కే.టీ.

‘ఐటీ-హబ్’ అన్నాను.

ఆటో వాడు అరగంటలో తీస్కెళ్ళాడు.

నడి సముద్రంలో తప్పిపోయిన ఓ నావా, తెల్లారేసరికి నగరం నడి బొడ్డులో తేలినట్టుందిగా ఉన్నా ఆ అద్దాల మేడ ముందు దిగాను.

ఎన్నో ఎమ్మెన్సీ కంపెనీల్లో విఫలమైనప్పుడు ‘ఓ ట్రై’ ఇద్దామని కూర్చోని, నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూ తర్వాత వచ్చిన ఆఫర్ లెటర్ తో, నాకా అంకుర సంస్థ పై విపరీతమైన గౌరవం పెరిగింది. మొదటి జాబ్..మొదటి రోజు కావడంతో తుణికిసలాడుతున్న ఉత్సాహంతో లోపలికి వెళ్లాను. పట్టా పొందిన పాతికేళ్ల కుర్రాడు కసితో కొట్టిన వేడి వేడి జాబ్ కి, లోపల చల్లార్చి రిలాక్స్ అనిపించేలా చేసిన ఏసీ గదులు..కళ్ళు జిగేల్ మన్పించే రంగుల గోడలపై, కళ్ళు తెరిపించే కొటేషన్లు చూస్తూ.. ఎక్కడున్నారోనని వెతకసాగాను..కాబోయే కొలీగ్స్ కోసం. ఏ ముచ్చట గొడుగుల కింద గుసగుసలాడుతూ, గాసిప్స్ ల టేబుళ్ల మీద సిప్ చేస్తూ క్యాంటీన్ కాఫీ వేడి కబుర్లతో కూర్చొనుంటారు. అందులో కాలం కలిసొస్తే జీవిత కాలం ముడిపడిపోయే అమ్మాయి ఉంటుందేమోనని ఓ ఆశ.!

మొదట్లో ఇలాగే ఉంటుందిలే అని తెలిసిన, మెదట్లో పురుగుల్లా చుట్టుకున్న ఎన్నో ఆలోచనలన్నీ ఒక్కసారిగా చటుక్కున ఎగిరిపోయేలా చేసింది..ఓ చిటుక! వెనక్కి తిరిగి చూసేసరికి..ఓ చెయ్యి, కరచాలానికి దగ్గరిగా వస్తున్న చెయ్యి, ఇంటర్వ్యూ చివరి దశలో భుజం తట్టిన చెయ్యి “కంగ్రాట్స్..యూ ఆర్ హైర్డ్,” అని చెవులకు చాక్లెట్ తిన్పించిన మాట చెప్పిన ఆమె..హెచ్.ఆర్. స్రవంతి. “హాయ్..వెల్కమ్ మ్యాన్,” అంటూ పలకరించి పక్కనే ఉన్నా సెక్యూరిటీ రూమ్ దగ్గర్కి తీసుకెళ్లి నా ఐడి కార్డు ఇచ్చింది. ఆధార్, వోటర్ కార్డులున్నా కూడా ‘గుర్తింపు’నిచ్చే కార్డు అని కళ్ళకద్దుకొని మెడలో వేసుకుంటూ వెనకే వెళ్లాను. టకటక ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చెప్తూ పోతుందామె, అన్నిటిని విచిత్రంగా చూస్తూ కలిసి లిఫ్ట్ ఎక్కాసాం. ‘దయచేసి డోర్ వేయండి’ లాంటి మాట రాలేదు కానీ ‘దయచేసి నోరు మూయండి’ అని వినబడిందేమో, అందరూ విచిత్రమైన సైలెన్స్ మైంటైన్ చేస్తున్నారు. నిశ్శబ్దంగా ఉండడం, పాటించడం తెల్సు కానీ ఇలా ఉండి పాటించేలా చేస్తున్న నిశ్శబ్దం నుండి బయటపడి, మూడో ఫ్లోర్ లో తేలాము.

ఆక్సిస్ కార్డుతో లోపల అడుగుపెట్టగానే, ఒక్కసారిగా ఆగిపోయి మరి చూసా..సువిశాలమైన స్పేస్ లో ఇంద్రభవనం లాంటి గదుల్లో ఓ వైపు క్యాబిన్స్, ఇంకో చోట క్యూబికల్స్, ఓ పక్క మీటింగ్స్.. కుర్చునట్టే ఉన్నా ఎవరి కుర్చీల్లో వాళ్ళు పరిగెడ్తున్నట్టున్నారు. అలా వాళ్ళతో పాటుగా పరిగెత్డానికి నాకో కుర్చీ చూపించింది. ‘సిట్ బ్యాక్ & రిలాక్స్’గా దర్జాగా కూర్చున్నాను. స్రవంతి  కాసేపటికే, కిషోర్ అనే వ్యక్తిని పరిచయం చేస్తూ “ప్రాజెక్ట్ కి సంబంధించిన కే.టీ. మొత్తం కిషోర్ ఇస్తాడు..జాగ్రత్తగా అన్ని తెలుసుకో, ఏ డౌట్ ఉన్నా అడగు, మొహమాటపడకు,” అంది. అదే అదనుగా “అసలు కే.టీ. అంటే ఏంటి?” అనడిగా మొదటి డౌట్ నిర్మొహమాటంగానే. దాంతో నేను ఫ్రెషర్నని చాలా స్పష్టంగా అర్థమైనట్టు నవ్వాడు కిషోర్. “నాలెడ్జి ట్రాన్స్ఫర్(కే.టీ.) అనేది చేసిన ప్రాజెక్ట్ మీద అవతలి వ్యక్తికి పూర్తి అవగాహన కల్పించడం. ఇక్కడికి కొత్తగా వచ్చిన వాళ్ళకి, ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు కే.టీ. ఇస్తారు. ఇక్కడి నుండి వెళ్లే వాళ్ళు, చేస్తున్న వాళ్ళకి కే.టీ. ఇస్తారు. అది సరిగ్గా అర్ధం చేసుకుంటేనే, పరిపూర్ణంగా పని చేయగలవ్,” వివరణించాడు కిషోర్.

“సో, మీరిద్దరు కంటిన్యూ చేయండి..మిగితా వాళ్ళను తర్వాత పరిచయం చేస్తాను,” అంటూ స్రవంతి వెళ్ళిపోయింది.

“సో ప్రీతమ్, మన సంస్థ మ్యాప్పింగ్ ని నమ్ముకొని చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయ్. నువ్వు పని చేయబోయేది మాత్రం ఫుడ్ ఆర్దరింగ్ మీద” అని కిషోర్ చెప్పగానే, అన్నం తెచ్చిపెట్టే యాప్ కి కోడ్ రాసే పుణ్యం నా చేతులకి దక్కబోతుందన్న సంబరం కలిగింది. సంబంధించిన డాక్యూమెంట్స్ చూపిస్తూ “ఇప్పటికే మన యాప్ లైవ్ లో ఉంది. దాదాపు రెండు కోట్ల కస్టమర్స్, యాభై వేల డెలివరీ బాయ్స్, నిమిషానికి రెండు వందల ఆర్డర్స్..ఉన్న దానితో ఎప్పుడు ఆగకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి, లేకపోతే వెనక పడిపోతాం. ఇప్పుడు అప్డేట్ కి జోడించాల్సిన కొత్త స్క్రీన్లు, సరికొత్త ఫీచర్స్ అనేవి ఏ రూపకంగా ఉండాలో నీకు యూఐ డిజైనర్స్ మెయిల్ చేస్తారు. ప్రస్తుతానికి ఈ డాకుమెంట్స్ తిరిగేయ్ సగం వరకు నీకే అర్ధం అవుతుంది. ఇంకొంత మంది వచ్చే వాళ్ళున్నారు. మిగితా కే.టీ. అందరికి కలిపి ఇస్తాను,” అని కిషోర్ వెళ్ళిపోయాడు..కాదు వేరే పనుందని  తప్పించుకున్నాడు.

నాకు చాలా విచిత్రంగా తోచిందంతా…ఒక చోటు నుండి వ్యక్తినైనా వస్తువునైనా ఎక్కించుకొని కావాల్సిన చోట దింపేయడం అనే ఆలోచనతో బుకింగ్ సర్వీస్ మొదలై, అది కాస్త పేరుపొంది సిరీస్ ఫండింగ్ రాగానే దాంట్లోనే ద్వి,త్రి చక్రాలను కూడా జోడించి బిజినెస్ పెంచుకొని, చాలదన్నట్టు డబ్బులు పంపడాన్ని, కొరియర్ చేయడాన్ని, ఫుడ్ డెలివరీ ని కూడా ఇరికించి యాప్ ని వ్యాప్తి చెందేలా చేయడం..ఇదంతా ఓ చిన్న గదిలో మొదలై రెండేళ్లలో దేశ వ్యాప్తంగా పాకీ ఆఫీస్ లను నెలకొల్పి సుమారు రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పింస్తుంది. ఇన్ని తెలిసాకా, యాప్ మొత్తం మనదేశం వాళ్ళే కదా తయారు చేసి వాడేది, ఆన్ సైట్ లోనే ఉన్నాననే ఫీలింగ్ తో వింత విరక్తి రెండు కలిగాయి..‘ఒక మంచి ఆలోచన విలువైనది ఎప్పుడవుతుందoటే..అది ఆచరించినప్పుడే,’ దూరంగా ఎడిసన్ మాట బల్బ్ కింద వెలిగిపోతుంది.

లంచ్ టైం లో..

“మన్ ప్రీతమ్..! ఏంటి మీ ప్రాంతంలో ఇలాంటి పేర్లు కూడా ఉంటాయా?!,” తింటూ పరిచయమైన కొత్త కొలీగ్ విచిత్రరంగా కాకుండా వెటకారంగా అడిగాడు.

ఇంకా ఏ కాలంలో ఉన్నారనుకొని ”ఇప్పడున్న కాలంలో పేరు పక్కకుండే తోకలే కత్తిరించుకుంటుంటే..ప్రాంతాన్ని బట్టి పేరు ఎంతండి. అయినా మీకు సినిమాల ప్రభావం ఎక్కువ కావచ్చు, అందులోని పాత్రలకు ప్రాంతపు సొగసు అద్దేలా కొన్ని పేర్లను మాత్రమే రుద్దబడుతున్నాయి. అలాని అందరవి అలాగే ఉంటాయనుకుంటే ఎలా,” అన్నాన్నేను కొన్ని ఒత్తుగా పలుకుతూ. అయినా కూడా అతనికి తింటున్న డోనట్స్ కంటే నా పేరే డైజెస్ట్ అవనట్టుగా ముఖం పెట్టాడు. కోడింగ్ వచ్చినంత మాత్రానా ఎదగని కోడి దిమాఖుల్లో వీడు ఒకడని మనసులో అనుకున్న.
పక్కనే ఉన్న ఓ సీనియర్ “మ్మ్..భలే పేరు.నిజానికి లిస్ట్ లో చూడగానే, పదాల అర్థాలు తెలీక కావచ్చు అబ్బాయో అమ్మాయో అర్ధం కాలేదు” అన్నాడు. “ఇంకా నయం, నన్ను చూసాక ఆ డౌట్ రాలేదు,” అన్నాన్నేను వాళ్ళతో పాటు గా నవ్వుతూ..
“కొత్త కాబట్టి నీకో సలహానోయ్, ఏమొచ్చినా రాకున్నా మన ఐటీలో కాపీ పేయిస్ట్ చేయడం మాత్రం తెలిసుండాలి…ఏ కంపెనీ వాడైనా ఏదో ఓ రోజు ‘జై గూగుల్’ అనకతప్పదు” అన్నాడు ఇంకా గట్టిగా నవ్వుతూ..

సరిగ్గా అదే సమయానికి వచ్చింది ఆమె..చూస్తూ ఉండిపోయేంత అందంగా,అంతే సౌమ్యంగా కూడా. ఏ అడివిలో ల్యాండై, చెట్ల సంధుల్లోని బండ కొండల నడుమ సమాధానాలు దొరక్క, స్పేస్ కావాలంటూ మైండ్ స్పేస్ లో అడుగుపెట్టి.. నా ముందు హైహిల్స్ వేసుకున్న దేవకన్యలా నిల్చున్నట్టుంది. సముద్రపు బ్లూ ని డ్రెస్ గా, ఉప్పు అలల చున్నిని మెడ చుట్టూ తిప్పుకొనున్నామెను చూసినప్పటి నుండి పెదాల మీదుండే నవ్వు ఒళ్ళంతా పాకినట్టైంది. నిజంగా దేవుడెంత గొప్ప యూఐ డిజైనరో కదా అని కళ్ళు చాలా సేపటికి ఆర్పుకొని అనుకున్నాను.

స్రవంతి ఆమెని చూసి ‘హే.. లేఖ’, అనగానే నిమిషంలో ఆ పేరుని ఎన్ని సార్లు జపించానో..మా ఇద్దరికి పరిచయం అయ్యాక, తన నోట నా పేరు పలికి..’నైస్ నేమ్’ అనగానే ఆ రోజంతా పేరు పెట్టిన నాన్నని మెచ్చుకుంటూనే ఉన్నా.. పాతికేళ్ళకు!
“కొంచెం నీరు..కొంచెం నిప్పు..ఉన్నాయి నా..” అని ఆమె పేరుతో ఉన్న పాటను మాత్రం గుండె సింక్ లో అందుకుంది.
ఇచ్చిన డాకుమెంట్స్ చూస్తూ, రెండు కాఫీలు, నాలుగు నవ్వులతో రోజు గడిచిపోయింది. రూమ్ కి వెళ్లి మంచంమీద వాలగానే నా నెంబర్ ఆఫీస్ వాట్సప్ గ్రూప్ లో ఆడ్ చేశారు. బోలెడన్ని కబుర్లు..అందులో లేఖ కూడా ఉంది. ఆమె డీపీ చూసా..గోవా సముద్రం ముందు, కోవా చూపులతో ఓ నవ్వు కన్పించగానే, గుండెలో ఫర్లూపై పడుతూనే ఉంది.. ‘చం..ద్ర..లే..ఖ..’ అని.

మరసటి రోజు..

పక్కనే వచ్చి కుర్చుంటుందని అనుకోలేదు. కిషోర్ కూడా రావడం “ఇద్దరికీ కలిపే కే.టీ. ఇస్తాను” అనడంతో అర్ధం అయిన్ది తను కూడా కొత్తే అని. ప్రాజెక్ట్ లో చేయాల్సిన వాటిపై చెప్తుంటే “మనమే కదా యాప్ చేసేది, సో మనమే కొన్ని కూపన్లు, ఆఫర్లు తయారు చేసుకోవచ్చా?” అడిగిందామె ఆశగా. నాకు నవ్వొచ్చింది, కానీ కిషోర్ ‘నో’ అన్నట్టు లుక్కిచ్చాడు. కాసేపటికి కాఫీ కి వెళ్ళాం. “కక్కుర్తి వెధవ క్లయింట్ దగ్గర నుండి బానే నోక్కుతున్నాడుగా, కాఫీ తప్ప ఇంకేం లేదు ఆఫీస్ లో” గుణుక్కుంటున్న ఆమె మాటలు వినబడసాగాయి.
సడన్ గా నన్ను చూసి “సో, ఎలా అనిపిస్తుంది కొత్త ఆఫీస్?” అడిగింది.
“మ్మ్మ్.. బాగుంది. నీకు?” ఏదో మాటలు కలపాలని నేను.

‘బానే’ అన్నట్టు తలూపింది.
అత్యుత్సాహంతో “మీ ఎక్స్పీరియెన్స్ ఎంత?” అడిగాను.

చిత్రం: ఆగాచార్య

ఆశ్చర్యార్ధం కిందో నవ్వు “నీకిది రెండో రోజు..నేను నీకంటే రెండ్రోజులు ముందు అంతే, అయినా అంత పెద్దావిడలా  కనిపిస్తున్నాన అనుభవం అడిగావు. ఫ్రెషెర్ని కూడా కాదు..అసలింకా నా కాలేజీ కూడా అయిపోలేదు,” అందామె భుజమ్మీదున్న వెంట్రుకల్ని వెనక్కి తోసేస్తూ.
“కాలేజీ అయిపోలేదా! ఇంకొన్ని సబ్జెక్టులు మిగిలాయేమో” అనుకుoటూ మెల్లిగా లింక్డ్ఇన్ లో తన ప్రొఫైల్ చూసా, నిజమే తను వరంగల్ ఎన్.ఐ.టీ కంప్యూటర్ సైన్స్ లో ఫైనల్ ఇయర్
“నేను ఇంటర్న్షిప్ చేయడానికి వచ్చా, మా చివరి సెం లో ఇదో భాగం…మేజర్ ప్రాజెక్ట్ పని కింద ఇక్కడ చేసింది చూపిస్తే చాలు” అంది.
కోఠి లో కొని పారేసే ప్రాజెక్ట్ కి, కే.టీ. తీస్కొని మరి చేయడమేంటో అనుకున్నాను.

“ఇంటర్న్ గా సరే, మరి తర్వాత ఏంటి?” అడిగాను ప్లేసెమెంట్స్ ఏమైన వచ్చాయేమెనని.
“ఇంకా అదే ఆలోచించాలి..చేతులో రెండు కంపెనీలున్నాయ్ కానీ హోల్డ్ లో పెట్టాను,” అంది.
అడిగి అడగనట్టుగా ప్యాకేజీ అడిగితే ”పాతిక లక్షలు” అంది.
వేడి కాఫీ సురుకు నాలుకకు అప్పుడే తాకినట్టైంది. “మరి ఇంకేంటి ఆలోచించడానికి, మాకిక్కడ ఒక్క ఎమ్మెన్సీ కూడా దిక్కులేదని ఏడుస్తుంటే,” నేను.
“భయం..! ఉద్యోగం చేస్తే అదే అలవాటు ఐపోతదని భయం.. పోనీ కొద్ది రోజులు చేసాక వదిలేద్దామనుకుంటే, మన చుట్టున్న వాళ్ళు ఒత్తిడి చేస్తారని భయం. అందుకే హోల్డ్ లో పెట్టాను. ఇవేమీ కాకుండా ఇంక్యూబేషన్ లో ఉన్న నా బేబీ పొదిగి ఎదిగితే చాలు..ఈ భయాలుండవు,” అంది చివరి వాఖ్యలు చాలా రిలాక్స్డ్ గా అంటూ. నాకొక్క సారిగా నాలుకకి కాఫీ కాకుండా కరెంటు వైర్ తాకినట్టు షాక్ కొట్టింది.
ఎమోజీ లో కూడా దొరకని విచిత్రమైన నా ముఖచిత్రంని చూసి, ఆమె రెండునిమిషాల దాకా నవ్వుతూనే ఉంది.

“హే చిల్.. మా కాలేజీలో ఐడియా ఇంక్యూబేషన్ సెంటర్ ఉంది. ఆచరించ దగ్గ ఇన్నోవేటీవ్ ఆలోచనలకి కాలేజీ తరపున ప్రోత్సాహం అందించి, దాన్ని అంకురం సంస్థగా తీర్చిదిద్దడం లో సహాయ పడ్తూనే ఉంటుంది. అలా నాకున్న కొన్ని ఆలోచనల్ని వాళ్ళ ముందైతే పెట్టాను. వాళ్ళనుండి స్పందన పాజిటివ్ గా వస్తే, నేనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తా,” అంది తను చాలా ఈజీగా.
నాకు అంతే ఈజీగా నవ్వొచ్చింది. ‘ఎందుకు బే నవ్వుతున్నావ్,’ అన్నట్టు చూసింది.
ఎర్రర్ వచ్చిన కోడ్ లా ఎరుపెక్కిన ఆమెను చూస్తూ.. “అటు కిషోర్ నుండి కే.టి. తీసుకుంటూనే ఇటు బగ్ ఫిక్సింగ్ ఎలా చేయాలో తెలీక నెత్తి గోక్కుంటూ కూర్చుంటున్నాం. అలాంటిది కంపెనీ అం..టే..,” కష్టం అన్నట్టుగా నేను.

“హలో.! జస్ట్ చిన్నగా ప్రాజెక్ట్ మొదలెట్టడమే, అది స్టార్ట్అప్ గా మారి, ఫండింగ్ తో ఎదిగి సంస్థగా మారడానికి చాలా ఉంటది. అందుకని, ముందే అన్నిట్లో పర్ఫెక్ట్ అవ్వాల్సిన పని లేదు అనేది నా పాయింట్. అంతెందుకు మన సీఈఓ వెంకీ, కాలేజీ లో నా సీనియర్. అతనేమైనా కోడింగ్ లో, మార్కెటింగ్ లో  ఎక్స్పర్టా? కానీ రిస్క్ తీస్కొని తన ఐడియా ని మా ఇంక్యూబేషన్ లో  కొంచెం కొంచెం గా ఇంప్లీమెంట్ చేసుకొని, కాస్త ఫండింగ్ రాగానే ‘మీ లాంటి’ వాళ్ళని పెట్టుకొని విస్తరించి నడిపించట్లేదా. మరి ఎక్కువ సీరియస్ గా ఆలోచించి భయపడితే ఈ కంపెనీ, నువ్వు, నేను ఇలా ఉండేది కాదు కదా. ఇంట్రెస్ట్ & ఇన్వెస్ట్మెంట్ మ్యాటర్స్,” అంది.
అయినా కూడా ఎదో అనుమానపు ముడతలు పోనీ నా నుదిటిని నొక్కి “నాకు తెలిసింది చెప్తాను..మన దేశంలో ఎదిగిన బుకింగ్స్ సర్వీసెస్ మాత్రమే కాదు, పంట పొలలకు సంబంధించిన నుండి ఎగిరే ప్లేన్స్ వరకు ఎలక్ట్రానిక్స్ లో, రోబోటిక్స్ లో, కుత్రిమ మేధస్సు(ఏఐ), ఐఓటి లో ఎన్ని ఐటీ ఆవిష్కరణలు ఇంక్యూబేషన్ సెంటర్ల నుండి వచ్చాయో తెల్సా. అవే కాకుండా తక్కువ ఇంధనం తో ఎక్కువ సామర్ధ్యమున్న ఇంజిన్లు, ఈ-బైక్స్ , స్మార్ట్ బైక్స్ లాంటివి మెషినరీ సెక్టర్స్ లో కూడా చాలా ఉన్నాయ్..” అని చెప్తూపోతూనే ఉంది. విని ముచ్చటగా తలూపుతు నేను, మధ్యలో కిషోర్ రాగానే నిశ్శబ్దంగా లోపలికి వెళ్లిపోయాం.

కిషోర్ కే.టీ. మొదలు పెట్టాడు కానీ నాకు ఏమి కూడా ఎక్కట్లేదు. పని అయిపోయి రూమ్ కొచ్చిన కూడా, మన కాలేజీల్లో ఇంక్యూబేషన్లు ఎందుకు లేవు అనే ప్రశ్న తో మొదలై, మనకు ఆలోచనలు అనేవి రావా లేదా ఆలోచనలకు పనికి రామా?!! ఒక వేళా వచ్చిన ఐడియాలను ఎలా ముందుకు వెళ్ళాలో తేలికే ఎంతో మంది ఆగిపోయారేమొ! అదే అయితే ఆలోచలనే కాదు మనసుల్ని కూడా చంపుకొని ఉద్యోగం చేయటమే దిక్కనట్టుగా మల్చబడ్డమా? ఇంకెన్నో ప్రశ్నలు మెదడుని నిద్ర పోకుండా చేస్తున్నాయి, ‘ఛ.. ఉద్యోగమొచ్చిన సంబురం కొద్దీ రోజులైనా లేకుండా పాడు చేసింది ఈ పిల్ల’ మళ్ళీ ఆమె డీపీ చూస్తూ.

తెల్లారింది..
ఎప్పటిలాగే, అంతే అందంగా..

చుట్టూ స్కాన్ చేసే కళ్ళ మధ్య, నవ్వు అతికిచ్చుకొని నడిచొస్తున్న క్యూఆర్ కోడ్ లా తను.
రోజంతా ఎం చేసిన నా దగ్గరికొచ్చే సరికి మాత్రం ఆవిష్కరణల ప్రస్తావనే తెస్తది. “అయినా అందరు ఆవిష్కర్తలే అయితే, పనులు చేసేదెవరు చెప్పు,” అన్నాను కానీ సరిగ్గా ఏది తియ్యకూడదో అదే తీసానేమో, వెంటనే అందుకుంది..
“పర్ఫెక్ట్.. అందరు ఇలాగె ఆలోచిస్తారు కాబట్టి ఎవరు అవ్వట్లేదు తెల్సా! అయినా కొన్నిటికి గట్స్ ఉండాలమ్మ,” పొడిచినట్టుగా ఆ మాట “గట్స్ కంటే ముందు ఆలోచన కూడా మంచిదై ఉండాలిగా..అసలు ముందు ఆలోచన అనేది రావడం అంత ఈజీనా! ఎదో కదిలించే సంఘటన నుండి ‘అలా జరక్కుండా ఇలాంటిదేదో చేయాలి’ అని అనిపించాలి లేదా మనిషికున్న బద్దకం ని ఆసరాగా తీస్కొని ఈజీగా పనులు చేసిపెట్టేలా ఉండాలి. అది కూడా వాడకం ఎక్కువుండి అందరికి అవసరమై ఉండాలి. ఇంత పెట్టుకొని మెదట్లో తర్జన భర్జన జరిగి ఓ బృహత్కరమైన ఆలోచన బయటికి ఎప్పుడు రావాలి?”నేను.
“ఓఓ..కూల్, ఐడియానే కదా. అయినా, నీకో సీక్రెట్ చెప్పనా, మన దగ్గర ఉన్నతంగా ఎదుగుతున్న చాలా ఆవిష్కరణలు, బయట దేశంలో ఆల్రెడీ ఎప్పడినుంచో ఉన్నవే. అవ్వే ఎక్కువ ఇక్కడ పెట్టేస్తున్నారు. ఉపయోగపడేదేగా అని స్లోగా క్లిక్ అవుతున్నాయి..” అంది. అలా తను చెప్తున్నప్పుడే వచ్చాడు “మీకిచ్చిన టికెట్స్ ఫిక్స్ ఐపోయాయ? లేదంటే వెంటనే చేసేయండి, రెండ్రోజుల్లో డెమో ఉంది,” అదర బాదరాగా  కిషోర్.
“సరే చేసేస్తాం” అని ఇద్దరం తలూపాము.
“అయినా యాప్ ఎప్పటినుండో లైవ్ లోనే ఉంది కదా, మరి డెమో ఎవరికీ?” కుతూహలంగా అడిగింది.
“అంటే ప్రస్తుతం మన కంపెనీ ని ఒక పెద్ద కంపెనీ కొనేయడానికి సిద్ధం గా ఉంది..వాళ్ళకు కొత్త ఫీఛర్స్ తో డెమో ఇవ్వాలి,” కిషోర్
” సో గాయ్స్, గో గెట్ ఎన్ కంప్లీట్ వర్క్” అంటూ పనిలో మునిగేలా చేసేసాడు. అంత పూర్తి చేసి కిందికి దిగుతుంటే ఎదురైంది ‘నేను కూడా వస్తాను’ అనే సైగ తో ఆగాను.
కలిసి నడుస్తున్నాం “ఇంతకీ ఏ కంపెనీ కొనేది?” నేను.
కింది పెదవి బయటికి పెట్టింది..ఏమో అన్నట్టు “కానీ చూసావా, ఎంత లాభమో. మొతానికి వెంకీ గాడి సంస్థ స్థాయి పెరుగుతుంది,” అంది.
అన్నదాంట్లో ‘గాడు’ మాటకి నన్నుచూసి, “వాడు నన్ను ర్యాగింగ్ చేసిన సీనియర్ అని చెప్పా కదా,” అంది.
అయినా కూడా జీతమిస్తున్నాడనే గౌరవం ఉండాలిగా అని నేను.
“నాకిచ్చేది స్టైఫండ్. అయినా ఎంత కమర్షియల్ వ్యక్తో నీకేం తెలుసు, ఎక్కడ రెఫరల్ బోనస్ ఇవ్వాల్సి వస్తదేమోనని నాకు డైరెక్ట్ గా ఆఫర్ లెటర్ పంపి,నన్ను పరిచేయం చేసిన మన కిషోర్ రెఫర్ మెయిల్ రిజెక్ట్ చేసాడు. అయినా, ఇక్కడ నీకో విషయం అర్ధం అయిందా.. ఎదుగుతున్న అంకుర సంస్థలపై బడా కంపెనీలు ఎప్పుడు ఓ కన్నేసి ఉంచుతాయి, లాభాల సమయంలో వెంటనే చూసి కొనేస్తాయి,” ఆమె.
“అవును, ఈ విషయం నాకు మొన్నే అర్ధం అయిన్ది. మా రూమ్మేట్ ఇలాగే స్టార్ట్అప్ లో చిన్న జీతానికే పనిచేసేవాడు. దాన్ని మొన్న ఓ సంస్థ కొన్నది. ఇప్పుడు వాడు ఆ పెద్ద కంపెనీ ఎంప్లాయ్ అయిపోయాడు. ఇప్పుడు వాడి జీతం లచ్చ,” నీరసంగా నేను.
“రా..మా.. నేను ఐడియాలను సంస్థగా ఎలాగా అవుతున్నాయో చెప్తే, నీకు దాంట్లో ఉద్యోగాలే కనబడుతున్నాయా. అయినా ‘ఉద్యోగం వస్తే చాలు’ అనుకుండే మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే, మీకో సీట్ ఇచ్చి కష్టపెట్టి వెంకీ లాంటోడు ఎదుగుతున్నాడు,” అంది. ఎక్కడి చేతులు అక్కడే ఉన్న చెంప వాచినట్టుగా ఆ మాట.. ఎందుకో అక్కడ ఉండబుద్ధి కాలేదు,వెంటనే ‘సరే బై’, అంటూ టకటకా బస్ ఎక్కేసాను.

కిటికీ లోంచి పరిగెడ్తున్న ప్రపంచంకంటే వేగంగా నా ఆలోచనలు…తగిలిన మాటల్లోంచి కాస్త నొప్పి పుట్టిన అసలు ఆమె దాంట్లో చెప్పాలనుకున్నది ఏంటి..? నాకు అర్థమైందేంటి? ఉద్యోగాల కోసమే ఈ చదువులు,కాలేజీలు అని పుట్టాయా? లేదా మన మీద అలా రుద్దబడ్డాయా? అయినా ఎప్పుడు ఎవరి మీదో ఏడవడం కాకుండా మన వైపున్న తప్పులను చూసుకోవాలిగా అనుకున్న. ఏం చదివాం, ఏం చేస్తున్నం అని మననం చేస్కోకతప్పలేదు. అయినా ఉద్యోగం రావడానికే కిందా మీదా పడ్తుంటే, అవి కల్పించే సంస్థలు పెట్టడం అంత కష్టమేమి కాదు అనే తనని ఎలా అర్థం చేసుకోను. మొన్నీ మధ్య…కేవలం పెద్ద కంపెనీల్లో జాబ్ కోసమని కొంత మంది వాళ్ళ సైట్స్ ని హ్యాక్ చేశారు. నిజానికి హ్యాక్ చేయడం అంత ఈజీ కాదు కదా. నేర్చుకొని మరీ సెక్యూరిటీ కోట గోడల్ని దాటుకొనో, కూల్చో  డేటా మాయం చేయడమనేది చిన్న విషయం కాదు. అలా చేసాక ఎలాగు పెద్ద కంపెనీ వాళ్ళు పోలీస్ ల సహాయం తో వాళ్ళని పట్టుకొని జైల్లో వేశారు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళి ఎం చేస్తారేమోనని ఆ కంపెనీయే వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చింది. ‘ఇలా ఉద్యోగo వస్తుందనే‘ హ్యాకింగ్ నేర్చుకున్నానని ఒకతను చెప్పడం కొస మెరుపు. అంత తెలివి తేటలు ఉన్నోడికి ఇంక్యూబ్షన్ సెంటర్లు ఎదురైతే ఈ పాటికి ఎన్నో స్థాపించి ఎదిగిన ఎంతో మంది గొప్ప వాళ్ళ మధ్య ఉండేవాడేమొ అని నా ఫీలింగ్…ప్చ్.

మొదటి వీకెండ్…
రెండ్రోజుల శాంతి కోసం ఐద్రోజుల చేసిన యుద్ధంలా వీకెండ్..గీకడానికి ఏం లేవని క్రెడిట్ కార్డ్లు వెక్కిరిస్తుంటే, గీకిన గూగుల్ పే స్క్రాచ్ కార్డ్లో అదృష్టం లేనప్పుడు..ఆఫీస్ వాళ్ళు టీం లంచ్ అనేసరికి వెళ్ళక తప్పలేదు.
‘ఊరించి ఊరించి ఊతప్ప తిన్పించినట్టు,’ ఎన్నో రోజుల నుండి అడుగుతుంటే ఏ ఫైవ్ స్టార్ట్ హోటల్ అనుకుంటే మన యాప్ లో ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న హోటల్ కి పట్టుకొచ్చావ్ అంటూ స్రవంతి ని నోట్లోనే తిట్టుకున్నారు కొలీగ్స్. అందరం లోపల కూర్చున్నాం, ఆమెకి ఎదురుగా నేను. ఈ రోజు మనసు విప్పి మాట్లాడుకోవాలి, వేరే ముచ్చట్లు ఏమి ఉండకూడదు అని ఫిక్స్ అయ్యాను. అంతలోపు ఎవరో అమ్మాయి దిగింది ‘లే..ఖ..!’ అని. చాలా రోజుల తర్వాత అనుకోకుండా కన్పించినట్టుగా ఆమె ముఖంలో ఓ కాంతి.
“హాయ్..” అంటూ ఆమెతో మాట్లాడడానికి వెళ్ళి కాసేపటికీ ఇద్దరు మాయమైపోయారు. ఎవరి ఆర్డర్ వాళ్ళు చెప్పుకొని లాగించేస్తుంటే, నాకు మాత్రం ముద్దదిగట్లేదు. అవతల పక్క కిషోర్ వచ్చి కూర్చున్నాడు. కుదిర్తే ఇక్కడ కూడా కే.టీ. ఇచ్చేలా ఉన్నాడని గబగబా తినేసి బయటికొచ్చా. రూమ్ లోకి వెళ్ళగానే గ్రూప్ లో తన మెసేజ్లు “సారీ గాయ్స్,” అని “మిస్ అవ్వడమే మంచిదైంది,బిర్యానీ లో దమ్మే లేదు..మన బాస్ లాగా” మిగితా వాళ్ళ కామెంట్లు.
అన్ని పక్కకు పెట్టి, ధైర్యం చేసి మెసేజ్ పెట్టా ‘తినకుండా ఆమెవరితోనో అటే వెళ్ళావ్?’, అని పెట్టా.
‘ఓ.. తను నా స్కూల్ దోస్త్. మామూలుగా మాట్లాడుతూ పని చేసిన కంపెనీ మోసం గురించి చెప్పింది. వాళ్ళు డ్రోన్ లతో డెలివరీ చేస్తామని, దాంతో సమయం ఆదా అవుతుంటదని,ట్రాఫిక్ కస్టాలు ఉండవని,డెలివరీ బాయ్స్ కిచ్చే జీతం మిగుల్తది అని బెంగుళూరు లో మొదలైందట. ప్రత్యేకంగా రూపుదిద్దిన డ్రోన్ లతో డెమో లు చుపించాక, బాగా నచ్చి ఓ సంస్థ పెట్టుబడి పెట్టింది. సుమారు 500 డ్రోన్లకనీ అలా ఒకరికి ఒకరు తెలియని కొన్ని సంస్థల నుండి పెట్టుబడి లాగి, ఒక తెల్లారి ఎవరి దిక్కున వాళ్ళు జంప్.! నిజానికి అందులో డ్రోన్ లకు సెన్సార్లు మీద వర్క్ చేద్దామని వెళ్లి తను చివరికి ఆ కంపెనీ ఎత్తేయడంతో ఇరకాటంలో పడింది ‘ అని రిప్లై ఇచ్చింది. ఏమి మాట్లాడిన వీటి గురించే తీస్తదని ఓపిక లేక చాట్ ఆపేసా.

కానీ, అనుకోలేదు కొద్దీ రోజులకే ఆమెని ఎంతలా మిస్ అవుతానని…

*****

ఒంటరిగా యుద్ధం చేయడం వేరు..
యుద్ధం చేసి ఒంటరిగా మిగలడం వేరు..
అసలు యుద్ధం చేసేదే ఒంటరి తనం కోసమనేది ఇంకా వేరు..
ఇలా వేరుగా ఉన్న మూడును కలిపి చూపించింది… ఓ పురుగు.. అదే కరోనా!
కంప్యూటర్ కీబోర్డు కి ఉన్నట్టుగా కంట్రోల్ బటన్ కాలానికి ఉంటె బాగుండు అనిపించినా రోజులు..ఎందుకంటే అన్ని అదుపుతప్పిన రోజులే కనబడుతున్నాయి. ‘బ్రతికి బయట పడాలి’ అనే ఆలోచన ఏ డైనోసార్ లాంటి జీవిని టీవీ లో బంధించి చూసినప్పుడు అనుకున్న గాని, నిజంగా ఒక కంటికి కన్పించని పురుగు ఇంట్లో బంధించే దాకా తెలియలేదు. తొడుక్కున్న మాస్క్ కొత్త ముఖాలపై అతికించుకున్న నవ్వుల వెనకాల, కార్చిన కన్నీళ్ళన్ని  సానిటైజర్ చుక్కలైతే బాగుండు..కాలం కరోనాని కాస్తైనా అంతం చేసేదేమో. అలసిన పాదాలతోనే వలస దూరాలు నడిచిన కూడా…బ్రతకడానికే బలాన్నిచ్చే వ్యాక్సిన్ చుక్కల మొక్షం కోసం…మూసేసున్న తలుపుల వెనకున్న దేవుళ్ళను ఎంత మొక్కిన ఏం లాభం…డాక్టర్లు,పోలీసులు,పారిశుద్ధకార్మకులకు కదా చేతులను జోడించాల్సింది. వీళ్ళకే కాకుండా ఆరోగ్యసేతు నుండి మొదులుకొని ఆన్లైన్ హెల్త్ కేర్ ఆప్స్ కి కోడ్ రాసిన చేతులకు క్కూడా మొక్కాలనిపించింది.
లొక్డౌన్ మొదలైనప్పటి నుండి ఆఫీస్ పని ఇంటి నుండే అవ్వడంతో..బయటకెళ్ళకుండా, ఇంట్లోనే ప్రశాంతంగా పని చేస్కోవచ్చు అనే ఊహ పాటించడానికి కొద్దీ రోజులే బాగుంటదని తెలియలేదు. అసలేది అనుకున్నట్టుగా లేదు…ముఖ్యoగా లొక్డౌన్ వల్ల ఆర్డర్స్ లేకపోవడంతో కంపెనీ బోల్తా కొట్టే పరిస్థితి కి వచ్చింది. కొంతమంది సీనియర్స్ కి జీతాలు ఇవ్వలేక ఇంకొంతమంది ఇంటెర్న్స్ తో కలిపి తీసేసారు. అందులో లేఖ కూడా ఒకరు. నిజానికి ఆ సందర్భంలో నేను ఏడుపు మొఖంతో మెసేజ్ చేసిన నవ్వుతున్న ఎమోజీ లే పంపేది. ఇక ఉన్న కొద్ది మంది ఉద్యోగులకు పని భారం పెరిగింది. కోడ్ రాయడానికి నాతో ఇంకిద్దరు, అది డెప్లాయ్ చేయడానికి డెవాప్స్ ఒకతను తప్ప కంపెనీలో ఉద్యోగులే లేరు. వాడడం ఆపేసిన యాప్ కి మెరుగులు ఎందుకు దిద్దడం అనిపించేది. టిప్ టాప్ గా రెడీ అయ్యి లాప్ టాప్ పట్టుకొని ఆఫీసుకి వెళ్లే నేను..టీ-షర్ట్, షార్ట్ మీదే కాల్స్ అటెండ్ అవ్వడం ఓ చిత్రమైన సంబురం. సమ్మర్ కాబట్టి మిస్సవ్వకుండా జగిత్యాల మామిడి మార్కెట్ నుండి శ్రీరాములపల్లె రసాలు తింటూ పనిచేయాలన్న కూడా అదృష్టం ఉండాలనుకుంటు పని చేసేవాడ్ని.ఇక మ్యూట్ చేయని మైక్ల గోలలతో, ఉన్న దానికంటే బిగ్గరగా కనిపించే ‘జూమ్’ ముఖాలతో మీటింగ్లుంటే…కరెంటు పోయిందని, నెట్ రావట్లేదనో పని తప్పించుకుంటూ రోజులు గడిచిపోవడం కూడా అలవాటైపోయింది.
అది అర్థమై అటు “లొక్డౌన్ ఏ కదా, ఇంట్లోనే కదా ఉండేది.. ఇంక్కేకువ సేపు వర్క్ చేయండి,” లాంటి ఘాటు మాటలు తప్పలేదు, ఇటు “ఎదో దేశాన్ని ఉద్ధరిస్తునట్టు..ఎంతసేపు కూర్చుంటావు రా లాప్టాప్ ముందు..ఇంటి పని చేయవా,” అని ఇంట్లో లొల్లి. ఇన్ని పరేషన్ల మధ్య ఆమె మెసేజ్ కాస్త ఊరట నిచ్చేది. ఇద్దరికీ కరోనా వచ్చి పక్క పక్క బెడ్స్ లో ఐసొలేషన్ ఉంటె ఎంత బాగుండనే ఆలోచనలు రావడం కూడా సహజం అయిపోయాయి. ఎంతైనా తను మా కంపెనీలో లేదు కాబట్టి ముందులా లేని మాటల వల్ల ‘ఏమనుకుంటదో’ అని నేను కూడా మెసేజ్ లు ఎక్కువ పెట్టక పోవడంతో..దూరం పెరిగుతూ వచ్చింది. డైరెక్ట్ గా మనుషుల మధ్య భౌతికి దూరాన్నే కాకుండా ఇన్డైరెక్ట్ గా మనసుల మధ్య కూడా చాలా దూరాన్ని తీస్కొచ్చిన కరోనాని మాస్క్ వెస్కొని తిట్టడమే తప్ప చేసేదేమి లేదనుకుంటూ కూర్చున్నాను. ఇంట్లోనే ఉన్న ఎవరి దార్లో వాళ్ళు మునిగిపోయారు.. ఆమె గుర్తొచ్చిన నిమిషాల్ని నిశబ్ధన్గా మింగేసి, మాట్లాడాలనుకున్న మాటలన్నీ మౌనంగా గొంతులో ఊరేసుకొని ‘చం..ద్ర..లే..ఖ..’ అనే గుండెలోని పాట కాస్త ఆమెని ‘పొం..ద..లే..క..’ అని పాడసాగింది. ఏది ఏమైన ఒక కంపెనీ మారిన తర్వాత పాత కంపెనీ కే.టీ. గుర్తుంటదో లేదో దేవుడికెరుగు..కానీ ఆమె వల్ల ఇన్నోవేటివ్ ఆలోచనల ఇంక్యుబేషన్ల మీద, కెరీర్ మీద పొందిన కే.టీ. మాత్రం ఆమె లాగే ఎల్లప్పటికీ గుర్తుంటుంది.

పరిస్థితులు కుదుట పడుతున్నాయి అనుకుంటున్న సందర్భంలో..అన్ లొక్డౌన్ మొదలయింది..
వద్దన్నా వినకుండా ఆఫీస్ కి రమ్మన్నారు.!
ఇంటి తిండితో పెరిగిన పొట్టకి బట్టలు ఎక్కకా షాపింగ్ కోసమైన వెళ్ళక తప్పదంటూ బయల్దేరా.
ఎన్నో ఏండ్ల తర్వాత సిటీ కి వచ్చిన ఫీలింగ్..ఎస్కేలేటర్ మీద కూడా పరిగెత్తే మెట్రో ప్రపంచం మళ్ళి దాని ఊపు అది అందుకుంటుంది. మొదటి సారంత కాకపోయినా కాస్త కొత్త అనుభూతితోనే ఆఫీస్ లోపలికి వెళ్లాను. పక్కకు ఖాళీగా ఉన్న ఆమె కుర్చీని చూసినప్పుడల్లా నేను కుదురుగా కూర్చోలేకపోయాను..ఇటు కంపెనీ పరిస్థితి కూడా అంతంత మాత్రానే అనుకుంటున్న సమయం లో అప్పుడెప్పుడో డెమో ఇచ్చిన బడా కంపెనీ ముందుకొచ్చి ఆదుకుంది. జీతాలు ఇస్తే చాలు అనుకుంటున్న టైములో వాళ్ళ ఫండింగ్ కి హైక్లు,బోనస్ లు కూడా రావడం ఆశ్చరం. మెల్లమెల్లిగా మొత్తం కంపెనీనె కొనడం తో, ఆఫీస్ స్థలం మారింది. కొన్న బడా కంపెనీ అంతస్తు చివరి ఫ్లోర్లో కి షిఫ్ట్ అయ్యేన్ది..అలా చాలా రోజులకు అక్కడ మళ్ళీ చూసాను ఆమెని!!

అంతే అందంగా..కలవాల్నా వద్దా అనే సందిగ్ధం లో ఉండగానే ఆమె నన్ను చూసేసింది. నిండుగా నవ్వాను.. తను మాత్రం పెదాల అంచున బరువుతో దించుతున్న నవ్వు.
మళ్ళీ ఎన్నో రోజుల తర్వాత పొంగిన కె’పిచ్చి’నోని కలుపుతూ ఆమెతో మాట్లాడుకుంటూ పొందిన ఫీలింగ్ ఎంత బాగుందో.. కోవిడ్ వల్ల చనిపోయిన తన వాళ్ళని, చిదిమేసిన ఇంటి ఆర్ధిక పరిస్థిని నుండి కోలుకోవడానికి జాబ్ చేయక తప్పలేదంటూ చెప్పింది. మూగ రోదనలతో అల్లుకున్న నిశబ్దంలోంచి
“సో, నీ సంగతేంటి?” అనడిగింది నార్మల్ అవుతూ.
“ఏముంది, మొత్తానికి సంవత్సరం దాటింది కదా, కంపెనీ తేడా కొట్టే లోపు వేరేది చూసుకుందామనుకుంటున్న సమయంలో.. ఇదిగో మీ కంపెనీ, ఇలా మన కంపెనీ అనేలా చేసేసింది,” కాఫీ సిప్ చేస్తూ, నా బాధల్ని స్కిప్ చేస్తూ అన్నాను.
తన మాటల్లో తగ్గిన ఉత్సాహం ని మళ్ళీ తీసుకురావాలని నేను ప్రతి కాఫీలో కెఫైన్ కంటే ఎక్కువగానే ట్రై చేస్తూ ఉన్నాను.

ఈలోపు మా ప్రాజెక్ట్ లోకి కొత్తగా వచ్చిన వాళ్ళకు కే.టీ. ఇచ్చే బిజీలో సీనియర్స్ ఉంటే, వాళ్ళ పనంత మాకే అప్పజెప్పారు. కానీ చెప్పడానికి టైం లేదని ఏదేదో గబగబా చెప్పేసే వాళ్ళను చూసాకా అన్పించింది, అన్ని కంపెనీల్లో కే.టీ. కోసం ఒక యాప్ లేదా సైట్ చేసిచ్చి దాంట్లో నే ప్రాజెక్ట్ సంబంధించిన డాక్యుమెంట్లు, శిక్షణ వీడియోలు పొందుపరుస్తే సరిపోతుంది గా…ఎన్న ఐడియా తలైవా! నాక్కూడా ఆలోచనలు వస్తున్నాయ్ రో…ఆమె తో షేర్ చేస్కోవల్సిందేనని వెళ్ళాను.
విన్నాకా ‘మ్మ్..’ అనో నవ్వుతో “ఏముంది దాంట్లో..మనకు సంబంధించినవి ఎలైతే దాచుకుంటున్నామో కంపెనీ కూడా కే.టీ వి మొత్తం ఏ డ్రైవ్ లోనో క్లౌడ్ లోని స్టోరేజ్ ని వాడుకుంటే సరిపోతుందిగా,” కొత్తగా ఎందుకు అని అంది. మళ్ళీ తనే “అయినా కూడా డెవలప్ చేయొచ్చు, ఎందుకంటే పేమెంట్ చేసే యాప్లో చాటింగ్ వీలున్న అది వాడకుండా వేరేదే వాడుతరు. అలాగే చాటింగ్ యాప్లో పేమెంటున్న వేరే యాప్లోనే చేస్తారు. ఎన్ని ఫీచర్సున్నా కేవలం ‘దీని కోసమే’ అని వాడుతారందరు. సో, నీ ఆలోచన ఆచరిస్తే కే.టీ కి మాత్రమే అన్నట్టు వాడుతరు కాబట్టి వర్కౌట్అవుతది.” అంది.

అలా ఆలోచన చెప్పిన నేనే పనిలో పడి కొద్ది రోజులకు మరిచిపోయాను, కానీ ఆమె మాత్రం ఓ ఉదయం పరుగున వచ్చి “నీకోటి చెప్పాలి..ఓ ప్రముఖ సంస్థలో దాదాపు పదిహేనేండ్లు పని చేసిన ఓ ఉద్యోగి, వేరే మంచి ప్యాకేజి రాగానే రాజినామా పెట్టాడు. మూడు నెలల నోటీస్ సమయంలో కే.టీ కూడా ఇవ్వమన్నారు. కానీ, అన్నేండ్ల కంపనీ ప్రాజెక్ట్ల గురించి అతను కే.టీ. ఇవ్వాలంటే సంవత్సరం పడ్తుందని అంచనా! మూడు నెలలు సరిపోదని తెల్సి ఇంకో ఆరు నెలలు పెంచాలని చూస్తే, అతనొప్పుకోలేదు. ఎందుకంటే, ఈలోగా అతనికొచ్చిన మంచి ప్యాకేజ్ కోల్పోయే అవకాశముంది. తెలిసిందే గా కంపెనీలు జాయిన్ అయ్యేటప్పుడు తొందరగా అవ్వమంటారు, వెళ్ళేటప్పుడు మాత్రం నెలలు నెలలు ఉంచుకుంటారు..అయితే అతను నోటీసనేది జాయినింగ్ లెటర్లో కేవలం మూడు నెలలు మాత్రమే ఉందని గట్టిగా వాదించడంతో…ఏమి చేయలేక అతనడిగినంత డబ్బిచ్చి ఉంచుకున్నారు. అలా కే.టీ. కోటి రూపాయలు డిమాండ్ చేయించింది.! అయితే, ఇక్కడ నాకేం అనిపించిందంటే, వేరే కంపనికి వెళ్ళడం కాకుండా… అతను ఏ మెమోరిలాస్ పేషెంటై పోయుంటే, పరిస్థితేంటి?! సో అప్పడు నీ ఆలోచనైన కే.టీ. స్టార్టప్ కి గిరాకి ఎక్కువే,” అంది.
నా ఆలోచన పై తన శోధన నన్ను కాస్త భయపెట్టి, ఆనందపెట్టింది. “ఇంకేంటి ఎదురుంగున్న బిల్డింగ్లోనే పెట్టేస్త నా కంపెని..,” అన్నాన్నేను హాస్యంగా..
కానీ ఆమెకి అలా అర్థంకాక,
“హే…నువ్వు కూడా అందరిలా ఈ సిటిలోనే ఆఫీస్ పెట్టాలనుకోకు…మీ టౌన్లో పెట్టేయ్,అక్కడ్నుంచి ఉద్యోగాల కోసం ఇక్కడికి వచ్చేవాళ్ళకి అక్కడే పని చేయంచుకోనివ్వడం మంచిది కదా…!” వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి అర్థమైన ఆలోచనలా.! నిజమే కదా.

రోజులు గడుస్తున్న కొద్ది..కరోనా అల(వేవ్)లు ఉవ్వెతున ఎగిసిపడి ప్రాణాల్ని మిగేసుకు పోతున్నాయి. నాతో పాటు తను కూడా వేయించుకున్న వ్యాక్సిన్ లా ప్రభావం నుండి బయటపడి కోలుకున్నాం. ఇక నా వల్ల కాలేదు..ఉండబట్టలేక ఆమెకి ఒక రోజు ప్రపొస్ చేసేసాను.
విచిత్రంగా తన నుండి రిప్లై కాకుండా నా రిప్లై కోసం నేనే వెయిట్ చేయాల్సి వస్తదనుకోలేదు.. “ఇంక్యూబేషన్ లో ఉన్న బేబీ కి కూడా తండ్రి నువ్వే అవ్వాలి..ఆలోచించుకో” ఉద్యోగం వదిలేసుకోవాలి అని ఇండైరెక్ట్ గా అంది.
ఈ లోగా మధ్యలో ట్రై చేసిన ఒక ఎమ్మెన్సీ నుండి మంచి ప్యాకెజీ తో ఆఫర్ వచ్చింది..తనకి చెప్పాలా వద్దా అనే సందిగ్ధం లో పడ్డాను..ఉద్యోగముంటేనే ఓకే చెప్పే అమ్మాయి కాదు తను, ఉద్యోగం వదలిపెట్టే ధైర్యముంటేనే ఎస్ చెప్పేలా ఉంది..!
ఇప్పుడు ఏ వైపు అడుగువేయాలన్నా ముందైతే ఉన్న ఉద్యోగానికి మాత్రం రాజినామా తప్పదని రిసిగ్నేషన్ పెట్టేసాను. నోటీస్ పీరియడ్ మొదలైంది…ఇప్పుడు మొట్టమొదటి సారిగా నేను కే.టీ. ఇస్తున్నాను..!

*

మన్ ప్రీతం

16 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Every IT employees faced these situations.well explained and going forward to see more Stories like this .

  • Nice one Preetham.
    నాకు నా జాబ్ లో జాయిన్ అయిన మొదటి రోజులు గుర్తుకు వచ్చాయి.
    నీ కలం అద్భుతం చేసింది.

  • కె.టి …. చాలా బాగుంది . నిజంగానే తన నాలెడ్జి మీకు ట్రాన్స్ఫర్ చేసి చివరలో మీకు ఒక కొత్త టర్నింగ్ పాయింట్ ఇచ్చింది.

  • కథ బాగుందండి .. నిజానికి ఎన్నో కథల్లో పాత్రలకు software/IT ఉద్యోగి అని ఉండడమే గాని ఆ field లోని కథలు అరుదనే చెప్పాలి..రాయాలన్న కూడా technical పదాలు వాడక తప్పదు ..వాటిని అర్థమైయేలా రాయడం చాలా ముఖ్యం . మీరు సీదా కథాంశమే technical ది తీస్కొని చాలా అద్భుతంగా, అర్ధవంతంగా రాయడంతో కాస్త లోటు తీరి.. మీ మీద మరింత గౌరవం పెరిగింది. మధ్యలో కరోనా నుండి వేరే కథ చెప్పబోతునట్టుగా ఉంది..కానీ  మెల్లిమెల్లిగా ఉన్న కథతో sync చేసిన విధానం, మీరు చెప్పాలనుకున్న పాయింట్స్ నచ్చాయి. మీ నుండి మరిన్ని కథలు ఆశిస్తూ .. Congratulations.

  • కొత్త తరం కథ బాగుంది. అభినందనలు మన్ ప్రీతమ్!

  • కే టి కథ బాగుంది మను గారు, సరికొత్త గా ,innovative గా సాగింది. అభినందనలు

  • కథ బాగుంది ప్రీతం, రెండు రోజుల శాంతికి ఐదు రోజుల యుద్ధం చేసినట్టు… లాంటి వాక్యాలు బాగున్నాయ్.

  • Extraordinary story with excellent narration Manpritham gaaru.. as a reader you took me into an IT building and feel the presence of gathered discussion at canteen coffee. You indirectly gave KT to us on innovative idea incubation. I loved the poetic expression of urs in every line..mainly on Lekha and Corona effected things. From now l’m more likely to remember u as ‘K.T.Manpritham’ rather than KV.

  • Thank you all 😍. Every comment gave me a boosting and special thanks to team Saaranga & Agacharya artist.

  • Hi, preetam
    Awsome. This is real life of every software employee . This very good and nice story, quotes in this story miracle.

    Thanks
    give more valuble stories to all of your friends👭👬in feature.

  • గుర్తుండిపోయె కథ రాసావ్ అబ్బాయి. అభినందనలు.

  • మంచి నర్రేషన్. సాంకేతిక పరిజ్ఞానం..ఐటీ రంగం వీటీకి సంబంధించిన సమాచారం ఎక్కువగా డామినేట్ చేసింది . పెద్ద కాలాన్ని తీసుకోవడం కథను బలహీన పరిచింది. ఈ కథలో మంచి వాక్యాలు వున్నాయి. కథ చెప్పే నైపుణ్యం వుంది. అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు