నేను రాజమండ్రిలో పనిచేస్తున్నప్పుడు గంటేడ గౌరునాయుడు మేష్టారు గారక్కడకి వచ్చారు. నన్ను తనతో బాటు ప్రముఖ విమర్శకులు కోడూరి శ్రీరామ మూర్తి గారింటికి తీసుకు వెళ్ళారు. మూర్తి గారి ఆదరణ నేనిప్పటికీ మర్చిపోలేను. అప్పుడు ఆయన కథల గురించి శ్రీపాద వారన్న మాటలు ఉటంకించడం నాకు హృదయంలో నాటుకుపోయింది. ‘కథలంటే పైపైన ఉన్నాయనుకుంటున్నావేమో, అవి కల్పించడానికి ఎంతో ప్రతిభ కావాలి. వాటి విలువ తెలుసుకోవడానికెంతో పరిజ్ఞానం ఉండాలి. అవి బోధ పరుచుకోవడానికెంతో బుద్దిసూక్ష్మత కావాలి. కథలు కళ్ళకి వెలుగునిస్తాయి. బుద్దికి పదునుపెడతాయి. మనసుకు ఉత్సాహము, ఉల్లాసము, ఇస్తాయి. కథలు చదవడం, వినడం, ఎప్పుడూ దండుగ అనుకోకేం’ అన్నారు. ఆ తర్వాత ఒక మిత్రుడి దయచేత మనసు ఫౌండేషన్ వారు అచ్చు వేసిన శ్రీపాద సర్వ లభ్య రచనలు కొనుక్కోవడం చదవనారంభించడం నాకు చేసిన మేలెంతో మాటల్లో చెప్పలేను. కొందరి పరిచయాలు, మాటలూ మనలోపల కాంతి రజను పుట్టిస్తాయి.
వంశీకృష్ణ కథలు చదువుతూ ఉన్నప్పుడు శ్రీపాద వారి ఈ మాటలెందుకు గుర్తుకు వచ్చాయంటే, ఆయన శైలి వలన. వంశీ శ్రీపాదలా రాస్తాడని కాదు అర్థం. ప్రతి రచయిత తాను ఏర్పరుచుకునే సొంత శైలీ విశేషణం, వారేం రాసినా చదవాలనిపించేట్టు చేస్తుంది. వంశీ వాక్యం అటువంటిది. ‘గోధుమ రంగు ఊహలో’ మొత్తం పథ్నాలుగు కథలున్నాయి. ఇవి జీవితాన్ని ఏక కాలంలో ప్రశంసించాయి, ఆక్షేపించాయి. ఎక్కడా ఆగ్రహించలేదు. పైగా సమన్వయపరిచాయి (?). జీవితంతో సామరస్యం నెరిపే అత్యంత కష్టతరమైన ప్రయత్నం చేశాయి. ఆ వ్యవహారం కొన్నింటిలో బాగా లోతుగా జరిగితే మరికొన్నింటిలో పైపైన ఉంటుంది.
ఇందులోని కథలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే అనేక సున్నితమైన అంశాలను ప్రస్తావిస్తాయి. కొంత సూక్ష్మమైనవి కావడం చేత చూడ్డానికి పరిమాణంలో కనబడకపోయినా వాటి ముద్ర బలమైనది. మరీ ముఖ్యంగా జీవితపు చరమాంకంలో ఉన్న సూర్యనారాయణ శాస్త్రికి అప్పుడే పుట్టి మూణ్ణెల్లైనా గడవని శ్యామ కళ్యాణి అనే పసి గుడ్డుకీ మధ్య చివురించిన అనుబంధం (శ్యామ కళ్యాణి), ఎప్పుడో కాలేజీ రోజుల్లో సహాధ్యాయి రేవతి పై తెలిసీ తెలియక ప్రేమాభిమానాలు పెంచుకున్న కరుణాకర్ ఆమె చనిపోయిన వార్త చూసి చలించి పోయిన విధం (ఎదురైన దృశ్యాలు), అమ్మ బట్టల విషయంలో మనస్తాపం చెంది ప్రాణం తీసుకునే దాకా వెళ్ళిన సుధాంశు అనే కొడుకు గుండెల్లోని బాధ (దుస్తులు) – ఇవన్నీ చదువరుల హృదయాన్ని కకావికలం చేస్తాయి. అయితే మంచి (?) కథకి లక్షణం ఏమిటి ? ఏ సాహిత్య ప్రక్రియకైనా ఒక ఆమోదయోగ్యమైన లక్షణాన్ని స్థిరీకరించడం ఎంత దుర్లభ ప్రయత్నమో ఒక్క పాఠకుడికే ముందు తెలుస్తుంది. ఇక్కడ అతని పరిణితిని / పసితనాన్ని కొంత పక్కన పెడదాం. కథ ఒక రూపం తీసుకుంటున్న క్రమంలో రచయిత తన లోపల గురవుతున్న సంఘర్షణే అతని కథన మూలం కావడం గురించి తప్పకుండా ఆలోచిద్దాం. లేదా అనేక జీవన వైరుధ్యాలని ఒక హేతువుకు ముడిపెట్టలేని పరిమితి గురించి కూడా సదుద్దేశ్యంతోనే ఆలోచిద్దాం. పుస్తకం టైటిల్ కథ, ఒక పసుపు పచ్చ సాయంకాలం ఇటువంటి ఆలోచనలు రేకెత్తిస్తాయి. లేకపోతే ఊహలకు రంగులేవిటీ అనిపిస్తుంది కానీ రంగులు, ఊహల వెనుక ఉన్న పరస్పర సంబంధ బాంధవ్యాల బాహ్య రూపాలు.
వంశీ ‘నిజానికి’ సంబంధించిన ఒక చైతన్యవంతమైన అంశాన్ని చిత్రిస్తున్నప్పుడు పాత్రల మధ్య కలిగే రాపిడి మనలో నిర్వికారమైన ఒత్తిడి కలిగిస్తుంది. దుస్తులు కథ ఇందుకు ఉదాహరణ. సామాజిక పరిణామాల్లో చిక్కుకున్న తల్లి బలహీనతను కొడుకు తట్టుకోలేక పోతాడు. ఈ అసమ సమాజం నుండి తనను తాను బయటకి నెట్టినట్టుగా భావిస్తాడు. అభివృద్దిలోని తిరోగామీ స్వభావం పిల్లల్ని సైతం నలిగిపోయేట్టు చేస్తున్న దాఖలా ఇది. దాన్ని మరింత బలంగా చెప్పేందుకు వంశీ కథలో ఆ పిల్లాణ్ణి చంపేస్తాడు. ఈ పిల్లాణ్ణే కాదు, శ్యామ కళ్యాణిలో కళ్యాణినీ, ఆమె తల్లి నీలవేణిని, గాంధీలో గోలి బ్రదర్స్ పిల్లల్ని, మౌనలో స్కూల్ కెళ్ళిన ఒక చిట్టి చేమంతిని, సెలవులో- పందులు కాయాల్సినవాడు పట్నంలో చదివి పైకొచ్చినవాణ్ణి సైతం, అందర్నీ చంపేస్తాడు. ఇదొక విపరీతమేననిపించింది. స్పృహతోనే దీన్ని రచయితకు ఆపాదిస్తున్నాను. పోయెటిక్స్ లో ‘Tragedy is imitation of action’ అంటాడు అరిస్టాటిల్. కనుక ఒక సహజమైన కార్యశీలత (action) ని నిర్దేశించే గుణము (character), ఊహ /బుద్ధి (thought) ని బట్టి పాత్రల స్వభావం అర్థం చేసుకోవచ్చనీ; అదే విజయవంతమైన కథాంశం (Plot) అవుతుందంటాడు. వంశీ కథల్లోని విషాదమంతా జీవితంలోని సందేహాల్ని, భయాన్నీ, సానుభూతిని, కొంత నిరాశని కూడా రేకెత్తిస్తాయి. వాటి నుండి మనల్ని మనం ఎంత దూరం జరగాలో తెలుపుతాయి. పాఠకుల్లో కలిగే ఈ జాగరూకత (alertness) కథకి చేసే మేలు చాలా సూక్ష్మమైనది. అందరూ తెలుసుకోవడం కష్టం.
అందుకే రచయితల్లో విషాద చిత్రణ చేసే రచయితలు అరుదు. గోపీచంద్, బుచ్చిబాబు, వంటి వారిని వంశీ ఎక్కువ ఆరాధిస్తాడేమో. ఉష్ మాన్ చెప్పని కథ చివర బుచ్చిబాబు చివరకు మిగిలేది లోని దయానిధిని ప్రస్తావిస్తాడు. అతడి పాత్ర చిత్రణలో ఉన్న తాత్విక సంక్లిష్టత వంశీ కథల్లో లేకపోయినా వంశీకి ఆ శైలి (genre) పట్ల ఎదో ఒక ఆకర్షణ ఉంది. వంశీ కథలు బలహీనతలతో పోరాడే పాత్రల్ని సృష్టిస్తాయి. అందుకే ఒక తాత్విక గాఢత, దాని వెనుకగల విస్తృతమైన సాహిత్యాధ్యయనం, మనోవైజ్ఞానిక దృష్టి వంటి విషయాలను ఈ కథలు తడుముతాయి. రూపం అయితే పోల్చుకోవచ్చు విరూపాన్ని ఎలా (అద్దంలో అమరేంద్ర), సంతోషానికి కారణం ఎందుకు ? దు:ఖాన్ని నివారించడానికి కారణం కావాలి గానీ (శ్యామకళ్యాణి) ఒకళ్ళు నచ్చడానికీ నచ్చక పోవడానికీ పెద్ద కారణాలుండవలసిన అవసరం లేదు (గోధుమ రంగు ఊహ) నా దుస్తులే నా ఆత్మగౌరవ సూచికలు (దుస్తులు) ప్రేమకు ఎండ్ పాయింట్ పెళ్ళేనా (ఎదురైన దృశ్యం) వంటి అనేక వాక్యాలు వంశీలోని తాత్విక గాఢతకు ప్రతిబింబాలు. ఆ విషయం అనన్యసామాన్యమైన ప్రసేన్ ముందుమాట కూడా తెలియజెపుతుంది. ఎవరి మధ్య అనే చర్చ పక్కన పెడితే వంశీకి ‘మానసిక సాన్నిహిత్యాల పట్ల విశ్వాసమూ సందేహమూ ఏకకాలంలో బలంగా ఉంటాయి’ అంటాడు. వంశీని సరిగ్గానే మధ్యతరగతి కథకుడు అని అంచనా వేస్తాడు.
వంశీ వృత్తిరిత్యా బ్యాంకు ఉద్యోగి కావడం చేత పైసా వసూల్, ఆట ముగిశాక, గాంధీ వంటి కథలు ఆ నేపథ్యంలో నడుస్తాయి. వీటిల్లో సామాన్య పాఠకులకి అర్థం కాని ఆర్థిక పరిభాష ఉంటుంది. దాన్ని పరిహరించాల్సింది. ఎంతో వివరణాత్మక లక్షణం గల వచనం వంశీ సొంతం అయినప్పటికీ ఈ లోపం ప్రస్పుటంగా ఉంది. అయితే కథ యొక్క మూల భావాన్ని ఇవి చెడగొట్టలేదు. భావ వినిమయానికి, సమాచార వినియోగానికి భాష అవసరమా అనగలిగిన వంశీ భాష మాత్రం ‘పూర్తిగా’ జనాంతికం కాదు. అలా అని వ్యాకరణాలు, ఛంధస్సులూ పట్టుకు వేళాడే మనిషి కూడా కాదు. వాక్యం హృదయం తెలిసినవాడు. పరిణిత శైలి కలిగినవాడు.
ఒక స్కాటిష్ రచయిత Hugh Blair అన్నట్టు వ్యాకరణం కంటే సంప్రదాయం గొప్పదని నమ్మే మనిషి. భాషా సౌందర్యం పై గల అపారమైన వ్యామోహము, ప్రేమ, అతనిలోని కవి కూడా ఇందుకు కారణం కావచ్చు. దీనివల్ల పాఠకుల్లో ఒక విభజన (segmentation) వస్తుందేమోనన్న భయం కలుగుతుంది. అందుకే ఈ కథల్లో భావజాల సంఘర్షణకు తక్కువ ఆస్కారం ఏర్పడుతుంది. మైనారిటీ హక్కులు, ముస్లింల మధ్య పెరుగుతున్న అభద్రత గురించి చర్చించిన ఉష్ మాన్ చెప్పని కథలో అసలు విషయాన్ని వంశీ కథన సౌందర్యం మింగేసింది. మొదట్లో ఉస్మాన్ కీ శర్మ కి మధ్య గల అపూర్వమైన స్నేహ చిత్రణ ఈ సమస్య కాని సమస్యకు కారణం. ఉస్మాన్ మన ప్రముఖ కవి, కథకుడు అఫ్సర్ కావచ్చునని తక్కువ మంది ఊహించగలుగుతారు. ఇటువంటి ప్రమాదాన్ని సెలవు కథ సంక్షిప్తత చేత తప్పించుకుంది. విషయమూ శైలీ మధ్య అవినాభావ సంబంధం తెలిసిన విషయమే. కృత్యాద్యవస్థ వాక్యానికి కూడా వర్తిస్తుందంటారు యూ ఏ నరసింహమూర్తి గారు. వంశీ టెక్నిక్ మింగేస్తున్నప్పుడల్లా అందులోంచి బయటపడగల నేర్పున్న రచయిత.
అదే విధంగా కొండ మీద కథ మంత్ర వాస్తవిక ధోరణిలో పర్యావరణ విధ్వంసాన్ని తడిమిన కథ. అద్దంలో అమరేంద్ర, అడవి అంటుకున్నది రాజకీయ కథలు. వంశీ తన కథల్లో ఎంత వద్దనుకున్నా కొంత రాజకీయ, సామాజిక ప్రయోజనాన్ని ఆశించాడు. అభేదతని, లేదా ఏకరీతిని (monotony) చేధించే సఫల ప్రయత్నం చేశాడు. మానవ సంబంధాల్లో వస్తున్న కృత్రిమత్వాన్ని, అంతకంతకూ పెరిగిపోతున్న సామాజిక మాధ్యమాల ప్రభావాన్నీ ఈ కథల్లో మనం చూడవచ్చు. వంశీలో ఉన్న సాహిత్యక లక్షణం అనేక చోట్ల ఈ కథల్లో వెల్లివిరుస్తుంది. నన్నయ్యని, నగ్నమునిని, తరిమెల నాగురెడ్డి, పారుపల్లి, మంగళంపల్లి, నారాయణ శర్మని, బుచ్చిబాబుని, కార్ల్ సాగన్, జార్జ్ ఆర్వెల్, లేయాట్రిస్ ఐసీమాన్ వంటి అనేక మందిని ఉటంకించడంలో కిందా మీదా పడుతూనైనా సంయమనం సాధించాడు. ఇవన్నీ కలగలిపి చూస్తే ఆరు కవితా సంపుటులు, మూడు కథా సంపుటాలు, ఒక ప్రేమ లేఖల సంపుటి, మూడు వ్యాసాల సంపుటి ప్రకటించిన వంశీని ‘ఎంపిక చేసుకున్న’ పాఠకుల సృజనకారుడని భావిస్తాను. మేధో స్వభావం ఉన్న సామాన్యత వంశీ ఆభరణం. కథ అతణ్ణి ఇష్టంగా ఎంపిక చేసుకుంది.
గోధుమ రంగు ఊహ (కథలు) : వంశీకృష్ణ, పేజీలు: 137, ప్రతులకు: పాలపిట్ట 9848787284, ధర:150/-








Add comment