ముస్లింవాదానికి మరో అరుదైన చేర్పు

బాధిత సమూహమైన ముస్లిం సమాజంలో అమ్మ ఎలా ఉంటుందనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

బాధిత సమూహాలకు సంఫీుభావంగా నిలబడడం కన్న గొప్ప పని ఏముంటుంది?

నోరులేని వారి తరపున నిలబడి గొంతెత్తడమే ఏ కవికైనా ప్రథమ కర్తవ్యం. అసమానతలు, అమానవీయాలు నెలకొన్న సమాజంలో నిత్యం దగాపడుతున్న వారి గురించి ఆలోచించడమో, పట్టించుకోవడమో చేయకుంటే ఏ కవైనా తన సామాజిక బాధ్యతను నెరవేర్చనట్టే. ఇలాంటి చారిత్రిక ఖాళీలను కనిపెట్టడంలో దిట్ట ప్రముఖ కవి, కథకులు, నవలాకారులు అన్వర్‌గారు. 2004లోనే తండ్రి మీద తొలిసారిగా తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప చారిత్రక కవితా సంకలనం వారి సంపాదకత్వంలోనే వెలువడిరది. నాన్నల జీవితాలకు ఒక నిలువెత్తు దోసిలిపట్టింది. ప్రస్తుతం విస్మరణకు గురయ్యే నిత్య బాధితురాలు తల్లిని గురించి అన్వర్‌గారు మరో చారిత్రక సంకలనం తీసుకువచ్చారు. అందరి తల్లుల గురించి అయ్యుంటే ఈ సంకలనం సాధారణమే అయ్యేది. కానీ, తల్లుల్లో మరింత దగపడ్డ బాధిత ముస్లిం తల్లిని గురించి పుస్తకం వేయాలి, కవులందరితో రాయించాలనుకోవడమే ఒక గొప్ప మార్పుకు నాంది.

అక్షరాల యాభైఆరుమంది కవులతో కూడుకొని ఉన్న కవితా సంకలనం ఈ ‘‘అమ్మీజాన్‌’’. ఇందులో కవులంతా తమను ఈ సమాజానికి అందించిన తొలిగురువైన తల్లికి తమ కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలుపుకున్నారు. తల్లిని గురించి కాసేపైనా ఆలోచించి ఆమె దయనీయ దు:ఖభరిత జీవితాన్ని తమ అక్షరాల్లో పొదిగి, నీరాజనాలు పలికారు. తల్లి ప్రేమలో మరోసారి తడిసిపోయారు. తల్లి త్యాగాలకు తల్లడిల్లిపోయారు. ఈ కవిత్వ సంకలనంలోని కవుల్లో చేయితిరిగిన వారితో పాటు తొలిసారిగా తల్లికోసం కలం పట్టినవారు కూడా ఉన్నారనేది మనకు ఈ పుస్తకం చదివినప్పుడు అర్థమవుతుంది. అలాగే పట్టణనేపథ్యాల నుండి వచ్చిన కవులు కొందరైతే, ఎక్కువగా పల్లెల నుండి వచ్చినవారే ఉన్నారు. మానవతా దృక్పథంతో తల్లిపట్ల తమ ప్రేమను కొందరు కవులు చూపిస్తే, రాజకీయ చైతన్యంతో, సామాజిక అవగాహనతో, వర్తమాన సందర్భంతో, చారిత్రిక మూలాలతో తల్లి పాత్రను సమీక్షించినవారు మరికొందరు. ఈ కవితా సంకలనం మనకు శ్రామిక తల్లుల జీవితదర్పణంగా కనిపిస్తుంది. తల్లి ప్రేమను గురించి, తల్లి చాకిరిని గురించి, తల్లి దు:ఖాన్ని గురించి, కష్టాలు`కన్నీళ్లను గురించి వివిధ కోణాల్లో చిత్రించడం మనలో కొత్త ఆలోచనలు రేపుతుంది. ఈ కవితా సంపుటిని చదివిన వారికి వారి తల్లులను గుర్తు చేస్తుంది.

పురుషాధిక్యత కలిగిన సమాజంలో ఏ సమూహంలోనైనా తల్లికి జరిగేది అన్యాయమే. ఇక్కడ ముస్లిం జిందగీల నిర్ధిష్టత కోణంలో తల్లిని దర్శించడమే ఈ కవితా సంపుటి యొక్క ప్రాసంగికతను నిలబెడుతోంది. బహుశా ఇది అస్తిత్వవాదాల కొనసాగింపు. ఆధునిక సాహిత్య గమనానికి అరుదైన చేర్పు. సాధారణంగా బహుజన (ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ)తల్లుల జీవితాలు కాయకష్టంతో ముడిపడి ఉంటాయి. వారి జీవితంలో విశ్రాంతి, విరామాలకు తావు లేదు. తాము ఎల్లప్పుడు అలసిపోవడానికి వీలు లేదు. తల్లి త్యాగాన్ని గురించి అందుకే ఈ సంకలనం ప్రారంభంలోనే సంపాదకుడు అన్వర్‌గారు చాలా స్పష్టంగా, బలంగా తల్లి పాత్రను సూత్రీకరించే ప్రయత్నం చేశారు. ఒక ముస్లిం తల్లి ఎన్ని విధాలైన కష్టాలను అనుభవిస్తు, కుటుంబాన్ని చక్కదిద్దడం కోసం తనను తాను ఏ విధంగా కోల్పోతుందో చాల గొప్పగా ఆవిష్కరించారు. బహుజన శ్రమ సంస్కృతి ఆ తల్లులను కష్టాలకు ఎదురీదే వారియర్స్‌గా మలిచింది. అలాగే ఎంతటి కష్టం వచ్చినా లోలోపలే దాచుకునే ఆకాశమంత అమ్మలను చేసింది. అందుకే ఇవాళ ఏ బిడ్డ ఎదిగి గొప్పవాడయ్యాడన్నా అది అతడిని లేదా ఆమెను కన్న తల్లుల యొక్క త్యాగమే కారణం.

‘‘నాకు పరిచయమైన తొలినేస్తం అమ్మీజాన్‌!

నా బొందిలో ప్రాణం పోసిన తొలిడాక్టర్‌
నవమాసాల నా చీకటి కుహురంలోనే
నాకెన్నో విద్యలు నేర్పిన ఉపాధ్యాయురాలు’’అంటూ తల్లికి కృతజ్ఞతల దండలేశారు.

అమ్మీ పుస్తకం నిండా కొడుకుల కృతజ్ఞత ఉంది. తల్లిని గురించి తమ గుండెగొంతుకతో మాట్లాడిన కవితలున్నాయి. శిరస్సు వంచి తల్లులకు జేజేలు పలికిన జాడలున్నాయి. వాటన్నింటిని చదువుతున్పప్పుడు పాఠకుడు కన్నీటి చెమ్మ అవుతాడు. మానవజాతి వికాసంలో తల్లుల పాత్రను గురించి తరచి చూసుకునే సందర్భాన్ని సృష్టించింది ఈ కవితా సంకలనం. ముఖ్యంగా మెజారిటీ సమాజానికి తెలియని ముస్లిం తల్లి గొప్పతనాన్ని ఈ కవులు గొప్పగా ఆవిష్కరించారు. చాలీచాలని సంసారాల్లో ముస్లిం స్త్రీలు పడే కనిపించని హింసను తల్లిసందర్భంతో వెలుగులోకి తీసుకొచ్చారు. సంసారాన్ని నడపడం అనే బాధ్యతను తల్లులు ఎట్లా భుజాన వేసుకుంటారో దృశ్యాలు దృశ్యాలుగా చిత్రించారు.

‘‘అమ్మంటే తెల్లకాగితం ఏమి రాయగలను నేను?
కొన్ని క్షమాపణలు
ఇంకొన్ని షుక్రియాలు తప్ప!
ఈ సిరాచుక్కలతో ఏం వ్యక్తపరచగలను?’’ అంటూ మనసులోని ఉద్వేగాలను ఈ కవులు కవిత్వ రూపంలో వ్యక్తీకరించారు.
‘‘పిల్లల్ని పెంచుడే ముష్కిల్‌ అయిన జిందగీల సదువుతోనే బతుకు మార్తదని నమ్మినావు’’అంటూ పిల్లల ఎదుగుదలలో తల్లుల పాత్ర ఎంతుందో తలుచుకున్నారు.

తెలుగు సాహిత్యంలో ఇది తొలి ముస్లిం తల్లి సంకలనం. ఇప్పటి వరకు ముస్లిం పురుషుల గురించే పట్టించుకోని తెలుగు సాహిత్యం ముస్లిం స్త్రీలను గురించి మాత్రం ఎందుకు పట్టించుకుంటుంది. నిజానికి ఇదొక ఖాళీ. వెలితి. ఇది ఎప్పుడో చేయాల్సిన పని. తెలుగు సాహిత్యంలో అప్పుడప్పుడైనా అమ్మల గురించి తలుచుకున్న సందర్భాలున్నాయి. నాన్నల గురించి గడిచిన ఇరవై యేళ్లుగా తెలుగు కవులు స్మరిస్తున్నారు.

కానీ, ఒక బాధిత సమూహమైన ముస్లిం సమాజంలో అమ్మ ఎలా ఉంటుందనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆమె త్యాగం తెలియాలంటే, ఆమె జీవితం తెలియాలి. ఆమె జీవితాంతం పోషించే పాత్ర తెలియాలి. అలా ఆవలితీరం వంటి తల్లుల బతుకుచిత్రాన్ని అమ్మీజాన్‌ సంకలనం మనకు పరిచయం చేస్తుంది. గుండెతడి ఉంటే ప్రతీ పేజీలోను మనకు కన్నీటి ఊటలు తగులుతుంటాయి. వెచ్చటి కన్నీటి స్పర్శ మనల్ని చుట్టు ముడుతుంది. చేతులెత్తి ఆ తల్లికి నమస్కరించాలనిపిస్తుంది. అంత హృద్యంగా ఈ కవులు తల్లిని గురించి కవిత్వమై ప్రవహించారు. ఆలస్యంగానైనా ఒక మంచి సంకలనాన్ని తీసుకురావడం అభినందనీయం. ముస్లింవాద సాహిత్య ప్రస్థానంలో మరో బలమైన సంకలనంగా ఈ అమ్మీజాన్‌ నిలుబడడానికి కావాల్సిన అన్ని అర్హతలూ పొదువుకున్న కవిత్వమిది.

*

పసునూరి రవీందర్

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎక్సలెంట్ రైటప్ తమ్ముడు అభినందనలు

  • నిజంగా అమ్మ గురించి cheppalante eppatiki odavani muchate Anna ….ammanu minchina daivam unnadha aatmanu minchina addamunnadha Ani Annaru oka kavi…ee prapanchanlo unna ammakandariki ankitham ee ammijaan🙏🙏👍👍❤️❣️

  • మంచి విలువైన పరిచయం లాగా వుందన్న..
    అయితే, నా మనసులో ఒక చిన్న సంఘర్షణ. తల్లి ఏ తల్లి అయినా ఆమె పాత్ర, ఆమె బాధ్యతలు..ఆమె త్యాగం , ఆమె సహనం , ఆమె మోసే భారం ఆమె తల్లి తనం అంత ఒకటే కదన్న..!

  • బాదిత సమూహాలకు సంఘీభావంగా నిలబడడం కన్నా గొప్ప పని ఏముంటుందన డా: పసునూరి రవీందర్ తన వ్యసంలో ఉటంకిస్తు ముందుకెళ్ళాడు.ఈ సందర్భంగా సి.నా.రే.ఓ సందర్భంలో మూఖీభాష్పాలకు నోరిచ్చి మాట్లాడించిన జాషువా అంటారు ,అదే విధంగా కొంతమంది కవుల సమూహం అమ్మమీద రాసిన కవితా సంపుటిగురించి గొప్ప విశ్లేషణ చేశాడు తమ్ముడు, ఇంత గొప్ప విశ్లేషణ ను సారంగ వెబ్ పత్రిక పబ్లిష్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు

  • రవీందర్, అభినందనలు. అన్వర్ సంకలించిన అమ్మీజాన్ అనే పేరున కన్నతల్లికి, కనీ పెంచీ పెద్ద చేసి శ్రమజీవన సహేతుకతను తన చేతలద్వారా నేర్పిన మాతృమూర్తికి ఈ రూపంగా వందనం తెలపటం అభినందనీయం. అమ్మీజాన్‌కి మీరు రాసిన పరిచయ వాక్యాలు వెలకట్టలేనివి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు