కీర్తి కోసం కానే కాదు!

కవిత్వాన్ని అవార్డులు కొలుస్తాయనుకోను. అసలే అవార్డూ కవిత్వానికి కొలమానం కానే కాదు.ఒక్కో సారి నాకు ఫలానా పుస్తకంలో కవిత్వం,శిల్పం,రూపం బాగా నచ్చి న్యాయనిర్ణేతలకు అస్సలు నచ్చక పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి.

డాక్టర్ ఉమ్మడిశెట్టి రాధేయ–సాహితీ ప్రపంచానికి పరిచయం అక్కరలేని పేరు. తన ముప్పైఏళ్ళ “ఉమ్మడిశెట్టి” కవితా పురస్కార యాత్రలో, 19 తొలి సంకలనాలు వేసిన కొత్త కవుల్ని వెలుగులోకి తెచ్చిన సాహితీ సేవకుడు. కవిత్వం పట్ల ఒక నిబద్ద ప్రేమకు డబ్బు, ప్రాంతీయత, ఏ రకమైన ప్రభావమూ అడ్డుకాదని తేల్చి చూపెట్టిన వ్యక్తి. “మగ్గం బతుకు” కవిగా ప్రసిద్దుడు. కవిత్వమే సామాజిక స్వప్నమూ, సత్యమూ, చైతన్యమూ, సంస్కారమూ అనే పుస్తకాల్తో విమర్శకుడిగా గుర్తింపూ పొందినవాడు. జూలై 15 న అనంతపురంలో డా: ఉమ్మడిశెట్టి  వచన కవితా పురస్కార త్రిదశాబ్ది ఉత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా శ్రీరామ్ అడిగిన ప్రశ్నలు, ఉమ్మడిశెట్టి నారాయణ సుబ్బన్న (రాధేయ) చెప్పిన జవాబులు :

ప్రభుత్వేతర వ్యవస్థలు నెలకొల్పిన సాహిత్య పురస్కారాల్లో మీ ఉమ్మడిసెట్టి గుర్తింపు ప్రత్యేకమైంది. అవార్డుకా విశిష్టత ఎలా  వచ్చింది ?

ప్రారంభం నుండి ఇప్పటి దాకా ఈ 30 ఏళ్లలో న్యాయనిర్ణేతల నిర్ణయాల్లో నేను ప్రేక్షకుడి కానీ ఉండి, వారి నిర్ణయాల్ని గౌరవించి,అమలు చెయ్యడమే ఉమ్మడిశెట్టికింత గుర్తింపుకు కారణం. ఇంకే రహస్యమూ లేదు.

సాహిత్య సేవకుడిగానా ? సాహితీ సృజన కారుడిగా నా ? రాధేయనెలా కొలవాలి ?

నన్ను నేను సృజన కారుడి గానే ఇష్టపడతాను.అందులో ఉండే ఆనందం, సంతృప్తి వేరు.

ఈ అవార్డును కొనసాగించలేనని రెండుసార్లు ప్రకటించారు. ఎందుకని ? 

వ్యక్తిగత సమస్యలు,ఆర్థిక ఇబ్బందులు కొంత కారణం కావచ్చు కానీ అవార్డు కొనసాగింపుకు అవే అవరోధాలని నేను భావించడం లేదు.మా అవార్డు ను ఆశించి పొందని కవులు నాపై చేసే ఆరోపణలూ వ్యాఖ్యలు, వారి వ్యక్తిత్వాలు ,ఆ క్షణాల్లో నాకు నైరాశ్యం కలిగించిన మాట వాస్తవం.కవిత్వం పట్ల నాకున్న ప్రేమను,అవార్డు నిర్వహణ లో నేను పాటిస్తున్న విలువల్ని గానీ,నిబద్ధతనూ కవులైన వారే గుర్తించక పోవడం నాకు విచారం కలిగించి అలా ప్రకటించానే తప్ప, విముఖత మాత్రం ఎప్పుడూ లేదు.

మీ అవార్డు తీసుకున్న వాళ్ళందరూ సాహితీలోకంలో ధృవతారలుగా వెలుగుతున్నారు. మీకేమనిపిస్తోంది ?

మా అవార్డులు పొందిన కవులంతా ఈ నాడు ప్రసిద్ధ కవులుగా గుర్తింప బడటం నా కెంతో గర్వంగా ఉంది.ఉదాహరణకు.. 1991లో అవార్డు పొందిన అఫ్సర్ గారు ప్రపంచ ప్రసిద్ధ పెన్సిల్వేనియా యూనివర్సిటీలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన అధ్యాపకులు. పాతికేళ్ల క్రిందటే మా అవార్డు పొందిన పాపినేని శివశంకర్ గారు కవిగా, కథకుడిగా ,విమర్శకుడిగా గుర్తింపు పొందడం, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు  పొందడం, యువకవి బాలసుధాకర మౌళికి కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కారం రావడం, కవులు యాకూబ్ గారు,శిఖామణి గారు కేంద్ర సాహిత్యకాడమీ సలహామండలి సభ్యులు గా ఎదగడం, ఈ పరిణామాలు,ఈ గుర్తింపులు  మా అవార్డు గ్రహీతలు పొందడం నాకు నిజంగానే గర్వకారణంగా చెప్పుకుంటాను.

ఆధునిక వచన కవితకి ‘ఫ్రీవర్స్ ఫ్రంట్’ మీ ‘ఉమ్మడిశెట్టి’ ఎనలేని గుర్తింపు తెచ్చాయి. వచన కవిత నేడెలాంటి పరిణామ క్రమాన్ని సాధించిందని భావిస్తున్నారు ?

30 ఏళ్ల కిందట కేవలం వచన కవిత్వం గా ప్రచారమై, రానురానూ, విభిన్న , అస్తిత్వ వాదాల తో, ఉద్యమ సదృశంగా పరివర్తన చెందుతూ, విస్తృతం కావడంలో ఈ  పురస్కారాలు  స్ఫూర్తిగా నిలిచాయని నేను భావిస్తున్నాను.

స్వప్నమా, సంస్కారమా, చైతన్యమా, కవిత్వేమేరకు సమకాలిక అస్తిత్వాన్ని ప్రతిబింబించాలి ?

కవిత్వ ప్రేమికులకు కవిత్వమే ఒక స్వప్నం, ఆ స్వప్నసాకార ఫలితమే సంస్కారం, అది కవి వ్యక్తిత్వాన్ని పరిమళింపజేస్తుంది.అది సత్యంగా, వాస్తవంగా ,చైతన్యం దిశగా అడుగులేయిస్తుందని నా విశ్వాసం అందుకే ఆ నాలుగు సీరీస్ కు ఆ పేర్లు నిర్ణయించుకున్నాను.

మీ శిష్యులేర్పాటు చేసిన ‘డా.రాధేయ కవితా పురస్కారం’ లో మీ పాత్ర ఏమిటి ?

ఎవరో అన్నట్లు, నాకు కీర్తి కాంక్ష పట్ల గానీ, శిష్య ప్రచారం పట్ల గానీ ఆసక్తి లేదు. నేను నాజీతం లోంచీ,పెన్షన్ లోంచీ గత 30 ఏళ్లుగా ఈ పురస్కాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నానే తప్ప ఎవ్వరినీ , ఏ కీర్తినీ ఆశించి ఈ పని చేయడం లేదనిగుర్తుపెట్టుకోవాలి. లెక్కల్లో వేసుకుంటే ఈ అవార్డు కోసం 10 లక్షలు దాకా ఖర్చు పెట్టాను.నేనెంత,నా శక్తీ ఎంత కవిత్వం పట్ల ప్రేమే నన్ను ఎంతదూరం నడిపించింది . కీర్తి కోసం కాదు. ఏ కవి చేశాడో చెప్పమనండి. అలాగే నా పేరుతో అవార్డ్ పెట్టమని నేను ఏ నాడూ నా శిష్యులతో చెప్పలేదు. వారు ఒకనాడు నా వద్దకు శిష్యులు గానే వచ్చారు.ఇప్పుడు నాకు మంచి మిత్రులుగా ఉన్నారంటే అది వారు సాధించిన కవిత్వ విజయం .నాపై వారికున్న అభిమానమో,గౌరవమో గానీ పురస్కారాన్నీ పెట్టుకున్నారు.ఈ విషయం లో వారికే స్వేచ్ఛ నిచ్చాను.సభకు పిలిస్తే గెస్ట్ గా వెళ్లి పురస్కారాల ప్రదానం లో పాలుపంచుకుంటానేతప్ప కీర్తి దాహం తో కాదు.

అవార్డులనేవి దేన్ని కొలుస్తాయి ? ఆయా కాలాల్లోని సాపేక్ష సాహితీ కృషినే ? లేక ఇంకేమన్నా ప్రత్యేక ప్రమాణాల్ని పాటించాలంటారా ? 

కవిత్వాన్ని అవార్డులు కొలుస్తాయనుకోను. అసలే అవార్డూ కవిత్వానికి కొలమానం కానే కాదు.ఒక్కో సారి నాకు ఫలానా పుస్తకంలో కవిత్వం,శిల్పం,రూపం బాగా నచ్చి న్యాయనిర్ణేతలకు అస్సలు నచ్చక పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. శాశ్వత ప్రాతిపదికన కొన్ని ప్రమాణాలు ఎప్పుడూ ఉంటాయి. అవార్డులు కవి యొక్క సమకాలిక  సాహితీ కృషిని కచ్చితంగా అంచనా వేయాలి. వేస్తుంది కూడా. హృదయ సంబంధమైన కవిత్వం అంతిమం గా ఆ వైవిధ్యాన్ని, స్థాయినీ ప్రదర్శించి తీరుతుంది. మా ముప్పై పుస్తకాలు అందుకు సాక్ష్యం.

తన్నీరు నాగేంద్ర , రమేష్ నారాయణలు మీ కవిత్వం పై పరిశోధన చేసి సాధించిన అంతస్సూత్రాల్ని చెప్పండి. 

డా.తన్నీరు నాగేంద్ర తన పరిశోధనలో చక్కగా అధ్యయనం చేయగలిగాడు. పెద్దలు డా.రమేష్ నారాయణ గారు  నా మగ్గం బతుకు కవిత్వాన్ని బాగా ఇష్టపడి నేను కోరకుండానే ఆంగ్లానువాదం చెశారు.అలాగే నా వ్యక్తిత్వాన్నీ,నా వ్యక్తి గత జీవితాన్ని దగ్గరగా చూసి,రాధేయ జీవితం ..కవిత్వం పేరుతొ బయోగ్రఫీ  రాశారు.

ఫలానా ఉత్తమ కవితా సంకలనాలు మీ అవార్డు పొందితే బాగుణ్ణనిపించిందా ? అలా ఏమన్నా మిస్స్ అయిన దాఖాలాలు చెప్పండి.

ఇన్నేళ్ల అవార్డు లో చరిత్ర లో కొంతమంది ప్రతిభా వంతులైన కవులకు అవార్డులు ఇవ్వలేక పోయాననే అసంతృప్తి నాలో ఉన్నమాట వాస్తవమే.వారి పేర్లు చెప్పను గానీ,ఈ త్రిదశాబ్ది.. కవితోత్సవం లో వారిలో కొందరినైనా ప్రతిభా పురస్కారాలతో గౌరవిస్తున్నాను అనే తృప్తి కలుగుతోంది.

మీ ఇన్నేళ్ళ ప్రస్థానం, మీరు ఒకే ఒక్కడై చేశారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. చేదోడు వాదోడుగా మీతో ఇంకెవరున్నారు ?

ఇన్నేళ్ల నా ప్రస్థానం వెనుక ఒక్కరే ఒక్కరు నా శ్రీమతి.నాతోడు, నీడ ,అండ.తానే లేకుంటే ఈ అవార్డు కు ఇంత సుదీర్ఘ ప్రస్థానమే లేదు.1988 లో ఈ అవార్డు పెట్టాలన్న ఆలోచన తనతో పంచుకున్నప్పుడు .నన్ను కాదనలేక అమాయకంగా ఒప్పేసుకుంది.చిన్నపిల్లలు,కొత్త సంసారం,800 రూ జీతం,పల్లెటూళ్ళో బడిపంతుల్ని.అక్కడే మా సంసారం.ఈ అవార్డు కోసం కనీసం అప్పట్లో  సం. రానికి 3000 దాకా ఖర్చయ్యేది.తన పొదుపు ద్వారానే నాకు సాధ్యమైంది.అవార్డు గ్రహీతలు కూడా ఎలాంటి భేషజాలకు పోకుండా అతిథులు గామాఇంటికొచ్చి మాతో పాటు బొంచేసి,సంతృప్తి గా వెళ్లేవారు.ప్రతియేటా వారికి చాలా చాలా ఇష్టం గా చేసి పెట్టేది.ఈ సంప్రదాయం 20 ఏళ్ళు గా కొనసాగింది.తను ఎప్పుడూ అలిసి పోలేదు,ఆపమని చెప్పలేదు.రాను రాను అతిథుల సంఖ్య పెరుగుతూ రావడం తో ,ఆమె కష్టం చూడలేక, నేనే క్యాటరింగ్ ఏర్పాటు చేసి తన శ్రమను తగ్గించాను.2013 లో 58 ఏళ్ళ కు నేను రిటైర్ అయ్యాక మా అవార్డు కు సరిగ్గా 25 ఏళ్ళు పూర్తి అయ్యాయి.రజతోత్సవ ఎంతో వైభవంగా జరిపి పదవీవిరమణ తో పాటుగా,ఇకపై  పెన్షన్ తో నిర్వహించలేక అవార్డు విరమణ ను ప్రకటించాను అదే సభలోనే ప్రకటించాను.సభికులూ,శ్రోతలూ అందరూ ఒక్కసారిగా వ్యతిరేకించారు.అవార్డు ఉండాలి.ఆపకూడదు.మేమున్నాం మీకు సహకరిస్తాం దయచేసి ఆపకండి అన్నారు.నేను మౌనం వహించాను.అదే సమయంలో తాను భావోద్వేగానికి గురై  మైకు ముందుకు వచ్చి  అవార్డు ను కొనసాగిస్తామని మాటిచ్చింది.ఆమాటే మరో 5 ఏళ్ళు కొనసాగడానికి కారణమైంది.

ప్రస్తుతం మీ సాహిత్య వ్యాసంగ విశేషాలు చెప్పండి.

నా భవిష్యత్ ప్రణాళిక…గత 8 ఏళ్లుగా సాహితీ విమర్శ లో పడి కవిత్వానికి విరామ మిచ్చాను.2009 లో వచ్చిన అవిశ్రాంతం  కవితా సంపుటి తర్వాత కవిత్వం తేలేదు.కాబట్టి త్వరలోనే పావుకోళ్లు పేరుతో కొత్త కవితా సంపుటి తేవాలని ఉంది.అలాగే గత పాతికేళ్ల నుంచి సీరియస్ గా కవిత్వం రాడుతున్న వర్తమాన కవుల సమగ్ర కవిత్వం మీద సీరీస్ గా పుస్తకాలు తేవాలను కున్నాను ఆ పని మొదలు పెట్టి  తొలి సంపుటిగా మాకంటే సీనియర్ కవుల కవితా ప్రస్థానంతో అవగాహన వచ్చింది.రెండవ సంపుటి గా ..వివేచన ..మూడవ సంపుటిగా ..విశ్లేషణ.. తేవాలని ఉంది.ఇకపోతే..చేనేత కార్మికుల బతుకు పోరాటం లో వృత్తి పనిముట్ల సంభాషణలు..ఉటంకిస్తూ పుస్తకం రాయాలని మొదలు పెట్టాను.ఇవీ నా ప్రస్తుత ప్రణాళికలు..

*

శ్రీరామ్ పుప్పాల

ఈ తరం కుర్రాళ్ళలో శ్రీరాం కవిత్వాన్నీ, విమర్శనీ సమానంగా గుండెలకు హత్తుకున్నవాడు. అద్వంద్వం (2018) అనే కవితా సంపుటితో పాటు, బీమాకోరేగావ్ కేసు నేపథ్యంగా 1818 (2022) అనే దీర్ఘ కవితని ప్రచురించాడు. తనదైన సునిశిత దృష్టితో వందేళ్ళ వచన కవితా వికాసాన్ని 'కవితా ఓ కవితా' శీర్షికన అనేక వ్యాసాలుగా రాస్తున్నాడు. ఆ వ్యాస సంకలనం త్వరలో రావలసి ఉంది.

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

    • మిమ్మల్ని కలిసి ఈ రోజు చాలా సంతోషం కలిగింది. థ్యాంక్యూ మేడం.

  • రాధేయ పురస్కారాన్ని పొందిన శ్రీరామ్ గారికి అభినందనలు.
    శ్రీరామ్ గారూ మీరు చేసిన రాధేయ గారి సమగ్రమైన ఇంటర్వూ వివరణాత్మకంగా ఉంది.
    మీకూ డాక్టర్ రాధేయ గారికీ అభినందనలు.
    రాధేయ గారి సమాదానాలు చదువుతూ ఉన్నప్పుడు వారూ వారి సతీమణి ఈరోజుకూ కష్టమైన ఆర్థిక పరిస్థితులనూ సర్దుబాటు చేసుకుంటూ ఇవ్వగలగడం చాలా గొప్ప విషయమని నా భావన.. వారిని అభినందించవలసిన విషయం.కూడా..
    డాక్టర్ ఉమ్మడి శెట్టి రాధేయ గారు కవుల ప్రతిభను గుర్తించి వారికి చక్కటి ప్రోత్సాహకాన్ని అందిస్తున్నారు.
    సాహిత్య సృజనకారునిగా దీర్ఘకాలంగా ఈ పురస్కారాలను అర్హత కలిగిన వారికి ఇవ్వడం సాహితీ ప్రియులంతా సతోషించతగిన విషయం.
    వారి ఆలోచనలు ఆచరణీయం కావడానికి చక్కటె సహకారాన్ని అందించిన వారి సతిమణికి వందనం.

  • ఒక పని ప్రారంభించి ,ముఫ్ఫై ఏళ్లపాటు కొనసాగించటం
    ( అదీతనకున్న కొద్దిపాటి వనరులతోనే ) ఆవ్యక్తి యొక్క దీక్ష పట్టుదలకు నిదర్శనం. రాధేయగారి కృషి మిక్కిలి అభినందనీయము..
    ఈ ఇంటర్వ్యూ వారి వ్యక్తిత్వాన్ని,మనస్తత్వాన్ని పట్టిచ్చింది.

  • మంచి కవితో ఒక మంచి ముఖాముఖి నిర్వహించారు.రాధేయ వ్యక్తిగతంగా మిత్రుడు.నాతో పాటి తెలుగు జూనియర్ లెక్చరర్ గా పనిచేశారు.ఆయన వ్యక్తిత్వాన్ని మీ ప్రశ్నలు ఆవిష్కరించాయి

  • నమస్తే సర్…
    గొప్ప సాహితీ మూర్తి…పరిచయాన్ని చక్కగా ఆవిష్కరించారు..
    తెలుగు సాహితీ చరిత్రలో ఉమ్మడి శెట్టి కవితాపురస్కారానికి ఉన్నత స్థానం ఉన్నది తిరుగులేని సత్యం..
    ఒక సుదీర్ఘ కాలం సాహితీసేవలో ఉండటం ఒంటి చేతితో నిర్వహించటం…మామూలు సంగతి కాదు..
    ఈ విషయంలో రాధేయ సర్ గారు మనకు ఆదర్శనీయులు…
    సర్ కు మీకు నమస్సులు, శుభాకాంక్షలు…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు