ఏంటే కడుపులో ఇలా తిప్పుతోందీ??!! అని వంటింటి వరకూ ఓ కేకేసిన లీలామృతాన్కి వాళ్ళావిడ ” ఆ టీ.వీ వాళ్ళు ఒకే వార్తని చాలా సార్లు చెప్పి, చెప్పీ, తిప్పి, తిప్పీ చూయిస్తూంటం వల్ల మీకలా అవ్తోంది గానీ నా నల్లగారం వల్ల కానే కాదండీ.” అని తిరుగు కేకేస్తూ, తిరగమోతకానిచ్చి ఒచ్చి చూసేసరికి పక్కకి ఒరిగి..’పోయున్నాడు లీలామృతం.
“వాళ్ళావిడ జబ్బు పడినప్పుడు ఆమె ‘లో లంగా’ ఉతికారేసిన పుణ్యానికిగానూ అలా ఆ మంచి రోజునాడు ఉదయాన్నే రాగి దోశెలో నల్లగారం నంజుకు తింటూ , టీ.వీ నైన్ లో నెగిటివ్ వార్తలు ‘నిరంతరం’ చూస్తూ అంతం లేకుండా బాధపడుతున్న లీలామృతం ఊపిరి ఊదేసి , శరీరాన్ని అంతిమయాత్ర కొదిలేసి, రాజముద్ర, తుంగభద్ర అనే ఇద్దరు స్పౌజ్ యమదూతలు అతడి ఆత్మని అమాంతం స్వర్గానికి తెచ్చేసి పడేసారు.
ఆ మాత్రం పుణ్యానికి ఇలాంటి అర్థంతరం చావా! నేను చేయాల్సిన పనులు బోలెడు ఉండగా..ఐనా నా వయసెంతనీ..ఖర్మ..ఖర్మ..అంటూ అనుకోకుండా ఒచ్చిపడిన చావుని జీర్ణించుకోలేక స్వర్గపు హైవే పై ప్రయాణం పొడుగూతా వాపోతూ, సణుగుతునే ఉన్నాడు లీలామృతం.
ఆ.. మంచి రోజులు నీ కోసం ఆగుతాయా ? అసలే ఎదర ఆషాడం అన్ సీజనాయే.
పైగా మీ ఆవిడకి, మీ అత్తగారికి కూడా నీ జీవితంలో మొదటిసారిగా పొయి వెలిగించి ‘ఉప్పులేని ఉప్మా చేసి’ ఇవ్వడం వల్ల కూడా నీ పుణ్యం గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది మరి.
దాంతో ఆగావా..తీగమీది బట్టలన్నీ తీసి శుభ్రంగా మడతలు కూడా వేస్తున్నావీ మధ్య మీ ఆవిడ మీద ప్రేమతో. చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత అనీ లెక్కలెక్కడికీ పోవు కదా! నసపెట్టక మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనీయ్ అని అన్నారు ఆ స్వర్గ దూతలు రాజముద్రా, తుంగభద్రా నిర్వికారంగా.
స్వర్గం చేరిన లీలామృతం ఆత్మకి “సగం ఆత్మలన్నీ తెలుగు సినిమాల్లోనే యాక్టు చేస్తూ బిజీగా ఉన్నాకూడా ఇక్కడ ఇంత ఆత్మల జనాభా ఉందేమిట్రా నాయనా” అనిపించింది.
అక్కడి గాలి అంతా ఆత్మల ఎగుర్లాటతో రద్దీ రద్దీగా ఉండటం చూసి.
‘లీలా’త్మకి ప్రస్తుతం పనేం లేకపోవటంతో అలా అలా తేలియాడుతూ అక్కడి వింతా, విశేషాలు పరికిస్తూ తిరగసాగింది.
ఓ ప్రదేశంలో కొన్ని స్త్రీ ఆత్మలు గుమిగూడి మంతనాలు ఆడతుండటం చూసిన లీలాత్మ ఏం జరుగుతుంది అక్కడ అని అడిగింది తన ‘సాటాత్మని’.
