ఒక్క కరచాలనం చేయండి!

నా నేలకు నేనెందుకు వెళ్లాలి  అన్న ప్రశ్న తలెత్తినప్పుడల్లా.. మెదడు శూన్యంగా మారుతుంది.

అక్కడ తిన్నావా నాన్నా… మళ్లెప్పుడొస్తావురా కన్నా అని అడిగే అమ్మ లేదక్కడ. నా కళ్లలోకి చూసి నా వేదనను అర్థం చేసుకుని,నా తల నిమిరి ఎన్నో రోజుల క్షోభను పోగొట్టి, ఒక్క స్పర్శతో నాకు స్వర్గాన్ని ప్రసాదించే అమ్మా నీవే స్వర్గానికి వెళ్లిపోయావా..

సార్, నేను ఉద్యమంలోకి వెళ్లాలి..అన్నాడొక యువకుడు నేను హైదరాబాద్ లో ఆఫీసులో ఉండగా నన్ను కలుసుకుని. వద్దురా..కావాలంటే ఈ పుస్తకాలు చదువు. ముందు సమాజాన్నిచదువు. ప్రపంచాన్ని అర్థంచేసుకో.. నీకోసం ఇంటిదగ్గర ఎదురు చూసే, నీపై కలలు కనే  ఒంటరి  అమ్మా,నాన్నల్ని వదిలిపెట్టకు.. అన్నాను నేను. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లాను. ఏడాది తర్వాత మళ్లీ హైదరాబాద్ తిరిగి వచ్చినప్పుడు ప్రెస్ క్లబ్ లో అతడి సంస్మరణ సభ జరుగుతోంది. ఒక మూల అమ్మా నాన్న కూర్చుని విలపిస్తున్నారు. అతడి వీరత్వాన్ని పొగుడుతూ వేదికపై పెద్దలు నివాళులర్పిస్తునన్నారు. అతడు రాసిన కవితలు వినిపిస్తున్నారు. నా కవితలు పుస్తకాలలోంచి రాలిపడి నీళ్లలో కరిగిపోయినట్లనిపించింది. అతడు ఏక వచనం కాదు. సర్వనామం.ఎన్నో సర్వనామాలు నామవాచకాల్ని ధ్వంసం చేశాయి.

చూస్తూచూస్తుండగానే దేశ రాజధానికి వచ్చి మూడు దశాబ్దాలు గడిచిపోయాయి. జీవితంలో సగభాగం తెలంగాణ పోరాటంలో ధగ్దం చేసి ఆ తర్వాత పేదరికంలో మగ్గుతూ,కుటుంబాన్ని లాగుతూ.. ఏమీసాధించలేక,మూత్రపిండాల వ్యాధికి గురై..మరణించిన మా నాన్న శేషగిరి రావుతో నేను వాదించలేకపోయేవాడిని. లెనిన్ గురించి మాట్లాడితే స్టాలిన్ గురించి చెప్పేవాడు.ప్లెఖనోవ్ గురించి వివరించేవాడు.శంకరుడి గురించి మాట్లాడితే రామానుజుడి గురించి అడిగేవాడు. అప్పుడు ఇంటర్నెట్ ఎక్కడిది.. ఆయనతోవాదించి గెలిచేందుకు హన్మకొండ లో పబ్లిక్ గార్డెన్ వెనుక ఉన్న లైబ్రరీకి వెళ్లేవాడిని. ఎంతచదివి వచ్చినా మరోకొత్త పేరు మా నాన్న పెదాలపై దొర్లేది..నేను అధ్యయనం చేసేందుకే మా నాన్న నన్ను వాదనలోకి దించేవాడని నాకు తర్వాతి కాలంలో అర్థమైంది. ఇప్పుడు వాదించేందుకు మా నాన్న ఏడీ?

మా నాన్నేకాదు,కమ్యూనిస్టు పోరాటంలో పాల్గొని ఉపాధ్యాయ ఉద్యమంలో కుటుంబాన్ని పెద్దగాలెక్కచేయని మాపెద నాన్న శ్యామసుందర్ రావు టీచర్స్ ఎమ్మెల్సీ అయినా స్వంత ఇల్లు లేక మరణించారు. ఆయన కూడా నాతో చర్చించేందుకు ఇష్టపడేవారు. ఢిల్లీ వచ్చినప్పుడల్లా నాతోనే గడిపేవారు. ఇప్పుడు హైదరాబాద్ గాలిలో లీనమై సంచరిస్తున్న ఆయనను ఎక్కడ కలుసుకోవాలి?

నీకు ఒక ఉద్యమం మీద అభిప్రాయభేదాలుండవచ్చు. వారి పంథాలు నీకు ఇష్టంలేకపోవచ్చు.కాని వారిని విమర్శించకు.వారు జీవితాలను త్యాగం చేస్తున్నారు. అదొక్కటిచాలు వారిని ప్రేమించేందుకు అన్నాడు కెఎన్ వై పతంజలి. ఆయన మాటల్ని తు.చతప్పకుండా పాటించాను. జీవితంలో ఎన్నో ఢక్కా మొక్కీలు తిని, కుటుంబ పోషణార్థం రకరకాల పనులు చేసేందుకు వెనుకాడని ఆయన సాహిత్యంలో మాత్రం ఒక రాజులాగే దర్జాగా బతికారు. ఆయనతో పాటూ సాహిత్యంలోనూ, జర్నలిజంలోనూ తలెత్తుకుని తిరిగే రాచరికమూ వెళ్లిపోయింది.

ఎందరో పటాలైపోయారు. ఎందరో గోడలపై నినాదాలయ్యారు. ఎందరో స్థూపాలయ్యారు. ఎందరో ప్రవాసులయ్యారు. ఎందరో జీవచ్ఛవాలయ్యారు.ఎందరో అమరులయ్యారు.. పాతవి రాలిపోతున్నాయి. నగరంలో కొత్త జన్మలేవీ కనిపించట్లేదు.లేక నేనే అంధుడినయ్యానా.. కరచాలనం చాపితే మనిషి ఎందుకు మాయమైపోతున్నాడు?

ఇప్పుడీ కవిత్వం ఎందుకు రాయాలి?

నీలి ఆకాశంలో ఎగురుతున్న పక్షుల్లో నిన్న చూసిన పక్షులు  లేనందుకు బాధతో రాయాలా?

పుస్తకం తెరిస్తే పేజీలు చెదల్లా రాలిపోతున్నందుకు రాయాలా?

దట్టంగా క్రమ్ముకున్న చీకటి మధ్య రాత్రంతా నడిచి వచ్చిన పాదాల్లో కొన్ని వేకువ రేఖల్లోనే అదృశ్యమయినవందుకు రాయాలా?

రోడ్డుమీద నడుస్తుంటే నిన్నటి స్నేహాలు నేటి ఆత్మలై పలకరిస్తున్నందుకు రాయాలా?

అతడితో తాగిన ఇరానీ చాయ్ వగరు ఇంకా నాలుకపై తచ్చాడుతూనే ఉన్నందుకు రాయాలా?

భుజం మీద పరుచుకున్న వెచ్చటి చేతి వేడిమి ఇంకా వీడనందుకురాయాలా?

వేలం వేసిన బతుకుల్లో ప్రశ్నార్థకాన్ని, విరిచిన పక్షుల రెక్కల,ఛిద్రమైన బాల్యపు వెన్నెలల

చిత్రాలను వర్ణించాలా?

ప్రతి తెల్లవారు జామూ ఒక హత్య అలారంలా మోగుతుంది.స్వప్నమో, సత్యమో తెలిసే లోపు

నిన్నటి నెత్తుటి మరక వాహనాల రొదలో కలిసిపోతుంది.ప్రతి జీవితమూ ఒక ప్రవాసం.స్వస్థలం జ్ఞాపకం వచ్చి నేలపై అడుగుపెట్టినప్పుడల్లా అదృశ్యమవుతున్న ముఖాల కోసం

కళ్లు వెదకడం, మనసు తడమడం మానవు.

కవీ, నీవెక్కడున్నావు? క్షేమమేనా? కరిగిపోతున్న కాలం నెత్తుటి సీరాతో తెగిపోతున్న కలల ఆర్తనాదాల మధ్య ఇప్పుడేమి రాస్తున్నావు? బతుకంతా అక్షరాల్లో  సముద్రాన్ని ప్రేమించి,అలల్ని హత్తుకుని కెరటాల్ని ఆలింగనం చేసుకుని  సమీపంలో ఉన్నా  తడి ఇసుకను తాకగలుగుతున్నావా?

ఏమైనా తెగిపడుతున్న పక్షుల రెక్కల చప్పుడును వినిపించాలనే తపిస్తున్నాను. కనురెప్పలపై పొడిపొడిగా పేరుకుని, చూపుల్ని మంచుగా మార్చి, శరీరాన్ని గడ్డకట్టించి, జీవితాన్ని నిస్తేజం చేసే చలి ప్రయత్నాలను ప్రతిఘటించకపోతే అది మెదడులోకి ప్రవేశించి ఆలోచనలను మృత్యువాయువై చుట్టుకుంటుందని భావిస్తున్నాను. .నా మాటలపై, పలకరింపులపై,చిరునవ్వులపై పొగమంచు క్రమ్మకోకుండా,నిటారుగా ఉన్న వెన్నెముకను కర్కశ స్పర్శతో  స్తంభింపచేయకుండా  ప్రతి అక్షరాన్నీ నిప్పుతో రాజేసి మంచు కటకటాల్ని ఛేదించకపోతే నేనే మాయమై పోతానని భయపడుతున్నాను.

కనురెప్పలు ఎత్తకుండా ఏదీ చూడలేవు. స్పర్శ జ్ఞానం లేకపోతే పాదాల క్రింద పారుతున్న నెత్తుటి తడి తెలియదు. హృదయానికి అస్తిత్వం లేకపోతే చెట్లకు వ్రేళ్లాడుతున్న శిరస్సులతో సంభాషించలేవు. హత్యల వెనుక మృత్యు రహస్యాలను అన్వేషించకపోతే ఆత్మల ఆక్రందనను వినలేవు. రాత్రి ప్రశాంతంగా నిద్రిస్తే తుడిచిపెట్టిన శవం పదజాడల్ని కనుగొనలేవు.

భక్తి పారవశ్యంలో మునిగిన తలల్నే  మోసాల ఖడ్గాల్ని ఖండిస్తాయి. ఆధునిక బానిసల సామ్రాజ్యంలో అక్షరాలు తలెత్తడం అతి కష్టంగా మారుతోంది.గడ్డకట్టని నెత్తుటి చుక్క

ప్రవాహం అయ్యే క్షణం కోసం, ఇంకిపోయిన కన్నీటి చుక్క నిప్పురవ్వ గా మారడం కోసం,

చితికి పోయిన అక్షరం మహావాక్యమై నేలను కబళించడం కోసం,కొత్త నేలపై చిగురించే

పూల వనాలకోసం నిరీక్షించే కాల పురుషుడిలా నిరీక్షిస్తున్నాను. గద్దలు నిండిపోయిన ఆకాశం ఆవరించిన విద్రోహ నగరిలోంచే నేను పేగుల్లో కదలిన గాయపడ్డ స్వరాన్ని సంధించడంకోసం రాశాను.

ఆకాశంతో కరచాలనం చేయాలనుకుంటున్న వాడిని.కాని శూన్యంలో చేయి చాచవలిసి వస్తోంది. దిక్కులను అనాఛ్చాదితం చేసే ధిక్కారం ఎలా ఉంటుందో చెప్పాలనుకుంటున్నాను..

అందుకే ఒక్క కరచాలనం చేయండి!

(కొత్తసంవత్సరానికి రెండురోజుల ముందు విజయవాడ పుస్తక మహోత్సవంలో  నా తాజా కవితా సంకలనం ‘ఒక్క కరచాలనం చేయండి!’ ఆవిష్కరణ జరిగిన సందర్భంగా)

 *

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అద్భుతంగా రాసావు కృష్ణుడూ
    ఎక్కడో పేగుమెలితిప్పిన బాధ
    ఎండిన మోదుగుపూలు నలుగుతూన్న సవ్వడి అట్టడుగుపొరల్లో ఒకటో ఆరో మిగిలిన వేర్లు శ్వాసిస్తున్న ఊపిరి
    నీ అక్షరాల్లో సుడులు తిరుగుతోంది
    దుఃఖం గా ఉంది ఉద్వేగంగా ఉంది
    నీకు వెచ్చని కరచాలనం

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు