1
లోపల రద్దీ
ఒక
సమూహం
లోలోని ప్రవహిస్తుంది.
వీధిలా.
కార్యాలయం లా
బంధు గణం లా
కొలీగ్స్ లా..
ఉత్తరాల్లా
నడిచొచ్చి
సరాసరి గుండె మూలాల్లో
తిష్ట వేసే అక్షరాలు.
వాట్స్ యాప్
పలకరింపులు
బాస్ ల మెస్సేజ్ లు
టెంప్లెట్స్ ఎమోజీల
గందర గోళం.
రైల్వే స్టేషన్లు
రద్దీలు
బస్టాండు లో
ఊరి వాసనలా
పాప్ కార్న్ గొంతుల్లా..
టేప్ రికార్డర్ కేసెట్లో
నలిగి చిక్కిన రీల్ గజిబిజి పాటలా
రహ దారుల
ట్రాఫిక్ కంట్రోల్ సిగ్నల్
సిస్టం..
జీవిత గందరగోళమంతా
పోటెత్తే మనిషి
లోపలా బయటా
నిరుత్తడిలా
నిస్సహాయంగా..
***
2
దగ్ధదృశ్యం
~
ఒక్కోసారి
మౌనమే మహా వాక్యం
అతడి శబ్దానికి
అర్దం ఉండదు
ఆమె శబ్దానికి
విలువుండదు.
వీరి విలోమానికి
కాలం ఉరిపోసుకుంటుంది
ఏకాంతం
ఎగిరిపోతుంది.
పూల కానుకలు చూసి
సమయాలు
అయోమయానికి గురౌతాయి.
ఆమె ఏకాంతాలను
అతడు ఎన్ని వేలసార్లు
భగ్నం చేసాడో
వసంతం
ఒడలి పోయింది
పరిమళం
గాయపడింది
~
3
మూడోకోణం
గదిలో మూలకు
మోడ్రన్ ఆర్ట్ ఏదో
దృశ్యాదృశ్యంగా గీస్తుంది సాలీడు.
ఎల్ ఈ డి
నీలిరంగు వెలుగులో
కాఫీ కప్ తో నేను
లోలోపల
చిక్కుబడిన ఊహలకు
అక్షర రూపం ఇచ్చేక్రమం
కలం
ప్యాడ్ పై కలల కవాతు.
తూనీగలాంటి భ్రమణం
వినీలాకాశపు లోతుల్లోకి.
చెమ్కీ చెక్కిళ్ళతో
తారసిల్లే జీవితం.
బోన్సాయ్
పూల గుత్తులు
తెరల తెరలుగా పరిమళించే
పచ్చని గులాబీలు.
గడియారపు ముల్లు
ఒద్దికగా నడుస్తున్నా
ఒళ్లు చీరికల
జ్ఙాపకాల చారికలు
సాలీడు
వాల్ పెయింట్ పూర్తవదు.
ఊహలు తెగవు.
లైఫ్ వొక
టంగ్ స్టన్ అల్లిక
సదా కాలుతూ
అక్షరమై వెలగాల్సిందే .
*
Add comment