తడి ఆరని కథ ‘కాలింగ్‌… సప్తవర్ణం’

తెగిన గొలుసువంటి వాక్యం తెలుగు కథల్లో ఇటీవల బాగా కనిపిస్తోంది. ఇది లోపమేమీ కాదు.

 ‘చదివావా. ఎట్లా ఉంది?’ అని అడిగాడు అతను, తను ఇటీవల రాసిన కథ గురించి.

‘బావుంది. కథానిర్మాణంలో నీ నైపుణ్యం అర్థమవుతోంది. కథను కొత్తగా, ఆసక్తిగా చెప్పాలనే ప్రయత్నం ఈ కథలో కూడా కనిపిస్తోంది. నీ వాక్యం బావుంటుంది. కానీ, నీ పొడి పొడి పొట్టి వాక్యాల్లో ఏదో లోపిస్తోంది.’ కాస్త తటపటాయిస్తూనే నా అభిప్రాయం చెప్పాను.

నిజానికి నా అభిప్రాయం ఈ  కథకి మాత్రమే పరిమితమైనది కాదు, గత కొన్నేళ్లుగా అతను రాస్తున్న అన్ని కథలకూ వర్తిస్తుంది. నాతో అతను విభేదించాడు. ‘కథ ఇప్పుడు చాలా మారింది. పాతికేళ్ల కిందట చాలా బావున్నాయని అనిపించిన కథలేవీ ఇప్పుడు పాఠకులకు నచ్చవు. అంత వివరంగా కథ చెబితే చదవలేరు.’ అంటూ అతను తొలిరోజుల్లో రాసిన కొన్ని కథలనూ, నేను రాసిన ‘నోరుగల్ల ఆడది’ కథనూ, మరికొందరు రచయితల కథలనూ ఉదహరించాడు. ‘కొందరు ఇప్పటికీ  పాత పద్ధతిలోనే కథ చెబుతున్నారు. వాటిని ఎవరూ చదవడం లేదు తెలుసా’ అని కూడా కుండ బద్దలు కొట్టాడు.

నిజమే, పాతికేళ్లలో జీవనవేగం ఎంతో పెరిగింది. ఓపిగ్గా, తీరిగ్గా చదివే అవకాశం లేదు. అంత సమయమూ వెచ్చించలేరు. బహుశా అందుకేనేమో ఇటీవల చాలా కథలు కట్టె, కొట్టె, తెచ్చె తరహాలో ఉంటున్నాయి. సినిమా చూసి వచ్చిన వెంటనే కథను పక్కవాళ్ళకు చెప్పినట్లుగా అన్నమాట. ఈ పద్ధతిలో కథ ఏమిటో చదువరి మెదడుకి అందుతుంది కానీ, హృదయాన్ని తాకుతుందా అని నాకు అనుమానం. కాలంతో పాటూ జీవనశైలిలో మార్పులు వచ్చినట్టే, కథానిర్మాణశైలిలోనూ మార్పులు రావడం సహజమే. అంతమాత్రాన శ్రీపాదనూ, పాలగుమ్మి పద్మరాజునూ ఇప్పుడు చదవలేకుండాపోతామా?  వాక్యంతో ఎన్ని విన్యాసాలు చేసినా, ఎంత మంచి పదాలు పడినా పొడిబారిన వాక్యం చదువరిని హత్తుకోదు. ఎత్తుగడ ఎంత అబ్బురంగా అనిపించినా, వస్తువు ఎంత బలమైనది అయినా లోపలికి ఇంకదు.

తెగిన గొలుసువంటి వాక్యం తెలుగు కథల్లో ఇటీవల బాగా కనిపిస్తోంది. ఇది లోపమేమీ కాదు. పైగా కొన్నికథలకు బలాన్నిస్తుంది కూడా. అయితే ఇది ఆధునిక కథా శైలి అనుకుని అనుకరిస్తే మాత్రం ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇక కథను వినూత్నంగా చెప్పాలనే ప్రయత్నం కూడా మెచ్చుకోతగినదే.  అయితే కొన్ని కథల్లో శైలీ, శిల్పాలు తెట్టుకట్టినట్టుగా పైకి తేలిపోయి కనిపిస్తుంటాయి. రచయిత నేర్పరితనాన్ని మాత్రమే ఇవి వెల్లడించగలవు. వస్తువు, భాష, ఎత్తుగడ, శిల్పం.. వీటిలో ఏది విడిగా కనిపించినా అది లోపమే అనుకోవాలి. పెనవేసుకుని అల్లుకుపోయి అన్నీ ఒక్కటే అనిపించడమే మంచికథ లక్షణం.

నా కథక మిత్రుడి తాజా కథల్లో అతని శ్రమా, ప్రయోగం కనిపిస్తున్నా, అతని మునుపటి కథల్లో ఉన్నదేదో ఈ కథల్లో మిస్‌ అవుతోంది. వర్తమాన కథకులను చదువుతూ ఉన్నపుడు అదేమిటో నాకు  అర్థమవుతూ వచ్చింది. అది తడిదనం. అతను రాసిన తొలి తొలి రోజుల కథలకూ, వర్తమాన కథలకూ నడుమ ఉన్న తేడా అంతా ఇదే! విస్తృతమైన అధ్యయనం, సాధన ఆయన నేర్పరితనాన్ని ఎంతో పెంచినమాట వాస్తవమే అయినా, అవి మాత్రమే కథకు సరిపోలేదనిపించింది. కథ ఆయన లోపలి నుంచీ గాక, వెలుపల నుంచీ వస్తోంది. ఊరిని విడచి, నగరంలోని కేఫ్‌ల్లో, పబ్బుల్లో, బహుళ అంతస్థుల షాపింగ్‌ మాల్స్‌లో కథను నడిపించడం తప్పేమీ కాదు గానీ, నగరం కూడా రచయిత నరాల్లోకి ఇంకినపుడే వాక్యంలో తడి తగులుతుంది. తిట్టు, కట్టు, తిండి, తిప్పలు.. అన్నింటిలోనూ నగరవాసన ఉండాలి. స్థలాలు, తేదీలు, పదాలు మాత్రమే కాలాన్ని చిత్రించవు. రచయిత, కాలంతో పాటూ కలగలిసిపోయి ప్రవహించగలగాలి. అట్లా ప్రవహిస్తున్నారు ఈ తరం కథకులు ఎందరో. వాళ్లలో ఒకరే చరణ్‌ పరిమి. ఆయన రాసిన ‘కాలింగ్‌…సప్తవర్ణం’ కథ గత ఏడాది సారంగ వెబ్‌ పత్రికలో వచ్చింది.

వెబ్‌ప్రపంచం, తెలుగుకథకి కొత్త రెక్కలు తొడిగింది అనిపిస్తుంది ఇటువంటి కథలు చదివినపుడు. అచ్చు హద్దులు చెరిగిపోయిన స్వతంత్రత వర్తమాన కథకుల వస్తువులో, వాక్యంలో, శైలిలో కనిపిస్తున్నాయి.

అవ్యాజమైన ప్రేమానురాగాలతో సాగుతున్న ప్రయాణంలో, సహచరుల్లో ఒకరు హఠాత్తుగా కన్నుమూస్తే రెండోవారు ఏమవుతారు? ఎడబాటు దుఃఖాన్ని మోసుకుంటూ బతకడం చావుకన్నా ఘోరంగా ఉంటుంది. అటువంటి స్థితిలోంచి తన గురువు భార్యను బయటకు తీసుకురావడమే ఈ కథ. కథను కథలోని రచయిత చెబుతుంటాడు. ఏ వైరాగ్యంలో నుంచి అయినా మనిషిని బయటకు తీసుకురాగలిగింది ప్రేమ మాత్రమే. ప్రేమ రూప, సారాల్లో ఉన్న వైరుధ్యంతోనే సమస్య అంతా. వెలితి, జీవితాన్ని నిస్సారంగా మారుస్తుంది. నింపుకోవడం ఎలాగో తెలియకనే సంక్షోభంలో కూరుకుపోతాం. తన కథలకు పాఠకులనుంచి తగిన స్పందన రావడం లేదనే వైరాగ్యంలో ఉన్న యువరచయితా, భర్త మరణంతో సకల ప్రపంచమూ తనకు దూరమైందనే భావనలో ఉన్న గురువు భార్యా ఒడ్డునపడ్డ చేపల్లాంటివాళ్లే. ఒక చిన్న కదలిక చాలు. ప్రవాహంలోపడి ప్రయాణం సాగించడానికి. అతడేం అద్భుతాలు చేయలేదు. ఉపన్యాసాలు ఇవ్వలేదు. ఆమె ముందు ఒక అద్దం నిలబెట్టాడంతే. ఆసక్తులన్నీ ఆవిరైపోయాయని నమ్ముతున్న ఆమెను, అద్దంలోకి చూసి ఒక చిరునవ్వు నవ్వమన్నాడు. అద్దంలోని మనిషిని ఆలింగనం చేసుకోమన్నాడు. ‘ఆ వ్యక్తి కోల్పోయిన ప్రేమను కళ్లలోకి చూస్తూ’ ఇవ్వమన్నాడు. ఎండిపోయిన బావిలోంచి బయటకు రావడం బావికి ద్రోహం తలపెట్టడం కాదు. బావి కాదు, నీళ్లు నిజం. అపారమైన జల సంపద చుట్టూ ఉంది. అందుకోవాలి. గొప్ప ప్రేమను పంచిన భర్తను కోల్పోయిన సీ్త్ర, తిరిగి సంతోషంగా ఉండడం ఎలా సాధ్యం? ‘పాతికేళ్ల బంధం, అలా ఎలా మర్చిపోతాం?’ అని విసుక్కుంది ఆమె, తమ కథ రాసిన రచయితను. ఆ ముగింపు ఆమెకు నచ్చలేదు. ఎందుకంటే, ఆమెకు నచ్చడాన్ని సమాజం మెచ్చదనే నమ్మకం వల్ల. సమాజానిదేముంది.. నిలబడి అదిలిస్తే తోక ముడుస్తుంది. భయపడి వెన్నుచూపితే ఎగబడుతుంది. నచ్చలేదని చెప్పినా, ఆ కథలోని ముగింపు ఆమెలో నాటుకుంది. అది వేళ్లు దిగింది. మొలకెత్తి చిగురేసింది. అపార్ట్‌మెంట్‌లో ఇంటింటికీ వెళ్లి ఒక మొక్కను కానుకగా ఇచ్చి వచ్చింది. ప్రయత్నం కృత్రిమంగా ఉండచ్చు, ‘రూపాయి బిళ్ల గొంతులో ఇరుక్కున్నట్టు’ వాళ్లు మొహం పెట్టుకునీ ఉండచ్చు. కానీ మొక్క లక్షణం ఏమిటి? పచ్చగా తీగ సాగడం, మొగ్గ తొడిగి పూలు పూయడం. మనుషులు కూడా మొక్కలే కదా. ఇక ఆమెకి నిద్ర మాత్రల అవసరం రాలేదు. నల్లకర్టెన్లు తీసేశాక ఇంట్లోకి వెలుగు జొరబడి వచ్చింది. భర్త జ్ఞాపకాలతో నిండిన వార్డ్‌రోబ్‌ ఖాళీ అయింది. భావోద్వేగాల బరువు దిగిపోయింది.  జీవితం ఎవరి కోసమో మాత్రమే కాదని అర్థమయ్యాక ఇక ఏదీ బాధించదు. బంధించదు. సప్తవర్ణ ప్రపంచం ఇది. తలుపులు తెరిస్తేనే అందుతుంది.

తాత్వికత ఒక పాయగా సాగిన ప్రేమ కథ ఇది. సంభాషణలతోనే ఎక్కువగా కథ నడుస్తుంది. గురువు భార్య మానసిక స్థితిని వర్ణనాత్మకంగా ఎక్కడా రచయిత చెప్పడు. ఎప్పుడూ వేసి ఉంచే నల్లరంగు కర్టెన్లు, టేబుల్‌ మీద ఉండే అరడజనుకు పైగా నిద్రమాత్రలు, స్పూన విసిరేసిన శబ్దం… కథలో యధాలాపంగా ప్రస్తావనకు వచ్చినా ఆమెలో పేరుకున్న నైరాశ్యాన్ని వెల్లడిస్తాయి. ‘మనస్సు ఫీనిక్స్‌ పక్షి లాంటిది. ప్రతి ఉదయం కొత్తగా ప్రేమించడం మొదలు పెడుతుంది’ అంటూ ప్రణయజీవన సౌందర్య రహస్యాన్ని సున్నితంగా గురుపత్నికి రచయిత చెప్పడం ఈ కథలో ప్రత్యేకత. మెటీరియలిస్టిక్‌ తరంగా పైకి కనిపించే ఈతరం మాటల్లోతుల్లోనూ, చేతల్లోనూ అంటిపెట్టుకుని ఉండే తడి కథలో పాఠకులను తాకుతుంది. వాక్యమైనా, జీవితమైనా తడారకుండా ఉండాలని సందేశమిస్తుంది చరణ్‌ పరిమి రాసిన ‘కాలింగ్‌.. సప్తవర్ణం’ కథ.

కథ తడి ఆరని కథ చదవండి.

*

ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావు

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఓహ్, ఈ ఏడు నాకు కలిగిన గొప్ప సర్ప్రైజ్ ఇది. థాంక్యూ సర్. నేర్చుకునే దశలో మా కలాలకు ఉన్న పరిమితులు కూడా కథకి కొత్త రూపు ఇస్తున్నాయేమో. మీరు ప్రస్తావించినట్లు నగర జీవితం మమేకమయింది. అది ఆలోచనలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది. ఇది చదివాక చక్కటి కథ రాసానన్న తృప్తి.

  • చరణ్ వాక్యం చాలా బాగుంటుంది. చిన్న చిన్న పదాలతో మేజిక్ చేయగలడు

  • అజంతా సరే అయ్యగారు మీ కథ కోసం ఎదురు చూసే పాఠకులు కళ్ళలో తడి ఆరకుండా చూడండి ప్లీజ్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు