గల్ఫ్ తెలుగు బతుకుల పోస్టుమార్టం రిపోర్ట్

డిక్షనరీలో దొరకని వలస భాష  ఇది. ఈ కథల్లో పండిత భాష లేదు. పాస్‌పోర్ట్‌పై ‘హురూబ్’ పడ్డవాడి భాష ఉంది. ‘కఫీల్’, ‘బల్దియా’ లాంటి పదాలు డిక్షనరీల్లో దొరకవు, లేబర్ క్యాంపుల్లో మాత్రమే వినిపిస్తాయి. సంజయ్ ఆ కన్నీటి పదాలను నేరుగా తెలుగు వాక్యంలోకి లాక్కొచ్చాడు.

ది 2000వ సంవత్సరం.

నేను సెలవు పెట్టి ఇంట్లో ఉన్నాను, మా వారు డ్యూటీకి వెళ్లారు. సాయంత్రం ఆయన తిరిగి వచ్చేసరికి నా కళ్లు ఎర్రబారిపోయి ఉన్నాయి, మొహంలో ఏదో తెలియని దుఃఖం. నన్ను అలా చూసి కంగారు పడిపోయి “ఏమైంది?” అని అడిగారు. “కమల్ హాసన్ సినిమా కదా అని మహానది చూడటం మొదలుపెట్టాను. అటు సినిమాని ఆపలేకపోయాను, ఇటు నా దుఃఖాన్ని కూడా ఆపుకోలేకపోయాను” అని మెల్లగా చెప్పాను. నన్ను అలా చూసి ఆందోళన పడిన ఆయన “ఇకపై ఇలాంటి సినిమాలు చూడకు” అని దెబ్బలాడారు.

మళ్లీ ఇన్నాళ్లకు సంజయ్ ఖాన్ రాసిన ‘సవారీ’ కథల సంపుటిని చదువుతున్నంతసేపు నా పరిస్థితి సరిగ్గా ఆనాటి మహానది సినిమా చూసినప్పటి లాగే అయిపోయింది. అసంకల్పితంగానే గుండె బరువెక్కి కళ్లవెంబడి నీళ్లు తిరిగాయి.

వృత్తిరీత్యా ఒక ఉపాధ్యాయురాలిగా, గల్ఫ్ దేశాలకు వలసపోయిన ఎందరో తల్లిదండ్రుల పిల్లలను నేను దగ్గరగా చూశాను. వారి కష్టాలు, కడగండ్లు విన్నప్పుడు “ముక్కుపచ్చలారని ఈ పిల్లలకు ఈ వెతలేంటి దేవుడా?” అని మనసు కలచివేసేది. ఆ బాధతో నా వంతుగా ఫీజులు కట్టడమో, భోజనం ఏర్పాట్లు చేయడమో చేసేదాన్ని. ఆనాడు నేను చూసిన వలస జీవుల యదార్థ గాథలకు, కన్నీటి వ్యథలకు నిలువెత్తు అక్షర రూపమే ఈ ‘సవారీ’.

ఇది కథల పుస్తకం కాదు ఒక ఛార్జ్‌షీట్ ఈ పుస్తకంలోనివి కేవలం కథలు కావు. నరకం కన్నా ఘోరమైన వలసజీవుల బతుకుపాట్లు. ‘సవారీ’ని కేవలం ఒక కథల పుస్తకం అనుకుంటే పొరపాటే. ఇది యాభై లక్షల మంది గల్ఫ్ తెలుగువాళ్ల సామూహిక పోస్టుమార్టం రిపోర్ట్. సమాజం మీద వేసిన ఒక ఎఫ్.ఐ.ఆర్ (FIR). అన్యాయం మీద దాఖలు చేసిన ఛార్జ్‌షీట్.

రచయిత సంజయ్ ఖాన్ వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆయన పని కోడ్ రాయడమే కావొచ్చు, కానీ గల్ఫ్ ఎడారిలో సాటివారు అనుభవిస్తున్న నరకాన్ని చూసి ఆయన మనసు కదిలింది. ఆయన కలం పట్టుకోలేదు స్టెతస్కోప్ పట్టుకున్నాడు, చచ్చిపోయిన వాళ్ల కలలకు పోస్టుమార్టం చేశాడు.

డిక్షనరీలో దొరకని వలస భాష  ఇది. ఈ కథల్లో పండిత భాష లేదు. పాస్‌పోర్ట్‌పై ‘హురూబ్’ పడ్డవాడి భాష ఉంది. ‘కఫీల్’, ‘బల్దియా’ లాంటి పదాలు డిక్షనరీల్లో దొరకవు, లేబర్ క్యాంపుల్లో మాత్రమే వినిపిస్తాయి. సంజయ్ ఆ కన్నీటి పదాలను నేరుగా తెలుగు వాక్యంలోకి లాక్కొచ్చాడు. డబ్బు కోసం మనిషితనం ఎలా అమ్ముడుపోయిందో తన కథల ద్వారా కళ్లకు కట్టాడు.

అలంకారాలు, ఉపమానాల జోలికి పోకుండా నిజాన్ని నగ్నంగా నిలబెట్టే నిర్మొహమాటం ఆయన కలం బలం. ఆయన శైలి కాటుకత్రాసు లాంటిది. వాక్యం మెత్తగా దిగదు, ఒక్కసారిగా కోసేస్తుంది. “శవానికి కూడా వీసా? వాట్ ఏ పిటీ!” అన్న ఒక్క లైన్‌తో గల్ఫ్ కార్మికుల దీనస్థితిని చెప్పేశాడు. “ఫ్రైడ్ రైస్ కుక్క పాలైంది”, “వాసన రక్తంలో ఇంకిపోయింది”, “చద్దర్ వెచ్చదనం శవానికే దక్కింది” లాంటి వాక్యాలు చదివితే కళ్లలో నీళ్లు తిరగవు గుండెలో నుంచి రక్తం ఉబుకుతుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయినా, అనుభవించిన బాధే అక్షరమైంది కాబట్టి ఆయన అభివ్యక్తిలో ఎక్కడా కృత్రిమత్వం లేదు. ఎడారి ఇసుకలో ఇంకిన కన్నీళ్లే కాగితం మీద అక్షరాలై పారాయి. అందుకే ఇవి కథలు కావు కత్తిగాట్లు.

గల్ఫ్ వలస  లాక్కున్నది ఏంటి? ఆకలి , గౌరవం, కన్నీళ్లు, నమ్మకం, కుటుంబం, చావు చివరికి శవాన్ని కూడా. ఈ వలసలు జీవితంలో శూన్యాన్ని మాత్రమే మిగులుస్తున్నాయని సంజయ్ లెక్కతో సహా చెప్పాడు. ఈ పుస్తకానికి ‘సవారీ’ అన్న పేరు ఎందుకు పెట్టారో రచయిత మాటల్లోనే చెప్పాలంటే “ఎక్కడం మన ఇష్టం, దిగడం వాళ్ల ఇష్టం.” యాభై లక్షల జీవితాలకు శవపేటిక మేకు కొట్టేసిన అద్భుతమైన నిర్వచనం ఇది.

పన్నెండు వేర్వేరు సంఘటనలు, ఎన్నో పాత్రల ద్వారా మహా సముద్రమంత వలసజీవుల బడుగు జీవితాల్లోకి పరకాయ ప్రవేశం చేసి మనకు దృశ్యమానం చేయడంలో రచయిత పూర్తిగా సఫలమయ్యాడు. చీము పట్టిన గాయాన్ని కోసి చూపించిన ఒక సర్జన్ కత్తి ఈ సవారీ.

ఈ పుస్తకం కేవలం ఒక కథల సంపుటి కాదు ఒక హెచ్చరిక! ఈ పుస్తకం చదివాక కూడా గల్ఫ్ వెళ్లాలనిపిస్తే వెళ్లొచ్చు. కానీ తిరిగి వస్తారో, శవమై వస్తారో, లేదా కాగితం ముక్కగా (piece of paper) మిగిలిపోతారో అన్నది మీ ఇష్టం కాదు, ‘వాళ్ల’ ఇష్టం.

ఇప్పుడైనా ఈ సవారీ దిగుదాం. మరెవ్వరూ ఇలా బలి కాకూడదు. ఈ కథల చరిత్ర ప్రతి ఒక్కరూ చదవాలి. ఈ సమాజానికి ఇంతటి బలమైన, యదార్థమైన పుస్తకాన్ని అందించిన సంజయ్ ఖాన్ గారికి నా అభినందనలు, ఆశీస్సులు. ఆయన ఇలాంటి కథలు మరెన్నో రాయాలని కోరుకుంటున్నాను.

*

సత్యగౌరి మొగంటి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.