కాలం వేళ్ల చివర..

దట్టమైన అడవి మధ్యన దీపంలా బతికిందీ బతికించిందీ కవిత్వమే

ఎంత దూరమని ప్రయాణం చేస్తావు
రెప్పలపై కత్తుల వంతెనని వేలాడదీసుకుని
అడుగు అడుగు కలిపితే నదివవటం
మాటా మాటా కలిపితే అడివవటం
ఆలోచనలోచనల్లో మునిగితేలుతూ ఎదురీదే చేపవటం
ఇవ్వన్నీ నీకు కవిత్వమే
మెత్తటి సూది సున్నితమైన పువ్వుగొంతును
కౄరంగా ముద్దాడుతున్నప్పుడు
కళ్లనిండా కవిత్వమే
రాతియుగాలను దాటొచ్చి
ఉనికి కోసం కాలం వేళ్లకింద తడితడిగా మిగిలిపోయే చరిత్రను
చేతుల్లోకి తీసుకుని డెర్సూ ఉజాలలా
మంచు కాలాల
దట్టమైన అడవి మధ్యన దీపంలా
బతికిందీ బతికించిందీ కవిత్వమే
ఎటొచ్చీ
ఈ పూట గుండెనిండా అఫ్గాన్ వలసకథలు
ఫెన్సింగ్ వైర్లు దాటుతూ సరిహధ్ధు రేఖల దగ్గర
కంచికి చేరిపోతుంటే
నిన్ను నువ్వు ఆయుధం చేసుకోవటమూ దుస్సాహసమే
దుస్సాహసకవిత్వమే
అయితే ఓ మొక్కనో
ఇంకా అయితే ఓ పూలతోటనో
ఆపై ఇంకా అయితే
నీటిచేపనో అరచేతుల్లో నాటుకుని
ప్రతిపూటా ఓ కవితనీ కథనీ
గుర్తుగా కాలానికి ముడుపులుగా కట్టి నడిచెళ్దాం
దూరంగా చేతులుచాచి వెలుగు పిలుస్తుంది.
*
పెయింటింగ్: రాజశేఖర్ చంద్రం

మెర్సీ మార్గరెట్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మెర్సీ నీ కవిత చాలా బాగుంది, కాలానికి ముడుపులు కట్టి….. బాగుంది.

  • చాలా చాలా బావుందండీ ” ప్రతిపూటా ఓ కవితనీ కథనీ గుర్తుగా కాలానికి ముడుపులుగా కట్టి నడిచెళ్దాం” 🙂

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు