అప్పారావు ఉరఫ్ అప్పిగాడికి దేవుడంటే అతి భక్తి. అతని భక్తి వై-ఫై లాంటిది. ఎప్పుడూ కనెక్ట్ అయి ఉంటుంది.
ఈ మధ్య తన జీవితంలోని వచ్చిన మార్పులతో ప్రతి చిన్న అంశాన్ని కూడా దేవుడే చూసుకుంటాడని నమ్మకంతో రోజులు నెట్టుకొస్తున్నాడు. ముఖ్యమైన పనుల్లోనూ సమస్యలు వచ్చినప్పుడల్లా దేవుడిని స్మరిస్తూ ఉంటాడు. తను చేసే ప్రతి పనిని దేవుడే నిర్ణయిస్తాడని గట్టిగా నమ్ముతాడు. అలాగే ఆఫీస్ లో సమయపాలన, నిజాయితీగా పనిచేస్తూ, మంచి పేరు తెచ్చుకున్నాడు. మనిషి చాల మంచి వాడు. నిజాయితీగా ఉంటాడు. కాకపోతే ముక్కోపిగాడు. దానికి తోడు నోటి దూల కొంచెం ఎక్కువ. ఏదైనా తేడా వస్తే ఎవరు ఏమని చూడ కుండా నోటికి పని చెప్తాడు.
ప్రతిరోజూ ఉదయాన్నే లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, భక్తితో దేవుడిని పూజించడం, కాస్త అల్పాహారం తీసుకుని, బైక్ మీద ఆఫీసుకు వెళ్ళడం అతని దినచర్య. అతని జీవితం క్యాలెండర్ కంటే క్రమబద్ధంగా ఉంటుంది. ఏనాడూ ఆలస్యం కాడు. పనులన్నీ సజావుగా సాగుతుంటాయి.
ఒక రోజు, అప్పిగాడికి ఏమైందో తెలియదు కాని ఉదయం లేవడమే ఆలస్యమైంది. అలారం మోగినా, అప్పిగాడు మాత్రం కదలలేదు, మెదల్లేదు. తీరా చాలా సేపు నిద్రపోయి లేచి చూస్తే… అప్పటికే ఆఫీసుకు వెళ్లాల్సిన సమయం దాటిపోతోంది. ఆ రోజు ఆఫీస్‌లో పని కూడా ఎక్కువగా ఉండడంతో, ఆలస్యమవుతుందని కంగారు పడి స్నానం, పూజ చేయకుండానే ఆఫీస్‌కు బయలుదేరాడు. బయటికి వచ్చేసరికి బైక్ టైరు గాలి లేని పూరీలాగా పడి ఉంది. దాన్ని చూసి ఉసూరుమని, కోపంతో బైక్ ని ఒక్క తన్ను తన్నాడు! బైక్ కూడ అప్పిగాడికి చిన్న పంక్చర్ చేసింది. కుయ్యొ అనుకుంటూ, ఇక చేసేదేం లేక ఆటోలో ఆఫీస్‌కు వెళ్లేసరికి మరీ లేటు. ఉదయం నుంచి ఏమీ తినకపోవడంతో కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి. ఆఫీస్ క్యాంటీన్‌కి వెళ్లి ఏదైనా తిందామని కొని వెళ్లే సరికి, ఎప్పుడూ రద్దీగా ఉండే క్యాంటీన్ మూసి ఉంది. దగ్గరలో ఇంకో ఫుడ్ సెంటర్ లేక, బైక్ లేక పోవడం, పని ఎక్కువ ఉండడం తో, రోజంతా ఆకలితోనే పనిచేసి, సాయంత్రము మళ్ళి ఆటోలో ఇంటికి తిరిగి వచ్చాడు.
గుమ్మం తెరిచి ఫ్యాన్ వేస్తే తిరగడం లేదు. కానీ అప్పిగాడికి తల మాత్రం బాగానే తిరిగింది. మంచి ఆకలి మీద ఉన్నాడు. ఏదైనా వండుకుందామంటే వెళ్ళి చూస్తే సిలిండర్‌లో గ్యాస్ లేదు. స్నానం చేద్దామంటే కరెంట్ లేక గీజర్ పని చెయ్యక, చివరికి చల్లని నీళ్లతోనే స్నానం చేయాల్సి వచ్చింది. కొంచెం శరీరం తేలిక పడింది. మనసు మాత్రం మరింత వేడిక్కింది. ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ…అలవాటు ప్రకారం పూజామందిరంలోకి వెళ్లాడు.
దేవుణ్ణి చూస్తూ… అప్పిగాడు గట్టిగా కట్టలు తెరుచుకున్న కోపం తో మాట్లాడటం మొదలుపెట్టాడు
ఏమిటి స్వామీ… ఇదీ!
“స్వామీ! ప్రతిరోజు నిన్ను పూజిస్తాను. ఈ ఒక్కరోజు ఆలస్యం అవుతుందని పూజ చేయలేకపోయాను. ఈ రోజు పూజ చేయని కారణంగా నాకు ఇన్ని కష్టాలా? స్వామీ! చాలా మంది అసలు పూజలే చేయరు కదా! మరి నాకు మాత్రమే ఎందుకు స్వామీ ఇన్ని కష్టాలు? నువ్వు కఠినాత్ముడివా? శాడిస్ట్‌వా? స్వామీ!”
“ఒక్కరోజు పూజ చెయ్యలేదని ఇంటికే కరెంటు కట్ చేస్తావా? గ్యాస్ లేకుండా చేస్తావా? ఏమి ద్రోహం చేశాను స్వామీ నీకు?” గొంతు వేగం పెంచాడు.
“బైక్ పంక్చర్, క్యాంటీన్ మూసివేత, పవర్ కట్… ఇవన్నీ ఒక్క రోజేనా? ఏం స్వామీ, నాతో ఆడుకుంటున్నావా?”
అప్పిగాడు నోటికి అడ్డు లేకుండా పోయింది. చల్లని నీళ్లతో స్నానం చేయాల్సి వచ్చిన విషయం గుర్తొచ్చి, అతని కోపం నసాళానికి తాకింది. “రోజూ… నీకు పంచామృతంతో నీకు అభిషేకం చేస్తాను కదా! నాకొస్తే చల్లటి నీళ్ళ స్నానమా? నిన్ను పూజిస్తే నన్ను కాపాడతావంటారు కదా!. కానీ నేను ఒక్క రోజు పూజ చేయలేక పోతే నీకు పగా! అంతేనా? పూజ చేయని వారిని ఏమీ అనరు. నేను ఏదో పెద్ద నేరం చేశానన్నట్టు నాకు మాత్రమే ఈ శిక్షా?” ఒక్కో మాటతో ఒక్కో ఆరోపణ, ఒక్కో ఫిర్యాదు, ఒక్కో కటువైన పదం. దేవుడిని నిందించడానికి అప్పిగాడు పెద్ద పెద్ద పదజాలంతో గట్టిగా మాట్లాడాడు.
***
ఇక దేవుడు కూడా అనుకున్నాడు— ‘వీడిని సైలెంట్ చేయకపోతే, మానవ లోకమంతా అరచి గోల చేసేటట్లున్నాడని, క్షణాల్లో అప్పిగాడి ముందు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అది కూడా మెరుపులు, మంటలతో కాదు. సాధారణంగా, “ఇంకా ఎంత మాట్లాడతావు?” అన్నట్టుగా! చాలా కూల్ గా!
అప్పిగాడు దేవున్ని చూసాడు. కానీ నోరు మాత్రం శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లా నాన్ స్టాప్ గా వాగుతూనే ఉంది. “స్వామీ, నా పై ఇంత కక్ష ఎందుకు?”
దేవుడు ఓ పెద్ద ఊపిరి పీల్చుకుని చెప్పాడు. “ ఒరే! ఒక్కసారి నన్ను మాట్లాడనిస్తావా రా?” అని అడిగాడు.
“నీకేమి స్వామీ! నువ్వు ఎన్నైనా చెప్తావు. మా మానవుల కష్టాలు నీకు ఏమని తెలుస్తాయి? నువ్వేమో లక్ష్మీ దేవితో కాళ్లు పట్టించుకొని హాయిగా నిద్రపోతావు. మాకు కొంచెం ఎక్కువ నిద్రపోతే సవాలక్ష సమస్యలు!” మా మానవుల పెళ్ళాలు అసలు మొగుళ్ళ మాటనే వినరు… నువ్వు అలా కులుకుతూ, మాకు ఇలా రాసిపెట్టావు మరీ! అని అసహనం వ్యక్తం చేసాడు.
“నిజాన్ని వింటావా లేక ఇంకా నిందల వర్షం కురిపిస్తావా? ఒక్కసారి నన్ను మాట్లాడనిస్తావా…” కొంచెం స్వరం పెంచాడు దేవుడు. అప్పిగాడు వెంటనే మెత్తబడ్డాడు.
దేవుడు చెప్పడం మొదలుపెట్టాడు. జాగ్రత్తగా విను…
“నువ్వు పూజ చేయకపోవడం వల్ల కాదు రా!
“ఈ రోజుతో నీ జీవితం పూర్తయ్యేది. యముడు వచ్చాడు. నేను అడ్డుకున్నాను. అందుకే నువ్వు లేట్‌గా నిద్ర లేచావు.”
“నువ్వు ఆఫీస్ కి వెళుతున్నప్పుడు నీ బైక్‌ను ఒక లారీ ఢీకొట్టాలి. అందుకే బైక్ టైరు పంక్చర్ చేశాను.”
“క్యాంటీన్‌లో సాంబారులో బల్లి పడింది. అది నువ్వు తింటావని, క్యాంటీన్‌ను మూయించాను.”
“నీ గీజర్ షార్ట్ సర్క్యూట్ అయి, నువ్వు షాక్‌తో చనిపోవాలి. అందుకే కరెంటు కట్ చేశాను.”
“ఆకలితో ఉన్న నువ్వు ఏదైనా వండుకుని తిందామనుకుంటే సిలిండర్ పేలిపోవాలి. అందుకే గ్యాస్ లేకుండా చేశాను.”
అప్పిగాడు సైలెంట్ అవ్వడమే కాకుండా… భయంతో బిగుసుకుపోయాడు.
దేవుడు చెబుతూనే ఉన్నాడు… “మా భక్తులు అంటే మాకు ఎంతో ఇష్టం. మేము చేసిన పనివలన మీకు తాత్కాలిక అసౌకర్యం ఉండవచ్చు. కానీ దీర్ఘకాలంలో మంచే జరుగుతుంది. మీ మానవులే చిన్న కష్టానికి ఓర్చుకోలేక వెంటనే నిందలు వేస్తారు…” ‘అంతా మన మంచికే’ అని ఎందుకు ఆలోచించరు రా మీ మానవులు? అని… దేవుడు ఆపాడు.
అప్పిగాడు అకస్మాత్తుగా నేలపై పడిపోయి సాష్టాంగ నమస్కారం చేస్తూ… “స్వామీ, నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు. నీ మహిమలు తెలియని వెర్రిబాగులవాడిని. నన్ను క్షమించు…” అని ప్రాధేయపడ్డాడు!
“సరి… సరేలే… నీ గండాలన్నీ పోయాయి. ఇక నూరేళ్లు బతుకు, రా” అని దేవుడు దీవించాడు!
“ధన్యుడిని స్వామీ!” అన్నాడు అప్పిగాడు.
అప్పిగాడు మళ్లీ… కొంచెం ఏదో గుర్తుకొచ్చినట్లు… “స్వామీ!” అన్నాడు.
“ఇంకా ఏంటి?” దేవుడు అడిగాడు.
“మరి… మరి… మరి… !! అనే సరికి “నసపెట్టక అసలు విషయానికి రా! నా గురించి చాల మంది భక్తులు వేచి చూస్తున్నారు! అన్నాడు దేవుడు.
మరి… ఇన్ని గండాల నుండి కాపాడిన నువ్వు… “నా పెళ్లిని మాత్రం ఎందుకు ఆపలేదు స్వామీ?” అన్నాడు అప్పిగాడు.
దేవుడు చిన్న విరామం తీసుకుని… నేరుగా అప్పిగాడి ముఖం లోకి చూస్తూ…
“ఒరే పిచ్చివాడా… నువ్వు నా భక్తుడివి అయింది నీ పెళ్లి తరువాత కదరా! నీ పెళ్లి నేనెలా ఆపగలను?”
బీమా (ఇన్సూరెన్స్) తీసుకున్న తర్వాత జరిగిన వాటికే కవరేజ్ (రక్షణ) ఉంటుంది. అంతకుముందు జరిగిన వాటికి వర్తించదు కదా! అని దేవుడు మాయమయ్యాడు.
అప్పిగాడు షాక్ అయ్యాడు.
***








ముగింపు పెళ్లి నుండి నచ్చలేదు
కథ నడిపించిన విధానం బాగుంది