గుప్పెడు ప్రేమకు భరోసా “టీనా”

ఠాత్తుగా ఒక స్తబ్దత ఆవరిస్తుంది. ఏదో గడ్డ కడుతుంది. అంతా నిశ్చలంగా మారిపోతుంది. ఏ పనీ  చేయాలనిపించదు. పుస్తకం తెరిచినా ధ్యాస నిలవదు. టీవీ రిమోట్‌ తాకబుద్ధి కాదు. తింటున్నదానిమీద ఇష్టం కలుగదు. అలాగని అయిష్టమూ పుట్టదు. మాట్లాడాలనిపించదు. మాటలు వినాలనీ అనిపించదు. ఇంట్లో ఎందరున్నా ఆ వెలితి పూడదు. అది బద్ధకమూ కాదు, శరీరానికి కలిగిన అనారోగ్యమూ కాదు.

అప్పుడు కావాలి గుప్పెడు ప్రేమ.

ఆకులు, కొమ్మల నడుమ ముదిరి ఎండిన కాయకు ఎండపొడ తాకి పగిలి, విచ్చుకుని, విత్తనాలను వెదజల్లినట్టుగా, అప్పుడు కావాలి గుప్పెడు వెచ్చవెచ్చని ప్రేమ.

గుప్పెడు కాదు గుండెడు ప్రేమను మోసుకొచ్చింది టీనా ఆ యువకుడి జీవితంలోకి, ఒకానొక సాయంత్రం ఒక పార్కులో.

తొలిచూపు వలపు అతడిని శూన్యపులోయలోంచి బయటకు తీసుకువచ్చింది.

టీనా అతనికి తారసపడే ముందు క్షణం దాకా అతను ఎలా ఉన్నాడనీ..

ఉద్యోగాన్ని ఇంట్లోకే తెచ్చుకున్నాడు. స్నేహితులనీ, చుట్టాలనీ తెంచేసుకున్నాడు. గడప దాటడు. అదే అతని లోకం. ‘అతను మాత్రమే సంచరించే లోకం. చూట్టానికి మామూలు మనిషిలాగే ఉంటాడు. పొద్దస్తమానం కంప్యూటర్‌ను ఒళ్లో తగలేసుకుని పనిచేసుకుంటూనే ఉంటాడు. హఠాత్తుగా ఏమవుతుందో ఏమో..దాన్ని పక్కకు గిరాటేసి గదిలోకెళ్లి ఢామ్మని తలుపు బిడాయించుకుంటాడు. టీవీలో న్యూసో, సినిమానో, ఏదోటి చూస్తుంటాడు. ఏం ముసురుతుందో ఏమో.. ఉన్నపళాన రిమోట్‌ని నేలకేసి విసిరి కొడతాడు.’

అమ్మకి అతనొక్కడే బిడ్డ. భర్త పోయినప్పటికన్నా ఎక్కువ దుఃఖం ఆమెను ఇప్పుడు పీడిస్తోంది. ఆమె వయసుకీ, బుద్ధికీ, అనుభవానికీ, వివేకానికీ అతని ప్రవర్తన అందడం లేదు. నిజానికి అతను ముందునుంచీ ఇలా ఏమీ లేడు. ‘బానే చదివేవాడు. అందరితో బాగానే మెలిగేవాడు. ప్రపంచమంతా నాదే అంటూ తిరిగేవాడు. అందరూ నావాళ్లే అంటూ ప్రేమించేవాడు. ఇంజనీరింగ్‌ చదువు పూర్తి కాకముందే ఉజ్జోగం కూడా కొట్టాడు.’ ‘ఏమైందో ఏమో! నెమ్మదిగా ముచ్చు మొహంవాడైపోతూ వచ్చాడు…మనిషి కాదు, జడం అన్నట్టుగా ఉండిపోయాడు’.  మాటా పలుకూ లేని కొడుకును చూసి దిగులు మబ్బు అయిపోయింది అమ్మ. గుడులు తిరిగింది. దేవుళ్లకి మొక్కింది. విబూది ఊదించింది. వేపమండలు విసిరించింది. అందరూ అతనికి పిచ్చెక్కిందన్నారు. ఆశ చావక అప్పుడప్పుడూ పార్కుకో, వాకింగ్‌కో తీసుకెళ్లేది. అట్లా తీసుకెళ్లిన ఒక రోజు అద్భుతం జరిగింది.

పచ్చని గడ్డిమీద వెల్లికిలా పడుకుని, నిర్వేదంలో కూరుకుపోయి ఆకాశానికేసి చూస్తూ ఉన్న అతన్ని వెతుక్కుంటున్నట్టుగా వచ్చింది టీనా.

ఇక అంతే అంతా మారిపోయింది.

టీనా_tina కథ ఇక్కడ చదవండి!

గడ్డ కరగడం మొదలైంది. ప్రవాహం..ప్రవాహం..ప్రవాహం.. అతని హృదయపు లోతులలో పుట్టి, టీనాను పూర్తిగా అతని ప్రపంచంగా మార్చేస్తూ.. ప్రేమ ప్రవాహం..

ఇంతకీ అతనికి ఏమైంది?

మౌనం బద్దలై ప్రేమ ప్రవాహంలో టీనాకి ఇలా చెప్పుకున్నాడు అతను..

‘మనిషికి బుద్ధి ఉండనే కూడదు టీనా! ఉన్నా దాన్ని ఉపయోగించకూడదు. బుద్ధి దాని సహజరీతిలో అది పనిచేస్తే ఎదుటివాడి నగ్నస్వరూపాన్ని చూస్తుంది.. అలా చూస్తేనే చాలా ప్రమాదం డార్లింగ్‌! ఎదుటివాళ్ల బుద్ధులన్నీ నేకెడ్‌గా కనిపించేస్తే మొత్తం ప్రపంచం మీదే చీదర పుడుతుంది. ఆ వెనుకనే, నా మీద నాకు ద్వేషం, నా అసహాయత మీద క్రోధం, పరిసరాల మీద అసహ్యం పుడతాయి. నాలోకి నేను ముడుచుకుపోవాలనిపిస్తుంది. కుంచించుకుపోవాలనిపిస్తుంది! ఒక బిందువుగా మారిపోయి అంతర్ధానమైపోవాలనిపిస్తుంది.’

అలా ఆ యువకుడు.. బయటి ప్రపంచం నుంచి ఇంట్లోకి..ఇంట్లోంచి తన గదిలోకి.. గదిలోంచి కంప్యూటర్‌లోకి.. కంప్యూటర్‌లోంచి తనలోకి తాను పారిపోయాడు. ప్రశాంతత దక్కని పలాయనం అది. మనుషులంతా ముసుగులుగా కనిపిస్తున్న అతనికి, మౌనంలోకి ముడుచుకుపోవడం తప్ప మరో దారి తెలియలేదు. అందుకే ‘వంటిమీద బట్ట కప్పుకోవడం నేర్చిననాడే.. మనసు మీద ముసుగు కప్పుకోవడం నేర్చుకున్నాడు మనిషి’ అని అసహనం ప్రకటిస్తాడు.  ఆ అసహనమే ప్రపంచాన్ని బద్దలు కొట్టేయాలన్నంత ద్వేషంగా మారింది. ‘సమస్త మానవ అనుబంధాల మీద విశ్వాసం సడలిపోయి, దేహంగా వడలిపోయి, నిర్జీవంగా మారుతున్న’ దశలో అతని జీవితంలోకి ప్రేమను మోసుకొచ్చింది టీనా. ఆ ప్రేమ అతని మనోనేత్రాలను విశాలం చేసింది.  ‘ద్వేషించిన ప్రపంచాన్ని తిరిగి ప్రేమించడం’ అతనికి నేర్పింది. ఎవరెలా ఉన్నా.. వాళ్లందరినీ కూడా ప్రేమించడం నేర్చుకుంటున్నాడు ఇప్పుడతను, టీనా సాంగత్యంలో. ఇప్పుడా ఇద్దరి నడుమా పగళ్లూ రాత్రులూ ఏకమైపోతున్నాయి. ‘అతని మునివేళ్ల మాయా కదలికల్లోంచి పియానో మెట్లమీదకు జాలువారి చుట్టూ ఉన్న గాలిలో చేరి శాశ్వతమైపోయే సంగీతమూ…, కిటికీలోంచి లోపలికి తొంగిచూస్తూ ఉండే మనోరంజని పూల పరిమళమూ..’ అనుభవిస్తూ, ఆ ప్రేమోన్నత్త క్షణాన అతనంటాడు..

‘ఐ లవ్యూ టీనా డార్లింగ్‌’ అని.

అంతే ప్రేమగా టీనా బదులిస్తుంది..

‘మ్యా..వ్‌’ అని.

ఆదివారం ఆంధ్రజ్యోతిలో ముని సురేష్‌ పిళ్లై రాసిన ‘టీనా’ కథ చదివినప్పుడు నాకు కిట్టీ గుర్తుకువచ్చింది.

ఒక స్తబ్దకాలంలో కిట్టీ కూడా మా ఇంటిని ఇలాగే పలకరించింది. తెలుపూ, బూడిద రంగూ, కాస్త బ్రౌన్ మచ్చలున్న వీధి పిల్లిపిల్ల. మా అమ్మాయి రాగలీన ముద్దు చేస్తూ ఉంటే భయం వేసేది, ఎక్కడ ఇంట్లోకి వచ్చేస్తుందో అని. పాలు పెట్టి ఆడుతుంటే, పోనీ వాకిట్లోనే కదా అనుకున్నాం. పెళపెళమంటూ ఉరుముల మెరుపుల వాన వేళ వరండాలోకి చేరితే, అయ్యో పాపం ఈ ఒక్క రాత్రే కదా ఉండనిద్దాం అని సమాధాన పడ్డాం. రాగలీన బడిలో ఉన్న వెలితి రోజుల్లో ఒక దినాన వరండాలో కూర్చుని ఏదో రాసుకుంటున్న విష్ణు ఒడిలోకి దర్జాగా ఎక్కి కూర్చునేసింది అది. అబ్బురంగా చూస్తుండగానే ఆదమరిచి నిద్రపోయింది ఒడిలోనే. ఇక అప్పటి నుంచీ గంటకోసారి వచ్చి ‘మ్యావ్‌’ అని గర్జిస్తుంది, పాలో, పెరుగో ఏదో ఒకటి కలిపి పెట్టండి త్వరగా అన్నట్టుగా. పెట్టేలోగా రచ్చరచ్చ చేసేస్తుంది. పిల్లి బొచ్చు ఇంట్లో పడితే ఉబ్బసం వస్తుందంటూ, పడక మంచాల మీదకు ఎక్కనివ్వద్దని రాగలీనను బతిమాలుకుంటూనే ఉంటాం. రాగలీన బడికి వెళ్లిపోయాక కిట్టీని విష్ణూ కిట్టమ్మా అని పిలుస్తుంది. కంప్యూటర్‌ మీద పనిచేసుకుంటూ ఉంటే కీబోర్డుమీద కదలాడే ఆమె చేతివేళ్లను పక్కకి నెట్టేస్తుంది, నన్ను మాత్రమే పట్టించుకోమంటూ..అచ్చం మా అమ్మాయిలాగే!

ఏమైందో యేమో వారం పాటూ కిట్టీ జాడ లేదు. దిగులు పడిపొయ్యాం. ఆఫీసుల నుంచి రాగానే కిట్టీ వచ్చిందా అని ఆశగా ఒకరినొకరం అడిగేవాళ్లం. ఒకరోజు వచ్చింది దొంగలా నెమ్మదిగా, బెరుగ్గా. అప్పటి నుంచీ కిట్టీ రాకపోకలు తగ్గిపోయాయి. రోజుకి రెండు మూడుసార్లు మాత్రమే వచ్చి అరిచి పిలిచేది. పెడితే తిని హడావుడిగా వెళ్లిపోయేది. పెద్దదవుతోంది కదా అనుకున్నాం. నెల తర్వాత ఒక రోజు రెండు కూనల్ని వెంటబెట్టుకుని వచ్చింది. పుట్టి ఏడాది నిండలేదు, తల్లి అయిపోయింది. అచ్చం కిట్టీ పోలికే ఒకటి. కిట్టీలాగే నాలుగు రోజులు బిత్తరగా దూరదూరంగా తిరిగినా, కుంటా,కింటేలు రెండూ ఇప్పుడు ఇల్లంతా సందడి చేస్తున్నాయి. అమ్మలాగే ఆకలికి అరిచి రచ్చ చేస్తున్నాయి, పెట్టేదాకా.

ముని సురేష్‌ పిళ్లై రాసిన ‘టీనా’ కథ మేం ముగ్గురమూ ఇష్టంగా చదువుకున్నాం. కథ ఇంతలా నచ్చడానికి కిట్టీ మాత్రమే కారణం కాదు. రచయిత, టీనా గురించి చెప్పడానికి ఈ కథ రాయలేదు. నిజానికి ఇది టీనా కథ కాదు. వర్క్‌ఫ్రం హోం లో ఉండే ఒక సాఫ్ట్‌వేర్‌ యువకుడి కథ. యువతలో పేరుకుంటున్న శూన్యబిలాల ప్రభావం గురించి హెచ్చరించే కథ. కొవిడ్‌, మనిషిని మరింత ఒంటరి ద్వీపాలను చేసింది. గంతలుకట్టి గుర్రాలను పరిగెత్తించినట్టుగా పిల్లల్ని చదువుల్లో తరుముతున్నాం. కాలేజీల్లోంచి, కంప్యూటర్‌ ఉద్యోగాల్లోకి బట్వాడా అయ్యాకగానీ చుట్టూ ఉన్న ప్రపంచం వీరికి కనిపించదు. మాయలఫకీరు గుహలో బందీలమని అర్ధం అయ్యాక అసహనం పురుగులా తొలవడం మొదలవుతుంది. ముసుగు తొలగిన ప్రపంచం కలవరపెడుతుంది. చుట్టాలు, స్నేహితులు, పరిచితులు.. ముసుగుల్లేని మనిషి కనిపించరు. పోరాడే తెగువను చదువు ఇవ్వలేదు. నిరాశ నిలువెల్లా కమ్ముకుంటుంది. జీవనోత్సాహం సన్నగిల్లుతుంది. మరణానికన్నా క్రూరమైన స్థితి ఇది. దీన్నించి బయటపడకపోతే భవిష్యత్తు లేదు. రాత్రికి రాత్రి లోకం మారదు. లోకాన్ని చూసే చూపు మారడమే పరిష్కారం. ఆ పరిష్కారాన్ని నైపుణ్యంగా అల్లి ‘టీనా’ కథ చెప్పాడు సురేష్‌. గుప్పెడు ప్రేమ చల్లితే చాలు, జీవితం చిగురిస్తుంది అనే భరోసాను ఇస్తుంది ‘టీనా’ కథ.

టీనా ఒక పిల్లి అని కథ చివరిదాకా చెప్పకపోవడం రచయిత కథనచాతుర్యం అయితే, కథ మొత్తాన్నీ పిల్లి చెప్పడం విశేషం. అమ్మ కోణాన్నీ, అతని కోణాన్నీ కూడా పిల్లే చెప్పడం శిల్ప వైవిధ్యం. కథకుడిగా తన స్థానాన్ని సురేష్‌ పిళ్లై తెలుగుకథలో సుస్థిరపరచుకుంటున్నాడు.

*

ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అద్భుతమైన కథ “టీనా”. కథ చదువుతున్నంతసేపూ మా బుడ్డి, టైగర్, లిల్లి ల ప్రేమ, లాలన, ఆనందం, ఒకరిమీద ఒకరికి నమ్మకం, భరోసా అన్నీ గుర్తుకువచ్చాయి. బుడ్డి, టైగర్, లిల్లి మేము దత్తత తీసుకుని పెంచుకునే మా పిల్లులు. అద్భుతమైన ” టీనా ” కథను సురేష్ పిళ్లే గారు తప్ప ఇంకెవరూ రాయలేరు అనిపించేంత గొప్పగా రాసారు. అంతే గొప్పగా ఉమామహేశ్వర రావు గారు కథని అందంగా విశ్లేషించారు. సురేష్ పిళ్లే గారికి, ఉమామహేశ్వర రావు గారికి హృదయపూర్వక అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు