కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ తప్పా?

కొత్త కాలమ్ ప్రారంభం: బ్యాంకింగ్ కథలూ వ్యథలూ

ముఖ్య గమనిక

ఈ చిన్న వ్యాసాన్ని సామాన్యులకు అర్థం అయ్యేలా అందిస్తున్నాను. అందుకే జటిలమైన విషయాలు సులువుగా అర్థం కావడానికి సరళీకరించాను, వివరణలు పక్కనపెట్టి. కానీ విషయ పరిజ్ఞానం వున్నవాళ్ళకు ఈ వ్యాసంలో చర్చించిన విషయాలు నిజ జీవితంలో ఇంత సాదాగా వుండవని అర్థం అవుతుంది మంచి విషయ పరిజ్ఞానంవున్న చదువరులకు ఇందులో రాసినవి సాదాసీదాగా కనిపిస్తే దానికి కారణం బ్యాంకింగ్ గురించి, కంపెనీల గురించి, రకరకాల మార్కెట్ల గురించి ఎలాంటి అవగాహనలేని సామాన్య ప్రజానీకం కోసం రాసినట్లు గమనించ మనవి. ఈ వ్యాసంలోని విషయాలను అభిప్రాయాలను పాఠకులకు అర్థం అవ్వడానికి కొన్ని నిజ జీవిత ఘట్టాలను చాలా టూకీగా చెప్పినట్టు గ్రహించాలి.

చదువరులు కొన్ని విషయాలను ఇంకా తెలుసుకోవాలని ఉవిళ్ళూరవచ్చు, అది సహజం. అందుకే, ప్రతీ వ్యాసంతో పాటూ సంబంధించిన విశ్వసనీయమైన కొన్ని బయట లింకులు ఇవ్వడం గమనించండి. . కాకపోతే, ఈ బయట లింకులు దారిచూపేది ఇంగ్లీష్ వ్యాసాలకు మాత్రమే. కొన్ని పదాలకు అర్థం తెలియకపోవచ్చు కొంత మందికి, ఈ వ్యాసం  ప్రవాహం కుంటుపడకుండా వుండడానికి, ఈ పదాలను ఫుట్‌నోట్ల ద్వారా చెప్పాను.  ఈ పదాల గురించి విషయ పరిజ్ఞానం వున్న చదువరులు ఈ ఫుట్‌నోట్లను వదిలివేయవచ్చు. పాఠకులేమైనా బ్యాంకింగ్, కంపెనీలు, రకరకాల మార్కెట్లకు సంబంధించిన విషయాల గురించి తెలుసు కోవాలని కుతూహలంగా వుంటే వాటిని గురించి అడగవచ్చు. వీలయినంత వరకు, ఆ విషయం గురించి మీ ముందుకి ఒక్క వ్యాసాన్ని తీసుకు రావడానికి ప్రయత్నిస్తాము.

ఇంక కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ గురించి…

ఒక్క వ్యక్తి కానీ ఒక్క సంస్థ కానీ నిజాయితీగా చెయ్యాల్సిన పని చెయ్యకుండా తమ వ్యక్తిగత లేదా సంస్థయొక్క లాభం కోసం ఏ పనులు చేస్తే బాగుంటుందో అవే చేస్తే, అది “కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్” (conflict of interest) పరిస్థితికి దారి తీస్తుంది. కొన్ని ఉదాహరణల ద్వారా దీన్ని అర్థం చేసుకోవడం కాస్త సులభం. ఒక్క వైద్యుడు కేవలం తన డబ్బు సంపాదన కోసం, ఒక్క శస్త్ర చికిత్స అవసరం లేకపోయినా ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పి అది అవసరం అని ఒక్క రోగిని భయపెట్టి ఆ శస్త్ర చికిత్స చేస్తే అది “కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్” అంటే ఒక్క వైద్యుడు రోగి బాగోగుల కంటే తన సంపాదన ముఖ్యం అని ఇలా చెయ్యడం న్యాయమైన పని కాదు. ఎవరైనా బీమా ఏజెంట్ (insurance agent) ఒక్క వ్యక్తి అవసరానికి తగ్గ బీమా పథకాన్ని (insurance scheme) కాకుండా తనకు ఎక్కువ కమీషన్ సంపాదించిపెట్టే బీమా పథకాన్ని అంటకట్టడం కూడా ఈ కోవలోకే వస్తుంది.

ఒక్క కంపెనీ బోర్డ్ మెంబర్ (board member) తన స్వంత లాభాలను దృష్టిలో పెట్టుకుని ఆ కంపెనీకి నష్టం కలిగే విధంగా ప్రవర్తిస్తే అది కూడా కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్. దీని వలన ఆ బోర్డ్ మెంబర్‌ని బోర్డ్ నుంచి తొలగించడమే కాకుండా క్రిమినల్ కేసులు కూడా నమోదు చెయ్యవచ్చు. ఉదాహరణకు, ఒక్క కంపెనీ బోర్డ్ మెంబర్‌ యొక్క కుటుంబ సభ్యుడు ఆ కంపెనీతో కానీ ఆ కంపెనీకి సంబంధించిన వేరే ఏదైనా సంస్థతో కానీ ఏవైనా వ్యాపార లావాదేవీలు ఉంటే, అలాంటి లావాదేవీలకు సంబంధించిన నిర్ణయాలు ఆ బోర్డ్ ఆమోదం కోసం ప్రస్తావనకు వస్తే, ఆ బోర్డ్ మెంబర్‌ తనకూ తన కుటుంబ సభ్యుడి మధ్య వున్న బంధుత్వం గురించి కంపెనీ బోర్డ్‌కి తెలియజేయడమే కాక, అలాంటి వ్యాపార లావాదేవీలకు సంబధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ బోర్డ్ మీటింగ్ నుంచి బయటికి వెళ్ళడం ఆ బోర్డ్ మెంబర్‌యొక్క కనీస నైతిక బాధ్యతగా భావిస్తారు.

చిన్న ప్రైవేటు కంపెనీలలో ఈ విషయాన్ని అంతగా పట్టించుకోకపోవచ్చు. కానీ లిస్టెడ్ కంపెనీల[1]లో (listed company) పబ్లిక్ షేర్‌హోల్డింగ్ వుంటుంది కాబట్టి పైన వివరించిన పద్ధతిని బోర్డ్ మెంబర్‌ తప్పనిసరిగా అనుసరించడం ఉత్తమం. ఏ కంపెనీయైనా అది వాటాదారుల (shareholders) స్వంతం, తాము ప్రతి దినమూ కంపెనీ వ్యవహారాలను స్వయంగా చూసుకోవడం సాధ్యం కాదు కాబట్టే కంపెనీ బోర్డ్‌లో తమకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకుని బోర్డ్ మెంబర్‌గా నియమించే హక్కు షేర్‌హోల్డర్స్‌కి వుంది. అందుకే, ప్రతీ బోర్డ్ మెంబర్‌ తమను ఎంచుకుని ఆ పదవిలో నియామకం చేసిన షేర్‌హోల్డర్స్ హితం కోసం మాత్రమే పనిచెయ్యాల్సిన బాధ్యత వుంది.

బ్యాంకర్లు కూడా చాలా సార్లు తమ లాభాలకోసం బ్యాంక్ అనుమతి లేకుండా లేదా బ్యాంకుకు తెలియకుండా కుటుంబసభ్యుల ద్వారా ఖాతాదార్లతో వ్యాపార లావాదేవీలు పెట్టుకోవడం కూడా కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్. అంతే కాదు, కొన్ని రకాల వ్యాపార లావాదేవిలలో రెండు వైపులూ పని చెయ్యడాన్ని కూడా కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్‌గా భావించవచ్చు. ఉదాహరణ ఒక్క వకీలు తగాదా పడ్డ రెండు వర్గాలతోటీ పనిచెయ్యడం కుదరదు కదా. అలాగే ప్రభుత్వానికి సలహాదారుడిగా పనిచేస్తున్న సమయంలోనే ప్రైవేట్ సంస్థలకు సలహాదారుడిగా పనిచెయ్యడం కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్‌గా భావిస్తారు.

ఇటీవల కాలంలో భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకైన ఐసిఐసిఐ బ్యాంక్ సీ‌యీవో చందా కోచర్ మీద కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్‌కి సంబంధించిన ఆరోపణలు మోపి బోర్డ్ నుంచి తొలగించడమే కాక ఆమె మీద పెద్దఎత్తు దర్యాప్తు నడుస్తూవుంది. ఆవిడ వీడియోకాన్ కంపెనీకి కొన్ని వందల కోట్ల రుణం బోర్డ్ ద్వారా మంజూరు చెయ్యించిన తర్వాత ఆవిడ భర్త వీడియోకాన్ కంపెనీ యజమాన్యం దగ్గర నుంచి అరవై డెబ్భై కోట్ల రూపాయలు రకరకాల రూపాలలో వివిధ సంస్థలను సృష్టించి వాటి ద్వారా ఈ మొత్తాన్ని తీసుకున్నట్టు ఆరోపణ. అంతేకాదు ఆవిడ వుండే ఇల్లు కూడా వివిధ రకాల సంస్థల ద్వారా వీడియోకాన్ కంపెనీ యజమానులు ఆవిడకు కొని ఇచ్చినట్టు ఆరోపణ. ఇది ఒక్క ఉదాహరణ కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్‌కి. బ్యాంక్ ఆవిడకిచ్చిన బోనస్లు, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ (employee stock options) మొత్తం కలిపి దాదాపు రూ. 350 కోట్లు తిరిగి బ్యాంక్‌కి ఇవ్వాల్సి రావచ్చని వార్త వచ్చింది.

బ్యాంకర్లు ఇలా చేయడం మోసపూరితం అని పరిగణిస్తారు, ఎందుకంటే ప్రజల సొమ్మును వాళ్ళ చేతిలో భద్రపరచడానికి బ్యాంకుకు ఇస్తున్నారు కాబట్టి, బ్యాంకర్లు ఖాతాదార్ల నమ్మకాన్ని వాడుకుని వారి హితానికి వ్యతిరేకమైన పనులు ఏవి చేసినా అవి అవినీతివంతమైన పనులుగా పరిగణించడం సహజం. ఇలాంటి విషయాలు కేవలం భారతదేశానికే పరిమితం కాదు ఇలాంటి కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్‌కి సంబంధించిన సంఘటనలు ఎన్నో ఏళ్ళుగా ప్రపంచంలో అన్ని మూలలా జరుగుతూ వున్నాయి. ఇవేమీ కొత్త విషయాలు కాదు బ్యాంకింగ్‌లో. అగ్రరాజ్యాలతో పోలిస్తే భారతదేశ బ్యాంకింగ్ ఆధునికం కాదనే చెప్పవచ్చు. అందువల్ల, అగ్రరాజ్యాల నుంచి మోస పూరితమైన పనులు కూడా మనం బాగానే దిగుమతి చేసుకుంటున్నామని చెప్పవచ్చు.

మెర్రిల్ లించ్ అనే పేరుమోసిన వాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఉద్యోగులు వాళ్ళకు అన్ని సంగతులూ తెలిసి కూడా మోసపూరితమైన సలహాలతో తమకు వ్యాపారాన్నిస్తున్న చచ్చుపుచ్చు కంపెనీల షేర్లు కొనమని అమెరికన్ ప్రజలను మభ్యపెట్టి పురికొల్పినట్టు గుట్టుగా వుంచిన వార్త అన్నీ చోట్లా పొక్కి పెద్ద రభస అయ్యింది 2002లో. అమెరికాలో ఒక్క అందమైన విషయమేమిటంటే, ఎవ్వరైనా ఇలాంటి పనులు చేసి పట్టుబడినా తప్పు చేసినట్టు అంగీకరించకుండా కొంత డబ్బు ముట్ట చెబితే అందరూ ఏమీ తెలియనట్టు ఏమీ కానట్టు వ్యవహరిస్తారు. న్యూయార్క్ ఇంకా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు 100 మిలియన్ల అమెరికన్ డాలర్లను చెల్లించి తన వ్యాపారంలో ఎలాంటి అంతరాయాలు లేకుండా ముందుకు వెళ్ళింది మెర్రిల్ లించ్. ఇలా చెబుతూ పోతే ప్రపంచమంతా బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాల గురించి ఎన్ని గ్రంథాలు రాసినా సరిపోవు.

ప్రపంచమంతా బ్యాంకర్లు కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్‌ని లెక్క చేయకుండా ఖాతాదార్ల నమ్మకాన్ని వాడుకుని పెద్దఎత్తున వారి హితానికి వ్యతిరేకమైన పనులు ఎడాపెడా చేస్తూ పట్టుబడుతున్నారు న్యాయవ్యవస్థకు. కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్‌ ఒక్క పెద్ద మూలకారణం బ్యాంకింగ్ వ్యవస్థ దిగజారడానికి, తీవ్ర ఆర్థిక సంక్షోభం (financial crisis) రావడానికి. దురదృష్టవశాత్తు, బ్యాంకర్లు మరచిపోతున్నారు ఖాతాదార్ల వలననే బ్యాంక్ వ్యాపారం నడుస్తుందని, అందుకు ఖాతాదార్ల హితానికి అనుగుణంగా నడచుకోవడం వారి అతి ముఖ్యమైన ధ్యేయమని.

బయటి లింకులు

https://www.livemint.com/news/india/icici-bank-seeks-recovery-of-amounts-from-chanda-kochhar-11578920757353.html

https://money.cnn.com/2002/05/21/news/companies/merrill/

[1] ఏ కంపెనీలోనైనా వాటాలను అంటే షేర్లను సామాన్య ప్రజలకు అమ్మి వాళ్ళు ఆ కంపెనీలో వాటాదార్లగా (షేర్‌హోల్డర్లగా) మారితే అలాంటి కంపెనీను లిస్టెడ్ కంపెనీ (listed company) అని అంటారు. లిస్టెడ్ కంపెనీలు స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ (stock market regulator) నిర్దేశించిన ఎన్నో నియమ నిబంధనలను పాఠిస్తూ నడుచుకోవాలి. ఉదాహరణకు భారత దేశంలో కంపెనీలు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా లేదా కురచగా సెబి (Securities and Exchange Board of India or SEBI) నిర్దేశించిన నియమ నిబంధన ప్రకారమూ, అలాగే అమెరికాలో కంపెనీలు యూ.ఎస్. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్ లేదా కురచగా ఎస్ఈసి (U.S. Securities and Exchange Commission or SEC) నిర్దేశించిన నియమ నిబంధన ప్రకారమూ నడుచుకోవాలి.

*

దాసరిపిట్ట

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇది చాలా మంచి ప్రయత్నం. బ్యాంకింగ్ వ్యవస్థ , ఆర్థిక లావాదేవీలు వంటి కొరుకుడు పడని విషయాలని, సరళమైన భాషలో అందరికి అర్థం అయ్యేలా అందిస్తున్నందుకు మీకు, ప్రచురిస్తున్న సారంగకి అభినందనలు.

    వివిధ మార్కెట్లు, కంపెనీల గురించి , వాటి ప్రభావం సామాన్య ప్రజలపై ఇండైరెక్టుగా లేదా డైరక్టుగా ఉండే ప్రమాదాలు , ప్రభుత్వ తీరులు గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను.

    మరింత సమాచారం కోసం ఎదురుచూస్తుంటాము.

    ఇంద్రాణి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు