2022 మాకు ఏమిచ్చిందంటే..

క ఏడాది కాలంలో ఏమేం జరగొచ్చు? ఏమైనా జరగొచ్చు కదా! ఒక్కోసారి ఏమీ జరక్కుండా కూడా పోవచ్చు. కోవిడ్ వల్ల ఒక రెండేళ్ళు అలా ఎగిరిపోయినవే. ఆ దెబ్బ నుంచి కాస్త కోలుకున్న ఏడాదంటే 2022 అనే చెప్పుకోవాలి. అందరూ మళ్ళీ ఎవరి బతుకులో వాళ్ళు కొత్త సవాళ్ళను వెంటేసుకొని ముందుకెళ్ళిపోతున్నారు.

ఈ ఏడాది హైదరాబాద్ బుక్‍ఫెయిర్‍కి ఎన్ని కొత్త పుస్తకాలు వచ్చాయో చూస్తే తెలుగు సాహిత్యంలో కొత్త ఆలోచనకు ఎంత దగ్గరవుతున్నామో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది కొత్త పుస్తకాలతో, కొత్త కథలతో తెలుగు సాహిత్యంలో మెరిసిన యువ కథకులను – “ఈ ఏడాది మీకు ఏమిచ్చింది?” అనడిగాం. ఆ సమాధానాలు సారంగ పాఠకుల కోసం –  

***

హైదరాబాద్‍కి వచ్చి ఆరు సంవత్సరాలైంది. సాఫ్ట్వేర్ జాబ్ మానేసి సినిమా వైపు, సాహిత్యం వైపు అడుగులు వేసి నాలుగు సంవత్సరాలవుతోంది. మూడు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసాను. ఇక్కడికి రాకముందు నేను పెద్దగా సాహిత్యం చదివింది లేదు, అసలు చదవనే లేదని చెప్పాలి. సినిమా తీద్దామని వచ్చిన తరువాతే చదవడం మొదలుపెట్టాను, కథలు రాయడం మొదలుపెట్టాను.

ఒక పుస్తకం తీసుకొని వస్తానని నేనెప్పుడూ ఉహించనే లేదు. అలాంటిది నా మొదటి కథాసంపుటిని (పార్వేట) ఈ సంవత్సరం తీసుకొనివచ్చాను. ఇది నాకు ఒక స్పెషల్ అచీవ్మెంట్. అందుకే ఈ సంవత్సరం (2022) నాకు ఎప్పుడూ పార్వేట రూపంలో గుర్తుండిపోయే సంవత్సరం.

-సురేంద్ర శీలం

ఇన్ని సంవత్సరాలు ఇవ్వలేదని కాదు గానీ కొన్ని అనుభవాల్ని, చక్కని అనుభూతిని ఇంకాస్త ఎక్కువగా ఇచ్చిందని చెప్పగలను. ‘పత్రికల్లో కథ వస్తే చాలు’ అనుకున్న నా ఆలోచనా విధానాన్ని మాత్రం పూర్తిగా మార్చింది. చాలా పుస్తకాలు ఈ సంవత్సరంలో వచ్చాయి. చదివించే స్కోప్ ఉన్న కథలు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా రావడంతో వాటిని చదివి అనుభూతి చెందడం బాగా జరిగింది. మరీ ముఖ్యంగా అనువాద కథల మీద దృష్టి పెరిగింది. ఇక రాయటం విషయానికి వస్తే 2022 ఆరు కథలు రాసే అవకాశం ఇచ్చింది. ఈ సంవత్సరంలోనే వెలువడిన ఐదు వివిధ కథాసంకలనాల్లో, రెండు పత్రికల్లో నా కథను చూసుకునేలా చేసింది. కథ విషయంలో 2022 మాత్రం మిగితా సంవత్సరాల కంటే ప్రత్యేకంగా నిలిచింది.

కేవీ మన్‌ప్రీతమ్

 నాకు మంచి అనుభవాలను ఇచ్చింది 2022. అదీ ముఖ్యంగా హైదరాబద్ రావటం వలన. మా ఇళ్ళలో మొదటిసారి M.A. దాకా చదివినవాడిని అయ్యాను. గతేడాదిలో నా మొదటిపుస్తకం ప్రచురణకు ఎవరూ తెలీక ఎన్నో ఇబ్బందులతో ఆ పుస్తకం బయటికి వచ్చింది. ఈ ఏడాది పబ్లిషర్స్ దొరికి, వాళ్ళే అడిగి రెండు పుస్తకాలు ప్రచురించటం, ఈ ఏడాదే రావటం ఆనందం. సారంగ మ్యాగజైన్లో తొలిసారి కవిత్వాన్ని సిరీస్గా రాసే అవకాశం రావటం గొప్ప విషయం.

ఈ ఏడాది మంచి అనుభూతులనే ఇచ్చింది. ముఖ్యంగా రాజకీయ, సాహిత్య స్పష్టతను ఇచ్చింది. సూఫీని ఈ ఏడాది కానుకలా ఇచ్చింది. చదువు యాప్లో ఒక ఉద్యోగం. ఇక ముందు జీవితానికి భయాలని తగ్గించి, స్పష్టతను ఇచ్చింది ఈ సంవత్సరం.

-గూండ్ల వెంకట నారాయణ

ఈ సంవత్సరం ఎప్పట్లానే గొప్ప గొప్ప ఆలోచనలతో, ఆశయాలతోనే ప్రారంభమైంది. చలికాలం పక్కనుంచితే, వేసవి ప్రారంభంలో ‘బాహుదా బతుకు కథలు’ పుస్తకం అచ్చవ్వడం, దానికి మంచి మార్కులే పడటం అనేది జీవితంలో మర్చిపోలేని ఘట్టం. తర్వాత కుటుంబంలో వరుసగా జరిగిన విషాదాలు, వాటి నుంచి మానసికంగా, ఆర్థికంగా బయటకు రావడం నరకాన్ని తలపించింది. చివర్లో జరిగిన రైటర్స్ మీట్ వీటన్నింటి మధ్యలో ఒక ఉపశమనాన్ని కలిగించి చాలా స్ఫూర్తిని నింపింది. మొత్తంగా చూసుకుంటే ఈ సంవత్సరం, జీవితంతో పోరాడటాన్ని నేర్పించింది.

-బూదూరి సుదర్శన్

గడిచిన కొన్ని సంవత్సరాలతో పోలిస్తే 2022 నా ఆశలకి కొంచెం ప్రాధాన్యత ఇచ్చింది అనిపించింది. జనవరిలో అమెజాన్‌లో అందుబాటులోకి వచ్చిన నా పుస్తకం ‘గాజులసంచి’ ఎనిమిది నెలల్లోనే తొలి ముద్రణ కాపీలన్నీ అయిపోయి రెండో ముద్రణకు వెళ్ళింది. నేను రాసిన కథలు కొత్తకథ, పెద్దకథ, యువ లాంటి కథా సంకలనాల్లో చోటు సంపాదించాయి. వృత్తి పరంగా కూడా ఒక మెట్టు పైకి ఎక్కగలిగాను. మొత్తమ్మీద 2022 కొన్ని కలలని నిజం చేసి మిగతా కలలని నిజం చేసుకోవటానికి కావాల్సిన ధైర్యాన్ని, ఆశనీ ఇచ్చి పంపుతోంది.

-మహమ్మద్ గౌస్

ఒక రోలర్ కోస్టర్ రైడ్ నుండి దిగి, స్థిరంగా ఒకచోట నిలబడి, స్వేచ్ఛగా ఊపిరి తీసుకునేలా చేసింది 2022. వ్యక్తిగతంగా చాలా నేర్పి, కొత్తబాట వేసిన సంవత్సరం. వృత్తిపరంగా ఇది నాకు రెండు వృత్తులు ఏర్పడిన సంవత్సరం. ఒకటి – నేను ఎప్పటి నుండో సోషల్ సెక్టార్లో పని చెయ్యాలనే కల నెరవేరింది. రెండోది, నా మనసుకి చాలా దగ్గరైన పని, కథలు రాయడం. మొదటిది ఆగస్టు నెలలో మ్యానిఫెస్ట్ అయ్యింది. ఇక కథలు రాయడం అనేది, దానికి తగ్గ కృషి చేయడం గత రెండు సంవత్సరాల నుండి ఎక్కువైంది. దాని ఫలితమే ఈ సంవత్సరం నా మొదటి కథా సంపుటి, ‘ఇసుక అద్దం’ తీసుకువచ్చాను. సంతోషం, భయం, రెండూ బ్యాలన్స్ చేస్తూ ‘ఇప్పుడు నేను ఒక రైటర్ని’ అనే ఫీలింగ్ ఆస్వాదిస్తున్నాను. పుస్తకం రాయడంలో కొత్త కిటుకులు నేర్చుకున్నాను. మొదటిసారి ఒక ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళాను. మొదటిసారి ఆటోగ్రాఫ్ చేశాను. “బ్రో.. నువ్వు ఫేమస్” అంటూ స్నేహితులు పలకరిస్తుంటే “అబ్బే! నేను ఎప్పిటికీ నీ ఫ్రెండే” అంటూ ప్రేమలు. చాలా బాగుంది. ఇదంతా కథలు ఇచ్చాయి. కథకుల ట్రైబ్ ఇచ్చింది. మనం కథలు రాస్తాము, మన ఆలోచనలు వేరు, అయినా మనం ఒక్కటే అనే వాళ్ళ వార్మ్ వెల్కమ్ ఇచ్చింది. మరింత ఉత్సాహంతో ఇక 2023లోకి దూసుకుపోవడమే.

-శ్రీ ఊహ

*

 

వి. మల్లికార్జున్

కొత్త కథకి సరికొత్త వాగ్దానం మల్లికార్జున్. రాసిన ప్రతి వాక్యం భిన్నంగా రాయాలన్న తపన. తను చెప్పాలనుకున్న కథకి ప్రయోగమనే గీటురాయి మీద నిరంతరం పరీక్షించుకునే నూత్న పథికుడు.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథకుల మనో భావాలు ఇవ్వడం బాగుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు