కొత్త కవులు కవిత్వం రాస్తున్నరంటే ఒక పండుగ సంబురం కనబడుతది. ఒక సాధారణ వాక్యాన్ని కవిత్వ వాక్యంగా తీర్చిదిద్దడానికి ఏలాంటి శ్రమ చేస్తున్నరో తెలుసుకోవటం మరింత ఆసక్తికరంగా వుంటది. ఒక ‘వస్తువు’ కవిత్వం అవ్వటానికి ఏమేం అక్కెరపడుతున్నయో, కవి ఎసువంటి వాతావరణాన్ని వస్తువు చుట్టూ అల్లుకుంటున్నడో తెలుసుకోవటం ద్వారా కవి నేపథ్యాన్ని, సామాజిక పరిస్థితుల్ని, స్థితిగతుల్ని అంచనా వేయవచ్చు. ఒకే రకమైన ‘వస్తువు’ మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ఏవిధంగా వ్యక్తమవుతుందో తెలుసుకోవచ్చు. కవులు ఎంచుకునే ‘వస్తువు’ మారకపోయినా అభివ్యక్తిలో కొత్తదనం వుందో లేదో పసిగట్టడం ద్వారా ఈతరం యువకవుల కవిత్వం ఎటువంటి దారుల్ని వేస్తుందో, పాతతరం కవుల అడుగుజాడల్ని ఎంతవరకు స్ఫూర్తిగా తీసుకుంటుందో అర్థమైతది .
వాసిగల్ల పలుకుబడుల కవిత్వం రాసే ఒక కొత్త అభివ్యక్తి స్వరం ‘చిందం రమేష్’. తను రాసిన ఒక కవిత ‘వలపోత’. శీర్షిక వినంగనే కవిత్వావరణం పాఠకులకు కొంత చేరుతది. అందుకు తగ్గట్టే కవిత్వ నడవడిక ఉంటది.
*

వలపోత
~
ఏ కన్న ప్రేగు కమిలిపోయిందో కాని
మది నిండా అలుముకున్న కన్నీటి వాసన…
ఇంటి చూరు కింది నుండి జారేవి అన్ని దుఃఖపు చినుకులే…
అవ్వ అని మురిపెంగా మందలించే కొడుకుని
కాడు పేర్చి కాలవెట్టుడు అంటే
కన్నపేగుని కత్తి వట్టి కర్కశంగా కోసుకున్నట్టే….
కంచంలో కూడు అయితడని కళ్ళళ్ళ వెట్టి సాదుకున్నోన్ని
కాటికి పంపుడు అంటే కంటిని వేలుతో పొడుసుకున్నట్టే…..
వడ్ల గింజ లెక్క నిటారుగా నిఖార్సుగా ఉన్న కొడుకు
పిడాతన పేలి ప్యాలాలై ఎగిరిపోతే పగిలిన గుండెలెన్నో…..
పాడెలో పెట్టి పట్టుకుపోంగా
అలుకు పిడిసెతో అలికినట్టు దారి దారంతా
అయినోళ్ల కానోళ్ల కన్నీళ్ళ తడి…..
అయినగాని
బంగుళా నుండి బజార్లకు చేరి
కాసులు రాసులు ఇడిసి
కడసారి తానాలు చేసి ఖద్దరు ధరించి దొరలెక్క
సాగిపోతూ కాడు మీదకు చేరుతుంటే
కలిగంలో ఇంతకు మించి సిరిమంతం ఇంకొక్కటి ఉంటదా??
ఏది ఏమైనా
కనుడు….కాలం తీరగానే కాలవెట్టుడు….
అల్కగనే కాని
మధ్యల కాలాన్ని ఈదుడే అసలైన వలపోత…
*
కమిలిపోయిన పేగుది ‘కన్నీటి వాసన’ అనంగనే ఎత్తుగడ వైపు తలెత్తి చూడాలనిపిస్తది. నిర్దిష్టంగా గాక సాధారణీకరణ వైపు మొగ్గు చూపడం వైయక్తిక అనుభవాల్ని సామూహికంగా ముసురుకునేట్టు చేస్తయి. చూరు నుండి జారేవి ‘దు:ఖపు చినుకులు’ అంటున్నప్పుడు గ్రామీణత దృశ్యమానమైతది. వ్యక్తీకరణలోనూ మామూలు జనవ్యవహారిక మాటలు ‘వస్తువు’ చుట్టూ అలుముకున్న సాంద్రమైన పరిసరాల్ని పరిచయం చేస్తయి. ఈ క్రమత గాఢత దిశగా కొనసాగుతది. చనిపోయిన కొడుకుని చూసి గుండెలు బాదుకునే అవ్వ ‘వలపోత’ – కన్న పేగుని కత్తితో కర్కశంగా కోయటం, వేలితో తన కంటిని తానే పొడుసుకోవటం నుంచి పిడాతన పేలి ప్యాలాలై ఎగరిపోవడంగా నిటారుగా నిఖార్సుగా వడ్లగింజ లెక్క వున్న కొడుకును చిత్రించటం, అలుకు పిడసతో అలికినట్టుగా ‘కన్నీటి తడి’ దారిని పరుచుకుంటూ కొనసాగుతది. ఔచిత్యవంతమైన అభివ్యక్తులు సహజంగా ఒదిగిన తీరు గుండెను తడిచేస్తయి. మాగిజామున నెగడు కాడ కూసోని ఉడుకుడు బూడిదలో పిడికెడు వడ్లు బోశి దోసిలి నిండా ఏరుకున్న పువ్వులసొంటి ప్యాలాలు అనుభవంలోకి వచ్చిన బాల్యంలోంచి తొంగిచూస్తున్నప్పుడు- కొడుకును ‘వడ్లగింజ’ తో పోలిక జెప్పి పిడాతన పేలాలై ఎగిరిపోవడమనే ‘కవి ఊహ’ కొత్తగా ధ్వనిస్తది. అస్తిత్వం, ఉనికి సమసిపోయిందని సింబాలిక్ గా చెప్పడం వెనుక కవి సృజనను అంచనా వేయవచ్చు. కవిత్వంలోకి వస్తున్న యువత సిరియెస్ నెస్ ని అర్థం చేసుకోవచ్చు.
‘వలపోత’ కు ఖచ్ఛితమైన నిర్వచనంగా ముగింపు వుండటం ‘కవి పరిశీలన’ కేవలం పదాల్ని వాక్యాలుగా, ప్రయత్న పూర్వకంగా కవిత్వంగా మలుస్తున్నట్లుగా గాకుండా జీవితాల్ని దగ్గరి నుంచి చూసిన అనుభవాల్లోంచి వ్యక్తమైనట్టుగా అనిపిస్తది. జీవితాల పట్ల వున్న ఎనలేని గౌరవం, బతుకును ‘కళ’ గా వ్యక్తీకరించగలదని నిర్ధారించవచ్చు. అయితే ఇదంతా సహజ పరిశీలన. వాచ్యార్థం మాత్రమే. “కనుడు.. కాలం తీరగానే కాలవెట్టుడు అల్కగనే కాని మధ్యల కాలాన్ని ఈదుడే అసలైన వలపోత” అనే వాక్యం చెవుల్ల గింగురు మంటూనే మనసు గ్రహించే ధ్వన్యార్థంలో ‘హిడ్మా’ ను కన్న తల్లుల దుక్కమేదో పొంగి పొర్లుతున్నట్టు వినిపిస్తది.
*








Add comment