రజని అంటే పాట మాత్రమే కాదు!

చాలా సందర్భాల్లో రజని స్వరం వింటున్నప్పుడో, ఆయన సాహిత్యం నాలో నేను చదువుకుంటూ వున్నప్పుడో భావకవిత్వ ప్రభావాల నీడలు మెల్లిగా చెదిరిపోయి, రజని మాత్రమే నిలువెత్తు రూపంలో ప్రత్యక్షమవుతూ వుంటారు. ఇంతకుముందు రవీంద్రుడి వాక్యాల్లో చెప్పినట్టు- వొక అందమైన చెట్టు ఆశ్చర్యపు మెరుపులతో నిలబడి ధ్యాన నిమగ్న అయినట్టు!

“అబ్బురంపు శిశువు” రజనీకాంత రావు గారు వెళ్ళిపోయారు.

ఆయన వెనక కొన్ని లలిత గీతాల తొలకరి వాన పడుతూ వుండగా. ఆ వాన చినుకుల మధ్యలోంచి పొన్న పూవూ ఛాయ పొగడ పూలా ఛాయ శ్రీసూర్యనారాయణుడు మేలుకుంటూ వుండగా! అట్లాంటి పొగడ పూలా ఛాయ భానుడి వెలుగులోనే నేను ఆయన్ని చూస్తూ వుండే వాణ్ని కొంత కాలం కిందట! అదీ బెజవాడ వెలుగులో! రజనీకాంత రావు గారి గురించి మాట్లడడం అంటే కనీసం అయిదు పదుల బెజవాడ చరిత్ర గానమే. ఈ యాభయ్యేళ్ళలో బెజవాడ యెంత మారిపోయిందో, యెన్ని రంగుల ఛాయలు అలదుకుందో అవన్నీ గుర్తుకు తెచ్చుకోడమే.

అయితే, రజని సమక్షంలో ఆ చరిత్ర వొక దశాబ్దం దగ్గిర గడ్డకట్టుకుపోతుంది. అది 1970. ఆ కాలాన్ని గురించి నాకంటే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారూ, పన్నాల సుబ్రహ్మణ్య భట్టు వంటి వారూ, ఇప్పుడు లేరు గాని, వుండి వుంటే నండూరి, పురాణం లాంటి వారూ బాగా చెప్పగలరు.

నేను ఆయన్ని 1984 ప్రాంతంలో మొదటి సారి చూసి వుంటాను. బెజవాడ లబ్బీపేట, బందర్రోడ్డు అప్పుడు కాస్త సందడిగా వుండేది. నేను వెంకటేశ్వర స్వామి ఆలయం వీధిలో వుంటే, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు మసీదు సందులో వుండేవారు. మా వెంకటేశ్వర స్వామి వీధిలోనే ఆంధ్రజ్యోతి ఆఫీసు వెనక రజనీకాంత రావుగారుండే వారు. ఇప్పుడెలా వుందో తెలీదు కాని, అప్పట్లో ఆ వీధి ప్రశాంతంగా వుండేది. నా చిన్ని ఇరుకు గదిలో నేనూ రుద్రభట్ల కిషన్ కాపురం వుండేవాళ్ళం. కిషన్ ని ఆ రోజుల్లో రజని గారు “కిషనారా బేగం” అని ఆట పట్టించేవారు. మేమిద్దరమూ రజని గారబ్బాయి వెంకోబుకి సన్నిహిత మిత్రులం. పొద్దున్నే  లేచి, బందర్రోడ్డులో రామకృష్ణ హోటల్ కి కాఫీ కోసం వెళ్ళేటప్పుడు మాకు రజని గారి కంఠం వినిపించినట్టే అనిపించేది. ఎందుకంటే, ఆ రోజుల్లో ఆయన స్వరం వినకుండా రోజు గడిచేది కాదు! అదే రోజుల్లో ఆయన సీజర్ (కుక్క పేరు)కి సంగీతం నేర్పిస్తున్నారు. అప్పుడప్పుడూ అదొక వీనుల విందు, కన్నుల పండగ.

నాకు సాహిత్య చరిత్ర అంటే ఇష్టం కాబట్టి, రజనిగారి ప్రాణం తోడేసే వాణ్ణి- ఆ రోజుల కబుర్ల కోసం! ఆయన ఎక్కువ మాట్లాడడం గుర్తు లేదు కాని, ప్రతి దానికీ పాట అందుకోవడం బాగా గుర్తుంది. ఆ కాలంలో నాకు ఆసక్తి వున్న విషయాల్లో లలిత సంగీతం పుట్టుకా, బెంగాలీ సాహిత్యం. అయితే, ఆశ్చర్యంగా రజని ఆ సమయంలో  హైదరాబాద్ చరిత్ర గురించి ముఖ్యంగా కులీ కుతుబ్ షా  కాలం గురించి ఎక్కువ మాట్లాడేవారు. బహుశా, అది ఆయన ఆ రూపకం మీద పనిచేస్తున్న కాలమో, పని ముగించిన కాలమో,ఆ రూపక  ప్రదర్శన విశేషంగా జరుగుతున్న కాలమో! అనేక విషయాల శాఖా చంక్రమణం జరిగినా, మా ఇద్దరికీ బెంగాలీ సాహిత్యం ప్రధానమైన ఆసక్తి. రవీంద్రుడి “గీతాంజలి” భిన్న తెలుగు అనువాదాల్ని దగ్గిరగా చదువుతున్న కాలం. గీతాంజలి తెలుగు సేత విషయంలో నేను బెల్లంకొండ రామదాసు పక్షం. చాలా మంది చలం పక్షం.  ఆ సమయంలో రజని అన్న మాట నన్ను చాలా కాలం కుదిపేసింది. “గీతాంజలి కొంచెం overrated. మీరు Fireflies చదవండి. మీకు కవిత్వం అంటే ప్రేమ కాబట్టి కవిత్వంలో ఉండాల్సిన క్లుప్తతా, సూక్ష్మ సౌందర్యమూ, సున్నితత్వమూ వాటిల్లో కనిపిస్తాయి.”

ఆ మాట విన్నాక కొద్దికాలం పాటు Fireflies లో లీనమైపోయాను. ఇప్పటికీ Fireflies చదువుతున్నప్పుడు రజని మాట గుర్తొస్తుంది.

నా ఆలోచనలు మెరుపుల్లా

ఆశ్చర్యాల రెక్కల మీద సవారీ చేస్తాయి

ఓ చిన్ని నవ్వు పొదువుకొని-

తన నీడని తానే తనివితీరా చూసుకొని

మురిసిపోతుంది చెట్టు

-తను అందుకోలేని తన నీడని!

ఇలాంటి వాక్యాలు చదువుతున్నప్పుడు అది ఆ కవి ఏ కాలంలో రాసి వుంటాడో అన్న ఆలోచన వచ్చి, ప్రతి అంచనా తప్పయిపోయి, కవి ఊహాశక్తికి ఆశ్చర్యమేస్తుంది చాలా సార్లు.

నిజానికి రజని పాటలన్నీ అట్లాంటి ఆశ్చర్యాలే. ఆయన “అబ్బురంపు శిశువు” మాత్రమే కాదు, అబ్బురమైన  కవి కూడా. వొక వూహ చేయడంలో కవికీ, గేయ రచయితకీ చాలా తేడా వుంటుంది. గేయ రచయితకి కవికున్నంత స్వేచ్ఛ లేదు. లయ అందమైన కట్టడి. కాని, రజని పాటలన్నీ జాగ్రత్తగా గమనిస్తే, ఆయన గేయ రచయితగా కంటే కవిగా ఎక్కువ సంచరించాడని అర్థమవుతుంది. ముఖ్యంగా ఆ పాటల ఎత్తుగడలు గమనించండి. సాంద్రమైన భావన వెంటపడి వేధించే వొక కవి మాత్రమే అందుకోగలిగిన ఎత్తుగడ అది. ప్రతి పాటలోనూ ఆ ఎత్తుకు తీసుకువెళ్లి, శ్రోతని అందంగా కట్టిపడేసే భావ లయ అది. రజని పాటల భాషలోనే చెప్పాలంటే, ఆ భావాలయ సమన్వితమైన అనుభవం ఇదిగో ఇలా వుంటుంది:

స్వప్నజగతిలో ఛాయావీణా
సమదశ్రుతులెవో సాగునవే!

అంతరాళమున వింతరంగులెవో
అలసాలసములై అలమునవే!
రెప్పపాటులో కోటికోటి శశి
రేఖలాశలకు యేగునవే!

కల్పనాకృతులు కథలు కథలుగా
కదలి మెదలి చెలరేగునవే!
జన్మజన్మ గతస్నేహమాధురులు
ఝరులు ఝరులుగా మూగునవే!

తెలుగు సాహిత్యంలో భావకవిత్వం తీసుకువచ్చిన కొత్త లక్షణాలూ అవలక్షణాలూ చాలా వున్నాయి. భావకవిత్వ వారసత్వంగా చెప్పుకోదగిన వొక గొప్ప లక్షణం: భావ ధార కొనసాగినంత మేరా శబ్దలయా, సౌందర్యం కొనసాగడం! నిజానికి ఇది ఆంగ్ల సాహిత్యంలో షెల్లీ, కీట్సులు సాధించినదే. ఈ ఇద్దరికీ భిన్నంగా వర్డ్స్ వర్తు సాధించిన విజయం ఇంకోటి వుంది- అది అనుదిన జీవితానికి దగ్గిరగా భావ శబ్ద లయల్ని అనుకరించడం. వర్డ్స్ వర్తు చేసిన ఈ పని వల్ల కాల్పనిక కవిత్వ వ్యాకరణం మారింది. కచ్చితంగా అలాంటి పనే రవీంద్రుడు Fireflies లో చేశాడు. తెలుగులో కృష్ణశాస్త్రి గారి వంటి భావకవులకి భిన్నంగా రజని కనిపించడానికి కూడా ఇదే కారణం అని నా అభిప్రాయం. జీవన సౌందర్యం ఎక్కడో వేరే ఊహాలోకంలో లేదని, ఇక్కడే మన చుట్టూ వుందని అటు వర్డ్స్ వర్తూ, మధ్యలో రవీంద్ర కవీ, ఇటు మనకి దగ్గిరగా రజని నిరూపించారని నేను అనుకుంటూ వుంటాను. ఉదాహరణకి రజని పదిహేనేళ్ళ వయసులో రాసిన ఈ కవిత చదవండి:

జీవుడా! ఏల కనుగొన వీవు నన్ను

ఏను నీ ప్రక్కనే యుండగానే యిట్లు

మతములంబడి నా జాడ వెతకనేల?

హిందువుల గుళ్ళు కావు నా మందిరములు

తురకల మసీదులందు నే దొరకబోను

కాశికాపురి నా గృహాంగణము కాదు

కాదు మక్కాపురంబు నాకాపురంబు

ముడుపులకు మ్రొక్కులకు మోము జూప

యోగశక్తిచే తపము చే లొంగబోను

నిజముగా నన్నుచూడ యత్నింతు వేని

చెంతనే యున్న నను నీవు చేరగలవు.

1935లో రాసిన ఈ ఖండిక వెనక బలమైన సామాజిక రాజకీయ కారణాలు వుండడం మాట అటుంచి, దేవుడి కన్నా అతి ఉన్నతమైన స్థానంలో మనిషిని నిలబెట్టిన కవి రుషి పరంపరని రజని ఇక్కడ అక్కున చేర్చుకుంటున్నారు.  కర్మకాండల కింద మాయమైపోయిన మాధవ రూపాన్ని నిర్గుణ కాంతిని చేరుకునే ప్రయత్నం గురించే ఆయనా మాట్లాడారు. “చెంతనే” వుండడం అన్నది ఆయన భిన్న సంస్కృతుల సాహిత్య సాంప్రదాయాల దీపంలో నేర్చుకున్న పాఠమే. అట్లాగే, కవిత్వ శిల్ప పరంగా చదువరిని కాకుండా శ్రోతని అందలమెక్కించడం కూడా ఆ పరంపరే.

ఆధునికత వెలుగులో తెలుగు కవిత్వానికి రజని అందించిన సుగుణం ఇది. అందుకే, చాలా సందర్భాల్లో రజని స్వరం వింటున్నప్పుడో, ఆయన సాహిత్యం నాలో నేను చదువుకుంటూ వున్నప్పుడో భావకవిత్వ ప్రభావాల నీడలు మెల్లిగా చెదిరిపోయి, రజని మాత్రమే నిలువెత్తు రూపంలో ప్రత్యక్షమవుతూ వుంటారు. ఇంతకుముందు రవీంద్రుడి వాక్యాల్లో చెప్పినట్టు- వొక అందమైన చెట్టు ఆశ్చర్యపు మెరుపులతో నిలబడి ధ్యాన నిమగ్న అయినట్టు!

1984 ఆ ప్రాంతాల్లో మా బందర్రోడ్డు ఆంధ్రజ్యోతి వెనక మూడు సందులూ చాలా సందడిగా వుండేవి. మసీసు సందులో పురాణం గారింట్లో “సాక్షి” క్లబ్ సమావేశాలు. మా వెంకటేశ్వర స్వామి సందులో నిరంతరం రచయితలూ కవుల రాకపోకలూ. ఇక ఆంధ్రజ్యోతి అప్పట్లో సాహిత్య కేంద్రమే! వీటన్నీటి మధ్యా ఇవేమీ పట్టకుండా తన పాటల తపస్సులో తానూ నిండా మునిగి వుండేవారు రజని. తనదైన ప్రశాంత మందిరమేదో నిర్మించుకొని అందులో లీనమై పోయిన యోగి. పాటతో మాత్రమే జతకట్టి, ఇంకే తొందరలూ పెట్టుకోకుండా “స్వప్న జగతిలో ఛాయా వీణా/ సమద శృతులేవో” సాగుతూ వుండగా- రజని వెళ్ళిపోయారు! కాని, ఎందుకో పాట ఇంకా పూర్తికాలేదనిపిస్తోంది. ఆయన ఇంకా పాడుతూనే ఉన్నారనీ అనిపిస్తోంది.

*

గతంలో మైథిలి అబ్బరాజు గారు సారంగ కోసం రజనీకాంత రావు గారితో చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ:

అఫ్సర్

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రజనీకాంతరావు గారు మనలను వదిలి వెళితే రజనిలో కాంతి తగ్గుతుందని బాధపడ్డాను… ఇన్ని గొప్ప విశేషాలను వెన్నెలవెలుగు దీపాలుగా మిగల్చడమే ఒక ఓదార్పు… ధన్యవాదాలండీ … మంచి విషయాలు పంచారు….

  • మీతో బాటుగా ఆ రోజుల్లోకి ప్రయాణం చేసి చూసినట్టుగా అనిపించిది చదవుతూంటే. లలిత సంగీతం అంటే మొదటగా గుర్తుకు వచ్చేది ఆయన పేరే.

  • రజనీ తన జీవితపు పరిపూర్ణతని సమగ్రంగా ఆస్వాదించిన మనీషి. 21వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని అంత దగ్గరగా చూసి, భాగం పంచుకున్న ఆఖరి మనిషి రజనీ. తెలుగు సాహితీ ప్రస్థానానికి తనవంతు సంగీత సాహిత్య సేవ చేసిన వాగ్గేయకారుడు రజనీ. రేడియోకి రూపమిచ్చిన తొలి తరం భారతీయుల్లో ఎన్నదగినవాడు. సాంప్రదాయాన్నీ, ఆధునిక ఆలోచనాధారనీ, దేశ ప్రేమనీ, సంగీతాన్నీ, సాహిత్యాన్నీ ఏకరూపంగా రేడియోకి అద్దిన వాడు రజనీ.బహుముఖీన ప్రజ్ఞావంతుడు.
    బహుశా రజనీ ఆఖరి భావకవి కామొసు.

    జోహర్.
    మీ జ్ఞాపకాలతో సాంద్రమైన నివాళి బావుంది.

  • రజనిగారిదో లోకం
    నిరంతర సాధన తపనలు ఆయన్ని పెనవేసుకుని ఉండేవి
    ఆకాశవాణిలో ఎవరెవరితోనో మాట్లాడుతున్నా ఆయన ధ్యాసంతా లోపల అందీ అందకున్న పాటమీదనో
    కుదిరీ కుదరని ట్యూన్ మీదనో ఉండేది..ఉన్నట్టుండి చిన్నపిల్లాడై పాటమీద స్వారీచేస్తుండేవారు
    మంచి జ్ఞాపకాలను పంచారు…నెనరులు

  • మామూలు అభిమానులకు అందే అవకాశం లేని చక్కని విశేషాలను ఆర్ద్రం గా ఆత్మీయం గా అందించిన అఫ్సర్ కు నెనర్లు

  • జన్మ జన్మ గత స్నేహ మాధురులు
    ఝరులు ఝరులు గా సాగునవే
    అంటూ రజనీ గారు వెళ్లినా ఆ మాధురీజ్యోత్సలు మనందరినీ చుట్టు ముట్టే ఉన్నాయి అనిపించేయి నీ జ్ఞాపకాలపలవరింతలు తమ్ముడూ
    ధరణీతలాచంద్ర శిలా తరళమంటపమున నిలచి
    యుగములుగ పరిభ్రమింతు అగమ్యుడౌ ఎవని వలిచి… అని రాసిన కవే ముందు కనిపిస్తాడు. తర్వాతే గాయకుడు అని పదిలం గా పట్టుకున్నావ్ ఆయన మౌలికతను.
    మనసును మరింత మెత్తపరిచే నివాళి

  • అఫ్సర్ గారు, రజనీ గారితో మీ జ్ఞాపకాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు! చదువుతుంటే ఆ రోజులు, ఆ వీధులు చుట్టి వచ్చినట్టు అనిపించింది. చాలా గొప్ప నివాళి!

  • అప్పటి విజయవాడ సెలవుల్లో అత్తయ్య వాళ్ళింటికి వెళ్ళినపుడు తప్ప నాకే మాత్రం పరిచయం లేక పోయినా, ఆ సందులన్నీ, వీధులన్నీ ఇప్పటి మీతో కల్సి నడిచినట్టే, రజని గారి గొంతు నేనూ పొద్దున్నే వింటున్నట్టే ఉంది చదువుతుంటే

    “గీతాంజలి కొంచెం ఓవర్ రేటెడ్”, ఎంత చదివి ఉంటే ఈ మాట అన్నారో కదా ఆయన!

    అస్తమాన బాలుడూ ఆవపూవు చాయ,ఆవ పూవూ మీద అద్దంపు పొడి చాయ.. లా, అద్దంపు పొడి లాగే ప్రకాశ వంతంగా, ప్రశాంతంగా నెమ్మది పడమరకు జారి పోయిన ఆయన నిండు జీవితానికి ఇంతకు మించిన శ్రద్ధాంజలి ఉందా

    అఫ్సర్ గారూ, ఎంత ఆర్దృంగా రాశారో

    • “తెలుగులో కృష్ణశాస్త్రి గారి వంటి భావకవులకి భిన్నంగా రజని కనిపించడానికి కూడా ఇదే కారణం అని నా అభిప్రాయం.”
      ఇదిరా నిజ ఆవిష్కరణ అఫ్సర్.
      ‘అమూర్త ప్రణయం’ రద్దు చేసి అక్కడి నుంచి మెట్లు ఒక్కొక్కటే దిగి ‘ఆవరణ ప్రణయం’తో కరచాలించిన రజనీ భావకవిత్వం కాలం నాటిన వాటిని దాటిన కాలీతీత ప్రాసంగికతని సాధించిన సిసలు కవి అని నా పరిశీలన.
      నీ అనుభాల రజను కాలం నా తరంపైన చల్లలేదుగా!

  • “తెలుగులో కృష్ణశాస్త్రి గారి వంటి భావకవులకి భిన్నంగా రజని కనిపించడానికి కూడా ఇదే కారణం అని నా అభిప్రాయం.”
    ఇదిరా నిజ ఆవిష్కరణ అఫ్సర్.
    ‘అమూర్త ప్రణయం’ రద్దు చేసి అక్కడి నుంచి మెట్లు ఒక్కొక్కటే దిగి ‘ఆవరణ ప్రణయం’తో కరచాలించిన రజనీ భావకవిత్వం కాలం నాటిన వాటిని దాటిన కాలీతీత ప్రాసంగికతని సాధించిన సిసలు కవి అని నా పరిశీలన.
    నీ అనుభాల రజను కాలం నా తరంపైన చల్లలేదుగా!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు