బయట భోరున వర్షం

తమిళ మూలం: ఆర్. చూడామణి
తెలుగు: దాము

రాఘవన్ చూడామణి(1931-2010)తొలి తమిళ స్త్రీవాద రచయితల్లో ముఖ్యమైంది. 1951 నుంచి 2004 దాకా, యాబై యేళ్ళకు పైగా రాసింది. ఆమె రచనలు ప్రధాన స్రవంతి పత్రికల్లోనూ, సాహిత్య పత్రికల్లోను వచ్చాయి. కథలు, నవలికలు, నవలలు, నాటికలు, వ్యాసాలు రాసింది. 350కి పైగా తమిళ కథలు, 200పైగా ఇంగ్లీషు కథలు రాసింది.

వాళ్ళ నాన్న రాఘవన్ ICS ఆఫీసరు. అమ్మ కనకవల్లి శిల్పి, చిత్రకారిణి. ఆమె ప్రోత్సాహంతోనే చూడామణి రచనలు మొదలు పెట్టింది. చిన్నప్పుడే ఆమెకు వెన్నెముక సమస్య వల్ల బడికి వెళ్ళలేదు. యింట్లోనే ట్యూటర్‌ను పెట్టి చదివించారు. జీవితంలో యెక్కువ భాగం యింటికే పరిమితమైంది.

“మానవ సంబంధాలలోని అనేక పొరల్ని చిత్రిస్తాయి ఆమె కథలు. అవి, స్త్రీలు యితరుల దృష్టిలో యెలా వుండాలో కాక, తమకు తాము యెలా వుండాలో చెబుతాయి. ఆమె కథలో వొక స్త్రీ పాత్ర అంటుంది, ‘మనం అంతిమంగా మనతో మనమే జీవించాలి. అందువల్ల, మనల్ని మనం యిష్టపడటం, గౌరవించుకోవడం ముఖ్యం’. ఆమె స్త్రీ పాత్రలు మృదువుగా మాట్లాడుతాయి. కానీ, యింట్లో, బయటా చేసే రోజు వారీ యుద్ధాల్లో దృఢంగా వుంటాయి. ఆ పాత్రలు ప్రతిఘటిస్తాయి, పోరాడుతాయి, అరుదుగా, నిస్సహాయంగా వుంటాయి.” అంటుంది ఆమె మితృరాలూ, ప్రముఖ రచయిత అంబై.

“ప్రేమ కన్నా న్యాయ భావన గొప్పది, ముఖ్యమైనది” అని ఆమె నమ్మింది. అయితే, న్యాయ భావనతో పాటు, నిర్నిబంధ ప్రేమ కూడా ఆమె కథల్లో యెక్కువగా కనిపిస్తుంది.

ఆమె శైలి సరళంగా, లయ బద్దంగా, బోధనకు దూరంగా, మనల్ని చెయ్యి పట్టి తనతో నడిపిస్తున్నట్టు వుంటుంది.

ఆమె కథలు అనేక భాషల్లోకి అనువాదమయ్యాయి. యెన్నో ప్రతిష్టాత్మక అవార్డులొచ్చాయి. ఆమె కథల ఆధారంగా కొన్ని లఘు చిత్రాలొచ్చాయి. యిటీవల ఆమె 5 కథల్ని జ్ఞాన రాజశేఖర్ web series తీశాడు.

ఆమె పెళ్ళి చేసుకోలేదు. దాదాపు 11 కోట్ల తన ఆస్తిని పేద పిల్లల చదువుకోసం యిచ్చేసింది.

యీ కథ 1985లో ప్రచురణ అయ్యింది.

యట బోరున వర్షం పడుతోంది. మూసిన గాజు కిటికీ గుండా చూస్తే, ప్రపంచం మీదికి వొక తెర కప్పినట్టు అనిపిస్తుంది. వాహనాలు నీడల్లా దాని మీద ప్రాకుతున్నాయి.

హాల్లో రమేష్ స్క్రాబిల్ గేములో వోడిపోతున్నాడు. అతని స్కోరు వొక అంకెను దాటి పోవడం లేదు. యెక్కువ పాయింట్లు వచ్చే అక్షరాల్ని, రెట్టింపు స్కోరు తెచ్చే పదాల్ని సురేష్ యెలా పెంచుకోగలుగుతున్నాడు?

“నువ్వు దొంగతనంగా లెటర్స్‌ ను చూసి యెంచుకొంటున్నావు. యూ ఛీటర్!” అని వున్నట్టుండి అరిచాడు.

“నేనేమీ చూసి చెయ్యడం లేదు. నాది అదృష్టం. పెద్ద అక్షరాలు వస్తున్నాయి నాకు. అంతే.”

“ప్రతి సారీ అలా యెలా జరుగుతుంది? నీ స్కోరు ఆగకుండా పెరుగుతూనే వుంది. నాకు మాత్రం పెరగనంటుందే.”

“నీకు పెద్ద లెటర్స్ వచ్చినా నీ స్కోరు యెప్పటికీ పెరగదు. పొడుగు పదాల్ని కూర్చడం రాదు నీకు.”

“అదంతా కాదు. నువ్వు యేమారుస్తున్నవ్” వొక్క సారిగా రమేష్ కోపంతో స్క్రాబిల్ బోర్డును పక్కకు తోసేశాడు. గేమును చెడిపేసాడు. అక్షరాల చదరాలు గది నిండా చెల్లా చెదురుగా పడ్డాయి.

“యూ లూజర్! నీకు ఆడను చేతకాదు. నేను గెలుస్తుంటే కడుపు మంట నీకు. దానికి ఆటను చెడగొడతావా?”

సురేష్ తమ్ముడి మీదికి దూకాడు. అన్నకి సరితూగని రమేష్ బొక్క బోర్లా పడ్డాడు. అన్న కొట్టిన దెబ్బలతో, తన్నిన తన్నులతో నొప్పిని తట్టుకోలేక, చెదిరిన జుత్తుతో, కన్నీటి ముఖంతో, వెక్కిళ్ళు పెడుతూ అమ్మ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి, “అమ్మా చూడు మా. సురేష్ మా. గేములో ఛీట్ చేసింది కాక, నన్ను కొట్టాడు…”

సురేష్ వెనకనే వెళ్ళాడు. రమేష్ రక్కిన చోటంతా వాడి శరీరం యెర్రగా కందిపోయింది. “నేను కొట్టింది మాత్రమే చెబుతున్నావు కదా! వాడు కూడా నన్ను కొట్టాడు మా. చూడు. కుక్క లాగా కరిచాడు. యింక మీదట వీడ్ని మన టైగర్‌తో కలిపి కట్టెయ్యాలి…”

“యేందిరా సురేష్ యిది? తమ్ముడ్ని యిలా కొట్టచ్చా?” అని అమ్మ రమేష్‌ని దగ్గరకు లాక్కుని వాడి కన్నీళ్ళు తుడిచింది. సురేష్ బాధతో రగిలిపోయాడు. “వాడు చిన్నోడు కాబట్టి యేమైనా చేయచ్చు. కదా! వాడికి యెక్కువ పదాలు తెలియదు కాబట్టి వాడు స్క్రాబిల్‌లో వోడిపోయాడు. దానికి కోపం తెచ్చుకొని గేమును చెడగొట్టాలా?”

వాడు రమేష్ మీదికి దూకబోతుంటే వాళ్ళమ్మ ఆపి, యిద్దరికీ రాజీ కుదిర్చింది. “ఆ స్క్రాబిల్ గేము వద్దు. యింకేదైనా ఆడుకోండి. వాన పడుతుందని వొక్క రోజు యింట్లో ఆడుకొంటున్నారు. అది కూడా గొడవ పడకుండా ఆడుకోరు కదా! భలే పిల్లలు! వెళ్ళి మంచిగా యేదో ఆడుకోండి. నేను కాసేపు నడుం వాల్చాలి.”

యిద్దరూ హల్లోకి తిరిగొచ్చి, ముఖాలు వేలాడేసుకొని, వొకరితో వొకరు మాట్లాడకుండా చెరొక మూల కూర్చున్నారు. తర్వాత వాళ్ళు స్క్రాబిల్ బోర్డును పెట్టెలో వేశారు. కానీ మరేదీ ఆడుకోలేదు. యింట్లో వున్నప్పుడు వాళ్ళు మామూలుగా రమ్మీ, మోనొపలీ, చైనీస్ చెకర్స్, క్యారం ఆడుకునే వారు. కానీ వాళ్ళకి యేదీ ఆడాలనిపించలేదు. అన్ని ఆటలూ పాతబడి బోరుకొడుతున్నాయి.

మామూలుగా సాయంత్రాలు బయటికెళ్ళి స్నేహితుల్తో కలసి క్రికెట్టో, యింకోటో ఆడుకునేవారు. వొక్కోసారి స్నేహితులు యింటికొస్తారు. మామూలు సెలవు రోజుల్లో, సాయంత్రాలు గడపడానికి ఆసక్తికరమైన ప్లాన్స్ వేస్తారు. యీ రోజు సెలవు మామూలుది కాదు. అనుకోకుండా వర్షం వల్ల సెలవిచ్చారు. వర్షం వల్ల స్నేహితులు వొకరిళ్ళకు వొకరు వెళ్ళలేరు. యింట్లో యిరుక్కుపోయి, అన్నదమ్ములు వొకరితో వొకరికి పడక పోట్లాడుకుంటున్నారు.

సురేష్ కిటికీ దగ్గరికొచ్చి, బయటికి చూసాడు. వాహనాలేవీ కనిపించలేదు. ప్రపంచం మొత్తం వర్షంగా మారిపోయింది.

అన్న చూస్తున్న ఆసక్తికర దృశ్యాన్ని వదులుకోకూడదని, రమేష్ కూడా వచ్చి అన్న పక్కన నిలబడ్డాడు.

“అక్కడేం లేదే! యేం చూస్తున్నావ్?”

“నీ తలకాయ”

“నువ్విలా మాట్లాడితే నేనెళ్ళి అమ్మకు చెప్తా.”

“క్రై బేబీ, చాడీలు చెప్పడం తప్ప నీకేం తెల్సురా?”

“అమ్మా…”

“నోర్మూయ్ రా. కొట్టి నలిపేస్తా”

“అమ్మా, సురేష్ కొడుతున్నాడు మా!”

“రేయ్ అబద్దాలకోరు! నువ్విలా అబద్దాలు చెప్తే, నరకంలో యెలుకలు నీ నాలుకను తినేస్తాయిరా.”

రమేష్ భయంతో అన్నను మిటకరించి చూసాడు. సురేష్ అనాసక్తిగా బయట చూస్తున్నాడు. యింట్లో యిలా యిరుక్కుని, యేమీ చేయకుండా వుండటం బోరింగ్‌గా వుంది.

దట్టమైన వర్షంలో యేదో కదులుతూ వుందే! సురేష్ కళ్ళు తీక్షణంగా చూసాయి.

యేదో కదులుతూ వుంది. యేదో పదార్థం వర్షంలో కదులుతూ వుంది. యినుప తలుపు కిర్రుమని శబ్దం చేస్తుంటే, అది లోపలికొచ్చింది. చిన్న తెల్లటి గుడారం లాగా అది వాళ్ళ వైపుగా, దగ్గరికొచ్చింది.

ఆశ్చర్యంగా పిల్లలిద్దరూ వొకర్నొకరు చూసుకున్నారు. “యేంటది? యెవరది?”

కాసేపటికి హాలు తలుపు తట్టిన శబ్దం. వర్షపు గోలలో తలుపుతట్టిన చప్పుడు కూడా తెలియడం లేదు. తర్వాత యింకో సారి చప్పుడు-మెల్లగా, సందేహిస్తున్నట్టు.

“యెవరది?” అడిగాడు సురేష్.

శబ్దం ఆగిపోయింది, భయపడి ఆగిపోయిన యేడుపు లాగ. ఆగి, ఆగి మళ్ళీ వినిపించింది.

“యెవరది? బెల్లు కొట్టకుండా తలుపు కొడుతున్నారు?”

“నేను..నేనే”

సురేష్ గబుక్కున గొళ్ళెం తీసి తలుపు తెరిచాడు. వాడి కళ్ళు కిందికి చూడాల్సి వచ్చింది. ఆ ఆకారం సురేష్ రొమ్ము వరకే వుంది. వాడికి ఐదేళ్ళుంటాయేమో! డోర్ బెల్ అందలేదు కాబట్టే వాడు తలుపు తట్టాడు. వాడి తల మీద కప్పి వున్న ప్లాస్టిక్ షీటు వొక టెంటు లాగ వాడి మీది నుంచి కిందికి వేలాడుతూ వుంది. దాని మీద వాన చుక్కలు గాజు ముక్కల్లా మెరుస్తున్నాయి. వెలసిపోయిన నీలి రంగు చొక్కా, చివర్లు చినిగిన ఖాకీ నిక్కరు. వాడు నిలబడిన చోట చిన్న నీటి గుంట వాడు తీసుకొచ్చిన వానతో నిండింది. ఆ పిల్లవాడు నల్లగా వున్నాడు. యెంత నల్లగా అంటే, ఆ నల్ల రంగు వానలో రక్తంలా కరిగి, కారిపోతుందేమో అనిపిస్తుంది. నల్లటి ముఖంలోంచి రెండు పెద్ద కళ్ళు పైకి చూశాయి. సురేష్, రమేష్ వాడి వైపు తీక్షణంగా చూస్తుంటే, వాళ్ళు విశ్వరూపం యెత్తినట్టుంది. వాళ్ళ 13, 10 యేళ్ళు ఆకాశాన్ని తాకుతున్నట్టు అనిపిస్తుంది.

“యెవడ్రా నువ్వు?” అడిగాడు సురేష్.

“…”

“చెప్పురా”

“మణి”

“సుబ్బర మణా? నాగ మణా?”

వాళ్ళిద్దరి నవ్వుల్ని విని, ఆ అబ్బాయి ముడుచుకుపోయాడు.

“బదులివ్వరా, నేనడుగుతున్నా కదా?”

“నేను.. వుత్త మణి”

“ఓహో! వుత్త మణి నా? యెక్కడికొచ్చావ్ రా వుత్త మణీ”

“నేను..మా అమ్మ పంపింది.”

“యెవరు మీ అమ్మ?”

“యిక్కడ పని చేస్తుంది…”

“ఓహో! నాగమ్మ కొడుకువా? పనోల్లు వెనక తలుపు గుండా రావాలని నీకు తెలియదా? ముందు నుంచి వచ్చి, యెందుకు హాలు తలుపు కొట్టినావ్?”

“యెంత పొగరు?” అన్నాడు రమేష్.

భయపడుతూ చెప్పాడు మణి. “లేదు…లేదు. వెనుక వాకిలి నుంచి రావాలని నాకు తెలియదు.”

“యెందుకొచ్చినావ్?”

“మా చెల్లికి జ్వరం. మా అమ్మ పది రూపాయలు అడగ మంది. ఆసుపత్రికెళ్ళి సూది వేయాలని. చేతిలో డబ్బు లేదంట”

“యిక్కడ కూడా డబ్బు లేదు. పో”

సురేష్ వొక్క చూపుతో తమ్ముడి నోరు మూయించాడు. యిడియట్! యిక్కడొక కొత్త గేముందని అర్థం కాలేదా?

“వుండనీ రమేష్. వాడ్ని తరమకు. చిన్న పిల్లాడు కదా. రేయ్ మీ అమ్మ యెవర్ని అడిగి డబ్బు తెమ్మంది?”

“యజమానమ్మను”

“ఆమె మా అమ్మే. నేను ఆమెనడిగి తెస్తాను. కానీ నువ్వు మాతో కాసేపు ఆడుకోవాలి. సరేనా?”

ఆ నల్లని ముఖం వెంటనే వికసించింది.

“ఓహ్. తప్పకుండా మీతో ఆడతా. మిమ్మల్నిద్దరినీ ‘అన్నా’ అని పిలవచ్చా?”

మాట పూర్తయ్యేలోగా వాడి చెంప ఛెల్లుమంది.

“పనిదాని కొడుకువి. మమ్మల్ని ‘అన్నా’ అని పిలవడానికి నీకెంత ధైర్యం? కొట్టి నలిపేస్తా. మర్యాదగా మమ్మల్ని ‘సార్’ అని పిలువ్. అర్థమైందా?”

సురేష్ దెబ్బ, సురేష్ ముఖం, సురేష్ గొంతు-యీ మూడు కత్తులు సూటిగా మణి గుండెల్లో దిగాయి.

చెంప పట్టుకొని తడుముకుంటూ వాడు తడబడుతూ నిలబడ్డాడు. కన్నీళ్ళు పొంగాయి.

“నేను..నేను పోతా. నేనాడను.”

“నీకు డబ్బులొద్దా?”

“కావాలి”

“నేను చెప్పినట్టు నువ్వు వింటే, నేను మా అమ్మనడిగి డబ్బులు తెచ్చిస్తా.”

మణి పెదాలు కొరుక్కున్నాడు. వాడి చెంప యింకా మండుతూనే వుంది.

“సరే”

“యేమన్నావ్?”

“సరే అన్నా” భయంతో వాడి నోరు పెగల్లేదు.

“మమ్మల్ని ‘సార్’ అని పిలవమన్నా. మర్చిపోయావా?”

అన్న యీ సారి వాడ్ని చెంప దెబ్బ కొడతాడని యెదురు చూసి, నిరుత్సాహపడిన రమేష్ తనే చెయ్యెత్తాడు. వాడు కొట్టక ముందే మణి చెప్పాడు.

“వద్దు. కొట్టద్దు. సరే. సార్.. కొట్టద్దు సార్…”

“రాస్కల్” అన్నాడు రమేష్.

“మ్..లోపలికి రా”

మణి లోపలికి వొక కాలు పెట్టగానే సురేష్ గొంతు మళ్ళీ లేచింది.

“రేయ్. రేయ్. డర్టీ ఫెలో. మా వరండా తడిపేసినావు కదరా. నీ పాదాల మీద బురద కూడా వుంది. ముందు సరిగా క్లీన్ చేసి, తర్వాత లోపలికి రా.”

“బట్ట..”

“నీకు ప్రత్యేకంగా మేము బట్ట యివ్వాలా దీని కోసం! నీకు చొక్కా లేదా? దాన్ని విప్పి తుడువ్”

“నా చొక్కతోనా?”

“అవును”

వాడి చూపు వేడుకొంది. కానీ సురేష్ ముఖం కఠినంగా వుంది. రమేష్ కుడి పిడికిలి మూస్తూ తెరుస్తూ వుంది. ఆ చేతి నుంచి వేగంగా పక్కకు జరిగి, మణి తల మీదున్న ప్లాస్టిక్ షీటును పక్కకు జరిపి, చొక్కా విప్పి, గచ్చును తుడిచాడు. వాడి గొంతులో యేదో అడ్డం పడి వూపిరాడలేదు.

“మ్.. నీ కాళ్ళు కూడా బాగా తుడుచుకో. అయిపోయిందా? గుడ్. ఆ గుడ్డని అలా మూలన పడేసి, యిలా రా.”

బెరుకుగా లోపలికి వచ్చాడు మణి. వాన వల్ల వచ్చిన చలితో వాడి రొమ్ము అదురుతోంది. సురేష్ తలుపు మూసి, గొళ్ళెం పెట్టాడు.

“కాసేపు బంతాట ఆడుదాం. రమేష్, వెళ్ళి నీ బాల్ తేబో రా.”

“లేత యెరుపు రంగు రబ్బరు బంతి ఫుట్‌బాల్‌లో మూడవ వంతు వుంది. హాల్లో సోఫాలూ, కుర్చీలు కొంచెం మూలకే వున్నాయి. హాలు మధ్యలో వున్న రెండు టేబుళ్ళను స్టూల్లను, “నువ్వు కూడా వచ్చి పట్టు రా” అని మణిని కూడా పిల్చి, అన్నదమ్ములు మూలకు జరిపారు.

“యిటు చూడు మణీ, పోయి అక్కడ నిలబడు. రమేష్ యిక్కడ నిలబడతాడు. నేను అటు పక్క నిలబడతా. మేము బంతిని నీ వైపుకు తంతాము. మళ్ళీ నువ్వు దాన్ని మా వైపుకు తన్నాలి. సరేనా?”

“సరే సార్”

“నువ్వు మొదలుపెట్టు రమేష్.”

రమేష్ బంతిని మణి వైపుకు తన్నాడు. అతి జాగ్రత్తగా, నాలుక మొన బయట పెట్టి, బంతిని తన్నబోతున్నాడు మణి. కానీ, వొక మెరుపులా సురేష్ బంతిని ఆవలి వైపుకు తన్నాడు. మణి చురుకుగా బంతి వెనుక పరిగెడుతుంటే, రమేష్ వేగంగా చొరబడి, బంతిని అన్న వైపుకు నెట్టాడు. మణి బంతిని తరిమి, దాన్ని కాలితో తాకాడు కూడా. లేపడానికి ప్రయత్నించాడు. కానీ, బంతి దొర్లనని మొరాయించింది. యెక్కడి నుండి వురికొచ్చాడో, సురేష్ బంతిని దొర్లకుండా ఆపి, దాన్ని తనే బలంగా వ్యతిరేక దిశలోకి తన్నాడు. ఆడే వుత్సాహంలో, మణి చలిని కూడా మర్చిపోయి బంతి వెనుక పరిగెత్తి, బంతిని తన్నబోయే క్షణంలో, రమేష్ బంతిని యింకోవైపుకు తన్నాడు. కాసేపు యిటు వైపు, అటు వైపు గస పోసుకుంటూ పరిగెత్తిన మణి, వాళ్ళ వైపు నిరాశగా చూసాడు.

“యేంట్రా ఆగిపోయావ్. ఆడవా?” అడిగాడు సురేష్.

“మీరు నన్ను అసలు బంతిని తన్ననివ్వడం లేదు.”

“ఆట అంటే అలానే పోటీ వుంటుంది. నువ్వు తెలివిగా ఆడి, తన్నాలి దాన్ని.”

“నువ్వు తెలివి తక్కువ వాడివా?”

‘కాదు’ అన్నట్టు తలూపాడు మణి.

“అయితే ఆడు.”

కాసేపు అదే విధంగా ఆట నడిచింది. పరిగెత్తి పరిగెత్తి మణికి వూపిరాడలేదు. వాడికి దొరక్కుండా బంతి అన్ని వైపులకీ యెగురుతోంది.

“మ్..బంతిని తన్నరా పొట్టోడా. ఆటాడలేని నువ్వొక దద్దమ్మవి.”

“నువ్విలా తన్నాలి రా.” బంతిని తంతున్నట్టు కాలు విసిరాడు రమేష్.

“ఆయ్యో, అమ్మా..” అని అరుస్తూ మణి నొప్పితో కింద కూర్చొని, పాదం పట్టుకొని, “నువ్వు నన్ను తన్నావు.” అన్నాడు.

“యేమన్నావ్?” సురేష్ కొరకొరా చూసాడు.

భయపడి మణి పైకి లేచాడు. “నువ్వు నన్ను తన్నావు సార్.”

“గేమ్ అంటే యిలానే వుంటుంది. వొక్కో సారి మన మీద దెబ్బలు, తన్నులు పడతాయి. నువ్వు జాగ్రత్తగా ఆడాలి.

“నాకు ఆడాలని లేదు. నేను వెళ్తున్నా. మీ అమ్మ దగ్గర డబ్బు తీసివ్వండి.”

“నువ్వు వొక్కసారయినా బంతిని సరిగ్గా తంతేనే తీసిస్తా.”

“నాకు డబ్బులొద్దు. నేను వెళ్తున్నా.” మణి తలుపు వైపు నడిచాడు.

సురేష్ పెద్ద పెద్ద అంగలేసి, తలుపుకడ్డంగా నిలబడ్డాడు.

“నువ్వు పోవడానికి వీల్లేదు.”

మణి దెబ్బ తిన్నట్టుగా అన్నదమ్ములకేసి చూసాడు. వాళ్ళు నవ్వుతున్నారు.

మణి అరిచాడు, “నేను వెళ్ళాలి. నేను వెళ్ళాలి.”

యింటిలోపల నుంచి వొక కుక్క మొరుగు ప్రతిధ్వనించింది.

మణి బిగుసుకు పోయాడు. “యిక్కడ…యిక్కడ కుక్క వుందా?”

“నీకు కుక్కలంటే భయమా?”

“అవును..చాలా భయం.”

“తలుపును కాపలా కాస్తుండ్రా రమేష్. వొక్క నిమిషంలో వస్తా.” సురేష్ లోపలికెళ్ళాడు.

“ఆగు.ఆగు. నువ్వు బాగా ఆడలేదు కాబట్టి, మేము నిన్ను కరవమని కుక్కను నీ మీదికి వదులుతున్నాము.” అన్నాడు రమేష్. మణి వణుకుతున్నాడు. వొకటి రెండు సార్లు నోరు తెరిచాడు. కానీ మాట బయటికి రాలేదు. నత్తి నత్తిగా “వద్దండి..వద్దండి…” అన్నాడు.

వాడి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. భూతాకారాన్ని దాల్చిన భయం వాటిలో పారాడింది. తెరచిన నోరు తెరచినట్టే వుంది. శరీరం ముడుచుకుపోయింది. అతడి ముందు లేత గోధుమ రంగు పొమోరియన్ కుక్కను పట్టుకొని నిలబడ్డాడు రమేష్. కొత్తవాడ్ని చూసి మొరుగుతూ, దూకడానికి ముందుకొచ్చింది.

వళ్ళంతా చెమటతో తడిచిపోయిన మణి, గోడకు బల్లిలా అతుక్కుపోయాడు. ముఖంలో చుక్క నెత్తురు లేదు.

“మర్యాదగా ఆడతావా? లేదా? యీ కుక్కను నీ మీదికి వదలమంటావా?” నవ్వుతూ అడిగాడు సురేష్.

మణికి మాటలు రావట్లేదు. చలనం లేని వాడి శరీరంలో, చేతులు మాత్రమే కదిలి ‘వద్దు’ అన్నట్టు ఆడాయి. వాడినెవరో కనికట్టు చేసినట్టు, వాడి చూపు కుక్క మీద గడ్డ కట్టింది.

సురేష్ కుక్క మెడ మీద తట్టాడు. “టైగర్, వీడు తప్పుగా నడచుకుంటే, అప్పుడు నిన్ను వీడి మీదికి వదులుతా. అంత దాకా నోరు మూసుకో.”

కుక్క మెల్లగా గుర్రుమంటూ వుంది.

మణి కళ్ళకు చీకటి కమ్ముకొంది.

బయట వర్షం తెరపివ్వలేదు. పగటి పూట కూడా మెరుపులతో వొక సెర్చ్ లైటు లాగా మెరుస్తోంది. దానికి తోడు వురుములు.

“రేయ్ మణీ, నేనిప్పుడు ఆడను. కుక్కను పట్టుకుని యిక్కడ నిలుచుంటా. రమేష్, నువ్వు ఆడండి. రమేష్ బంతిని తంతాడు. నువ్వు పరిగెత్తి దాన్ని చేతుల్తో ఆపాలి. అర్థమైందా?”

మణి శిలలా నిలబడ్డాడు.

“యేంట్రా నేను అడుగుతున్నా కదా? బదులు చెప్పు. పొగరా? చూడిక్కడ. కుక్కను వదులుతా నీ మీదికి.”

కుక్క వొకడుగు ముందుకు వేయగానే మణిలో చలనమొచ్చింది.

“చేస్తాను..చేస్తాను…కుక్కను వదలద్దు..కుక్కను వదలద్దు సార్..”

“అలా రా దారికి!” సురేష్ గొలుసును వెనక్కి లాగాడు.

“గమ్మునుండు టైగర్. మ్..మీరిద్దరూ ఆడండి యిప్పుడు.”

“ఆడతా”

నల్లటి పాదాలు కదిలాయి. నల్లటి చేతులు బంతిని పట్టుకోడానికి కిందికి దిగగానే, రమేష్ వాడికి దొరక్కుండా, బంతిని వేరే వైపుకు తన్నాడు. మణి దాని వెంట పరిగెత్తాడు. అతని గుండె దడదడలాడింది. అతని వూపిరి ఆగిపోతోంది. భయం గడ్డకట్టడంతో, కనీసం యేడవడానికి కూడా అతని వల్ల కావట్లేదు. కుక్క-భయం- పరిగెత్తుతున్న పాదాలు-లేస్తున్న చేతులు-అందకుండా యెగిరే బంతి-యింకే ప్రపంచమూ లేదు. యింకే సత్యమూ లేదు.

“యేరా ఫూల్. వొక్కసారి కూడా కనీసం దాన్ని పట్టుకోలేదు. సోమరిపోతా! కుక్కను వదలమంటావా?”

నల్లటి పాదాలు వేగంగా దూసుకెళ్ళాయి. వేడెక్కిన నల్లటి చేతులు బంతిని పట్టుకోడానికి తహతహలాడాయి. యింతకు ముందు వాడు బంతిని తన్నడానికి ప్రయత్నించాడు. యిప్పుడు దాన్ని అందుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ, పదే పదే యెగరడం. వల్ల, వంగడం వల్ల, అతని నడుం నొప్పెడుతోంది. కానీ, నొప్పిని మర్చిపోయాడు. మారని వర్షపు చప్పుడు. వెనుక, కుక్క మెల్లగా గుర్రు గుర్రు మనటమే మణి విన్నాడు.

రమేష్ మెరుపు తన్ను. బంతి గెంతింది, మణికి దొరక్కుండా.

“నువ్వు వేగంగానే పరిగెత్తడం లేదురా. పెద్ద సోమరిపోతులా వున్నావే. టైగర్ వస్తేనే నువ్వు వేడెక్కుతావు. టైగర్, వెళ్ళి వాడ్ని తరుము చూద్దాం.”

“అయ్యో వద్దు..వద్దు…”

సురేష్ గొలుసు మీద పట్టు వదిలాడు. కుక్క స్వేఛ్చగా పరిగెత్తడానికి అనుకూలంగా గొలుసు వదులైంది. టైగర్ మణి మీదికి యెగిరి దూకింది. మణి అటూ యిటూ గెంతున్నాడు, మొరుగుతున్న కుక్కను తప్పించుకుంటూ. అది తరుముతూ వుంది. కనుగుడ్లు బయటికొస్తుంటే, వాడు ఆ గది మూల మూలలకీ పరిగెత్తుతున్నాడు.

“మ్ టైగర్, బాగా తరుము వాడిని!”

మణి యింకా వేగంగా పరిగెత్తుతున్నాడు. ఆ వేగంలో అతడి కాళ్ళు కనీ కనిపించని రెండు నల్ల గీతలుగా మారిపోయాయి. నోట్లోంచి నురగ కారుతోంది. వాడి మనసులో వొకటే లక్ష్యం: కుక్కను తప్పించుకోవడం.

“అరే! పొట్టోడు బానే పరిగెత్తుతున్నాడే. చూద్దాం, యింకెంత వేగంగా పరిగెత్తుతాడో. టైగర్, పో. పట్టుకో వాడ్ని.”

తడిసిన నిక్కరు, కాళ్ళతో మణి మెరుపు కంటే వేగంగా పరిగెత్తుతున్నాడు.

సురేషూ, రమేషూ పగలబడి నవ్వుతున్నారు.

“గుడ్.. గుడ్. మామూలోడివి కాదురా మణీ నువ్వు. బాగా పరిగెత్తుతున్నావు. యింకొంచెం వేగంగా..యింకొంచెం. అది చాలు. యింకొంచెం. టైగర్..మ్..మ్…”

“యేయ్ పిల్లలూ యేందీ గోల? కొంచేపు కూడా ప్రశాంతంగా నన్ను పడుకోనివ్వరు కదా. టైగర్ యెందుకు మొరుగుతూ వుంది?” లోపలి నుంచి అమ్మ వచ్చింది.

సురేష్ వెంటనే గొలుసు లాగి కుక్కను ఆపాడు. మొరుగు గుర్రుగా తగ్గిపోయింది. రమేష్ బుద్ధిమంతుడులాగ నిలబడ్డాడు. బంతి సోఫా కింద వుంది. ఐదేళ్ళ నల్లటి చిన్న పిల్లవాడు భయమే కళ్ళుగా మారి, రొప్పుతూ గోడను కరుచుకొని నిలబడ్డాడు. అతని శరీరం పొగలు కక్కుతోంది. పెదాలు, గడ్డం అదురుతున్నాయి. యింకా ముడుచుకుపోయి, కుక్క వైపే తదేకంగా చూస్తున్నాడు.

వాడి వైపు చూసి, కొడుకుల్ని చూసిందామె. “యీ పిల్లాడెవరు?”

“నాగమ్మ కొడుకంటా.” కింద చూస్తా గొణిగాడు సురేష్.

“యెందుకొచ్చాడు?”

“వాళ్ళమ్మకు అర్జెంటుగా పది రూపాయలు కావాలంట. చెల్లికి జ్వరమంట. అందుకని..”

“వాడినేం చేసారు మీరిద్దరూ?”

“యేం చెయ్యలేదు”

అమ్మ వాళ్ళ వైపు చూసింది. గొలుసును గుంజుకుంటున్న కుక్క వైపు చూసింది. వణుకుతూ గోడకు అతుక్కుపోయిన పిల్లవాడ్ని చూసింది.

“ఛీ. సిగ్గులేదా మీకు? లోపలికెళ్ళండ్రా యిద్దరూ. నాన్న రానీ సాయంత్రం. బెల్టు చినిగిపోతుంది యీ రోజు.”

యిద్దరూ తలలొంచుకొని, కుక్కతో సహా, లోపలికి తుర్రుమన్నారు.

ఆమె వాడి దగ్గరికెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని, వాడి జుత్తుని సవరించింది.

“భయపడ్డావా బాబూ? కుక్క యేం చెయ్యదు. నేనున్నా కదా.”

భయం నిండిన వాడి కళ్ళు ఆమెను చూశాయి. నోరు వంకర పోయింది. వెక్కిళ్ళతో గొంతు పూడుకపోయింది. కన్నీళ్ళై జల జలా రాలాడు.

“యేడవద్దబ్బా. బిస్కట్ తింటావా? అయ్యయ్యో! చొక్కా కూడా లేకుండా వచ్చావే! వుండు చొక్క యిస్తా.”

“…నేనెళ్ళాలి. తలుపు తీయండి. నేనింటికెళ్ళాలి. మా అమ్మ దగ్గరికెళ్ళాలి.”

వాడు డబ్బు తీసుకోవడానికి కూడా ఆగలేదు. ఆమె తలుపు తెరవగానే, ప్లాస్టిక్ షీటునూ, నలిగి పడి వున్న చొక్కాను కూడా తీసుకోకుండా, వెక్కిళ్ళు పెడుతూ పరిగెత్తి, వర్షంలోకి అదృశ్యమయ్యాడు.

వాడు వెళ్ళాక, యింటి యజమానురాలైన అమ్మ గొళ్ళెం పెట్టి, లోపలికెళ్ళి పిల్లల్ని చీవాట్లు పెట్టింది. యెప్పటిలానే వాళ్ళు తలలు వేలాడేసుకుని, అదంతా విన్నారు. మళ్ళీ హాల్లోకెళ్ళి కూర్చున్నారు. చందమామ చదవాలని చూసారు. కానీ, బోరుగా అనిపించింది. కాసేపు యేమీ చెయ్యకుండా, మౌనంగా కూర్చున్నారు.

సురేష్ కళ్ళు ఆనందంతో వెలిగిపోయాయి. “రేయ్ రమేష్, వాడు నిక్కరులో యెలా వుచ్చ పోసుకున్నాడో చూశావా?”

వాళ్ళమ్మకు వినిపించకుండా, చేతుల్తో నోర్లు మూసుకొని నవ్వుకున్నారు.

వర్షం లయబద్ధంగా కురుస్తోంది.

***

 

దామూ

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా ఆలోచనలను రేకెత్తించిన కథ!పిల్లల్లో negativity ను చూపించే అరుదైన కథ. thankyou!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు