ఒక సాహసి వాక్యాల కవాతు!

దిలేర్  అంటే సాహసి. స్కై బాబా నిజంగానే సాహసికుడు, సమసమాజ స్వాప్నికుడు. లౌక్యాన్ని ప్రదర్శించనివాడు, లౌల్యాలకు లొంగనివాడు. తన కవిత్వం నిండా ఈలక్షణాలు మనకు మెండుగా మెదళ్ల నిండుగా కనిపిస్తాయి. ఈ పుస్తకంలో 80కిపైగా కవితలు ఉన్నాయి. ఇవన్నీకూడా దాదాపు పదిహేడు సంవత్సరాలలో రాసిన కవిత్వం. 2005లో జగ్ నే కి రాత్, 2009 షాజహాన గారితో కలిసి చాంద్ తార  మినీకవిత్వం వెలువరించాక మళ్లీ ఈ కవితాసంపుటి వెలువడింది. కవిత్వంలో రెండవ పుస్తకం రావడంలో ఆలస్యానికి కారణం కవిత్వంకంటే కథలకు తను ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం.  అయినప్పటికీ తాను కవిత్వానికి ఎప్పుడూ దూరంగా లేడనీ, తనలో కవిత్వసృజన మరింత పరిపుష్టం అయిందని ఈ  పుస్తకం  చదివితే తెలుస్తుంది.

సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని అక్రమాల్ని ఖండిస్తూ తక్షణస్పందనగా రాసిన “రోహిత్ దళిత్ బహుజన్, నీమౌనం వారికిఆయుధమే, కలాన్ని..రేపటికలను(గౌరీలంకేష్), కాలజ్ఞాని (రైతుచట్టాలను నిరసిస్తూ), బెచైన్, జంబుస్థాన్ ఇందులో ఉన్నాయి. “హతుడి వాంగ్మూలం” మాబ్ లించింగ్ నేపథ్యంలో రాసిన అద్భుతమైనకవిత.  “లాల్చీ పైజామాలో నేనోతెల్లని పావురాయిలా కదులుతుంటే/ కసాయిమూకకు కండ్లుకుడుతున్నాయి/నాసంచిలో ఆవుకూరఉందనో/ నేను కబేళాకు పశువుల్ని తోలుకుపోతున్నాననో/ నామీద దాడి చేస్తున్నారు/” అన్నప్పుడు మనం ఉలికిపాటుకు గురవుతాము. ఇలాంటి సంఘటనలు ఇటీవలి కాలంలో పెచ్చరిల్లడం వెనుక ఎవరున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కవిత పొడుగు ఎక్కువైనప్పటికీ చదివించేదే.

తన చెల్లెలు మరణించినప్పుడు రాసిన “చెల్లెమనాది” మనల్ని కదిలిస్తుంది. మతమేదైనా ఆకలిని దాచడానికి అబద్ధాలు ఆశ్రయించే జీవితాలుమాత్రం అన్నిఒకటే. “రోజావెనుక” మనకు కన్నీళ్ళుపెట్టిస్తుంది. “ఇప్పుడుబాగా అర్థంఅవుతోంది అమ్మీ/ పస్తులుండడాన్ని రోజాఉండడంగా మార్చుకున్న నీనిస్సహాయత/  పూటగడపడంకోసం  మజీదువెతుక్కునే అబ్బాభయ్యా అసహాయత/”  ఈ దేశంలో ఆకలిబాధలు అభివృద్ధితోపాటే సమాంతరంగా పెరుగుతున్నాయన్నది జీర్ణించుకోలేని వాస్తవం.

ప్రేమ ప్రేయసి గాఢపరిష్వంగం ఎదురుచూపు విరహం లాంటివి కవికి ఇష్టమున్నట్టే కనిపిస్తుంది. “ఇష్క్” కవితలో ప్రేమ గొప్పతనంగురించి చెబుతూనే “ప్రేమల్లో పడ్డదాకాతెలియదు/ ప్రేమికులను ప్రేమించేవారు లోకంలో తక్కువని/”  అని నిష్ట్టూరపడతాడు. “పరధ్యాన్నంగా నడుస్తున్నాం ప్రేమలోపడి/ ముళ్ళూ పాములూ దారిస్తున్నాయ్/ ఒక్క మనుషులు తప్ప/” అని అసలు గుట్టువిప్పెస్తాడు. భావుకతనిండిన చక్కనికవితలు “అమృత పాణీలు, నువ్వూనేనే, దేవులాట, ఇంతేజార్, మోహబ్బత్ కి తాజీ దునియా.”

“నీకో నిజమైన దోస్తుండాలే.”కవితలో  దోస్తు  “గాయానికి మనసుతో లేపనంరాయగలిగే దోస్తు /  అగాధంలోకి జారిపోతున్నప్పుడు/ నిన్నల్ల్లుకుని దూకేదోస్తు’ లా ఉండాలంటూ  “ఇటువంటి దోస్తు ఒక్కరన్నా లేనిబతుకు బతుకేకాదుఫో..!” అని ముగిస్తాడు. అదే సమయంలో ఏకాంతం గురించి గొప్పగా ఏకరువుపెడతాడు. దాన్ని స్కైబాబా “ఏకాంతి” అంటాడు. “ఈతి బాధలు ముక్కలు చేసినప్పుడల్లా/ ఏకాంతాన్ని ఆశ్రయించి/ నన్ను నేను కూడగట్టుకుంటాను/” అంటూ “నాలో నీకువిలువైనది అనిపించే ఏదైనాలాక్కో/ నీకుపైసా విలువచేయని ఏకాంతాన్ని నాకు వదులు.”

ఇందులో కొన్నికవితలు మొత్తంగా కోట్ చేయదగ్గ అర్హతను కలిగిఉన్నాయి. అందులోఒకటి “మేరేఅబ్బా గులామ్ మహమ్మద్.” ఇది చదువుతున్నంతసేపు మనం కనెక్ట్ అవుతాం. “ఇప్పుడు అన్నీతెలిసి/ నిన్ను కొడుకులాగా చూసుకుందామంటే/ నువ్వులేవు అబ్బాజాన్” అన్న ఎత్తుగడ మనల్ని ఒక పెయిన్ఫుల్ కుదుపుకు గురిచేస్తుంది. కవిత్వ నిర్మాణంలో ఎత్తుగడ, కొనసాగింపు, ముగింపు కవియొక్క నేర్పరితనాన్ని చెబుతాయి. అందులో అందెవేసిన చేయి మన స్కైబాబాది.

స్కైబాబా మరణం, మరణానంతర పరిణామాల గురించి కొంచెం ఎక్కువేరాసాడని చెప్పాలి. ఇల్లు ఖాళీచేయడం ఎలాగో దేహాన్నికూడా ఖాళీచేయడం అలాగే అంటూసాగే “దేహిల్లు” ప్రతీకాత్మకంగా సాగుతుంది. “మృత్యువుతో సంభాషణ” లో “కుచ్ దీవారే తొడ్నాహై/ కుచ్ ఆస్మానే జోడ్నా హై/ మాఫ్ కర్నా మైఅభి ఆనహీఁసక్తా” అంటూ  చావుకు తానప్పుడే రాలేనని తనకు “ఇంకాకొన్ని సత్యాల్ని రాయాల్సిఉంది/ కొన్నిఅసత్యాలని పూడ్చాల్సి ఉంది/ నాకింకాలోకంతో పేచిలెన్నోఉన్నాయి/” అంటాడు. కవికి ఉండాల్సిన సామాజిక స్పృహకు ఇంతకంటే నిదర్శనం ఏంకావాలి?

కవిత్వమైనా, కథైనా  సమకాలీన చరిత్రను రికార్డు చేస్తుంది. అలాంటి ఓకవిత “హైదరాబాద్ ఆత్మ ఇరానీ కేఫ్.” ఇరానీచాయ్ హోటల్లో పరిమళించే కార్మికుల పేదవాళ్ళ జీవితాలను కళ్ళకుకట్టింది. చాయిహోటల్లో ఆగుపడే మనుషులమధ్య కులమతాలకు అతీతంగా స్నేహం పొగలుకక్కుతూ ఉంటుంది. గంగాజమునా తెహజీబ్ సంస్కృతిలోని అంతర్భాగంగా అల్లుకుపోయి మన జీవనవిధానంలో ఇమిడిపోయిన ఒక అంతసూత్రం ఆది. కరోనా మహమ్మారి రేపిన అలజడిమీద ఒక్క కవితకూడా లేకపోవడం ఒకింతలోటుగా అనిపిస్తుంది.

తమమతంలోని మహిళలపట్ల జరుగుతున్న వివక్ష, అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయమని పురికొల్పుతాడు స్కై బాబా. ఎంతో సాహసం, ధైర్యం, స్పష్టత ఉంటెతప్ప తమమతానికి, చాందసవాదానికి ఎదురునిలబడ్డం సాధ్యంకాదు. ఇందుకు కవిని అభినందించాల్సిందే. ఎవరికీ లొంగని తత్త్వం నాదని సగర్వంగా ప్రకటించుకున్న కవి “అల్విదా” లో  “అన్నిదారులూ మూసేసాక ఏంచేస్తాం/ మిగిలింది ఒకేదారి/ భయాలనువీడి నిశ్చింతగా నిష్క్రమించడం!:” అంటూ పోరాడకుండా చేతులెత్తేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

జన్మనిచ్చినతల్లి, జీవితాన్నిచ్చినఊరు కవిదృష్టిలో సమానమే. తన పుట్టినఊరిని మానవీకరణ చేస్తూ, అమ్మ క్షేమసమాచారాలు అరుసుకుంటూ “మనుషులమధ్య పెరుగుతున్న కాలుష్యందాటి చూపుఆనుతున్నదా” అని అడగడంలో కవిచూపు మనకు అర్థమవుతుంది. బ్రతుకుతెరువుకై పట్టణాలు చేరినజనం అనాధలాగా వదిలేసినఊరిని అప్పుడప్పుడు గుండెలో తలపోయడం ఖాయం. సామూహిక సార్వజనీన దుఃఖాన్ని సంలీనంచేసి అందరితరపున అక్షరబద్దంచేసిన కవితఇది.  ఇంతజరిగినా మళ్లీ పల్లెకుతిరిగిరాలేని అనివార్యస్థితిలో ఉన్నామని, మమ్మల్ని క్షమించుతల్లి కేశరాజుపల్లె అని చెంపలేసుకుంటాడు. కానీ “అప్పుడప్పుడు వెళ్లిరావడానికి/ అమ్మలాంటి ఊరంటూ ఒకటిఉండాలి” అని ఊరుమీద తన అవ్యాజ్యమైన ప్రేమనుప్రకటిస్తాడు.

తెలంగాణా ఉద్యమంలో కవులపాత్ర చాలా కీలకంగా ఉండింది. స్వయంగా నిత్యఉద్యమకారుడు ఐన స్కై ఆకాలంలో రాసిన నిప్పుకణికల్లాంటి కవితలు ఇందులో చాలాఉన్నాయి. ముక్కుసూటిగా అవతలివాడి ఆధిపత్యాన్ని నిలదీసినతీరు తానుఎంత స్పష్టంగాఉన్నదీ చెబుతాడు.

స్కైబాబా భాష, కవిత్వశైలి పరిశీలిస్తే వ్యవహారికభాషలోనే దాదాపు అన్ని కవితలు ఉన్నాయి. బాగాప్రేమగా దగ్గిర అనుబంధంతో  రాసిన కవితల్లో పూర్తి తెలంగాణ కనిపించింది.  కవిత్వశైలి విషయానికి వస్తే స్కైబాబా కవిత్వంలో మోడర్న్  పోయెట్రీ, పోస్టుమాడర్న్ పోయెట్రీ పోకడలు లేశమైన కనిపించవు. సూటిగా ఉన్నది ఉన్నట్టు తనదైన కవిత్వభాషలో, శైలిలో పాఠకులకు అందిస్తాడు. అలాగే తన సహజమైనటువంటి మాతృభాష ప్రభావంకూడా కవిత్వంలో స్పష్టంగా  కనిపిస్తుంది. చాలాకవితలలో ఉర్దూవాక్యాలు, ఉర్దూశీర్షికలు మనకు ఆశ్చర్యం కలిగించవు, అసహజంగా అనిపించవు. వస్తువైవిధ్యం, విస్తృతి చాలాఎక్కువ. ముస్లిం జీవనదుఖం, జీవనవిధ్వంసం, మానవ సంబంధాలు, తాత్వికత, భావుకత ఇలా అన్నికోణాలను, దృక్పధాలను స్పృశించిన కవిత్వం ఇది. రెండో పుస్తకకాలం మరీఎక్కువగా ఉండడంవల్లనేమో సంధికాలంలో రాసిన మినీవిత్వం, పాటలుకూడా ఇందులో చోటుదక్కించుకున్నాయి.

 ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కార్టూన్ వేస్తేనే కటకటాల్లోకి నెట్టివేస్తూ ప్రశ్నించడాన్ని నిషేధించిన ప్రజాస్వామ్యం మనది. అయితే ఇప్పటికీ తమ అమ్ములపొదిలో బాణాలకు ప్రశ్నను బంధించి సంధిస్తున్న కవులు మనమధ్య ఉన్నారు. అందులో ఒకరు స్కైబాబా అని తప్పకుండా చెప్పవచ్చు.

*

పెనుగొండ బసవేశ్వర్

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బసు లోని కవిత్వ విశ్లేషణా సామర్ధ్యాన్ని వెలికితీసిన వ్యాసం ఈ పుస్తకం.

  • బాగుంది సమీక్ష భయ్యా కవి కవిత్వ సొగసులను విప్పి చెప్పిన వ్యాసం

  • ధిక్కార స్వర కవి స్కైబాబ గారి కవిత్వం ప్రశ్నల అమ్ములప్దిపొది.. ఆసాంతం చదివించిన విశ్లేషణ..కవికీ.. విశ్లేషకులకు అభినందనలు.

  • ధిక్కార స్వర కవి స్కైబాబ గారి కవిత్వం ప్రశ్నల అమ్ములపొది.. ఆసాంతం చదివించిన విశ్లేషణ..కవికీ.. విశ్లేషకులకు అభినందనలు.

  • సమీక్ష బాగుంది. బసవేశ్వర్ గారికి, స్కైబాబ కు అభినందనలు.

  • దిలేర్ కవిత్వాన్ని మనసుతో విశ్లేషించిన పెనుగొండ బసవేశ్వర్ గారికి, ప్రచురించిన సారంగ వారికి, స్పందించిన నిర్మలారాణి, శ్రీరామ్, విలాసాగరం, ఒద్దిరాజు, సరసిజ గారలకు బహుత్ షుక్రియా 🌼🌿

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు