‘నా గానమా, సముద్రంవైపు సాగిపోయే నదిలా ప్రవహించు..’. అని ఒక కవి ఆలపిస్తాడు. ‘నా హృదయం ఒక సర్వసంగపరిత్యాగి, అక్కడ ఆశ్రమంలా వికసించు, శంఖపు ఒడిలో నిద్రించే ముత్యంలా… ‘అని ఆహ్వానిస్తాడు. ఇప్పుడు అతడి చుట్టూ పూలు వికసిస్తాయి. చెట్లు ఆకుల వర్షం కురిపిస్తాయి. చల్లటి గాలి వీవనలా విసురుతుంది. సరసులో హంసలు అతడి గురించి మాట్లాడుకుంటూ విహరిస్తాయి.
ఆతడెవరో కాదు, జేమ్స్ క్లారెన్స్ మంగన్. కేవలం 46 ఏళ్లలో మరణించాడు. ఐర్లాండ్ తొలి జాతీయ కవి. అక్కడి ప్రజలు ఆయనను ఆరాధిస్తారు. డబ్లిన్ నగరం నడిబొడ్డున సిటీ సెంటర్ వద్ద ఉన్న అందమైన సెయింట్ స్టీఫెన్స్ గ్రీన్ అనే పబ్లిక్ పార్క్ లో అతడి విగ్రహం మనను ఆకర్షిస్తుంది.
మంగన్ విగ్రహమే కాదు, ఆర్థిక వేత్త, రచయిత, న్యాయవాది, జర్నలిస్టు, పార్లమెంట్ సభ్యుడై ఉండి కూడా తొలి ప్రపంచ యుద్దంలో సైనికుడుగా ప్రాణాలర్పించిన థామస్ మైఖేల్ కెటిల్ విగ్రహమూ ఆ ఉద్యానవనంలో మనను పలకరిస్తుంది. ‘జెండాకోసం మరణించకు, చక్రవర్తి, రాజులకోసమూ ప్రాణాలర్పించకు.. జన్మించిన స్వప్నం కోసం త్యాగం చేయి’ అని ఆయన విగ్రహం క్రింద రాసిన కవితా వాక్యాలు మననతో మాట్లాడతాయి.
యూలిసిస్ వంటి గొప్ప నవలను రచించిన జేమ్స్ జాయిస్ విగ్రహమూ అక్కడుంటుంది. ‘మధ్యాహ్నపు బూడిద బంగారు వలలు రాత్రంతా ముసుగును కప్పుతాయి. నిద్రిస్తున్న సరస్సులో తీరపు దీపాలు కనకాంబరపు తీగల్లా సాగిపోతాయి. రెల్లుగడ్డి తెలివిగా రాత్రి గుసగుసలాడుతుంది.ఒకే పేరును— ఆమె పేరును చెబుతుంది. నా ఆత్మ ఆనందంలో మునిగిపోతుంది. సిగ్గు నిండిన ఒక మత్తులో మునిగిపోతుంది’ అని ఆయన అక్కడే కవిత్వం రాశారా అనిపిస్తుంది.
సమీపంలోనే చరిత్ర ప్రసిద్ది చెందిన ట్రినిటీ యూనివర్సిటీ ఉంటుంది. ఆ విశాలమైన భవనాల్లోనే మన తొలి ప్రధాని నెహ్రూ, నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ తో సహా ఎందరో భారతీయ శాస్త్రవేత్తలు, కవులు, కళాకారులు పాఠాలు అభ్యసించారు. సాహిత్యంలో అన్ని ప్రక్రియలూ స్పృశించి, శిథిలమవుతున్న గ్రామాలు, వలస వెళుతున్న ప్రజల గురించి రచించిన ఆలివర్ గోల్డ్ స్మిత్ నిలువెత్తు విగ్రహం కనబడుతుంది. ఈయనేనా మన పాఠ్య పుస్తకాల్లో కవితలతో మనను పలకరించింది.. అన్న ఆలోచన వస్తుంది. ఈ యూనివర్సిటీలో అడుగుపెడితే యువకవుల చిత్రాలతో వారి కవితా వాక్యాలూ మనను అలరిస్తాయి.
అలా నడుస్తూ వెళుతుంటే అనేక రెస్టారెంట్లూ, ఆఫీసులూ ఉన్న ఒక ప్రధాన వీధిలో ఒక అమ్మాయి బండిపై చేపలు అమ్ముతున్న విగ్రహం కనపడుతుంది. ఆమె ఏ కవయిత్రీ కాదు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఐరిష్ వీధుల్లో ఉదయం పూట బండిపై చేపలు అమ్ముతూ, రాత్రిపూట వ్యభిచారం చేస్తూ పొట్ట పోసుకునే ఒక అందమైన యువతి. ఆమె జీవితం ఒక కవి గానం ద్వారా అది ప్రజలకు పరిచయం అయింది. అది ప్రజల నోట నానింది. కవులు, గాయకులూ, వాయిద్యకారులు ప్రతి ఏటా జూన్ 13న ఆ గీతాన్ని ఆలపిస్తూ ఒక ఉత్సవంలా ఆనందిస్తారు. ఆమె పేరు మీద పబ్ లూ, రెస్టారెంట్ లూ వెలిసాయి.
ఆమె ఆత్మగా డబ్లిన్ వీధుల్లో సంచరిస్తుందన్న ప్రచారం ఇప్పటికీ ఉన్నది. ఎవరో ఆమె వక్షోజాలను తడిమితే అదృష్టం వరిస్తుందని ప్రచారం జరిగింది. ఉదయం సాయంత్రాలు ఆ విగ్రహం వద్ద ఎవరో ఒకరు గిటార్ వాయిస్తూ, పాడుతూ కనిపిస్తారు. ఆమె నిజంగా జీవించిందో, కల్పిత పాత్రో తెలియదు కాని, ఒక కవి గీతంలో పాత్ర నిజ జీవితంలో ప్రజలను ఇంతలా ఆకట్టుకోవడం, ఆమె పేరు ప్రపంచ ప్రఖ్యాతి చెందడం అచ్చెరువు కలిగిస్తుంది. మనం కూడా వీధుల్లో కూరగాయలు, సరుకులూ అమ్మే ఎందరో స్త్రీలను చూస్తాము. ఎవరు మన కవితల్లో జీవించారు? ఎవరు శాశ్వతంగా మన జ్ఞాపకాల్లో విగ్రహమై నిలిచిపోయారు?
సాహిత్యాన్నీ, కవిత్వాన్నీ ప్రేమించే లోకంలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి.
డబ్లిన్ అంతటా ఇలాంటి అపురూపమైన దృశ్యాలు కనపడతాయి. ఏట్స్ మ్యూజియంలోకి అడుగుపెడితే ఏట్స్ మన ముందు నిలుచుని కవితలు చదువుతున్నట్లే ఉంటుంది. ఆయన కవితా వాక్యాలు అలా మన మీద వెలుగులా పరుచుకుంటాయి. ఆయన జీవిత దృశ్యాలు మనను ఏలోకంలోకో తీసుకువెళుతాయి. ఆయన జ్ఞాపకాల్నీ, వస్తువుల్నీ ఎంతో ప్రేమతో పదిలపరిచిన మ్యూజియం అది. జేమ్స్ జాయిస్ కూ అలాంటి ప్రత్యేక కేంద్రం ఉంది డబ్లిన్ లో.
మ్యూజియం ఆఫ్ లిటరేచర్ (మోలి) పేరిట ఉన్న మరో ప్రదర్శన శాలలోకి వెళితే జేమ్స్ జాయిస్, శామ్యూల్ బెకెట్, ఆస్కార్ వైల్డ్, జార్జి బెర్నార్డ్ షా తో పాటు ఎందరో కవులూ, రచయితలు మనను ఆహ్వానిస్తారు. ఆధునిక కవులను కూడా అక్కడ పరిచయమవుతారు. ఐర్లాండ్ లో ప్రముఖ కవుల చిత్రాలు, వారి రచనలు, పుస్తకాలను చూసేందుకు, తెలుసుకునేందుకు అంతకంటే మంచి ప్రదేశం ఏదీ లేదు. ఎప్పుడూ ఏదో ఒక ప్రముఖ కవి గురించి ప్రత్యేక ప్రదర్శన అక్కడ జరుగుతుంది.
ఐర్లండ్ లోని మరో నగరం గాల్వే లో కూడా నగరం మధ్యలో ఆస్కార్ వైల్డ్, ఆయన సోదరుడు విలియం వైల్డ్ ఇరువురూ మాట్లాడుతున్న విగ్రహాలు ఉంటాయి. ఎక్కడ చూసినా కవిత్వాన్ని ఆలపిస్తూ గిటార్ వాయిస్తూ తమ కళను ప్రదర్శించే కళాకారులూ ఐర్లండ్ లో గోచరిస్తారు.
ఎందుకు మనం విన్న ఎందరో గొప్ప రచయితలు ఈ నేలలోనే జీవించారు?
ఇక్కడే ఏట్స్, బెర్నార్డ్ షా, బెకెట్, షేమస్ హీనీ వంటి గొప్ప రచయితలు నోబెల్ బహుమతిని ఎలా పొందారు? ఐర్లాండ్ ఎన్నో ఏళ్ల పాటు వలసపాలనను, హింసాకాండను, సాంస్కృతిక విధ్వంసాన్నీ అనుభవించింది. పాక్షిక స్వతంత్రాన్ని పొందింది. ఈ పరిణామంలోంచే ఎందరో కవులు, నవలా రచయితలు, సాహితీ విమర్శకులు, నాటక రచయితలు ఈ నేలలో జన్మించారు. భారత దేశంతో సహా అనేక ఇతర దేశాల్లో కవుల్నీ, రాజకీయ నాయకులకూ ప్రేరణ కలిగించారు. తన భాషను, సంస్కృతిని, అస్తిత్వాన్నీ కాపాడుకునేందుకు ఐర్లండ్ కొన్ని దశాబ్దాలుగా పోరాడుతునే ఉన్నది. ఆ క్రమంలో సాహిత్యాన్నీ, కవులను, రచయితలను కాపాడుకుంటూనే ఉన్నది. కాపాడుకోవడమే కాదు అడుగడుగునా ఆరాధిస్తూనే ఉంటుంది.
మన దేశంలోనూ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న, రచనలు చేసిన, జాతీయవాదాన్ని ప్రేరేపించిన రచయితలు, కవులు ఉన్నారు. టాగోర్, ప్రేమ్ చంద్, బంకిం చంద్ర ఛటోపాధ్యాయ, సుబ్రహ్మణ్య భారతి, రాంధారీ సింగ్ దినకర్, నజ్రుల్ ఇస్లామ్, సుభద్రా కుమారీ చౌహాన్, హస్రత్ మొహానీ వంటి వారెందరో ఉన్నారు. మనం వారి జ్ఞాపకాలను ఎంతవరకు పదిలపరుచుకుంటున్నాము? భావితరాలకు తెలియజేస్తన్నాము?
రాజకీయ నేతలనే ఆరాధించి, వారి విగ్రహాలను స్థాపించి, ఓట్లను దండుకునే వ్యవస్థలో రచయితలు, కళాకారుల స్మృతులకు విలువ ఉంటుందా? మన నేలలో ప్రతి రాష్ట్రంలోనూ ఎందరో మహాకవులు,రచయితలు ఉన్నారు. సామాజిక సంస్కరణోద్యమాల్లో, స్వాతంత్ర్. పోరాటాల్లో, అస్తిత్వ సంఘర్షణల్లో పాలు పంచుకున్నారు. షేమస్ హీనీ లాగా పొగమంచును శ్వాసిస్తూ అక్షరాలు, చరిత్రతో నదులు ఉప్పొంగేలా చేశారు. వారి జ్ఞాపకాలు చరిత్ర గర్భంలో కలిసిపోయాయి. మన ప్రాచీన సాహిత్యమూ ఆవిరైపోయింది. ఆధునిక సాహిత్యమూ కరిగిపోయింది.
ఒక దుర్మార్గ దుష్ట వ్యవస్థ అంతటా తాండవిస్తోంది. ఏ వెన్నుముకా నిటారుగా ఉన్నట్లు లేదు. తలలు నేలలో పాతుకుపోయినట్లున్నాయి. అందరి నాలుకల్లోంచి చొంగ నేలపై ప్రవహిస్తూ బురదను సృష్టిస్తోంది. చప్పట్లు అంతిమ క్రియల్లో డప్పుల్లా వినబడుతున్నాయి. శరీరాల్లో నెత్తురు బదులు చీము ప్రవహిస్తున్నట్లున్నది. అడవుల్లో రెక్కలు కూలిన పక్షుల శవాలపై నడుస్తున్నట్లుంది.

ఐరిష్ మహాకవి ఏట్స్ రచించిన ‘సెకండ్ కమింగ్’ ఎందుకో గుర్తుకు వస్తోంది.
అన్నీ కుప్పకూలిపోతాయి. కేంద్రం ఆపలేకపోతుంది.
ప్రపంచంపై అరాచకం విరుచుకుపడుతుంది.
నెత్తురు క్రమ్మిన అలలు ఉప్పొంగుతాయి
అమాయకత్వ వేడుకలు మునిగిపోతాయి
ఉత్తములు దృఢ విశ్వాసం కోల్పోతారు
దుష్టులు ఉత్సాహంతో ఉల్లాసంగా ఉంటారు
తప్పకండా ఏదో ఒక ప్రకటన రాబోతోంది
రెండవ ఆవిర్బావం ఆసన్నమవుతోంది
రెండవ ఆవిర్బావం..!
*








ఒక దేశాన్ని సందర్శించడం అంటే – అక్కడి చరిత్రను మళ్లీ కనుగొనడం; ఆ సంస్కృతిని ఆస్వాదించడం; వారి సాహిత్యం, కళలు మనల్ని ఆవహించడం. ముఖ్యంగా అక్కడి ప్రజల నాడిని కాసేపయినా పట్టుకోగలగడం. ఇది నాకు అనుభవం నేర్పింది. మీ యాత్రానుభవ వివరణతో మరోసారి ఋజువైంది. డబ్లిన్ వీధుల్లో విహరించిన అనుభవాన్ని కలిగించారు! పంచుకున్నందుకు ధన్యవాదాలు!