ఈ మంగలి పల్లె కథలు ఎందుకు?

ఊరు పోయినట్టే నేనూ ఎక్కడో మాయమై, పూడ్చబడి, కుళ్లిపోయి, మగ్గిపోయి మట్టిలో భాగమైపోతే… కొన్నేళ్ల తర్వాత ఎవరైనా పిల్లవాడో, పిల్లదో ఈ రాతలని చదివితే, వాళ్లకి ఇలా ఒక ఊరుండేదని తెలియాలి. అది ఈ ప్రపంచానికి వెలుగులని ఇవ్వటానికే కాలగర్భంలో కలిసిపోయిందనీ తెలియాలి అనుకున్నాను.

“మెమొరీస్ ఆఫ్ మంగలి పల్లె” మంగలి కులానికీ ఈ పేరుకూ ఉన్న అనుబంధం చాలా చిన్నది. కుమ్మరి, కమ్మరి, చాకలి, కోమటి, రెడ్డీ, వెలమా, కాపు ఇలా ఆ ఊరిలో ఉన్న అన్ని కులాలాలకూ ఇక్కడ రెండే పేర్లు. సింగరేణి- నాన్ సింగరేణి. మైనింగ్‌లో పని చేసేవాళ్లూ, వాళ్ల మీద ఆధార పడ్డ ఇతర కుటుంబాలూ…

ఆ ఊరిలో నా చిన్న నాటి ఙ్ఞాపకాలను వెతుక్కుంటూ మొదలై అభివృద్ది అంటే ఏమిటీ? అది ఎవరి కోసం? అనే ప్రశ్నల వైపు నాకు తెలియకుండానే జరిగింది… ఈ కథలు ఎవరు ఎప్పుడు చదివినా, చదువుతున్నా, ఈ ప్రపంచం అనుభవించే ప్రతీ సౌకర్యం వెనుకా ఓ పెనువిధ్వంసం ఉందని అర్థం చేసుకోవాలి. లక్షల మంది మనుషుల, కోట్ల జీవరాసుల ప్రాణాలు పోతే తప్ప, మరెన్నో జాతులు సమూలంగా నిర్మూలించబడితే తప్ప ఇప్పుడు మనకు ఉండే ఏ సౌకర్యమూ రాదనీ తెలియాలి… దానికి సాక్ష్యంగా ఈ కథలు నిలబడాలన్న కోరిక లోలోపల ఉంది.

కానీ, దానికోసం నేనేం ప్రత్యేకంగా కలిపిన దినుసు ఏమీ లేదు. నేను చూసిన జీవితాలనే, నాకు పరిచయం ఉన్న మనుషులనే గుర్తున్నంత వరకూ రాసుకుంటూ వచ్చిన. కథల్లా రాయబడ్డ ఈ శకలాల్లో ఉన్న మనుషులూ, ప్రాంతాలూ, ఇండ్లూ ఏదీ ఉట్టిగనే ఊహల్లో పుట్టినవి కాదు. ఆ ఊరు నిజంగా ఉండేది. మనుషులు నిజంగా తిరిగేవాళ్లు. ఆ భాష అట్లానే మాట్లాడేవాళ్లు. సింగరేణి కోసం వాళ్లని ఆ ఊరినుంచి తరిమేస్తే ఎక్కడెక్కడో మళ్లీ కుదురుకోవటానికీ, బతకటానికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. కుదరకపోతే రాలిపోతున్నారు.

ఇదంతా ఒకేసారి జరగలేదు, అంతా ఒకేదగ్గర చనిపోలేదు కాబట్టి అవి మామూలు మరణంలాగా అనిపిస్తాయిగానీ, ఇవన్నీ ఈ అభివృద్ధిభూతం చేసిన, చేస్తున్న హత్యలు. ఎదిరించలేని నిస్సహాయులమై, అడ్డుకోలేని బలహీనులమై…. కాంపన్సేషన్ పేరిట మొహాన కొట్టిన నామమాత్రపు కరెన్సీ కాగితాలు తీసుకొని, మాదికాని చోటుల్లో ఇమిడటానికి ప్రయత్నిస్సూనే ఉన్న వేలాది మందిలో నేనూ ఒకన్ని. మంగలిపల్లె, ఎంకట్రావుపల్లె, వకీలుపల్లె… ఇంకా ఎన్నోగ్రామాల, అక్కడి జనుల కన్నీళ్లు రాలిన చప్పుడు ఎవ్వరికీ వినిపించదు. ఎప్పుడైనా ఒక్కన్నే కూచుంటే నాకు మా ఊరు గుర్తొస్తుంది. అక్కడి మనుషులు గుర్తొస్తారు. ఆ ఊరు ఊరునే అమాంతం మింగిన సింగరేణి నోరు గుర్తొస్తుంది. కాలగర్భంలో కలిసిపోయిన ఒక స్పెషల్ కేటగిరీ మనుషుల అడ్డా అయిన మంగలిపల్లె…

అందుకే… ఆ ఙ్ఞాపకాల బరువు మోయలేక మా ఊరు మంగలిపల్లె గురించి కొన్ని జ్ఞాపకాలు ‘మెమొరీస్ ఆఫ్ మంగలిపల్లె’ పేరుతో రాయటం మొదలుపెట్టాను. యాదికున్నంత వరకూ మనుషులనీ, కొన్ని సంఘటనలనీ రాసుకుంటా వచ్చిన. చదవటానికి కూడా బాగుండాలి కదా. మరీ న్యుస్ రిపోర్ట్ ఇచ్చినట్టో, డైరీ రాసుకున్నట్టో ఉండకూడదు కాబట్టి, అక్కడక్కడా కొద్దిగా ఫిక్షన్ కలుపుకున్న.

ఊరు పోయినట్టే నేనూ ఎక్కడో మాయమై, పూడ్చబడి, కుళ్లిపోయి, మగ్గిపోయి మట్టిలో భాగమైపోతే… కొన్నేళ్ల తర్వాత ఎవరైనా పిల్లవాడో, పిల్లదో ఈ రాతలని చదివితే, వాళ్లకి ఇలా ఒక ఊరుండేదని తెలియాలి. అది ఈ ప్రపంచానికి వెలుగులని ఇవ్వటానికే కాలగర్భంలో కలిసిపోయిందనీ తెలియాలి అనుకున్నాను.

అనుకున్నట్టే… ఊరు పూర్తిగా పోయేనాటికి పసివాళ్లుగా ఉన్న ముగ్గురు పిల్లలు నా నంబర్ కనుక్కొని మరీ కాల్ చేసి. బాబాయ్, మామా అని పిలుస్తూ “నేను ఫలానా వాళ్ల అమ్మాయిని, నేనూ ఫలానా ఆయన కొడుకును. మా పిల్లలకి ఇందులో ఉన్న కథలు చెబుతున్నా, మన ఊరు గురించి… ఒకసారి ఇంటికి రండి” అని చెప్పినప్పుడు కథల ఉద్దేశం కొంతైనా నెరవేరింది అనిపించింది.

*

నరేష్కుమార్ సూఫీ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.