కాలింగ్ బెల్

తాటి కమ్మల గుడిసె

మాకు రాజభవనం

గోపమ్మ లచ్చయ్య

అవ్వ తాతల

కలల కోట

మోరీ మీది బండపై అతిథుల

అడుగుపడితే చాలు

దొల్లిన సరిబండరాయి చప్పుడు

అన్నదమ్ములకు, కోడండ్లకు

మనవళ్ళకు మనవరాళ్ళకు

అదొక సిగ్నల్

అందరి గుండెల్లో రాయి పడ్డట్టే

 

చుట్టపుచూపు కల్లుబింకై

సాయంత్రాలు నాయన

చుట్టూ మూగేది

మాటలు ముచ్చట్లు

వాడకట్టంతా లొల్లి లొల్లి

 

చాటుమాటు మాటల్లోకి

తుఫాను గాలి చొచ్చుకొచ్చేది

ఎవరి నోటా మాట ఆగదు

అంతా కలగం పులగం

 

కల్మషం లేని బాల్యం

ఎల్లలు దాటేది

కాశీపుల్లాట, చార్పల్లి

మారంబీట్, లిక్కోస్

ఆటలన్నింటినీ

మట్టి తల్లి

సంకనెత్తుకుని లాలించేది

 

పండుగ వచ్చిందంటే

బతుకులకు భరోసానిచ్చే

మగ్గం సట్టర మానేరు వాగులో

బుద్ధి తీరా స్నానమాడేది

 

వీలుపడ్డప్పుడల్లా

మగ్గం గుంటల

పాదాలు పావుకోళ్ళతో

నాట్యమాడేది

చేతులతో మగ్గాన్ని

లయబద్దంగా కదుపుతూ

బెత్తడు బట్టనేసినా

ప్రపంచ దేశాలన్నింటినీ

తిరుగొచ్చిన సంబురం

 

ఐదుగురు అన్నదమ్ముల

ఉమ్మడి కుటుంబ

సాధకబాధకాలు తండ్లాటలు

కొట్లాటలు  మా మేనత్తల అలుగుళ్ళూ…

 

ఇంటికి పెద్ద నాయిన్నే

పంచాయతీదారు

“నారద ముని” అంటూ

ఇద్దరు పెద్దవ్వల బిరుదు

 

చుట్టూ తడికలున్న గుడిసె

అద్దాల భవంతే

నిట్టాడును చూస్తే చాలు

పెద్దకాక గురువదాసు

రాసిన భజన కీర్తనలు యాదికి వచ్చేది

 

తమ్ముడు వినోద్ నేను తిరిగిన

జాడల్ని ఇప్పటికీ మర్చిపోలేం

సుదన్న వాగువంకల్ని తింపి

ఇంటికి పైలంగా తోలుకొచ్చిన జ్ఞాపకం

 

గుడిసెకు పక్కన పాతిరోళ్ల

చింత చెట్లు దయ్యాల్లా అగుపించేది

రాత్రుళ్ళు బయటకు రావడానికి జడుసుకునేటోల్లం

 

మా నాయనమ్మ

తాగుతున్న చుట్ట పొగను

గుప్పిట బంధించాలన్న

చిన్నతనం ముందు

పొగ నీలి మేఘమై కదిలిపోయేది

 

నూలును గంజిల అద్దె

సరిబండ మోరీ బండకు

అంకితమై కాలింగ్ బెల్ లా

ఇప్పటికీ చెవుల్లో

ప్రతిధ్వనిస్తూనే ఉంది.

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం

ఆడెపు లక్ష్మణ్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు