నాకు నచ్చిన నా కథ ‘‘పెంజీకటి’’

ఇది నవలగా రాసినా ఇంకా మిగిలిపోయి అసంపూర్ణంగా ఉండే జీవిత శకలం అనిపించింది నాకు.

పరిచయం అక్కరలేని పేరు పసునూరి రవీందర్. కవిగా, కథకుడిగా, బహుజన ఉద్యమకారునిగా నిత్యం క్రియాశీలకంగా పనిచేస్తున్న యువ సాహిత్యకారుడు పసునూరి. ఔటాఫ్ కవరేజ్ ఏరియా కథల సంపుటితో దళిత కథను మోడరన్ టోన్ లో చెప్పిన కథకుడు. ప్రతిష్ఠాత్మక  కేంద్ర సాహిత్య యువ పురస్కారంతో పాటూ అనేక అవార్డులు అందుకున్న పసునూరి దళిత కథను, తెలంగాణ కథను తనదైన మార్గంలో నడిపిస్తున్నారు. పసునూరి రచించిన పెంజీకటి కథ ఈ పక్షం మరిచిపోలేని కథానుభవం–

పెంజీకటి కథ చదవండి

 

థ జీవితంలో నుండి రావాలి. చెట్టు మీద పండుగా మారి అది రాలాలి అని నమ్మే వాళ్లలో నేను కూడా ఒకణ్ణి. కథను ఎలా ఎత్తుకోవాలి? ఎలా నడిపించాలి? ముగింపు, ఎత్తుగడ ఏముండాలి? ఏం సందేశం ఇవ్వాలి ఇలాంటి ప్రశ్నలేవి వేసుకోకుండానే రాసిన కథ పెంజీకటి. నా అవుటాఫ్‌ కవరేజ్‌ ఏరియా కథ సంపుటిలో ఉందీ కథ. దోసెడు కన్నీళ్ల తడిని ఒడిసి పట్టుకోవాలనే తండ్లాటలో నుండి పుట్టిందే ఈ కథ. ఎందుకంటే ఇది మా బతుకు కథ.

ఎంతో ప్రతిభ ఉన్నాసరే కిందికులాలకు అంత సులభంగా అవకాశాలు, అందలాలు దక్కవు. అలా ఊరందరినీ మెప్పించిన ఓ కళాకారుడు, కాలం విసిరిన గాలానికి చేపలా చిక్కి గతించిపోయాడు. ఆ కళాకారుని జీవితానికి నేను ప్రత్యక్ష సాక్షిని. ఎందుకంటే ఈ కథానాయకుడు మా పెద్దనాన్న జన్ను రామస్వామి. అందుకే కథలో కూడా కథానాయకుడికి అదే పేరు పెట్టాను.

ఆయన జీవితం సగం గడిచిన తరువాత నేను పుట్టి ఉంటా. కానీ ఆయన గత జీవితం గురించి మా అమ్మానాన్న చాలా రోజులు చెప్తూనే వచ్చారు. నాకు వాళ్లు చెప్పిన మాటలు వింటుంటే, నిజంగా ఈయన గతం ఇలా ఉండేదా? అంత గొప్ప కళాకారుడు, ఇంత సామాన్యంగా ఎట్లా జీవిస్తున్నాడు అనేకునేవాణ్ణి.

కాకుంటే ఆయన గత వైభవాన్నిగానీ, గత జీవితాన్ని కానీ తెచ్చివ్వలేని నిస్సహాయత మా అందరిది. ఆయన శేష జీవితం దుర్భర దారిద్య్రంలోనే గడిచింది. అది నన్ను కలిచి వేయడం ఒక బాధాకరమైన విషయమైతే, ఆయనను నేను చివరి చూపుకు కూడా నోచుకోకపోవడం ఒక జీవితకాలపు విషాదం నాకు.

సడెన్‌గా చిన్న జ్వరానికే చనిపోయాడు మా చిన్నాయన పసునూరి జనార్ధన్‌. పేదోడికి ప్యారాసెటమోల్‌ ట్యాబెలెట్‌ కూడా ఖరీదైనదే. ఆ అకాల మరణపు అంత్యక్రియలకు నేను అతి కష్టం మీద లీవ్‌ కోరి వెళ్లి వచ్చాను. సరిగ్గా వారం తరువాత అమ్మనుండి ఫోన్‌ వస్తే మా పెద్దయ్య రామస్వామి పోయాడేమో అని బిక్కు బిక్కుమంటూ ఫోన్‌ ఎత్తిన. మా అమ్మ గొంతులో ఏడుపు లేదు. కొంచెం కుదుటపడ్డాను. కుశలక్షేమాలు మాట్లాడక, పెద్దయ్య ఎట్లున్నాడని అడిగితే…ఇంకెక్కడి పెద్దయ్య బిడ్డా, నువ్వు వచ్చివెళ్లిన తెల్లారే చనిపోయాడు అంది. నాకు దు:ఖం కట్టలు తెగింది. మరి నాకెందుకు చెప్పలేదంటే చిన్నాయిన చావుకే కష్టంగా అంతదూరం నుండి వస్తివి. మళ్లీ నీకు లీవు దొరకది కదా బిడ్డా, ఇంకేమొస్తవ్‌ అని చెప్పలేదు అంది అమ్మ.

ఇట్లా నేను రామస్వామికి బాకీపడ్డాను.

అతడి బతుకును ఉద్దరించలేకపోయాను. కనీసం అతడి చావుకైనా భుజం కలుపలేకపోయాను. ఈ పశ్చాత్తాపం నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఈ బరువు కొంత దింపుకోవడానికి ఏం చేయాలో తెలియలేదు.

అట్లా నా గుండెలోతుల్లో దాగి ఉన్న దు:ఖంలో నుండి తన్నుకొచ్చిన కథే ఈ పెంజీకటి.

పెద్దయ్య నన్ను పూనాడో ఏమో అనిపించింది కథ రాయడం పూర్తయ్యాక.

మా ఊరికి, మా వాడకి, మా వాళ్ల బతుకులోకి నా ఊహ వెళ్లింది.

కళాకారునిగా రామస్వామి ఎట్లా నాటకాలు ఆడి ఉంటాడో అన్ని రోజులు విన్న ముచ్చట్లన్నీ మైండ్లో గిర్రున తిరిగినయి. అతడు నాటకమాడుతుంటే నేను మందిలో కూర్చొని చూసినట్టు రాసిన. అతడు తల్లిని పట్టించుకోకుండా నాటకాల పిచ్చితో తిరుగుతుంటే అతడి తల్లి ఎంతగా విలవిలలాడిరదో ఊహించిన. అతడి తల్లి చనిపోతే కనీసం గుండు చేసుకోకుండా నాటకాన్ని ప్రేమించిన అంకితభావాన్ని అక్షరీకరించిన. రాస్తుంటే ఏడుపొచ్చింది. రాశాక చదువుకుంటే ఇప్పటికీ ఏడుపు తన్నుకొస్తది. ఎందుకో తెలియదు ఈ అనుభవం రాస్తుంటే ఇప్పుడు కూడా ఏడుపే వస్తున్నది. అంతగా ఆ కథతో మమేకం అయ్యాను. కథ రాసేటప్పటికీ 2014లో నా కథా సంపుటి అచ్చుకు వెళ్లే సమయం. అందుకే ప్రచురణకు కూడా పంపకుండా పుస్తకంలో నెమలీకను దాచుకున్నట్టు దాచుకున్న ఈ కథను.

పుస్తకం వచ్చాక మా మరో పెద్దనాయిన, చిన్నాయినలను కూర్చోబెట్టి చదివి వినిపిస్తే…మా పెద్దనాయిన కొర్నేల్‌(నర్సయ్య) కాసేపు మనిషి కాలేకపోయాడు. ‘‘ఎట్లా గడిచిపోయిందిరా వాని బతుకు’’ అని మాత్రం ఒక్క మాటన్నాడు. నా డౌట్‌ ఏంటంటే…నేను అతడి జీవితాన్ని సరిగానే రాశానా? లేదా?! అని. కానీ మా పెద్దయ్య ఒక్కసారిగా లేచి నిలబడి అక్కడి నుండి కన్నీళ్లతో వెళ్లిపోవడం నన్ను కలచివేసింది. ఇప్పటికీ అప్పుడప్పుడు ఈ పెంజీకటి కథను చదివి మా అమ్మకు వినిపిస్తే, వలవల ఏడుస్తది. అందుకే నాకు ఈ కథ ప్రత్యేకమైంది.

నా పుస్తకానికి ముందుమాట రాస్తూ అఫ్సర్‌గారు ‘‘పెంజీకటి కథ ఇక్కడ అచ్చులో కొన్ని పేజీలే. కాని, ఈ కథ ఆవిష్కరించే జీవితం వొక మహానవల పరిమాణంలో వుంది. ఈ కథని ఊహించడంలో రవీందర్‌ వెళ్లిన దూరాలు నాకు ఆసక్తిని కలిగించాయి. ఈ కథారూపంలో నాటకానికి సంబంధించిన నిర్మాణ అంశాల్ని చాలా సహజంగా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాడు. అంతకంటే ఎక్కువగా ఒక నవలకి కావలసిన జీవితపు ముడిసరుకు తీసుకొని, దాన్ని కొన్ని పేజీల కథలోకి కుదించడం రవీందర్‌ శిల్పవిజయం. అయితే రవీందర్‌ కథన స్వరానికి వున్న నిర్ధిష్టత వల్లనే ఇది సాధ్యపడిరదని నా నమ్మకం’’ అన్నారు.

ఇది నవలగా రాసినా ఇంకా మిగిలిపోయి అసంపూర్ణంగా ఉండే జీవిత శకలం అనిపించింది నాకు. కాకుంటే దీన్ని నవలగా మలచడానికి ప్రయత్నం చేయాలన్న నా తపన ముందుకు సాగడం లేదు. ఇంకా ఎంతో తెలుసుకోవాలి. తప్పకుండా నవలగా రాసి మా పెద్దనాయిన రామస్వామి చరిత్రను శాశ్వతం చేయాలనే చిన్నకోరిక కూడా ఉంది నాకు. పరిస్థితులు అనుకూలిస్తే, కాలం అంగీకరిస్తే రాస్తాను.

మళ్లీ మా పెద్దనాయినను గుర్తు చేసుకునేందుకు,

అపారమైన కళాప్రతిభను కాపాడుకోలేక, బతుకుపోరాటంలో అలసి నిస్సారమైన జీవితం మీద అలిగి అర్ధాంతరంగా రాలిపోయి, నా కథలో పాత్రగా ఒదిగిపోయిన మా పెద్దనాయిన నిలువెత్తు పెనుచీకటి జన్ను రామస్వామిగారికి ధన్యవాదాలు.

*

పసునూరి రవీందర్

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఒక్కోసారి కథ వెనుక కథలు కన్నీటిని వర్షిస్తాయి. వసంతాన్ని చిగురిస్తాయి. తీయటి జ్ఞాపకాలను మిగులుస్తాయి. జీవితాన్ని ఆశను రంగరించి రాసిన రచయిత కథ పాఠకుల హృదయాలలో కలకాలం శిలాక్షరాలుగా నిలిచిపోతుంది. అలాంటప్పుడు పాఠకుడు ఆ కథను రాయడానికి రచయిత యొక్క ప్రేరణ, అనుభవాలను తెలుసుకోవాలి అనుకుంటాడు. అలాంటి మంచి కథల కోవలో ఉన్న ఈ కథ వెనుక కథ పాఠకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. “పెంజీకటి” రచయిత పసునూరి రవీందర్ గారికి, మరిచిపోలేని కథా అనుభవం శీర్షిక నిర్వాహకులు చందుతులసి గారికి అభినందనలు. సారంగ వేదిక నిర్వాహకులకు ధన్యవాదాలు.

  • రవీందర్ అన్న రాసిన ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియా లో నాకెంతో ఇష్టమైన కథ , బతుకు పోరాటం తెలిపేటి కథ పెంజీకటి. ఈ కథ వెనుక కథ గుండెను తడి చేసింది చందూ గారు.

  • ఇప్పటికీ ఇలాంటి జీవితాలే కొట్టుమిట్టాడుతున్నాయి

    పేదోడికి పారాసిటమాల్ గోలి, భారమే.
    ఇలాంటి ఎన్నో కన్నీటి గాధలను, ప్రపంచం ముందుకు తీసుకవచ్చి , పాలకులను మేల్కొలిపే ప్రయత్నం చేశారు
    అన్నయ్య నీ కలం పేదవాడి పక్షమే నీకలం రాతలు పేదవాడి బ్రతుకు చిత్రమే మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

    ప్రేమతో
    మీ తమ్ముడు
    మాల్లారం అర్జున్

  • రవీందర్ …
    కథా వస్తువు ఎన్నుకోవడంలోనే రచయిత సునిశిత బుద్ధి ఉంటుంది. దాన్ని శిల్పంగా మార్చటంలో నైపుణ్యం ఉంటుంది. దానికి జీవాన్ని ఇవ్వటానికి ప్రతిభ ఒక్కటే చాలదు. స్పందించే ఆర్ద్రత కూడా ఉండాలి.
    ఆ ఆర్ద్రతతో కథనానికి జవసత్వాలు ఇనుమడిస్తాయి. నువు అక్కడున్నావు.
    నీ రచలోని
    ప్రతి అక్షరానికి, పదానికి తడి తగిలి,
    రసభూయిష్టమవుతుంది. పాఠకుడికి తన్మయత్వాన్ని ఇవ్వగలది ఇంకేముంది …
    భవిష్యత్తులో ఎన్నో ఎదగని, ఎదగనివ్వని,
    ఎదిగే క్రమంలో రాలిన పూల హృదయులైన
    మన జనాంగ జీవుల జీవిత బావుటా(జండా)లను నీవు ఎగురవేయాలని అభిలషిస్తున్నాను.

    • అన్న మీ గుండె గొంతుక స్పందనకు ధన్యవాదాలు

  • సామాజిక అంతరాలను ఎత్తిచూపుతూ కథనాన్ని నడిపించే గొప్ప కథకుడు పసునూరి అన్న. కథా శిల్ప నైపుణ్యం కొలమానం ఏమంటే కథ చదువుతున్నంత సేపూ కథలోనే మనసు ను తిరిగాడేలా చేయడం …ఈ కౌశలం వలనే రవన్న సాహిత్యానికి అందరూ ఫిదా అవుతారు. తను పెరిగిన నేపథ్యం, తాను ఆచరిస్తున్న బహుజన వాదం గురించి గళం విప్పి కలం తో పోటెత్తు తాడు.
    పెంజీకటి శీర్షిక నాకు చాలా నచ్చింది. జానపదులు వాడే పడం. తమ జీవితాల్లో ఈ పెంజీకటి ఆవహించడానికి కారణం ను చాలా చక్కగా కథ రూపంలో చెప్పియున్నాడు.

  • జీవితంలో నుంచి పుట్టిన కథ పెంజీకటి. దళితుడిగా పుట్టినందుకే తన కళకు గుర్తింపు రాలేదు.తన జీవితాన్నంత నాటకానికే వేసేయడం వలన ఆయనకు నాటకం వేయడం అంటే ఎంత ఇష్టమో అర్థమౌతుంది.రాత్రంతా నిద్ర లేకుండా నాటకమాడి తన ప్రతిభను ప్రదర్శించడంలోనే మునగడం వలన తన తల్లీ ఆనారోగ్యంతో ఉందని కూడా తెలియకపోవడంతో తన తల్లీ చనిపోవడం జరుగుతుంది. తల్లీ చనిపోయిన సగం నాటకం వేయ్యాల్సి ఉందని తన పెద్దనాయినలు , చిన్ననాయినలు ఎంత చెప్పిన గుండు మాత్రం తీయలేదు.
    నాటకమే ప్రపంచం అనుకున్న అతని జీవితంలో సినిమాలు ,టివిలు రావడం వలన నాటకం లేకుండా పోయింది. చివరికి కూలినాలి చేసి ఆయన బ్రతికిన జీవితం చాలా దుఃఖకరమైనది.
    నాక్కిక్కడ కళాకారుడు మరణించడం కాదు
    కళ అంతమైపోయిందని తారసపడింది….

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు