మా(MAA) ఎలక్షన్ ప్రచారం గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అందులో ఎవరు గెలిచినా ఓడినా మనకి ఒరిగేదేమీ లేదు. హైదరాబాద్ లో ఏ హౌసింగ్ సొసైటీ తీసుకున్నా ఒక అసోసియేషన్ ఉంటుంది, ఆ అసోసియేషన్ లో మా(MAA) కంటే ఎక్కువ మంది సభ్యులుంటారు.కానీ నా గొడవంతా ప్రకాష్ రాజ్ వాగుడు గురించి. అతని అహంకారం, కండకావరం గురించి.
ఇంతకీ, ఇతనేమంటాడు?!
1. తెలుగుకి నేనే నేషనల్ అవార్డ్ తీసుకొచ్చాను. ఇంకెవరైనా తీసుకొచ్చారా ?
– ఈ మాట వినగానే అతనికి దక్కిన అవార్డుల గురించి రిసెర్చ్ చేస్తే తెలిసిందేమిటంటే.. ఆయన సంపాదించినవి ఐదు నేషనల్ అవార్డులు ! అందులో తెలుగు సినిమా అయిన అంతఃపురానికి అతనికి లభించింది “స్పెషల్ మెన్షన్”. మళ్ళీ చదవండి.. “స్పెషల్ మెన్షన్”. అదే ఏడాది ఉత్తమ నటుడు అవార్డ్ మమ్ముట్టి గారికి, ఉత్తమ సహాయ నటుడు అవార్డ్ మనోజ్ భాజ్పాయ్ గారికీ దక్కింది. ప్రకాష్ రాజ్ అనబడే మన ప్రకాష్ రాయ్ కి దక్కింది “స్పెషల్ మెన్షన్” మాత్రమే. పోనీ అదేమైనా మొదటిసారి వచ్చిందా అంటే కాదు. అంతకు మునుపే స్త్రీ అనే చిత్రానికి రోహిణి గారికీ, అన్నమయ్యకి అక్కినేని నాగార్జునగారికీ , అదే ఏడాది ప్రకాష్ రాజ్ తో పాటు దాసరి నారాయణరావు గారికి కూడా స్పెషల్ మెన్షన్ అవార్డ్ వచ్చింది. మరి మన మోనార్క్ ప్రత్యేకంగా తెలుగుకి తెచ్చిన గుర్తింపు ఏమిటి?
కాసేపు దాసరి గారు, రోహిణి గారు, నాగార్జున గారికి దక్కిన స్పెషల్ మెన్షన్ల కంటే అతని స్పెషల్ మెన్షనే గొప్పది అని అనుకుందాం. ఆ స్పెషల్ మెన్షన్ అవార్డు ఆయన పేరు మీద ఇచ్చి ఉంటారా తెలుగు సినిమా పరిశ్రమ పేరు మీద ఇచ్చి ఉంటారా ? మరి తెలుగుకి నేనే అవార్డ్ తెచ్చాననడం వెర్రివాగుడు అనిపించుకోదా ? ఆయనకి నటుడిగా వచ్చిన నాలుగు అవార్డుల్లో మూడు తమిళ్ సినిమాల వల్ల, ఒకటి తెలుగు సినిమా అయిన అంతఃపురం వలనా వచ్చాయి. మరి పక్క భాషలైన తమిళ్ కి, తెలుగు కి నేషనల్ అవార్డులు తెప్పించగలిగిన సామర్ధ్యాలున్న వ్యక్తి కన్నడలో ఎందుకు ఉత్తమ నటుడి అవార్డ్ సాధించలేకపోయాడు ? ఎందుకంటే నేషనల్ అవార్డ్ లభించదగ్గ పెర్ఫార్మెన్స్ ఇవ్వవలసిన పాత్రల్ని అతనికోసం కృష్ణవంశీ గారు, మణిరత్నం గారు రాశారు. అందుకు కృతజ్ఞత చూపించవలసింది పోయి లేని ఘనతని ఆపాదించుకోవడం అతని కుత్సిత మనఃస్తత్వాన్ని సూచిస్తుంది.
పోనీలే కాసేపు స్పెషల్ మెన్షన్ కాదు నేషనల్ అవార్డే తెలుగులో వచ్చిందనుకుందాం. Would that put you on a higher pedestal than your peers Mr. Prakash ? ఎంటీఆర్, ఎస్వీఆర్, ఏఎన్నార్ వంటి వారికి ఏ నేషనల్ అవార్డూ లేదు. అంతెందుకు… ప్రకాష్ రాజ్ గురువుగా భావించే శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి కూడా నేషనల్ అవార్డ్ రాలేదు. ఒక టీవీ డిబేట్ లో చూసాను “నాకు ఆచార్య ఆత్రేయ తెలుసు. ఆయన సాహిత్యం గురించి చర్చకు రండి దమ్ముంటే” అన్నాడు మన రాయ్. ఆత్రేయ గారు ఎన్నో సినిమాలకు మాటలు, వేలాది పాటలూ రాసినా ఆయనకీ ఒక్క నేషనల్ అవార్డూ రాలేదు. ఆరుద్ర ని మొదలుకుని అందెశ్రీ వరకూ, దాశరధిని మొదలుకుని గోరేటి వెంకన్న గారి వరకూ మన తెలుగు కవులకు నేషనల్ అవార్డ్లు దక్కలేదు. ఏ కలన జ్యూరీ ఉందో మన వేటూరి గారికి ఒకటి, అశోక్ తేజ గారికి ఒకటి విదిలించారు.తమిళ వైరముత్తు గారికి ఏడు నేషనల్ అవార్డులొచ్చినప్పుడు మన కృష్ణశాస్త్రో,గద్దరో ఒక్క నేషనల్ అవార్డుకీ నోచుకోరా అని అడిగే దమ్ము మన తెలుగు సమాజానికి లేనంత కాలం చెప్పులోని రాయి లాంటి ప్రకాష్ రాయి తత్సమాన కుసంస్కారులు ఇలాగే పేలుతూ మనల్ని అవమాన పరుస్తారు.
2. “నా అంత తెలుగు మీ ఎవరికీ రాదు. నేను మాట్లాడితే భాష గర్విస్తుంది.”
– “నా అంత తెలుగు నీకు రాదు విష్ణు” అంటే మనకి పోయేదేముంది? అది వాళ్ళిద్దరికీ సంబంధించిన గొడవలే అని ఊరుకునే వాళ్ళం. కానీ అతను అన్న ఇంకో మాట ఏంటంటే అతను పలకడం వల్ల తెలుగు పులకిస్తుందంట. ఏమంత కోకిల కంఠమో కంచు గాత్రమో నీది మిస్టర్ ప్రకాష్ ? కొంగర జగ్గయ్య గారి వార్తలతో మేల్కొన్న జాతి మాది. ఉషశ్రీ ప్రవచనాలతో తరించి , శ్రీశ్రీ ప్రసంగాలతో ఊగిపోయిన నేల మాది. ఘంటసాల గానామృతంలో ఓలలాడిన తెలుగు భాషకి నీ కంపు నోరు కొత్తగా తెచ్చిపెట్టిన సౌరభం ఏముంది?
తెలుగు వాడైన త్యాగరాజస్వామికి ప్రతి ఏడాది తమిళ్ నాడులో ఆరాధనోత్సవాలు చేస్తారు. సింగీతం శ్రీనివాసరావు గారు, పి.బి.శ్రీనివాస్ గారు కన్నడలో విజయబావుటా ఎగరేసారు. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, ఎస్.పి.బి., జానకమ్మ, మనో, పి.సుశీలమ్మ మొదలగు వారికి పక్క రాష్ట్రాల్లో ఉన్న కీర్తి ప్రతిష్టలు జగద్విదితం. వారందరూ సంస్కారులు కనుక ఎప్పుడూ నీలాగా “మీరెవరైనా తమిళ్ లో కన్నడలో నాలా పాడగలరా?” అని హొయలుపోలేదు.
ప్రాచీన హోదా దక్కిన అతి కొద్ది భాషల్లో తెలుగు ప్రధానమైనది. మన దేశంలోనే ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు ఒకటి. తెలుగు నేర్చుకోగలగడం మాట్లాడగలగడం నీ అదృష్టం. నీలాంటి వదరుబోతూ వాచాలుడూ ఒక్కడు తెలుగు నేర్చుకోనంత మాత్రాన భాష కోల్పోవలసిందేమీ లేదు.. నువ్వు మాట్లాడ్డం వల్ల భాషకు కొత్తగా చేరే కీర్తి కిరీటాలూ లేవు.
*
గమనిక: ఈ రచనలో వ్యక్తం చేసిన అభిప్రాయాలకు “సారంగ”కేమీ సంబంధం లేదు. అవి ఆ రచయిత అభిప్రాయాలు మాత్రమే!
Sorry..I totally disagree with u..your analysis went wrong
In my view – both are not correct persons.