ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలపట్ల పెరుగుతున్న ప్రజల నిరసనలను చూస్తున్నాం. ఇరవయ్యో శతాబ్దపు చివరినాళ్ళ మౌనాన్ని వీడి గళం విప్పుతున్న ప్రజలను చూస్తున్నాం. అయితే బలపడిన ప్రభుత్వాలు నిరసనలపైనా ఆందోళనల పైనా ఉక్కుపాదం మోపి అణచివేయడం కూడా చూస్తున్నాం. ఆధునికతలోని అభ్యుదయపు డొల్లతనాన్ని నిరసించిన ఇరవయ్యో శతాబ్దపు చివరి రోజులు ఆంధ్ర దేశంలో అస్తిత్వ పోరాటాలుగా మారి సామాజిక మార్పుల కారణంగా విద్యారంగంలో వచ్చిన మార్పుల కారణంగా సేవారంగాల పెరుగుదల కారణంగా ఇరవయ్యో శతాబ్దం చివరల్లో పుట్టిన ఇప్పటి యువతరంలో మధ్యతరగతి వారు కళాశాలలనుండి నేరుగా ఉద్యోగాలకు వెళ్ళడం చూశాం.
ఈ యువతను సామాజిక విలువలు తెలియని స్వార్థపరులనీ సామాజిక బాధ్యత లేదనీ వారి ముందు తరాల వారు నిందిస్తూ ఉండడం కూడా చూశాం. కానీ ఆశ్చర్యంగా అదే యువతను దేశవ్యాప్తంగా మెచ్చుకోవడం అందుకు దారి తీసిన పరిస్థితులూ చూస్తుంటే పాశ్చాత్య సామాజిక శాస్త్రవేత్తలు గమనించిన ఒక పరిణామం మన దేశంలో ఇప్పుడు ప్రత్యక్షమవుతుందేమో అనిపిస్తుంటుంది.
మన దేశంలో తలెత్తిన ఆ పరిణామం గురించి మాట్లాడుకునే ముందు సామాజిక శాస్త్రవేత్తలు గమనించిన విషయాలేమిటో ఒకసారి చూద్దాం. ఈ శీర్షిక కింద ఇంతకుముందు ఆ విషయాలను గురించి కొంత మాట్లాడుకుని ఉన్నాం.
“అంతకుముందువరకూ అందంగా కనిపించిన భవిష్యత్తు ప్రపంచం మొత్తాన్ని సంశయంలోకి నెట్టి గతాన్నీ భవిష్యత్తునూ కనుమరుగు చేసి వర్తమానాన్ని సైతం ప్రశ్నార్థకంగా మార్చింది. సమాజపు ఆలోచనలు మొత్తం వినిర్మాణం వైపుకూ విచ్చినం వైపుకూ మళ్లాయి. నిరాశాత్మక విచికిత్చ సమాజం మొత్తాన్ని అంతకు ముందున్న ఆధునిక ఆదర్శవాద ధోరణులనుండి నూతన వేర్పాటువాద ధోరణులకూ స్వప్రయోజనవాద ధోరణులకూ దారి తీసింది. అయితే శ్రమ ఫలితంగా అంతకంతకూ పెరుగుతున్న పెట్టుబడి వేర్పాటువాద సమూహాలను ప్రలోభాలకు గురిచేసి తన లాభాలను మరింత పెంచుకుంటుంటే నిర్మాణాత్మక విధానానికి దూరమైన నిరాశాత్మక విచికిత్చ ఏమాత్రమూ పనికి రాదన్న ఆలోచనకు ఇరవయ్యో శతాబ్దపు చివరలోనే అంకురార్పణ జరిగింది.
ఇప్పుడు కవికి ప్రపంచం నిరాశగా కాక తను చూస్తున్న ప్రతి వస్తువులోనూ ఒక ప్రోత్సాహకర నూతన వాతావరణం కనిపిస్తున్నది. డెబ్భైలూ ఎనభైలలో మానవ జీవితాలలోకి జొరబడిన ఆధునికానంతర ఆలోచనా స్థితిని దాటి కవిత్వం ఇప్పుడు కొత్త్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు కవిత్వం ఊహాత్మక విమర్శనా స్థితిని దాటి వాస్తవిక దృశ్యాన్ని ఆశావహ దృక్పథంతో ఆవిష్కరించడం సాధారణమైపోయింది. అంతకు ముందు చూసిన ప్రపంచమే ఇప్పుడు కొత్తగా కనబడుతోంది. ఆ కొత్తగా కనబడిన విషయమే ఇప్పుడు కవి మనసునుండి కవిత్వంగా మనముందు నిలుస్తున్నది”
(చిటికెన వేలుపై భూగోళం – సారంగ 01.05.2026)
ఆధునికతనుండి (Modernism) ఆధునికానంతర (Post Modernism) వరకు జరిగిన సామాజిక ప్రయాణంలో మనవంతు (తెలుగు నేల) మార్పులను చూశాం. అయితే పోస్ట్ మోడరన్ భావనలోని నిరాశా నిస్పృహలనూ అపనమ్మకాన్నీ సమిష్టి ఆచరణలోని డొల్లతనాన్నీ చూసిన సమాజం వివిధ గుంపులుగా విడిపోయి అస్తిత్వ పోరాటాల పేరుతో తమ అస్తిత్వాలను నిలుపుకోవాలనుకున్న వ్యక్తులు చివరికి సాధించినదేమిటో చూశాం. అయితే అప్పటి ఆలోచనలలోకి వారు విసిరిన గులకరాళ్ళు కలిగించిన అలజడి కొంతకాలం వాస్తవమని భ్రమింపజేసినా వాటి జాడలు సమాజపు సమిష్టి ఆలోచనలలో నిలిచి పోయాయి.
పోస్ట్ మోడ్రనిజం నిరాశావహ ప్రపంచం నుండి బయట పడి సమాజం ఇప్పుడు మెటా మోడ్రనిజం దిశగా ప్రయాణిస్తున్న వైనాన్ని పాశ్చాత్య సామాజిక శాస్త్రవేత్తలు గమనించారు. ఈ మెటా మోడ్రనిజం పోస్ట్ మోడ్రనిజాన్ని పూర్వపక్షం చెయ్యడం కాక దాని విమర్శనాత్మక దృష్టిని కలిగి వుంటూనే ఆధునిక అర్థాన్వేషణ కోసం జరిగే ప్రయత్నం అంటారు సామాజిక శాస్త్రవేత్తలు.
ఇప్పటి యువతరం నిస్సందేహంగా స్వార్థపరులే. ఇటీవల భారత దేశంలోని Gen Z ఉద్యమ సందర్భంగా ఎవరో చెప్పినట్లు ఈ యువత సర్కారు వైద్యశాలల్లో పుట్టలేదు. సర్కారు బడుల్లో చదువుకోలేదు. ప్రభుత్వాలు అందిస్తున్న ఉచితాల వూసులెరుగరు అయితే తాము కట్టే పన్నుల వల్ల పాలిస్తున్న ప్రభుత్వాలు జవాబుదారీ తనాన్ని కలిగి ఉండాలనీ రాజ్యాంగ బద్ధ పాలన అందించాలనీ కోరుకుంటారు. వారి ఆకాంక్షలకు విఘాతం జరిగినప్పుడు కూడా వారు సాధారణంగా నోరెత్తరు. ప్రభుత్వాలు తమ జవాబుదారీతనం మరచిపోయి తమనే హేళన చేసినప్పుడు జీవితాన్ని జంతర్ మంతర్ చేస్తారు.
సరిగ్గా అప్పుడే వారి ముందు తరాలవారికి కూడా వారిపై విశ్వాసం పుడుతుంది. దేశవ్యాప్తంగా ఈ విశ్వాసం కవులతో కవితలు రాయించింది. గాయకులు గళాలెత్తి పాటలు పాడారు దేశం నలు మూలలనుండి ఆ యువతకు సహాయ సహకారాలందించారు.
ఈ యువత చూపిన చొరవా వ్యవస్థలపట్ల వారికి ఉన్న నమ్మకం రాజ్యాంగం పై వారి విశ్వాసం వారి పోరాటానికి ఆశ్చర్యకరమైన రూపాలనిస్తే కవులు తమ నిరాశావహ గొంతులను వీడి వసంతానికి స్వాగతం పలుకుతున్నట్లు కనిపించారు.
మొదట ఈ చిన్న హిందీ కవితను చూడండి.
తొక్కేయగలవు చీమల పుట్టని
నాశనం చేయలేవు చీమల పట్టుదలని
చీమల పట్టుదల
నిరాకారంగానే రాకాసిబల్లి కన్నా పెద్దది
విలుప్తం అయిపోయింది రాకాసిబల్లుల ప్రజాతి
కానీ పట్టుదలతో కొనసాగుతూనే ఉంది భూమిపై చీమల సంతతి.
-హిందీ మూలం : నిఖిల్ సచాన్, అనువాదం : ఆర్. ఎస్. వెంకటేశ్వరన్. Fb wall 28.07.2026
ఈ ఉద్యమం ప్రాంత జాతి మత కుల లింగ విభేదాలకు అతీతంగా సాగుతూ కవులకు స్పూర్థినివ్వడాన్ని మనం ఇటీవలి తెలుగు కవిత్వంలో విరివిగా గమనించవచ్చు.
కాసుల లింగారెడ్డి రాసిన ఈ కవిత ఫ్రాన్స్ విద్యార్థులను స్పురణకు తెస్తూనే నేటి Gen-Z ఉద్యమాన్నీ ఆ ఉద్యమం పట్ల ఆశాభావాన్నీ ఎలా ప్రకటిస్తోందో చూడండి.
వాళ్ళు వస్తారు…. మళ్ళీ మళ్ళీ వస్తారు
“హమ్ దేఖ్ లేంగే యే భగత్ సింగ్ కా దేశ్ హై
హమ్ దేఖ్ లేంగే…” ( షేర్ సింగ్)
వాళ్లు
ఏ ముట్టడి చేయడానికి రాలేదు…
దేన్నీ కూల్చడానికి రాలేదు కనీసం పొగబాంబులేయడానికైనా రాలేదు
వాళ్ళ
చేతుల్లో కర్రలు లేవు… పుస్తకాలున్నాయి. పెదవులపై ద్వేషం లేదు… ప్రశ్నలున్నాయి.
మాటల్లో అధికార దాహం లేదు… భవిష్యత్తుపై ఆందోళన ఉంది
కళ్ళల్లో క్రౌర్యం లేదు…కోటి వసంతాల వెలుగుంది.
పసిప్రాయపు అమాయకతుంది కౌమారపు పరిహాసముంది
వాళ్ళు
ఈ దేశపు మనస్సాక్షిని తట్టి లేపడానికి వచ్చారు
నిరాశామయ కొలనులో అలలై వచ్చారు
చిక్కటి చీకటి చుట్టుముట్టిన అడవిలో వెన్నెలై వచ్చారు
నాలుగు బాటల కూడలిలో చేవచచ్చి చతికిలబడ్డ
మన బాధ్యతల బరువు భుజాలకెత్తుకొని వచ్చారు.
వాళ్ళేమడుగుతున్నారు?
అజాదీ….
అవును…అజాదీ
పేదరికం నుంచి ఆజాదీ నిరుద్యోగం నుంచి ఆజాదీ
పీడన నుంచి ఆజాదీ ఆధిపత్యాలనుంచి ఆజాదీ
మతవాదం నుంచి ఆజాదీ మనువాదం నుంచి ఆజాదీ
వివక్ష నుంచి , విభజనలనుంచి ఆజాదీ..
అజాదీ…
పుష్కరకాలంగా పొగచూరి మసిపట్టి తెగబలిసిన బాధ్యతారాహిత్యం
మదమెక్కి పంజా విప్పిన నియంతల అహంకారం
వారిని స్వాగతించింది ఇనుప బారికేడ్లతో వారిని పలకరించింది లాఠీల భాషతో
వారి కలలను ఛిద్రం చేసింది టియర్ గ్యాస్ తో..
పాలకులారా!
ప్రశ్నలంటే మీకు ఎందుకంత భయం? ప్రజలంటే ఎందుకంత తృణీకారం?
ఒక విద్యార్థి ప్రశ్నలో వేల తరాల భవిష్యత్తు దాగి ఉంటుంది కదా
ఒక యువకుడి ఆవేదనలో దేశం తన ప్రతిబింబాన్ని చూసుకుంటోంది కదా
ప్రశ్న పత్రాలు లీక్ చేయించుకొని ఉద్యోగాలు పొందిన మీరు
మతాల మధ్య మంటలు పెట్టి పదవులు పొందిన మీరు
దొంగనోట్ల , దొంగ ఓట్ల ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న మీరు
పార్లమెంటును పశువుల సంతగా మార్చిన మీరు
పెట్టుబడికి పుట్టిన వికృత రాకాసి శిశువుల కొమ్ముకాసే మీరు
ఫోర్ పిల్లర్ డెమోక్రసీని ఒంటి స్తంభపు వంచన సౌధంగా మార్చిన మీరు
దిక్కు చూపిన చూపుడు వేలును కత్తిరించి వెక్కిరించిన మీరు
పుస్తకాల కన్నా లాఠీలను నమ్ముకున్నరు సంభాషణ కన్నా దమనాన్నే ఎంచుకున్నరు
కానీ…
ప్రతి లాఠీ దెబ్బ ఒక కొత్త ప్రశ్నను పుట్టిస్తుంది.
ప్రతి గాయం వేలాది గొంతులను మేల్కొలుపుతుంది.
ప్రతి బారికేడ్ ఒక ఉద్యమానికి మొదటి మెట్టవుతుంది.
గుర్తుంచుకోండి… పార్లమెంటు కేవలం ఒక భవనం కాదు
ప్రజల ఆశలు యువత కలలు రాజ్యాంగపు హక్కులు కలిసే ఒక వేదిక
లీకయ్యింది ప్రశ్నా పత్రం మాత్రమే కాదు ఒక నమ్మకం
కూలిపోతున్నది విద్యా వ్యవస్థ మాత్రమే కాదు ఒక దేశ భవిష్యత్తు
వాళ్ళు
వస్తారు..మళ్ళీ మళ్ళీ వస్తారు ప్రశ్నల బాణాలతో వస్తారు
సరికొత్త ఆలోచనల వసంతమై వస్తారు చేతుల్లో అగ్నివీణను మీటుతూ వస్తారు
స్వరాల్లో వైప్లవ్య గీతాలాలపిస్తూ వస్తారు. తూరుపు వాకిళ్ళ ద్వారాలు తెరుస్తూ వస్తారు
వినూత్న చరిత్ర సృష్టికర్తలై వస్తారు.
( షేర్ సింగ్ ..జంతర్ మంతర్ లో విద్యార్థుల మీద లాఠీఛార్జీ చేయడానికి నిరాకరించి తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఒక కానిస్టేబుల్)
కాసుల లింగారెడ్డి 26 జూలై 2026, Fb wall కవిసంగమం 27.07.2026
పై కవితలో కవి యువతపై వ్యక్తం చేసిన ఆశాభావం కంటే యువతపై కవికి ఉన్న నమ్మకం పునాదులు ఏమిటో మనం భాషతో చర్చించకుండానే అర్థమయ్యే విషయం.
సామాజిక బాధ్యత లేదని నీరసించబడ్డ తరాన్నే ఇప్పుడు కవులతో పాటు అనేక సమూహాల ప్రజలు ఆరాధనగా చూస్తూ అక్కున చేర్సుకుంటున్నారు. ఆ యువత కారణంగా ఇప్పుడు యువతపై నమ్మకంతో వెనుకటి తరాలవాళ్ళూ పోస్ట్ మోడరన్ నిరాశావాదం నుండి బయట పడడానికి ప్రయత్నిస్తున్నారు.
భవిష్యత్తు కాలం గర్భంలో పెరగడం మానేసి
విద్యార్థుల గుండెల్లో నెమ్మదిగా
కొత్త దేశాన్ని పెంచడం మొదలుపెట్టింది
అంటారు యింకొక కవి మెర్సీ మార్గరెట్ భవిష్యత్తును వేటాడిన రాజ్యం అనే కవితలో
భవిష్యత్తును వేటాడిన రాజ్యం తెలుగు ప్రభ 23. 07.26
విరిగిన చోటును మనసులో దాచకు, చిట్లిన ఆ గాయమే నీ బలానికి కొత్త ఊపిరి.
ఎందుకంటే వెలుగు జీవితానికి ఎక్కడి నుంచో రాదు…
చివరి మెట్టు మీద నిలబడినప్పుడు నువ్వే ఒక కాంతికిరణమై తళుక్కుమంటావు
అని భరోసానిస్తారు యింకొక యువకవి ఎన్. లహరి తన చివరి మెట్టు అనే కవితలో
‘చివరి మెట్టు’ నమస్తే తెలంగాణా 27.07.2026
ఇప్పుడు తెలుగు సమాజమే కాదు భారత సమాజమంతా మెటా మోడరన్ తార్కిక యదార్థ జవాబుదారీ తరానికై వారి ఆచరణాత్మక విజయాలకై ఎదురు చూస్తోంది. ఇప్పటి తెలుగు కవులు కూడా నిశ్సబ్దంగా అందులో భాగమవుతున్నారు.
*








Add comment