కాస్త తేలిక పడు

వ్వేవాళ్ళు నవ్వుదురు
ఏడ్చే వాళ్ళను ఏడ్వనీ…
నాకేం కావాలన్నదే నాకు ముఖ్యం!
కవిత్వమా…నువ్వెంత అమాయకురాలివి!
ప్రతితీగనూ కదిలించాలన్న
నీ విపంచి కల
నీ దేహపుచెక్కకు బిగించిన వలపుదారాలు
సరితూగని స్వరాల శుద్ధమధ్యమాలు
వేలికొసలతో రాగాన్నెలా పలికించగలవ్?
హృదయతీగలు తహతహలాడితేగానీ శృతిశుద్ధరాగం కూర్చలేవు!
నిన్నేదో అలలనదిపై ఓడనుచేసి ఓదార్చాలన్న దాహంలోకి చొరబడతాను గానీ
లోతులేని నదిలో పరుగెలా తీయడం.
ఎన్ని ఇసుకమేటలు
కవితాక్షర జల్లులనడ్డుకోవడానికి!
ఒక్క బిగువు తప్పినా
సరిపడని దిగుడు సంగీతమే మ్రోగే తరంగాలలో
కవిత్వమా నీవెక్కడని నిలబడగలవ్!
ఏ శృతిన పాడగలవ్…
కన్నీటమునుగుతున్న ప్రపంచాన్ని
నీ ఏ తీగలపై నిలబెట్టగలవ్?
ఇది మునుపటి విశ్వం కాదు
భారవాయువుల బలాత్కరింపులో ఊపిరాడని విచిత్రమిది!
కవిత్వమా…
నువ్విలా కన్నీళ్ళకు మొగ్గకు!
ఇదంతా
విషవలయంలో చిక్కిన
కృషివలుల ఫలిత సంగీతం!
అనంతానంత అశృధారల విలయస్వప్నం!
నువ్వొక్కదానివే ఒకింత శుద్ధగాంధారానివి…దైవతానివీ!
మతిని మరిచి కన్నీటిని వొంపకు!
ఊరికే ద్రవింపకు….ద్రవింపజేయకు!!
ప్రపంచమిప్పుడు
ఏడుపునదిలో
రక్తమాంసాల స్పర్శతెలియని వాగ్వాదంలో
సిలికాకోరల గమకసంపదలలో
లయలెరుగని రాగమైపోయింది…
నువ్వో…నేనో…
ఇలా
గాఢ పరిశ్వంగనమవడమెందుకు? దుఃఖించడమెందుకు?
*

అరుణ నారదభట్ల

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు