గుట్టు రట్టు చేసినందుకు తిట్లు!

క్షిణాసియా  దేశాల్లో దాదాపు మహిళల పరిస్థితి ఒకే రకంగా ఉంది. మెసోగైనస్‌ భావజాలం బాగా పాతుకు పోయిన ఈ దేశాల్లో తిట్టే తిట్లన్నీ మహిళలను ఉద్దేశించినవే! జండర్ సమానత్వం మాట అటుంచితే, కనీసం స్త్రీల రుతుక్రమం, గర్భధారణ సమయాల్లో వచ్చే శారీరక, మానసిక ఇబ్బందులను అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య చాలా స్వల్పం.  పి.యం.ఎస్‌. కథ పీరియడ్స్‌లో వచ్చే మూడ్‌ స్వింగ్స్, స్త్రీల శారీరక మానసిక ఆరోగ్యాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో రాసాను.

ఈ కథ రాసినప్పుడు కొన్ని ప్రశంసలతో పాటు, ఆడవాళ్ళ రెండు కాళ్ళ మధ్య గుట్టుగా ఉండాల్సిన విషయాన్ని బజారుకు ఈడ్చావని తిట్టిపోసిన వాళ్ళు ఉన్నారు. కొంత మంది “మేము ఈ విషయం గురించి ఇంత ఆలోచించలేదు. చాలా మంచి అవగాహన కల్పించావు ” అన్నవాళ్ళూ ఉన్నారు.

ఈ కథా నేపథ్యం క్లుప్తంగా అందరితో పంచుకో దల్చుకున్నాను. నేను ఒక ఫిల్మ్‌ మేకర్‌ని, ఆంత్రపెన్యూర్‌ని. ఈ రెండూ మేల్ డామినేటెడ్ ఫీల్డ్సస్ కాబట్టి ఎక్కువగా మగవాళ్ళ మధ్యే పని చేస్తూ వస్తున్నాను. మొదటి నుంచి మెనుస్ట్రుయేషన్‌కు సంబంధించి నేను చాలా క్యాజువల్‌గా మాట్లాడి నా చుట్టూ ఉన్న, ముఖ్యంగా మేల్ కొలీగ్స్ కి అవగాహన కల్పించే ప్రయత్నం ఎప్పుడూ ఆపలేదు.

ఒకరోజు నా బిజినెస్‌ అసోసియేట్‌ భార్య నన్ను కలిసినప్పుడు ‘‘నా పెళ్ళై పాతికేళ్లు అయ్యింది. ఇన్నేళ్ళలో ఎప్పుడూ ఆయన నా పీరియడ్‌ టైంలో కన్‌సర్న్‌ చూపించలేదు. సడన్‌గా పీరియడ్స్‌ కదా! రెస్ట్‌ తీసుకో…ఫుడ్‌ బయటి నుంచి ఆర్డర్‌ చేసుకుందాంలే అన్నారు.  నేను ఎగిరి గంతేసాననుకో… నువ్వు బాగా మొట్టి సెన్సిటైజ్‌ చేసినట్లున్నావ్‌… అప్పుడుకాని ఆయనకు బుర్రకెక్కలేదు. ఏది ఏమైన ఫిమేల్‌ డెషిషన్‌ మేకర్స్‌ సంస్థల్లో ఉన్నప్పుడే ఇలాంటి వాతావరణం సాధ్యమౌతుంది’’ అన్నారామె.

అప్పుడు నేను బాగా ఆలోచించి చుట్టూ చూస్తే, చాలా మంది మగవాళ్ళకు పీరియడ్స్‌పై అవగాహన లేకపోగా, అర్థం చేసుకోవాల్సిన విషయంగా కూడా దీన్ని పరిగణించట్లేదని గ్రహించాను.  గంటలు గంటలు జరిగే బోర్డ్‌ మీటింగ్స్‌ పీరియడ్స్‌ టైంలో ఉంటే చాలా విసుగ్గా ఉంటుంది నాకు. మొదటల్లో నాకు కడుపు నొప్పిగా ఉంది. మీటింగ్‌ రెండురోజులకు పోస్ట్‌పోన్‌ చేద్దామని చెప్తే, వెంటనే నా చుట్టూ ఉన్న మెన్‌ అయ్యో! నిన్న ఏం తిన్నారు? అజీర్తీ ఏమన్నా చేసిందా? ఫుడ్‌ పాయిజనింగ్‌ కాదు కదా? నా కడుపు నొప్పికి ఇలాంటి కొత్త యాంగిల్స్ లో కారణాలు కనిపెట్టేసారు. నాకు పీరియడ్స్, ఆ టైంలో నాకు రెస్ట్‌ కావాలి. నన్ను ఆనాలుగు  రోజులు వదిలెయ్యండి అని మూడ్‌ స్వింగ్స్, శారీరక ఇబ్బందుల గురించి చెప్పి చెప్పి చివరకు నా చుట్టూ ఉన్న వాళ్ళకు అర్థం అయ్యేలా చేసాను. వీటన్నింటి తర్వాత పీరియడ్స్‌పై అవగాహన కల్పించడానికి పి.యం.ఎస్‌ అనే కథ రాసాను. కనీసం వర్క్ ప్లేస్‌లో, ఇంట్లో  ఆడవాళ్ళ ఆ ఐదురోజుల మూడ్‌ స్వింగ్స్‌ను అర్థం చేసుకొని వాళ్లపట్ల బాధ్యతగా ఉంటారని చేసిన ప్రయత్నమిది. ఈ కథ చదివి మీ అభిప్రాయం చెప్పండి!

పి. యం. ఎస్( Pre Menstrual syndrome )

టింగ్ మని వాట్సాప్ నోటిఫికేషన్…అప్రయత్నంగా ఆరూహ కళ్లు ఫోన్ మీదకు వెళ్లాయి. బోర్డ్ రూంలో అందరూ ఒక్కసారిగా తలపై కెత్తి చూసారు. ఫోన్ చేతిలోకి అందుకొని మేసేజ్ వైపు చూసి, బ్లాక్ చెయ్యడం ఎలా మిస్సయ్యాను. అనుకుంటూ నొసలు చిట్లించి వాట్సాప్ నోటిఫికేషన్ ఆఫ్ చేసి, మీటింగ్ కంటిన్యూ చేసింది. బోర్డ్ రూంలో మీటింగ్ జరుగుతోంది. చాలా ముఖ్యమైన బోర్డ్ మీటింగ్ కావడంతో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ హాజరయ్యారు. వచ్చే నెలలో మూడు రాష్ట్రాలలో తమ ప్రాజెక్టులు మొదలౌతున్నాయి. ఆ ప్రాజెక్టుల కోసం పెద్ద మొత్తాల్లో తమ కంపెనీలోకి ఇన్వెస్ట్ మెంట్స్ వస్తున్నాయి. ఏ ఫేజ్ లో ఎంత ఫండ్స్ అసవరమౌతాయి? వాటి ఎలాట్ మెంట్, ఈ ప్రాజెక్టులకు సంబంధించిన గవర్నమెంట్ పర్మిషన్స్, వచ్చే మూడేళ్ల ఫైనాన్షియల్ ప్రొజెక్షన్స్ ఇలా పలు అంశాలపై కూలంకుషంగా చర్చ జరుగుతోంది. మీటింగ్ లో  కూర్చున్న కంపెనీ సెక్రటరీ, చార్టెడ్ ఎకౌంటెంట్ నుంచి కావల్సిన ఇన్ పుట్స్ తీసుకుంటూ, ముఖ్యమైన పాయింట్స్ పై మార్కర్ తో దిద్దుతోంది మేనేజింగ్ డైరెక్టర్ ఆరూహ. ఇంకా చాలా ఇష్యుూ స్ పై చర్చించాలి. అందుకే లంచ్ తర్వాత దాకా మీటింగ్ షెడ్యూల్ అయ్యింది. మిగతా ఏది పట్టించుకునే మూడ్ లో లేదు ఆరూహ, తన ప్రస్తుత పని తప్ప. మధ్యలో పదినిమిషాలు బ్రేక్ తీసుకొని వర్కింగ్ లంచ్ కానిచ్చి, మూడింటి కల్లా మీటింగ్ పూర్తి చేసి తన ఛాంబర్ లోకి వచ్చి కూర్చుంది. అర్జెంట్  ఫైల్స్ తెచ్చి సెక్రటరీ తన టేబుల్ పై పెట్టింది. ఒక్కో ఫైల్ చెక్ చేస్తూ సిగ్నేచర్ చేస్తోంది. సడన్ గా పొద్దున వచ్చిన మెసేజ్ గుర్తొచ్చింది. ఫోన్ చేతిలోకి తీసుకొని వాట్సాప్ ఓపెన్ చేసి మెసేజ్ పూర్తిగా చదివింది. “అసలు మీకు నామీద ఎలాంటి ఒపీనియన్ ఉందో మీ గుండె లోతుల్లోంచి చెప్పండి. నన్ను బ్లాక్ లోంచి తీసేసారంటే మీరు నాకు ఓకే చెప్తున్నట్లేనా? నిజం చెప్పండి ప్లీజ్ …” మెసేజ్ చూసి ఆరూహకు వంటి మీద గొంగళి పురుగు పాకినట్లనిపించింది. వెంటనే “ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ .. అన్న! నీ కాల్ మొక్తనే.. నన్నొదిలెయ్..” రిప్లై ఇచ్చి నెంబర్ బ్లాక్ చేసింది.  తన మీద తనకే చిరాకొచ్చింది ఆరూహకు.. ఏం పిచ్చి పనులు చేస్తుందా వారం రోజులు…

***

మెలకువ వచ్చి గంట దాటినా బెడ్ మీద నుంచి లేవాలనిపించడం లేదు.. బయటకు రావాలనిపించడం లేదు… మనసు బాగా లేదు.. చాలా డిప్రెసింగ్ గా ఉంది… కాలింగ్ బెల్ మోగుతూనే ఉంది.. శని, ఆదివారాలు తన ఏడేళ్ల కొడుకు పక్క వీధిలో ఉన్న చెల్లిలి దగ్గరికి వెళ్తాడు. ఇంత పెద్ద ఫ్లాట్లో తానొక్కతే ! బెడ్ మీద నుంచిబద్దకంగా లేచి డోర్ ఓపెన్ చేసింది. నవ్వు మొహంతో  డోర్ కెదురుగా రేఖ… ఏం మాట్లాడ కుండా వెనుదిరిగి బెడ్ రూంలో కొచ్చి, బెడ్ మీద వాలిపోయింది ఆరూహ…ఆరూహ వెనకాలే బెడ్ రూంలోకి వచ్చింది రేఖ. మొహం మీద నుంచి బెడ్షీట్ పక్కకు జరిపి ” ఏంటమ్మా వంట్లో బాగా లేదా?” నుదిటి మీద చెయ్యి వేసి చూసింది. “జ్వరం లేదమ్మా ! తలనొప్పిగా ఉందా?” అడిగింది రేఖ.

‘’బానే ఉన్నానెళ్లు.. కాసేపు పడుకొనీ.. ‘’ చిరాగ్గా అంది ఆరూహ. పొద్దున్నే రెండుగంటలు చెమటలు కారిపోయే దాకా సైక్లింగ్ చేసి ఆరున్నరకల్లా ఫ్రెష్ గా స్నానం చేసి, రెండు కప్పుల నిండా కాఫీ కలిపి, ఒకటి మూత పెట్టి తన కోసం ఉంచుతుంది. ఇంకొ కప్పు చేతిలో పట్టుకొని నవ్వుతూ వచ్చి తలుపు తీసే ఆరూహమ్మకు ఈ రోజేమైంది? అనుకుంటూ కిచెన్ లోకి వెళ్ళింది రేఖ… కిచెన్ లో ఎక్కడి వక్కడ పడి ఉన్నాయి. కాఫీ కలిపి తీసుకెళ్లింది.

దుప్పటి పక్కకు జరిపి,  లేచి ముఖం మీద నీళ్ళు చల్లుకొని నోరు పుక్కిలించింది. బెడ్ రూం టీపాయ్ పై ఉన్న కాఫీ కప్పు తీసుకొని లివింగ్ రూంలో ఉన్న సోఫాలో కూర్చుని, ఛార్జింగ్ లోంచి ఫోన్ తీసి చెల్లిలికి ఫోన్ చేసింది.

“వర్షా ! పనిలో  ఉన్నావా? డిస్ట్రబ్ చెయ్యలేదు కదా!”  “ఏం లేదక్కా! వినయ్ వాషింగ్ మెషీన్ లో వెయ్యలేని నాడెలికేట్ డ్రస్సులు, చున్నీలు ఉతికి, గంజి పెట్టాల్సిన వాటికి పెట్టి ఆరేస్తున్నాడు. ఆదివారం పొద్దున్నే ఎంత చెప్పినా వినకుండా చేసే రెగ్యులర్ పనిది. నేను గట్టు మీద  కూర్చొని చూస్తూ ఉన్నా”

“నువ్వూ హెల్ప్ చెయ్యక పొయ్యావా?”

” నీకు బ్యాక్ పెయిన్ ఎక్కువౌతుంది. నేనే చేస్తాను అని రానివ్వడు.. చేసేది లేక గట్టు మీద కూర్చొని కబుర్లు చెప్తుంటా..!”

” వినయ్ నిజంగా బంగారం .. నాకు పెద్ద టెన్షన్ తగ్గించాడు నీపట్ల వినయ్ ఏ మాత్రం తేడాగా ఉన్నా, నాకు ఈ కాస్తా మనశ్శాంతి లేకుండా  పోయేది.. నాకెంత గ్రాటిట్యూడ్ ఉంటుందో ఆ పిల్లోడి మీద.. చాలా సార్లు వినయ్ కి చెప్తుంటా.. అలా చెప్పగానే మీ చెల్లి నాకంటే మంచిది అక్కా! అంటుంటాడు. బాలు అన్న లోకం వదలి వెళ్లి పోయాక, నా మరిదిగానే కాక,  వాడి స్థానం రిప్లేస్ చేసి నాకు తోడ బుట్టిన వాడయ్యాడు..”

“అవునక్కా ! నీ మీద చాలా కన్సర్న్ ఉంటుంది తనకు. రెండు రోజులు నవ్వు టూర్ లో ఉండో, ఏదైనా బిజీ వర్క్ లో ఉండో మాట్లాడక పోతే పదిసార్లు గుర్తు చేస్తాడు.. ”

“ఏదేమైనా నువ్వు చాలా అదృష్టవంతురాలివిరా వర్షా!”

” ఏంటి అలగ్ సలగ్ పొద్దునే అక్కా చెల్లెళ్ళు మీటింగ్ పెట్టారు..” వర్ష చేతిలో ఉన్న ఫోన్ స్పీకర్ ఆన్ చేసి అన్నాడు వినయ్.

” ఏం లేదులే మాకు మాకు బోలెడు ఉంటాయ్.. అవన్నీ చెప్పలా ఏంటీ పక్క నుంచి అంది వర్ష.

“నీగురించే మాట్లాడుకొంటున్నామ్ లే వినయ్ …!”

” సరేగాని అక్కా! ఏంటి డల్ గా ఉంది వాయిస్”

“బానే ఉన్నాలే వినయ్ ”

“ఏం బాగో ఏంటో..?”

“వినయ్ నువ్వు  నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా! మా చెల్లిని పెళ్లి చేసుకునే ముందు మీ కజిన్సో, చుట్టాల్లోనో నీ లాంటి వాడిని ఎవర్నో నా కోసం వెతికుండాల్సింది. నేను ఆ పిచ్చి పెళ్లి చేసుకుంటుంటే  ప్రేక్షకుడిలా చూస్తూ ఉండిపోయావు,.. చూడు ఇవ్వాళ ఎంత ఎమోషనల్ ఇన్ సెక్యూరిటీతో ఒంటరి దాన్నై పోయాను..!”

వినయ్ కి నోట మాట రాలేదు.. వినయ్, వర్షా మొహాలు చూసుకున్నారు… తానో సక్సస్ ఫుల్  ఆంట్రప్రెన్యూర్ . పని తప్ప ఇంకో ధ్యాస ఉండడం ఎప్పుడూ చూడలేదు.  సడన్గా ఇలా మాట్లాడుతుందేంటని ఇద్దరు ఆశ్చర్యపోయారు…

అంతలో పక్కనున్న వాళ్ల ఆరేళ్ల పాప అన్వేష కల్పించుకొని ‘’ఆమ్మా! గుడ్ మార్నింగ్ “ అంది.

ఆ పిల్ల గొంతు విని ఖంగుతిని మళ్లీ మాట్లాడతాలే అని ఫోన్ పెట్టేసి కిచెన్ లోకి వచ్చింది ఆరూహ… పొయ్యి గట్టు మీదున్న అంట్లన్ని బయట వేసి స్టవ్ శుభ్రం చేస్తోంది రేఖ. షింక్ అంట్లతో నిండిపోయింది. కరుణకి ప్రెగ్నెన్సీ రావడంతో పొద్దుటి పూట రాలేక పోతోంది. సాయంత్రం కరుణ వచ్చేదాకా..  అవసరమైన గిన్నెలు కడిగి వాడుతుంది రేఖ. కిచెన్లోకి వెళ్లింది  ఆరూహ.

“అమ్మా చూడండి.. ఎంత శుభ్రం చేసినా ఇంకా ఇంకా మురికిగానే  ఉంటోంది.. మీరు ఆఫీసు నుంచి రావడం లేటయినా, టూర్ లో ఉన్నా, బాబు ఫ్రెండ్స్ ని తెచ్చి యూట్యూబ్ లో వంటలు మొదలెడతాడు.. స్టవ్ అంతా పొంగించి కంపులేపుతాడు.. ఎక్కడ కాల్చుకుంటాడోనని భయం నాకు! ఎంత చెప్పినా వినడు. మీకు చెప్పొదంటాడు. చాలా విసుగొస్తోందమ్మా…! ” అంది రేఖ. ఆరూహకు చిరాకొచ్చింది.

“ఎప్పుడు చూడు ఏదో ఒక నస… కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వు.. నేనింతే … నా ఇల్లు ఇంతే… ఇష్టమైతేనే నాతో ఉండు, లేకపోతే  అందరి లాగా నువ్వు వెళ్ళిపోవచ్చు! ”

” నన్ను వెళ్ళ మంటున్నారా?  ఏడేళ్ల నుంచి మిమ్మల్నే అంటి పెట్టుకొని ఉన్నా.. మీ కష్టంలో.. సుఖంలో… మీరు మారిపోయారు లే అమ్మా !”

కళ్లు తుడుచుకుంటూ, ముక్కు చీదుతోంది.

“ఈ కొంపలో ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోరు.. పో! పొద్దున్నే నీ సోది…!” విసురుగా బెడ్ రూంలోకి వెళ్లి పోయింది.

మనసు బాగా లేనప్పుడు, అందరితో తెగతెంపులు చేసుకోవాలనుకున్నప్పుడూ, తనలో తాను పారిపోవాలనుకున్నప్పుడు ఆరూహ చేసేది బెడ్రూంలోకి వెళ్ళి ముసుగుతన్ని పడుకోవడమే…అలా కొన్ని గంటలు నిద్రపోయి ఆ ఎమోషనల్  పెయిన్ లోంచి బయటకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఆరూహ..

“క్యూటీ లే…! ఎంత సేపు నిద్రపోతావు… ” నాన్న తట్టి లేపాడు ఆరూహను.

“మీరెప్పుడు వచ్చారు నాన్న…?”

“చాలా సేపైందమ్మా”

“రేఖ టీ పెట్టి ఇచ్చింది… తాగి పేపర్ చూస్తూ కూర్చున్న…”

“అయ్యో ! లేపాల్సింది నాన్న…”

“నువ్వు పసిపిల్లలా హాయిగా పడుకుంటే డిస్ట్రబ్ చెయ్యాలనిపించలేదు తల్లీ…!”

దుప్పటి మడత పెట్టి, లివింగ్ రూంలోకి వచ్చి సోఫాలో నాన్న పక్కన దూరి, నాన్న భుజంపై తల వాల్చి కూర్చుంది. వాళ్ల నాన్న, ఆరూహ తల నిమురుతూ మాట్లాడుతున్నాడు ఏమీ మాట్లాడకుండా తండి చెప్పే కబుర్లు వింటోంది ఆరూహ అప్రయత్నంగా కళ్లలోంచి ధార కడుతున్న కన్నీటి చెమ్మ నాన్న భుజానికి చల్లగా తాకేసరికి…

“ఏమైంది తల్లీ? అంటూ ఆరూహ మొహంలోకి చూసే ప్రయత్నం చేసాడు.

తండ్రి కళ్లలో పడకుండా గబుక్కున కళ్లు తుడుచుకుంది.

“నాన్నా!  నేను చెడ్డ పిల్లనా?”

” ఛా.. ఎవరన్నారు రా?”

” ఎందుకో నాకే అలా అన్పిస్తోంది…”

” నువ్వు నా బంగారు తల్లివి”

“మీకు తప్ప నేనెవ్వరికీ నచ్చనులేండి”

“పిచ్చి పిచ్చిగా ఆలోచించకు.. ఏమైంది ఇవ్వాళ నీకు?”

“ఇంత విశాలమైన ప్రపంచంలో నన్ను అన్ కండిషనల్ గా ప్రేమించే వాడు.. ఒక్కడూ లేడా?”

“ఎందుకు ఉండరు?”

” మరి నా లైఫ్ లోకి ఎవ్వరూ ఎందుకు రావడం లేదు?”

“అది నువ్వు రానిస్తే వస్తారు…?”

” నాన్నా ! నా చేతితో అరవై నాలుగు పెళ్లిళ్లకు సంతకం పెట్టాను అందరూ బాగున్నారు కదా.. నా పెళ్లే ఇలా ఎందుకైంది? ”

“అది ఆమె చేతి మహిమేమో”

అప్రయత్నంగా ఆరూహ మొహంలో నవ్వు వచ్చింది…

ఎప్పుడూ లేనిది తన పవర్ ఫుల్, స్ట్రాంగ్ కూతురు ఇంత ఎమోషనల్ గా మాట్లాడుతుంటే తండ్రికి అర్థం కాలేదు. చీకటి పడుతుండడంతో ఆలోచించుకుంటూ కూతురికి బై చెప్పి వెళ్లిపోయాడు.

కాసేపు టీవీ ఆన్ చేసి సినిమా చూసే ప్రయత్నం చేసింది. ఏది నచ్చక మారుస్తూ కాలక్షేపం చేసింది. అక్కడి నుంచి లేచి బాల్కనిలోకి  వచ్చింది. ఓ సాయంత్రం తన ఒంటరి తనానికి తోడుగా తెచ్చి నాటిన మొక్కల దగ్గర నిల్చుని కాసేపు మాట్లాడింది.. ఒక్కో ఆకును, పువ్వును సున్నితంగా చేతితో తాకుతూ తన ప్రేమను ప్రకటించింది. తన ప్రేమకు ప్రతిగా విచ్చుకున్న పూలు తలలూపాయి. సన్నగా కడుపులో నొప్పి మొదలయ్యింది.. కాళ్లు లాగుతున్నాయి. తలుపులు కిటికీలు అన్ని మూసి, బెడ్ రూంలోకి వచ్చి, ఫోన్ సైలెంట్ చేసి ఛార్జెంగ్ లో పెట్టి బెడ్ మీద వాలి కాళ్లు దగ్గరగా ముడుచుకొని, దుప్పటి పైకి లాక్కొని పడుకుంది. కాసేపు ఎవరైన కాళ్లు నొక్కి, తలనిమురుతూ పక్కన కూర్చుంటే  బాగుండనిపించింది… ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం ఎవరూ లేని తనం తనను వెక్కిరించింది… కళ్లలో నీళ్ళొచ్చాయి.. కాసేపు  అలాగే ఉండిపోయింది..

ఏదో గుర్తొచ్చిన దానిలా లేచి ఫోన్ తీసుకొని తను బ్లాక్ చేసిన ఎనిమిది ఫోన్ నెంబర్ లను అన్ బ్లాక్ చేసింది..

ఫోన్ దిండుపై పెట్టి మోకాళ్ళ మీద వంగి కూర్చొని ఫోన్ వైపే చూస్తోంది…

టింగ్.. టింగ్.. వాట్సాప్ నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి…

మెసేజెస్ స్ర్కోల్ చేస్తోంది ఆరూహ..

“నా ప్రపోజల్ ఒప్పుకున్నారా? ”

“నాకు తెలుసు ఏదో ఒక రోజు నేను మీకు నచ్చుతానని…”

” మీ టామ్ బాయ్ ముసుగులో హ్యాపీగా ఎవడ్నీ దగ్గరికి రానీయకుండా  మీ ఇగో సాటిస్ ఫై చేసుకుంటూ బ్రతికేస్తున్నారుగా… ఫైనల్లీ ట్రాక్ లోకి వచ్చారన్న మాట…”

“మీరు చాలా ఇండిపెండెంట్ గా ఉంటారు, నేను చాలా ఇండిపెండెంట్ అందుకే మీరు నాకు చాలా నచ్చుతారు.. .  మన మధ్య ఓన్లీ ఫిజికల్, ఓన్లీ ఫిజికల్ రిలేషన్ ఉంటే బాగుంటుందని ఫీల్ అవుతున్నా…”

ఆ మెసేజ్ ల ధాటికి ఒక్క క్షణం ఒళ్లు జలదరించింది ఆరూహకు …. వెంటనే ఒక్కో నెంబర్  బ్లాక్ చేసి వెళ్ళి పడుకుంది.

***

ఆఫీస్ నుండి వచ్చే సరికి వర్ష తన కోసం వెయిట్ చేస్తోంది ఇంట్లో..

ఫ్రెష్ అయి వచ్చి వర్షతో కూర్చుంది ఆరూహ

“అక్కా! ఒక ముఖ్యమైన విషయం మీద వచ్చాను, నాన్న నీతో మాట్లాడి రమ్మన్నారు…”

“అంత మాట్లాడాల్సిన విషయమేంటో…?”

” ఈ మధ్య నాన్న నీ గురించి చాలా వర్రీ అవుతున్నారు..”

“ఎందుకు..  నాకేమైంది?”

“నాన్న ఉండగానే  నీ లైఫ్ సెటిల్ చెయ్యాలని తాపత్రయ పడుతున్నారు..”

“సెటిల్డ్ గా లేనా ఇప్పుడు…?”

“ఏంటో అక్కా! సడన్ గా నువ్వు డల్ అవుతున్నావు…మేం నిన్నలా చూడలేక పోతున్నాం .”

“మరేం చేద్దామిప్పుడు…”?

” అదే నువ్వు మళ్లీ పెళ్లి చేసుకో అక్కా! ”

“పెళ్లా…? నాకా … ?”

“అవును… నాన్న ఈ విషయమే నీతో మాట్లాడమన్నారు..

“……..”

“కిరణ్ కి డైవర్స్ అయి రెండేళ్లయ్యిందట…ఈ మధ్యే ఇండియా వచ్చాడు… ఇక్కడే సొంత హాస్పిటల్ పెట్టుకొని ఉండిపోవాలుకుంటున్నాడు… మొన్న నాన్నను చూడడానికి వాళ్ళమ్మ వచ్చి మాటల్లో నీ గురించి అడిగారంట… నీ డైవర్స్ గురించి తెలిసి చాలా బాధపడ్డారు… కిరణ్ కి నువ్వంటే  చాలా ఇష్టమట… ఆంటీ వచ్చి అడుగుదామనకునే లోపే… వసంత్ తో నీ ప్రేమ, పెళ్లి తెలిసి ఊరుకున్నారట… కిరణ్ కి ఇప్పటికి నీ పై ఇంట్రస్ట్ ఉందట… వీలు చూసుకొని నిన్నోసారి కిరణ్ తో  మాట్లాడమంటున్నారు నాన్న…”

” మెన్ మేనేజ్మెంట్, మ్యారేజ్ నా కప్ ఆఫ్ టీ కాదు… ఇనఫ్ ఈజ్ ఇనఫ్…”

వర్షకు నోట మాట రాలేదు…

“ఇక నా మూడ్ స్వింగ్స్ అంటావా! ఈ మధ్య ప్రీ మెన్ స్ట్రువల్ సిండ్రోమ్ నన్ను బాగా విసిగిస్తోంది… మెడికేషనో, ఏదైనా థెరపీనో తీసుకొని నార్మల్ కి తెచ్చుకుంటాలే…”

రేఖ ఇద్దరికి టీ పెట్టుకొని వచ్చింది….

” అమ్మా ! రేపటి నుంచి నేను మానేస్తున్నాను… “మొహం గోడవైపు తిప్పుకొని చెప్పింది…

ఆరూహ చటుక్కున లేచి, రేఖ భుజాల చుట్టూ చెయ్యి వేసి… “రేఖా !  నా వైపు  చూసి చెప్పు…”

రేఖ కళ్లనిండా నీళ్లు…

“ప్రేమైనా, కోపమైనా చూపించేది అయిన వాళ్లపైనే… నాకు ప్రేమించడానికి, కోప్పడడానికి ఎవరున్నారు చెప్పు….?”

రేఖ ఆరూహను గట్టిగా హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చింది… ఎవరికి వాళ్లు అరిందల్లా పెద్ద పెద్ద డెషిషన్స్ తీసుకొంటున్నారు…చాల్లే గాని, నా బట్టలు సర్దుపో… రేపు రాంచి వెళ్లాలి….

కొత్త కథ 2022

రుబీనా పర్వీన్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు