లోకం కనురెప్పల అంచున
నిద్రపాకుతూ వున్నప్పుడు
బయట వీధులనిండాఊళ్ళ నిండా,
అడవుల నిండా,
అడవులు పరుచుకున్న కొండలంతా
కొండల ఆవలగా సముద్రాలపైన,
సముద్రాల తీరంలో
బిక్కు బిక్కు మంటున్న ఇసుక రేణువుల నెత్తిమీద కుండాపోతలా వాన కురుస్తూవుంది.
వాన వాలడానికి
పగలూ రాత్రుల భేదం అక్కరలేదు
గుడిసె,మేడ తేడాయేముండదు.
ఎక్కడైనా కురవడం వాన ధర్మం.
వానకు నేలగొంతు తడిపి
మట్టిపూలను ప్రసవించడమేకాదు
స్వేచ్ఛగా జల ప్రవహించే దార్లుల్ని అడ్డగిస్తే
కట్లతెంచుకున్న కోపమై వరదరూపెత్తడమూ తెలుసు
ఎవరో బిందెలతో కుమ్మరించినట్లు,
ఈ రాత్రి కూడా వాన కురుస్తుంది.
వానలో ముద్దవుతున్న ఇంటిలోపల
నేను కూడా కురుస్తూనే వున్నాను.
ఎలాగని పొయ్యికాడా
ఏ పంచకిందో కుములుతున్న ఆకలి పేగు కాడా
నగరాలు వెలివేసిన రోడ్డు పక్కన
పాత గుడ్డపేలికలు చుట్టుకున్న బతుకుపరాజితుని దేహం మీద
వర్షించే రాత్రై బొట్లు బొట్లుగా
దుఃఖం ముసిరిన చీకటిలో తడి తడిగా!
ఏ దిగులు కన్నీళ్లజడి కనిపించకుండా
వాన బయట మాత్రమే కాదు,
మన లోపల కూడా కురుస్తుంది!
***
వాన బైట మాత్రమే కాదు మన లోపల కూడా కురుస్తుంది..👌👌👌చాలా బాగా చెప్పావు తమ్ముడు
థాంక్యూ అక్క
వాన బయట మాత్రమే కాదు
మన లోపల కూదా కురుస్తుంది..
ఎంత చక్కని భావ ప్రకటన.. తమ్ముడు కవితలు ఎంతో ఇన్స్పైర్ గా వుంటాయి.. అభినందనలు..🌹🌹
ధన్యవాదాలు అన్న
మంచి పోయెం..
ధన్యవాదాలు అన్న