వాళ్ళంతా తమ తమ భర్తల ‘అంగవస్త్రాలను’ తమకు రోగమవనీ, రొష్టవనీ…. ఓపికచేసుకుంటూ ప్రవచనకారులు సెలవిచ్చినట్టుగా భక్తిశ్రద్ధలతో ‘పిడచటం’ వల్ల గతజన్మ పాపాలన్నీ పోయి ఉన్నపళాన ఎక్కడివక్కడ వదిలేసి స్వర్గానికి తీసుకురాబడ్డారట.
కొందరికి సరిగ్గా తమ పిల్లల పెళ్ళి టైంలోనూ, ఇంకొందరికి హాయిగా మనవలతో ఆడుకుంటూ లైఫ్లో రిలాక్స్ అయ్యే కరెక్ట్ టైంలోనూ ఈ అర్ధంతర మోక్షం సంప్రాప్తించటం అస్సలు నచ్చలేదట! ఆ విషయాన్ని పరమాత్మ దృష్టికి తేవాలని వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు అని వివరించింది మరో ‘అపరిచితాత్మ’.
” నిజం..మనకి ఆత్మ సంతృప్తి లేకపోయినా ఈరోజు అడిగితే నెక్స్ట్ జనరేషనాత్మలకైనా న్యాయం జరిగి కాస్త కింది లోకాన ఆర్చుకు, తీర్చుకోనొస్తారు పాపం..అనేసి స్వర్గంలో ‘పాపం’ పదం నిషిద్ధం కదాని నాలుక్కరుచుకుందుకు చూసింది గానీ అవన్నీ కిందే మట్టికి ఒదిలేసి వచ్చినట్టు గుర్తొచ్చి గమ్మనుండిపోయింది అందరికోసం ఆలోచించే ఓ వెల్ఫేర్ ఆత్మ.
పైగా వీళ్లలో కొందరు మాసికాలకి, సంవత్సరీకాలకీ ఆరగింపుల కోసం భూలోకంలో తమ ఇళ్లకు వెళ్లినప్పుడు
“నేనూ అత్తగారి గుడ్డలు, మామగారు లుంగీలూ శ్రద్ధగా ఉతికి ఛస్తూనే ఉన్నా కదా .అయినా ఈ దండేసుకుని గోడెక్కిన మనిషికి మల్లే అల్లాంటి మంచిరోజు, అల్లాంటి ఓ మంచి చావు ఛస్తే నాకు వచ్చి చావదేంటీ?” అని బాధ పడిందట ఒక ముత్తైదువు .
చావుల్లో మళ్ళీ మంచి చావులూ, వాటి గురించి జెలసీలూ ఏవిటో!…ఒకసారి ఛస్తే గానీ తెలవదు వీళ్ళకి. ఐనా ఆవిడ భర్త లోదుస్తులు వాడని జెంటిల్మెన్ అవడం తను చేసిన తప్పా??! ఇది గాకపోతే మరో మోక్ష మార్గం వెతుక్కోవాలిగానీ….అంటూ ఒక ‘ఇల్లాలాత్మ’ ఆత్మ బాధపడడం వినవచ్చింది లీలాత్మకి..
అందుకే పుణ్యానికి పరిధులూ, మంచికి మెజర్మెంట్లూ సవరించాలని చెప్పి పరమాత్మకి పితూరీ ఇవ్వాలని నిర్ణయించారు ఆ గుంపు పుణ్యవతాత్మలంతా చేరి.
లీలాత్మకి ఎటుచూసినా శాంతే శాంతిగా ఉన్న ఆ లోకంలో ఏంచేయాలో తెలిక ‘మాలోకంలాగా’ కాసేపు గింగిరాలు తిరగ్గానే తన భార్య గుడ్డలు ‘పిడచటం’ మూలంగా ప్రాప్తించిన ఆ స్వర్గం తనకు ఏమంత ఆనందాన్నివలేదని ,తన కింకా సాంసారిక, ప్రాపంచిక, ఆఫీసాత్మక, వినోదాత్మక ,వాట్సాపాత్మక, టిక్ టాకీ విషయాలపై మక్కువ తీరలేదనీ, ఆ వేదాంతపు వయసుకి, మోక్షాభిలాషకీ బాగా టైం ఉందనీ గట్టిగా అనిపించింది.
శాంతి, ఆనందాలతో కొంతకాలం సావాసం అయాకెపుడో ఒకనాడు ఈ పవిత్రాత్మలన్నీ కొన్ని, కొన్నిగా పరమాత్మలో ఐక్యం అవుతాయనీ ‘పక్కాత్మ’ వివరించగా తెలిసింది మన లీలాత్మకి.
కష్టం ఉంటేనే సుఖం సుఖమనీ, దుఃఖం ఉంటేనే ఆనందం ఆనందమనీ గట్టిగా నమ్ముతాడు లీలామృతం. అందుకే తనకి తన పుణ్యం రద్దు చేసుకునైనా సరే ఇల్లు చేరుకోవాలనుంది. ఇలా అర్థంతరపు చావుతో ముడిపెట్టిన పుణ్యం తనకొద్దులెమ్మనీ తనను తిరిగి పంపేయమనీ అభ్యర్థిద్దామని ‘పరమాత్మ ఏరీ అగుపించరేం’ అని తన ‘తోడాత్మ’ నడిగింది లీలాత్మ.
పరమాత్మని అంత వెంటనే చూడ్డం కుదరదనీ, నువు ఇపుడే ఒచ్చిన లేతాత్మవు గావున కొంత సమయం ఆగాలనీ, ఆయన్ని చూసాక ఇక నీ ఆత్మే ఉండదనీ చెపుతూ ‘అరుగో తమ కుటుంబపాశాలను పూర్తిగా వదిలించుకున్న ఆ పవిత్రాత్మలన్నీ పరమాత్మలో ఐక్యం అవటానికి క్వాలిఫై అయి గుంపుగా వేగంగా పోతున్నాయి చూడ’నీ చూపించిందా ‘తోడాత్మ’.
విముక్తులయేందుకు వెళ్ళేవాళ్ళు తక్కువా, నరలోక పాశాలను వదుల్చుకోలేక తనతో పాటూ గింగిరాలు కొట్టేవాళ్ళెక్కువాగా గుర్తించిన లీలాత్మ “ఇలా ఏ పనీలేకుండా శాంతిలో పడి ఈదుతున్న ఆత్మలని భూలోకంలో చిన్నారులపై, ఆడాళ్ళపై, నిస్సహాయులపై జరిగే అరాచకాలను ముందుగానే పసిగట్టి, దుర్మార్గులను ఆపి, నిస్సహాయులను రక్షించేందుకు వాడొచ్చు కదా ! ఖాళీ టైంలలో తమ ఇళ్ళ చుట్టూ కాసేపు తచ్చాడుకుని మరీ రావొచ్చును ” అనిపించి ఆ ప్రపోజల్ ని పరమాత్మలో ఐక్యం అయేందుకు పోతున్న ఒక సీనియర్ ‘విముక్తాత్మ’కు చెప్పి పంపింది లీలాత్మ.
లీలామృతం అసలే ఆఫీస్లో ఎవర్ని ఎలా వాడాలో బాగా తెలిసిన టీం లీడరాయె.
దాంతో పరమాత్మ ఈ స్వర్గ సంస్కరణలు సూచించిన వ్యక్తెవరా యని ఎంక్వయిరీ చేయగా పుణ్య పంపకాల్లో జరిగిన పొరపాటువల్ల తీసుకురాబడ్డాడని తెలిసింది. పరమాత్మ ఆజ్ఞ్నతో దూతలు “ఓన్లీ భర్తల అంగోస్త్రం ‘పిడిచిన’ మహిళలకే తప్ప భార్యకు పొరపాటున సేవ చేసిన భర్తలకి ఈ పుణ్యం వర్తించదనీ, బహుశా పేరువల్లనో మరి దేనివల్లనో జరిగిన ఈ పొరపాటుకు స్వర్గంలో చింతించటం నిషిద్ధం గనుక తిరిగి వదిలేయబోతున్నందుకు ఆనందిస్తున్నామనీ చెప్పి పొద్దు వాలేముందు వాకిట్లో పాడె మీదున్న లీలామృతం శరీరానికి అతని ‘జీవాత్మ’ నొప్పజెప్పి తిరిగి షార్టుకట్లో సొరంగమార్గాన స్వర్గానికి చక్కాపోయారు.
అసలు ఈ లొల్లి కంతటికీ కారణం ‘పుణ్యాల నాణ్యత – పంపిణీల’ సెక్షన్లో కొత్తగా పనిలో చేరిన పురుషుల పక్షాన పురిషిజం పాటించే ఫలానావాడు అయుంటాడనీ జాయింట్ దూతలు రాజముద్రా,తుంగభద్రా దారిలో తర్కించుకుని, ఆపై అనుమానించుకున్నారు కూడా.
పాడె లేచే సమయానికి హాయిగా లేచి కూర్చున్న లీలామృతాన్ని చూసి ఝడుసుకున్నోళ్ళు అరుచు కుంటూ పోగా, అప్పటిదాకా ” మొన్నే కదయ్యా..జొమోటోలో ఆర్డరు పెడతా పరోటా తినెళ్ళమన్నావ్..ఇంతలోనే పాడెక్కి మమ్మల్నొదిలి వెళ్ళిపోతున్నావా బాబయ్యా ??” అని శోకాలెట్టిన దగ్గరోళ్ళంతా ‘బాబోయ్ ఇదేంటి..ఈడు లేచొచ్చేస్తన్నాడురోయ్’ బతికుంటే మిల్లెట్స్ అయినా తినొచ్చు.. లగెత్తండ్రో..అంటూ దూరంగా పారిపొయ్యారు.
భార్యా పిల్లలూ మాత్రం ఆనందంగా లీలామృతాన్ని లేవదీసి, తడిబట్టలు మార్చి, పెరట్లో వాలుకుర్చీలో కూర్చోబెట్టి చాలా సేపు కాళ్ళూ చేతులు, రుద్దుతూ.. పడుతూ…. ఆనందపడ్డారు.
ఆనక భార్య లేచి తడిబట్టలు పిండేందుకు బకెట్టు ముందు కూర్చోవటం చూసిన లీలామృతం పెద్దగా ఓ వెర్రి కేక పెట్టి, ఒక్కగెంతున పోయి
“ఒద్దే…ఒద్దు…’ఇది’ మాత్రం నేనే పిండుకుంటా..జీవితాంతం పిండుకుంటా…ఓపిక లేకపోయినా పిండుకుంటా . మరీ చాతకాకపోతే పి.ఎఫ్.లోను తీసి మరీ ‘ఇవి’ బొచ్చెడు కొనుంచుకుంటా..నువు ముట్టుకోకే. అస్సలు ముట్టుకోక. లే ” అంటూ భార్యకి అడ్డం పడ్డాడు ఒణికిపోతూ..తూలిపోతూ…
ఆమె భర్తని ఓ మారు వింతగా చూసి లోకం కాని లోకాలు చూసొచ్చినాక ఆమాత్రం ‘మాలోకంగా’ మాట్టాడతాడ్లే అనుకుని, కాదనకుండా కదిలి, కందిపప్పు మెదుపుకోవటానికెళిపోయింది.
“ఒళ్ళు దగ్గరెట్టుకు స్నానం చేయాలి నాయనోయ్..వామ్మో తన ఇల్లాలు ‘మోక్షం’ఎక్కౌంట్లో గానీ పైకి పోతే తను బుక్కైపోవటం ఖాయం . ఇంకానయం ఏం కళనుందో తర్కించకుండా ఒప్పేసుకు తప్పుకుంది కాబట్టి బ్రతికిపోయాను” అని ఊపిరి పిల్చుకున్నాడు ఒకేరోజు రెండు సార్లు బ్రతికిపోయిన ‘స్వర్గం రిటర్న్డ్’ మన లీలామృతం.
***
Add comment