ప్రిడేటర్

తల్లిదండ్రులకు యషిక ఒక్కతే కూతురు. కానీ తల్లిదండ్రులకు, ఆమెకు మధ్య వేర్వేరు లోకాలు ఎప్పుడు సృష్టించబడ్డాయో ఆమెకు తెలియదు.

మె ఆ మనుషులను వారిలో వెతుకుతూనే ఉంది.

‘యషిక బావుంటుందిరా! మాట్లాడితే కిక్కెక్కుతుందిరా…’

‘హవర్ గ్లాస్ ఫిగరబ్బా! చూస్తేనే…’

‘అదేరా యషికంటే!’

‘ఆడది ఆడదాన్లా ఉండాలి‌. లేకపోతే అంతే!’

వారంతా ఆమె మనసులోని ఓ అరలో భద్రంగా ఉంటూనే ఉంటారు. అప్పుడప్పుడు వారు బయట ఓ రూపంగా కనిపిస్తే ఆమె పోల్చుకునే ప్రయత్నం చేస్తుంది. వారంతా కలిసి ఆమె తనకు తానే ధైర్యమని అనుకుంటున్న ఓ ‘ఫ్రిజిడ్ బోన్’గా చేశారు. ఆ ధైర్యంలో కసి, ప్రతీకారం,అభద్రత కలబడినట్టు ఉంటాయి!

యషిక మాట్లాడటం పూర్తయ్యేసరికి ఆమె వెతుకుతున్న మనుషుల స్వరూపం మారింది. దానికి కారణం ఆమె దానిమ్మపండు లాంటి మెత్తదనం నుండి ఇనుము లోహ దృఢత్వంగా మారానని అనుకోవడం వల్ల, లేదా అదే నిజమూ కావచ్చు!

ఒకప్పుడు తనకు కనిపించిన ‘ప్రిడేటర్స్’ ఇప్పుడు తనను చూసి భయపడిన భావం కలుగుతుంది‌.

***

యషికది చిన్నప్పటి నుంచి ఒక రకమైన మనస్తత్వం. ఆ మనస్తత్వం వల్లే టీనేజ్ దాటడంతోనే ‘సెకండరీ ఉమేనోరియా’ వ్యాధి ఎదుర్కొంది. తనను తాను ‘స్త్రీ’గా గుర్తించడానికి ఆమెలో ఉన్న విముఖత వల్ల అలా జరుగుతుందని ఆమెకు అనిపిస్తూ ఉండేది. బహుశా అది నిజం కూడా కావచ్చు.

తల్లిదండ్రులకు యషిక ఒక్కతే కూతురు. కానీ తల్లిదండ్రులకు, ఆమెకు మధ్య వేర్వేరు లోకాలు ఎప్పుడు సృష్టించబడ్డాయో ఆమెకు తెలియదు. తండ్రికి ఓ స్త్రీతో అక్రమ సంబంధం ఉందని యషిక చిన్నప్పుడే తెలుసుకుంది. అలా తెలియడం వల్ల ఆమెకు తండ్రి మీద అసహ్యం, తల్లి మీద కోపం కలిగాయి. తల్లి స్త్రీగా ఉండటం వల్లే ఆ అసహ్య అనుబంధాన్ని గౌరవమనుకుని కొనసాగిస్తుందని ఆమెకు అనిపించేది. ఆడతనం-అందం స్త్రీకి సంకెళ్ళు అని, స్త్రీత్వం అనేది గుర్తించబడకపోతే స్త్రీ ఎటువంటి సమస్యలూ ఎదుర్కోవాల్సి రాదని కూడా ఆమె ఆలోచిస్తూ ఉండేది. 

ఆ ఆలోచనలు క్రమక్రమంగా పెరిగాయి. స్త్రీలు తాము స్వభావసిద్ధంగా చేయాల్సిన పనులు అని భావించేవాటిని వ్యతిరేకించేలా చేశాయి. వంట, పూజలు, చీరలు ఆమెకు నచ్చని అంశాలు. అవన్నీ స్త్రీని మనిషి నుండి వేరుచేసి మత్తెక్కించే నషాలా తయారవడానికి దోహదపడతాయని యషిక ఆలోచన. ఆ నషా ఒట్టి భావనే తప్పించి, నిజం కాదని, ఆ భావన మగవారిలో కలిగించడానికే స్త్రీ స్త్రీత్వం అనే రూపాన్ని ధరిస్తుందని కూడా అనుకునేది. ఆమె ఇంకా తీవ్రంగా ఆలోచించి ‘స్త్రీ-స్త్రీత్వం=మనిషి’ అనే ఒక సూత్రాన్ని తనకు తానే ప్రతిపాదించుకుంది.

రంగనాయకమ్మ నవలలోని కొందరు నాయికలు ఆభరణలేవీ ధరించకుండా ఉండటం ఆమెకు నచ్చింది. తననుకునేవి నిజమే అని తనకు తానే నిర్ధారణ చేసుకోవడానికి సాహిత్యం ఆమెకు కొంత ఉపకరిస్తే, ఆమె స్నేహితురాళ్ళు కోపంతోనో, విరక్తితోనో అన్న మాటలు ఇంకొంత ఉపకరించాయి. నయోమి వుల్ఫ్ ‘బ్యూటీ మిత్’ ఆమె ఇంకొన్ని స్త్రీత్వ వ్యతిరేక సిద్ధాంతాలు ప్రతిపాదించుకోవడానికి ఉపయోగపడ్డాయి.

వేల ఆలోచనలు విభిన్నంగా ఓ మనిషిలో ఎంత కాలం ఘర్షించినా ఒక్కసారి అనుభవాల గాఢత తాకగానే ఆ ఘర్షణ లేని కొత్తలోకం ఆవిష్కృతమవుతుంది. ఇక్కడా అలాగే జరిగింది. ఆ కొత్తలోకం యషికను సంజయ్ రూపంలో తాకింది.

అతనితో ఉన్నప్పుడే ఆమెకు తను ఏర్పరచుకున్న ఆలోచనల పట్ల సందేహం కలిగింది. స్త్రీ కోరికకు, మగవాడి తృప్తికి మధ్య స్త్రీత్వం అనే పొర అవసరమేమో అనిపించింది. 

ఓసారి సంజయ్ అన్నాడు. “నువ్వు చెవికి జూకాలు, కాళ్ళకు పట్టీలు, నుదుటిన బొట్టు, చేతులకు మట్టిగాజులు, మెడలో ముత్యాలహారం, చీర కట్టుకుని పెట్టుకుంటే స్మిత కన్నా ఎన్నో రెట్లు అందంగా ఉంటావు, తెలుసా?” అని. అతనలా అనగానే స్మిత రూపం యషిక కళ్ళ ముందు మెదిలింది. స్మిత సంజయ్ స్నేహితుడు రాహుల్ గర్ల్ ఫ్రెండ్.

నడుము కనిపించకుండా, ఏ రకమైన వేషధారణనూ ఇష్టపడనట్టు ఉంటుందనుకుంటా అని మొదట్లో స్మిత గురించి అనుకుంది. ఆ తర్వాత తన స్ట్రక్చర్‌ను అందరూ గుర్తించాలన్న తపన కూడా ఆమెకుందని నిర్ధారించుకుంది యషిక. అందం అంటే ఏంటి అని ఆలోచించినప్పుడల్లా ఆమెకు తెలిసినవారిలో అందగత్తెలుగా కీర్తించబడే ఎందరో మెదిలేవారు. అందులో ఒకరే స్మిత.

“అసలు నేను అందంగా ఎందుకుండాలి?” ఎదురడిగింది సంజయ్‌ని.

“అంటే.. అందంగా ఉంటే కొత్తగా ఉంటావు”అన్నాడు సంజయ్.

“అంటే? నేను మనిషిగా ఉంటే చాలదా?”

“వయసులో ఉన్నప్పుడు మగవాడిని ప్రోవొకేట్ చేసేలా గర్ల్‌ఫ్రెండ్ ఉంటేనే కదా మజా!”

“మరి నేను ఇన్నాళ్ళు అలా లేనే? మరెందుకు నాతో ఉన్నావ్?” టక్కున అడిగింది.

సంజయ్‌కి యషిక ఎప్పుడూ అర్థం కాలేదు. అర్థం చేసుకోవాలన్న ఆత్రుత కూడా అతనికి లేదు. అతని దృష్టిలో ఆడవాళ్ళందరూ వయసులో ఉన్నప్పుడు నచ్చిన మగవాడి ఇష్టాలకు తగ్గట్టు మారిపోతారు. అది సహజమని, దానికి భిన్నంగా ఎవరైనా ఉంటారని కూడా ఎప్పుడూ అతను ఆలోచించలేదు.

యషిక తనను తాను స్త్రీత్వం లేని స్త్రీగా నిర్మించుకున్నానని అనుకున్నా, ఆమెను అతను అటువంటి ప్రత్యేకమైన వ్యక్తి అని భావించలేదు. అసలు యషిక అడిగేది, మాట్లాడేదీ ఎప్పుడు అతనికి సరిగ్గా అర్థమయ్యేది కాదు. అతనికి ఆమెలో నచ్చింది వయసు, వయసులో ఉంటాయని అతను అనుకున్న భావనలు-స్పందనలు అంతే!

“యషికా! వాదించకు. ఇంత వయసొచ్చింది. నీకు తెలియదా? నువ్వు ఇన్నాళ్ళు ఏ డ్రస్ వేసుకున్నా, ఎలా ఉన్నా నేను పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పుడు మనం ఫ్రెండ్స్ మాత్రమే. ఈనెలలో మనం అంతకన్నా క్లోజ్ అయ్యాము. ఇప్పుడు నువ్వు నాకు నచ్చేలా ఉండటమే నా మీద నీకు ఉన్న ప్రేమ ప్రజంట్ చేయడం. నీకు తెలుసా స్మిత రాహుల్ కోసం ఎన్ని చేస్తుందో? వాడు ఎంత గర్వంగా తన గురించి చెబుతూ, తనను అందరికీ పరిచయం చేస్తాడో తెలుసా?” అన్నాడు.

“అసలు దానికి, దీనికి సంబంధమేంటి? నువ్వు నన్ను కూడా అలా ప్రజంట్ చేయాలనుకోవడం రోతగా లేదా?”

“ఏది రోత? నీకోటి తెలుసా? ఏ మగాడికైనా తన గర్ల్‌ఫ్రెండ్ సెక్సీగా ఉంటే, ఆమె వల్ల ఆ మగాడి ఫ్రెండ్స్ ఎంత ఈర్ష్య పడితే అంత కిక్కొస్తుంది. నలుగురు అబ్బాయిలు – నలుగురు అమ్మాయిలు కలిసి గర్ల్‌ఫ్రెండ్స్-బాయ్ ఫ్రెండ్స్‌గా వెళ్ళినా, సింగిల్‌గా వెళ్ళినా ఒకరి కంపెనీ ఇంకొకరు ఎంజాయ్ చేస్తారు. కానీ అది పైకి చెప్పుకోరు. అది కల్చర్! అంతే!” సంజయ్ సమాధానం ఇచ్చాడు.

“ఏమో? ఇదంతా నాకు అసహ్యంగా అనిపిస్తుంది. ఆడ, మగ కలిసి ఉండటానికి ఇదంతా అవసరమా?” అడిగింది.

అవసరమో, అనవసరమో అతను చెప్పలేదు. ఇక ఒకరికి ఒకరు ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేకుండానే ఆ ఇద్దరూ విడిపోయారు.

సంజయ్ యషికని తేలికగానే మర్చిపోయాడు కానీ యషిక అతన్ని మర్చిపోలేకపోయింది. ఆ మర్చిపోలేకపోవడంలోనే ఆమె వ్యక్తి ఆలోచనలు-సిద్ధాంతాలు-ఆశయాలకన్నా గాఢమైంది కొన్నిసార్లు వీటికి వ్యతిరేకంగా ఉండే అనుభవమని తెలుసుకుంది. యషికకు సంజయ్ నచ్చలేదు. అతనికి సామీప్యంగా ఉండగలిగేలా ఆమె మాట్లాడలేదు. కానీ అతనితో ఉండటమనే అనుభవాన్ని ఆమె మర్చిపోలేకపోతోంది. అనుభవానికి అస్థిత్వం అవసరం లేదని కూడా ఆమెకు అనిపించింది. అప్పుడు ఆమెకు తల్లిదండ్రుల పట్ల సహానుభూతి కలిగింది.

సంజయ్ చెప్పింది విన్నప్పుడు, ఆడ-మగ అలా పరస్పర ఆసక్తి కలిగి ఉండటం కల్చర్ అని, తనకు నచ్చకపోయినా అది సహజమే అనుకుంది. ఆమె పరిచయమైన మగ మిత్రులందరితో మాట్లాడింది. హద్దులు దాటీదాటని సామీప్యతను వారితో అనుభవించింది. జీవితంలోని ఆ కాలంలో ఆమె కావాల్సింది అనుభవం మాత్రమే; దానికి ఏ అభిప్రాయాలు-విలువలు జోడించబడకపోయినా అది పెద్ద విషయంగా కనిపించలేదు. 

తనలోని అందాన్ని అందరూ గుర్తించడానికి సంజయ్ చెప్పినట్టే ఆమె తన కట్టు, బొట్టు మార్చుకుంది. వాటివల్ల తెలియకుండానే తనలో ఏర్పడుతున్న ఓ నషా చుట్టూ ఉన్నవారిని మత్తెక్కిస్తుంటే ఆమె గర్వించింది కూడాను!

ఇప్పుడు యషిక మారిపోయింది. 

ఒకప్పుడు అసహ్యించుకున్నవి ఆమెకిప్పుడు ఏదో తెలియని గొప్ప భావనను కలిగిస్తున్నాయి. ఆ భావన తను కోరుకున్న అనుభవాన్ని ఇంకా ఉధృతం చేస్తుందని ఆమె అనుకుంది. కాలంతోపాటు ఆ మత్తు దిగిపోతుందని, అది దిగిపోయే ముందు గట్టి దెబ్బలే కొడుతుందని అప్పట్లో ఆమెకు తెలియదు.

ఆమె ఒంటరిగా మగమిత్రులతో ఉన్నప్పుడు ఎంజాయ్ చేసిన కామెంట్స్ అందరి ముందు బహిర్గతమైనప్పుడు బూతులుగా మారతాయని ఆమె అప్పుడే తెలుసుకుంది. ఒకప్పుడు ‘ఆడ-మగ’గా కనిపించిన సమాజం ఆమెకు ఇప్పుడు ‘ప్రే–ప్రిడేటర్ల’ లోకంగా అనిపిస్తుంది.

ఒకప్పుడు స్త్రీత్వాన్ని కట్టుబొట్టు, పూజాపునస్కారాల్లో ఉందనుకుని వాటిని వదిలేసి ‘స్త్రీత్వం నుండి వేరుపడిన స్త్రీ’ తను అని అనుకుంది. కానీ ఎక్కడో బలహీనమయ్యే తన మనసే సంజయ్‌లో వీటిని మించి తనలో స్త్రీత్వం గుర్తించేలా చేసిందని ఆమెకు కొత్త ఎరుక కలిగింది.

ఇప్పుడు ఆమె బలమైన మనస్సును వెతుక్కునే క్రమంలో ఉంది. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఆ ‘ప్రిడేటర్ల’ను భయపెట్టేంత బలం తన లోపల భయపడుతూనే ప్రోది చేసుకోవాలని అనుకుంటుంది.

ఆమెలో జనించే క్రమాలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి! వాటికిక ముగింపు లేదు.

*

నాదైన కోణంలో కథలు రాయాలని ఉంది!

  • హాయ్ రచనా! మీ గురించి చెప్పండి.

హాయ్! మాది ఏలూరు జిల్లా నూజివీడు మండలం అనంతసాగరం. చాలా మారుమూల పల్లెటూరు అది. ఇప్పటికీ ఆ ఊరికి వెళ్లడానికి సరైన సౌకర్యాలు లేవు. నేను పుట్టి పెరిగింది అక్కడే! ఇంజినీరింగ్ చదివాను. కొన్నాళ్లు విజయవాడలో ఇంగ్లీషు టీచర్‌గా‌ పనిచేశాను. ఆ తర్వాత ఈవెంట్ మేనేజర్‌గా, ఇంగ్లీషు శిక్షకురాలిగా పనిచేశాను. 2016 నుంచి హైదరాబాద్‌‌లో ఉంటున్నాను‌. ప్రస్తుతం పూర్తిస్థాయి అనువాదకురాలిగా, రచయిత్రిగా ఉన్నాను.

  • కథలు రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

నాకు పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కథలు బాగా చదివేదాణ్ని. అయితే కథ రాయాలన్న ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో ఒక ప్రముఖ రచయిత రచనలు చదివి ఆయన గురించి చాలా ఉహించుకున్నాను. ఆయన్ని కలిసిన తర్వాత నా ఊహలకు, ఆయన ప్రవర్తనకు చాలా వ్యత్యాసం కనిపించింది. అదొక చేదు అనుభవంలా మిగిలింది. కొత్తగా రాసేవారికి సీనియర్ రచయితల నుంచి ఎదురయ్యే అనుభవాలను ‘చిరుదివ్వె‌ నీవైతే’ అనే కథగా రాశాను. అది 2016లో ‘యుగభారత్’ మాసపత్రికలో ప్రచురితమైంది. అదే నా తొలి కథ. ఆ తర్వాత ‘లక్ష్యం’, ‘మృగాల మధ్య’, ‘నువ్వు నువ్వుగా’.. ఇలా మరికొన్ని కథలు రాశాను.

  • ఇప్పటికి ఎన్ని కథలు రాశారు? 

18 కథలదాకా రాశాను. కానీ అందులో చాలా వరకు ఇప్పుడు డిస్‌వోన్ చేసుకోవాలని ఉంది. 

  • అదేంటి? 

ఆ కథలన్నీ రకరకాల పత్రికల్లో ప్రచురితమయ్యాయి. కొన్నింటికి పోటీలో బహుమతులు కూడా వచ్చాయి. కానీ వాటిలో నాదైన దృక్పథం కనిపించదు. నేననుకున్నట్టు కాక ఆయా పత్రికల ఎడిటర్ల నా చేత రాయించిన కథల్లా ఉంటాయి. వాటికంటే ఎక్కువగా ఆర్టికల్స్ రాశాను. వార్త దినపత్రికలో ‘మగువ మనసు’, ఆంధ్రభూమిలో ‘జయహో’ కాలమ్స్ నిర్వహించాను. ‘ఆవిర్భవ’ అనే పత్రికకు కొన్నాళ్ళు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా పనిచేశాను. కొన్ని యూట్యూబ్ వీడియోలు, స్పాటిఫై‌లో ‘రచన-ద బుక్ క్రిటిక్ షో’ చేశాను.

  • అనువాదాలు కూడా చేశారు కదా! వాటి గురించి చెప్పండి.

నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో రచయిత ఆకెళ్ళ రాఘవేంద్ర గారు పరిచయమయ్యారు. ఆయన రాసిన ‘పరుగు ఆపడం ఒక కల’ పుస్తకాన్ని ఇంగ్లీషులోకి అనువదించాను. అది బయటకు రాలేదు. ఆ తర్వాత 10 పుస్తకాల దాకా తెలుగు నుంచి ఇంగ్లీషులోకి అనువాదం చేశాను. అక్కినపల్లి సుబ్బారావు గారు రాసిన ‘తోడు’ నవల, సన్నిహిత్ రాసిన ‘గురుకుల్’, మాలావత్ పూర్ణపై వచ్చిన ‘ఎవరెస్ట్ ఇన్ మైండ్’ పుస్తకాలు అందులో కొన్ని. 

  • చాలా పుస్తకాలు చదువుతుంటారు కదా! అవి మీ మీద ఎలాంటి ప్రభావం చూపించాయి?

2018 నుంచి ఇప్పటిదాకా దాదాపు 500 పుస్తకాల దాకా చదివి ఉంటాను. అందులో ముగ్గురు మహిళల ఆత్మకథలు నన్ను చాలా ఇన్స‌పైర్ చేశాయి. జీవితంలో ఎలా ఉండాలి అనే కాదు, ఎలా ఉండకూడదు అనే విషయం కూడా ఆ ముగ్గురి ఆత్మకథల ద్వారా తెలుసుకున్నాను. వాళ్లు కమలాదాస్, ప్రొతిమాబేడీ, ప్రభాకైతన్. వాళ్లు చాలా నిజాయితీగా తమ ఆత్మకథ రాసుకున్నారు. ఏమాత్రం సంకోచం లేకుండా తాము చేసిన తప్పుల్ని బహిర్గతం చేశారు. అలా నా మీద వాళ్లు ప్రభావం చూపించారు.

  • ఇకపై ఎలాంటి కథలు రాయాలని ఉంది?

స్త్రీ పురుష సంబంధాల మీద నాదైన కోణంలో కథలు రాయాలని ఉంది. వాటిని కథల రూపంలో ప్రభావవంతంగా చెప్పాలని ఉంది. 

*

రచన శృంగవరపు

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కొత్త గొంతుక విన్నాను.తన రచనలపై చిన్నపాటి విమర్శను కూడా సహించలేని రచయితలు ఉన్న కాలంలో నా రచనలు డిసొన్ చేసుకుంటున్నాను అని చెప్పగలిగిన గొప్ప సాహసిని గురించి తెలుసుకున్నా. రచన గారికి మనఃపూర్వక అభినందనలు.

    • మీ అభిమానపూర్వక స్పందనకు హృదయపూర్వక ధన్యవాదములు రంజన్ గారు.

  • ఒక పాత్ర మనస్తత్వ ఆవిష్కరణ,
    మానసిక విశ్లేషణ…
    ఆ పాత్ర చుట్టూ ఉండే పరిస్థితులూ,
    వాటి ప్రభావం వల్ల ఆ పాత్ర పొందే
    మానసిక స్థితిగతులూ…
    వాటి పరిణామాల కారణంగా
    ఆ పాత్రలో కలిగే భావప్రకంపనలూ…
    తద్వారా ఆ పాత్ర ఆలోచనావిధానంలో,
    ఆచరణాక్రమంలో జరిగిన
    మార్పు-చేర్పుల గురించి…
    ఓ ‘రచయిత్రి’గా పాఠకులకు
    ‘వి..వ..రిం..చ..టం..’
    (ఔను- “వివరించటమే!”)…
    “మనోవిశ్లేషణ-మానసిక చిత్రణ”తో
    కూడిన “వ్యాసం” అవుతుందే తప్ప–
    “కథ” ఎలాగౌతుందీ??
    * * *
    ఇక- ప్రశంసించదగిన అంశం ఏమిటంటే…
    “మనస్తత్వ విశ్లేషణ”లో మీ ‘పరిశీలన’ అద్భుతం!
    ఎవరూ పట్టుకోలేని, అసలు కనిపెట్టలేని అతి పల్చటి విషయాల్ని కూడా ఒడిసి పట్టుకొని- వాటి విపరిణామాల్ని నిర్ధారిస్తూ, తీర్మానిస్తూ “డైరెక్ట్ స్టేట్మెంట్స్”గా, “నోట్ చేసుకోదగిన కోట్స్”గా డెలివర్ చేయటం… ఈ ఆసాంతం *రచన* లోని అతిగొప్ప అంశం.
    అభినందనలు మీకు!!
    👌👍💐
    –యస్వీకృష్ణ

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు