రంగస్థలిపై… ప్రజా నాట్యమండలి – నేను – మా రెంటాల!

–     మిక్కిలినేని రాధాకృష్ణ, ప్రముఖ రంగస్థల – సినీ కళాకారుడు జానపద కళారూపాల పరిశోధక రచయిత

(అభ్యుదయమే రచయితలు, కళాకారుల తారకమంత్రమైన దశలో… 1940ల చివర, 1950ల తొలినాళ్ళలో… అరసం, ప్రజా నాట్యమండలి తదితర సంస్థలతో ముడిపడి, తనదైన కృషి చేసినవారు రెంటాల గోపాలకృష్ణ. ఆ కాలం నుంచి చివరి దాకా ఆయనకు సన్నిహితులలో ఒకరు – ప్రముఖ రంగస్థల కళాకారులు, తదనంతర సినీ నటులు ‘కళాప్రపూర్ణ’ డాక్టర్ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి. విజయవాడ, మద్రాసుల్లో ఎక్కడ ఉన్నా… తరచూ విజయవాడలోని రెంటాల నివాసగృహానికి వచ్చే సందర్శకులలో మిక్కిలినేని ఒకరు. సోదరీ సమానురాలైన శ్రీమతి రెంటాల చేతి మద్రాసు రసం, సాంబారు రుచి బాగుంటాయంటూ, ‘చెల్లెమ్మా… ఇవాళ సాంబారు, రసం చేసి మాకు అన్నం పెట్టవా’ అని స్వతంత్రించి అడిగేటంత కుటుంబ సన్నిహితులు. రెంటాల ప్రథమ వర్ధంతికి ముందు మిక్కిలినేని రాసిన వ్యాసం ఇది. తొలినాళ్ళ రంగస్థల జీవితంలో రెంటాలకూ, తనకూ ఉన్న సాన్నిహిత్యాన్ని ఆయన ఇందులో వివరించారు.)

‘‘అది 1949వ సంవత్సరం. తెలంగాణాలోని నిజామ్ నికృష్ట పాలనకు వ్యతిరేకంగా ‘తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం’ జరుగుతూ ఉంది. మరోప్రక్క కాంగ్రెస్ ప్రభుత్వం… కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది. పోలీసులు గ్రామాల మీద పడి, కమ్యూనిస్టుల్నీ, అభిమానుల్నీ నానా చిత్రహింసలకు గురిచేస్తున్న రోజులు.

కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థ అయిన ప్రజా నాట్యమండలి పైన ప్రభుత్వం విపరీతమైన నిర్బంధకాండను సాగించింది. ‘మాభూమి’ నాటకాన్నీ, ‘అల్లూరి సీతారామరాజు’ బుర్రకథనూ నిషేధించింది. రాష్ట్ర ప్రజా నాట్యమండలి కార్యక్రమాలను అణచివేసింది.

ప్రజానాట్యమండలిపై దమనకాండతో… ఆంధ్ర ఆర్ట్ థియేటర్!

ప్రజా నాట్యమండలి సభ్యుల్ని లాఠీఛార్జీలతో, చింతబరికెల దెబ్బలతో దారుణంగా హింసించడమే కాక అరెస్టు చేసి, కేసులు పెట్టి, జైళ్ళకు పంపించింది. నాట్యమండలి ఛిన్నాభిన్నమైపోయింది. కళాకారులంతా చెల్లాచెదురైపోయారు.

ఈ పరిస్థితుల్లో ప్రజా నాట్యమండలి రాష్ట్రదళ సభ్యులమైన మాతో విజయవాడ ‘హనుమంతరాయ గ్రంథాలయ’ కార్యదర్శి కృత్తివెంటి కుటుంబరావు, గ్రంథాలయ పోషకులు గెల్లి రాజగోపాలం, గరికిపాటి సుబ్బారావు, స్క్రీన్ ఆర్ట్సు జి.వి.యస్. శాస్త్రి గార్లకు ఒక అభిప్రాయం కలిగింది. ప్రజా నాట్యమండలి సభ్యులైన మిక్కిలినేని, మాచినేని (వెంకటేశ్వరరావు), వై.వి. రాజు, రాఘవాపురపు అప్పారావు మొదలైన వారితో గ్రంథాలయ వైజ్ఞానిక శాఖను నియమిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. మాతో సంప్రతించారు. హనుమంతరాయ గ్రంథాలయ వైజ్ఞానికశాఖగా ‘ఆంధ్ర ఆర్ట్ థియేటర్‌’ను స్థాపించాం. ప్రజా నాట్యమండలి అభ్యుదయ కార్యక్రమాలన్నిటినీ ఈ సంస్థ ద్వారా కొనసాగించాలని పూనుకున్నాం.

‘ఆంధ్ర ఆర్ట్ థియేటర్’ వారానికొక కార్యక్రమం ప్రదర్శిస్తూ వచ్చింది. తద్వారా విజయవాడ నగర కళారంగంలో గొప్ప సంచలనాన్ని కలిగించింది. అనేకమంది నాటక సమాజాలను ఏర్పాటుచేసి, వారూ నాటకాలను ప్రదర్శించారు.

అదీ… రెంటాల గుండెధైర్యం!

ఆ సందర్భంలో ‘ఆంధ్ర ఆర్ట్ థియేటర్’ సాగించే అభ్యుదయ కార్యక్రమాలకూ, నాటక ప్రదర్శనాలకూ ఆకర్షితుడయ్యాడొక యువకుడు. మా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. ప్రదర్శనల సమయంలో అండగా ఉండి, తన వంతు సహాయాన్ని అందించేవాడు. నటుడిగా, రచయితగా పాలుపంచుకొనేవాడు. అంకితభావంతో పనిచేసేవాడు.

ఇక్కడ ఒక మాట చెప్పాలి. ‘ఆంధ్ర ఆర్ట్ థియేటర్’ కార్యక్రమాలలో కందుకూరి వీరేశలింగం, గురజాడ వర్ధంతులు జరిపేవాళ్ళం. (సుంకర సత్యనారాయణ రచించిన) ‘వీరేశలింగం చరిత్ర’ బుర్రకథ, గురజాడ అప్పారావు గారి ‘దేశభక్తి’ గేయం పాడేవాళ్ళం. గురజాడ ‘కన్యక’ జముకుల కథ చెప్పేవాళ్ళం. ఇదంతా ప్రభుత్వానికి కంటకమైంది. ఆర్ట్ థియేటర్ మీద ఒక కన్ను వేసి ఉంచింది. అందుకు ముఖ్యకారణం – ప్రజా నాట్యమండలి సభ్యులమైన మేమందరం ఉండడమే! ఈ పరిస్థితుల్లో ‘ఆంధ్ర ఆర్ట్ థియేటర్’ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఏ వ్యక్తికైనా గుండె ధైర్యం కావాలి. ఒక ఆదర్శం కావాలి. ఒక మహదాశయం కావాలి. అకుంఠితమైన దేశభక్తి కావాలి.

అలాంటి ఆశయాలతో ఆ యువకుడు మాతో మమేకమై, మా కార్యక్రమాలన్నిటిలోనూ పాల్గొన్నాడు. అప్పటికి ఆయన ఎక్కడ పనిచేస్తున్నాడో, ఆయన విశేషాలు ఏమిటే మాకూ వివరంగా తెలియదు. అయితే, అవేమీ ఆయనకూ, మాకూ అడ్డు కాలేదు. ఆ పరిస్థితుల్లో మాతో పాటు కష్టసుఖాలు పంచుకున్న ఆ యువకుడు – అభ్యుదయ కవి అనిసెట్టి (సుబ్బారావు) మిత్రుడని తెలిసింది. ఆ మాటకొస్తే ‘నయాగరా’ కవి మిత్రబృందమైన కుందుర్తి – ఏల్చూరి – బెల్లంకొండ – గంగినేని (వెంకటేశ్వరరావు) మొదలైనవారికి ఆ యువకుడు ముఖ్యమిత్రుడనీ తెలుసుకున్నాం. ఆ యువకుడు వేరెవరో కాదు… ఆధునిక తెలుగు సాహిత్యంలో సామాజిక స్పృహ కలిగిన అభ్యుదయ కవి, రచయిత, నాటకకర్త, ప్రసిద్ధ పాత్రికేయుడు, అవిశ్రాంతంగా రచనలు చేసిన అలుపెరుగని అమృత హృదయుడూ అయిన రెంటాల గోపాలకృష్ణ.

రోజూ రిహార్సల్సులో..!

అనిసెట్టి గాలిమేడలులో..!!

అలా రెంటాల మాకు సహచర మిత్రుడైనాడు. అప్పటికే ఆయన ఎక్కడో పనిచేస్తూ ఉండేవాడు. ప్రతిరోజూ సాయంత్రం మా ‘ఆంధ్ర ఆర్ట్ థియేటర్‌’లో జరిగే రిహార్సల్సు కార్యక్రమానికి తప్పకుండా హాజరయ్యేవాడు. అలా ఆర్ట్ థియేటర్ నాటకాలలో పాత్రలు ధరించేవాడు.

మా నాటక ప్రదర్శనానికి సి.ఐ.డి.లు, పోలీసు ఆఫీసర్లు మఫ్టీ డ్రెస్‌లో వచ్చి కూర్చునేవారు. ఈ ఒత్తిళ్ళకు తట్టుకోలేక కొందరు ప్రజా నాట్యమండలి సభ్యులే వేరే థియేటర్‌కు వెళ్ళిపోయారు. అయినా, రెంటాల మాత్రం మా వెంటే ఉన్నాడు. ప్రదర్శనకు కావాల్సిన అన్ని పనుల్లోనూ తన వంతు బాధ్యతలు నిర్వహించేవాడు.

తరువాత అనిసెట్టి రహస్యంగా ఉండి, ఆర్ట్ థియేటర్‌కు ‘గాలిమేడలు’ నాటకం రచించాడు. ఆ సమయంలో అనిసెట్టికి రెంటాల తోడ్పడేవాడు. అనిసెట్టికి అంతటి ప్రియమైన మిత్రుడు. ఆ రోజుల్లో ఆయన సిగరెట్లు ఎక్కువ త్రాగుతూ ఉండేవాడు. సిగరెట్లు మానెయ్యమని నేను కోపంతో అరిస్తే, చిరునవ్వుతో నా గడ్డం పుచ్చుకొని, బ్రతిమలాడేవాడు.

రెంటాల చాలా సహృదయుడు. ఎప్పుడూ చిరునవ్వుతో మాతో సరదాగా గడిపేవాడు. తాను ఒక విషయం చెప్పాలనుకున్నప్పుడు ముక్కుసూటిగా, ముఖం బద్దలు కొట్టినట్టు మాట్లాడేవాడు. ఆయన ఆవేశపరుడు. అన్యాయాన్ని సహించేవాడు కాడు.

అలా రెంటాల, నేను చాలా సన్నిహితులమయ్యాం. నేను ‘ఆంధ్ర ఆర్ట్ థియేటర్’ నుంచి సినిమా రంగంలోకి వెళ్ళే వరకూ రెంటాల మాతోనే ఉన్నాడు. ఆ తరువాత కూడా ఆర్ట్ థియేటర్‌లోనే కొనసాగాడు. ‘శిక్ష’ లాంటి నాటికలు, ‘ఇన్‌స్పెక్టర్ జనరల్’ లాంటి నాటకాలు రాశాడు, వేశాడు. అటు పైన కొన్నేళ్ళకు ప్రజా నాట్యమండలిని పునరుద్ధరించి, పునరుత్తేజం కల్పించే దశలోనూ రెంటాల పాలుపంచుకున్నాడు. ‘అంతా పెద్దలే’ నాటక రచన, ఊరూరా ప్రదర్శనల ద్వారా 1960లలో ఆ ప్రయత్నానికి ఎంతో తోడ్పడ్డాడు.

 చాలీచాలని జీతాలు… భారమైన సంసారంతో…

ఒకప్రక్క భారమైన సంసారం… పిల్లల చదువులు… చాలీచాలని జీతాలు. అందుకోసం అహర్నిశలూ బలహీనమైన శరీరంతో రచనలు చేసి, ‘ఆర్థికలోటును ఎంతోకొంత పూడ్చుకోవడం తప్ప, ఒక్క చిన్న ఇల్లు కూడా కొనుక్కోలేకపోయాను మిక్కిలినేనీ’ అని ఎప్పుడైనా రెంటాల తన మనస్సులో ఉన్న బాధను మాటల్లో చెప్పేవాడు. ఆవేదన పంచుకొంటూ, క్రుంగిపోయేవాడు.

ఆప్తమిత్రుడు రెంటాల ఎన్నో రచనలు చేశాడు. అనువాదాలు చేశాడు. ఏది వ్రాసినా అది విశిష్ట రచనగానే వ్రాశాడు. అందుకే, ఆయన రచనలు అందరి మన్ననలనూ అందుకున్నాయి. ఇవాళ్టికీ ఆయన ఒక విశిష్ట రచయితగా నిలిచిపోయాడు.

అంతటి ఆత్మీయ మిత్రుడైన రెంటాల చివర కొద్ది నెలలు దీర్ఘ అనారోగ్యంతో బాధపడ్డాడు. ఆ అనారోగ్యంతోనే అనంతాకాశంలో కలసిపోయిన రోజున నేను విజయవాడలోనే ఉన్నా, సమయానికి మరణవార్త తెలియలేదు. దాంతో, వ్యక్తిగతంగా అంత్యక్రియలకు హాజరుకాలేకపోయా. అది నన్ను బాధించింది. అయితే, ఆ మరునాటి సంస్మరణ సభలో పాల్గొని, నా సంతాపం తెలియజేసుకున్నాను. నివాళి అర్పించాను. నవ్వుతూ, ఆప్యాయంగా పలకరించే ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోయాను.’’

  • విజయవాడ, 1996 జూన్ 4

 

రెంటాల

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు