సరైన సందర్భంలో స్వరం విప్పిన నస్రీన్!

ముస్లిం వాదాన్ని, సమాంతరంగా స్త్రీ వాదాన్ని బలంగా వినిపిస్తున్న మరో అద్భుత రచయిత్రి నస్రీన్ ఖాన్.

The right song at the right time can change the history.

– Pete Seeger

మూహం లో వ్యక్తి తన స్వేచ్ఛను, భాగస్వామ్యాన్ని పొందలేనప్పుడు, సమాజం ఆ వ్యక్తికి సంఘర్షణ ను నేర్పుతుంది. లేదా ఆ వ్యక్తే సంఘర్షణ కు ఆద్యుడవుతాడు. తన ఉనికిని గురించి వ్యక్తి ప్రశ్నించడం మొదలవుతుంది. నాగరికత కానీ, రాజ్యం కానీ ఈ సంక్లిష్టమైన వ్యక్తి జీవితాన్ని సంక్షోభ పరిచే కొద్దీ , ఆ వ్యక్తి లేక సమూహం ఆ కల్లోలాన్ని ఎదుర్కోవడం మొదలు పెడతారు. అలా పుట్టిన కవిత్వమే ముస్లీం మైనారిటీ వాద కవిత్వం గా ఎమర్జ్  అయ్యింది. ప్రారంభం లో మైనారిటీ వాదమని, తర్వాత ముస్లీం మైనారిటీ వాదమని పిలిచినా, ప్రస్తుత్తం ముస్లీం వాదంగా స్థిర పడింది.

తన నలభయ్యేళ్ల కవిత్వ సంపుటి “అప్పటి నుంచి ఇప్పటిదాకా”లో లో అఫ్సర్ ఒక చోట అంటాడు..”స్త్రీలు, దళితులు, ముస్లీంలకు సంబందించిన సంవాదం జాతీయోద్యమ దశ నించే ఉన్నప్పుడు 1980 లోనూ, 90 లోనూ, 2000 తరవాతా, అవి ఎట్లాంటి రూపాల్లోకి మళ్ళాయో గుర్తించలేక పోతే, అస్తిత్వ చైతన్య సమస్య ఎటూ తేలదు.పూర్వం నుండి వున్న కొలమానాలే దిక్కవుతాయి. అట్లా కాకుండా కోత్హ దిక్కులోకి మళ్ళి, కొత్త శిరస్సుతో వాటిని అనుభవంలోకి తెచ్చుకోవడం సరైన సమకాలీనత అవుతుంది.” ఇవి నిజంగా గొప్ప మాటలు. ఈ సందర్భ౦గా మనం గుర్తు చేసుకోవాల్సినవి, 1992 లో రామజన్మ భూమి వివాదం సందర్భంగా అఫ్సర్ రాసిన సీరీస్ ఆఫ్ పోయెమ్స్. వీటిని చరిత్ర రికార్డు చేసింది. మానవ సమాజం మర్చిపోలేనివి. ఈ తరం అభ్యుదయ, అస్తిత్వ వాద కవులు ఆ మలుపు దగ్గర కూర్చొని, చదువుకోవాల్సినవే ఆ సీరీస్ ఆఫ్ పోయెమ్స్..! అలాగే,

కన్నబిడ్డని సవతి కొడుకుగా

చిత్రించింది చరిత్ర

అన్నదముల్నించి చీల్చి

నన్ను ఒంటరి వాణ్ని చేసింది చరిత్ర”  అంటూ 1991 లో అనేక అనుమానాల అపోహాల మధ్య ‘పుట్టుమచ్చ’  రూపం లో ఖాదర్ మొహియుద్దీన్ వ్యక్తం చేశారు. ఖాజా రాసిన ‘ఫత్వా’ స్కైబాబ రాసిన ‘జగ్ నే కీ రాత్’ షాజహానా రాసిన ‘నఖాబ్’ కవితా సంపుటులు, ”అలావా” ”వతన్” ”ముల్కి” ”ముఖామి” ముస్లింవాదానికి ఊపిరి పోశాయి.  అఫ్సర్, యాకూబ్ తదితర కవులు రాసిన ఎన్నో కవితలు ముస్లింవాదానికి బలాన్ని చేకూర్చాయి. షమీ ఉల్లా ”మైనారిటీ కవిత్వం” ఖాజా ”ముస్లింవాద తాత్వికత” పరిశోధనా గ్రంధాలు వెలువరించారు. “జల్ జలా” కి బాలగోపాల్, అఫ్సర్, సురేంద్ర రాజు, సుంకిరెడ్డి రాసిన ముందు మాటలు ప్రామాణికంగా నిలిచాయి.

ఆ తరవాత అనేక మంది ముస్లిం కవులు “జల్ జలా” “అజా” “గుజరాత్ గాయం” వంటి సంకలనాల్లో మాత్రమే కాకుండా విడిగా కవిత్వ సంపుటాల్లో ముస్లిం అస్తిత్వం గురించిన భిన్న కోణాలు వెలుగులోకి తెచ్చారు. దేశం లో జరుగుతున్న పరిస్థితుల కారణంగా ముస్లీం లు రెండవ తరగతి పౌరులమనే భావన, ఆవేదన మొదలైంది.  కవులు, కవయిత్రులు  ముస్లిం వాద కవిత్వం పై తమ తమ శైలి లో గళం విప్పడం మొదలు పెట్టారు. ఇక్బాల్ చంద్ “ఆరో వర్ణం” హనీఫ్ రాసిన “ఇక ఊరు నిద్ర పోదు” , షాజహానా “నఖాబ్”– ఇలా దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం వాద కవులు, కవయిత్రులు ఒక వెలుగు నీడ కిందకు వచ్చారు. అలాంటి ముస్లిం వాదాన్ని, సమాంతరంగా స్త్రీ వాదాన్ని షాజహానా తర్వాత అంత బలంగా వినిపిస్తున్న మరో అద్భుత రచయిత్రి నస్రీన్ ఖాన్. ఆమె రాసిన ‘జఖ్మీ’ కవితా సంకలనం నిజం చెప్పాలంటే ఒక సంచలనం. తెలుగు సాహిత్యానికి నిజంగా ఈ దశకం స్వర్ణ యుగం.  రకరకాల ఆంక్షలను , పెత్తనాలను పెకలించుకొని స్వేచ్ఛగా వినిపిస్తుంది తెలుగు కవిత్వం.  ఇదిలా ఉంటే, బహుశా ఇందుకు భిన్నంగా, కవిత్వం లో భిన్న వస్తువులు, వేదనలు తీసుకు రావడానికి ఒక చారిత్రక అవసరం ఏర్పడింది.

ప్రస్తుతం దేశం లో  ఓ వేదన లిఖింపబడుతోంది. దేశం నలుమూలలా ఓ నొప్పి ప్రవహిస్తోంది. అనేక గళాలు ఆ నొప్పి కి బాణీలు కూర్చి గీతాలు ఆలపిస్తున్నాయి. ఈ సమయంలో ఆ నొప్పి రూపం చూపేందుకు కవిత్వమై వచ్చిన స్వరం నస్రీన్ ఖాన్.

నువ్వు నిలబడ్డ చోటూ నీది కాదంటుంటే పీలుస్తున్న గాలి కూడా పరాయిదైపోతున్న భావన.

నువ్వు వేసుకున్న బట్టలూ, నువ్వు తింటున్న ఆహారమూ నీలోని మానవతను అంచనా వేసే కొలతలవుతుంటే,

అడుగడుగునా నీ వేషాన్నీ భాషనీ అనుమానపు చూపులు గుచ్చుతుంటే ఉనికికి కూడా ఊపిరాడనితనం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నీ ప్రమేయం లేకుండా నిన్ను నిర్వచించే రాజ్యాంగం నిర్మితమవుతుంటే.. నేరం చేయకుండానే శిక్షకు అర్హత ఆపాదిస్తుంటే..

ఈ లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంలో ని లౌకికతలో నేను లేనా? ఆ ప్రజాస్వామ్యపు హక్కులు నాకు కాదా? భిన్నత్వంలో ఏకత్వం అనే విశిష్ట లక్షణంలో నేనెక్కడ? ప్రశ్నలు.. ప్రశ్నలు.. నలుదిక్కులా ప్రశ్నలు ప్రతిధ్వనిస్తున్నాయి. జవాబుల జాడ దొరకని చోట జఖ్మి లకు కొదవేముంది. అనేక జఖ్మి ల తరఫున ఇటీవల ఒక నవ గళం కవిత్వమై మన ముందుకొచ్చింది.

“జఖ్మి” అంటే గాయపడిన వ్యక్తి.  గాయమైంది ఎవరికి? గాయమైతే నొప్పి ఎలా ఉంటుంది మీకు తెలుసా? నొప్పి తెలిసిన వాళ్ళే మాతో రండి ఈ కవిత్వంలోని బాధను ఒకపరి పరామర్శించి వద్దాం. నొప్పి తెలిస్తేనే గాయం లోతు అర్థమవుతుందిమరి.

“ఘావ్ కీ ఆవాజ్”..

హా.. యే దర్ద్ కీ ఆవాజ్ హై. సున్ నా హో? తో దిల్ కా ఖాన్ హోనా చాహియే”  అక్షరాల నిజం. ఇది గాయం యొక్క స్వరం. ఇక్కడ మాట్లాడుతున్నది స్వయంగా “నొప్పి”.  ఆ మాటలు వినాలంటే మనసుకు చెవులుండాలి. గుండెల్లో తడి ఉండాలి. కమ్ముకున్న నల్ల మబ్బుల పరదా చాటు నుంచి కవిత్వమై వర్షిస్తున్న నయనపు మేఘం “నస్రీన్ ఖాన్”.  నస్రీన్ కవిత్వం లోని పారదర్శకత అందరిని మెప్పింప చేస్తుంది. తప్పును తప్పుగా, నిజాన్ని నిర్భయంగా, ఆమె కలం పరుగులు తీసింది. సంకలనం చదివితే, ఇంకా కొన్ని కవితలు రాసి ఉంటె బాగుండేది అనిపిస్తుంది.

స్త్రీ బాధలను, వారి  ఫీలింగ్స్ ని , వారి అనుభవాలను  చాల సహజ సిద్ధంగా స్త్రీ లు మాత్రమే వ్యక్త పరుస్తారనేది సత్యం. అదే క్రమం లో ఒక వర్గ ప్రజల ఫీలింగ్స్ ని, అనుభవాలను వ్యక్త పరచడానికి  అదే వర్గం వారి నుండే అత్యంత  సాంద్రత గా, మిగతా వారికన్నా  అతి సహజంగా రాయగలరు. దళిత సాహిత్యాన్ని చిత్రించడం లో- గద్దర్ చిత్రించిన స్థాయి లో  శ్రీ శ్రీ చిత్రించ లేక పోయాడన్నది వాస్తవం. ఇక్కడ మన నస్రీన్ ఖాన్ ఒక స్త్రీ, అంతేగాక, మధ్యతరగతి ముస్లీం కుటుంబం నుండి రావడం తో, ఈ రెండు కోణాల్లో అంటే, అటు స్త్రీ వాద కవిత్వం, ఇటు ముస్లీం  వాద కవిత్వం రెంటిని సమ ఉత్తమ స్థాయిలో, అతి సహజంగా రాయగలిగింది. ఇక్కడ ఇంకో విషయం మన ఎరుక లోకి రావాలి. ముస్లిం సాహిత్యం లో  ముస్లీం స్త్రీవాద సాహిత్యం అనే విభాగాన్ని కూడా సాహితీ వేత్తలు గుర్తిస్తున్నారు.

ఒక ముస్లీం స్త్రీ  తన పెళ్ళి విషయం లో జరిగిన తంతును “బద్ సూర్తి”  అనే కవిత లో చూడాలి.  ఈ కవిత లో స్త్రీ వాద ఛాయలు, ముస్లీం వాద స్వరం రెండూ కలగలిపిన కవిత. ఒక ముస్లీం స్త్రీని ఒక వ్యక్తి కళ్ళు చూసి ప్రేమించడం.,,, తర్వాత  పెళ్లి క్రమం లో జరిగిన ఆటుపోట్లతంతును,  అమ్మాయిని నేరుగా చూపించకుండా,  అమ్మాయి ఫోటో చూపడం, ఆ తర్వాత అనేక అడ్డంకులు, ఆ తర్వాత పెళ్లి, అటు తర్వాత మొదటి రోజు రాత్రి, ఆ ముస్లీం స్త్రీ ని నేరుగా చూడటం, అప్పుడు ఆ పెళ్లి కొడుకు “ నన్ను మోసం చేసారని” నింద వేయడం తలాఖ్ కోరటం_  ఇలా సాగుతుంది ఈ కవిత..

అందుకు కొన్ని కవితా లైన్స్ ని ఇక్కడ పొందు పరుస్తున్నాము.

ప్రేమించే సమయం లో…

“ఆంఖోమే మోహబ్బత్ కా సముందర్

కళ్ళను చూసే ప్రేమించానంటాడు”

పెళ్లి సమయం లో…..

అగ్లీ బార్ మళ్ళా వచ్చారు వాళ్లు

రిస్తా పక్కా చేద్దామని

మళ్ళీ సొంచాయించమని అమ్మీ తోటి చెప్పించిన

భావజూద్ భీ పక్కా చేస్కుంట మన్నారు

అనుమానమొచ్చిన అమ్మీ

నా తస్వీర్ ఇచ్చింది వాళ్లకి …..

 

పెళ్లి అయిన మొదటి రోజు రాత్రి

వలీమా రాత్ న

ఘూంఘట్ లో దాగిన నా చేహ్రా చూసిండు

కమ్రా నుండి గాయబ్ అయ్యిండు …

అగ్లే దిన్ తెలిసింది ధోకా చేసినమన్నాడని”…..

చివరగా…

జో భీ హుం…మై హూం

నా జిందగీల కొచ్చి

మా ఇంట్లోకి జొరబడి

మేము ధోఖా చేసినమంటాడు

అమ్మీ అబ్బూ ను నేను సంఝాయించాలి

బయటకు కనిపించే నన్ను వదిలి

లోపల ఉన్న నన్ను చూడమని

‘తలాఖ్’ కాదు నేనే ‘ఖులా’ ఇస్తానని

-ఇలా సాగుతుంది ఈ కవిత.

ఇలాగే  “వేర్ ఈజ్ మై రైట్” , “ గుర్తింపు నాదా? నాతో ఉన్న నీ అవసరానిదా ? లో ఆమె తీవ్ర స్వరాన్ని చూడొచ్చు.  ఒక రకంగా చెప్పాలంటే ధిక్కార స్వరం ,  వ్యక్తి గా నాకున్న స్వేఛ్చ, నాకున్న హక్కు ను కాల రాయడానికి ఇంకొకరికి ఎలాంటి ఆధిపత్యం ఉండదని నిఖార్సు గా చెపుతారు. నా హక్కు ఎక్కడ ? అని ప్రశ్నిస్తూనే కవయిత్రి నేరుగా ఆ కవిత లో స్త్రీలను ఒక యుద్ధానికి సన్నద్ధులు చేయడానికి సిద్ధపడుతుంది.

“కలుపు మొక్కలు లేని పంట ఉంటుందా?

నీ జాతిలో లేవని నువ్వు కితాబివ్వగలవా?”..

ఎవరో ఒకరు చేసిన నేరానికి, ముస్లీం జాతి మొత్తాన్ని దోషిని చేస్తున్న రాజ్యపు పైత్యం పై, మూర్ఖపు మనస్తత్వాలను నస్రీన్ ఒక తీరం వైపు నిలబడి ప్రశ్నించిన కవితా వాక్యం ఇది.

మానవులంతా పరస్పర సోదరులేనని చాటిచెప్పిన ఇస్లాం విశ్వ మానవ సిద్ధాంతాన్ని వంట పట్టించుకొన్న  ముస్లిం కవులు తెలుగు సాహిత్యంలో తమదైన శైలిని, ముద్రను వేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ సమైక్యత, మత సామరస్యం, సమాన హక్కులు-ఆదరణ వంటి ఆంశాలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయటానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమం లో నస్రీన్ ఖాన్ తన కవితలో….. ఇలా అంటారు.

‘భుజం భుజం కలుపుదాం// భాయీ భాయీగా మెలుగుదాం//ఇదే కదా మనదేశం రగిలించే స్ఫూర్తి

ఇదే కదా ఇతర దేశాల నుంచి మనను వేరు చేసేద’ ని ఒక్కో సారి….అంటూ,  ఆమె తన కవితలో ఐక్యతా రాగాన్ని గుర్తు చేస్తుంది.

‘వేరు చేస్తున్న కొద్దీ అక్కున చేర్చుకుంటున్న వారం.. .. మేం ముసల్మానులం’ అంటూ ముస్లీం ల  ఉనికి కి  సంబందించిన వేదనను ఒక వైపు,  “దేశభక్తి అంటే ద్వేషం పెంచటం కాద” ని నచ్చచెప్తూ మరోవైపు, “మతాల ప్రాతిపదికన దేశం రెండుగా ముక్కలైతే ప్రాణాలు విడవాలనుకున్న” అని ఇంకో కవితలో , స్వాతంత్ర్య యోధుల్ని తలచుకుంటూ చరిత్ర ను పునశ్చరణ చేసే ప్రయత్నం చేస్తోంది.

తెలుగు సాహితీ లోకంలో పదునైన కలమై దూసుకువచ్చిన నస్రీన్ ఖాన్ జర్నలిజం లో పీజీ చేసింది. జర్నలిస్ట్ గా తన వృత్తి లో భాగంగా ముస్లిం సొసైటీ పై రిపోర్టింగ్ వర్క్స్ ఎక్కువగా చేసింది. వారి జీవితాలనూ, వారెదుర్కుంటున్న వాస్తవ కడగండ్లనూ అతి దగ్గర నుంచి చూసిన ఆమె సున్నితమైన మనసు అక్షరమై విస్ఫోటించింది. మైనారిటీ లుగా ముస్లిం సమాజాన్ని రాజ్యం ఎప్పుడూ ఓటుబ్యాంకుగా పరిగణించిందనటంలో ఏ మాత్రం సందేహం లేని సత్యం. ఎక్కడో లాడెన్ ఉగ్ర పంజా విసిరితే ఇక్కడి సుర్మా ధరించిన సులేమాన్ సస్పీషియస్ అయాడనేదీ అనబద్ధం. పాకిస్తాన్ తోనో, ఇంకో ముస్లీం దేశం తోనో పేచీ పడితే, ఇక్కడి ముస్లీం లను దోషులుగా చూడటం, ఇక్కడి ముస్లీం లను ఆయా దేశాల ప్రతినిధులుగా భావించడం జరుగుతోంది.  అసలు నిజానికి, ముస్లీం ల వాస్తవ జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది నస్రీన్ పలు కవితల్లో వివరించే ప్రయత్నం చేశారు. వారి ముస్కురాహట్ (చిరునవ్వు) ల వెనుక దలిందరాగీ (దారిద్ర్యం) నీ, కడ్వీ జిందగీ లోనూ అస్లీ నియ్యత్ నూ వర్ణించింది నస్రీన్. ముస్లిం ల జీవన శైలిలో ని సున్నితమైన వేదనలు.. మనకు తెలియని కొత్త కోణాల్లో పరిచయం అవుతాయి “జఖ్మి” లో.

కాలం తీసుకురాని మార్పును స్వప్నిస్తుంది. మూర్ఖపు గోడల్ని కూల్చాలని ఘోషిస్తుంది. మీరు కలగన్న గడ్డేనా ఇదని రోదిస్తుంది. సమానత్వపు జాడలెక్కడని నిలదీస్తుంది.

ఏది చెప్పినా నిజాయితీగా చెప్పింది నస్రీన్. కవిత్వం కదా అని ఎటువంటి అభివ్యక్తి వ్యూహాల జోలికీ పోలేదు. నేరుగా నే ప్రకటించింది. కళాత్మక కవిత్వం ఆశించే వారికి నేరుగా మాట్లాడటం ఒకింత చేదుగా తోచవచ్చు. ఆధునిక సమాజం సృష్టిస్తున్న కొన్ని కొంగొత్త సమయాలు నేరుగా మాట్లాడటం వల్ల పాఠకులకు దగ్గరవుతున్నాయి. ఇదే మార్గం లో ప్రయాణిస్తోంది నస్రీన్ ఖాన్. కవిత్వ భాష తెలియక కాదు. కానీ.. సామాన్యుని వాడుక భాష లో చెప్తే త్వరగా అర్థమవుతామనే సూత్రం తెలుసుకుంది. తన చుట్టూ ఉన్న మనుషులు సహజంగా మాట్లాడే భాష వాడింది తన కవిత్వంలో. ఈ సంకలనం లో  శిల్ప సౌందర్యం అంటూ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఎక్కడా అపూర్వమైన పోలిక లు గానీ, మెటాఫర్ ల ప్రయోగం గానే కనిపించదు. వస్తువు లో కొత్తదనమే దాని శిల్పం.  కవిత్వ వ్యక్తీకరణలో కవి చూపిన  నిజాయితీ నే ఈమె కవితలకు అలంకారం. అవే,  ఆద్యంతం వ్యక్తమయ్యే వేదనే  ఈ సంకలనానికి ఊపిరి.  అదే దీన్ని ఉన్నత స్థితి లో ఉంచుతుంది.  ఈ  సంకలనం లో, తెలంగాణా మాండలీక ప్రయోగం అంటే, ఉర్దూ తెలుగు పదాల జుగల్బందీ  కవిత్వంలో కనిపిస్తుంది. ఈ భాషల జుగల్బందీతో పరిచయం లేని పాఠకుల్ని ఒక మోస్తరు ఇబ్బంది కి దగ్గర చేస్తుంది.

జఖ్మీ నస్రీన్ ఖాన్ తొలి కవిత్వ సంపుటి. ముస్లిం వాద కవిత్వం అనే టాగ్ తో ఈ పుస్తకం ప్రచురించారు. “తరతరాలుగా సమాజంలో అణచివేతకు గురవుతున్న, బాధింపబడుతున్న వర్గాల్లో ఒకరైన స్త్రీ తరఫున ఎలుగెత్తిన స్వరం అవటం నాకిష్టం. అందుకే నేను స్త్రీ వాద కవినే” అని ప్రకటించుకున్నారు ప్రముఖ స్త్రీ వాద కవి శిలాలోలిత గారు. సరిగ్గా  ఇలాంటి అభిప్రాయమే నస్రీన్ గారిని ముస్లిం వాద కవి గా ప్రకటించుకునేలా చేసిందనుకుంటాను.

“జఖ్మి” (గాయపడిన వ్యక్తి) లో.. గాయపడిన ముసల్మాన్ మాత్రమే కాదు అణచివేయబడుతున్న ముస్లిం మహిళ కనిపిస్తుంది హిజాబ్ లతో చిదిమివేయబడుతున్న పసితనాలు కనిపిస్తాయి కాశ్మీర్ లోని ‘రక్తపు సరస్సు ల నరకం’ దర్శిస్తాం నోట్ల రద్దుతో ఏటీఎం ల వద్ద గాల్లో కలిసిన ప్రాణాలు.. జీఎస్టీ తో వెన్ను విరిగన సామాన్యులు.. ఒకటేమిటి ఎక్కడ గాయం ఉందో అక్కడ ఈమె కవిత్వమై నిలబడింది.

“ఏదీ బాధిత మహిళ లేని మతం? ఏదీ ఆధిక్యత లేని ప్రపంచం? ఏదీ అణచివేత లేని సమాజం?” ఏదీ? ఈమె అడుగుతున్న వాటికి జవాబులు ఎక్కడైనా చూపగలరా ? ఆడది ఉన్న చోటల్లా అణచివేత ఉంటుందేమో. ఆఖరికి చిన్నపిల్లల్నీ వదలని వివక్ష.. హ్మ్..పుట్టుకతోనే మొదలవుతుందేమో కదా..!!

“.. బేడీలతో బయటకొచ్చిన కబూతర్లు

….అడుగులైనా కుదురుగా పడని ఆ చిన్ని పాదాలకు బంధంలా చుట్టేస్తూ నల్లని వస్త్రం సమానతకు చిహ్నమైన యూనిఫామ్ లను కప్పేసే చిట్టి బుర్ఖా

………… తరీఖాల్లో దిగబడిన సమ్మెట పోట్లు

ఆధునికత నిర్దేశించిన తెహజీబ్ లు..”

ఆల్రెడీ ఉన్న సంప్రదాయాలకు తగిలిస్తున్న కొత్త సంస్కృతులకు బలవుతున్న చిట్టి బాల్యాలు..

“మొగ్గలుగా ఉన్నప్పుడే ధిక్కరించే చైతన్యం చేయూతనివ్వాలి” అంటూ ఆవేదనతో ధిక్కార స్వరమై పలికింది “తాలీమ్” కవితలో.

రంజాన్ మాసాన్ని ఫలప్రదం చేసేందుకు తాము కొవ్వొత్తులయే ముస్లిం మహిళల సంవేదన “నిరామయ సైరన్ ఆమె”. ఇందులో ఓ పక్క అవిశ్రాంతమైన పనులు మరోపక్క ధార్మిక చింతన.. ప్రత్యేకమైన కోణం లో స్త్రీ శ్రమను వివరిస్తుంది.

ముస్లిం మహిళకు మాత్రమే ప్రత్యేకమైన వేదన తలాక్. ఈ నేపథ్యంలో నే “అతడు ఆమె” కవితలో స్త్రీ పట్ల వివక్షను సమర్ధంగా ప్రశ్నిస్తుంది. మొత్తం స్త్రీ త్యాగాన్నీ.. ఒడవని శ్రమనూ తెలిపే కవిత.. ఉనికే ప్రశ్నార్థకమైనప్పుడు ఆపద్బాంధవి రాత్రి అంటూ హృద్యంగా మహిళ ఏకాకితనాన్ని చెప్పే కవిత “రాత్ కీ కహానీ”

“..కులం మతం జాతి మాటున యావత్ ప్రపంచమూ దద్దరిల్లితేనేమి? చూడదగిన జాతులు రెండు మాత్రమే ఒకటి ఆడ జాతిరెండు మగ జాతి తోటి జాతిని నాశనం చేసే పాము లాంటి జాతి…” యావత్ మహిళా ప్రపంచం తరఫున ఎలుగెత్తిన స్వరం ఇది.

“మన బతుకులు లగ్జరీ కాకున్నా రుతుస్రావాలకైనా లగ్జరీ బడ్జెట్ లో చోటు దక్కిందని గర్వపడు ఆ ఖర్చు అంబానీ ఇంట పూచే చెట్టుకు ఎరువో, యోగాలు చేసే మ్యాట్ లకొనుగోలుకో ఉపకరిస్తుందిలే! అదీ కాదంటే స్వచ్ఛ భారత్ కు ఆయుధాలు కొంటారేమో

ఒక్క మాటలో..

నీ ఒక అవసరం ప్రభుత్వాన్ని నడుపుతుందనుకో!” పక్కా పొలిటికల్ సెటైరికల్ టోన్.

ఇలా.. ఎలాంటి పరిస్థితి లో ప్రశ్నై నిలబడాలి, ఎక్కడ ధిక్కార పతాకమై ఎగరాలి, ఎందుకు చైతన్యమై వికసించాలో ఎరుక కలిగిన కవి నస్రీన్ ఖాన్.. “శల్యమైన దేశానికి సారధి కావాల”ని కోరుకుంటుంది.

సంపుటిలోని చివరి పేజీ లో ఉన్న ఒకే ఒక్క వాక్యం “అంతిమంగా నిలిచేది మానవత మాత్రమే”. ఇది నస్రీన్ ఖాన్ గారి అసలు హృదయాన్ని పట్టించే వాక్యం.

సమాజమనే అన్నంలో వ్యక్తి ఒక మెతుకు

ఇంటర్వ్యూ :  సి.వి.సురేష్

 

* సి.వి. సురేష్ : మీ బాల్యం లో  మీరెక్కడైనా కాస్ట్ డిస్క్రిమినేషన్ కు గురయ్యారా!? అలా అయితే, ఆ సందర్భాన్ని మా ‘సారంగ’ పాఠకులతో పంచుకుంటారా!?

* నస్రీన్ ఖాన్ : బాల్యంలో అస్సలు లేదు. గ్రామీణ వాతావరణంలో గడవడం వల్ల మధుర స్మృతులే ఎక్కువగా ఉన్నాయి. మా గ్రామంలో కుల,మతాల పట్టింపు బాల్యంలో ఏమీ లేదు. కోడలా అనో, మనవరాలా అనో పిలిచేవాళ్ళు. నేనూ అమ్మమ్మ, తాతయ్య అనే పిలిచేదాన్ని. నగరవాతావరణం సోకక మునుపు పల్లెలన్నీ చక్కటి వరుసలు కలుపుకుని నోరారా పిలుచుకునేవారు. ఇప్పటికీ మా వూరికి వెళ్తే నోరారా అలాగే పలకరించే వారు ఉన్నారు.

⁃ స్కూల్, కాలేజ్ లో అయితే ఒక్కరిద్దరే ముస్లిం విద్యార్థినులం కావడంతో ఫ్రెండ్స్ అంతా మా గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరిచేవారు. చమ్కీ దుస్తులు బాగున్నాయనో, నెయిల్ పాలిష్ లోని మెరుపులనో ఆరాధనగా చూసేవారు. మా అమ్మ కట్టే లంచ్ బాక్స్ కు మహా క్రేజ్ ఉండేది. ఇంకాస్త ఎక్కువ తీసుకురమ్మని హుకూం జారీ చేసేవాళ్ళు. అమ్మ పెట్టిన చింతకాయ పచ్చడిని ఒక్క రోజు తీసుకెళ్ళకపోయినా ఫ్రెండ్స్ అందరూ తిట్టేవారు. ఇక పండుగలు వస్తే సేమియా గురించి బాగా అడిగేవారు.

* సి.వి. సురేష్ : సమూహాల స్వేచ్ఛో.. కొందరు వ్యక్తుల లేదా గుంపుల స్వేచ్ఛో కాదు.. “వైయుక్తిక స్వేచ్ఛ” అస్తిత్వ వాదాపు అంతర్గత ప్రధాన లక్ష్యమని మీరు భావిస్తారా!?  ఆ దిశగా ప్రస్తుత అస్తిత్వ వాద పోరాటం సాగుతోందా!?

* నస్రీన్ ఖాన్ : ⁃ ఏ జీవికి అయినా కావలిసింది స్వేచ్ఛే. ఇదే మూల సూత్రం. రూపమేదైనా పోరాటం జరుగుతున్నది మాత్రం స్వేచ్ఛ కోసమే. బాధితుల కోసమే పోరాటాలు జరిగాయి. జరుగుతున్నాయి. జరుగుతాయి.  తాము అనుభవిస్తున్న బాధలను ప్రపంచానికి చూపాలనే తపన అస్తిత్వవాదంలో ఉన్నది. ఆ దిశగా అస్తిత్వవాద పోరాటం సరైన దిశలోనే జరుగుతున్నది. తమ అస్తిత్వం గురించి ఎవరైతే గొంతెత్తున్నారో వారు స్వయం తమ అనుభవాలనో, తాము ఎక్కువగా ఏ బస్తీల్లో చూస్తున్నారో వాటినే రాస్తున్నారు. అసలు చూడకుండా ఊహించి రాసినదానికంటే అనుభవించి, చూస్తూ రాసిన వాటిలో నిజం ఉంటుంది. అది ఎప్పటికైనా జీవన పరిమళాన్ని వెదజల్లుతూనే ఉంటుంది. భావి తరాలకు కాస్తంత బతుకునూ నేర్పుతుంది.  చలం అయినా, శ్రీ శ్రీ అయినా వారు చూసినదే రాశారు. అందుకే ఈనాటికీ వాటికి మనుగడ.  అయితే పోరాటాలు చేసే వారిపైనే సమాజం మరింత బరువును మోపుతుంది. ఎవరైతే ఒక లక్ష్యం గురించి పోరాటం చేస్తున్నారో వారి నుంచే మరో రకమైన బాధితులకోసం కూడా పోరాటాన్ని ఆశిస్తున్నారు. ఇదే అసంతృప్తులకు కూడా కారణం కావొచ్చు.

సి.వి. సురేష్ : వ్యక్తి జీవితాన్నీ… సమాజాన్నీ వేరు చేసి చూసి, ఆ దిశగా కథ గానీ, కథానిక గానీ.. కవిత్వం కానీ కదిలే అవకాశం ప్రస్తుత సమాజం లో ఉందా!?

* నస్రీన్ ఖాన్ : ⁃ సమాజమనే అన్నంలో వ్యక్తి ఒక మెతుకు. అన్నం ఉడికిందో లేదో చూడాలంటే ఒక్క మెతుకునే పట్టి చూస్తం. అయితే అన్నమంతా సరిసమానంగా ఉడకాలంటే మాత్రం నీళ్ళు, మంట ఉండాల్సినంతే ఉండాలి. కథ అయినా, కథానిక అయినా, కవిత అయినా వ్యక్తి జీవితం నుంచో, సమాజం నుంచో ఎందుకు వేరు చేసి చూడాలి?

సి.వి. సురేష్ : మీరు ఒక రచయిత్రి గా మొదలై… తర్వాత క్రమంలో ముస్లీం వాద రచయిత్రి గా మలచబడ్డారా!? లేక, మొదటి నుండి ముస్లిం వాద కవిత్వాన్నే ఎంచుకున్నారా!?

* నస్రీన్ ఖాన్ : ⁃ కవిత్వాన్ని మలచడం అనే ఆలోచన కంటే మనం ఏవైతే ఎదుర్కొంటున్నామో అవే రాతలుగా మారి తమను తాము మలుచుకుంటున్నాయేమో. నాకు ఆదీ అంతం ఏమీ లేవు. నేను ఇప్పుడే ప్రయాణం మొదలుపెట్టాను.

సి.వి. సురేష్ : ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఓ కవయిత్రి గా ఈ నవ, యువ కవులకు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు!?

* నస్రీన్ ఖాన్ : ⁃ వాస్తవికతకు అనుగుణంగా సమకాలీన కవిత్వాన్నే అందరూ చక్కగా రాస్తున్నారు.  ఎవరికి వారు సొంత శైలిలోనే తమ గొంతు వినిపించడానికి ఇష్టపడుతున్నారు. ఇది కూడా అస్తిత్వ ప్రకటనే. గైడెన్స్ ఏముంది కానీ రాసేది ఏదైనా నిజాయితీగా రాస్తే చాలు.

సి.వి. సురేష్ : ఈ సమాజాన్ని ఒక కవయిత్రి కోణం లో చూస్తున్నారు.. ఆ సమాజాన్ని చక్కదిద్దే క్రమంలో కవిత్వం తన లక్ష్యాన్న్ని చేరుకొంటోందా!?

* నస్రీన్ ఖాన్ : ⁃ కచ్చితంగా చేరుకుంటోంది. కవిత్వానికి ఆ లక్షణమే లేకపోతే ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన ‘హమ్ దేఖేంగే’ కవిత ఇంత ప్రకంపనలు సృష్టించదు. ఎప్పుడో 79లో రాస్తే ఈనాడు పాలకుల్లో వణుకు పుట్టించడమేమిటి?  పుట్టుమచ్చ ఈనాటికీ గుర్తు చేసుకునేవారు కాదు.  జల్ జలా పునర్ముద్రణకు వెళ్ళేది కాదు.

.సి.వి. సురేష్ :  మీ గురించి క్లుప్తంగా..

* నస్రీన్ ఖాన్ : ⁃ అన్ని మధ్యతరగతి కుటుంబాల్లోని పిల్లల బాల్యం ఏ విధంగా గడుస్తుందో అలాగే గడిచింది. సాంప్రదాయ ముస్లిం కుటుంబం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడిచింది. వివాహానంతరం హైదరాబాద్ రావడం, ఇక్కడే డిగ్రీ పూర్తి చేసి జర్నలిజంలో చేరడం జరిగింది. జర్నలిజం సూల్లో పుస్తకాలు చదివే అవకాశం ఉండేది.  నేను చదివిన మొదటి పుస్తకం ఓల్గా గారి రచన స్వేచ్ఛ. ఆ తరువాత వాసిరెడ్డి సీతాదేవి గారి మరీచిక. అనంతరం ఏడుతరాలు, అమ్మ, స్పార్టకస్, చలం, రంగనాయకమ్మ…అలా కొనసాగుతూనే ఉంది.

సి.వి. సురేష్ : చాలా వరకు మీ కవితల్లో…. స్త్రీవాద కవిత్వం, ముస్లిమ్ వాద కవిత్వం పారలల్ గా నడిచింది.. ముస్లిమ్ మతం లోని కొన్ని సాంప్రదాయాలు (మహిళల పట్ల) గురించి ఆలోచిస్తే బాలన్స్ చేయడం కష్టం అనిపిస్తుంది.. మీరు అలా స్త్రీవాద కవిత్వం, ముస్లిమ్ వాద కవిత్వం రాసే సమయంలో ఆ డిఫికల్టీ ని ఫేస్ చేసారా!?

* నస్రీన్ ఖాన్ : ⁃ మహిళగా మహిళలను, ముస్లింగా ముస్లిం ముస్లింలను, ముస్లిం మహిళగా  ఏకకాలంలో రెండింటినీ చూసే అవకాశం నాకు లభించింది. ఏవైతే చూసానో వాటినే రాసాను. డిఫికల్టీస్ ను ఫేస్ చేయడం ఆడవారికి కొత్తేమీకాదు. సాంప్రదాయాలు అంటే… ఇస్లాం మతంలో అద్భుతమైన సాంప్రదాయాలు ఉన్నాయి. అవి కూడా అపార్థాలకు గురయ్యాయి. గురయ్యాయి అనడంకంటే గురి చేశారు అని చెప్పొచ్చు.

⁃ అందరికీ బుర్ఖా గురించిన చర్చపైనే ఆసక్తి. హోదాలు మరిచి మనిషిని మనిషిలాగే చూస్తారట కదా అని మాత్రం ఎవ్వరూ అడగరు. ట్యూబెక్టమీ, వేసెక్టమీల ప్రచారం వారికి అర్థమయ్యేలా చేయరు కానీ పిల్లలను ఎక్కువ కంటారెందుకు అని ప్రశ్నిస్తారు. మత విద్యతోపాటు వృత్తి విద్యలు అవసరమనే చైతన్య కార్యక్రమాలు ఎక్కడా జరగవు కానీ వేరే చదువులు చదవనీయరట కదా అని అడుగుతారు. సచార్ కమిటీ రావడానికి ముందు ముస్లింల అభివృద్ధికి సంబంధించి రాజకీయ పార్టీలు ఏవేవో చెప్పుకొచ్చారు. తీరా నివేదిక వచ్చాక అమలు విషయం మరుగున పడింది.   ఇటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఏవైతై ఉన్నాయో వాటినే జఖ్మిలో రాసాను.

సి.వి. సురేష్ : కవిత్వమే వృత్తిగా తీసుకుని ఎవరైనా ఒక రచయిత ఈ మెటరియలిస్టిక్ ప్రపంచం లో  మనుగడ సాగించగలరా!?

* నస్రీన్ ఖాన్ : ⁃ ఏదో ఒక వృత్తికి కవిత్వం ఒక ప్రవృత్తిగానే కొనసాగుతోంది. కవిత్వమే వృత్తి అని చెప్పినా బతకడానికి ఏం చేస్తున్నారు అని అడిగే సమాజంలోనే ఉన్నాం మనం. ఆర్థికావసరాలు, పోషణ భారాలు లేని వారికి కవిత్వమే వృత్తి అయినా మనగలగడం పెద్దకష్టం కాకపోవచ్చు. కానీ మిగతావారిలాగే బాధ్యతల నుంచి తప్పించుకోవడం నేటి కవులకు సాధ్యం కావడంలేదు. ఆర్థికంగా కుదురుకుని ఉన్నవారికైతే ఈ సమస్య తలెత్తదేమో.

సురేష్ : మీకు ఈ దేశం లో స్పష్టంగా కనిపిస్తున్న వాస్తవికత ఏమిటి!?

* నస్రీన్ ఖాన్ : ⁃ దేశం అద్భుతమైనది. ఎన్నో పరిణామ వికాసాల తరువాత వచ్చిన రూపమిది. ఏదో ఒక సంఘర్షణ నిత్యకృత్యమే. సంఘర్షణ తరువాతే స్పష్టత వస్తుంది. ఇప్పుడూ అటువంటి స్పష్టత దిశగానే సంఘర్షణ జరుగుతోంది.

సురేష్ : ఒక ముస్లిమ్ వాద రచయిత్రిగా  ట్రిపుల్ తలాక్ పైన కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం పై మీ అభిప్రాయం ఏమి!? అది ముస్లిమ్ మహిళలకు ఉపయుక్తమైనదిగా భావిస్తారా!?

* నస్రీన్ ఖాన్ : ⁃ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇస్లాంలో అనేక అపార్థాలకు గురైన వాటిలో ట్రిపుల్ తలాక్ కూడా ఉంది. రాజ్యాంగేతర శక్తులు ఎలాగైతే రాజ్యాంగంలోని లొసుగులు వెతుక్కొని వాడుకుంటున్నాయో, ట్రిపుల్ తలాక్ ను కూడా అలాగే వాడుకుంటున్నాయి.

⁃ కేంద్రప్రభుత్వం చట్టం చేయకమునుపు ముస్లింలలోని విడాకుల సంఖ్య కంటే హిందువుల విడాకుల సంఖ్యే అధికం. మెజారిటీ, మైనారిటీ పరంగా శాతాల్లో లెక్కించినా హిందువులదే ఎక్కువా. అయినా అపార్థాలకు గురైంది మటుకు తలాక్ పద్ధతి.  నిజానికి ఇస్లామ్ లో ఉన్న ట్రిపుల్ తలాక్ పద్ధతి ఏ ఇతర మతాల్లోని విడాకుల పద్ధతికి తీసిపోదు. వాట్సాప్ లో తలాక్ చెప్తున్నారు, ఇంకేదో అనేదంతా దానిని దుర్వినియోగం చేసేదే.  కేంద్రప్రభుత్వం కూడా తన ప్రయోజనాలకు అనుగుణంగా ట్రిపుల్ తలాక్ ను బూచిగా చూపింది. దానికి ప్రత్యేక చట్టం తెచ్చే బదులు జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ నివేదికనే అమలు పరిచితే ఆ ట్రిపుల్ తలాక్ ఏమిటో వారే చదువుకునేవారు. పోనీ పురుషులు ఇచ్చే విడాకులూ(తలాక్), స్త్రీలు ఇచ్చే విడాకులు(ఖులా) ఒకటే అనైనా స్పష్టం చేయలేదు. పైగా భార్య ఖులా ఇస్తే… అదీ ఏకపక్షంగా భర్త అంగీకారం మేరకే జరిగే విడాకుల్లా కాకుండా స్త్రీకి ఉపయోగపడేలాగానైనా చేయలేదు. మరో విషయమేమిటంటే ఇప్పుడు చట్టంగా వచ్చినంతమాత్రాన ట్రిపుల్ తలాక్ దుర్వినియోగం ఆగిపోనూలేదు.

*

 

 

సి.వి.సురేష్, ఫణి మాధవి కన్నోజు

21 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మొత్తం ఇంటర్వ్యూ,… సాఫీగా,జరిగింది. ముస్లిం రచయిత్రి గా,జర్నలిస్ట్ గా,తమది అయినా పరిధిలో..బాగా సమాధానాలు. చెప్పారు. అభినందనలు,💐👍.ఇంటర్వ్యూచేసినవారికి, రచయత్రి ఖాన్ గారికి…

    • చాలా ధన్యవాదాలు మీ ఆత్మీయ స్పందనకు

    • మంచి విశ్లేషణాత్మక ఇంటర్వ్యూ. ఈ పుస్తకాన్ని చదవాలి.

  • ముందు నస్రీన్ గారి కవిత్వ.సంపుటి విశ్లేషణ ఆ తర్వాత ఇంటర్వ్యూ రెండు సూపర్ సురేష్ సార్

  • నస్రీన్ ఖాన్ అంతరంగం …..స్త్రీ అభ్యుదయ భావాలకు …..సంప్రదాయాల్లో ని నాస్తికత్వం పైన తన అంతర్మధనానికి …..ప్రతికలా … ఉంది ….
    నైస్ ఆర్టికల్…..

  • బయటకు కనిపించే నన్ను వదిలి

    లోపల ఉన్న నన్ను చూడమని

    ‘తలాఖ్’ కాదు నేనే ‘ఖులా’ ఇస్తానని….. excellent lines!

    Great interview and also inner view of Nasreen .. congrats to Cv Suresh Sir and Phani Madhavi and Nasreen …

  • Great interview…. Kudos to the team of Cv Suresh and Phani Madhavi Kannoju…..నస్రీన్ గారి జఖ్మీ నేనూ క్షుణ్ణంగా చదివి సమీక్ష రాయటం జరిగింది…. ఇంత సవివరంగా మరోసారి చదవటం ఆనందంగా వుంది… Congrats to Nasreen and looking forward for many more books from her pen…..

  • ఎలాంటి పరిస్థితి లో ప్రశ్నై నిలబడాలి, ఎక్కడ ధిక్కార పతాకమై ఎగరాలి, ఎందుకు చైతన్యమై వికసించాలో ఎరుక కలిగిన కవి నస్రీన్ ఖాన్ ఆపాకు వొందనాలు.

    జాతీయోద్యంలో కానీ, జాతిని జాగృతం చేసి క్రాంతిపధం లో నడిపించటానికి ఆత్మబలిదానాలతో ఉవ్వెత్తున లేచిన వామపక్ష ఉద్యమాలలో కానీ… కుల, మత, జాతి, లింగ అస్తిత్వాలకతీంగా కలగలిసినవారు అనేకులు…

    వారిలో సుభాష్ చంద్రబోసుకు కుడిభుజమైన షానవాజ్ ఖాన్ ఓ ప్రతీక… సాహిత్యం లో మున్షి ప్రేం చంద్, ఇస్మత్ ఆపా… ఉద్యమాలకు మారుపేరైన మక్ధూం, కౌముది, నిన్నటి సఫ్దర్ హష్మి ఎందరెందరో కదా ఆపా.

    గమ్యానికి దూరమవుతున్న, బహుళ అస్తిత్వాలు తనలో మమైకం అయ్యేలా ప్రేరేపించటంలో విఫలమవుతున్న వామపక్ష ఉద్యమాన్ని ఉద్దీపనం చెయ్యటం, ప్రగతిశీల శక్తులను కూడగట్టటం కు నస్రీన్ ఖాన్ ఆపా కలం, గళం సాయం రావాలని విన్నవించుకుంటూ…

    ~ ఓ నేలక్లాసు పెట్టీ బూర్జువా… అందుకు ఓ చిన్న ప్రతీక

    ముస్లీం జాతి మొత్తాన్ని దోషిని చేస్తున్న అధమం వైపే ఎందుకు చూడాలి ఆపా ? మొఘల్ చక్రవర్తుల గోల్డెన్ స్వర్ణయుగం … సూఫీ ఇజం, మైసూర్ టైగర్ టిప్పూ సుల్తాన్… దక్షిణ ఆసియాలోని మొదటి అతిపెద్ద నాగరికత అయిన సింధు లోయ నాగరికత ( హరప్పా, మొహెంజో దారో ఈ నాగరికతకు కేంద్రం )లో భాగస్వామ్యమైన పాకిస్తాన్ ( క్రికెట్, హాకీ ఆటల్లో అత్యంత ప్రతిభచూపిన ), సింధ్ ప్రాంతం, భారత్ భూభాగం లో దొరికే మార్బుల్ ( చలువరాయి ) కి తీసిపోని ఆనిక్స్ గనులున్న పాకిస్తాన్ ( PAKISTAN is estimated to have around 297 bn tonnes of marble and granite reserves, mainly in the remote areas of Khyber Pakhtunkhwa, Fata, Balochistan and rural Sindh. Onyx, a rare marble, is abundant in the Chagai district of Balochistan; its dark green variety is found in five countries only. ) పాకిస్తాన్ లో ఉన్నవారిలో కొద్దిమందే ముస్కరులు… మూర్ఖులు. మెజారిటీ అంతా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆత్మీయతలు పంచుకునే దాయాదులం. భారత్ పర్షియాల వాణిజ్యం సాంసృతిక అనుబంధం మాటేవిటి.

    క్రీ.పూ. 5 వ, 6 వ శతాబ్దాలలో గౌతమ బుద్ధుడు, మహావీరుడు బుద్దిజం, జైనిజం ధారావాహిక తత్వాలు ప్రచారం చేశారు. మరి యీ 21వ శతాబ్దంలో హిందూ, సిఖ్, ఇసాయి, జైన, బుద్దిజాల కతీతమైన సమసమాజాన్ని ఆవాహనం చేస్తున్న ప్రగతిశీలశక్తుల ఉద్యమాన్ని బలోపేతం చెయ్యి నస్రీన్ ఖాన్ ఆపా

  • మంచి వ్యాసం. మంచి ఇంటర్వ్యూ. నస్రీన్ వంటి చైతన్యవంతమైన మహిళలే మతపరంగా ఇంటా బైటా మహిళలకి, మైనారిటీలకి చేసే అన్యాయాల్ని ఎండగట్టగలుగుతారు.

  • మంచి ఆర్టికల్. నస్రీన్ గారికి అభినందనలు

  • ఇంటర్వ్యూ బావుంది. పుస్తక సమీక్షలో కూడా కొన్ని ప్రతిపాదనలలో ఇప్పటి దాకా వచ్చిన ముస్లిం వాద కవిత్వాన్ని సమీక్షించుకోవడం అయింది. అభినందనలు.

  • నస్రీన్ గారికి కవిత్వం పై సురేష్ గారి మంచి విశ్లేషణాత్మక ఇంటర్వ్యూ. Superb… Congratulations akka

  • ముస్లిం సాహిత్యం గురించి మొదట్లో వివరంగా రాయడం బాగుంది సార్ .ముస్లిం స్త్రీవాద సాహిత్యంలో నస్రీన్ అక్క కవిత్వ ప్రత్యేకత అద్భుతంగ విశ్లేషించారు.ఇంటర్య్వూ మరింత ఆసక్తికరంగా సాగింది.నస్రీన్ అక్క జవాబులలో ఎంతో నిజాయితీ వుంది.ముఖ్యంగ పల్లెటూర్లలో ముస్లిం జీవిత ఎలా వుంటుంది అనే విషయాలు ,వృత్తిగా కవిత్వం తీసుకోలేకపోవడం లాంటి అంశాలు ఎంతో బాగున్నాయి.ఎంతో శ్రమ ఈ వ్యాసంలో కనిపించింది సార్ .కొత్త కవులకెప్పుడు మీ ప్రోత్సాహం ధైర్యాన్నిస్తుంది.

  • చరిత్రను అద్భుతంగా రాశారు సురేష్ సర్ , మాధవి మేడమ్ ! చాలా మంచి వ్యాసం! నస్రీన్ గారి కవితలు కొంచెం చదివా ఇలా. పుస్తకం చదవాల. సురేష్ సారూ మంచి ప్రశ్నలు అడిగారు. నస్రీన్ గారి సమాధానాలు నేరుగా ఉన్నాయి.
    సారంగకు ధన్యవాదాలు

  • చరిత్రను అద్భుతంగా రాశారు సురేష్ సర్ , మాధవి మేడమ్ ! చాలా మంచి వ్యాసం! నస్రీన్ గారి కవితలు కొంచెం చదివా ఇలా. పుస్తకం చదవాల. సురేష్ సారూ మంచి ప్రశ్నలు అడిగారు. నస్రీన్ గారి సమాధానాలు నేరుగా ఉన్నాయి.
    సారంగకు ధన్యవాదాలు .

  • దశాబ్దాలుగా గాయపడుతున్న ఎన్నో హృదయాలను తన కవితా సంపుటి జఖ్మీలో నస్రీన్ చక్కగా వివరించింది. సురేష్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుత దేశ పరిస్తితులను బాగా విశ్లేషించింది. ఇలాంటి కవితలు నస్రీన్ కలం నుండి మరెన్నో జాలువారాలని కోరుకుంటున్నా….

  • ముస్లీంవాద కవిత్వం పట్ల వ్యాసకర్తలు చూపిన సానుభూతి ప్రశంసనీయం.. నస్రీన్ ఖచ్చితంగా. ముస్లీంవాద మహిళా సాహిత్యానికి కొత్త చేర్పు. వ్యాసమూ ఇంటర్య్వూ రెండుకూడా ముస్లీం
    వాద కవిత్వం పట్ల పాఠకులకు మంచి అభిప్రాయం కలిగిస్తాయనడంలో సందేహం లేదు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు