పడేవోల్లు

“ఉష్షు, పానీలేవే, ఆడపడుసంటే అడిలి సచ్చుద్ది. ఆవె నోరుకెవ్వుడూ అడ్డుపల్లేడు! ఇలాగైనా కాత్త కోపం‌ తీరుద్ది మనిసికి.” అన్నా నేనూ ముకంలో నవ్వుబెట్టుకోని.

టీ కప్పు పైకెత్తి గట్టిగా పీలుస్తూ తాగాను.

మెల్లగా దాన్ని మళ్లీ సాసర్లో పెడుతూ “ఇంకేంటే అయితే పెళ్లి విశేషాలు? నగలేం బెట్టారు వాళ్ళు? నాక్కుదర్లా రావడం. ఊర్లో గుడి పన్లూ, కళ్యాణం…నీకు తెలుసుగా…” అన్నా.

“ఊళ్ళో పన్లు ఎప్పుడూ ఉండేవేగా ఒదినా! మాకా ఒక్కగానొక్క పిల్ల. మళ్లీ మళ్లీ చేసేది గాదుగా.” అంది సత్యవతి నొచ్చుకుంటూ.

“అయితే ఏంటే, కావాలనే ఎగ్గొట్టానంటావా! మీరు చెయ్యాల్సిన పన్లన్నీ ఊళ్ళో నేను తలకెత్తుకుని చేస్తుంటే…” గొంతు పెంచాను.

“ఏమో, ఎవరికి తెలుసు. నీకేమో నేనంటే అసయ్యం. మీ తమ్ముడేం మాట్టాడ్డు. మా పిల్లకేమో అదేంటో అత్తంటే తెగ ప్రేమ!” సత్యవతీ పెంచింది గొంతు.

సత్వవతి ధైర్యానికి నాకాశ్చర్యమేసింది. ఏవైంది దీనికి?

“నాకెవ్వరి మీదా కోపాల్లేవమ్మా. లేతే మీ ఇంటి దాకా ఎందుకొస్తాను! ఉంటే గింటే మీకే ఉండాలి.” అన్నా.

“లేవా, నిజంగా కోపాల్లేవా? ఊరికొచ్చిన తమ్ముడికి కనీసం అన్నం కూడా పెట్టకుండా వెనక్కి పంపించడం, దేవుడి కళ్యాణాలకి వరసకైనా మమ్మల్ని పిలవకపోడం, మా ఇంటి శుభకార్యాలకి ఏదో సాకు చెప్పి ఎగ్గొట్టడం…నాకన్నీ తెల్సులే ఒదినా!”

“ఏం తెల్సే? అన్నీ ఊరికే మనసులో పెట్టేసుకుని… ఏం లేదు.‌ నాకందరూ ఒక్కటే!”

“ఏంటి ఒక్కటి? ఎవరు ఒక్కటి? ఊర్లో కౌలుదార్లకిచ్చిన మర్యాదకూడా నా మొగుడికివ్వట్లా నువ్వు. ఆ రెండెకరాల చెక్క బలవంతంగా అమ్మించామనేగా.”

“ఊ అను అను… అసలు నిన్ను కాదే, నా తమ్ముణ్ణనాలి. నేన్జెప్పిన సంబంధాలన్నీ పక్కనబెట్టి, విజయవాడెళ్లి మరీ మీ సంబంధం చేస్కోనొచ్చాడు చూడూ…నువ్వొచ్చిన…”

హఠాత్తుగా పైకి లేచింది సత్వవతి
“నోర్ముయ్, ముదనష్టపుదానా! ఎప్పుడు చూడు నా మీదే నీ కళ్ళు. ముప్పై ఏళ్ళు దాటినా అదే పట్టుకుని…”

మౌనంగా ఉన్నా. నా మొహంలో భయం అలుముకుంది.

“అసలు నువ్వు పోతే గానీ…మాకు ప్రశాంతతుండదు!” అనేసిందది చివరికి.

నా కళ్లల్లో నీళ్ళు గిర్రున తిరుగుతున్నాయ్.

తల వంచి హాఠాత్తుగా ఫోన్లో టైం చూస్కున్నా. గంట దాటేసింది.

తలెత్తి “ఎల్లాలమ్మా ఇంక!” అన్నా కల్లు తుడుసుకుంటా.

“అప్పుడేనా…” అంది సత్తెవతమ్మ బాదగా‌.

“యాడికి బోతా, మల్లొత్తాలే. నీగ్గూడ ఆయనొత్తాడుగా షాపు నుండి.” అన్నా పైకిలేస్తా.

నీరసంగా లేసి, లోనికెల్లి ఐదొందలు తెచ్చి‌ నా సేతికిచ్చింది.

“ఇట్నే కూతురేసం గావాలంటే సెప్పు, మా రవణమ్మ సేసుద్ది. నీ కన్నా సరే, ఈ‌ లైన్లో ఎవురికన్నా సరే.”

“రవణమ్మ చేస్తుందా ఇవన్నీ?”

“ఎందుకు సెయ్యదమ్మా. బలేదానివే.” అన్నా ఆ బైటగది దాటేస్తా.

ఏవో, సేస్తదో లేదో ఆ మాదచ్చెప్ ముండ!

========================

గేటు తీసి బైటికొత్తంటే సిన్ని బైట్నే మెట్లమీద కూసోనుంది.

“ఏందే ఎప్పుడొచ్చా!”

“పావుగంటైందిలే, నువ్వీడే ఉంటావ్ లే కల్సిపోదావనీ…” అంది నవ్వుతా.

అందంగ నవ్వుద్ది సిన్ని.

“ఎందత్తా, అరికాలి మీద లేత్తంది సత్తెవతమ్మ.” అంది రోడ్డు మీద నడుత్తా.

“ఉష్షు, పానీలేవే, ఆడపడుసంటే అడిలి సచ్చుద్ది. ఆవె నోరుకెవ్వుడూ అడ్డుపల్లేడు! ఇలాగైనా కాత్త కోపం‌ తీరుద్ది మనిసికి.” అన్నా నేనూ ముకంలో నవ్వుబెట్టుకోని.

“అంత బా ఎట్టజేత్తావత్తా? బాపనోల్లల్లా, కోవటోల్లల్లా…అచ్చం ఆల్లలాగే?!”

“హుమ్…నాయన బెట్టిన ఇద్యే. నువ్వేం తక్కువగాదులే పా.”

“ఏం గాదు, ఈ ఇద్యలో నిన్నుగొట్టేవోడే లేడత్తా.”

“ఆ… ఇంగ మన్లో మనవే పొగుడుకోవాల.”

“సూస్కో, ఈ సిన్ని గూడా నీ అంతదైద్ది. రత్నం తర్వాత సిన్నే అనాల కస్టమర్లు.”

సిన్ని ఏది మాటాడినా బావుంటది నాకు. ఆ కల్లూ, నలుపూ గోదుం రంగు కల్సిన జుట్టూ, పెద్ద బుగ్గలూ…సూట్టానికెంత బావుంటదో పిల్ల.

“ఏందే, అట్ట సూత్తన్నా, నీక్కొడుకుంటే నన్నాడికిచ్చి సేసేదానివే గదా?!” అందది ఆటపట్టిత్తా.

“అమ్మనీ! ఆ సీతమ్మ ఆకిట్లో సినెమాలో పిల్లలా అన్నీ ముందే తెలుత్తాయే నీకు.”

పట్టుమని పదారేల్లుండవా పిల్లకి. నాకైతే కోడలు గాదు, కూతురిగానే సేస్కోవాలనుందసల!

“బేరాలేవన్న సేసావా పొద్దున్నించి?” అడిగా.

“ఆ…ఆ పిండిమిసనామె పిలిత్తే పోయాలే.”

“అబ్బా ఆవె పెద్ద కాతా మనిసే. ఓ సారిచ్చుద్ది, రెండు సార్లు కాతా బెట్టిద్ది.”

“ప్చ్, లేదులే లెక్క రాసిందంట. ఇస్తదిలే.”

“ఏ‌‌‌ ఏ‌సం ఏసావే?”

“సిన్నదే, ఆవెకీ పక్కింటావెకీ పడట్లేదంట. ఆ కోపవంతా నా మీద తీర్సుకుంది. పాపం.” అందది.

“పాపం ఏవుందిలేబ్బా. ఆల్లూ, ఆల్లూ బానే‌ ఉంటారు మల్లా.”‌ అన్నా.

“ఆల్లేంత గొడవ బడితే, మనకంత మంచిదిగదత్తా!” అందది మల్లా నవ్వుతా.

టక్కన మొట్టికాయ పడింది దాన్నెత్తి మీన.

========================

ఇద్దరం కల్సి టీవీ రిపేరు సురేషు ఇంటికి బోయాం.

గేటు కాడే నిలబడి అరిసా

“అమ్మా, అమ్మా, పడేవోల్లం వొచ్చావమ్మా!”

లోపల సెక్క తలుపేసుంది. ఎవురూ పలకలా.

“పడేవోల్లవమ్మా!’ అంది సిన్ని, గేటు తలుపు టకటకా కొడతా.

పలుకు లేదు.

“ఆడపడుసూ, తోడికోడలూ, కూతురూ, కోడలూ, ఒదినా, అత్తా…” ఏవైనా సేత్తావమ్మా!

తలుపు గబాల్న తెరుసుకుంది.

“ఓ సారి పలక్కపోతే, ఎళ్ళాలి గానీ, ఏంటే ఈ గొడవ…వద్దులే పో!” అంది వర్దనమ్మ కోపంగా.

“మూడు నెల్లు దాటిపోయిందమ్మా నువ్వు పిల్సి…” అన్నా నీరసంగా.

“మల్లా పిలుస్తాలే…ఎల్లండెల్లండి.” అంటా దడేల్న తలుపేసుకుంది.

పక్కీదిలో, నేతికొట్టు సాంబయ్య ఇంటికెల్లాం. “అమ్మా, పడేవోల్లవమ్మా!”

సాంబయ్య పెల్లాం అడావిడిగా బైటికొచ్చి “అరవబాకండే ఊరికే, మా తోడికోడలింటోనే ఉంది. తెనాలి నుండి దిగింది పొద్దున్నే!” అంది.

“పొద్దున్నించి బేరాల్లేవు మేడం…” నసిగింది సిన్ని.

“రెండ్రోజుల్లో పిలుస్తాలే…పోండి…దానికసలే తిక్క, ఈ యవ్వారలన్నీ తెలవ్వు.” అంది సెకసెకా లోపలికి బోతా.

మెట్టు దిగాం. మెట్టెక్కాం. లాబం లేదు.

“ఇయాలెందుకో బాలేదత్తా, ఇంటికి పోదాం పా!” అంది సిన్ని సెయ్యి పట్టుకుని నడిపిస్తా.

మెల్లగా మా పేట కాడికి పోతన్నాం గానీ, ఆ మలుపు తిరిగే టయానికి టక్కని ఆగిపోయా ఒకింటికాడ.

బీరువాల మంగపతిల్లు.

“అత్తా, ఒద్దత్తా! నీకు దన్నం పెడతా, ఈ ఇల్లొద్దు. ఆ మాతల్లొద్దు. పోదాం పా!” బతిమిలాడిందది.

“పోదాంలేవే, ఓసారడిగి పోదాం.” అన్నా ఆసెగా.

“ఆవెతో ఐన గొడవలు సాలవా ఏంది నీకు?” అందది‌.

మంగపతి బార్య పారవతమ్మ దగ్గర పదేల్లు పనిసేసుంటా నేను. సాకలిగా సేసా, పాసి పని సేసా. తర్వాతీ బిసినెస్ పెట్టాక, వారానికోపాలి వొచ్చిపోయేదాన్ని. ఆల్ల సుట్టాలూ, ఇంటో జనాలూ అందరూ బాగా తెల్సు నాకు. నేనే సనువు బాగా ఇచ్చానేమో, సెయ్యి సేస్కోడం దాకా బోయింది ఆర్నెల్ల కితం. ఆవె రెండేత్తే, నేనొకటేసా! ఏసంలో ఉన్నప్పుడంతే. నన్ను నేను మర్సిపోతా.

“సూద్దాం, ఆర్నెల్లు దాటిందిగా. ఏవంటదో.”

“అబ్బా ఒద్దత్తా…” నసుగుతూనే ఒచ్చిందది ఎనక.

“అమ్మా, అమ్మా, సాకలి రత్నాన్ని…” అరిసా గేటు కొడతా.

ఇంటి పక్క సందు నుండి అంట్ల గిన్నెలు టకటకలాడతన్నయ్.

మెల్లంగ తలుపు తెరిసి బైటికొచ్చింది పారవతమ్మ. నల్లటి ముకంపై మెరిసిపోయే ముక్కుపుడకా, పెద్ద స్టికర్ బొట్టూ పెట్టుకుంటది. ఆవంటే అసయ్యం నాకు. కానీ అయన్నీ మనసులో బెట్టుకుంటే, బిజినెస్సెట్టా జేసేది?

“ఏంటే ఇటువైపొచ్చా, తమరికి చాలా ఇళ్లున్నయ్ గామ్మా?” అందావె ఎటకారంగా.

సిన్ని సెయ్యి లాగుతా ఉంది పక్కనే.

“పాతయన్నీ పెద్ద మనసుతో వదిలెయ్యాల నువ్వు. ఎన్నేల్లు సేసా నీ ఇంటో.” అండా.

“అయినా ఇప్పుడేం పన్లేదులే నీతో. వెళ్ళెళ్ళు.”

“కాదు, నీ కోడలు ఆ దేసం నుండి వచ్చెల్లినట్టుంది పోయిన్నెల? సూడు మరి…”

ఎంటనే ఆమె ముకం మారిపోయింది.

“అవునే, కావాలి. నా కోడలు వయస్సుది కావాలి. అయినా నీకివ్వను. రాజ్యం…రాజ్యం…!” అరిసింది.

బైపడతా బైపడతా వచ్చిందావె పనిమనిసి రాజ్యం. సీపురు సేతిలో పట్టుకుని. ముప్పై ఏల్లుంటాయ్ ఒంటి మీద కానీ ఒట్టి పిరికి ముండ.

“ఇది చేస్తానందే నాకు, ఇది పడతానంది. నువ్వక్కర్లా, నీ సంతా అక్కర్లా!” అందావె తెగేస్తా.

నేను మాటాడేలోపే ఎత్తుకుంది సిన్ని “దొంగ ముండా! నిన్నీడ పన్లోబెట్టింది అత్తే గదే, దానికే ఎసరెడతావా, పాపిట్టిదానా.”

“ఏవే, ఏందే రాజ్యం ఇది? పేటలో సాకళ్లూ, పనిమనుసులూ, పడేపని సెయ్యగూడదని రూలు బెట్టుకున్నాంగా. మరేంది?” అండా నేనూ గదమాయిస్తా.

“ఏందత్తా దాంతో మాటలూ, పెతొక్కతీ పడేదైతే, ఇంగ మేమెందుకీడ! పేటకొస్తదిగా, ఆడ తేలుద్దాం దీనెవ్వారం.” అరిసింది సిన్ని.

రాజ్యం ఒణికిపోతా ఉంది ఆ మూల. సీపిరి కింద పడేసి “అమ్మా, నేన్జెయ్యన్లేమ్మా. రత్నం అత్తనెదిరించి నా వల్లగాదిదంతా.” అంటా లోనికిబోయింది.

“నూ సేద్దావనుకున్నా, అంత సీన్ లేదులే నీకు…” అంది సిన్ని ఎకసెకంగా.

“మా ఇంటికొచ్చి నా ముందే బెదిరిస్తన్నారేంటే! అది కాకపోతే ఇంకోకటి.” అంది పారవతమ్మ.
“ఏమ్మా, ఎవురో ఒచ్చినా మా అంత బా సెయ్యలేరనీ, నీకు తెలవదామ్మా.” అన్నా నేను జాలిగా మొహం‌ పెడతా…

“హుమ్…నాకు తొందరగా కావాలే. ఎవర్నో ఒకర్ని పంపు. నువ్వు మాత్రం ఒద్దు.” అందావె కరాకండీగా.

ఎవురో ఒకల్లు మాట పడితే గానీ, ఆవెకి సుకంగా నిద్రపట్టదు.

“దీన్ని పంపు, ఏవే సిన్నీ, నువ్వు చెయ్ ఒచ్చి నాకు…”

నేను టక్కన సిన్నీని ఎనక్కి లాగి “ఇది గాదులేమ్మా, మా రవణమ్మని బంపుతా, నీ కోడలి వయిసే దాన్ది గూడా”. అన్నా.

సిన్నీ నా ఏపు ఆచ్చెర్యంగా సూసింది. గావాలంటే అది సానా తేలిగ్గా ఏసిద్దా యాసం.

“సర్లే, రేపటికల్లా పంపు నీ కూతుర్ని.” అంటా లోనికి బోయింది పారవతమ్మ.

========================

“నూ పల్లేవు లేయే ఆవెతో.” అన్నా పేటకెల్లే దార్లో సిన్నితో. సిన్నీ తిరిగేం మాటాడలా.

ఇంటికాడి కొచ్చేతలికి, ఐదారుగురు మా గ్రూపోల్లు వచ్చేసుండారు బైట. సిన్ని గూడ ఆల్లల్లో పోయి నిలబడింది.

“అత్తా, అత్తా…” అంటా వాల్లు, “ఏమ్మాయ్, ఏవయ్యా…” అంటా నేను.

అట్టనే సరాసరి ఇంటోకి బోయి, లెక్క రాసే పట్టీ బుక్కు దెచ్చి మెట్ల మీన కూసుండా.

“మీరంతా కల్యానపురి కాలనీకే బోతన్నారుగా?” అడిగా. అవునండారు. నా కాడ పది గ్రూపులుండాయ్. ఒక్కో గ్రూపూ ఒక్కో కాలనీకి బోతారు.

చొప్పర్ల సునీతొచ్చింది ముందట. “అత్తా, పోయినోరం అంతా కార్పరేటర్ నాగరాజింటికి బోయా. ఆల్లు కొంతే ఇచ్చి మల్లా రమ్మన్నారు. ఇద్దో.” అంటా రెండు వేలు నా సేతిలో బెట్టింది.

సునీత నాకంటే సిన్నది. మంచి రంగు. పెద్దోల్ల ఇల్లల్లో యాసాలకి దాన్నే బంపుతా నేను. ఆల్ల సీరగట్టి, జడేత్తే పోల్సుకోలేరెవ్వురూ.

“వారం అంతా బోతే, ఇంతేనామ్మాయ్ ఆల్లిచ్చిందీ? నూ గట్టిగడగాలగా.” అన్నా.

అది జుట్టు బరుక్కుంటా “నువ్వే అడగాలత్తా, ఆవెతో ఎక్కుతక్కులు మాట్టాడతానేవోనని నాకు బయ్యం.” అందది.

“ఏయ్యా బాబ్జాన్, ఎంతొచ్చింది పోయినోరం?”

బాబ్జాన్ లెక్క సూత్తే, పెతివోరం మూణ్ణించి నాలుగేల దాకా తెత్తన్నాడు. ఆడి ముకం, మాటా, యాక్టింగూ, అంతా బావుంటది గానీ, మా కాలనీల్లో మెయిన్ కాతాల్లో ఆణ్ణి పెట్టలేను. అందరికీ ఇట్టవుండదు.

“మూడు వేలు వచ్చింది అత్తా!”

“ఆ…నీ పిల్లను జేస్కున్నట్టే పిలుత్తున్నాడు జూడత్తా!” అంది గోరంట్ల కుమారి.

అందరం పుసుక్కున నవ్వాం. బాబ్జాన్ మెలికల్దిరిగిబోయాడు.

అటాత్తుగా నా కూతురు రవణమ్మ వస్తా కనపడింది ఇంటేపు. అందరూ గమ్ముగైపోయ్యాం. నేనేదో లెక్కలేత్తన్నట్టు బుక్కేపే సూత్తన్నా. పళ్ళు నూరతా పోయిందది లోనికి.

“అకా! కస్టమర్ల కాడ కూతుల్లేసాలకీ, కోడల్లేసాలకీ సానా గిరాకీ ఉందకా. నా కూతుర్ని దింపేదా పన్లోకి?” అంది కొండూరు సువర్న ముందుకొస్తా. మోన్నీమద్యే మతం తీసుకుందది.

“అవునత్తా, నన్నూ అడిగారు కస్టమర్లు…”

“ఈ సిన్నినేమో, సిన్న పిల్ల అప్పుడే గాదన్నావు నువ్వు…” నసిగింది ఇంకొకత్తె.

సిన్ని నీలిగింది ఓ మూల నుండి.

“పోనీ మీ రవణమ్మనన్నా బెట్టు ముందర. ఎనకే మా పిల్లల్ని దింపుతాం. నీ తర్వాతేగా మేవు…” అంది సువర్న మల్లీ.

“సూద్దాంలే, ఇప్పటికిప్పుడంటే, ఎట్టౌతయ్ అన్నీ. టయం సూస్కుని సేద్దాం.” అన్నా.

బేరాల్లేనోల్లకి కొంత డబ్బు పంచి, అందర్నీ అంపేసా గానీ ఆ పారవతమ్మ మాట మాత్రం గుర్తొత్తానే ఉంది నాకు. రేపు తెమ్మంది రవణమ్మని. సిన్నికియ్యచ్చు ఆ పనిగానీ, టక్కన లాగేత్తదది కస్టమర్లని. పెద్ద కాతాలు దానికే బోతే, రవణమ్మ గతేంగానూ!

పాపం సిన్ని తల్లి లేని బిడ్డగదా, ఏందిట్టా ఆలోసిత్తన్నా? ఏవో, పేగే ఎక్కువేమో అన్నిటికండా.

రవణమ్మైతే దిగాల పన్లోకి.

========================

“నేను సచ్చినా దిగనే ఆ గలీజు పన్లోకి.” అంది రవణమ్మ ఇంటోకొచ్చాక.

“కాదే, కస్టమర్లు తెగ అడగతన్నారు. నువ్వట్టా నిలబడు సాలు. డబ్బులే డబ్బులు.”

“ఏందే నిలబడేది! నిలబడి తిట్టిచ్చుకోడానికా?”

“అదంతా ఉట్టి యాసవే.‌ నిన్నెవుడూ తిట్టట్లా, ఆ యాసాన్నే…” అన్నా.

“చ, చ, నీలా పోరుసం లేన్దాన్ని గాదే అట్టాంటి సెత్త‌ పన్లు సెయ్యడానికి.” అంది.

“ఏందే పోరుసం? తిండి పెట్టుద్దా, నీ పిల్లకి సదూ సెప్పుద్దా.”

“నాలుగిల్లకెల్లి నా పనులు నే సేస్కుంటా, ఎవురన్నా అనొసరంగా తిట్టారన్కో, ఆల్లింట్లో మానిపార నూకుతా, అంతే గానీ నీలా ఎదవ ముండ ముకవెట్టుకోని, తిట్టిచ్చుకోను.” గిన్నెలు డబడబలాడిస్తందది.

“ఇదో, ఈ గొప్పలకి బోయే, మొగుడ్నొదిలేసి ఈడకొచ్చి నా పీకబట్టుకున్నావు. ఓ రోజు పనికెల్తే, ఆ పక్క రెండ్రోజులెల్లవ్. ఆ నా బట్ట మీ నానేమో, ముందే పైకిబోయి ఈ కొంపంతా నా మీద బడేసాడు. దేవుడా ఎట్ట సచ్చేదీ పిల్లతో!” కూలబడ్డా నేల మీన.

“అదే మంచిదైందిలే. నువ్వు జేసేటియన్నీ జూత్తే ఇప్పుడైనా పుటుక్కున బోయేవాడు నాన.”

సర్రన కాలింది నాకు. లేసి సెయ్యెత్తబోతే, గట్టిగా నెట్టిపారనూకిందది. ఊగిపోతా పక్కన బడ్డా. కల్లెంబట బొటబొట రాల్తన్నాయ్. ముదనట్టపు కన్నీల్లు, ఇంకా యాడ మిగిలుండయ్యో!

“నీయమ్మ, తాత ఊల్లో నాటకాలేసాడంటే మన కులపోల్లకి పేరు తేవాలనే సేసాడే. నువ్వయన్నీ నేర్సుకుని, ఈడ మన పరువు తీత్తన్నావ్. పైగా నువ్వొక్కత్తివే గాకుండా, పెద్ద మూకని తయారు సేసావ్. పడేవోల్లంట, పడేవోల్లు. అవ్వ… తాత సూసి గుండెలు బాదుకుంటాడే పైనుండి. థూ…” అని ఊసింది.

“ఏమాయ్, మీ యమ్మతో అట్టాగేనా మాట్టాడేది. ఎంతమందికి సాయం సేత్తంది బైట.” అరిసింది పక్క పోర్సను బీబీ.

“నూ మెల్లకుండ కూసో‌ బీబక్కా! మా ఇసయాల్లో కలగజేస్కోబాక.” అటేపు తిరిగి అరిసింది రవణ.

ఏం పాపం సేసా దీనికి నేను. నాలుగేల్ల కితం కట్టుకున్నోడు తన్ని తగలేత్తే, ఏడ్సుకుంటా ఒచ్చింది. గుండెల్లో బెట్టుకుండా దీన్నీ, దీని పిల్లనీ. కుంచెం గూడ దర్మం లేదు. నా కర్మ అంతా.

“సేయ్ బేవార్సు ముండా, నీ గురించి యాడేడ సెప్పుంటానో – ‘నా కూతురొత్తది’, ‘మా రవణొత్తది’ అనుకుంటా. మా గూపులో ఏరే పిల్లల్లేకనా? ఈ ఏసాలేవో ఆ సిన్నికిప్పిత్తే, కాత్త పున్యవైనా ఒచ్చుద్ది. నేనదీ సెయ్యలా, అంతా నీ గురించేనే, దయిద్రపు…” ఏడుపుతో మాట రాలా.

“వామ్మో! అంత సలవ నాకొద్దమ్మా. నీ గూప్ మెంబర్లకే ఇత్తావో, నువ్వే పిల్లలేసాలేత్తవో, నాకనౌసరం. ఆ పరువు తక్కువ పన్లు మాత్రం నేన్జెయ్యను. నా కూతురిమీదొట్టు!” అందది సెకసెకా బైటికిపోతా.

నాకేడుపాగలా. ఏవంత తప్పు సేసానని, దీనికంత కోపం?

“తలొంచుకునే పనెప్పుడూ చెయ్యబాకే రత్నం.” అనేవోడు నాయన.

అదేపనిగా గుర్తుకొస్తా ఉండాడు. నాయన పేరేచర్లలో ఏసం గడితే పందిరి నిండిపోవాల్సిందే. అనుమంతుడూ, కర్నుడూ, లచ్మనుడూ…బలే ఏసేవోడు. అదే పనిగా ఇంటో గంటలు గంటలు కంటతా పట్టేవోడు.

ఆయన్ని సూసే ఇయన్నీ నేర్సుకున్నా. మొహవెట్టా పెట్టాల, మూతెట్టా తిప్పాల, సేతులెట్టా ఆడించాల, డైలాగెట్టా సెప్పాల, మాటకి మాటెట్టా ఎయ్యాల…అన్నీ సూత్తా సూత్తా మెల్లింగ నేర్సుకున్నా. అదే మా వోల్లకీ నేర్పిత్తన్నా.

నాయనే బతికుంటే, రవణమ్మన్నట్టు నన్ను జూసి బాద పడేవోడా? ఎడాపెడా తిట్టేవోడా? గుండెలు బాదుకుంటా…! చ చ లేదు. నలుగురికి దారి సూపిత్తన్నందుకు సంతోసబడేవోడే.

ఏవో…నిజ్జంగ అది ఊసేంత తప్పు సేత్తన్నానా…ఎటూ తేలట్లా నా ఆలోసెన్లు. అటీటు తిరగతా ఉండయ్.

దొంగముండ అంటించి పోయింది. ఎట్టగొట్ట ఒదిలించుకోవాల.

=======================

సెంపలు తుడుసుకుంటా ఇంటి బైటికొచ్చా. ఒల్లంతా కాలతన్నట్టుంది.

“సిన్నీ, సిన్నీ! ఏమ్మాయ్…యాడసచ్చా…ఈణ్ణే ఉండావా ఇంగా…?” అరిసా సుట్టూ సూత్తా.

“ఉప్పుడే ఇంటేపు పోయిందక్కా, యావన్నా గావాల్నా?”

గబగబ సెప్పులేసుకుండా. సరాసరి దానింటికి బోయా.

అప్పుడే బిందె బట్టుకోని లోనికి పోతందది.

“అమాయ్…ఓమాయ్…” ఆయాసపడతండా.

సటుక్కున ఎనక్కి తిరిగిందది బిందె కిందబెడతా.

“అయ్యో ఏందత్తా, ఏందిట్టొచ్చా!”

“ఇంటో ఎవురన్నా ఉండారా?”

“లేదు, నాన పనికిబోయాడు.”
“పా, లోనికి పా ఐతే.”

దాని సెయ్యి బట్టుకోని లోనికి లాక్కెల్లా.

నా ముకం, మాట‌‌తీరు‌ సూసి దానికేం అర్దం గాలా. బిక్కమొగమేసింది.

“ఏవైందత్తా?!”

బాబ్జాన్ ఇచ్చిన ఐదొందల నోటు తీసి దాని ముందు బెట్టా.

“ఏందిది?”

“సిన్నీ, ఓ గంట సేపు నూ నా కూతురు రవణమ్మలా సెయ్యాల.” అన్నా డబ్బు మొకం మీదకి నెడతా.

“అత్తా!”

“అత్త గాదే, అమ్మ… అమ్మలా సెయ్యాల. నువ్వు పడేదానివేగా?” అన్నా ఆగని కల్లు తుడుసుకుంటా.

అదట్నే నన్నూ, డబ్బునీ సూస్తా కూర్సుంది.

దాని కల్లల్లో నీల్లు ఊరతండయ్. మెల్లంగ పైకి లేసింది.

“కూతురేసం ఏత్తా గానీ… నీ కాడ తీస్కునే దాన్నిగాదు…బోణీ‌ బేరవనీ…” అందది, సెయ్యి‌ జాపుతా.

*

చిత్రం: సృజన్ రాజ్

పాణిని జన్నాభట్ల

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు