మన కాలపు తెనాలి రామలింగడు

ఉత్తరాంధ్ర లో ప్రముఖ కవి కథకుడు చింతా అప్పలనాయుడు ఆగస్టు 2వ తేదీన విజయనగరంలో చాసోస్ఫూర్తి అవార్డు అందుకోనున్న సందర్భంగా–

త్తరాంధ్రలో చింత అప్పలనాయుడుని తెలియని ఆధునిక సాహితీ వేత్తలు ఎవరూ వుండరని నా నమ్మకం. పార్వతీపురంకు చెందిన చింత అప్పలనాయుడు ప్రముఖ కవి. కథకుడు కూడా. అంతకుమించి మంచి మాటకారి. చమత్కారి. తనున్న చోటల్లా పూల పరిమళాన్ని పండిస్తూ ఉంటాడు. తేనె వాన చినుకుల్లా ఛెణుకులు విసురుతూనే వుంటాడు. నవ్వుల జలపాతాలను కురిపిస్తూనే ఉంటాడు. అందుకే నేనంటాను చింతా  మన కాలపు తెనాలి రామలింగడు అని.

తెనాలి రామలింగడిని మనం చూడలేదు అతని కథలు చదివి నవ్వుకుంటాం. తన చమత్కారాన్ని సమయ స్ఫూర్తిని మెచ్చుకుంటాం. కానీ నేటి మన చింత అప్పలనాయుడుని చూడగలం మాట్లాడగలం. నవ్వి నవ్వి పొట్టల్లో నొప్పిని తెచ్చుకోగలం. అసలు  తనని చూస్తే చాలు నవ్వు వస్తుంది తెలిసిన వారికి. అతను మాట్లాడితే మన పొట్టలు పగిలిపోతాయి. పావుగంట సేపు తను మనప్రక్కన ఉన్నాడా మన శరీరాలు పూలబుట్టల్లా తేలికైపోతాయి.

ఆనాటి  తెనాలి రామలింగ కవిని వికటకవి అంటారు. అంటే కేవలం హాస్యకవి మాత్రమేనా! అంటే కాదు అనిచెప్పాలి. తన చతురోక్తులతో చాతుర్యంతో సమయస్ఫూర్తితో అటు రాజును ఇటు ప్రజలను మెప్పించినవాడు మాత్రమేనా! కాదు. వాటితో పాటు గొప్ప కావ్యాలు రాశాడు. తెలుగునాట పంచ కావ్యాలలో ఒకటైన పాండురంగ మహాత్యం అతడి రచనే. అంతే కాకుండా ఉద్భటారాధ్య చరిత్ర,ఘటికాచల మహాత్మ్యము మొదలైన కావ్యాలు రాశాడు.

అలాగే మన చింత అప్పలనాయుడు కూడా. గ్రామీణ భాషలో చెప్పాలంటే ‘ఇకటకవే’ (“గొప్ప ఇకటాలాడుతాడు మేస్ట్రుబాబు” అంటారు) అలాగే అంత మంచి సాహిత్యాన్ని కూడా సృష్టించాడు. “దుక్కి”..”అరసేతిలో బువ్వపువ్వు”అనే రెండు కవితా సంపుటులు, “నకజనకరి .. నాం.. నాం” ఒక కథా సంపుటి ప్రకటించి  మంచి రచయితగా తనను తాను నిరూపించుకున్నాడు అప్పల నాయుడు.

తను ఎంతగా నవ్వించినా కవ్వించినా రచనల దగ్గరకు వచ్చేసరికి అంతా సాంద్రతరమైన సాహిత్యాన్నే సృష్టించాడు. పాఠక లోకాన్ని మెప్పించాడు. కనుకనే ప్రతిష్టాకరమైన చాసోస్ఫూర్తి  అవార్డును గెలుచుకోగలిగాడు. సుప్రసిద్ధ కథా రచయిత ఆంధ్రా చెకోవ్  అని పిలవబడిన చాసో పేరుతో ఇచ్చే అవార్డును ఆగష్టు 2వ తేదీన  విజయనగరములో అందుకో గలుగుతున్నాడు. ఈ అవార్డు కథల అవార్డు. తన కథలకు వచ్చిన అవార్డు. గనక తన కథలపై రెండు మాటలు మాట్లాడుకుందాం.

కథా సంపుటి పేరులోనే రచయిత తన దృష్టి ఏమిటో,తన స్వభావం ఏమిటో తెలియజేశాడు. తన కథా వస్తువు ఏమిటో చెప్పకనే చెప్పాడు.

“నకజనకరి నాం ..నాం” అనేది ఒక డప్పు శబ్దం. ఇది ముఖ్యంగా గ్రామాల్లో ఎక్కువగా వాడే డప్పు అనే వాయిద్యంపై వేసే లేదా వాయించే ఒక వరస లేదా ఒక దరువు. ఆపేరు పెట్టడ ములో తనది కళా హృదయమని చెప్పకనే చెప్పాడు రచయిత.. తన వస్తువు గ్రామీణమని, కథల్లో దళిత బహుజన జీవితాలను గురించి రాసానని పేరులోనే ధ్వనింపజేశాడు.

కొందరు గ్రామము అనగానే రైతు, రైతంటే గ్రామం అన్నట్టు రైతు బాధలే బాధలుగా మొత్తం అవే గ్రామసమస్యలుగా రాసిపడేస్తారు.పుంఖాను పుంఖాలు. అప్పలనాయుడుకి ఆ ఫ్యూడల్ మనస్తత్వం లేదు. గ్రామమంటే అనేక కులాల అనేక శ్రమల సమాహారమని తెలుసు.ఆ చైతన్యము అతనిలో వుంది. పుస్తకం తెరిచి చూస్తే రచయిత సమాజములోని వివిధ తరగతుల జీవితాన్ని ఎంత నేర్పుగా ఎంత బలంగా చిత్రించాడో తెలుస్తుంది. అట్టడుగు జీవితములోని ఆర్ధిక, సాంస్కృతిక స్థితిగతులను భిన్న కోణాల్లో దర్శించి ఎలా చిత్రించాడో మనకు అర్ధమవుతుంది.

అతని వాక్యాలు చిన్న చిన్న పూలగబ్బల్లా వుంటాయి. మృదువుగా వుంటాయి. చాలా లలితంగా వుంటాయి. పదజాలంలో ఉత్తరాంధ్ర మాండలిక పదజాలమే ఎక్కువగా కనపడుతుంది. అంతేకాదు యాస కూడా సువాసన భరితంగా ఉంటుంది. ఆ సువాసనను ఆస్వాదించుకుంటూ సామెతలు నానుడులు చమత్కారాల మీదుగా కథ నడక చాలా హాయిగా వేసవిలో తగిలే చల్లగాలిలా మనసును తాకుతుంది.

అప్పలనాయుడు దళితవాది.బహుజనవాది. స్త్రీవాది. ఇలా అనేక వాదాలు తనలో ఇముడ్చుకున్న గొప్ప మానవతావాది. అందుకు అతని కథలే సాక్ష్యం. ఏ కథ రాసినా గొప్పఅనుభవంతో రాశాడు. ఏ మాట రాసినా సందర్భోచితంగా రాశాడు.  భాష స్థానిక పలుకుబడితో మేళవించి ఉంటుంది.

మీకు నేను చెప్పిన మాటలపై సందేహముంటే ‘నంపు ‘ కథ ఒక్కటి చదవండి చాలు.

నంపు కథ ఒక పేద దళిత కుటుంబంలో జరిగిన కథ. మరియమ్మ మత్తేసుల కొడుకు డేనియేలు స్కూల్లో చదువుకుంటున్నాడు. స్కూలులో పిల్లలకి వారం వారం  ఒక గుడ్డు ఇస్తారు. దానిని డేనియలు ఇంటికి తెచ్చి వాళ్ళ అమ్మని కూర వండమని ఇస్తాడు. వాడికి ఆ గుడ్డుని ఉప్పు కారం తగిలించి కూరగా వండుకొని రుచిగా తినాలని కోరిక ఉంటుంది.

ఆ రోజు మరియమ్మ కూర వండుతుంది. అయితే అనుకోకుండా ఒక చుట్టము ఇంటికి రావటంతో గుడ్డుకూర అతనికి పెట్టేస్తుంది మరియమ్మ. రెండవ వారం మళ్లీ గుడ్డు తెస్తాడు డేనియేలు. ఆరోజు కొడుక్కి వండి పెట్టాలని ఆశపడుతుంది మరియమ్మ. వండుతుంది. కాకపోతే ఆరోజు కుక్క తినేస్తుంది. మరియమ్మ చాలా బాధపడుతుంది. డేనియేలుకి దుఃఖం వస్తుంది.ఇంట్లో మరే కూరా ఉండదు.తను తెచ్చుకున్నది కూడా తనకు దక్కక పోవడం వలన రెండు వారాలు అలాగ అయిపోయాయని బాధపడతాడు. పిల్లాడు ఆశపడ్డాడని పోనీ ఒక పూట గుడ్డు కొని తెచ్చి వండుదాం అని తనకున్నా తన దగ్గర డబ్బులు ఉండవు రావలసిన కూలీ డబ్బులు రావడం లేదని బాధపడుతుంది మరియమ్మ.

కూలీ ఇవ్వాల్సిన యజమాని తిప్పడమే తప్ప డబ్బులు ఒక అంతట ఇవ్వటం లేదు. మరో వారం గడిచిపోతుంది ఈసారి తప్పకుండా జాగ్రత్త పెడతాను గుడ్డు తెచ్చుకో నాయనా అంటుంది మరియమ్మ. డేనియేలు ఎప్పటిలా గుడ్డు తెచ్చి గూట్లో పెడతాడు. మరియమ్మ పొలంలో మేకను మేపుకొని వచ్చి కొడుకు ఆశ నెరవేర్చాలని ఎక్కువ ఉల్లిపాయలు వేసి గుడ్డు కూర బాగా వండి ఈసారి కుక్కలకి పిల్లలకి అందకుండా ఉట్టిమీద జాగ్రత్తపెడుతుంది. చెరువు పని చేసిన కూలిడబ్బులు అకౌంట్ లో పడ్డాయని వెళ్లి తెచ్చుకోమని తోటికోడలు చెబితే తలుపు వేసుకొని పోస్ట్ ఆఫీస్ కి వెళ్తుంది మరియమ్మ.

ఈ లోపల మత్తేసు ఫుల్లుగా తాగి పద్యాలు పాడుకుంటూ ఇంటికి వస్తాడు. అన్నం తిందామని చూస్తే అన్నంతో పాటు గుడ్డుకూర కనపడేసరికి నా కోసమే వండింది నా భార్య అనుకుని ఆనందంగా తినేస్తాడు. అతడు తినేసి చేయి కడిగే సమయానికి వస్తుంది మరియమ్మ. గుడ్డు తనే తినేసాడని తెలిసి అతనితో గొడవ పడుతుంది. తిడుతుంది. మత్తేసుకు రోషం వస్తుంది. పక్కనున్న కర్ర తీసి మరియమ్మను కొడతాడు. అంతలో స్కూల్ నుంచి వచ్చిన డేనియేలు నాన్నా! అమ్మను కొట్టకు నాన్నా.. అని అడ్డంపడి ఆపడానికి చూస్తాడు. అది మత్తేసుకు మరింత పౌరుషాన్ని తెప్పిస్తుంది. నన్నే అడ్డగించేంత పెద్ద వాడివి అయిపోయావురా!  అని కొడుకుని గట్టిగా కొట్టేస్తుంటాడు మత్తేసు. తనను కొట్టిన భరించిన మరియమ్మ కొడుకుని దారుణంగా కొట్టడం చూడలేకపోతోంది. తను ఒక చెక్క పేడు తీసుకొని భర్తపై తిరగబడుతుంది. ఆ దెబ్బకు మత్తేసు వేసిన కేక మాలపేటంతా వినపడుతుంది. ఇది స్థూలంగా కథ.

రచయిత ఈ కథను నడపడంలో చాలా మెలకువలు పాటిస్తాడు. ఇది ఆరు పేజీలు చిన్న కథ కానీ దీనిని విపులంగా విశ్లేషించాలంటే అంతకు మించి ఎన్నో పేజీలు కావాలి.

కథలో అప్పలనాయుడు చాలా విషయాలు చెప్పాడు. అనేక కోణాలను స్పృశించాడు. కథ చాలా సరళంగా చతురోక్తులతో కూడిన సంభాషణతో అత్యంత ఆసక్తితో ఏకబిగిని చదివిస్తుంది. అదే సందర్భంలో అనేకమైన ఆలోచనలు మనలో రేపుతుంది. ఒక దళిత కుటుంబం యొక్క ఆర్థికలేమి ఒక కుర్రాడి చిన్న కోరికను కూడా తీర్చలేని బ్రతుకును గురించి చెప్తాడు. పెద్ద రైతులు పని చేయించుకొని కూలీ ఇవ్వక ఇబ్బంది పెట్టడాన్ని గురించి చెప్తాడు.

పేద కూలీలకు గ్రామాల్లో అన్నివేళలా కూలి పనులు దొరకవు వాళ్లు ఇతరత్రా మరికొన్ని పనులు చేస్తారు. మరియమ్మ, జోగినాయుడు కొనిచ్చిన మేక పిల్లను మేపుతుంది. ఆరేడు మాసాలు మేపితే మేకపిల్ల పెద్దదయి అమ్మకానికొస్తుంది. అమ్మిన నాడు ఆ మేక పిల్లను మేపినందుకు ఎన్నో కొన్ని డబ్బులు ముట్టజెప్పుతారని తన రోజువారి పనితో పాటు అదనంగా ఈ పని చేస్తుంది. ఆ మేకను సరిగా మేపడం లేదని ఒకరోజు జోగినాయుడు పెత్తందారీ తనముతో మరియమ్మను  బెదిరిస్తాడు. మేకపిల్లను మరొకరికి ఇచ్చేస్తానని అంటాడు. గ్రామాల్లో పేదలకు ఆదాయమొచ్చే అవకాశాలే తక్కువ.అందులో ఉన్న అవకాశం పోతుందేమోనని నాయుడి బతిమాలుకుంటుంది మరియమ్మ.ఇలా జీవితములోని అనేక సంఘర్షణలను  చూపిస్తాడు రచయిత.

ఇంకోపక్క ఎన్నికలు రాజకీయ పార్టీలు విధానాలపై విసుర్లు కూడా కనబడతాయి. సాంస్కృతిక జీవనంలోని మూఢనమ్మకాలను ఎద్దేవా చేయడం కనపడుతుంది. అలాగే గ్రామీణ సంస్కృతి ని చూపడం కనిపిస్తుంది ఇలా ఈ కథలో చాలా సాంస్కృతిక కోణాలు ఉన్నాయి. ఒకటి రెండు ముఖ్యమైన విషయాలను చర్చిస్తాను.

కూర వండిన గుడ్డుని కుక్క తినేసిందని మరియమ్మ బాధపడుతూ అలోపొలో మంటుంటే ఎదురింటి గడపలో మంచమ్మీద కూర్చున్న కాళ్లు రాని,కళ్ళు కనపడని ముసలోడు వెటకారంగా మాట్లాడుతాడు.

“శనివారంగదా! బేపి గుడ్డు తింతాదేటి” !? హాస్యమాడేడు. అంటాడు రచయిత ఇది కేవలం హాస్యం మాత్రమే కాదు. అందులో ఎన్నో భావాలున్నాయి. తినే తిండికి అందునా కౌసు(మత్స్య మాంసాదులు) తినడానికి శనివారం సోమవారం అని వారాలు పాటించే వారి నమ్మకాలను  వెటరించడం కనిపిస్తుంది. నిజానికి ఈ నమ్మకాలు హిందువులవి.

మరియమ్మ కుటుంబం క్రిస్టియన్ మతస్తులు. మరి వారికి ఈ సెంటి మెంట్లు ఉంటాయా! ముసలాయన ఎందుకన్నాడు!? న్యాయంగా ఉండకూడదు. కానీ భారతీయ సమాజంలో తరతరాలుగా వచ్చిన నమ్మకాలు సంప్రదాయాలు మతం మార్చుకున్న తర్వాత కూడా చాలామంది వదులుకోవడం లేదు. వదులుకోలేరు. కేవలం నమ్మకాలేకాదు మతం మార్చుకున్న తర్వాత కుల వ్యవస్థకు దూరమవ్వాలి. అందరిలా సమాన గౌరవంపొందాలి. మరి గౌరవం వస్తోందా?  సమాజము చూసే చూపులో మార్పు ఏమైనా వస్తోందా!? అంటే ఆయా మత సమూహాల్లో గౌరవం వస్తుందేమో కానీ, తమ గ్రామంలో తమ చుట్టూ ఉన్న మిగతా సమూహాల్లో మాత్రం వారిని పాత దళిత కుటుంబంగానే చూస్తారు. చూస్తున్నారు తప్ప కుల వ్యవస్థనుంచి బయటపడ్డవారిగా చూడటంలేదన్నది సమాజములో కనపడుతున్నది. అదే ఈ కథలోనూ కనిపిస్తుంది.కనుకనే ముసలాయన అలా అనగలిగాడు.

ఇటీవల మతం మార్చుకున్న దళితులకు ఎస్.సి.  రిజర్వేషన్లు ఉండకూడదనే వాదనను ఓ సమూహము తెరమీదికి తెస్తోంది.కోర్టులు కూడా తదనుగుణంగానే మాట్లాడుతున్నాయి. ఆమాటలు ఎంత అనౌచిత్యమైనవో ఈ కథద్వారా మనం గ్రహించవచ్చు.

కథలో ముసలాయన చాలా గడుసు ప్రశ్నలు వేస్తూ ఉంటాడు.

“బేపులుకి గవర్నమెంట్ గుడ్లు యిచ్చునుగానీ.. వాటికి ఓట్లు లేవు” మళ్లీ వ్యంగ్య బాణం వేసాడు ముసలాడు. బేపి గుడ్డుతినేసిందని  మరియమ్మ బాధపడూతున్న సందర్భములో .

“వస్తుందినే.. ఎలక్షను.. మంచం కట్లుమీద  ఎల్దువు రాజు వోదా లోన” అంటుంది మరియమ్మ.

ఈ రెండు డైలాగుల్లో రాజకీయపక్షాల ప్రభుత్వ విధానాలను వ్యంగ్యంగా వెటకరించడం కనబడుతుంది. రాజకీయ పక్షాలు ఓట్లు వస్తాయంటే ఏ పని చేయడానికి అయినా  సిద్ధ పడతారు అన్న వెక్కిరింత ముసలాయన మాటలో ధ్వనిస్తే, ఎలక్షన్ రోజుల్లో కాళ్లు లేని కళ్ళు లేని ముసలి ముడగనైనా చాలా గౌరవంగా తీసుకెళ్లి ఓట్లు వేయించుకుంటారు పార్టీల కార్యకర్తలు. ప్రభుత్వము సహకరిస్తుంది.

ఓట్లు వేసేది ఒక్క రోజు, ఆరోజుకి రాజులైపోతారు ప్రజలు. ఆ తర్వాత వాళ్ళు ఎవరో ..ఎవరికీ   అక్కరలేదు.మళ్లీ ఎలక్షను వరకు మరి కనపడరు. మర్చిపోతారు నాయకులు.ప్రజాస్వామ్యం లోని ఈ డొల్లతనాన్ని బట్టబయలు చేస్తుంది మరియమ్మ మాట. ఇలా ఈ కథలో ఇంకా అనేక కోణాలు ఉన్నాయి.  అన్ని విషయాలూ ఇక్కడే చెప్పేయకుండా,వ్యాస పరిధి పెరిగిపోకుండా నేనిక్కడికి పరిమితం చేసి ఆపేస్తున్నాను. కథచదవండి. ఆ అనుభవం వేరుగావుంటుంది.

అప్పలనాయుడు రచనా విధానము  శైలి, చాసో శైలికి దగ్గరగా అనిపించింది. చాలా హాయిగా నడిపిస్తాడు కథను.

“కొవ్వెక్కిన కోడి నాయిరాలమ్మ గుండారు పొడిచిందట”, “బోడెందుకు పోట్లు మప్పడం”  వంటి సామెతలు గుప్పడంత గుడ్డు, ఉడూకు ఎసరు, దంత సిరి, కుయ్యెత్తుల కూరొండడం, లాంటి గ్రామీణ  నానుడులు సందర్భోచితంగా వాడటం అప్పలనాయుడు కథనశైలిని పరిపుష్టం చేశాయి. పాఠక జనహృదయానికి బాగా చేరువు చేశాయి. ఇలాంటి మంచి కథలు రాసిన అప్పలనాయుడికి అభినందనలు.

*

రెడ్డి రామకృష్ణ

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఉత్తరాంధ్ర నుడికారాన్ని, యాసను, భాషను ప్రతి కథలోనూ ఇంకించి రైతుల, దళితుల, గిరిజనుల దోపిడీకి కారణమైన ఈ వ్యవస్థలోని లోపాలను తనదైన వ్యంగ్య శైలిలో తూర్పారబట్టి *నక జనకరి నాం… నాం…* అంటూ డోలు కట్టి కథల దండోరా మోగిస్తున్న కథకుడు *చింతా అప్పలనాయుడు.* ఈయన కథలు ఉత్తరాంధ్ర సంభాషణలు, వాలకాలు, చతురోక్తులు, మాటలు, సామెతల ఆవెతల విందు చేస్తుంటాయి. దుక్కి, ఇల మీద దేవత, అరిసేతిలో బువ్వ పువ్వు వంటి కవితా సంకలనాలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న చింత అప్పలనాయుడు గారు చాసో కథా పురస్కారం అందుకుంటున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు.

    ఇట్లు
    రత్నాల బాలకృష్ణ
    అరసం-విజయనగరం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.