బడుగుల నడ్డీ మీద ‘జాడీ’

పేదల వ్యథలను, అట్టడుగు వర్గాల బతుకులను, జీవితంలోని చీకటి వెలుగులను, సుఖ దుఃఖాలను, మధ్యతరగతి మందహాసాన్ని,  అసంఘటిత శ్రామికుల జీవితాలను మక్కువతో కథీకరించిన  సదానంద్ శారద అసలు పేరు పాకాల సదానంద్‍ (1952) తన శ్రీమతి శారద పేరును తన పేరు చివరన చేర్చుకున్నారు. 150కి  పైగా కథలు రచించారు. జాడి, గొలుసు, పాలకంకి, సదానంద్ శారద కథలు పేరుతో నాలుగు కథా సంపుటాలు వెలువరించారు. మంచి నీళ్ళబావి, ఆవలి తీరం అనే రెండు నవలలు కూడా రాశారు. తొక్కుడు బండ, హద్దురాయి, బలం, ఉప్పునీళ్ళు తదితర కథలు వీరికి చాలా పేరు తీసుకు వచ్చాయి. ‘జాడీ’ కథ వీరు రాసిన కథల్లో మణిపూస వంటిది. ఈ కథ మొదట 2 డిసెంబర్ 1977లో ఆంధ్రజ్యోతి వీక్లీలో ప్రచురింపబడింది.

జాడీ కథచదవండి.

ఇంచుమించు 1970ల దాకా కూడా తెలంగాణలో భూస్వాములు, దొరలు, పటేల్లు, పట్వారీలు అమాయక, పేద ప్రజల రక్త మాంసాలను తోడుకొని వాళ్ళచేత వెట్టి చాకిరీ చేయించుకొని పబ్బం గడుపుకున్నారు. బహుజన కులాలన్నీ దించిన తల ఎత్తకుండా ‘నీ బాంచెన్ కాల్మొక్కుత’ అని దొరకు ఊడిగం చేయాల్సిందే. ఈ పరిస్థితి నుండి ప్రజలను బయట పడేయడానికి సాయుధ రైతాంగ పోరాటం, (1946-51)  నక్సలైట్ ఉద్యమం, రైతు కూలి ఉద్యమంలాంటివి చాలానే వచ్చినా ఇవి ప్రజల్లో వలసినంత చైతన్యం తీసుకు రాలేక పోయాయి. ఒకించుక తీసుకు వచ్చినా గ్రామీణ ప్రజల అమాయకత్వం వలన, అనివార్యంగా దొర మీద ఆధారపడటం వలన, నిరక్షరాస్యత వలన అది ఎక్కువ కాలం నిలవలేదు. అందుకే ‘సంగం’ లాంటివి ఏర్పడ్డా సాయుధ పోరాటం తరువాత పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ నేపథ్యం నుండే ‘జాడీ’ లాంటి కథలు పుట్టుకు వచ్చాయి.

దొర ముసలితనాన్ని కూడా తానే మోస్తున్న ఎముకల గూడు లాంటి గవురిగాడ్ని(గౌరయ్య) పిలిచి దొర్సాని ఇచ్చే మామిడి కాయ జాడీని భద్రంగా తీసుకపోయి పట్నంల ఉన్న చిన్న దొరకు ఇచ్చి రావాలే అంటాడు దొర.

“అట్లనే కొంటబోతా” అంటాడు గవురిగాడు.

“అట్లనే… గిట్లనే కాదు. శానా జాగర్తగా కొంటబోవాలే, లేక పోతే నీ ఒళ్ళు పట్టున పగుల్తది” అంటాడు దొర.

తెల్లవారి భద్రంగా చెక్క పెట్టె అడుగున దాచిన ‘అంగీ’ తొడుక్కొని, దొరగారిచ్చిన రెండు రూపాయలు, అడ్రస్ చీటి  జేబులో వేసుకొని జాడీ భుజం మీద పెట్టుకొని పట్నం బయలుదేరుతాడు గవురిగాడు.

గవురిగాడు పండించిన ధాన్యం చాలాసార్లు పట్నం పోయింది కానీ గవురిగాడు పట్నం పోవడం ఇది రెండో సారే. ఇంతకు ముందు పోయినప్పుడు అమృతం లాంటి టీ తాగి సంబరపడుతాడు. ఇప్పుడు మళ్ళీ తాగొచ్చుననుకుంటాడు. “ఆ ఊరికి బస్సు రాదు. ఎలా వస్తుంది? అదేమన్నా మనిషా?” బస్సు రావాలంటే రోడ్డు ఉండాలి కదా! అందుకే బస్సెక్కాలంటే రెండు మూడు మైళ్ళు నడవాలి. “ఊరికి రోడ్డు పడితే పట్నంకు దారి పడ్డట్టే కదా! పట్నంకు దారి పడితే ఇంకేమన్నా ఉందా. ఈ పల్లెటూరోళ్ళ కళ్ళు నెత్తికెక్కవూ? అప్పుడు ఈ గవురయ్యసోంటోడు మన పొలంల పని చేయడానికి వత్తాడు? పట్నం పనులకే పోతనంటరు.  పట్నం మాటలు నేర్చి మనలను ఖాతరు చేయరు. అనేది దొరల ఆలోచన. ఇది వాళ్ళ మనసుల లోపలి ఆలోచన. బయటికి చెప్పే జవాబులు వేరే వుంటాయి. గవురయ్యలాంటి రైతు కూలీలే వాళ్ళ పొలాలకు కావాలి. వాళ్ళ చెమట బిందువులే దొరల సంపదకు పెట్టుబడులు. ఇదంతా గవురయ్య ఆలోచించడం లేదు. తమ ఊరికి రోడ్డు లేదు గనుక బస్సు రాదు అనుకుంటున్నాడు. అయితే రోడ్డు ఎందుకు లేదు? అనే ప్రశ్న అతనిలో ఉదయించాలంటే అతడు మరికొన్ని జన్మలెత్తాలి.

పట్నం చేరే సరికి గవురిగాడి తల ప్రాణం తోకకు వస్తుంది. బస్సెక్క పోతుంటే ఆ ఒత్తిడిలో రుమాలును ఎవరో లాగుతారు. అది  జారీ మరెవరి భుజం మీదనో పడుతుంది.  రద్దీ ఎక్కువుండడం వల్ల జాడీ ఎక్కడ పగులుతుందో అని బస్సెక్కలేక పోతాడు. ఇక లాభం లేదని రెండు రూపాయల తోని సంటి దానికి ఏమైనా కొనుక్క పోవచ్చు అని కనీసం చెప్పులు కూడా లేకుండా కాలి  నడకన ఇరవై మైళ్ళు నడిచి పట్నం చేరుకుంటాడు. మధ్యలో వర్షం పడుతుంది. జాడీలోకి నీళ్ళు పోయి తొక్కు ఎక్కడ కరాబు అవుతుందోనని అంగీ విప్పి జాడీ చుట్టూ కడతాడు. చలికి వణికి పోతాడు. జాడీని దొరను చూసుకున్నట్టే చూసుకుంటాడు. జాడీ గవురిగాడి భుజం మీద, నెత్తి మీద ఎక్కి పెళ్లి కూతురి లాగా పట్నం చేరుకుంటుంది. నాలుగు రోడ్లు వచ్చినకాడ ఎటు పోవాల్నో తెలీక అడ్రస్ అడిగితే పట్నం ఆకతాయి కుర్రాళ్ళు ‘గాంవాలే’ అంటూ ఆట పట్టిస్తారు. అడ్రస్ చీటి వానకు తడిసి అక్షరాలు చెదిరిపోతాయి. ఇంతకు జాడీ చిన్న దొర ఇంటికి చేరిందా? అడ్రస్ కనుక్కోవడానికి గవురిగాడు ఎంత తిప్పల పడ్డాడు. చివరాఖరికి గవురిగాని శారీరక, మానసిక పరిస్థితి ఏమిటి? గవురిగాడు తిరిగి ఊరికి చేరాడా? ఇవన్నీ ఆసక్తి రేకెత్తించే అంశాలు కథలోనే చదవాలి.

కథా కాలం కేవలం రెండు రోజులే. కానీ శతాబ్దాల బానిసత్వపు రూపాన్నంతా చాలా వ్యంగ్యంగా కళ్ళకు కట్టిస్తాడు కథకుడు. కథతో పాటు కథలో వాడిన కవిత్వం బాగా ఆకట్టుకుంటుంది. ‘ఎముకలపై ఆరేయబడిన ఒళ్ళును మోస్తూ కర్రల్లాంటి రెండు కాళ్ళు నడిచి వచ్చాయి.’, ‘దొరలో మంచితనం లాగే ముసలితనం కూడా కనిపించడం లేదు.’, ‘ఆకాశం జాలిగా నవ్వుతున్నది. చెమటతో తడిసిపోయే అతని శరీరాన్ని వర్షం తడిమి చూస్తున్నది. చలి అతని ఎముకలను కొరుక్కొని తింటున్నది.’ లాంటి వాక్యాలు కథలో గాఢతను పెంచాయి. కథకుడు ప్రయోగించిన శిల్పం సరళ శిల్పమే కానీ శైలి అద్భుతమనిపిస్తుంది. జాడీని దొరతనానికి, ఆధిపత్యానికి ప్రతీకగా వాడి పాఠకుల్ని మెప్పిస్తాడు కథకుడు. నరేషన్ అంతా ప్రామాణిక భాషలో నడిపినా సంభాషణలు స్వచ్చమైన తెలంగాణ తెలుగులో నడుస్తూ గుండెను చేరుకుంటాయి. గవురయ్యలు పండించిన తిండిని తింటూ వాళ్ళను మనం (సమాజం) ఎంత అధమంగా చూస్తామో చెప్పే సంఘటనలు ఆధ్యంతం సిగ్గుపడేలా చేస్తూ ఆలోచింప చేస్తాయి. గవురయ్య పాత్రను చూస్తే జాలేస్తుంది. దొరల పెత్తనానికి బలయ్యే గవురయ్య  బుక్కెడు బువ్వకు.. గుక్కెడు నీళ్లకు దూరమయ్యేలా చేసే దొరసాని పాత్ర మీద అక్కసు కలుగుతుంది. తెలంగాణ కథా వైభవానికి ఈ కథ ఒక మచ్చు తునక.

*

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నీ కాల్మోక్తా బాంచెన్ ….రోజుల నాటి కథ…..దొరలు సామాన్య, అతి సామాన్య జనాలను బానిసలగా చూస్తూ వారిపై పెత్తనం చలాయింపు కథ….చాలాహృద్యంగా సంభాషణల పఠిమ పఠితునికి హత్తుకొనుట అతిశయోక్తికాదండి.
    యండమూరి వీరేంద్రనాద్ వారి…నాటిక కుక్క గుర్తుకొస్తుంది…తెలంగాణాలో ఆనాడు పఠేల్ ,పట్వారీలు వారి చావడిలో పనిచేస్తున్న కులీల బతుకులను ఛిద్రచేయడమే వారి నైజం…అనేక మార్గాలద్వారా వారిని శరీరక, మానసిక హింసలద్వారా పైశాచికఆనందాన్ని పొంది అహంకారపూరిత నైజాన్ని ప్రదర్శింపచెసేవారు. మా ఉత్తరాంధ్రలోవెనుకబడిన జిల్లాలుగా పేరొందిన శ్రీకాకుళం జిల్లాలో మునసబు,కరణాలకు బలియైనరైతుకూలిలుఅంతే…యజ్ఞం కథలో మా కథలమాష్టారూ కాళీపట్నంరామారావుగారు రాసినరీతీన…
    మీ సమీక్షకూడాను అంతే మోతాదులో ఆకట్టుకుంది…దోపిడిని, పీడనను అభివర్ణించడంలొ కథారచయితయొక్క నాడిని పట్టుకొని ప్రస్తుత పాఠకునికి అందించారు. సదానందశారదగారి కథలను తప్పకుండా చదవాలనిపించెటట్టుగారాసారు….వెల్దండి శ్రీథర్ గారు..

  • పెత్తందార్ల దుర్మాసర్గాలకు పరాకాష్ట జాడి కథావస్తువు. కాలం మారినా ఇంకోరూపంలో దుర్మార్గాలు నడుస్తూనే ఉన్నాయి. సాంద్రతలో కొంచెం తేడా. వెల్దండి శ్రీధర్ విశ్లేషణ బాగుంది

  • జాడి కథ లో నాటి తెలంగాణ దొరల అహం, దానికి గురి అయిన దిగువ కులాల దయనీయ పరిస్థితి చిత్రించబడింది. ఈ కథను ఎన్నుకున్న శ్రీధర్ అభినందనీయుడు. పరిచయం బాగుంది.

  • చాలా మంచి స్థాయిలో ఉంది మీ పరిచయం విశ్లేషణ. అభినందనలు

  • గత చరిత్ర మూలాలు మనల్ని మరింత ముందుకు తీసుకెళ్తాయి.

  • నమస్కారం సార్!
    చాలా మంచి కథను పరిచయం చేశారు. తెలంగాణ ప్రజల అమాయత్వాన్ని, నమ్మిన వారికి అండగా, చేసే పనిలో నిష్ఠ, గవురయ్య పాత్రలో కనిపిస్తాయి. పట్టు వదలని విక్రమార్కుడు గవురయ్యా. అహంకారానికి, అధికారానికి, పేద బతుకులంటే అలుసుతనానికి ప్రతీక దొర. పేద వారి గుండేనే ప్రేమలో గొప్పది. అన్యాయాల, దౌర్జన్యాల, దాస్టికలను ప్రశ్నించే వైపు తన కలాన్ని కదిపిన సదానంద్ శారద సార్ కి కృతజ్ఞతలు. ఇంత మంచి కథను పరిచయం చేసిన శ్రీధర్ సార్ కి ధన్యవాదలు. గత చరిత్ర మూలాలు మనల్ని మరింత ముందుకు తీసుకెళ్తాయి.

  • ఒకమంచి విశ్లేషణ.ఒకమంచి కథ ను చదివించింది.అభినందనలు శ్రీధర్ గారు

  • మంచి కథను చదివించారు. విశ్లేషణ బాగుంది. మీకు , రచయితకు అభినందనలు.

  • చారిత్రక నేపథ్యం ఉన్న ఇలాంటి కథలను ఈ తరానికి పరిచయం చేయడం వలన సాహిత్యం మరింత సుసంపన్నం అవుతుంది.

  • జాడీ దొరతనానికి చిహ్నమే . దొరతనపు రూపమే మారింది .సారం లో అది అంతకంతకూ చిక్కపడుతోంది ,మీ విశ్లేషణలాగే . మీకు చేయి తిరుగుతున్నది .సదానంద్ శారద గారి కధను వేదికిపట్టుకొని పరిచయం చేయడం మీ సాహిత్య దాహాన్ని తెలియచేస్తున్నది .మీ మూలంగా ఈ కధను మరొక్కసారి చదివే అవకాశం వచ్చింది .అందుకు మీకు ధన్యవాదాలు
    గుండెబోయిన శ్రీనివాస్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు