లేడీస్ టాయ్లెట్లో…

అనువాదం: అవినేని భాస్కర్

లేడీస్ టాయ్లెట్లో ఏం జరుగుతుంది?

పబ్బుల్లోని టాయ్లెట్లలో జంటలు ముద్దులు పెట్టుకుంటుంటారు, కౌగిలించుకుంటారు, మందు మత్తులో దుస్తులు తొలగించుకుని ఇంకా గాఢంగా పరస్పరం ప్రేమను పంచుకుంటూంటారు… అని చెప్పుకోవడం విని ఉంటారు. ఒకప్పుడు టాయ్లెట్ లోపలికి దూరామంటే, ఇక్కడ బాంబే సర్కస్ ప్రాక్టీస్ జరుగుతోందా అని ఆశ్చర్యపోయే అవకాశాలుండేవి. వాళ్ళు కూల్ గా సారీ చెప్పేసి సర్కస్ ని కంటిన్యూ చేసేవారు.

ఇప్పుడలాంటివి జరగట్లేదు. టాయ్లెట్లలో టైట్ సెక్యూరిటీ వేసేశారు. టాయ్లెట్ సెక్యూరిటీని దాటుకుని లోపలకి వెళ్ళామంటే ఇద్దరు పనివాళ్ళు వినయంగా నిల్చుని ఉంటారు. కరెక్టుగా మనం జిప్ ఓపెన్ చేసేప్పుడు సెల్యూట్ చేస్తారు. ఎవరికి సెల్యూట్ చేస్తున్నారా అని మనం సందిగ్ధంలో పడిపోతాము. సెల్యూట్ ని స్వీకరించి పని ముగించుకుని జిప్ వేసుకోగానే, సీమంతానికి వచ్చిన పేరంటాండ్లకి బ్లౌజూ ముక్క, ఆకు-వక్క, పసుపు-కుంకుమ ఇచ్చినట్టు ఎంతో భక్తిగా టిష్యూ పేపర్ అందిస్తారు. వాళ్ళని చూడ్టానికే జాలేస్తుంటుంది. మామూలుగా వీళ్ళకెవరూ టిప్స్ ఇవ్వరు.

వాంతులు, విరేచనాలు అంటూ ఆకస్మికంగా ప్రమాదాలు కలిగించే సందర్భాలలో గలీజైపోయే టాయ్లెట్లను శుభ్రపరచడం వీరి బాధ్యతే. పబ్ అంటే ఆటలు, పాటలు, చాటు మాటు సరసాలు అన్న రసవత్తరమైన మనో స్థితిలో చదువుతున్న పాఠకులకు మానసికంగా క్షమాపణ చెప్పుకుంటూ రసహీనమైన ఒక మేటర్ చెప్పేస్తున్నాను. మామూలు టాయ్లెట్లకంటే పబ్బుల్లో టాయ్లెట్లు భయంకరంగా కంపు కొడుతుంటాయి. మందు కొట్టి మలమూత్ర విసర్జన చేస్తే మామూలు కంటే కంపెక్కువగా ఉంటుంది. మత్తులో ఉండటం మూలాన కస్టమర్లకు అది అసలు తెలీదు. శుభ్రపరిచేవారికే కష్టాలు. టాయ్లెట్లోపలే ఏడెనిమిది గంటలు నిల్చుని ఉండే వారి పరిస్థితి బహు బాధాకరం.

రాత్రి పన్నెండు గంటలకు పైన లేడీస్ టాయ్లెట్‌లో దూరి చూస్తే విచిత్రంగా ఉంటుంది. కొందరు అమ్మాయిలు కింద పడి నిద్ర పోతుంటారు. కొందరు అమ్మాయిలేమో తలమీద చేతులు పెట్టుకుని ఒకే పొజిషన్ లో నిల్చుని ఉంటారు. ఇదంతా నాకెలా తెలుసు అనడుగుతారా? అదంతా వృత్తి రహస్యం అని పొల్లు మాటలు చెప్పను. ఒక సారి చెన్నై పబ్బలో లేడీస్ టాయ్లెట్ దగ్గర ఓ అక్కయ్య నిల్చుని ఉన్నారు. ఆమె అక్కడ పని చేస్తారు. ఆమెతో మాటలు కలిపాను. ఆ పబ్బు ఉన్న బిల్డింగ్ బేస్మెంట్లోనే ఆమె కుటుంబం ఉంటున్నట్టు చెప్పారు. నేను రాసేవాడినని తెలియగానే మరిన్ని విషయాలు పంచుకున్నారు.

ఇలాక్కూడా జరుగుతుందా? అని నేను అమాయకంగా అడగ్గానే రెండు సెకన్లు టాయ్లెట్ తలుపు తీసి చూపించారు. భయపడకండి. లేడీస్ టాయ్లెట్ నిర్మాణం వేరేలా ఉంటుంది. మేకప్, టచప్ చేసుకోడానికంటూ ఓ ఏరియా ఉంటుంది, దాని అవతల మలుపు తిరిగాకే తలుపులున్న టాయ్లెట్లుంటాయి. ఆ అక్కయ్య తెరచి చూపించినది, మేకప్, టచప్ చేసుకునే ముందు భాగాన్నే. ఆ అక్కయ్య ఒక కథకు సరిపోయేన్ని విషయాలు చెప్పారు. క్లుప్తంగా, ‘ఈ రోజుల్లో అమ్మాయిలూ బాగా సంపాయిస్తున్నారు. సంతోషమే. అయితే ఎందుకు ఇలా పాడైపోతున్నారో అర్థం కావట్లేదు’ అని అన్నారు. ‘తాగుడు గురించా…?‘ అనడిగాను. ‘కాదు, ఎవరితోనో వస్తారు, మత్తులో మరొకడెవడో తీసుకెళ్ళి పోతుంటాడు… నాకు బాగా తెలుసు. అయినా అడగలేము. అడిగితే తిడుతారు… ఈ ఉద్యోగం పోతుంది.’ అన్నారు. ఆ అక్క ఆమె భాషలో చెప్పిదాని సారాంశం ఏంటంటే, ‘ఎవరూ పట్టించుకోకుండా తాగి మత్తులో పడిపోయున్నఅమ్మాయిల్ని ఏం చెయ్యాలి అన్నదానిగురించి ఎటువంటి విశదమైన మేనేజ్మెంట్ కాన్సెప్ట్ లేదు. పబ్బు రూల్సో, గైడ్‌లైన్సో, పద్ధతులో ఏమీ లేవు. ఎవడు కావాలన్నా భుజానేసుకుని తీసుకెళ్ళి పోవచ్చు. పబ్బు వాళ్ళు ప్రశ్నించలేరు!’

రాత్రి పన్నెండు దాటాక కొన్ని పబ్బుల్లో ఆడవారి టాయ్లెట్ పబ్లిక్ టాయ్లెట్ అయిపోతుంది! మెయిన్ డోర్ ఓపెన్ గా ఉంటుంది. చాలా మామూలుగా మగవాళ్ళు మేకప్, టచప్ ఏరియా దాక వెళ్తారు. అలాంటొక సందర్భంలో నేను చూసిన దృశ్యాలు ఇలా ఉన్నాయి.

ఓ అమ్మాయి టాప్ తొలగిపోయి పడుంది. బట్టలంతా వాంతి. తన చేతులతోనే తన గొంతు నులిమేసుకొంటోంది. ‘అసహ్యంగా ఉంది, గలీజు చేసేశాను. చచ్చిపోవాలనుంది నాకు. నే చచ్చిపోతాను…’ అని కలవరిస్తోంది. ఆమె బాయ్ ఫ్రెండ్, చిరాగ్గా ‘అవన్నీ తర్వాత చూసుకుందాం(!)’ అని చెప్తూ ఆమెను లేపి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ కూడా ఆ బాయ్ ఫ్రెండ్ చేతిలో మందు గ్లాసు, మండుతోన్న సిగరెట్టు పట్టుకుని ఉన్నాడు. ఆ అమ్మాయి ఇప్పుడల్లా లేవదని గ్రహించి మళ్ళీ పబ్బులోపలికి వచ్చేశాడు. ఆ అమ్మాయి మళ్ళీ తన గొంతుని నులుముకోవడం మొదలెట్టింది. ఆమె మందు మత్తులో ఉండటంతో చేతుల్లో బలంలేదు; ఆమెకు గొంతెక్కడుందో కూడా తెలీక మరో చోట నొక్కేసుకుంటోంది.

అమ్మాయిలు ఒంటరిగా పబ్బుకు రారు అని చెప్పాను కదా? జంటగానో, స్నేహితురాండ్లతోనో వస్తారు అని కదా చెప్పాను. అలాంటప్పుడు ఓ అమ్మాయి ఎవరూ పట్టించుకోకుండా ఇలా ఎలా ఒంటరిగా పడుంటుంది? అదే విడ్డూరం. సమయం రాత్రి ఒంటి గంట దాటాక, ఫుల్ స్పీడ్‌లో మోగే సంగీతం కొంచం సన్నగిల్లుతుంది. మందు మత్తు చాలని వాళ్ళు, పొట్ట ఖాళీ అయిందనిపించేవాళ్ళు తిరిగి గ్లాసులనూ పొట్టలనూ నింపుకోడానికి ఇదో చిన్న విరామం.

ఈ విరామం గడిచాక మరో రౌండ్ మ్యూజిక్ పై స్థాయికి చేరుకుంటుంది. దయ్యాల్లాగా ఊగిపోతారు. ఇప్పుడు జంటలుగా వచ్చినవాళ్ళు విడిపోతుంటారు. స్నేహితురాండ్లు తప్పిపోతుంటారు. అంకుల్సు మరియూ అమ్మాయల కోసం వచ్చిన ఒంటికాయ శొంఠికొమ్ములూ ఇప్పుడు హుషారుగా లేస్తారు. ఆటేమో రక్తి కట్టి పీక్ కి చేరిపోయి ఉంటుంది!

(రౌండప్ కొనసాగుతుంది)

 

మూలం: ‘కుంకుమమ్’ అనే అరవ వార పత్రకలో సీరీస్ గా వస్తున్న వ్యాసం. తేదీ: 09 ఆగస్ట్ 2019.

అరాత్తు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు