దుత్తలో చందమామ దొంగ నేనే!

ఆమె కథల్లో ని జానపద కథల్లోని శిల్పాన్ని దొంగలించి,నేను గొప్ప మ్యాజిక్ రియలిజం కథకుడ్ని అయిపోయాను. కధామాంత్రికుడ్ని అయిపోయాను.

ఇప్పుడు దుత్తలో చందమామ కథ గురించి ఆలోచిస్తుంటే వొళ్ళు పులకరిస్తోంది.ఈ కథకు బీజం ఎక్క
డ పడింది? ఇది కథగా ఎలా రూపుదిద్దుకుంది? ఎన్నిసార్లు తిరగరాసాను? ఎలాంటి మానసిక సంఘ
ర్షణకు లోనయ్యాను? అని ఆలోచిస్తుంటే ఆ క్షణం నాకు ఇంకా గుర్తుంది.
సినిమా ఇండస్ట్రీ మద్రాసు నుంచి హైదరాబాద్ కు షిప్ట్ అయ్యింది. నేను మణిరత్నం అంత డైరెక్టర్ అయిపోదామని మా తిరుపతిలో ఎర్రబస్ ఎక్కి హైదరాబాద్ కు వచ్చేసాను. ఈ హైదరాబాద్ లో ఎలా బతకాలో తెలీదు.సినిమా ఇండస్ట్రీలో ఎవర్ని కలవాలో తెలీదు. ఎవరి దగ్గర జాయిన్ అవ్వాలో తెలీదు. ఈ హైదరాబాద్ మహానగరంలో నాకు ఒకే ఒక్క ఆసరా ప్రముఖ కవి సౌభాగ్య సర్. ఆయనది మా ఊరు ఎల్లమంద పక్కనున్న బోడేవాండ్లపల్లి అగ్రహారం.ఆయన బామ్మార్ది పీలేరు కాలేజ్ లో నా  ఫ్రెండ్.వాడి పేరు పశుపతి.వాడు చెప్పేవాడు.
“మా బావ హైదరాబాద్ లో ఉంటాడ్రా.గ్రామర్ స్కూల్ల్లో టీచర్ గా వర్క్ చేస్తాడు.ఆయన కొలీగ్ తనికెళ్ళ భరణి. ఆర్టిస్ట్ కాకముందు మా బావతో పాటూ గ్రామర్ స్కూల్లో టీచర్ గా వర్క్ చేసాడు.” అని చెప్పాడు.
నేను మద్రాస్ కు పొయ్యి భారతిరాజా సర్ దగ్గర ‘కరుత్తమ్మ’సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి,మళ్ళీ పీలేరులో శ్రీ బాలాజీ టాకీస్ లో బుకింగ్ క్లర్క్ గానే వర్క్ చేస్తూ వుండే వాడ్ని.హైదరాబాద్ కు వెళ్ళాలంటే భయం.
అంత దూరం ఎలా పోతాము?ఏం చేస్తాము? ఎలా బతకాలి?సినిమా ఇండస్ట్రీలో మనకు ఎవరు  హెల్ప్ చేస్తారు? అని దిగులు.అందుకని హైదరాబాద్ కు రావాలన్న ఆలోచనే లేదు. సౌభాగ్య సర్ గురించి తెలిసినాక,హైదరాబాద్ కుపోదాం,పోదాం అని మనసు పీకింది. అలా ఐదొందలు చేతిలో పట్టుకుని బస్ ఎక్కేసాను.హైదరాబాద్ లో మా తమ్ముడు క్లాస్ మేట్ ప్రభు (హీరోయిన్ సౌందర్యకు బంధువు అవుతాడు), వాడు మధు ఫిల్మ్ ఇన్ స్టూట్ లో యాక్టింగ్ కోర్స్ చేసి ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాడు.
వాడి రూమ్ లో జాయిన్ అయ్యి, సౌభాగ్య సర్ ని కలిసి,నా గోడు చెప్పుకున్నాను.ఆయన నాకు తనికెళ్ళ భరణి గారిని పరిచయం చేసాడు.దాంతో పాటూ ఆయన కవి కాబట్టి సాహిత్యం సర్కిల్స్ లో కూడా తిప్పేవాడు.అలా శివారెడ్డి సర్,సిధార్థ, అఫ్సర్ గారు, అఫ్సర్ గారి ద్వారా ఆర్.ఎం.ఉమామహేశ్వర రావు పరిచయం అయ్యారు. ఉమ మళ్ళీ నా చేత’దేవరెద్దు’కథను రాయించి ఆంధ్రజ్యోతి సండే లో ప్రచురించాడు. సినిమా కథలు రాయడానికి ప్రాక్టీసుగా ఉంటుందని కథలు రాయడం మొదలు పెట్టాను.ప్రముఖ సైన్స్ ఫిక్షన్ రచయిత,అడిషనల్ డిజిపి అయిన కె సదాశివ రావుగారు నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాడు.
హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ లో సంవత్సరం చందా కట్టి, వరల్డ్ మూవీస్ ని చూడమనే వాడు. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ ని నిర్వహించింది. ఒకసారి కన్నడ డైరెక్టర్ గిరీష్ కాసరవెల్లి ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించింది.
ఆ ఫెస్టివల్ దుత్తలో చందమామ కథ రాయడానికి ప్రేరణ అయ్యింది.
ఆ ఫెస్టివల్ లో ‘క్రౌర్యం’అనే మూవీని చూసాను.అందులో కథలు చెప్పే నాయనమ్మ ఉంటుంది.మనవ
డికి అధ్బుతమైన కథలు చెపుతుంటుంది.ఆ కుటుంబం బతుకుతెరువు కోసం బెంగుళూరుకి వెళ్లి పోవాల్సి వస్తుంది. ఆ మనవడు వాళ్ళమ్మ,నాన్న లతో పాటూ బెంగుళూరికి వెళ్ళిపోతాడు.వాడు వాళ్ళ నాయనమ్మతో పాటూ వున్న అందమైన ప్రపంచాన్ని,అధ్బుతమై న కథలు చెప్పే నాయనమ్మను కోల్పోతాడు. ఆ పట్టణం క్రౌర్యంకి వాడి బాల్యం  ఎలా చితికిపోయింది అనేది ఆ సినిమా కథ.
ఆ సినిమా చూస్తున్నప్పుడు నాకు కథలు చెప్పే మానాయనమ్మ గుర్తుకు వచ్చింది. ఆమెది అధ్బుతమైన కంఠస్వరం. ఆమె చెప్పే కథ ల్లో అధ్బుతమైన టెక్నిక్ వుండేది.కథ చెపితే కనికట్టు చేసినట్టు,కళ్ళముందు దృశ్యాలను కదిలినట్టు,మాయలు,మంత్రాలు సృష్టిస్తూ,హావభావాలతో అధ్బుతంగా ఫెర్ఫామ్ చేసేది.ఆమె కథ చెపుతుంటే పిల్లలంతా ఆశ్చర్యచకితులైపోయే వాళ్ళు.
మా నాయనమ్మ మీద ఒక కథ రాయాలనుకున్నాను. ఆ కథ మా నాయనమ్మ చెప్పినట్టే ఉండాలి. ఆమె చెప్పిన కథల్లోని టెక్నిక్ నే తీసుకోవాలనుకున్నాను.ఆమె కంఠస్వరంలోనే చెప్పాలనుకున్నాను.ఆమె చెప్పే కథల్లోని,జానపద కథల్లోని శిల్పాన్ని దొంగలించి కథ రాయడం మొదలు పెట్టాను.కథలు చెప్పే నాయనమ్మ ఉట్టి మీద దుత్తలో దాచి పెట్టిన చందమామని తీసి ఆకాశానికి తగిలిస్తూ ఉంటుంది.ఆ చందమామను మనవడు ఇమ్మని అడిగితే,ఇప్పుడు తీసి ఇస్తే కరిగిపోతుంది.రాత్రికి తీసి ఇస్తాలే అని చెపుతుంది.రాత్రి అయ్యాక తీసిమ్మంటే, ఇప్పుడు తీసిస్తే లోకమంతా చీకటై పోదా అంటుంది.ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటూ ఉంటూ ఉంటుంది.ఒకరోజు,పొద్దున్నే ఆకాశానికి తగిలించిన చందమామను తీసి దుత్తలో దాచి పెట్టినప్పుడు, ఆ మనవడు వాళ్ళ నాయనమ్మకు తెలీకుండా ఆ చందమామను దొంగలిస్తాడు.కథ అయిపోతుంది.
ఆ దుత్తలో చందమామను దొంగలించింది ఎవరో కాదు నేనే. చందమామను సృష్టించింది మా నాయనమ్మ.అంటే అది ఆమె క్రియేషన్.సృజనాత్మకత.అంటే మా నాయనమ్మ చెప్పే కథల్లోని సృజనాత్మకతను దొంగలించాను.టెక్నిక్ ని దొంగలించాను.ఆమె కంఠస్వరాన్ని దొంగలించాను.ఆమె నుంచి అన్నీ దొంగలించి నేను గొప్ప కథకుడ్ని అయిపోయాను.
ఆమె కథల్లో ని జానపద కథల్లోని శిల్పాన్ని దొంగలించి,నేను గొప్ప మ్యాజిక్ రియలిజం కథకుడ్ని అయిపోయాను. కధామాంత్రికుడ్ని అయిపోయాను.
ఈ కథ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో 1998 ఏప్రిల్ సంచికలో అచ్చయింది. లక్ష్మణ్ ఏలే ఈ కథ
కు బొమ్మ వేసాడు. తెలుగు సాహిత్యంలో ఆ కథ ఒక సెన్సేషన్. ఒక ట్రెండ్ సెట్టర్ కథగా సంచలానా
న్ని సృష్టించింది.కధా నేషనల్ అవార్డు వచ్చింది.ఢిల్లీలో గిరీష్ కర్ణాడ్ చేతులమీదగా అవార్డు తీసుకు
న్నాను.భారతీయ భాషల్లోకి ఆ కథ అనువాదం అయ్యింది.పెంగ్విన్ వాళ్ళు వేసిన వరల్డ్ క్లాసిక్స్ స్టోరీస్ లో ఇండియా నుంచి రెండు కథలు తీసుకుంటే, అందులో ఒకటి దుత్తలో చందమామ కథ.
నేనెప్పుడూ కథ రాయను.ఆ కధే నా చేత రాయించుకుంటుంది.
*

గోపిని కరుణాకర్

తెలుగు కథకి రాయలసీమ నించి "కొండంత" దీపం పట్టుకొచ్చినవాడు గోపిని కరుణాకర్. తన భాషతో తన కథనంతో వచనాన్ని వెలిగించిన వాడు.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.