ఆమె ద్వీపం, అతను ద్వీప కల్పం

దులు సముద్రాలే కాదు ద్వీపాలూ,ద్వీపకల్పాలూ కూడా కవిత్వ వస్తువులవుతూ ఉంటాయి కవులకు. ద్వీపాన్ని, ద్వీపకల్పాన్ని మనిషి ఏకాంతానికీ,మనిషి అస్తిత్వానికీ ప్రతీకలుగా చేసి ఎందరో కవులు కవిత్వం రాశారు. కరీబియన్ దీవుల్నికావ్యవస్తువులుగా మలిచి గానంచేసిన కవులలో ప్రముఖుడు వాల్కాట్ . సముద్రం ఒడిలొ వొదిగిపోయే ద్వీపాన్ని ఒక్కసారి ఊహించుకుంటే కలిగే అనుభూతి అన్నిటికన్నా అనూహ్యమైనది అని అంటాడు వాల్కాట్ ఒకచోట.

“No man is an Island

Entire of itself

Every man is a piece of the continent

A part of the main”

ఈ కవితా పంక్తులు 17వ శతాబ్దపు ప్రసిద్ధ బ్రిటిష్ కవి John Donne గారివి. ‘  ఏ మనిషీ వొంటరి ద్వీపం కాదు.అందరూ వొకరితో వొకరు ముడిపడి ఉన్నవారే ‘అన్న భావనను  తాత్వికంగా ఈ   బ్రిటీష్ కవి ప్రతిపాదించాడు.

ఇప్పుడు మనిషి’ ఏకాంత ద్వీపం’ అంటాడు శ్రీను పైండ్ల అనే కవి. ‘ప్రాణం లేని యంత్రాలతో నింపిన కాంక్రీట్ కీకారణ్యంలో కలిసున్నా కనిపించని కంచెలతో కట్టిన ఏకాంత ద్వీపం’లా మనిషి మారిపోయాడని  శ్రీను పైండ్ల గారి భావన.  ఇట్లా భౌగోళిక ప్రతీక అయిన ద్వీపాన్ని,  కవిత్వంలోకి తెచ్చిన కవులు అనేకం ఉన్నారు.అయితే ద్వీపకల్పాన్ని ప్రతీకగా కవిత్వంలో వాడిన కవులు అరుదే.

స్త్రీ తత్వానికీ ప్రతీకగా ద్వీపాన్ని, పురుష తత్వానికీ ప్రతీకగా ద్వీప కల్పాన్ని ఊహ చేసి చాలా ఏళ్ళ క్రితమే ఒక కవి ‘ద్వీపకల్పాంతం’ అనే కవితను రాశారు.ఆ కవి అట్లా ఊహ చేయడంలో ఒక కెథార్సిస్ ని తడి ఆరని అక్షరాల్లో పొదిగి, ఆ తడిని పీల్చుకొని సజలాలయ్యే వాక్యాలతో కవితను నింపి పాఠకుని హృదిలో వొంపుతాడు ఆ కవి. ఆ కవి ఎవరో కాదు కొప్పర్తి.

విషాదాన్ని,మోహనాన్ని ఏకకాలంలో కవిత్వ వీణమీద మీటగల కవిత్వ వైణికుడు కొప్పర్తి. మనిషి పుష్పించగల చెట్టే అని చెప్పటం కోసం కవిత్వం రాసిన కవి కొప్పర్తి. వచనా కవితా రూపానికి ఒక రసమయ సృజనాత్మకతను ఇవ్వగల రూపశిల్పి కొప్పర్తి.

ఏ వస్తువును కవిత్వం చేయదలిచాడో,ఆ వస్తువు వాతావరణాన్ని అపూర్వంగా  ఏర్పరిచి పాఠకుడిని భౌతిక స్తితి నుండి అంతర్గత చైతన్య పరిధిలోకి తీసుకెళ్ళి ఆలోచింప చేసే కవి కొప్పర్తి. ‘రాసేది ఏదైన హృదయ పరిచ్ఛేదన నుంచి రాయడం కొప్పర్తి తత్వం’ అని ప్రముఖ కవి కథకుడు వెంకటకృష్ణ అంటాడు ఒక వ్యాసంలో. అట్లా హృదయ పరిచ్ఛేదన నుంచి కవితలు ఎన్నో ఆయన రాసినప్పటికీ నన్ను వెంటాడే కవిత మాత్రం “ ద్వీప కల్పాంతం” అనేది.

 ద్వీపకల్పానికీ మూడు వైపులా నీరుండటం మూలానా ఆ మూడువైపులే చెమ్మగిల్లి ఉంటాయి. ఆ నాలుగో వైపున్న భూభాగంలో చెమ్మతనం ఉండదు.నాలుగో వైపు కూడా నీళ్ళు కమ్ముకుంటే ఏమవుతుంది.? ద్వీపకల్పం ద్వీపంగా మారుతుంది.అట్లా జరిగితే సంభవించేది ద్వీప కల్పాంతమే.

అంటే పురుషునిలో ఉండే  పురుషతత్వం అనే ఆ నాలుగో వైపును స్త్రీ తత్వం అనే చెమ్మ కమ్ముకోగలిగితే ఇక జరిగేది స్త్రీ పురుష భేదం అంతరించడమే అనే గొప్పభావనతో కొప్పర్తి కవిత రాశాడని అనిపిస్తుంది.స్త్రీ అస్తిత్వాన్ని సమాజంలో ఆమె స్థానాన్ని ఒక సరికొత్త కోణంలో ఆవిష్కరించే కవితే ‘ ద్వీపకల్పాంతం’.

తనను బహువచనంతో సంభోదించడాన్ని నిరాకరించే కొప్పర్తి తనలోని పురుషాహాంకారాన్ని నిరాకరించకుండా ఎట్లా ఉంటాడు?. అందుకేనేమో ‘ నేను కవిత్వాన్ని/ చైతన్యాన్ని/ వాదాన్ని తత్వాన్నీ/ నేను కవిని/ముస్లింని /దళితుణ్ణి స్త్రీని’ అని అనగలిగాడు.గాంధీతో పాటు బుద్ధుడు,అశోకుడు,జీసస్ స్త్రీలుగా మారిన పురుషులు అని కొప్పర్తి అంటున్నాడంటే ఆయనలో ఉండే స్త్రీ తత్వం అట్లా అనిపించిందేమో?ఇట్లాంటి ఒక భావననే కొప్పర్తి ‘ద్వీప కల్పాంతం’ లో స్థాపించినట్టున్నాడు.

అతను, ఆమె, ఇద్దరు కూతుర్లు ఉన్న కుటుంబంలో అతను ఒక్కడే పుష్పించలేని వాడట. అంటే గర్భం ధరించి బిడ్డను కనే శక్తి లేని వాడన్న భావనను ‘నేను వొకణ్ణే  పుష్పించ లేని వాణ్ణి’ అనే ఒకే ఒక వాక్యంతో స్ఫురింపచేశాడు కవి.’ వాళ్ళు ముగ్గురు రుతు రాణు లు’ అనే వాక్యం ద్వారా స్త్రీలకుండే ఉత్పత్తి శక్తి ని గుర్తింప చేస్తాడు. ‘ ఆమె ఆక్సిజన్ వాళ్ళిద్దరు హైడ్రోజన్  పరమాణువులు’ అని అనడం ద్వారా సైన్స్ ఫార్ములాను కవిత్వంలోకి అనువదించడమే కాక ఆ ముగ్గురిలో ఉండే స్త్రీతత్వం అనే నీరు కమ్ముకొని ద్వీప కల్పం లాంటి అతన్ని  చల్లగా వెచ్చగా అలజడిగా తాకే జలాల మధ్య చెమ్మగిల్లిన ద్వీపంగా చేసిందని కొప్పర్తి కవి ఆత్మాశ్రయంగా  చెబుతున్నాడు.

ఉబికి ఉబికి ఊటలై తేట నీటి పాయలై పోయిన పురుషాహాంకారాన్ని అతి తక్కువ మాటల్లో గొప్పగా వ్యక్తీకరించిన స్త్రీవాద కవిత’ ద్వీప కల్పాంతం’.ద్వీప కల్పాంతం జరిగితే ఇక ‘భూమీ లేదు ఆకాశం లేదు అంతా వొకటే ప్రవాహం’ అని అనడం ద్వారా స్త్రీపురుష సమానత్వాన్ని  కొప్పర్తి ఆకాంక్షిస్తున్నాడని తెలుస్తుంది.తనలోని కఠినమైన పురుష తత్వాన్ని సుకుమారపు స్త్రీతత్వంగా మార్చుకుండే క్రమానికీ ఈ కవిత ఒక ప్రతీక. ఒక విశిష్ట కోణాన్ని ప్రతిపాదిస్తూ, ద్వీపకల్ప తాత్వికతను  పొదువుకున్న కవిత ఇది. ఇంత మంచి కవితను తెలుగు కవితా ప్రియులకు కాన్క చేసిన కొప్పర్తి గారికీ ధన్యవాదాలు.

 

 ద్వీప కల్పాంతం

నేను వొకణ్ణి

పుష్పించలేని వాణ్ణి

వాళ్ళు ముగ్గురు

రుతు రాణులు

ఆమె ఆక్సిజన్

వాళ్ళిద్దరూ హైడ్రోజన్ పరమాణువులు

నీరై ఏరై

ప్రవహించి వ్యాపించి

మూడువైపులా కమ్ముకున్నారు

నేనప్పుడు ద్వీపకల్పాన్ని

భూమి ఎవ్వళ్ళదో

ఆకాశమూ వాళ్ళదే

నిరంతరం

చల్లగా వెచ్చగా అలజడిగా తాకే

జలాల మధ్య

చెమ్మగిల్లి పోయాను

ఉబికి ఉబికి ఊటలై

తేట నీటి పాయలై పోయాను

ఇప్పుడిక భూమీ లేదు ఆకాశమూ లేదు

అంతా వొకటే ప్రవాహం.

*

రాజారామ్ తూముచర్ల

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అద్భుతమైన కవిత్వానికి అద్భుతమైన వ్యాఖ్యానం

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.