తొలి రోజుల్లో అందరూ ఎక్కిరిచ్చి పెట్టారు!

ఇన్నేళ్ల సాహిత్య ప్రయాణం గురించి అక్షరశిల్పుల అంతరంగాన్ని ఆవిష్కరించే శీర్షిక

విత్వం నాకు

గుడిసె మీద పారే బీర తీగ

ముండ్ల కంపపై పుష్పించిన కట్ల పువ్వు

గంగ డోలుకు కట్టిన గంట

గొంతులో ప్రవహించిన రాగం

కళాత్మకంగా కుండను వానినట్లు

నాణ్యతగా చెప్పును ముడిచినట్లు

అందమైన చీర నేసినట్లు

నేను కవిత్వాన్ని పదిలంగా అల్లుతా

ఈ అక్షరాల నులక అల్లకం అనే అంశ 1985 లోనే మొదలైంది. నేను బాల్యంలోనే మా తాత తొడమీద పగ్గం పేనుడు చూసిన.  అట్లనే కవిత్వ పురి కలిసేట్టుగా వాక్యం చేస్తున్న. ఇదంతా నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న ఎవుసం. 2001 నుంచి పుస్తకాల పంట మొదలైంది. ఇప్పటికి 13 సంపుటాల కవిత్వం మరో 4 వ్యాసాల పుస్తకాలు బయటకు వచ్చినయ్. ఇంకా మూడు సంపుటాలు ఇంగ్లీషు అనువాదాలుగా వెలువడ్డయి.

నాకు సదువుడు, రాసుడు, వినుడు, తిరుగుడు చిన్నప్పటినుంచే ఉన్నది. మా తాత చిన్నప్పుడు వాకిట్ల నిద్ర పోయే ముందు ఊహలు ఊహలుగా మౌఖిక కథలు చెప్పేది, వాటిని శాత్రాలు అనేవాళ్లం. అట్ల ఆయనతో ఉద్భవించిన ఊహలే సృజనాత్మక అల్లిక మొదలైంది కావచ్చు, ఆ తరువాత మహాప్రస్థానం, గబ్బిలం , అమృతం కురిసిన రాత్రి లాంటి పుస్తకాలు మా హుస్నాబాద్ శాఖా గ్రంథాలయంలో చదివిన. 1977 వ సంవత్సరం లో మా స్కూల్ మ్యాగజైన్ చంద్రిక లో ఒక గల్పిక అచ్చయింది.  మొదటిసారి అచ్చులో నా పేరు చూసుకున్న. అటు తర్వాత 1985లో కరీంనగర్ కేంద్రంగా బి విజయ్ కుమార్ నేతృత్వంలో వెలువడ్డ జీవగడ్డ దినపత్రికలో పాత్రికేయ జీవితం నన్ను రచయితగా  కవిగా తీర్చిదిద్దింది. అలా కొనసాగుతున్న జర్నలిజపు రోజుల్లోనే సాహిత్య  అధ్యయనం పట్ల సీరియస్ పెరిగింది .అప్పటికి అందుబాటులో ఉన్న  ఆధునిక సాహిత్యాన్ని చదివేట్టు చేసింది. శ్రీ శ్రీ శ్రీ శివసాగర్ తిలక్ చెరబండ రాజు వరవరరావు  శివారెడ్డి, సినారె, ఎన్.గోపి ల కవిత్వం ఇష్టంగా చదివేది. ఈ అధ్యయనం నడుస్తుండగానే 1988 నుంచి రాసినదంతా సరి చేస్తే 2001 లో  ‘తొవ్వ ‘ అయింది. ఆ తొవ్వనే నా సాహిత్యానికి పెద్దర్వాజ.

‘నేను నడుస్తున్న దారి

చెమట చుక్కల పరిమళం

 

నేను కన్నీటి వానలో నాని వచ్చాను

నేనంతా చెమటతో తడిసి పోయాను

ఇది 1999లో రాసింది. 1980-90 దశకం అంతా మర్లపడుడు, ఎగవడుడు, పట పట పండ్లు కొరుకుడు కాలం. ఊర్లల ఇసోంటి పోరాటాల శక అంటని మనుషులుంటారా? తెలంగాణ అంతటా వ్యాపించిన విప్లవోద్యమ మంటలు, ఎదురుకాల్పులు, అమరత్వాలు, మందుపాతరలు. వీటికి తోడు తెలంగాణ అస్తిత్వ ఉద్యమ ఆకాంక్షలు మొదలయ్యాయి. అగొ అప్పుడే రాసుకున్న కవిత…తెలంగాణ పల్లె

‘కనుకొనల నుంచి రాలుతున్న సముద్రం

తెలంగాణ పల్లె

ఇది కన్నీళ్ళ కోనేరు

ఒకవైపు ఉడుకుతున్న నెత్తుటి సంగీతం

మరోవైపు రివ్వుమంటున్న బుల్లెట్ల వాన

ఊగుతున్న ఉరి తాళ్ళ చప్పుడు

బక్కచిక్కిన బతుకుల్లో ఆత్మహత్యల సన్నివేశాలు’ . ఇది 1998లో రాసిన కవిత.

అప్పటికి ఇంక తెలంగాణ వాదం ప్రజల్లో బలపడలేదు. అంతర్గతంగా తెలంగాణ భావజాల సిద్ధాంతం పలు వేదికల ద్వారా వ్యాపిస్తున్న సందర్భం.

నా తొలి పుస్తకం నిండా తెలంగాణ వాదం, ప్రపంచీకరణ పర్యవసానాలు , కరువు,పోగొట్టుకున్న బాల్యం, బహుజనవాదం ప్రబలంగా కనిపిస్తాయి.

తర్వాత 2003 లోనే ‘నడక’ను మొదలుపెట్టిన .ఇదే సందర్భంలో తెలంగాణ ఉద్యమం ప్రజల్లో మొదలైంది. తెలంగాణ భాష పట్ల నాకు మరింత మమకారం పెరిగింది. తెలంగాణ భాషను నేను కొత్తగా నేర్చుకునేది ఏమీ లేదు. అది మా ఊరి భాష. మా ఇంటి భాష. చిన్నప్పటి నుంచి తేట తెలంగాణ పదాలు మాట్లాడుకుంటూ పెరిగినవాళ్లం. ముఖ్యంగా మా బాపమ్మ మా తాత మాట్లాడినట్టే నేను కవిత్వం రాస్తాను. తెలంగాణ ఉద్యమంలో సాహిత్యకారునిగా పౌరునిగా ఉద్యోగిగా ఇష్టంగా పాల్గొన్నాను. నడక పుస్తకంలో మొదటి కవిత నా కవిత్వ నిర్వచనాన్ని దృక్పథాన్ని తేటతెల్లెం చేస్తుంది. దాని పేరు చెలిమే

‘ఎదలయల విన్యాసం నా కవిత్వం

గలగల పారే వాగు నీరు నా కవిత్వం

కవిత్వమే నా హృదయం కవిత్వమే నాకు ప్రాణ వాయువు

కడుపులోంచి తన్నుకు వచ్చే దుఃఖం నా కవనం

వలవల శోకంల రాలిన కన్నీరు నా కవితాత్మ

పొదుగు నుండి పిండుతున్న పాలు నా కవితాధార

పెరట్ల పూసిన గుమ్మడి పువ్వు నా కవితా శీర్షిక’

తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న కాలం.  ఈ ‘ చెలిమె’ కవిత మాత్రం ఒక పత్రికలో చాలాకాలం వెయ్యకుండా ఒకాయన నిలువరించాడు.

ఇదే క్రమంలో 2005లో ప్రచురించిన ‘మంకమ్మ తోట లేబర్ అడ్డా ‘కవితా సంపుటి. ఇందులో గ్లోబలైజేషన్ కు వ్యతిరేకంగా లోకలైజేషన్ గా స్థానికతనే నిలిపి ఎదుర్కోవాలనే ఆకాంక్షలు ఉన్నాయి. 2003 లో నేను హుస్నాబాద్ నుంచి వచ్చి కరీంనగర్ లోని మంకమ్మ తోట ఏరియాలో  నివసిస్తున్న కాలం. అక్కడ ఉన్న లేబర్ అడ్డా కూలీల మీద రాసిన కవితనే

మంకమ్మ తోట లేబర్ అడ్డా.

‘పల్లె పొలిమేరలు దాటి

అడ్డా మీద సరుకుగా మారిన సందర్భం

అంగడిలో గొడ్డూ గోదా అమ్ముడు పోయినట్లు

నిలువెత్తు మనిషి

తనకు తానే అమ్ముకుంటున్న దృశ్యం

మంకమ్మతోట లేబర్ అడ్డా మీద

బక్క చిక్కిన దేహాలన్నీ

లొట్టబోయిన కండ్లతో చూస్తున్నాయి’.

ఇందులో ప్రపంచీకరణకు తోడు.. కరువు, వలసలు వస్తుంటాయి. ఈ కవిత కాకతీయ విశ్వవిద్యాలయం బిఏ స్పషల్ తెలుగు విద్యార్థులకు ఒక పాఠంగా ఉన్నది. ఇదే యునివర్సిటీలో ఈ సంపుటిపై శ్రీమతి రాధారపు మమత ఎంఫిల్ 2023 లో పూర్తి చేసింది. ఇక్కడే నా సాహిత్యం పై పరిశోధనల గురించి కొంచెం చెప్పుకోవాలి. యం .పురుషోత్తం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘ అన్నవరం దేవేందర్ కవిత్వం సమగ్ర అధ్యయనం’ పై 2024 లో పీహెచ్డీ పూర్తి చేశారు. శ్రీమతి కాపర్తి స్వరాజ్యం కాకతీయ విశ్వవిద్యాలయంలో ‘ అన్నవరం దేవేందర్ సాహిత్యం తెలంగాణ పద సంపద’ పై పీహెచ్డీ చేస్తున్నది.

మరో సంపుటి బుడ్డపర్కలు- నానీలు. ఇది 2006లో వచ్చింది. నానీలు ఆచార్య ఎన్ గోపి గారు సృష్టించిన అద్భుత కవిత్వ ప్రక్రియ. మచ్చుకు ఈ నాని చూడండి

‘దొర గడీని చూస్తేనే

ఉచ్చపడేది

ఇప్పుడు అండ్లనే

పోస్తన్నం.’

ఇందులో ఎంతో పోరాట చరిత్ర దాగున్నది. ఊర్లల్ల 1980కి ముందు అరవై డెబ్భై ఏండ్లనుంచి బానిసత్వం, దొరలను చూస్తే గజగజ భయం, ఆ ఇండ్ల ముందు నుంచి నడవడమంటే చెప్పులు చేతిలో పట్టుకొని పోవడమే. వెట్టి చాకిరి చేయడం ఇంటింటికి ఉండేది. అగొ అప్పటి గమనింపుతో రాసిన నానీ ఇది

2005-08 మధ్య రాసిన కవిత్వాన్ని, 2008 జూన్ లో ‘బొడ్డు మల్లె చెట్టు’గా వెలువరించాను. దీనిని నా సహచరి రాజేశ్వరికి ఇరవై అయిదు ఏండ్ల మా పెండ్లికి గుర్తుగా అంకితం ఇచ్చాను. ఇందులో పల్లెల విధ్వంసం, ప్రకృతి విధ్వంసం కనిపిస్తది. కవితల్లో తెలంగాణ అస్తిత్వం ఎట్లాగూ ఉండనే ఉంటది.

బొడ్డుమల్లె చెట్టు అంటే

‘ఊరేగింపుల పలకరింపు

ఉద్యమాల నీడ

నాలుగు ఊర్ల మనుషులకు కలయిక

అన్ని కదలికలకు ఆరంభ వేదిక

బొడ్డు మల్లె చెట్టు’

అందులోనే

తెలంగాణ నేల ఆది నుంచి అంటే తెలంగాణ సాయుధ పోరాటం, భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాల మీదనే ఈ మొత్తం చరిత్ర సందర్భాన్ని ఒక చిత్రికలా దృశ్యమానంగా చూయించాలని రాసిందే నేల పాట కవిత.

‘నేలనేలంతా పరిఢవిల్లుతున్న కాలం

పెయ్యి పులకరింపుచే మట్టి స్పర్శ

తెలంగాణం మహా తెలంగాణం

సకల ఆధిపత్యాలపై పురివిప్పిన రేశం

పీడనపై ఎదురేగిన ఊరేగింపు’

పెద్ద గేయ కవితలా సాగుతుంది

ఆనాటి ఉద్యమ రోజుల్లో బహిరంగ సభల్లోనూ చదివిన కవిత ఇది. శతవసంతాల కరీంనగర్ సభలోను చదివే అవకాశం వచ్చింది.

బొడ్డు మల్లె చెట్టు తర్వాత  కవితా సంపుటి ‘పొద్దు పొడుపు ‘2009-11 మధ్యలో రాసిన కవిత్వం ఉంది. తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్రం మాటిచ్చి తప్పిన సందర్భం, పోరు దీర్ఘంగా సాగుతున్నది. ఈ సంపుటి చదివితే రికార్డు అయిన డే టు డే చరిత్ర కండ్లకు కనిపిస్తుంది.

ఈ జంగ్ ఇలా సాగుతుంది

‘తెర్లు తెర్లయిన తెలంగాణ తెగిస్తంది

తెలంగాణ తెగతెంపులు చేసికుంటంది

పట పట పండ్లు కొరుకుతంది పల్లె

భూమి ధనిస్తంది… దద్దరిల్లుతంది’

2012 నుంచి 2014 దాకా రాసిన కవిత్వం

‘ పొక్కిలి వాకిళ్ళ పులకరింత’ తెలంగాణ వచ్చిన తర్వాత పులకరించిన సందర్భం అని జూన్ 2, 2014న దీని ఆవిష్కరణ జరిగింది. ఇందులో ఆవిర్భావ పూర్వ ఉద్యమమంతా కనిపిస్తుంది. ఆ తర్వాత

2016లో ‘బువ్వ కుండ’ దీర్ఘ కవితను ఆవిష్కరణ అచ్చు వేశాను. ఇది కుమ్మరి కులవృత్తికి సంబంధించిన కవిత . అది బువ్వకుండ /ఆకాశంలోని శూన్యాన్ని /ముక్కలు ముక్కలుగా కత్తిరించి/ చుట్టూ మట్టి గోడలు కట్టించిన గుండె కాయ/ అంటూ సాగే కవిత బహుజన జీవన నేపథ్యాన్ని కుండ నిర్మాణ వర్ణం నుంచి కుమ్మరి జీవితం దాకా చిత్రీకరించింది. ఈ కవితను ఎన్ వేణుగోపాల్ చదివి ఆడియో క్లిప్ పంపడం నా కవిత్వానికి ఒక గౌరవం. అది నా యూట్యూబ్ ఛానల్ లో ఎప్పుడైనా చూడవచ్చు. తర్వాత 2016లో ‘ ఇంటి దీపం’ సంపుటిని వెలువరించారు. ఇది మా నాన్న స్మృతి లో వచ్చింది. బహుళ జనుల ఆహారం మీద ఆధిపత్య వాదం చెలాయిస్తున్న క్రమంలో రాసిన ‘ శాకం’ అనే కవిత ఉన్నది. 2016 -18 మధ్య రాసిన కవిత్వం ‘ వరి గొలుసులు’ ఇందులో బహుజనుల జీవితం ‘వాకిలి గీతం ‘కవిత

అన్ని కుల వృత్తుల కళాత్మకతను చిత్రీకరిస్తుంది. ఈ పుస్తకాన్ని మా తమ్ముడు ప్రముఖ చిత్రకారుడు అన్నవరం శ్రీనివాస్ కు అంకితం ఇచ్చాను. తర్వాత క్రమంలో 2018- 21 మధ్య కవిత్వం ‘గవాయి ‘ గా వెలువరించాను. 2021-22 కాలంలో ‘జీవన తాత్పర్యం’ అనే సంపుటి తెచ్చాను.

2022 అక్టోబర్ 17 మా 60వ జన్మదినం సందర్భంలో పైన చెప్పిన 12 కవితా సంపుటాలు కలిపి ‘అన్నవరం దేవేందర్ కవిత్వం 1988-2022’ వేరే రెండు బృహత్ సంకలనాలు ఆవిష్కరించాను. దీనికి ప్రఖ్యాత కవి చరిత్రకారుడు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి విశేషమైన ముందుమాట రాశారు . ఆచార్య గోపి గారు కరీంనగర్లో ఆవిష్కరించారు. తర్వాత 2025లో ‘అట్లనే’ కవితా సంపుటిని ప్రచురించాను. దీనిని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య ఘంటా చక్రపాణి ఆవిష్కరించారు.

ఇంగ్లీషు అనువాదం

2011లో ‘ Farmland Fragrance ‘ పి జయలక్ష్మి గారు అనువాదం చేశారు. 2008 వరకు వచ్చిన నా కవితల్లో ఎంపిక చేసిన సంపుటి.

2022 లో ‘ The Unyielding Sky ‘ డాక్టర్ మంథని దామోదరచారి గారు అనువాదం చేశారు.

2024 లో ‘ Grain Chains ‘ నా గవాయి సంపుటి లోని కవితలన్నీ సవ్యసాచి అనువాదం చేశారు.

వ్యాసాల పుస్తకాలు

2002 లో ‘మరోకోణం’ సామాజిక వ్యాసాలు

2020 లో ‘ఊరి దస్తూరి’ తెలంగాణ సాంస్కృతిక చిత్రణ.

2023 లో ‘ సంచారం’ యాత్రా వ్యాసాలు

2024 లో ‘ అంతరంగం’ వర్తమాన జీవన చిత్రాన.

నేను పాత్రికేయ వృత్తి నుంచి వచ్చాను కాబట్టి కవిత్వం తో పాటు కాలమ్స్  కూడా రాస్తుంటారు ‘ ఊరి దస్తూరి’ మన తెలంగాణలో మూడు సంవత్సరాలుగా వచ్చిన శీర్షిక. అంతరంగం దిశ దినపత్రికలో వచ్చింది. మరో కోణం కూడా వివిధ పత్రికల్లో వచ్చిన వ్యాసాలు. నవతెలంగాణలో ‘ఊరి సామెతలు’ రెండు సంవత్సరాలు రాశాను. అది పుస్తకంగా రావాల్సి ఉంది.యాత్రలు చేయడం కూడా ఇష్టమైన జ్ఞాపకం కాబట్టి నేను ఎక్కడికి పోయినా వచ్చిన తర్వాత ఒక వ్యాసము ఒక కవితను తప్పనిసరి వస్తుంది. నిరంతరం రాయడం చదవడం

ఒక ఇష్టమైన పనిగా నడుస్తుంది

నేను తెలంగాణ పల్లెలో పుట్టడం వల్ల

అచ్చమైన తెలుగు భాషను అవలీలగా రాయగలుగుతున్నాను. చలామణిలో ఉన్న తెలుగు భాష కాకుండా పల్లె ప్రజలు మాట్లాడే భాషలోనే కవిత్వం రాస్తున్న తొలి రోజుల్లో అందరూ ఎక్కిరిచ్చి పెట్టారు. పల్లె పదాలు సాహిత్యంలోకి తేవచ్చా అని చర్చ పెట్టి విమర్శించారు. నేను అవేవీ పట్టించుకోలేదు రాసుకుంటూ పోతున్నా. శ్రమైక బహుజన జీవిత తాత్వికత నా కలంలో ప్రవహిస్తది. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర, భూస్వామ్య వ్యతిరేక నక్సలైట్ ఉద్యమం , తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాలు అన్నిటికీ సాక్షిగా నిలబడ్డట్టుగా జీవితం కొనసాగింది.

*

అన్నవరం దేవేందర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు