మంచి సమాజం ఏర్పడాలంటే మంచి సాహిత్యం రావాలి. మంచి సాహిత్యం రావాలంటే మంచి సాహిత్య విమర్శ రావాలి అంటారు కొడవటిగంటి కుటుంబరావు.
ఇవాళ వర్తమాన సాహిత్య విమర్శ రాయలసీమ నుండి పదునెక్కుతున్నది. నిజానికి ఒరవడి వల్లంపాటి వెంకటసుబ్బయ్య నుంచే మొదలైంది. మార్క్సిస్టు దృక్పథంతో చూసిన వాళ్లలో కొడవటికంటే కుటుంబారావు, రావిశాస్త్రి, మహీధర, బీనాదేవి, కాళీపట్నం వంటి ప్రసిద్ధ విమర్శకుల సరసన రాయలసీమ నుండి చేరిన వారు వల్లంపాటి.
విమర్శ పదునెక్కేదెప్పుడు అని ఆలోచించినప్పుడు విమర్శకు మార్క్సిస్ట్ నిబద్ధత కలిగినప్పుడు మాత్రమే అది విమర్శగా రాణిస్తుంది. పైన పేర్కొన్న వాళ్ళు చేసింది అదే. ఈ మార్క్సిస్ట్ నిబద్ధత అన్నది విమర్శకుడికి ప్రగతిశీలభావజాలం కలిగివుండటం. ఇది మార్క్సీయభావజాలం. ఈ మార్క్సిజం పునాది భౌతికవాదం. భౌతిక వాదానికి పునాది- ఉపరితలం ముఖ్యం. ఇదే సిద్ధాంత పునాది. మార్క్సిజం పునాదుల మీదనే విమర్శ నిర్మితమవుతుంది. కవిత్వానికి శిల్పవైవిధ్యాలు ఉన్నట్లే, కథకు లేదా ఇతర సాహిత్య ప్రక్రియలకు కొన్ని నిర్మాణ సూత్రాలను భౌతిక వాదం నిర్దేశిస్తుంది. వర్తమాన సమాజానికి అన్వయించి చెబుతుంది. వర్తమాన సమాజానికి అనుగుణంగా నిర్మాణ సూత్రాలను నిర్దేశిస్తుంది.
ఈ నేపథ్యంలోనే విమర్శలో రాయలసీమ నుండి ఎవ్వరూ చేయలేని కృషి వల్లంపాటి వెంకటసుబ్బయ్య చేశారు. మార్క్సిస్టు దృక్పథంతో సాహిత్యాన్ని ఎలా అధ్యయనం చేయాలో ఆయన నేర్పడం వల్లనే ఇవాళ సీమ నుండి విమర్శ మరింత పదునెక్కింది.
తెలుగుసాహిత్య విమర్శ రాయలసీమ నుండే అధికంగా రాయడం చూస్తున్నాం. నిజానికి జీవితము, సాహిత్యము, సాహిత్య విమర్శ సమబాహు త్రిభుజంలోని భుజాల వంటివంటారు వల్లంపాటి. ఈయన అడుగుజాడల్లోనే అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్న విమర్శకులు నేటి ఆధునిక సాహిత్యంలో రాయలసీమలోని ప్రతి జిల్లాలో కనబడుతున్నారు. అనంతపురం జిల్లాలో స్థిరపడిన చిత్తూరు నివాసి ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి తెలుగు సాహిత్యంలో విమర్శను అగ్రస్థానంలో నిలబెట్టారు.
తెలుగుసాహిత్య విమర్శలో రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డిది పెద్దన్న పాత్ర. తన పరిశోధనా గ్రంథం ప్రభావతి ప్రద్యుమ్నం మొదలుకొని తీసుకొచ్చిన అన్ని విమర్శ పుస్తకాలు తెలుగు సాహిత్యంలోనే మైలురాళ్లు. ఆధునికాంధ్ర కవిత్వం ఉద్యమాలు సందర్భాలు, చర్చ, దరిదాపు, విమర్శ 2009 వంటి గ్రంథాలు తెలుగు విమర్శను ఇప్పటికీ సుసంపన్నం చేస్తున్నాయి. ఆయన రాసిన మన నవలలు మన కథానికలు అనే విమర్శ గ్రంధానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం సీమను అగ్రస్థానంలో నిలబెట్టింది.
అనంతపురం జిల్లా నుండి విమర్శ రాస్తున్న కర్నూలు జిల్లాకు చెందిన కవి తూముచెర్ల రాజారాం విమర్శలో కృషి చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో స్థిరపడ్డ అనంతపురం వాసి కవి జి వెంకటకృష్ణ రవ్వలసడి పేరుతో విమర్శ గ్రంధం తీసుకువచ్చారు. కర్నూలు జిల్లా నుండి కెంగార మోహన్ (నేను) చెమట చెక్కిన వాక్యం కవిత్వ పరామర్శ పేరుతో విమర్శ గ్రంథం తీసుకురావడం, దీనికి ప్రతిష్టాత్మక కొలకలూరి రామయ్య-2026 పురస్కారం రావడం గమనార్హం.
అలాగే జంధ్యాల రఘుబాబు అక్షరకాంతులు పేరుతో ఇదే జిల్లా నుండి విమర్శ తీసుకువచ్చారు.కడప జిల్లా నుండి కేతు విశ్వనాథరెడ్డి అనంతరం విమర్శ రంగంలో నత్తనడకనే సాగుతుంది. పిల్లాకుమారస్వామి నిశిత పేరుతో విమర్శ వ్యాసాలు తీసుకొచ్చారు. రాయలసీమలో కడప, చిత్తూరు జిల్లాల నుండి వర్తమాన సాహిత్యంలో విమర్శ ఆశించినంత రావడం లేదు.
*








మార్క్సిస్ట్ కోణం నుండి మొదలవ్వాల్సిందే విమర్శ
ఆహ్వానిస్తున్నా మీ పరిచయాన్ని