ ఆట మొ.న పదాల్ని వాడటం వల్ల సహచరుల అన్యోన్యతను ప్రతిఫలిస్తూనే ఒకటి లేకపోతే మరొకటి నిష్ప్రయోజనం అన్న భావన వ్యక్తం అవుతుంది. సాధారణ వ్యవసాయిక జీవనంలోని వాతావరణాన్ని అత్యంత సహజంగా చిత్రించటం వల్ల సజీవతను సొంతం చేసుకుంది. పచ్చగూర పచ్చడ మెతుకుల తోటి పూటెల్లదీయడం, కలోగంజో కలుపుక తాగడం, కంకరదేలిన తొవ్వల్ల
కలిసి నడవడం ఎంత ఇష్టంగా చేస్తున్నారో చెబుతూనే ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను అన్యాపదేశంగా ధ్వనింపజేస్తుంది. కవి వాడిన తెలంగాణ భాషలోని నుడికారపు సొబగులను అనుభూతి చెందుతాం. “కట్టె పిడుక ఒక్కదగ్గరేసి కొట్టంల సట్టమేసుకున్నం” అనడంలో భవిష్యత్తు ప్రణాళికా రచన దాగుంది. కాపిష్కలు రెండుగానే ఉంటాయి. ఇసుర్రవుతులు రెండుగానే ఉంటాయి. ఒకరితో దస్తీ బుస్తీ ఆట ఆడలేం. బండి ఒక గిర్రతో నడువదు. సంసారం సజావుగా సాగాలంటే ఒకరితో వశం కాదు. సావైనా రేవైనా, కష్టమైనా సుఖమైనా బాధ్యులు మాత్రం ఇద్దరు అనేది కవి  స్పష్టపరుస్తున్న కవిత్వ అంత:సారం అని బోధపడుతుంది.
*
కవి రచనలు తెలుగు సాహిత్యానికి అదనపు చేర్పుకాగలవని విశ్వసిస్తూ, తనదైన ముద్రను ఏర్పరచుకోగలడని నమ్ముతూ కవికి శుభాకాంక్షలు.
*

బండారి రాజ్ కుమార్

1 comment

Leave a Reply to చిట్ల ప్రేమ్ కుమార్ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అన్న అంతగా పేరు కూడా తెలియని నా కవితని తీసుకొని ఇంత సవివరంగా రాసినందుకు శనార్థులు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు