అండమాన్ సముద్రం

ముద్రం
పెదాల కింద
హసిస్తున్న
ఉదయాలు

ప్రతి ఉదయం
గుప్పెడు నీలి ఆశల్ని
ద్వీపం మొహమ్మీద
చిలకరిస్తుంటుంది

పక్షులు
తమ తమ ఆకాశాల్ని
అనేక రాగాలుగా పాడుకుంటాయి

వందల వేల ద్వీపాలు
మడ అడవుల చేతుల వేళ్ళతో
ఒళ్ళంతా తడుముకుంటాయి

వేలకు వేల ఇంద్రథనుస్సులు
వదిలివెళ్లిన రంగుల్ని
ఒక్కక్క చెట్టు
ఒక్కొక్క ఆకు
ఒడిసి పట్టుకుంటాయి

నిశ్శబ్ద నిశ్చ ల ఆకాశం
దానికింద
అనంతంగా వ్యాపించిన
పగడాల కళ్ళు
రంగు రంగుల చేపలు
ఆ మధ్య
రహస్యంగా
సంచరిస్తూ తాబేలు
తాబేలు గుండెల్లో
దాగివున్న
ప్రాచీన మానవుడి జాడలు

ప్రతి సాయంత్రం
చంద్రుడు విసిరిన
నిచ్చెన
ఒక్కొక్క మెట్టు
ఎక్కిన అలలు
నక్షత్రాలుగా మారిపోతాయి

వలయాలుగా
వ్యాపించిన అడవులు
హోరుగాలిగా
రూపాంతరం చెందుతాయి

ఆకులు
గాఢ నిద్రలోంచి
లేచిన
పసిపాప కళ్ళలా
ఒణుకుతాయి

సముద్రం
మటుకు
ఒక్క క్షణం కూడా
కునుకు తియ్యదు
తన వేల లక్షల
పగడాల కళ్ళను
విప్పార్చి
కురవని మేఘాల్ని
మొహం చాటేసిన
చంద్రుణ్ణి
రాత్రంతా
మార్చి మార్చి
చూస్తూనే ఉంటుంది

ఏ దిగంతం
ఏ నేల
ఏ ప్రపంచం
ఎక్కడున్నా
సముద్రం
తడి చేతులతో
దేహాత్మల్ని
ఎప్పటికీ
తడుముతూనే ఉంటుంది

2

ద్వీపాంతరం

 

వర్షాన్ని చూసినపుడు
వర్షంలో ఊగుతున్న
చెట్ల కొమ్మల్ని చూసినపుడు

భూప్రపంచంలో వున్న
వాసనలు
వెలుగులు
వస్తువులు

ఆన్నీ చిన్న పడవుల్లా మారి
దీవుల వేపు పరిగెడతాయి
కొద్దికొద్దిగా
కరిగిపోతాను
నీళ్లల్లా
అడివిలా
ఎల్లపుడు కురిసే ఆకాశంలా
దీవుల్లోకి ఇంకిపోతాను

జీవితం కన్నా ఎత్తయిన జెండాలా
ప్రేమ కన్నా పొడవయిన తీరంలా
మారిపోతాను
ఒక పిచ్చి ప్రేలాపనలా
నా వేర్లు విడిచి
నా నేల విడిచి

కొత్త ప్రపంచం
కొత్త భూగోళం
కొత్త ప్రపంచం లోకి ఇంకి పోతాను
నాలో ఏం వెలుగుతోంది
నాలో ఏం మాడి బూడిదవుతోంది
ఏం జ్వలిస్తోంది
ఏం ఆరిపోతోంది
అసలు ఏమవుతోంది తెలీదు
అసలు ఎందుకిలా అవుతోంది తెలీదు
వర్షాన్ని చూసినపుడు
వర్షంలో ఊగుతున్న
చెట్ల కొమ్మల్ని చూసినపుడు

నేను అనేక ద్వీపాలుగా
మారిపోతాను

నీళ్లల్లా
అడివిలా
ఎల్లపుడు కురిసే ఆకాశంలా
దీవుల్లోకి ఇంకిపోతాను

*

ఆకెళ్ళ రవిప్రకాష్

22 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • వందల వేల ద్వీపాలు
    మడ అడవుల చేతుల వేళ్ళతో
    ఒళ్ళంతా తడుముకుంటాయి
    excellent boss

  • నాలుగేళ్ల విరామం తర్వాత రాసిన రెండు కవితలు సారంగా ఆగస్టు 1 సంచికలో అందంగా ప్రచురించిన ఆఫ్సర్ కి నా ధన్యవాదాలు నిజానికి రాయలేని తనం లోకీ
    కవిత్వం గురించి ఒక వైరాగ్య భావన లోకి వెళ్లిపోయిన నన్ను
    బయటికి లాగి ఈ రెండు కవితలు రాయమని తొందర పెట్టింది ఆఫ్సర్ యే

    నలభై ఏళ్ల క్రితం 1986 లో
    విజయవాడ లో వుండే వాళ్ళం
    కవులు చాలామంది
    పత్రికా ప్రపంచం అక్కడే ఉండేది
    ఆంధ్ర జ్యోతి సాహిత్య వేదిక లో
    నా మొదటి కవిత ” కవిత్వవృక్షం ”
    ప్రచురించింది కూడా తనే

    కాలం ఎలా పరిగెత్తినా
    స్నేహాలు కాలం కన్నా పొడుగ్గా
    ఉంటాయనడంలో సందేహం లేదు

  • మీ కవిత్వం లో చిన్న పదాలు.. పెద్ద భావాలు..

    బావున్నాయ్ సార్

  • I remember my trip to Andaman and Nicobar islands where the beauty of the nature is astonishingly breathtaking. But the poems by Raviji showed an altogether different side of beauty which a poet only can see. I read all his poetry. They say men are from Mars but for him we must say He is from Venus. All the best.

  • చాలా చక్కగా అండమాన్ సముద్రం గురించి వర్ణించారు.ఇది చదివాక అండమాన్ సముద్రాన్ని దర్శించాలనే కోరిక కలుగుతోంది

  • Lyrics reflects Sweet melody of waves and harmony. Highly inspiring shore weather with melodious heavenly music in heart

  • Lyrics reflects Sweet bells of waves and harmony. Highly inspiring shore weather with melodious heavenly music in heart

  • ప్రపంచం cloud storage కి shift అయినట్టు గా నే, మీ Andaman experience స్పందనలన్నీ మీరు మీకు తెలియకుండానే మీ personal cloud memory లో record చేసుకున్నట్టు గా వుంది….ఈ అద్భుతమైన భావాలన్నీ….5G కంటే వేగం గా సునాయసం గా download చేసి, అందంచారు!

    • మీ కవి హృదయానికి
      కవి సమయానికి
      ధన్యుడ్ని

  • మీ కవి హృదయానికి
    కవి సమయానికి
    ధన్యుడ్ని

  • చాలా బావున్నాయి. పదచిత్రాలన్నీ దృశ్యమానం చేస్తున్నాయి. ప్రతి పాదంలో తడి, భావుకత అండమాన్ సముద్రాన్ని ఊహించుకోమంటోంది. అభినందనలు రవిప్రకాష్ గారూ

    • Thank you రాజు గారూ
      మీ మాటలు
      వేల వరహాల మూటలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.