ఇషాక్ హుసేన్ కవితలు మూడు

1

కిటికి ఆవల

 

ముసురు రాతిరిలా
నా గది నిండా
అలుముకున్న దిగులు చీకటి_

చమురింకినా…
విఫల ప్రయత్నంగా దిగుట్లో దీపం
ఆరిపోతూ రెప రేపల  మధ్య .

గోడలు
తరాల మౌన దీక్షలో నిశ్శబ్దాన్ని భరిస్తూన్నాయి.

కిటికి ఆవల
పలకలు కట్టిన కరిమబ్బుల ఆకాశం
ఎవరి వాటకో ఆతిధ్యం_

నేల ఆనిన
అడుగుకిందా దృశ్యం కట్టని
నీడ

రహస్యంగా
నా పాదముద్రలను మోస్తూనే ఉంది_

నేనింకా
ఎంత నడవాలి నా మీద నాకే అసహ్యంగా ఉంది…
దుఃఖానికి ఆశకి మధ్య వారధిగా_

దారి పొడువునా…
ఆసువులు బాసిన
అరణ్య స్వప్నాల కన్నీటి చుక్కలు…
మిణుగురులై మెరుస్తునే ఉన్నాయి_

వెన్ను విరిగిన  వెదురు బొంగు
వేరవడం లేదు శిధిల స్తూపాలపై

జెండాను
మోస్తూ..!మోస్తూ!!

 

ఇదే కదా !
ఈ నిశబ్దం
నీ మౌనం
నా ఆర్ద్రత
ఇదే కదా !
ప్రేమంటే-
ఒక తపన
ఒక సంకల్పం
ఈ నిండు భావనే కదా!
నీ
ఆరాధన
కొంచం
విశ్వాసంగాను
మరికొంచం విస్మయంగాను
నా ప్రార్థనలో విస్తరించవూ
నీకై
చేతులెత్తిన ప్రతిసారి నా
దోసిలి
నిండిపోతు ఉంటుంది
కన్నీటిభాష కవిత్వానికి తెలిసినట్టు .
రాసినప్రతి సారి
నాలోకి నేను నిష్క్రమిస్తూ ఉంటాను.
నేనులేని
ఖాళీ తనంలో నిన్ను వెతుకుతూ…
నువ్వు
హృదయ ద్వారం తెరిచినట్టు
భళ్ళున తెల్లవారుతుంది
తెరవడానికి
రెప్పలు నిరాకరించిన క్షణం
అప్పుడే…!?
వొక కల
విరిగిన చప్పుడు.
*

ఇషాక్ హుసేన్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అరణ్య స్వప్నాల కన్నీటి చుక్కలు
    బావున్నాయి కవితలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.